top of page
Original.png

చూడాలని ఉంది

22 minutes ago
6 min read

చిన్నతనంలో తల్లిని కోల్పోయిన కేశవకు అతని తల్లి నందిని చిత్రపటాన్ని అందిస్తున్న వృద్ధ చిత్రకారుడు శేఖర్ – చూడాలని ఉంది తెలుగు కుటుంబ కథ

Choodalani Undi - Telugu Emotional Family Story | Ganti Asa Padmini

చూడాలని ఉంది - తెలుగు భావోద్వేగ కుటుంబ కథ | గంటి ఆశ పద్మిని

Published in manatelugukathalu.com on 23/10/2026


అమ్మను చూడాలని, ఆమె ప్రేమను అనుభవించాలని ప్రతి బిడ్డ కోరుకుంటాడు. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన కేశవ తన తల్లి జ్ఞాపకాల కోసం చేసే అన్వేషణ, అతనికి లభించిన ఆప్యాయత, కొత్త బంధాల కథే గంటి ఆశ పద్మిని రచించిన “చూడాలని ఉంది”.


రాత్రి పదకొండు గంటలకు స్నేహితుడి పుట్టినరోజు వేడుకలో పాల్గొని కారులో తిరిగి వస్తున్న కేశవకి, రోడ్డుపైన లిఫ్ట్ అడుగుతూ ఒక వ్యక్తి కనిపించాడు. 


కేశవ వెంటనే కారు ఆపాడు. ఆ వ్యక్తి కారు దగ్గరకు వచ్చి, “నాకు బస్టాప్ వరకు లిఫ్ట్ ఇస్తారా?” అని అడిగాడు. కేశవ “రండి” అని పిలిచి తన కారు డోర్ తెరిచాడు. ఆ వ్యక్తి కారు ఎక్కాడు. ఇద్దరూ ముందుకు సాగారు.


కొంతదూరం వెళ్ళాక, కారు ఎక్కిన వ్యక్తిని కేశవ, ‘మీ పేరేంటి తాతగారు?’ అని అడిగాడు. వెంటనే ఆ వ్యక్తి కేశవ వైపు చూశాడు. కేశవ, ‘నేను మిమ్మల్ని తాతగారు అని పిలవచ్చా?’ అని అడిగాడు. 


ఆ వ్యక్తి నవ్వుతూ, “పిలవచ్చు” అని చెప్పి.. “నా పేరు శేఖర్” అని చెప్పాడు. ‘మీది ఏ ఊరు?’ అని అడిగాడు కేశవ. “నాది పక్కనే ఉన్న చందర్లపాడు” అని చెప్పాడు శేఖర్. “ఏంటి, మీది చందర్లపాడా!” అని అడిగాడు కేశవ. “అవును, ఏమైంది?” అని అడిగాడు శేఖర్. 


“మా అమ్మ పుట్టిన ఊరు చందర్లపాడు” అని చెప్పాడు కేశవ. 


“అవునా! అయితే మీ అమ్మమ్మగారి ఊరు మా ఊరేనా, మంచిది” అన్నాడు శేఖర్. 


“కానీ నేను ఇప్పటివరకు అస్సలు ఆ ఊరిలో అడుగే పెట్టలేదు” అన్నాడు బాధగా కేశవ. 


“కారణం ఏమిటి?” అని అడిగాడు శేఖర్.


“మా అమ్మ నాకు రెండేళ్ల వయసులోనే ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోయింది. మా నాన్నగారు వ్యాపారరీత్యా ఊర్లు తిరుగుతూ ఉంటారు. 


అందుకోసమే నన్ను చూసుకునేందుకు మా అమ్మమ్మ, తాతయ్యలను ఇక్కడే ఉండమని కోరారు. దాంతో వాళ్ళు ఆ ఊరిని వదిలి ఇక్కడకు వచ్చేశారు. 


నాకు పదిహేను సంవత్సరాలు వచ్చేసరికి వాళ్ళిద్దరూ కాలం చేశారు. అందువల్ల నేను ఇప్పటివరకు మా అమ్మ పుట్టిన ఊరిలో అడుగు పెట్టలేదు” అని తన బాధ చెప్పాడు కేశవ. 


“బాధపడకు, నీకు ఆ భగవంతుడు ఎప్పుడూ మంచే చేస్తాడు” అని చెప్పి ఓదార్చాడు శేఖర్. అలా ఒకరి పరిచయాలు ఒకరు తీసుకుని వెళుతుండగా మధ్యలో.. “తాతయ్య, మీ చేతిలో ఏమి ఉన్నాయి?” అని అడిగాడు కేశవ.


“నేను ఒక చిత్రకారుడిని. రోడ్డుపైన పెద్ద పెద్ద ఫ్లెక్సీలకు బొమ్మలు, డిజైన్స్ తయారు చేస్తుంటాను. ఆ విషయానికే ఇక్కడ ఒక కంపెనీతో కాంట్రాక్టు గురించి వచ్చాను. అక్కడ బాగా ఆలస్యం అయ్యింది” అని చెప్పాడు శేఖర్. 


ఆ మాట వినగానే వెంటనే కేశవ కారు పక్కకు ఆపి కిందకు దిగి, శేఖర్‌ను కూడా కిందకు దిగమన్నాడు. శేఖర్ కిందకు దిగాడు.


కేశవ తన పర్స్ లోంచి ఒక చిన్న ఫోటో తీసి శేఖర్‌కు ఇస్తూ.. “తాతయ్య, ఇది మా అమ్మ నందిని ఫోటో. మీరు పెద్దగా నాకు గీసి ఇవ్వగలరా? మా అమ్మది ఒక్క ఫోటో కూడా లేదు. నేను వెతగ్గా వెతగ్గా అసలు ముఖం కూడా సరిగ్గా కనిపించని ఈ ఫోటో దొరికింది. 

నాకు మా అమ్మను చూడాలని ఉంది” అని అడిగాడు. 


శేఖర్ ఫోటోను చేతిలోకి తీసుకుని చూశాడు. ఫోటో బాగా పాతబడిపోయి, చిన్న చిన్న ముక్కలు చిరిగిపోయి పూర్తిగా పాడైపోయింది. శేఖర్ “సరే” అన్నాడు. 


కేశవ వాళ్ళ అమ్మ ఫోటోను శేఖర్‌కు అందించి కారు ఎక్కాడు. ఇద్దరూ బస్టాప్ వైపు బయలుదేరారు. కొంతదూరం వెళ్ళాక కేశవ మళ్ళీ, “మనం ఎప్పుడు, ఎక్కడ కలుద్దాము?” అని అడిగాడు.


శేఖర్ వెంటనే ఒక చిన్న కాగితం తీసుకుని తన ఇంటి అడ్రస్ రాసి.. “రెండ్రోజుల తర్వాత నువ్వు మా ఇంటికి రా, అక్కడ కలుద్దాము” అన్నాడు. 


“ఏంటి, నేను మా అమ్మ పుట్టిన ఊరికి రావాలా!” అని అన్నాడు కేశవ. 


“ఈ తాతయ్య ఊరికి రావా?” అని అడిగాడు శేఖర్. 


“వస్తాను తాతయ్య” అన్నాడు కేశవ. 


ఇంతలో బస్టాప్ వచ్చింది. శేఖర్ ఆ బస్టాప్ వద్ద కారును ఆపమన్నాడు. కేశవ కారు ఆపాడు. శేఖర్ కారులోంచి కిందకు దిగి, “చాలా థాంక్స్” అని చెప్పాడు. 


“తాతయ్యకు మనవడు సహాయం చేస్తే మనవడికి థాంక్స్ చెబుతారా?” అని అన్నాడు కేశవ. 


“నిజమే, అయితే ఆశీర్వాదం ఇస్తాను” అని “ఆయుష్మాన్ భవ” అని దీవించాడు శేఖర్. 


“సరే బాయ్ తాతయ్య” అని చెప్పి.. “నేను చెప్పింది మర్చిపోవద్దు” అన్నాడు కేశవ. 


“రెండ్రోజుల తరువాత ఈ తాతయ్య ఇంటికి రావడం మర్చిపోవద్దు” అన్నాడు శేఖర్. కేశవ ముందుకు వెళ్ళిపోయాడు.


రెండ్రోజులు గడిచిపోయాయి. రెండోరోజు ఉదయాన్నే లేచి చందర్లపాడుకి కారులో బయలుదేరాడు కేశవ. 


కేశవ ముఖంలో ఏదో తెలీని కాంతి, ఆనందం విరబూస్తున్నాయి. ప్రసవ వేదన అనంతరం తల్లి తమ బిడ్డను చూసేందుకు పడే ఆవేదన లాంటిది తన అమ్మ పుట్టిన ఊరిని చూసేందుకు బయలుదేరిన కేశవ పరిస్థితి.


మూడు గంటల ప్రయాణం తర్వాత చందర్లపాడు చేరుకున్నాడు కేశవ. చందర్లపాడు ఊరిలోకి ప్రవేశించగానే “తన తల్లి వచ్చి పలకరించినట్టు” అయింది కేశవకి. 


కారు అక్కడే ఆపి తన తల్లి పుట్టి, పెరిగి, నడిచిన నేలను ముద్దాడాడు కేశవ. ఆ మట్టిని తాకి తన తల్లి పాదాలను స్పర్శించినంత పొంగిపోయాడు. 


ఆ ఊరి గాలి పీల్చుకున్న కేశవకు తన తల్లి ప్రేమగా ముద్దు పెట్టినట్టు భావనకు లోనయ్యాడు. కొంతసేపు అక్కడి వాతావరణాన్ని ఆస్వాదించినాక.. కారు ఎక్కి ఊరిలోపలకు వెళ్ళి, “ఇక్కడ చిత్రకారుడు శేఖర్ తాతయ్య ఇల్లు ఎక్కడ?” అని ఒక టీ దుకాణం వాడిని అడిగాడు. అక్కడే ఉన్న ఒక వ్యక్తి “రండి చూపిస్తాను” అని తన సైకిల్ పైన ముందు వెళుతూ కేశవకు దారి చూపించాడు.


రెండు వీధులు తిరిగిన తర్వాత “ఇగో, ఇదే శేఖర్ తాతయ్య ఇల్లు” అని చూపించాడు. కేశవ ఆ వ్యక్తికి ధన్యవాదాలు తెలిపి, ఆ ఇంటి గుమ్మం ముందర నిలబడి “తాతయ్య” అని పిలిచాడు. 


ఆ పిలుపుకు లోపలనుంచి శేఖర్ భార్య వచ్చి “ఎవరు కావాలి?” అని అడిగింది. 


“నేను శేఖర్ తాతయ్య కోసం వచ్చాను” అని బదులిచ్చాడు కేశవ. 


ఆ మాట వినగానే “ఓహో! నువ్వు కేశవవా, రా లోపలకు” అని ఆహ్వానించింది శేఖర్ భార్య. 


“తాతయ్య ఇంట్లో లేరా?” అని అడిగాడు కేశవ. 


“ఉన్నారు, వస్తున్నారు” అని బదులిచ్చింది శేఖర్ భార్య. 


ఇంతలో శేఖర్ వచ్చి “ఏం మనవడా! ఎలా ఉన్నావు?” అని పలకరించాడు. 


“బాగున్నాను” అని బదులిచ్చి, “మా అమ్మ బొమ్మ తయారైందా!” అని ఎంతో ఆతృతగా అడిగాడు కేశవ. 


“అరె! ఎందుకు అంత తొందర? ఇంతదూరం వచ్చి మీ అమ్మ పుట్టి పెరిగిన ఊరిని తిరిగి చూడవా?” అని అడిగాడు శేఖర్.


“నాకు ఊరంతా తిరిగి చూడాలని ఉంది. కానీ నాకు ఈ ఊరిలో ఎవరూ తెలీదు” అన్నాడు కేశవ. 


“అదేంటి! నీ ఎదురుగా ఈ తాతయ్య ఉండగా ఎవరూ తెలీదు అంటున్నావు?” అన్నాడు శేఖర్. 


“మీరు చూపిస్తారా!” అని ఆనందంగా అడిగాడు కేశవ. 


“అవును, పద” అని తనతో తీసుకెళ్ళాడు శేఖర్.


ముందుగా తన అమ్మ పుట్టి, పెరిగిన ఇంటికి తీసుకెళ్ళి.. “ఇగో, ఇదే మీ అమ్మవాళ్ళ ఇల్లు” అని చూపించాడు శేఖర్. ఆ ఇల్లును చూడగానే గుండె బరువెక్కిపోయింది కేశవకి. కంటినిండా నీరుతో, గొంతునిండా బాధతో “నేను లోపలకు వెళ్ళి చూడొచ్చా?” అని అడిగాడు కేశవ. 


“తప్పకుండా చూడొచ్చు” అని కేశవ చేయి పట్టుకుని లోపలకు తీసుకెళ్ళి చూపించాడు శేఖర్. కేశవ ఆ ఇంటిని, అక్కడ ప్రదేశాన్ని ఫోనులో వీడియో తీసుకున్నాడు. వీడియో తీసుకోవడం అవ్వగానే బయటకు వచ్చిన కేశవని, “పద, మీ అమ్మ అక్షరాలు నేర్చుకున్న బడిని చూపిస్తాను” అన్నాడు శేఖర్. 


“ఏంటి, మా అమ్మ చదివిన బడా! పదండి” అని ఎంతో సంబరంగా వెళ్ళాడు కేశవ.


ఊరి మధ్యలో ఉన్న ఒక పెద్ద వృక్షాన్ని చూపించి, “ఇగో, ఇదే మీ అమ్మ బడి” అన్నాడు శేఖర్. కేశవ ఆ చెట్టు కిందకు వెళ్ళి సరిగ్గా వాళ్ళ అమ్మ కూర్చునే జాగాలోనే కూర్చున్నాడు. 


అప్పుడే అటు వెళుతున్న వెంకయ్య, కేశవని చూసి “ఎవరు?” అని అడిగాడు. 


“మన ఓబులయ్య మనవడు” అని బదులిచ్చాడు శేఖర్. 


ఆ మాట వినగానే వెంటనే సైకిల్ పక్కకు పెట్టి ఆ చెట్టు కిందకు వచ్చి కేశవని పట్టుకుని, “నువ్వు మా నందిని కొడుకువా!” అని అన్నాడు వెంకయ్య. 


కేశవకి అతను ఎవరో తెలీక శేఖర్ వైపు చూశాడు. 


“మీ అమ్మకు అక్షరాలు దిద్దించిన గురువు” అని చెప్పాడు శేఖర్. 


కేశవ వెంకయ్య కాళ్ళకు నమస్కరించాడు. ఆ వినయం, నమ్రత చూసి “అచ్చం మా నందిని లాగే ఉన్నావు” అని అన్నాడు వెంకయ్య.


“మీ అమ్మకు చాలా ఇష్టమైన ప్రదేశానికి వెళదాము, పద” అని ఊరిలో ఉన్న శివాలయానికి కేశవని తీసుకొచ్చి.. “ఈ గుడి అంటే మీ అమ్మకు చాలా ఇష్టం” అని చెప్పాడు శేఖర్. 


“నీకు ఇంకో మాట చెప్పనా.. మీ అమ్మ పెళ్ళి కూడా ఈ గుడిలోనే జరిగింది” అని చెప్పాడు శేఖర్. 


“అవునా! నిజమా!” అని గుడి అంతా తిరిగి తిరిగి చూశాడు కేశవ. 


ఫోటోలు, వీడియోలు తీసుకుంటున్న కేశవను చూసి గుడి ప్రధాన అర్చకుడు “ఎవరు నువ్వు?” అని అడిగాడు. 


“నేను.. నేను..” అని కేశవ అంటుండగా.. శేఖర్ అక్కడికి వచ్చి “మన నందిని కొడుకు” అని చెప్పాడు.


“మన నందిని కొడుకా ఈ అబ్బాయి! నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది” అని, నందిని చిన్నతనం, చిలిపితనం, ఊరివాళ్ళతో తనకు ఉన్న అనుబంధం, పెళ్ళికూతురుగా మారి ఈ ఊరిని, తన వాళ్ళని వదిలి అత్తారింటికి నందిని వెళ్ళిన తర్వాత ఊరంతా ఎలా బోసిపోయిందో.. ఇలా ఇంకా ఎన్నో సంగతులు చెప్పాడు ఆ ప్రధాన అర్చకుడు కేశవకు. 


ప్రధాన అర్చకుడు తన తల్లి గురించి చెప్పిన సంగతులన్నీ రికార్డ్ చేశాడు కేశవ. చాలాసేపు ప్రధాన అర్చకుడితో మాట్లాడాక ఇద్దరూ శేఖర్ ఇంటికి తిరిగి వచ్చేశారు.


“మీకు మా అమ్మ తెలుసని మనం కలిసినప్పుడు ఎందుకు చెప్పలేదు?” అని అడిగాడు కేశవ. 


“మీ అమ్మ ఫోటో చూసిన వెంటనే నాకు తెలిసింది నువ్వు మా నందిని కొడుకువి అని. అప్పుడే నీలో ఉన్న ఒంటరితనాన్ని కూడా చూశాను. అందుకే నా చిరునామా ఇచ్చి నిన్ను ఇక్కడకు రమ్మని పిలిచాను” అని బదులిచ్చాడు శేఖర్. 


వెంటనే శేఖర్‌ని కౌగలించుకుని, “నేను మా అమ్మను చూడాలని మిమ్మల్ని మా అమ్మ చిత్రాన్ని గీయమన్నాను. కానీ మా అమ్మకు కూడా నన్ను చూడాలని అనిపించిందేమో, అందుకే మీ ద్వారా నన్ను ఇక్కడకు పిలిపించుకుంది. 


తల్లి స్పర్శ తెలీని నాకు మొదటిసారి తల్లి ఒడిలో సేద తీరినట్టు అనిపించింది” అన్నాడు కేశవ.


“కబుర్లు తర్వాత, ముందు భోజనానికి రండి” అని ఇద్దరినీ పిలిచింది శేఖర్ భార్య. ఇద్దరూ భోజనం ముగించుకున్నారు. భోజనం తర్వాత “ఇంక నేను ఊరికి బయలుదేరుతాను” అన్నాడు కేశవ. 


“సరే” నని శేఖర్ చిత్రించిన నందిని చిత్రాన్ని తీసుకొచ్చి, “ఇవాళ్టి నుంచి నువ్వు ఒంటరివి కాదు. ఈ తాతయ్య, అమ్మమ్మ నీకు తోడుగా ఉన్నాము” అని చెప్పి ఇచ్చాడు శేఖర్.


కేశవ తన తల్లి చిత్రాన్ని, ఇంకా ఎన్నో జ్ఞాపకాలను తీసుకుని సిటీకి బయలుదేరాడు. కేశవకు తన తల్లిని చూడాలనిపించినప్పుడల్లా ఆ చిత్రాన్ని చూస్తూ, తల్లి జ్ఞాపకాలను ఫోటోలు, వీడియోలలో చూసుకుంటూ ఉన్నాడు. శేఖర్ పరిచయంతో కేశవ జీవితంలో ఒంటరితనం మెల్లగా దూరమవ్వసాగింది.


*** 


📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y



గంటి ఆశ పద్మిని గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



గంటి ఆశ పద్మిని

పరిచయం: నా పేరు గంటి ఆశ పద్మిని.

నేను ఇప్పటివరకు ముఫై కథలు, పది బాలగేయాలు, ఒక మినీ నవల , ఐదు పుస్తక సమీక్షలు చేసాను.రాసాను. నా కథలు విశ్వభవిష్యత్, ఈనాడు, రేపటికోసం పత్రికలో పబ్లిష్ అయ్యాయి. సుమబాల, ఉషబాల, బాలబాట పుస్తకాల్లో, కదంబం అనే వెబ్ మ్యాగజైన్ లో కూడా నా కథలు ప్రచురణ అయ్యయి.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page