మార్గం మంచిదైతే
- Srinivasarao Jeedigunta

- 12 hours ago
- 7 min read

Margam manchidaithe - Telugu Inspirational Story | Jeedigunta Srinivasa Rao
మార్గం మంచిదైతే - తెలుగు ప్రేరణాత్మక కథ | జీడిగుంట శ్రీనివాసరావు | ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత
Published In manatelugukathalu.com On 05/06/2026
“దేవుడిని నమ్మని ఆమె… తన బిడ్డ ప్రాణాపాయంలో ఉన్నప్పుడు మొదటగా ఎవరి పేరును తలచుకుందో తెలుసా?”
శ్రీనివాసరావు జీడిగుంట గారి మార్గం మంచిదైతే కథ వినండి. ]
అభిరామ్ తల్లి పార్వతమ్మకు దైవభక్తి అంటే ప్రాణం. తన కొడుకును పెళ్లాడే అమ్మాయి కూడా అపర లక్ష్మీదేవిలా పూజలు పునస్కారాలు చేయాలని ఆమె కోరిక. కానీ అభిరామ్ ప్రేమించిన కావ్య ఇంట్లో, అసలు పూజ గది అన్నదే లేదు.
"సేవే దైవం.. తోటి మనిషికి సాయం చేయడమే పరమార్థం" అని నమ్మే కుటుంబం ఆమెది.
పార్వతమ్మ ఈ పెళ్లికి ఒప్పుకోదని భయపడిన అభిరామ్, తన తల్లితో ఒక పెద్ద అబద్ధం చెప్పాడు: "అమ్మా, కావ్య కూడా నీలాగే నిత్యం పూజలు చేస్తుంది. నీకు తగ్గ కోడలు వస్తోంది" అని. అలా ఆ అబద్ధం మీద పెళ్లి జరిగిపోయింది.
చెన్నై ప్రయాణం - ఊపిరి పీల్చుకున్న అభిరామ్:
పెళ్లయిన కొత్తలో కావ్య పూజగది వైపు వెళ్లకపోవడం చూసి పార్వతమ్మ అనుమానిస్తుంటే, "తను కొత్త కదా అమ్మా, సిగ్గు పడుతోంది" అని అభిరామ్ కవర్ చేసేవాడు.
అదృష్టవశాత్తూ, సరిగ్గా అప్పుడే అభిరామ్‌కు చెన్నైలో మంచి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వచ్చింది. అది అతనికి ఒక రకంగా ఉపశమనం కలిగించింది.
చెన్నై వెళ్ళాక అభిరామ్ రెండు ప్రపంచాల మధ్య బ్యాలెన్స్ చేయడం మొదలుపెట్టాడు:
అమ్మతో ఫోన్లో: "అమ్మా, కావ్య ఈరోజు లలితా సహస్రనామాలు చదివింది.. ఇల్లంతా భక్తితో నిండిపోయింది" అని అబద్ధాలు.
ఇంట్లో కావ్యతో: కావ్య తనకిష్టమైన సామాజిక సేవలు, ఎన్జీవో పనులతో బిజీగా ఉండేది. అక్కడ పూజల ఊసే ఉండేది కాదు.
కొడుకు పుట్టుక - చిక్కుముడి
ఏడాది తర్వాత వారికి ఒక బాబు పుట్టాడు. కొడుకు పుట్టాడన్న ఆనందంలో పార్వతమ్మ చెన్నైకి ప్రయాణమైంది. అక్కడే అసలు సమస్య మొదలైంది. కొడుకుకి తనే స్వయంగా 'అన్నప్రాసన', 'అక్షరాభ్యాసం' వంటి వేడుకలు జరిపించాలని, పద్ధతిగా పూజలు చేయాలని ఆమె ప్లాన్ చేసుకుని వచ్చింది.
చెన్నై ఇంటి సీన్:
పార్వతమ్మ రాగానే ఇల్లంతా వెతికింది. ఎక్కడా దేవుడి పటం లేదు, కనీసం ఒక దీపం వెలిగించిన ఆనవాళ్లు లేవు.
"అభి.. ఏదిరా పూజ గది? కావ్య రోజూ పూజ చేస్తుంది అన్నావు కదా, మరి ఇల్లంతా ఇలా ఉంది?" అని అడిగేసరికి అభిరామ్‌కు చెమటలు పట్టాయి.
అప్పుడే డాన్స్ క్లాస్ ముగించి వస్తున్న కావ్యకు అత్తగారు అంటున్న మాటలు విని, "అత్తయ్య.. మీరు ఫోటోలో దేవుడు ఉన్నారని పూజలు చేస్తున్నారు, నాకు సాటి మనుషులలో దేవుడు ఉన్నాడని నమ్మకం. మీ నమ్మకం మీది, నా నమ్మకం నాది" అంది.
కోడలు మాటలకు తెల్లబోయింది పార్వతమ్మ.
ఒక వారం రోజులలో ఆ ఇంటి పరిస్థితి అర్థం చేసుకుంది పార్వతమ్మ.
"ఏమండీ! ఈ వాతావరణంలో నేను ఉండలేను. అన్ని గోడలకు డాన్సర్ బొమ్మలు తప్ప, ఉదయం లేవగానే దండం పెట్టుకోవడానికి ఒక్క దేవుడి ఫోటో లేదు. మనం మన ఊరు వెళ్ళిపోదాం" అంది భర్త సీతారాంతో.
"వచ్చేదాకా ప్రాణం తీశేశావు, ఇప్పుడు వెళ్ళిపోదాం అంటున్నావు. నీ పూజలు ఏవో మనసులో చేసుకో. ఇప్పుడు వెళ్ళిపోయినా రేపు ఓపిక లేనప్పుడు మళ్ళీ చివరికి చేరాల్సింది ఇక్కడికే అని గుర్తు పెట్టుకుని కోడలితో తగాదా పడక జాగ్రత్తగా ఉండు. ఇప్పటికిప్పుడు వెళ్ళిపోదాం అంటే అబ్బాయి బాధపడతాడు" అన్నాడు.
పిల్లాడిని ఉయ్యాలలో వేద్దాం అని ఒక ఉయ్యాల కొనుక్కుని వచ్చారు కొడుకు కోడలు.
వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు మనవడిని చూసే బాధ్యత తనదే కావడంతో మనవడిని శుభ్రంగా ముస్తాబు చేసి బుగ్గన చిన్న చుక్క పెట్టేది పార్వతమ్మ. కోడలు రాగానే "ఏమిటి అత్తయ్యా ఈ బొట్లు ఒళ్ళంతా" అంటూ తడిగుడ్డతో తుడిచేసేది.
పిల్లాడిని తీసుకుని ఉయ్యాలలో పడుకోబెట్టబోతున్న కోడలు చేతిలో నుంచి మనవడిని లాక్కుని, "పెద్దదానిని నేను ఉన్నాను కదా, మంచి రోజు చూసి ఉయ్యాలలో వెయ్యాలి. ఒరేయ్ అబ్బాయి, నా మాటకు విలువ ఇచ్చి చిన్న ఫంక్షన్ చేసి మన ఫ్లోర్ లో ఉన్న ఆడవాళ్ళని పిలిచి పిల్లాడికి అక్షింతలు వేయించి అప్పుడు ఉయ్యాలలో పడుకోబెట్టి వాళ్ళ చేత ఉయ్యాల ఊపిస్తే మంచిది."
"అమ్మాయి కావ్య, నువ్వు క్యాలెండరు తీసుకురా మంచి రోజు ఎప్పుడో చూస్తాను" అంది గంభీరంగా.
అత్తగారు అలా పిల్లాడిని లాక్కోవడంతో తెల్లబోయి, "మా ఇంట్లో క్యాలెండరు లేదు, అయినా అన్ని రోజులూ మంచివే. పిల్లాడు మంచం మీద పడుకోకుండా ఏడుస్తున్నాడు, అందుకే ఉయ్యాల కొన్నాను" అంది.
"ఒరేయ్ అబ్బాయి, ఆ కంప్యూటర్ లో చూసి చెప్పు మంచి రోజు ఎప్పుడో. చిన్నప్పటి నుంచి మంచి చెడు చూసుకునేవాడివి, నీకేమైంది?" అని కసిరింది కొడుకుని.
"ఈ పట్టణంలో ఇవి కుదరవు పార్వతి. పిల్లాడు ఏడుస్తుంటే కోడలు మాత్రం ఏం చేస్తుంది, ఉయ్యాలలో పడుకోనివ్వు" అన్నాడు సీతారాం.
"ఇన్నాళ్ళు లేని ఉయ్యాలా ఒక్కరోజు ఆగితే నష్టం లేదు. రేపు సాయంత్రం మంచిదే. అమ్మాయి, మనమిద్దరం ఈ నాలుగు ఇళ్ళ వాళ్ళని పిలిచి వద్దాం పదా" అంది.
పరిస్థితి తన కంట్రోల్ లో లేదు అని తెలుసుకుని "సరే పదండి అత్తయ్యా" అంది కావ్య.
పార్వతమ్మ డ్రెస్ మార్చుకుని వచ్చేసరికి కావ్య కూడా రెడీగా ఉంది. "అదేమిటి అమ్మాయి, ముఖానికి బొట్టు లేకుండా ఇతరులకి బొట్టు పెట్టి ఎలా పిలుస్తావు? ఇంట్లో నీ ఇష్టం, బొట్టు విలువ ఈ కాలం పిల్లలకి తెలియడం లేదు. ఊరికే మొగుడు వెనుక కూర్చుని షికారులు కొట్టడం కాదు, బొట్టు పెట్టుకోవడం భర్త క్షేమం కోసం అని ఎప్పుడు తెలుసుకుంటారో ఏమో" అంది.
లోపలికి వెళ్లి కావ్య చిన్న బొట్టు బిళ్ళ ముఖానికి అంటించుకుని "పదండి, వచ్చి మళ్ళీ వంట చేయాలి నేను" అంది.
అదే ఫ్లోర్ లో ఉన్న నలుగురు ఆడవాళ్ళని పిలిచారు. అందరూ జుట్టు విరబోసుకుని జిడ్డోడిపోతూ బొట్టు కాటుక లేకుండా ఉన్నారు. పెద్దవాళ్ళు చక్కగా తయారై టీవీ చూస్తూ ఉన్నారు. "ఏమిటో అమ్మాయి, ఈ పట్నంలో తల దువ్వుకుని జడ వేసుకోరా" అంది కోడలితో పార్వతమ్మ.
"మీకెందుకు అత్తయ్యగారు, ఇతరులు మీకు నచ్చినట్టుగా ఉండాలని బలవంతం చెయ్యడం? ఎప్పుడో అప్పుడు మీరు అవమానపడే స్థితి వస్తుంది" అంది కావ్య.
కోడలు అన్న మాట తననే అనుకుని, ఈ ఫంక్షన్ అవ్వగానే మా ఊరు వెళ్ళిపోవాలని అనుకుంది.
"అమ్మా ఇప్పుడే చెప్తున్నాను, సాయంత్రం వచ్చిన ఆడవాళ్ళకి పసుపు కుంకుమ అంటూ తయారవ్వద్దు" అన్నాడు కొడుకు అభిరామ్.
మొత్తానికి ఆ వారం రోజులలోనే తమ ఊరికి బయలుదేరి వెళ్లిపోయారు సీతారాం, పార్వతమ్మ.
కొడుకు కూడా ఉండమని అనలేకపోయాడు. అమ్మకి ఈ ఇంటి వాతావరణం పడదు, వెళ్ళనీ, ఊర్లో హాయిగా ఉంటుంది అనుకున్నాడు.
రోజులు వేగంగా గడుస్తున్నాయి. కావ్యకు డాన్స్ చెప్పించుకునే వాళ్ళు ఎక్కువ అవ్వడంతో ఉదయం భర్త వెళ్ళగానే వెళ్లి డాన్స్ క్లాసులు తీసుకుని సాయంత్రం వచ్చేది. పిల్లాడిని చూడటానికి ఒక పనిపిల్లని పెట్టుకున్నారు.
"ఎందుకు కావ్య ఈ డాన్స్ నేర్పడానికి వెళ్లడం? నేను సంపాదిస్తున్నాగా, నువ్వు ఇంటి పట్టున ఉండి పిల్లాడిని చూసుకోవచ్చుగా" అన్నాడు అభిరామ్.
"మా అమ్మ నాకు డాన్స్ నేర్పించింది నీ ముందు డాన్స్ చెయ్యడానికి కాదు. నాకు వచ్చిన విద్యతో పేరు, డబ్బులు సంపాదించుకోవాలి. పనిపిల్ల బాబుని బాగానే చూసుకుంటోంది" అంది కావ్య. "అవున్లే, నన్ను డాన్స్ చేయించడానికి నీకు మీ అమ్మ డాన్స్ నేర్పించింది" అని మనసులో అనుకుని సైలెంట్ అయిపోయాడు.
ఆ రోజు ఆఫీసులో పని త్వరగా అయిపోవడంతో ఇంటికి వచ్చేసిన అభిరామ్ కి పనిపిల్ల చేతిలో బాబు గుక్కపెట్టి ఏడుస్తూ ఉండటం చూసి, పిల్లాడిని తన చేతిలోకి తీసుకుని "ఎందుకు ఏడుస్తున్నాడు? అమ్మగారు రాలేదా ఇంకా?" అని అడిగాడు.
"ఐదు గంటలకు వస్తారు సార్. బాబు ఎంత పడుకోబెట్టినా పడుకోకుండా ఏడుస్తున్నాడు" అంది.
అభిరామ్ చేతిలో కూడా ఆగకుండా ఏడుస్తున్న కొడుకుని ఎందుకైనా మంచిది అని దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాడు. డాక్టర్ గారు "పిల్లాడికి కడుపులో నొప్పి అనుకుంటా, మందు ఇస్తాను తగ్గిపోతుంది" అన్నాడు.
సాయంత్రం ఆరుగంటలకు వచ్చిన కావ్య అభిరామ్ ని చూసి కంగుతిని, "బాబు ఎందుకు ఏడుస్తున్నాడు?" అంది. "కడుపునొప్పి అన్నాడు డాక్టర్. అయినా నువ్వు రోజుకి రెండు గంటలు మాత్రమే డాన్స్ క్లాసులు ఉంటాయి అని ఇప్పటివరకు ఇంటికి రాకుండా ఎందుకు ఉన్నావు?" అన్నాడు.
"డాన్స్ బాగా నేర్పిస్తున్నాను అని ఇంకా కొన్ని క్లాసులు ఎక్కువ ఇచ్చారు, అందుకే లేట్ అయ్యింది" అంటూ పిల్లాడిని తీసుకుంది.
రాత్రి కొద్దిసేపు తప్ప కొడుకు ఏడుస్తూ ఉండటంతో అభిరామ్, కావ్య భయంతో పిల్లల హాస్పిటల్ కి తీసుకువెళ్లారు. స్కానింగ్ చేసిన డాక్టర్ "బాబు కడుపులో ప్రేగు మీద చిన్న బ్లడ్ కంతి ఉంది. చిన్న ముక్క తీసి బయాప్సీకి పంపుతాను. ఇప్పుడు అడ్మిట్ చేసుకుని సాయంత్రం చిన్న ఆపరేషన్ చేస్తాను" అనటంతో గుండె జారిపోయింది అభిరామ్ కి, కావ్యకి.
డాక్టర్ గారు చెప్పినట్టే పిల్లాడిని హాస్పిటల్ లో అడ్మిట్ చేసి బాబుతో పాటు అదే గదిలో విచారంగా కూర్చొని ఉన్నారు అభిరామ్, కావ్య.
"పొరపాటున కూడా మా అమ్మకి ఫోన్ చేసి బాబు విషయం చెప్పకు. కంగారుపడిపోతుంది. మనమే ధైర్యంగా ఎదుర్కొందాం" అన్నాడు భార్య కావ్యతో.
రెండు గంటలకు నర్స్, అసిస్టెంట్ డాక్టర్ వచ్చి బాబుని ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకువెళ్లారు. ఆపరేషన్ థియేటర్ ముందు కుర్చీలలో విచారంగా కూర్చొని ఉన్న అభిరామ్ కి తల్లి నుంచి ఫోన్ రావడం చూసి, భార్య వంక చూసి "నువ్వు ఏమైనా మా అమ్మకి చెప్పావా?" అని అడిగాడు. "లేదు" అని తల అడ్డంగా ఊపింది కావ్య.
"ఆ చెప్పు అమ్మా, భోజనం అయిందా? నాన్న ఏమి చేస్తున్నారు?" అని అడిగాడు తల్లిని.
"ఏం భోజనాలో ఏమిటో, మూడు రోజుల నుంచి మనసు ఒక్కటే కలతగా ఉంది. ఏదో జరగకూడనిది జరుగుతోంది అని భయంగా ఉంది. మీరు ఎలా ఉన్నారు?" అని అడిగిది పార్వతమ్మ.
"బాగానే ఉన్నాము అమ్మా, అనవసరంగా కంగారు పడి ఆరోగ్యం పాడు చేసుకోకు. మేము బాగానే ఉన్నాము" అన్నాడు. "నిన్నటి నుంచి ఆంజనేయస్వామికి ఆకుపూజ చేస్తున్నాను ఎవరికీ ఎటువంటి హాని కలగకూడదు అని. పడుకోబోయే ముందు బాబా విభూతి మీరు పెట్టుకుని పిల్లాడికి పెట్టండి. ఏమిటో, ఒక పూజా లేదు పాడు లేదు మీ ఇంట్లో" అని ఫోన్ డిస్కనెక్ట్ చేసింది.
ఇక్కడ మనవడికి ఇలా ఉండటంతో అక్కడ అమ్మ మనసులో కంగారుగా ఉండటం నిజంగా రక్తసంబంధం కాకపోతే ఏమిటి అనుకున్నాడు.
"ఏమంటున్నారు అత్తయ్యగారు?" అంది కావ్య.
"విషయం విని అభి, బాబుకి ఎటువంటి ప్రమాదం కలగకుండా ఉండాలని రేపటి నుంచి నేను కూడా దేవుడి పూజ చేసి ఒంటిపూట భోజనం చేస్తాను ఒక నెల రోజులు" అంది కళ్ళు తుడుచుకుంటూ కావ్య.
భార్య వంక ఆశ్చర్యంగా చూసి "నువ్వు పూజలు చేయగలవా?" అన్నాడు.
"అత్తయ్య గారికి ఫోన్ చేసి పూజా విధానం తెలుసుకుని చేస్తాను. ఈ గండం గడిస్తే ఒకసారి తిరుపతి వెళ్దాం అండీ" అంది.
"అలాగే తప్పకుండా" అన్నాడు అభిరామ్.
కొద్దిసేపటి తర్వాత ఆపరేషన్ థియేటర్ లైట్ ఆరింది. డాక్టర్ చిరునవ్వుతో బయటకు వచ్చి, "భయపడాల్సింది ఏమీ లేదు, ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. కంతిని తొలగించాం. అయితే చిన్న ముక్క బయాప్సీకి పంపుతాను రొటీన్ గా. నా ఎక్స్పీరియన్స్ బట్టి రిపోర్ట్ నార్మల్ గా ఉంటుంది అనుకుంటున్నాను. బాబుకి కొంతసేపటిలో స్పృహ వస్తుంది. ఈ రోజు ఐసీయూలో ఉంచి రేపు రూమ్ కి మారుస్తాము. ఒకసారి మీరు అబ్బాయిని చూసి ఇంటికి వెళ్లిపోండి, మీరు ఉండక్కర్లేదు" అన్నాడు.
ఆ మాట వినగానే అభిరామ్, కావ్యల ప్రాణాలు లేచివచ్చాయి. "సార్ బయోప్సీలో ఏమీ ఉండదు కదా" అంది కావ్య.
"నా దృష్టిలో ఏమీ ఉండకపోవచ్చు. ధైర్యంగా ఉండండి" అన్నాడు డాక్టర్ గారు.
కావ్య మనసులో ఒక్కసారిగా అత్తగారి మాటలు మెదిలాయి. "ఆపద వచ్చినప్పుడు దైవం గురించి తలుచుకోవడం కాదు, నిత్యం ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ పూజ చేసుకుంటే అసలు ఆపదే రాదు అని నమ్మాలి".
అవును, తన అత్తగారి పూజల వల్లనే గండం గడిచింది. రిపోర్ట్ కూడా నార్మల్ చేస్తాడు ఆ భగవంతుడు అనుకుంటూ బాబుని చూడటానికి ఐసీయూలోకి వెళ్లారు. కళ్ళు మూసుకొని పడుకొని ఉన్న కొడుకుని చూడగానే కావ్యకు ఒక్కసారిగా ఏడుపు తన్నుకొచ్చింది.
పక్క మంచం మీద ఒక ముసలాయన ఆక్సిజన్ ట్యూబ్ పెట్టుకుని పడుకొని ఉన్నాడు. అతని భార్య అనుకుంటా కావ్య ఏడుపు విని దగ్గరగా వచ్చి, కావ్య భుజం మీద చెయ్యి వేసి "భయపడకు తల్లీ, అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. ఆయన తప్పకుండా కాపాడుతాడు" అంది.
కావ్య మనసులో అనుకుంది, "ఇంత మంది ఆ దేవుడిని నమ్ముకుని ధైర్యంగా ఉన్నారు. తను ఇన్నాళ్ళు ఆయనని మరిచిపోయాను" అని ఆంజనేయస్వామిని తలచుకుంది కళ్ళు మూసుకొని.
మరుసటి రోజు అభిరామ్ వాళ్ల అమ్మకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. పార్వతమ్మ కంగారు పడుతూ భర్తతో పాటు వెంటనే బయలుదేరి చెన్నై వచ్చేసింది. కానీ ఈసారి ఆమెకు ఇంట్లో ఎదురైన దృశ్యం వేరు. ఇంటి హాల్లో ఒక చిన్న టేబుల్ మీద ఆంజనేయ స్వామి ఫోటో, దాని ముందు చిన్న ప్రమిద వెలుగుతోంది.
కావ్య తలస్నానం చేసి, తల దువ్వుకుని, నుదుటన చిన్న బొట్టు పెట్టుకుని అత్తగారికి ఎదురువచ్చింది.
కావ్య అత్తగారి కాళ్లకు నమస్కరించి, "అత్తయ్యగారు, నన్ను క్షమించండి. రూపం లేని దైవాన్ని నమ్మడం గొప్పదే కావొచ్చు కానీ, మనసు వికలమైనప్పుడు ఆ రూపమే మనకు ధైర్యాన్ని ఇస్తుందని నాకు అర్థమైంది."
"కష్టంలో ఉన్నప్పుడు మనకి దిక్కు భగవంతుడే అని తెలుసుకున్నాను. త్వరలో మనం తిరుపతి వెళ్లి వద్దాం" అంది.
పార్వతమ్మ కళ్లలో నీళ్లు తిరిగాయి. కోడలిని దగ్గరకు తీసుకుని, "అమ్మాయీ! నీ నమ్మకం తప్పు అని నేను అనను. తోటి మనిషికి సాయం చేయడం కంటే మించిన పూజ లేదు. కానీ మన సంప్రదాయాలు మనకు ఒక క్రమశిక్షణను, మానసిక బలాన్ని ఇస్తాయి. ఇప్పుడు మనవడు బాగున్నాడు కదా, అదే నాకు పదివేలు" అంది.
అభిరామ్ దూరంగా నిలబడి ఇద్దరినీ చూస్తూ ఊపిరి పీల్చుకున్నాడు.
పదిహేను రోజుల తరువాత బిక్కుబిక్కుమంటూ డాక్టర్ దగ్గరికి వెళ్లి "రిపోర్ట్ సార్" అన్నాడు. డాక్టర్ గారు నవ్వుతూ "రిపోర్ట్ నార్మల్. ఏమైనా ఉంటే మేమే మీకు ఫోన్ చేసేవాళ్ళం. పిల్లాడికి కొద్దిగా బలమైన ఆహారం ఇవ్వండి" అని రిపోర్ట్ చేతికిచ్చాడు.
శుభం
జీడిగుంట శ్రీనివాసరావు గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):
జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం
ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.











@t.s.sbhargavateja6196
• 2 hours ago
Super story srinivas garu.Chaala baaga undhi story and nijam ni kallaku Katti nattu cheppaaru