top of page
Original.png

జరుగుతున్న కథ

1 hour ago
4 min read

కుటుంబ వేధింపులతో భర్త ఇంటి నుంచి పుట్టింటికి చేరిన తెలుగు మహిళ తన తొమ్మిదేళ్ల కూతురితో బాధగా కూర్చున్న దృశ్యం

Jarugutundha Katha - Telugu Family Story | Seeda Nagaraju

జరుగుతున్న కథ - తెలుగు కుటుంబ కథ | సీదా నాగరాజు

Published in manatelugukathalu.com on 23/10/2026



జరుగుతున్న కథ – సీద నాగరాజు రచించిన హృదయాన్ని కదిలించే తెలుగు సామాజిక కుటుంబ కథ. పద్నాలుగు సంవత్సరాల వైవాహిక జీవితంలో అత్తింటి వేధింపులు, భర్త హింస, ఆర్థిక ఒత్తిళ్లు, బంధువుల స్వార్థం మధ్య తన తొమ్మిదేళ్ల కూతురి భవిష్యత్తు కోసం పోరాడుతున్న ఓ మహిళ మనోవేదనను ఈ కథ ఆవిష్కరిస్తుంది.నాకు పెళ్లయి 14 సంవత్సరాలు అయింది. గడిచిన 14 సంవత్సరాలలో ఎన్నో జ్ఞాపకాలు. 


అత్తగారి ఆరళ్లు, ఆడపడుచు అపనిందలు, తోడికోడలి దెప్పిపొడుపులు అన్నీ భరించాను. మా వారి గురించి చెప్పాలంటే... మంచివారే, కానీ ఆయనకి అమ్మే సర్వస్వం. ఆమె చెప్పిందంటే చాలు వాళ్ల నాన్ననైనా కొట్టే రకం. 


తన చెల్లెలు అంటే తనకి పంచప్రాణాలు. తమ్ముడు తన ఆరో ప్రాణం. ఆయన దృష్టిలో తన తమ్ముడు గొప్ప జీనియస్. తమ్ముని మాటే తనకి వేదవాక్యం. 


ఆ తమ్ముడు అపర లక్ష్మణుడే! అన్నని అప్పుడప్పుడు తిడుతుంటాడు. కోపమొస్తే కొడుతుంటాడు కూడా. 


అయినా ఆ తమ్ముడు అంటే అంతులేని ప్రేమ, భయం కూడా!

ఇంత మంచివాడికి ఇతరులు, అందునా భార్య తరపు వారు అంటే మాత్రం మహా చులకన.


మా పధ్నాలుగు సంవత్సరాల దాంపత్యంలో ఆ ముగ్గురి కారణంగా మేము కలసిమెలసి సంతోషంగా ఉన్న రోజులు చాలా చాలా తక్కువే. ఎప్పుడూ ఏదో ఒక గొడవ. 


పోలీస్ కేసులు, కోర్టు మెట్లు ఎక్కడంతోనే జరిగిపోయింది. కలసి ఉన్నా.. విడిగా ఉన్నా.. హైదరాబాద్‌లో ఉన్నా... బెంగళూరులో ఉన్నా.. కాదని ముంబైలో ఉన్నా.... ఆ ముగ్గురూ మా సంసారంలో కల్పించుకోనంత వరకు సుఖంగా లేకపోయినా క్షేమంగా ఉన్నాం. 


మాకు ఇప్పుడు ఒక తొమ్మిదేళ్ల పాప కూడా ఉంది. ముగ్గురమూ ముచ్చటగా ఉండాలని నా కోరిక. కానీ ఆ ముగ్గురూ సైంధవుల్లా మా సంతోషాలకు అడుగడుగునా అడ్డుపడుతుంటారు.


ఆయన తమ్ముడు నిజంగా లక్ష్మణుడే! తనంటూ ఏ పనీ చేయడు. 


అన్న వెంటే తిరుగుతుంటాడు. ఆ వ్యాపారం ఈ వ్యాపారం అంటూ మాయమాటలు చెప్పి అన్న జీతంలో సగం తన భార్య అకౌంట్లో వేయించుకుంటాడు. 


తన కొడుకు, భార్యతో కలసి జల్సాలు చేస్తుంటాడు. ఆయనకి తన భార్య అంటే ఎంత ప్రేమో! పల్లెత్తు మాట కూడా మాట్లాడడు, అపురూపంగా చూసుకుంటాడు. అన్నకి మాత్రం భార్యని దూరం పెట్టాలని సలహా ఇస్తుంటాడు.


చెల్లెలి సంగతి సరేసరి. ఆమె ఆడింది ఆట పాడింది పాట. ఇప్పటికీ రెండు సార్లు పెళ్లి చేసుకుంది. అయినా ఇప్పటికీ, బహుశా ఎప్పటికీ నేమో పుట్టింటిలోనే మొగుడితో సహా సంసారం చేస్తోంది.


“బిల్డర్ మోసం చేశాడు. నాకు 40 లక్షలు నష్టం వచ్చింది. కట్టించిన ఇల్లు కూడా కోర్టు కేసులో ఇరుక్కుంది. ఇప్పుడు చాలా కష్టంగా ఉంది. మీ పుట్టింటికి వెళ్లి యాభై లక్షలు తీసుకొని రా” - అని శ్రీవారు సతాయించడం ప్రారంభించారు.


“నెలకి లక్షకు పైగానే సంపాదిస్తున్నారు కదా! ఆ డబ్బంతా ఏమి చేస్తున్నారు? ఇంటి ఖర్చులు అన్నీ నేనే నా జీతంతో భరిస్తున్నాను కదా! మరి మీ జీతం డబ్బులు ఏమయ్యాయి?” - అని ఎదురు తిరిగాను.


అంతే, ఆయన అహం దెబ్బతింది. నా చెంప చెల్లుమంది!

“ఏమ్మా! మొగుడంటే లెక్క లేదా! అలా మాట్లాడుతున్నావు? మగవాడిని జీతం లెక్క చెప్పమనే ఆడదాన్ని నిన్నే చూశానమ్మా” - అంటూ అత్తగారి సన్నాయి నొక్కులు.


“అన్నయ్య ఇల్లు కట్టిస్తూ డబ్బులకు ఇబ్బంది పడుతున్నాడు కదా! మీ అమ్మవాళ్లని అడుగు వదినా! తప్పేముంది? మీ కోసమే కదా!” - అంటూ వత్తాసుగా చెల్లెలి సమర్థింపు.


“ఏం వదినా! ఎక్కువ మాట్లాడుతున్నావు? అన్నయ్య అంటే భయం భక్తి లేదా? ఎదురు తిరిగి మాట్లాడుతున్నావు?” - అంటూ ఆయన తమ్ముడి హుంకరింపు.


నాకేమీ పాలుపోలేదు. తనని ఎగదోసేవాళ్లే కానీ నన్ను సమర్థించేవాళ్లు గానీ, భార్యని కొట్టడం తప్పు అనేవాళ్లు గానీ ఎవరూ లేరు. తోడికోడలు మాత్రం తనకేమీ పట్టనట్లు చోద్యం చూస్తూ కూర్చుంది.


గత్యంతరం లేని స్థితిలో ఏడుస్తూ కూర్చోండిపోయాను. ఆ కుటుంబం అంటేనే నాకు భయం. 


సూటిపోటి మాటలతో మనసును గాయపరుస్తారు, లేదంటే తనతో కొట్టిస్తారు. నాకు తనను చూస్తేనే భయం అంటే నమ్మండి. ఎప్పుడూ గట్టిగా అరుస్తుంటాడు. పళ్లు కొరుకుతూ కొట్టడానికి మీదమీదకు వస్తుంటాడు. 


తనేమో దృఢకాయుడు. నేనేమో సన్నగా, తనకన్నా పొట్టిగా ఉంటాను.


తను నా భుజాలు గట్టిగా పట్టుకొని, నాలుక మడతబెట్టి, పళ్లు కొరుకుతూ నన్ను గద్దించాడంటే చాలు నా పైప్రాణాలు పైనే పోయినట్లు అవుతుంది. ఆ దృశ్యం గుర్తుకొస్తే చాలు ఒళ్లంతా భయంతో గగుర్పొడుస్తుంది, చెమటలతో తడిసి ముద్దయిపోతాను.


రాత్రంతా నిద్ర పట్టలేదు. ఉదయం లేచిన వెంటనే గబగబా రెడీ అయిపోయాను. పాపను కూడా రెడీ చేసి బస్టాండ్‌కి క్యాబ్ బుక్ చేసుకున్నాను. పాప బట్టలు, నా బట్టలు రెండు బ్యాగుల్లో సర్దుకొని పుట్టింటికి బయలుదేరాను. ఎవ్వరూ అడ్డు చెప్పలేదు. 


తను అడిగిన 50 లక్షలు తీసుకువస్తానని గట్టి నమ్మకమేమో, అందరూ సైలెంట్‌గా ఉండిపోయారు.


రెండు నెలలు గడిచాయి. ఈ రెండు నెలల్లో రెండు మూడు సార్లు ఫోన్ చేశారు. అయినా నేనేమీ మాట్లాడలేదు. పాప పుట్టినరోజు నాడు వచ్చాడు. 


అమ్మనాన్నల దగ్గర “ఇల్లు కట్టించే విషయంలో మోసపోయాను, అప్పుల పాలయ్యాను” అన్నాడు. 


“50 లక్షలు సర్దండి” అన్నాడు. అమ్మనాన్నలు అంత డబ్బు తమ దగ్గర లేదనడంతో కోప్పడి వెళ్ళిపోయారు. అంతే, మళ్ళీ రాలేదు. 


మా ఆడబిడ్డ మాత్రం ఫోన్ చేసి - “డబ్బుదేముంది వదినా! భర్తే ముఖ్యం, ఆలోచించుకో. ఏదో విధంగా మీ అమ్మనాన్నలకు నచ్చజెప్పి డబ్బులు తీసుకొని రా” - అంటూ ఉచిత సలహా చెప్పింది.


తనకేం, ఎన్నయినా చెప్తుంది! మొదటి మొగుడి మీద 498A, గృహహింస మొదలైన కేసులు పెట్టి లక్షలు గుంజుకొని మరీ విడాకులు తీసుకుంది. 


ఈమధ్యనే రెండో పెళ్లి కూడా చేసుకుంది. తన రెండో పెళ్లి సందర్భంలోనే 30 లక్షల విలువ చేసే నా నగలు ముత్తూట్ పరమయ్యాయి. మా వారు నా పేరు మీద క్రెడిట్ కార్డులు తీసుకొని మరీ అప్పులు చేశారు, ఆవిడ పెళ్లి చేశారు. 


ఆయన సంపాదించిందంతా చెల్లెలి రెండు పెళ్లిళ్లకి, తమ్ముడి దిక్కుమాలిన దివాలా వ్యాపారాలకి హారతికర్పూరం అయిపోయింది. వెనక్కి తిరిగి చూస్తే అన్నీ అప్పులే. ఆ అప్పులు నా పేరు మీద చేయడంతో నేను సమాధానం చెప్పవలసి వస్తోంది.


అందరూ బాగున్నారు. మా మరిది ఏ పనులూ చేయకుండా తన కుటుంబ పోషణ కోసం మా వారిని జలగలా పట్టిపీడిస్తున్నాడు. చెల్లెలేమో రెండు పెళ్లిళ్లు చేసుకుని జల్సాగా తిరుగుతోంది. 


మా అత్తగారేమో నా కొడుకు సంపాదన నాకే కావాలంటోంది. మధ్యలో నా కూతురూ నేనే అన్యాయమయ్యాం.


ఇప్పుడు నేనేమి చేయాలో మీరే చెప్పండి.


*** 


📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y



సీదా నాగరాజు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


పరిచయం

: పేరు సీదా నాగరాజు.1965లో గుంటూరు పట్టణంలో జన్మించాను.స్థానిక జలగం రామారావు మెమోరియల్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి (1980)వరకు, ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల; నాగార్జున సాగర్ లో ఇంటర్మీడియట్( 1980-82), సిల్వర్ జూబ్లీ కళాశాల, కర్నూలు లో డిగ్రీ( 1982-85),ఆంధ్రా క్రిస్టియన్ కాలేజ్ అఫ్ లా లో లా డిగ్రీ(1985-88) చదువుకున్నాను.దక్షిణ మధ్య రైల్వే గుంతకల్ డివిజన్ లో ఉద్యోగం చేసి 2025 లో రిటైర్ అయ్యాను.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page