ఒక ముల్లు మల్లెమొగ్గగా మారాలని..

Oka Mullu Mallemoggaga Maralani - Telugu Family Story | Pandranki Subramani
ఒక ముల్లు మల్లెమొగ్గగా మారాలని.. - తెలుగు కుటుంబ కథ | పాండ్రంకి సుబ్రమణి
| ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత
Published In manatelugukathalu.com On 23/10/2026
ఒక ముల్లు మల్లెమొగ్గగా మారాలని పాండ్రంకి సుబ్రమణి రచించిన హృద్యమైన తెలుగు కుటుంబ కథ. కొడుకు కోసం యోగానంద్ చేసే పోరాటం, కుటుంబ కలహాలు, చివరికి మనసు మారి ప్రేమకు దారితీసే పరిణామాలు ఈ కథలో హృదయాన్ని తాకుతాయి.
ఇలలో కష్టాలు ఎదుర్కొనని వారుండరు.
ఇక—మరింత లోతుగా చెప్పాలంటే—కష్టాలెరుగని వారు ఇలలో ఉండనే ఉండరు.
ఐతే—కొందరికి కొన్ని కష్టాలు పిలువని పేరంటాల్లా ఒరసుకుంటూ వచ్చి ఎదురొస్తాయి.
పలకరిస్తుంటాయి. తప్పుకోనివ్వని రీతిన, సందు దొరకనివ్వని పంథాన పొత్తురాళ్లలా పైన పడి ఊపిరాడనివ్వని తీరున తాకుతూనే ఉంటాయి.
వెంట తరుముతూనే ఉంటాయి. మనిషికి అలా జరగడానికి కర్మే కాదు—గ్రహాల కదలికల ప్రభావం కూడా కారణం కావచ్చు.
గత జన్మ పాప పుణ్యాల ఫలితం కూడా కారణం కావచ్చు. కానీ—కష్టాలూ ఇక్కట్లూ అదే పనిగా, వాటికి వేరే పనులేవీ లేవన్నట్లుగా ఒకే ఒక వ్యక్తిపైన ఏక లక్ష్యంతో గురిచూసి దాడి చేయవు; తడి గుడ్డను పిండేసినట్టు ఏకబిగిన నలిపి పులిమేయవు.
మరి అదేం ఖర్మో గానీ, యోగానంద్‌ని కష్టాలు, సమస్యలూ సమ్మిళితమై అలుపెరగని కవ్వంలా, గిరగిర తిరిగే తిరగలిలా నులిపేస్తూనే ఉన్నాయి.
అలాగని అతడు అచేతనుడై, అసహాయుడై కూర్చున్నాడా!—లేదు. పలుసార్లు సర్పదోష గ్రహదోష నివారణ కోసం కాళహస్తి వరకూ, మరొకసారి కాంచీపురం వరకూ వెళ్ళి శివాలయాలలో యాగాలు చేసి వచ్చాడు.
పరిహార పూజలు చేసి కూడా వచ్చాడు. ప్ఛ్—ఫలితం మాత్రం కానరావడం లేదు. సమస్యల పొత్తురాళ్ళు పడుతూనే ఉన్నాయి.
దాదాపు సంఘటనలన్నీ ఒకటి తర్వాత ఒకటిగా గగన మార్గాన గుంపుగా కూడబల్కుకుని పంతం పట్టినట్టు అతడికి ప్రతికూలంగానే వికటిస్తున్నాయి, నాన్ స్టాప్ సెంటిమెంటల్ ధారావాహికలా-- ఇంకా ఆ రీతినే జరుగుతూనే ఉన్నాయి.
మొదట్లో అవి కుటుంబంలో జరిగాయి, జీవితంలో జరిగాయి, ఇప్పుడేమో కోర్టులో కచేరీ రూపంలో జరుగబోతున్నాయి.
కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా తనకు అనుకూలంగా మలచుకోలేకపోతున్నాడు. ఎందుకోసం తొందరపడిందో తనకే తెలియదు—ట్రైను కోసం మూడు గంటలు ముందే స్టేషన్ చేరుకున్నట్టు భార్గవి తన ముద్దుల కొడుకుని తనకు అప్పజెప్పి ప్రశాంతంగా పైలోకాలకు చేరిపోయింది.
తన కోసం గానీ, తన ఒక్కగానొక్క బిడ్డ కోసం గానీ ఆలోచించిందా!—లేదు.
చాలా అత్యవసరమైన పనిపైన ఎవరిదో పిలుపందుకున్నట్టు వెళ్ళిపోయింది తనను ఒంటరివాణ్ణి చేసి-- ఇక అంతకంటే ప్రతికూల అంశం ఏమంటే—తెలిసి కూడా పెద్దింటి పిల్లయిన భార్గవిని మనసారా ప్రేమించడం-- అంతటితో ఊరుకున్నాడా! లేదు.
ఎడాపెడా అందర్నీ ఎదిరించి—‘అంత డబ్బుగలవాళ్ళ అమ్మాయిని కోడలు పిల్లగా తేకురా మొర్రో--’ అని
అమ్మా నాన్నలిద్దరూ బిగ్గరగా వాపోతున్నా పెడచెవిన పెట్టి—భార్గవి
అమ్మానాన్నలతో, బంధువులతో హమీతుమీ తేల్చుకుని గుడి ప్రాంగణంలో మంగళసూత్ర ధారణ చేసి ఇంటికి తీసుకువచ్చేసాడు మీసాలు దువ్వుకుంటూ--
అప్పటి తెలుగు పౌరాణిక చిత్రాలలోని వీర గంభీర కథానాయకుడిలా--
ఇంకా నయం—అప్పుడు తననావహించిన ప్రేమ మోహంలో పడి గమనించలేదు గానీ, మెడలో పుస్తె కట్టే సమయానికి తెలుసుకున్నాడు, సరిగ్గా అప్పుడప్పుడే కటాబొటిగా మెజారిటీ తీరింది భార్గవికి;
ఆఖరు నిమిషాన కదులుతున్న రైలు బండి అందుకున్నట్టు-- అసలే అత్తగారు అండ పిండ బ్రహ్మాండాన్ని పుక్కిట బట్టగల క్రిమినల్ లాయర్. మామగారేమో భాగ్యనగర్ ఛేంబర్ ఆఫ్ కామర్స్‌కి వైస్ చైర్మన్.
అమ్మానాన్నలు చేసిన పుణ్యఫలం వల్ల, ఎలాగో ఒకలా వాళ్ళ జాయింట్ గండం నుండి తప్పుకోగలిగాడు; ముచ్చటగా సిగ్గుదొంతర్ల మధ్య మురిపెంగా యవ్వనంతో నేవళంతో మెరిసిపోతున్న భార్గవి నెత్తిన రెండు మొట్టికాయలు పెట్టి—భారీ వరద ముంపుకి లోనైన గోదావరి గట్టులా అంత డేంజర్ లెవల్లోనా తనకు మెజారిటీ తీరిందని అప్పటికప్పుడు చావుకబురులా చెప్పడం! అప్పుడు భార్గవి మాత్రం తక్కువ తిన్నదా-- తన కోపాన్ని చిన్నటి దరహాసంతో చిదిమేసింది— “మీరంటే నాకంత మోహం! ఆ మూడ్‌లో నిజం చెప్పకపోవడం గుణాంశం, స్త్రీత్వానికి సహజ మనోహరం” అని.
మరి తనపై అంతటి మోహం పెంచుకున్నది అంత అర్జెంటుగా ఎందుకు పైలోకాలకు టపా కట్టేసిందో!
ఇక చివరి ఘట్టంగా యోగానందానికి ఎదురైన సమస్య—గడ్డు సమస్య—తన కన్నకొడుకుని తన వద్దకు తీసుకురాలేకపోవడం.
భార్గవి పుట్టింటివాళ్ళు తనకు చెప్పాచేయ్యకుండా తను ఆడిట్ టూర్‌పైన ఉన్నప్పుడు అమాంతం గాలిలో తేలుతూ వచ్చి పావురాన్ని తన్నుకుపోయిన గ్రద్దలా ఎగరేసుకుపోయారు.
కన్న తండ్రి బ్రతికుండగా అదెలా సాధ్యమవుతుంది? ఇదేమిటి విడాకుల వ్యవహారమా కోర్టువారిచ్చిన కాల వ్యవధి ప్రకారం బిడ్డను అక్కడొకసారి ఇక్కడొకసారి ఉంచుకోవడానికి! తనిక క్షణం వృథా చేయకుండా ఫ్యామిలీ కోర్టులో కేసు ఫైల్ చేశాడు.
అప్పుడు కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు తనకు ఎదురైన ప్రతిబంధకాలు రెండు— అమ్మానాన్నా పొలం పనులు చూసుకోవడానికి, పనిలో పనిగా భూమి పట్టా పాస్ బుక్కు తెచ్చుకోవడం కోసం ఊరెళ్ళిపోవడం.
రెండవది— బుజ్జిగాణ్ణి ప్రక్కింటి పెద్దమ్మగారికి అప్పచెప్పడం-- వీటిని పేర్కొంటూ కేసు విచారణలో వాటినన్నిటినీ సెల్ఫీ ఫోటోలతో, వీడియోలతో ఉదహరిస్తూ కొడుకుని చూసుకోగల స్థితిలో తను లేడని, తన వద్దగానీ ఉంటే బిడ్డ భవిష్యత్తు ఛిన్నాభిన్నమవడం ఖాయమని క్రిమినల్ లాయర్ అయిన అత్తగారు తన క్రిమినల్ బ్రెయిన్‌ని ఉపయోగించి ఎమోషనల్‌గా వాదించి—దానితో బాటు ఒక తప్పుడు అఫిడెవిట్ కూడా ఇచ్చి బిడ్డను లాక్కుపోయింది; కుర్రాడికి మైనారిటీ తీరిన తర్వాత కన్న తండ్రికి భద్రంగా అప్పగిస్తామని.
ఈ మాట విన్నంతనే యోగానంద్ అమ్మానాన్నలిద్దరికీ గుండెలు పగిలినంత పనయింది. దుఃఖపు తెరల మధ్య కుమిలిపోతూ ఊరి నుంచి పరుగెత్తుకుంటూ వచ్చారు.
చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు అప్పుడు వృద్ధ దంపతులిద్దరూ తీరిగ్గా వచ్చి మొరపెట్టుకుంటే ఏం ప్రయోజనం? అప్పటికే కోర్టువారి ముందు సాక్ష్యాధారాలతో కథ దాదాపు ముగిసిపోయిందిగా! కోర్టుకి చెవులుంటాయి గానీ చూపుండదుగా!
ఇక విషయానికి వస్తే-- ఇంట్లోని వాళ్ళెంత కాలం మాత్రం హృదయభారాన్ని మోయగలరు? ఆ దుఃఖభారాన్ని వాళ్ళు మోయగలరనుకున్నా వాళ్ళ వయసు తట్టుకోవద్దూ! యోగానంద్ అక్షరాలకు ఊహలు అందని రీతిన ఖిన్నుడైపోయాడు.
ఇక కాస్తంత వెనక్కి తిరిగి చూస్తే అతడికి ఒక విషయం సంపూర్ణంగా అవగతమవుతోంది. తను కూపీతీసిన వైనం ప్రకారం— ఈ తతంగం వెనుక అతి ముఖ్యమైన, అతి పదునైన పాత్ర వహిస్తున్నది నిజంగా వాళ్ళ చిన్నకూతురే— భార్గవి తోబుట్టువయిన కమలే! అది కూడా తల్లికి ఏమాత్రం తీసిపోనట్టు ‘లా’ చదువుతోంది.
లా-పాయింట్స్‌తో కోర్టు ప్రొసీడింగ్స్‌ని గిరికీలు తిప్పేస్తుంది. చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకం.
వయసుకు వచ్చిన పిల్ల అన్న ధ్యాస మరచి దానిని ఎలాగో ఒకలా అమాంతం ఎత్తుకుపోయి దండకారణ్యంలోనో, నల్లమల అడవుల్లోనో పడేసి వస్తే గానీ తన సమస్యకు ముగింపు కలగనట్లుంది.
ఎంతటి విద్యాధికురాలయితే మాత్రం— ఈ సుకుమార యుక్త వయసులో దానికేమిటి తనపైనా, తన అమ్మానాన్నలపైనా అంతటి కక్ష! కోర్టు వసారాలో కేసు వాదించడంలో అత్తామామలకు కమలే ప్రక్కనుండి లా-పాయింట్స్ అందిస్తుంటుంది— తనను ఇరకాటంలోకి నెడుతూ-- ఇందులో సందేహం లేదు.
ఆ మధ్య తను మరొకటి కూడా విన్నాడు; అదేదో లీగల్ ప్రొఫెషనల్ సర్టిఫికేట్ కోర్సులో చేరిందని— లీగల్ బ్రెయిన్‌ని మరింత పదును పెట్టాలని--
ఆ రోజు నగరం హైవేకి దగ్గర్లో ఉన్న ముత్యాలపేట మిట్టపైన గుమికూడారు కార్యాలయ సహోద్యోగులందరూ-- మొత్తం ఆరుగురు, యోగానంద్‌తో సహా-- స్టాటిస్టికల్ సెక్షన్ సూపర్ వైజర్ సుందరమే మొదటి ప్రస్తావన తెచ్చాడు— “ఏమిట్రా యోగీ! ఈ మధ్య నువ్వు మరీ దిగాలుగా మందనుండి వేరుపడ్డ గొర్రెపిల్లలా తయారయ్యావని మనవాళ్ళు తెగ గగ్గోలుపడిపోతున్నారు.
కార్యకారణం చెప్తే మాకు చేతనైంది చేయడానికి ప్రయత్నిస్తాం కదా! చెప్పవలసిన విషయమైతే చెప్పు, లేకపోతే చెప్పకు—అది నీ ఇష్టం. కానీ మమ్మల్ని మాత్రం నిస్తేజుల్ని చేయకు— నీ ఆవాలకంలో చూస్తూ ఊరుకోలేం--”
“అవునురా యోగీ! నువ్వు మా తరపున రాబోయే ఎలక్షన్‌లో యూనియన్ ఆఫీస్ బేరర్‌గా నిలుస్తావనుకున్నాం.
కానీ చివరి క్షణాన వెనక్కి లాక్కున్నావు. చురుగ్గా ఉంటావు— నువ్వే ఇలా డబ్బా కొట్టేస్తే ఎలారా?”— అకౌంట్స్ సెక్షన్ సూపర్ వైజర్ రామారావు రంగంలోకి దిగాడు.
యోగానందం వెంటనే స్పందించలేదు. వెళ్ళిపోతున్న కుర్రవాణ్ణి పిలిచి అందరికీ వేరుశెనక్కాయల పొట్లాలు ఇప్పించి నిదానంగా జరిగిందంతా చెప్పాడు— అదంతా విని మిత్రులందరూ ‘ఔరా!’ అని ముక్కున వేలేసుకున్నారు. అప్పుడు వాళ్ళలో ఒకడైన ఆడిట్ సెక్షన్ తల గుమాస్తా గుర్నాథం చప్పున లేచాడు— “నా కోసం కొంచెం ఆగండి.
ఇదేదో ఎమోషన్స్‌తో కూడుకున్న లిటిగేషన్ కేసులా ఉంది. ఇక్కడ తొందరపాటుకి తావుండకూడదు. ఇక్కడికి దగ్గర్లోనే ఉన్నాడు క్యాష్ సెక్షన్ సూపర్ వైజర్— దిగ్విజయ్-- అతణ్ణి పిలుద్దాం. ఆధ్యాత్మిక చింతన గలవాడు, సామాజిక స్పృహ గలవాడు.
కాబట్టి నిష్పక్షపాతంగా చెప్పేస్తాడు ఉన్నదున్నట్టు-- నిమిషం ఆగండి” అంటూ సెల్ ఫోన్ నుండి కాల్ ఇచ్చాడు.
అతడన్న ప్రకారం పది నిమిషాలలో దిగ్విజయ్ హాజరయ్యాడు.
అప్పుడు యోగానంద్ గతాన్ని రిపీట్ చేశాడు. అంతా విన్న తర్వాత అతడు కూడా అదే మాటన్నాడు— “దిస్ ఈజ్ రియల్లీ యాన్ ఎమోషనల్ ఇష్యూ-- దీనిని పరిష్కరించడానికి మధ్యే మార్గం వెతకాలి.
ఇరు కుటుంబాలకూ కావలసినవాడు కుర్రాడు. ఎడాపెడా కేసులు మీద కేసులు వేస్తూ తిరిగితే కర్ర విరిగిపోతుంది, పాము మాత్రం పారిపోతుంది. కాబట్టి—“
“కాబట్టి—“ అందరూ ఆసక్తిగా దిగ్విజయ్‌తో గొంతు కలిపారు.
“కాబట్టి— ఈ విషయంలో ముందుకు సాగడానికి రెండు అంశాలు చెప్పాలి. మొదటిది— నాకు మూడు రోజుల గడువు కావాలి నాకు తోచింది నేను చెప్పడానికి. రెండవది— నాకు తోచిన సలహాను నేను యోగానంద్‌కి మాత్రమే చెప్తాను.
కొన్ని విషయాలు గానీ, కొన్ని పథకాలు గానీ సాధ్యమైనంతమేర ఎదుటివారికి తెలియకుండా ఉండటమే ఉభయతారకం-- ముఖ్యంగా— వీళ్ళ లిటిగేషన్ గొడవల మధ్య ముక్కుపచ్చలారని పసివాడు నలిగి చిత్తయిపోకూడదు.” యోగానంద్ కచ్చితమైన రీతిలో తలూపాడు.
ప్రక్కింటి పావనమ్మ వల్ల జరిగిందదేగా! క్రిమినల్ బ్రెయిన్‌తో కమలం రప్పించిన కోర్టు అధికారులు వచ్చి అడిగిన ప్రశ్నకు యథాలాపంగా బదులిచ్చేసింది పావనమ్మ— ఎవరి పట్లా కీడెంచకుండానే— ‘పాపం ఒంటరివాడు-- ఉద్యోగస్థుడు-- అమ్మానాన్నలేమో వయసు మళ్ళినవారు.
ఈ బిడ్డను మేము చూసుకోకపోతే మరెవ్వరు చూస్తారు నాయనా?’ అని అమాయకంగా ఆనుపానులు తెలియకుండా వ్యాఖ్యానించేసింది. దానిని అలాగే అలవోకగా అందిపుచ్చుకుని, కోర్టువారికి నివేదిక రూపంలో ఉంచి, ఆవిడ ద్వారా సాక్ష్యం ఇచ్చేలా పథకరచన చేసింది ఆ కమలం— తల్లిదండ్రుల వత్తాసుతో-- దానితో కేసు తలకిందులైంది-- బాల్చీ తన్నేసింది.
అందరూ మరికాసేపు ముచ్చట్లాడుకుని చెదరిపోయారు చెరొక వైపూ— అలా ఎవరి దారిన వాళ్ళు చెదరిపోతున్నప్పుడు యోగానంద్ మనసున అనుకోకుండా ఉండలేకపోయాడు— “ఇంకా నయం, తల్లీకూతుళ్ళిద్దరూ చేరి భార్గవి మరణానికి తన కుటుంబం వాళ్ళ వేధింపులే కారణమని కేసు వేయకుండా ఉన్నందుకు--”
“హల్లో మేడమ్ కమలా! హౌ డూ యూ డూ?” చల్లని సాయంత్రం పూట లా కాలేజీలో క్లాస్‌మేట్స్‌తో మాట్లాడుతూ ఆవరణ మెట్లు దిగుతున్న కమల దిగ్భ్రాంతితో చూస్తూ ఆగిపోయింది. ఆమెకప్పుడు సీతమ్మ పర్ణశాల వాకిట బుర్రమీసాలతో మారువేషంలో రావణేశ్వరుడు నిల్చున్నట్లనిపించింది.
ఆమె వెంటనే తేరుకునేందుకు ప్రయత్నిస్తూ తోటి క్లాస్‌మేట్స్‌ని ప్రక్కలకు నెడుతూ యోగానంద్ వైపు దూసుకువచ్చింది. “అదేమిటి బావా! ఇలా రెక్కలు తెగిన పక్షిలా ఇక్కడ వాలావు! బుజ్జిగాణ్ణి నాతో బాటు మా ‘లా’ కాలేజీకి తీసుకువస్తానని కలగాని కన్నావా ఏమిటి?”
అతడేమీ మాట్లాడలేదు. నవ్వుతూ అలానే నిల్చున్నాడు.
“అదేమిటి అలా రెప్పవాల్చకుండా చూస్తున్నావు! నేనేమిటి అబద్ధం ఆడుతున్నాననుకుంటున్నావా?”
అతడింకా అలానే నవ్వుతూ మరదలు పిల్లకి సమీపంగా వచ్చాడు. “మనవన్నీ అనవసరపు ఆర్భాటాలు గానీ, ఇగోల వల్ల వచ్చిన పనికిరాని రాద్ధాంతాలు గానీ-- బుజ్జిగాడు ఇక్కడుంటేనేం, అక్కడుంటేనేం-- వాట్ డిఫరెన్స్ డజ్ ఇట్ మేక్! ఇంకా చెప్పాలంటే వాడు మీ ఇంట్లోనే పసందుగా, రీతిగా ఉంటాడు.”
ఆ మాట అతడి నోట విన్నంతనే కమలం కనులు గిర్రున తిరిగాయి. చేతిలోని నోటు పుస్తకాలు పట్టుతప్పి క్రింద పడ్డాయి. కొడుకు కోసం పలువురు లాయర్ల వత్తాసుతో, రాజకీయ నాయకుల ప్రమేయంతో కోర్టుల చుట్టూ, పెద్దల పంచాయితీలు చుట్టూ తిరిగి అత్తామామలిద్దర్నీ మూడు చెరువుల నీరు తాగించిన బావేనా ఇలా ఇంత సౌమ్యంగా, సొంపుగా అంటున్నాడు!
అప్పుడు యోగానంద్ నేలన పడ్డ పుస్తకాలను మరదలు పిల్లకి తీసి అందిస్తూ— “అదేమిటి అలా స్థాణువులా నిల్చుండిపోయావు! అప్పుడప్పుడు బావను కాకపోయినా బావ మాటల్ని నమ్మడం నేర్చుకో!”
“ఇంతకూ నువ్వేమంటున్నావు బావా?”
“నాకు జ్ఞానోదయం ఆలస్యంగా వచ్చిందంటున్నాను. మాటకు మాట చెప్పుకోవాలే గానీ— వయసు మళ్ళి, కళ్ళు మసకబారిన మా అమ్మానాన్నా తెగ ఇదయిపోతున్నారు గానీ— మీ ఇంట్లో చూసుకుంటున్నట్టు బుజ్జిగాణ్ణి వాళ్ళు చూసుకోగలరా! ఇదంతా వాళ్ళకు నచ్చజెప్పి విషయాన్ని ఒక కొలిక్కి తెచ్చేసరికల్లా తలప్రాణం తోకకు వచ్చిందనుకో— ఇక విషయానికి వస్తే నువ్వు నమ్ముతావో నమ్మవో గానీ—” అని ముందుకు సాగబోయాడు యోగానంద్.
అప్పుడు కమలం చప్పున అడ్డువచ్చింది— “చెప్తేనే కదా నమ్మాలా నమ్మకూడదా అన్నది తేల్చుకునేది--”
“యూ ఆర్ రైట్—” అంటూ కాసేపు వ్యవధి తీసుకుని సమయపాలన పాటిస్తూ అన్నాడతను— “నిజంగా నేనిప్పుడు బుజ్జిగాణ్ణి గురించి మాట్లాడటానికి రాలేదు.”
‘మరి?’ అన్నట్టు కళ్ళెత్తి చూసిందామె.
“నిన్ను చూసిపోవడానికే వచ్చాను.”
ఈసారి నిజంగానే కమలానికి నోట మాట కరువైంది. నడిరోడ్డున పబ్లిక్ షో ఇస్తున్న గిరికీరోడి కొరడా చెళ్ళున తగిలినట్లనిపించింది. ఈ రోజు తన జీవితానుభవం చిత్రాతిచిత్రంగా ఉందే! ఆమె మరొకసారి కళ్ళు తిప్పుతూ చూసింది.
“ఏమిటిది కమలం? మాటిమాటికీ ఆశ్చర్యంగా చూడటమే గానీ— పెదవి తెరచి మాట్లాడనంటున్నావు! మనసు విప్పి, నోరు విప్పి అడిగితేనే కదా నేను సహితం మనసు విప్పి స్పందించగలను!”
“అలాగే! చెప్పు బావా!”
“అదీ— అలా గుండాలి మరదలు పిల్లంటే— నేనీనాడు నిన్ను వెతుక్కుంటూ వచ్చింది నీకు కంగ్రాట్స్ చెప్పిపోవడానికి—”
“నాకు కంగ్రాట్స్ చెప్పడానికా! ఎందుకూ?”
“అలా నోరు విప్పి అడిగితేనే కదా నాకు థ్రిల్ వస్తుంది! రాత్రి అనుకోకుండా దూరదర్శన్ ఛానెల్లో నీ డ్యాన్స్ ప్రోగ్రామ్ చూశాను. స్టన్ అయిపోయాననుకో!”
“నిన్ననా డిడీలో నా డ్యాన్స్ ప్రోగ్రామ్! నాకు తెలియదే! బహుశా రిపీట్ బ్రాడ్‌కాస్టేమో—”
“ఏదైతేనేమి— నీ హస్తముద్రిక, లయ విన్యాసం, పాదాలతో కుదురుగా నువ్వు చెక్కిన సింహరూపం— ఇవన్నీ చూసి నేను మంత్ర ముగ్ధుడినయ్యాననుకో!
రూపంలో, పొడవులో, లావణ్యంలో ఇద్దరికిద్దరూ ఒకేలా ఉంటారేమో— నిన్ను చూసి అచ్చు మీ అక్కయేమోననుకున్నాను. దివి నుండి భువికి దిగి వచ్చి మీ అక్కయ్య నా కోసం నాట్యమాడుతుందనుకున్నాను--”
ఈసారి మంత్రముగ్ధురాలవడం కమలం వంతయింది. చలించిన హృదయంతో, బరువెక్కిన కనురెప్పల్ని పైకెత్తి చూడలేకపోతోంది.
“ఇంకా నమ్మకం కుదరడం లేదా కమలా! ఇప్పుడు నిరూపిస్తాను. ఏదీ నీ చెయ్యి అందుకో—”
ఆమె ఎందుకని అడక్కుండా కుడిచేతిని అందించింది. ఆమెను చెట్టు ప్రక్కకు నడిపించుకుంటూ వెళ్ళి ఆమె చేతిని పెదవులతో స్పృశించాడు. అతడలా స్పృశించి అక్కడ నిల్చోలేదు. మరుపలుకు లేకుండా చటుక్కున వెనక్కి తిరిగాడు— “బై” అంటూ.
“ఆగు బావా! ఇంత దూరం వచ్చావు— నాతో కలసి కాఫీ తీసుకుని వెళ్ళు. మా ఫుడ్ కోర్టులో కాఫీ చాలా బాగుంటుంది.”
అతడు చటుక్కున ఆగాడు. అతడికి కావలసింది అదే! ఆ ఆవేశపూరితమైన, అనురాగపూరితమైన స్త్రీ పిలుపే! మరులుగొలుపు కంఠస్వరమే! పులకాంకితగా మారి— ఇప్పుడతడి చెంతన ఒక నవయవ్వన అయస్కాంత కాంత!
ఆ రోజు ఉదయం బయటికి బయలుదేరబోతున్న కొడుకుని చూసి బుగ్గన చేతులుంచుకుని విస్తుపోయింది కాంతమ్మ. “అదేమిట్రా యోగా! కార్యాలయానికి వెళ్ళే ఉడుపులా ఇవి? పంచె కట్టుకున్నావు-- దానితో చాలించావా, పట్టు ఉత్తరీయం కూడాను-- ఉదయమే మీ ఆఫీసు క్లబ్బు వాళ్ళ కార్యక్రమానికి వెళ్తున్నావా ఏమిటి!”
“అదేమీ కాదే అమ్మా! ఈ రోజు ఉదయం ఎప్పుడు లేచానో తెలుసా? బ్రాహ్మీ ముహూర్తానికి— ఎందుకు లేచానో తెలుసా?”
అప్పుడక్కడకు తండ్రి బసవయ్య చేరాడు— “చెప్తేనే కదరా తెలిసేది! నువ్వు కట్టుకున్న పంచె నాదా లేక మీ తాతయ్యదా?”
“ఎవరిదీ కాదు నాన్నా! ఇది నాదే— భార్గవికి పుస్తె కట్టేటప్పుడు కట్టుకున్నది. ఇక నేను వస్తాను. ఎక్కడికి, ఎందుకని అడక్కండి, పుణ్యఫలం తగ్గిపోతుంది. కానీ ఒకటి మాత్రం ఖాయం. విజయపతాకంతో జేజేలు పలుకుతూ వస్తాను” అంటూ చకచకా నడుచుకుంటూ రోడ్డుపైకి వెళ్ళిపోయాడు యోగానంద్.
చాలా రోజుల తర్వాత అతడు అత్తగారింటి ముందు సౌమ్య శుభ్ర తేజస్సుతో మెరుస్తూ నిల్చున్నాడు.
ఫెళఫెళమని మెరుస్తున్న పట్టుచీరతో, వికసించిన వదనంతో కమలం ఎదురువచ్చింది. “రా బావా! రా! శుభఘడియ మిస్ అయిపోతావేమోనని భయపడ్డాననుకో—”
అతడు నోట పలుకు లేకుండా నవ్వుల దివ్వెల్ని వదనాన వెలిగిస్తూ, చూపుల కాంతుల్ని నట్టింట వెదజల్లుతూ లోపలకు వచ్చి కూర్చున్నాడు. కూతురి వింత పోకడకు మేడమెట్లు దిగి వచ్చిన అమ్మానాన్నలిద్దరూ నివ్వెరపోయి నిల్చున్నారు.
కోర్టులో తమకు ప్రత్యర్థిగా పోరుతున్న ఈ మొనగాడు తమింటికి ఏకంగా చెప్పాచేయ్యకుండా ఎలా వచ్చాడు? ఏ ముఖం పెట్టుకుని వచ్చాడు? అసలెందుకు వచ్చాడు? మనవణ్ణి కిడ్నాప్ చేసుకుపోవడానికేగా--
వాళ్ళు అలా షాక్ నుండి తేరుకునే లోపల మరొక షాక్ తగిలింది. లోపలకు వెళ్ళిన కమలం ఒంటరిగా రాలేదు, బుజ్జిగాణ్ణి వెంటబెట్టుకుని మరీ వచ్చింది. వాడు తండ్రిని చూసిన తోడనే— “నాన్నా!” అని పరుగున వెళ్ళి కౌగలించుకున్నాడు.
శోభాదేవి కోపంగా చూస్తూ కూతురి దగ్గరకు దూసుకువెళ్ళింది— “ఏమిటిదంతా! ఎందుకీ తతంగమంతా?”
ఆమె భర్త భాస్కరరాజు కోపం దిగమింగుకోవడానికి గుటకలు మింగుతున్నాడు.
“సింపుల్ మామ్! వెరీ సింపుల్. కొడుకు గానీ, కూతురు గానీ కన్నతల్లి బ్రతికుంటే కన్నతల్లి వద్దే ఉండాలి. ఉంటారు కూడాను. కన్నతండ్రి గానీ ఉంటే— కన్నతండ్రి వద్దే ఉంటారు, అవునా కాదా!”
“మరి నువ్విన్నాళ్ళూ అన్నమాట?” ఈసారి భాస్కరరాజు సూటిగా చూస్తూ అడిగాడు.
“ఏ మాట గురించి నాన్నా?” కమలం కళ్ళు తిప్పుతూ అడిగింది.
“అంతా మరచిపోయావన్నమాట! బుజ్జిగాడు ఇంట్లో నడయాడుతుంటే అక్కయ్య ఇంట్లోనే ఉన్నట్లనిపిస్తుందని చెప్పలేదూ! బుజ్జిగాణ్ణి ఎటువంటి సందర్భాన కూడా దూరం చేసుకోనని చెప్పలేదూ!”
“ఇప్పుడూ అదే మాటంటున్నాను నాన్నగారూ! వాణ్ణి ఎప్పుడూ నేనే దగ్గరుండి చూసుకుంటాను నాన్నగారూ!”
“నీకు రాను రాను తిక్కెక్కుతున్నట్లుంది కమలా! బుజ్జిగాణ్ణి మీ బావతో వాళ్ళింటికి పంపించేస్తే నువ్వెలా వాడి ఆలనాపాలనా చూడగలవు? మీ అక్కయ్య పాదాల చప్పుడు ఎలా వినగలవు? కొంచెమైనా బుర్రపెట్టి ఆలోచిస్తున్నావా!”
“నిస్సందేహంగా బుజ్జిగాడి ఆలనాపాలనా నేనే చూసుకుంటాను. ఇకపైన వాడున్న చోటనే నేనుంటాను కదా!”
ఈ మాటతో శోభాదేవి సహనం కోల్పోయింది. “అదెలా సాధ్యం? మీ బావ ఇంట్లో నువ్వెలా ఉండగలవు?”
“ఉండగలను. తప్పకుండా ఉండగలను! బావకు భార్యగా— బుజ్జిగాడికి తల్లిగా--”
ఆ ఒక్క మాటతో భార్యాభర్తలిద్దరూ కండ్లు మిటకరిస్తూ మిన్నకుండిపోయారు. యోగానంద్‌నీ, కూతుర్నీ మారి మారి చూడసాగారు నోట మాట రాక. తమ వెనుక గుట్టుచప్పుడు లేకుండా అల్లుడు ఎంతటి షేక్స్‌పియర్ నాటకం నడిపించాడో!
నిశ్శబ్ద తరంగాలపైన ఎన్నో ఆలోచనలు తెప్పలు తెప్పలుగా తేలిపోతున్నాయి. మనసులు విప్పి అవుననలేకపోతున్నారు, అదే సమయాన కాదనలేకపోతున్నారు. దీనినే కాబోలు అంటారు— సంధ్యాసమయ సుశోభిత సుమధుర గంధర్వ జీవన గానమని—
“మరి కోర్టులో సాగుతున్న కేసు గురించి ఏమి చేయదలచుకున్నావు కమలా?” శోభాదేవి అడిగింది.
“బావ కేసుని వాపసు తీసుకున్నాడుగా! ఇక కేసెక్కడ ఉంటుంది?”
ఈసారి భార్యతో బాటు భాస్కరరాజు కూడా అవాక్కయి నిల్చున్నాడు. లా-కోర్సులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న కూతురు, తమ ప్రత్యర్థి యోగానంద్‌కి ముల్లులా ఉండాల్సిన కూతురు ఎంత లాఘవంగా, నిశ్శబ్దంగా పూమొగ్గలా మారిపోయింది!
శుభం
📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!
మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.
✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి
👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y
పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పాండ్రంకి సుబ్రమణి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

1) పేరు-పాండ్రంకి సుబ్రమణి
2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య
3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ
4)స్వస్థలం-విజయనగరం
5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు
6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.







Comments