top of page
Original.png

ప్రియమైన నాన్న గారికి

3 hours ago
4 min read

హాస్టల్ గదిలో పాత ఉత్తరాలు చదువుతూ నవ్వుకుంటున్న నలుగురు తెలుగు అమ్మాయిలు

Priyamaina Nannagariki - Telugu Childhood Memories Story | Bugatha Yamuna

ప్రియమైన నాన్న గారికి తెలుగు బాల్య స్మృతుల కథ | బుగత యమున

Publishes in manatelugukathalu.com on 20/09/2026


బుగత యమున రచించిన ‘ప్రియమైన నాన్న గారికి’ కథ ప్రతి ఒక్కరినీ తమ విద్యార్థి దశలోని మధుర జ్ఞాపకాల్లోకి తీసుకెళ్తుంది. హాస్టల్ జీవితం అంటే కేవలం చదువు మాత్రమే కాదు; తోటి స్నేహితులతో బట్టలు ఉతుక్కోవడం, తినుబండారాలు పంచుకోవడం, స్వతంత్రంగా ఎదగడం నేర్పించే ఒక బృందావనం. సెలవుల సందడి వేళ సౌమ్య చిన్నప్పుడు తన నాన్నకు రాసిన అమాయకపు ఉత్తరాల ద్వారా హాస్టల్ తొలి రోజుల బెంగ, నాన్నపై గల ప్రేమ, స్నేహితుల మధ్య చిలిపి నవ్వులు ఈ కథలో ఎంతో సహజంగా ఆవిష్కృతమయ్యాయి. ప్రతీ హాస్టలర్ తప్పక చదవాల్సిన భావోద్వేగభరితమైన తెలుగు కథ ఇది.


పిల్లగాళ్ల మీదకి పదిహేడేళ్ల వయసు వచ్చినా సరే... పది రోజులు వరుస సెలవులంటే హాస్టల్ జీవితం గడిపేటోళ్లకి మహా సంబరం. మూడు రోజుల ముందు నుంచే మాసిన బట్టలను మచ్చుకైనా కనిపించకుండా ఉతికి ఆరేసుకోవడం, నెమ్మది నెమ్మదిగా నిల్వ ఉన్న పప్పులు, పచ్చళ్లను పగడ్బంధీగా ఖాళీ చేసేసుకోవడం... ఇదే సందడి. 


పది రోజులకే ఇంత ఆర్భాటం చేసే హాస్టల్ జీవితాలకు నెల రోజులు సెలవులు అనేసరికి నేల మీద కాళ్లు నిలబడతాయా? ఆ రోజు ఏప్రిల్ 29, సోమవారం. కాలేజ్ నోటీస్ బోర్డులో సమ్మర్ హాలిడేస్ నోటీస్ అతికించారు. వేద, సౌమ్య, అంకిత, దీప్తిలు నలుగురూ డైట్ హాస్టల్లో రూమ్‌మేట్స్. కాలేజీ పూర్తయిన సాయంత్రం నాడు... అలా నోటీస్ బోర్డు వైపుగా వస్తుండగా కొత్తగా నోటీస్ ఏదో అంటించినట్టున్నారే అనుకుంటూ అటువైపు చూపును తిప్పారు. 


“ఒసేయ్, ఇప్పుడు కూడా వేసవి సెలవులు ఉంటాయా? ఇంటర్ వరకే వేసవి సెలవులు ఉంటాయనుకున్నాం కదా! మే ఒకటి నుంచి నెల రోజులు సెలవులా! అలా అయితే మనకు రేపు ఒక్క రోజే గ్యాప్ ఉంది. నెల రోజులు రాం అంటే... అన్నీ జాగ్రత్తగా సర్దుకొని వెళ్లాలి మరి” అనుకుంటూ... సంతోషంగా హాస్టల్‌కు చేరుకొని, బ్యాగులు సర్దే పనిలో పడ్డారు. 


పెట్టెల్లో సర్దినవి బయటకు తీస్తూ, బయట ఉన్నవి పెట్టెల్లో సర్దుతూ హడావిడిగా ఆ సందడిలో మునిగిపోయారు నలుగురూ... అప్పుడే సౌమ్య పెట్టెలో నుంచి తీసిన పుస్తకం మధ్యలో నుండి జారిపడినవి కొన్ని ఉత్తరాలు. 


కొంచెం ఎత్తు నుండి జారిపడటంతో అవి నాలుగు దిక్కులకూ చెల్లాచెదురైపోయాయి. వెంటనే మిగిలిన ముగ్గురి కళ్లూ ఆ ఉత్తరాల పైకి మళ్లాయి. ముగ్గురూ చేతికి దొరికిన ఉత్తరాలను చేజిక్కించుకున్నారు.


బ్యాగులు సర్దుకునే బిజీ పనిని పక్కకు నెట్టేసి... చిట్టి చిట్టి రాతలతో రాసిన ఆ ఉత్తరాలను చదవడం మొదలు పెట్టారు. 


“ఒసేయ్... ఒసేయ్... వాటిని నాకు ఇచ్చేయండే... ప్లీజ్... ప్లీజ్…” అని బతిమిలాడుతూ లాక్కుంటున్న సౌమ్యతో పట్లు పడుతూ, ముందుగా అంకిత చదవడం మొదలుపెట్టింది.


తేది: 10/08/2004తాటిపూడి


ప్రియమైన నాన్న గారికి,మీ కూతురు సౌమ్య... నేను రాయునది ఏమనగా, నేను ఇక్కడ బాగున్నాను... మీరు అందరూ అక్కడ బాగున్నారా? ఈ సంవత్సరం ఆగస్ట్ 15కు నిర్వహించిన ఆటల పోటీల్లో నేను చాలా బహుమతులు గెలుచుకున్నాను. అందుకు నాకు బాగా ఆనందంగా ఉంది. 


అలాగే మీరు ఇక్కడికి వచ్చి రెండు నెలలపైనే అయిపోతుంది. నాకు మీ మీద చాలా బెంగగా ఉంది. ఈ ఆగస్ట్ 15కు మీరు ఇక్కడికి వస్తే, నేను బహుమతులు తీసుకున్నప్పుడు కూడా చూడవచ్చు. అమ్మా, నువ్వు, చెల్లిని తీసుకుని రండి నాన్నా…

ఇట్లు మీ కూతురు సౌమ్య... 


అని ఆసక్తిగా చదివి ఆపేసిన తరువాత వేద మొదలుపెడుతూ…

ఒసేయ్, ఈ ఉత్తరంలో సౌమ్య చూడండే సామాన్ల లిస్ట్ రాసింది.


'తేది…” అనగానే... “ఒసేయ్, అవి అక్కర్లేదులేవే... అసలు విషయం చదవవే…”


‘ప్రియమైన నాన్నకు...నాకు మీరు వెళ్లేటప్పుడు కొనిచ్చిన పప్పులు అన్నీ అయిపోయాయి... అందుకే, నాకు పప్పుండలు, జంతికలు, చేగోడీలు, కొబ్బరి ఉండలు కొని తీసుకురండి. అలాగే నా బకెట్ బట్టలు ఉతికి ఆరేసుకుంటున్నప్పుడు చేయి జారి విరిగిపోయింది. సబ్బులు, షాంపూలు కూడా అయిపోయాయి... అవి కూడా కొనుక్కొని రండి’


 అని చదువుతూనే నవ్వాపుకుంటున్న తనను చూసి, ముగ్గురూ కూడా కడుపుబ్బా నవ్వడం మొదలు పెట్టారు.


మధ్యలో కలుగజేసుకున్న దీప్తి... “ఒసేయ్ ఒసేయ్... ఆగండి... మన సౌమ్య రాసిన ఇంకో చిట్టి రాతను మీకు చదివి వినిపిస్తాను” అంటూ…


‘ప్రియమైన నాన్నకు, నేను ఇక్కడ బాగున్నాను అనుకుంటున్నారా! నేను ఇక్కడ బాగోలేను... నాకు మీరందరూ గుర్తువస్తున్నారు... నాకు ఇక్కడ ఉండ బుద్ధి అయితాలేదు. నన్ను ఇంటికి తీసుకువెళ్లిపోవడానికి మీరు రండి. నేను ఇంటి దగ్గర అల్లరి చేయను... అమ్మ చెప్పిన మాటే వింటాను, ఊర్లో తిరుగుతూ ఆటలాడను…’


అంటూ చదువుతున్న దీప్తి దగ్గరి నుండి ఆ ఉత్తరాన్ని తీసుకొని, ‘ఒసేయ్, ఇది నేను హాస్టల్‌కు వెళ్లిన కొత్తలో రాసిన ఉత్తరమే... నాకు అప్పటికి తొమ్మిది సంవత్సరాలే. రెసిడెన్షియల్ స్కూల్లో సీటు వచ్చిందని హాస్టల్లో వేశారు. కనీసం కంచం కూడా కడుక్కోవడం రాని రోజులు అవి... స్నానం చేసుకోవడం, జడలు వేసుకోవడం, బట్టలు ఉతుక్కోవడం... అన్నీ మేమే చేసుకోవాలి. 


ఎవ్వరూ తెలియదు, ప్రేమగా మాట్లాడేవారే ఉండరు. అప్పుడు ఆ వయసులో హాస్టల్లో ఉండడం చాలా బాధగా అనిపించేది ముందు. కొన్ని రోజులకు ఆ పనులన్నీ అలవాటైపోయాయనుకోండి. కొన్ని రోజుల వరకు ఇలా వచ్చేస్తాను... నేనిక్కడుండను... తీసుకుపోండి బాబోయ్ అని లెటర్లు రాస్తూనే ఉండేదానిని. 


ఆ తరువాత ఇదిగో ఆ ఉత్తరంలో లాగా ఆ పప్పులు తీసుకురండి... ఈ పప్పులు తీసుకురండి... అంటూ ఉత్తరాలు రాయడం మొదలు పెట్టాను…


చెప్పాలంటే అప్పట్లో మా హాస్టల్ అయితే ఒక బృందావనమే. అన్నీ అక్కడే నేర్చుకున్నాం మేము. అలాంటి రోజులు మళ్లీ రావు. అంత చిన్న వయసులోనే ఎంతో అవగాహనతో ఉండేవాళ్లం. ఒకరికి ఒకరం జడలు వేసుకోవడం... పేలు చూసుకోవడం... 


అందరం కలిసి ఆదివారం బట్టలు ఉతుక్కోవడం... ఒకరి దగ్గర పప్పులు మరొకరం పంచుకోవడం... డబ్బులు లేకపోతే రెండు రూపాయలు కూడా అప్పు అడిగి తీసుకోవడం... అమ్మ వాళ్లు హాస్టల్లో దించేసి వెళ్లేటప్పుడు కొనిచ్చిన వాటినే జాగ్రత్తగా వాడుకోవడం... 


ఇలా చాలా విషయాలు ఆ చిన్నతనంలోనే నేర్చుకుని వచ్చేసాం కదే. దీప్తి... నువ్వేమంటావ్? నేను ఇన్ని చెబుతున్నా నువ్వేం చెప్పవేంటే” అంది సౌమ్య.


“అవునే... మన సౌమ్య అయితే వాళ్ల అమ్మ వాళ్లు ఇచ్చిన పది, ఇరవై రూపాయలతో మొత్తం ఉత్తరాలనే కొనేదే అప్పుడు. ఇన్ని ఉత్తరాలు ఎందుకు కొనేదో? ఎవరికి రాసేదో? ఏమని రాసేదో? మాకు చూపించమన్నా చూపించేది కాదు... ఓ మూలన కూర్చుని రాసుకునేది…” అనగానే ఒక్కసారిగా నలుగురూ నవ్వుకున్నారు.


“ఒసేయ్, మీది అక్కడి హాస్టల్ లైఫ్ ఒక ఎత్తైతే... ఇక్కడ మనందరి హాస్టల్ లైఫ్ ఒక ఎత్తు.ఇది ప్రతి విద్యార్థి వారి జీవితంలో తప్పకుండా అనుభవించవలసిన అనుభూతి కదా!” అని “హాస్టల్ బాగుంటుందే... బాగుంటుందే..." అనుకుంటూ... మళ్లీ బట్టలు సర్దుకోవడం మొదలుపెట్టారు.


                   సమాప్తం 



బుగత యమున గారి కొన్ని ఇతర రచనలు:




బుగత యమున గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

బుగత యమున

రచయిత్రి పరిచయం: బుగత యమున

నేను బుగత యమున,సెకండరీ గ్రేడ్ టీచర్ గా గోకవరం మండలంలో పని చేస్తున్నాను..నాకు సాహిత్యం అంటే ఎనలేని అభిమానం..ఆ అభిమానం అందించిన ప్రోత్సాహకంతోనే ముందుగా ప్రతిలిపి యాప్ లో రచనలు చేయడం మొదలుపెట్టి..సుమారు 200 వరకూ రచనలు చేసాను..అలాగే సాహితీ గోదావరి మరియు విశాఖ సంస్కృతి పత్రికలకు కూడా నేను కవితలు రాస్తూ ఉంటాను..

***


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page