ఇంద్రలోక వైభవం - పార్ట్ 1
- Nallabati Raghavendra Rao
- 6 hours ago
- 8 min read
#NallabatiRaghavendraRao, #నల్లబాటిరాఘవేంద్రరావు, #ఇంద్రలోకవైభవం, #IndralokaVaibhavam, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Indraloka Vaibhavam - Part 1/3 - New Telugu Story Written By - Nallabati Raghavendra Rao Published In manatelugukathalu.com On 21/12/2025
ఇంద్రలోక వైభవం - పార్ట్ 1/3 - పెద్ద కథ మొదటి భాగం
రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు
ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత
ఒకప్పుడు ఆ పల్లె ఆరు వీధుల అందమైన కూడలి. ఇంద్రలోకం లాగా ఉండేది. రంగురంగుల, రకరకాల చేనేత వస్త్రాలు నేస్తూ ఆడమగ.. పిల్ల, పెద్ద హాస్య చతురోక్తులతో, పాటలతో, చిలిపి చేష్టలతో పండుగపబ్బాల శుభ సమయ ఆనందాలతో పురివిప్పిన నెమలిలా మానస సరోవరంలో జలకాలాడే హంసలబారుల్లా కళకళలాడిపోతూ ఉండేది.
ఇప్పుడు ఆ పల్లె చమురు అడుగంటి ఆరిపోతున్న ప్రమిద దీపంలా ఉంది. నాలుగు మూలల నుండి వీస్తున్న సుడి గాలితో ఎప్పుడు నేలకొరుగుతుందా అన్న పూరిపాకలా ఉంది. చెదలు పట్టిన నేతబట్ట తెరచాపగా దిశానిర్దేశం లేని చుక్కాని లేని పగుళ్లపడవ లాగా ఉంది. విగ్రహాలే లేని శిధిలమైపోయిన రామాలయం సాక్షిగా ఆ పల్లె పేరు.. రామాపురం.
''ఒరేయ్ గణపతి, ప్రసాదరావు, రమణయ్య, పాండురంగ సహదేవుడు గమ్మున రండిరా. మన గుడిసెల దగ్గరకు చిన్నకారొచ్చింది. ఎలక్షన్ల ఓళ్ళు ఏమో. డబ్బులొస్తాయి రండి. '' ఆశ్చర్యపడుతూ అందరినీ పిలిచాడు భుజంగ స్వామి.
పది లక్షల రూపాయల కారులోంచి హుందాగా దిగాడు ఆజానుబాహు లాంటి వ్యక్తి. మేలిమి బంగారురంగు చేనేత బట్టలు ధరించి అదే రంగు శరీర ఛాయతో పొడవాటి ముక్కుతో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. కారు దిగగానే ఆ ప్రాంతవాసులు అందరినీ విడివిడిగా ఒక్కొక్కరిని పరిశీలనగా చూసి క్షణం పాటు బాధపడి దాన్ని దిగమింగుకొని జేబీలోంచి కర్చీఫ్ తీసుకుని నుదుటి మీద చెమట బిందువులనే కాదు కళ్ళల్లోంచి వస్తున్న కన్నీటి బిందువులను కూడా తుడుచుకున్నాడు ఆ వ్యక్తి.
''ఎవరు బాబ మీరు. ''
''సినిమా షూటింగు చేయడానికి వచ్చినారా. ''
''ఒరేయ్ సినిమా వాళ్లు లాగానే ఉన్నార్రా. ఐదు వేలు ఇస్తేనే గాని ఇక్కడ షూటింగ్ కి ఒప్పుకోవద్దు. ''
''ఆ కనపడే ఇళ్ళు అన్ని అలా తాళం కప్పలు వేసి ఉంచారేమిటి. '' అడిగాడు ఆ వచ్చిన వ్యక్తి.
''మావేనండి బట్టలు నేసుకునే వాళ్లమండి బాబ, మేము. మా బతుకులు రాబందులు పీకుతున్న శవంలాగా అయిపోయాయి. అప్పులు ఇచ్చినోళ్ళు ఊరుకుంటారా ఇవన్నీ రాయించేసుకున్నారు. మా ఇరవై కుటుంబాల వాళ్ళం ఎక్కడికి పోలేక ఇదిగో మా ఇళ్లకి కూతంత దూరంలో ఈ సెరువుగట్టు మీదే ఈ చెట్ల కింద చస్తూ బ్రతుకుతూ గడి పేస్తున్నాం. '' అన్నాడు వాళ్లల్లో పొడుగ్గా ఉండే గణపతి.
''ఇంతకీ మీరెవరు బాబ'' అడిగాడు ప్రసాదరావు.
''చెప్తాను. మీ కులవృత్తి చేసుకుంటున్న ఆనవాళ్లు లేవు ఎలా బ్రతుకుతున్నారు. '' అడిగాడు మళ్లీ ఆ వ్యక్తి.
''ఒరేయ్ టీవీ ఓళ్ళు ఏమోరా. నేను చెబుతాను బాబు. బ్రతకలేనోడు ఎలా బతుకుతాడు బాబు. మూడు ముక్కల్లో చెప్పాలంటే చేనేత పని మమ్మల్ని వదిలేశాక అడుక్కు తింటున్నాం. కొంతమంది చిన్న చిన్న దొంగతనాలు అలవాటు పడ్డారు. రత్తమున్న ఇలాంటి కుర్రోళ్ళు రైల్వే స్టేషన్ లో బరువులు మోసి చివరాఖరుకు రిక్షాలు లాగి అలా అలా గాలికి బ్రతికేస్తున్నారు బాబు. ఈ పల్లెలో మగ్గాలు శబ్దాలు చేసి చాలా సంవత్సరాలు అయినాది. '' వివరంగా వివరించాడు పాండురంగ.
''ఇంతకీ తమరు ఎవరు బాబ.. '''
''చెప్తానన్నాను కదా. ఇక్కడ యశోదమ్మ అని ఒక ఆవిడ.. ''
''బ్రతికే ఉంది బాబ. దాని కొడుకు, కోడలు, మనవడు ఈ ఊరు నుంచి పారి పోయినారు. అదే పుష్కరంనర నాటి మాట. ''
''ఆయమ్మ ఉండేది ఆ సెట్టు కింద. చచ్చిపోద్దని భయ మేసి మేమందరం నాలుగు కర్రలు తెచ్చి రెండు తాటాకుల పైన ఏసాం. అక్కడే ఉంది సూపిస్తాను రండి. '' అటు తీసుకు వెళుతూ అన్నాడు సహదేవుడు.
''రండి రండి ఇదిగో వచ్చేసాం. '' అన్నాడు రమణయ్య.
అందరూ చెట్టు దగ్గరికి చేరిపోయారు. 'యశోదమ్మ.. యశోదమ్మ.. '' అంటూ పిలిచాడు రమణయ్య.. ఆమె 80 ఏళ్ల వృద్ధురాలు. నీరసంగా తల పైకెత్తి చూసింది. ఆ వచ్చిన వ్యక్తి ఆమె ఎదురుగా కూర్చుని ఆమె కళ్ళల్లోకి అలా చాలాసేపు చూశాడు. ఆమె ఆశ్చర్యంగా కళ్ళు మరింత పెద్దవి చేసుకొని.. 'ఎవరూ.. ' అంటూ మాట్లా డింది.
మళ్లీ ఆమె మరింత ఆనందంతో అందరి వైపు తలతిప్పి..
'రేయ్ ఈడు నా మనవడురా పార్థసారథిగాడు' అంటూ ఆశ్చర్యంగా చెప్పింది.
''నానమ్మ.. బాగున్నావా. '' అంటూ ఆనందంగా పలక రించాడు ఆ వచ్చిన వ్యక్తి పార్థసారథి.
అందరూ ఆశ్చర్యంగా.. 'అమ్మో మన సారధిగాడు.. మన సారధి గాడు.' అంటూ ఆనందంగా ఎగిరేరు.
''ఎంత గొప్పోడు అయిపోయాడు. అప్పులోల్లకు భయపడి ఈల్ల నాన్న సాంబమూర్తి పారిపోతే పారిపోయాడు గాని మన సారథి గాడు మాత్రం సానా గొప్పోడు అయిపోయా డురా. '' మహదానందంగా అన్నాడు ప్రసాదరావు.
''ఒరేయ్.. ఆడినిప్పుడు.. 'ఆడుఈడు' అనకూడదురా."
పార్థసారధి పాత స్నేహితులు భయపడినట్లుగా కొంచెం దూరం జరిగారు.. సారధి ఉబికి వస్తున్న కన్నీటిని ఆపు చేసుకోలేకపోయాడు. ఎవరో సత్తు గ్లాసుతో టీ తెచ్చి ఇచ్చారు. ఆ గ్లాసు అంచులకు ఈగలు మూగి అసహ్యంగా ఉంది. నోట్లో వేలు పెట్టుకుని చీమిడి ముక్కులతో వస్త్ర హీనంగా ఉన్న చిన్న పిల్లలు చొంగలు కార్చుకుంటూ బొమ్మ ల్లా చూస్తూ ఉండిపోయారు దూరంగా.
''అప్పుల బాధతో ఇక్కడ నుండి మేము పారిపోయాక ఎంతో కష్టపడి చివరికి మూటలు మోసి, బజ్జీలు అమ్మి, రిక్షా లాగి.. అమ్మ నాన్న నన్ను ఇంటర్ చదివించారు. ఇంజనీరిం గ్ పరీక్షలో మొదటి ర్యాంకు రావడంతో ఓ మంచి మనసున్న పెద్దాయన నా చదువుకు డబ్బు ఖర్చు పెట్టడానికి ముందుకు వచ్చాడు. అలా ఇంజనీర్ అయ్యాను. బెంగ ళూరులో నెలకు 25 వేల రూపాయల ప్రారంభ జీతంతో ఉద్యోగం వచ్చింది 6 ఏళ్లక్రితం. అలా అలా ఇప్పటికీ నెలకు రెండు లక్షల రూపాయల జీతగాడినయ్యాను.
మా అమ్మ సీతమ్మ ఈ ఆనందం పంచుకోకుండా క్యాన్సర్ తో ఎప్పుడో చచ్చిపోయింది. జీవితంలో ఓడిపోయిన మానసిక వేదనతో మతితప్పిన నాన్న సాంబమూర్తి మా దగ్గరే ఉంటున్నాడు. ఎవరిని గుర్తు పట్టే స్థితిలో లేడు. ఆయన ఆలనా పాలనా చూడడానికి నా భార్య కోడలే గాని కూతురు, భార్య కాదుకదా. అందుకనే నానమ్మను తీసుకెళదామని వచ్చాను. కానీ నానమ్మ పరిస్థితి చూశాక.. ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. వచ్చినందుకు మీతో ఈరోజు గడిపి రేపు వెళ్తాను. నానమ్మ ఆరోగ్యం కూడా బాగుండలేదు కనుక మిగతా విషయాలు ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను. '' వాళ్లందరి వైపు చూస్తూ జరిగిన విషయాలన్నీ చెప్పాడు పార్థసారథి.
''బాబు అంతా మీ ఇష్టం. కానీ రేపు ఎళ్లే ముందు మీరు గొప్పోళ్ళు అయ్యారు కనుక మా అందరికీ తలో వెయ్యి రూపాయలు ఇచ్చి వెళ్లాలండి. ఎలాగోలా గంజి నీళ్లు తాగుతూ ఒక నెల రోజులు హాయిగా బతికేత్తం. '' ఓ పెద్దావిడ ముందుకు వచ్చి అంది.
''అదేంటి బాబు అట్ట చూత్తున్నారు.. ఇవ్వలేరా. చివరాకరకు తలా 500 ఇస్తేనే కానీ మిమ్మల్ని కదలనివ్వ. ఎందుకంటే మీ నాన్న సాంబమూర్తికి మా వాళ్ళు నూలు కొనడానికి, రంగులు, కండెలు కొనడానికి చాలా సార్లు అప్పులు ఇచ్చారు.. ఓ ఫైనాన్స్ కంపెనీ రెడ్డిగారు మీ అమ్మని, నాన్నని కొట్టడానికి వస్తే నిన్ను మీ అమ్మని నాన్నని మేమందరం దాచిపెట్టి ఈ ఊరు నుంచి అర్ధరాత్రి అలా పంపించేసాం. అది గుర్తుకుతెచ్చుకునైనా మాకు సాయం చేసి ఎల్లాలి బాబు. ఇది మడిషి ధర్మం. '' ఓ ముసలాయన ముందుకు వచ్చి నమస్కారాలు పెడుతూ అడిగాడు భయంభయంగా.
''ఇయ్యకపోతే ఈ కారుకు అడ్డంగా పడుకుంటాం సారథి. '' చిన్ననాటి స్నేహితులు ముందుకు వచ్చి అన్నారు
పార్థసారథి మౌనంగా ఉండిపోయాడు తన మెదడులో పాత జ్ఞాపకాలు తొలిచేస్తున్నాయి. ఒకసారి తన మిత్రులు అందరిని దగ్గరకు తీసుకొని గుండెలకు హత్తుకొని వదిలి పెట్టి అక్కడ నుండి కొంచెం దూరంగా వెళ్లి ప్రశాంతంగా ఉన్న గానుగచెట్టు కింద కూర్చుని ఆలోచనలో పడ్డాడు.
**
అంతకు ముందు రోజు
''లలితా.. రేపు ఒకసారి మా ఊరు వెళదాం. సిద్ధంగా ఉండు. మా నానమ్మని తీసుకొద్దాం. ఇక్కడ నాన్నకు సాయంగా ఉంటుంది. ''
''ఆ చేనేత దారాలు, ఆ రంగులు, ఆ శబ్దాలు, ఆ బాధలు వీట్లకి దూరంగా ఉంచాలని నాన్న.. వాటిలన్నిటికీ దూరంగా ఉన్న మీకు.. నన్ను ఇచ్చి పెళ్లిచేశారు. ''
''అది సరే లలితా.. ఆ పడుగు పేకరకం నూలుకు రంగులు అద్దమనడం లేదే నిన్ను, డబ్బాల పడుగురకం పేకరకం కండెలుగా చుట్టమనడం లేదే, పడుగుకు గంజి పట్టించ మనటం లేదే, పాగుళ్ళకి అల్లు పట్టి మగ్గం పైకి చేర్చ మనటం లేదే, రంగురంగుల పేకలతో 18 గంటలు కష్ట పడి బట్టనేయమనడం లేదే.. కేవలం మా ఊరు వస్తావా అని అడిగాను. ''
''ఎందుకండీ, మీరు వాళ్లందరు గురించి, మీ ఊరు గురించి అలా తాపత్రయపడతారు. మీరు ఒక్కరు ఆ నేత పని వాళ్ళ జీవితాలను మొత్తం మార్చేద్దామనుకుంటున్నారా. వాళ్లు బ్రతుకేదో వాళ్లు బ్రతుకుతున్నారు కదా. ఈ ప్రపంచ ఉద్ధరణ మీకెందుకు. ''
''బ్రతుకుతున్నారు బాగా బ్రతుకుతున్నారు లక్ష్మి. నమ్ము కున్న వృత్తి కూడు పెట్టక కడుపులో కాళ్లు పెట్టకొని పడుకుంటున్నారు. వాళ్ల జీవితాలకు రేపటి అన్నం ముద్దకు భరోసా లేదు. ఒక మూల నెత్తి మీద ఉరుముతున్న అప్పుల భారం. పొద్దుగుంకే దాకా పోగులన్నీ పేని రంగు రంగుల బట్టలు చీరలు తయారు చేస్తే రాత్రి వేళకు గంజి నీళ్లు కూడా ఉండవు వీళ్ళకు. పడుగు పోగులన్నీ చిక్కు తీసి అందంగా పెడతారు. కానీ వీళ్ళ జీవితాలే చిక్కుబడి సిగ్గుపడిపోతున్నాయి. పడుగు పోగులన్నీ ఉరి వేసుకోవడానికి సిద్ధంగా ఉన్న వేలాడుతున్న ఉరితాళ్ళులా కనబడుతుంటాయి వీళ్ళకి. అలాగని మరమగ్గాల మీద పని చేసే చేనేత కార్మికులు కూడా పంచభక్ష్యపరమాన్నాలు తినడం లేదు. వాళ్ల ఆత్మహత్యలు కూడా సంవత్సరం సంవత్సరం పెరుగుతున్నాయి. ''
''నన్ను మాటలతో ఎలా హింస పెడుతున్నారు. నా తండ్రి గారి కుటుంబం కూడా నా చిన్నప్పుడు మీరు చెప్పిన ఈ కష్టాలన్నీ పడ్డారు. మా వాళ్లు వేరే వృత్తిని ఆశ్రయించి బ్రతకడం నేర్చుకున్నారు. వాళ్ళ దశ తిరగబడి లక్షాధికారులు అయ్యారు. అటువంటి కష్టాల వృత్తికి మీరు దూరంగా ఉన్నారు కదా అని మిమ్మల్ని ఏరికోరి నన్ను సుఖ పెడతారని మీకిచ్చి పెళ్లి చేశారు. జీవితంలో ఆనందాలన్నీ అనుభవించాలి అని నేను అనుకుంటుంటే మీరేంటండీ మళ్లీ ఈ రొంపిలోకి లాగడానికి ప్రయత్నిస్తున్నారు. చివరగా చెప్తున్నాను ఆ నరకానికి దూరంగా నేను నా బిడ్డలు ఉండాలని నిర్ణయించుకున్నాము.
''ఛి ఛి భర్తను అర్థం చేసుకోలేని భార్య. అందులోనే పుట్టిన నీకు ఇప్పుడు చేనేత వృత్తులు నరకంగా అనిపిస్తున్నాయా. అయితే నేనిప్పుడూ నీకు ఓ నరకాసురుడిలా కనిపిస్తున్నా నన్నమాట''
''ఈ ఒక్క విషయంలోనే కదా మీకు నాకు చాలా కాలం నుండి ఏకీభావం కుదరటం లేదు. నా మనసు మార్చు కోలేకపోతున్నాను. మీరే ఏదైనా ఆలోచించుకోండి. ''
ఇంకా ఉంది
ఇంద్రలోక వైభవం పెద్ద కథ రెండవభాగం త్వరలో
**
నల్లబాటి రాఘవేంద్ర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.



రచయిత పరిచయం: నల్లబాటి రాఘవేంద్ర రావు
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
ముందుగా " మన తెలుగు కథలు" నిర్వాహకులకు నమస్సులు..
"రచయిత పరిచయం"..... ఇది చాలా ముఖ్యం.
రచయిత తన గొప్పలు చెప్పుకోవడం కాదు గాని తన గతచరిత్ర వివరాలు అందరికీ తెలియ చేయటం అవసరమే. ఈ చర్య ఆ రచయితకు మానసికంగా ఎంతగానో ఉపయోగపడి అతను మరిన్ని మంచి మంచి రచనలు చేసి సమాజానికి అందించే అవకాశం ఉంది.. ఎంతో పెద్ద ఆలోచనతో అలాంటి 'మహా ప్రయత్నం'.. చేస్తున్న 'మన తెలుగు కథలు' కు మరొక్కసారి అభినందనలు.
పునాది....
-----------
ఏడు సంవత్సరాలు వయసు నాది. మా తండ్రి సుబ్బారావు గారు ప్రోత్సాహంతో శ్రీ కృష్ణార్జున యుద్ధం అనే 10 నిమిషాల నాటకాన్ని నేనే రాసి కృష్ణుడి వేషం నేనే వేసి దర్శకత్వం నేనే చేసి పెద్ద స్టేజి మీద దసరా నవరాత్రులకు ప్రదర్శించాము.
ఆ తర్వాత భక్త ప్రహ్లాద లో ప్రహ్లాదుడు గా.. మరో నాటకంలో శ్రీరాముడుగా.. రచన దర్శకత్వం నాదే.. ఏడు సంవత్సరాల వయస్సు.
తర్వాత పదిహేను సంవత్సరాల వయసులో
టెన్త్ క్లాస్ యానివర్సరీ కి 15 మంది నటులతో నా దర్శకత్వం లో పెద్ద స్టేజి మీద నాటకం వేసాము.
అప్పుడే నేను రచయితను కావాలన్న
ఆశయం మొగ్గ తొడిగింది.
నా గురించి..
---------------
50 సంవత్సరాల సుదీర్ఘ సాహితీ ప్రయాణం.
450 ప్రచురిత కథల రచన అనుభవం.
200 గేయాలు నా కలం నుండి జాలువారాయి
200 కవితలు నా మేధస్సు నుండి ఉద్భవించాయి
20 రేడియో నాటికలు ప్రసారం.
10 టెలీఫిల్మ్ ల నిర్మాణం.
200 కామెడీ షార్ట్ స్కిట్స్
3 నవలలు దినపత్రికలలో
" దీపావళి జ్యోతి "అవార్డు,
"రైజింగ్స్టార్" అవార్డు
" తిలక్ స్మారక" అవార్డు... మరికొన్ని అవార్డులు.
ప్రస్తుత ట్రెండ్ అయిన ఫేస్బుక్ లో ముఖ్యమైన 15 గ్రూపుల్లో... ఇంకా అనేక వెబ్ సైట్లు, బ్లాగులు,ఆన్లైన్ పత్రికలలో యాక్టివ్ గా తరచు నాకథలు, కవితలు,గేయాలు, ముఖ్యంగా కామెడీ షార్ట్ స్కిట్స్ ప్రతి రోజూ దర్శనమిస్తూ ఉంటాయి..
రమారమి 75 అవార్డులు, రివార్డులు అందు కున్నాను... అని గర్వంగా చెప్పుకునే అవకాశం కలగటం... ఆ చదువులతల్లి అనుగ్రహమే!
ఇదంతా ఒక్కసారిగా మననం చేసుకుంటే... 'పడని సముద్ర కెరటం' లా... నూతనశక్తి మళ్లీ పుంజుకుంది.
ఇక నా విజయ ప్రయాణగాధ....
------+------------------------------
పేపర్లెస్ రచయితగా... ఒక కుగ్రామం లో పేరు ప్రఖ్యాతులు పొందిన నా తండ్రి సుబ్బారావు గారు నా ఆలోచనలకు, రచనలకు ప్రాణప్రతిష్ట చేసిన ప్రథమగురువు. తల్లి వీరభద్రమ్మ నాకే కాదు నా కథలకూ ప్రాణదాతే!!
తదుపరి రమారమి 50 సంవత్సరాల క్రితమే.. మా ఊరివాడైన నా జూనియర్ క్లాస్మేట్... నా స్నేహితుడు ఇప్పటి సినీ దర్శకుడు " వంశీ "... కథలు రాస్తూ... నన్ను కూడా కథలు రాయ మని... చెప్తుండేవాడు. అప్పటి నుండి ఎక్కువగా రాయడం మొదలు పెట్టాను.ఆ తర్వాత మా ఊరి వారైన సినీ గేయరచయిత
" అదృష్టదీపక్".. నా కథలు.. చదివి.. మెచ్చు కునే వారు.. దాంతో ఇంకా విరవిగా కథలు రాయడం మొదలు పెట్టాను.
1. మొదటి రచన 1975 నాటి ప్రఖ్యాత పత్రిక "ఆంధ్రసచిత్రవారపత్రిక" లో బుద్ధిలేనిమనిషి కథ.
2. రేడియో నాటికలు గొల్లపూడి మారుతీ రావు గారి సమకాలంలో విరవిగా వచ్చాయి.
3. సినిమాకథలపోటీ లో అలనాటి "విజయచిత్ర" ద్వితీయబహుమతి కథ.. "డిసెంబర్ 31 రాత్రి"
4. ఉగాది కథలపోటీ "ఆంధ్రభూమి" బహుమతి కథ
5. ఉగాది కథల పోటీలో "ఆంద్రజ్యోతి" బహు మతి కథ
6. దీపావళి కథలు పోటీలో "ఆంధ్రజ్యోతి" బహుమతి కథ.
7. అప్పాజోస్యుల( అమెరికా) నిర్వహించిన కథల పోటీలో "నలుగురితో నారాయణ".. ఆంధ్రప్రభ విశిష్ట కథ ప్రచురణ
8. అల్లూరి స్మారక జయంతి "కళావేదిక " కరప తిలక్ స్మారక అవార్డు కథ " బ్రతుకు జీవుడా"
9. "స్వాతి " తానా అమెరికా కథల పోటీలో ప్రచురణ కు ఎన్నికైన కథ..." వైష్ణవమాయ."
10. రాష్ట్రస్థాయి కథలపోటీ హైదరాబాద్ "నిమ్స్"ద్వితీయ బహుమతి కథ..న్యాయనిర్ణేత శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి." బంగారు పేకమేడ"
11. "అనిల్ అవార్డ్" స్వాతి కన్సోలేషన్ బహు మతి..." అమృతం కురిసింది"
12. సస్పెన్స్ కథల పోటీ "స్వాతి" లో ఎన్నికైన కథ
13. "పులికంటి సాహితీ సంస్థ" రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన కథ..
14. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆరాధన" హైదరా బాద్ ద్వితీయ బహుమతి కథ.." అదిగో స్వర్ణ యుగం" న్యాయనిర్ణేత జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.. శ్రీ రావూరి భరద్వాజ గారు.
15. "అభ్యుదయ ఫౌండేషన్" కాకినాడ రాష్ట్ర స్థాయి అత్యుత్తమ కథ.. " ఐదేళ్ల క్రితం " .
16. సి.పి.బ్రౌన్ "సాహితీ స్రవంతి".. ప్రత్యేక కథ
" ఇంద్రలోకం".
17. కొమ్మూరి సాంబశివరావు స్మారక సస్పెన్సు కథల పోటీలో "నవ్య' ప్రచురణకు ఎన్నికైన కథ.
18. "వేలూరు పాణిగ్రహి" విజయవాడ " గాంధీ తాత" రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి కథ.
19. 'కదలిక'... సర్వశిక్షఅభియాన్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మింపబడిన అత్యున్నత టెలీ ఫిల్మ్... చిన్న సినిమా.
20. "అల కమ్యూనికేషన్" హైదరాబాద్ కథల పోటీలో ఎంపికైన కథ...." హృదయానికి శిక్ష".
21. రాష్ట్రస్థాయి కథలపోటీ "మైత్రేయ కళాసమితి" మెదక్.. పుస్తక సంకలనానికి ఎన్నికైన కథ. "బిందెడు నీళ్లు".
22. రాష్ట్ర స్థాయి కథల పోటీలు "జాగృతి" కన్సోలేషన్ బహుమతి కథ "ఆలస్యం అమృతం విషం"
23. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్ర ప్రదేశ్" పత్రిక ప్రత్యేక బహుమతి హాస్య కథ.
24. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్రప్రభ" ప్రచురణకు ఎంపికైన కథ.
25. దీపావళి కథల పోటీ "ఆంధ్రభూమి" ప్రచురణ కు ఎన్నికైన కథ.
26. రాష్ట్రస్థాయికథల పోటీ "ఆప్కో ఫ్యాబ్రిక్స్" హైదరాబాద్ నిర్వహణ పోటీ లో ఎన్నికైన కథ.
27. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆంధ్రప్రదేశ్పత్రిక" కు ఎన్నికైన హాస్యకథలు." చంద్రమండలంలో స్థలమును అమ్మబడును".
28.దీపావళి కథల పోటీ "జాగృతి" పత్రిక కు ఎన్నికైన కథ.
29. "హాస్యానందం" విశేష స్కిట్స్ కొరకు.. "రైజింగ్ స్టార్".. అవార్డు.
30 ఆంధ్రజ్యోతి "భావ తరంగం" వారం వారం 30 కథలు.
31. "కళా దర్బార్" రాజమండ్రి.. రాష్ట్రస్థాయి కవితలపోటీలలు... 4 సంవత్సరాలు ఉత్తమ కవిత్వానికి ప్రథమ బహుమతి...మూడుసార్లు.. ఉత్తమ కవిత్వానికి ద్వితీయ బహుమతి.
32.."హాసం" మాస పత్రిక లో ప్రచురింపబడిన "చిరాకు దంపతులు చింతకాయ పచ్చడి" కథ చదివిన చాలా మంది సినీ ప్రముఖులు ఫోన్ కాల్స్ చేసి అభినందించడం.
33. ప్రఖ్యాత సిరివెన్నెల పత్రికలో సిరివెన్నెల సీతా రామశాస్త్రి గారి నిర్వహణలో జానపద పాటల పోటీలో ప్రథమ బహుమతి పాటకు వారి నుండి పత్రికాముఖంగా ప్రత్యేక ప్రశం సలు.. తదుపరి ఆ పాట అనేక రంగస్థల ప్రదర్శనలు పొందడం.
34. విశేష కథలుగా పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కథలు
నలుగురితోనారాయణ
కొరడా దెబ్బలు
అమృతం కురిసింది.
వైష్ణవమాయ
ఐదేళ్ల క్రితం
ఇంద్రలోకం
బిందెడు నీళ్లు
చంద్రమండలంలో స్థలములు అమ్మబడును
డిసెంబర్ 31 రాత్రి
మహాపాపాత్ముడు
35. రాజమండ్రి ,కాకినాడ ,విజయవాడ, విశాఖ పట్నం ,రామచంద్రపురంలో.. విశేష సన్మానాలు.
ప్రస్తుతం...
1. ఒక పరిశోధన నవల.. ఒక చారిత్రక నవల రాసే ప్రయత్నం
2. పరిషత్ నాటికలు జడ్జిగా..
3. కొందరు సినీప్రముఖుల ప్రోత్సాహంతో..
సినిమాలకు కథ మాటలు స్క్రీన్ప్లే అందించే ప్రయత్నం.
4. .. 4 కథల సంపుటిలు... రెండు కవితా సంపుటిలు.. 1గేయ సంపుటి.. 2 కామెడీ షార్ట్ స్కిట్స్.. రెండు నాటికల సంపుటిలు..ఒక నవల ప్రచురణ తీసుకొచ్చే ప్రయత్నం.
5. ఒక ప్రింటెడ్ పత్రిక ప్రారంభించే ఉద్దేశ్యం.
భార్య.. గోవిందీశ్వరి... హౌస్ వైఫ్.
కుమారుడు... వెంకట రామకృష్ణ .. బి.టెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్... మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్.
కోడలు... మాధురీ లత..... ఎం ఫార్మసీ.
కుమార్తె.. సౌభాగ్య.. స్టూడెంట్.
మనుమరాలు.. ఆద్య... యాక్టివ్ బేబీ.
నా కథలను ఆదరించి తమ అమూల్య అభి ప్రాయాలు తెలియజేస్తున్న... రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ... వినమ్ర నమస్సులు.
నల్లబాటి రాఘవేంద్ర రావు
