వ్యాపార ప్రపంచం – పార్ట్ 1
- Pandranki Subramani

- 6 hours ago
- 6 min read

Vyapara Prapancham – Part 1 | Telugu Emotional Inspirational Serial | Pandranki Subramani
వ్యాపార ప్రపంచం – పార్ట్ 1 | తెలుగు భావోద్వేగ ప్రేరణాత్మక ధారావాహిక| పాండ్రంకి సుబ్రమణి | ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత
Published in manatelugukathalu.com on 07/08/2026
"ప్రమోషన్ ఇవ్వాలంటే ప్రతిభ సరిపోతుందా... లేక వ్యక్తిత్వమే అసలు అర్హతా?"
కుటుంబ ప్రేమతో రోజును ప్రారంభించిన సుఖదేవ్, కార్యాలయంలో మాత్రం కఠినమైన వ్యాపార నిర్ణయాల ముందుంటాడు. ఉద్యోగుల ప్రమోషన్లు, నైతిక విలువలు, నాయకత్వ బాధ్యతలు, వ్యాపార విస్తరణ—ఈ నాలుగు అంశాల మధ్య జరిగిన ఆసక్తికర సంభాషణ కథను కొత్త మలుపులోకి తీసుకెళ్తుంది. కుటుంబాన్ని గౌరవించని వ్యక్తికి ఉన్నత పదవి ఇవ్వాలా? నిజమైన నాయకుడి లక్షణాలు ఏమిటి? ఆలోచింపజేసే ప్రశ్నలకు సమాధానాల కోసం చదవండి "వ్యాపార ప్రపంచం – పార్ట్ 1".
Scene 1 – కుటుంబం నుండి వ్యాపార ప్రపంచంలోకి
కంపెనీ కార్యాలయానికి బయల్దేరేముందు భార్య ప్రణవి హాలు వరకూ వచ్చి అందించిన కాఫీ కప్పు - పెదవుల చిలకరించిన చిరునవ్వూ అందుకుని నిదానంగా ఇంటి గడప వరకూ నడుస్తూ కూతురు కామిని నెత్తిన ప్రేమగా చిన్న మొట్టికాయ పెట్టి, కొడుకు రాఘవ్ వైపు సాలోచనగా చూస్తూ వెళ్లి కారులో కూర్చున్నాడు సుఖదేవ్.
డ్రైవ్ చేస్తున్నప్పుడు గుమ్మం వరకూ వచ్చి భార్య చిలకరించిన నవ్వుల పన్నీటి చినుకులు మనసును ఇంకా తాకుతున్నా ఆలోచనలు మాత్రం ఉవ్వెత్తున ఎగిసిపడే తరంగాలలా, అలజడి రేపే ఉధృత ఊహల్లా ముప్పిరిగొంటూనే ఉన్నాయి. డ్రైవ్ చేస్తూనే ఎవరో తట్టి లేపినట్టు అతడు ఉన్నపాటున తల విదిలించాడు - బలంగా దవళ్ళు బిగిస్తూ అనుకున్నాడు -
“ఊఁహుఁ! వ్యాపార విస్తరణలో ఈ వేగం చాలదు. ససేమిరా చాలదు -- ముఖ్యంగా ఇప్పటి డైనమిక్ అండ్ డేషింగ్ యూత్‌ఫుల్ పోటీ ప్రపంచంలో - ఇంటర్ ప్రెన్యూర్ షిప్పుల్ని పిడికిట బిగించి వ్యాపింపచేస్తున్న క్వాలిఫైడ్ వ్యాపార దక్షతలు గల యువకుల పరిసరాలలో--“
వీళ్ళ ముందు నిటారుగా నిల్చుని సజావుగా నిలదొక్కుకోలేకపోతే తననూ తన వ్యాపార సంస్థ - సుగుణ్ ట్రేడర్స్ ను ఒలిచిన అరటి తొక్కలా తీసిపారేస్తారు. కాదు - తొక్కి పారేస్తారు. అతడికి తెలుసు ప్రపంచంలో చాలా విషయాలు మనిషి అదుపులో ఉండవని. అందుకోలేనంత దూరాన తచ్చాడుతుంటాయని -- ఇంటి వాకిట ఎలా వచ్చి వాలుతుంటాయో అదే రీతిన చప్పుడు లేకుండా పెరటి దారిన మూడవ కంటికి కనిపించకుండా కనుమరుగై పోతుంటాయని కూడా అతడికి తెలుసు.
కానీ, ఎన్ని అవాంతరాలు ఎదురొచ్చినా కొన్నిటిని అలా అలవోకగా తనవరకూ రాలేదు కదా అన్న నిర్లిప్త భావంతో పోనివ్వకూడదు. ఇంటి పెద్దల ఆశీర్వచనంతో సొంతం చేసుకున్న సుగుణ్ సంస్థను - దాని నీడన సామాజిక పరిధిన పొందిన స్టేటస్ ను తను జారవిడుచుకోలేడు. అది గాని కోల్పోతే తన మనుగడే దెబ్బతింటుంది - దానితో బాటు తన కుటుంబ భవిష్యత్తు కూడా దెబ్బతింటుంది. తన జీవితమూ తనకు సేద తీరుస్తున్న కుటుంబమూ ఇప్పటికిప్పుడు నడి రోడ్డున పడకపోవచ్చు — కానీ, జీవితం తప్పకుండా సామాజిక స్థానం కోల్పోయి నవ్వులపాలవుతుంది. అటువంటి పరిస్థితి నుండి తలెత్తుకోవాలంటే ఒక దశాబ్ద కాలం కావాల్సి ఉంటుంది.
Scene 2 – విజయమే లక్ష్యం

అందుకే అతడిలో చాలా రోజులుగా జ్వలిస్తున్న తపన - పదే పదే కుదుపుతున్న సంచలిత మనో భావన -- అతడు అలా ఆలోచిస్తూ కారుని కంపెనీ గేట్ వద్ద ఆపి పరుగున వచ్చి సెల్యూట్ చేసి నిల్చున్న సెక్యూరిటీ గార్డుకి కారు కీ అందించి డోరు తెరచి కారు దిగి మెల్లగా తన కార్యాలయ ఛాంబర్ వైపు నడిచాడు ఎదురొచ్చి జూనియర్ స్టాఫ్ చేస్తున్న అభివాదాలు అందుకుంటూ -- అలా అందుకుంటూనే మనసున ఫెళ్ళున నవ్వకుండా ఉండలేకపోయాడు మరొక వింతైన ఆలోచన గుప్పున గుర్తుకువచ్చి.
“బయట పై పొరన చూస్తున్న చాలామంది పామర జనం అనుకుంటారు వ్యాపార వేత్తలు - పారిశ్రామిక వేత్తలు సుఖలాలస్యం అనుభవిస్తూ ఇంటా బయటా నిత్య వైభోగం అనుభవిస్తుంటారని! వాళ్ళలో కచ్చితంగా కొందరికి తెలియదు - వ్యాపారవేత్త తన వ్యాపార లావాదేవీలు కొనసాగించాలంటే బ్యాంకు లోనుల రూపంలో, పన్నుల రూపంలో ముళ్ళ కంప వంటి చిక్కులు ఎదుర్కొంటారని. ఇదే కదూ దూరపు కొండల నునుపంటే--“
అతడు అలా అన్యమనస్కంగా ఆలోచించుకుంటూ తన ఛాంబర్ లోకి ప్రవేశించి సరాసరి సీటులో ఆసీనుడవక ముందు ఓసారి వినాయకుడి పటానికి నమస్కరించి ఆ తరువాత తన దివంగత తండ్రి సాంబమూర్తిగారి పటానికి కూడా నమస్కరించి కూర్చున్నాడు బల్లపైనున్న నీళ్ళ గ్లాసుని అందుకుంటూ --
అప్పుడు అతడి సీనియర్ పి. ఏ. మాలిని - “లోపలకు రావచ్చా సార్!” అని పర్మిషన్ అడుగుతూ శుభోదయం కూడా అదే స్వరాన పలుకుతూ అడిగింది - “నిమ్మరసం పంపించేదా సార్?“
అతడు వద్దంటూ తల అడ్డంగా ఆడిస్తూ అన్నాడు - “వర్క్స్ డిప్యూటీ మేనేజర్ నాగముని గారు వచ్చిన తరువాత పంపించండి. “
ఆమె అలాగే సార్ అంటూ వెనక్కి తిరిగి - “అదిగో — వచ్చేసారు సార్!“ అని ఆగింది ఆమె.
నాగముని కూడా ముఖమంతటా నవ్వులు కురిపిస్తూ - “గుడ్ మోర్నింగ్ సార్! నేను రావడం ఆలస్యమైందేమో - సారీ!“ అంటూ లోపలకు ప్రవేశించి సుఖదేవ్ చూపుల్లో ఆదేశం అందుకుని బాస్ కి ఎదురుగా వచ్చి కూర్చున్నాడు -
“అదేమీ లేదు లెండి — మీరు ఆలస్యంగా రావడమా - ససేమిరా అలా జరగదు. ముందు నిమ్మరసం తాగండి —“ అంటూ మాలిని వైపు చూశాడు అతను.
ఆమె తలూపుతూ డోరు కొద్దిగా తెరచి బయటకు చూసింది. ఆ చూపులోని సంకేతం అందుకుని లేడీ సబ్ స్టాఫ్ నాగలక్ష్మి ట్రేలో రెండు గ్లాసుల నిండా నిమ్మరసం తెచ్చి ఇద్దరికీ భవ్యంగా అందించింది. సుఖదేవ్ ఒక గ్లాసు తను అందుకుని మరొకటి నాగముని ముందు చాచాడు.
“థాంక్యూ సార్!” అని గ్లాసు అందుకుని లేడీ ప్యూన్ నాగలక్ష్మి వైపు చూశాడు నాగముని; ఇక ఆమె అక్కణ్ణించి వెళ్ళవచ్చని కళ్ళతో సంకేతం ఇస్తూ -- ఆమె మరుమాటకి తావివ్వకుండా తలవంచి అక్కణ్ణించి కదలి వెళ్ళిపోయింది.
అప్పుడు తమ మధ్య ఉన్న అసలు సంబంధానికి రూపమిస్తూ అన్నాడు నాగముని - “ఇప్పుడు చెప్పబ్బాయి ఎందుకో పిలిచినట్టున్నావు —“
సుఖదేవ్ అవునన్నట్లు తల ఊపుతూ అన్నాడు - “అవును బాబాయ్! వేకెన్సీలు ఫిలప్ చేయడంలో, స్టాఫ్ కి ప్రమోషన్ల ఇవ్వడంలో మీరు మరీ ఖరాఖండీగా ఉన్నట్లు, మూల్యాంకనం మరీ కచ్చితంగా చేస్తున్నట్లు సీనియర్ స్టాఫ్ కొందరు వచ్చి నొచ్చుకున్నారు. మొరపెట్టుకున్నారు”
నాగముని నవ్వుతూ అడిగాడు - “ఏమని?“
“ప్రమోషన్ కమిటీ చైర్మన్ గా మీరు చేసే అడ్వర్స్ రిమార్కుల వల్ల కొద్దిమందికి ఇవ్వబోయే ప్రమోషన్లు బాగా ఆలస్యమవుతున్నాయని.. వాళ్ళ సీనియారిటీ పొజిషన్ ని స్థిరపర్చడంలో ఆలస్యమై బాగా నష్టపోతున్నారని -- బట్ వాటీజ్ ది ప్రాబ్లెమ్ బాబాయి?”
నాగముని బాస్ చెప్పింది విని అదే చెదరని చిరునవ్వుతో నిదానంగా చూసి బదులిచ్చాడు - “వాళ్ళు పరిపూర్ణంగా సర్వమూ నీ ముందుంచలేదనే తోస్తుంది. అదంతా వన్ సైడెడ్ వెర్షన్ —“
ఎలా అన్నట్టు బాబాయి కళ్ళలోకి చూశాడు సుఖదేవ్.
Scene 3 – విలువలే నిజమైన ప్రమోషన్

నాగముని కొనసాగించాడు - “చెప్తాను. సూపర్ వైజరీ స్థాయి వరకూ సాగే ప్రమోషన్ల విషయంలో నేనెన్నడూ అడ్డగోలుగా నిలవలేదు. ప్రమోషనల్ కమిటీ సిఫార్సుల్ని యథాతథంగా ఎండార్స్ చేస్తూనే వచ్చాను. నీకు సమర్పిస్తూనే ఉన్నాను. వాళ్ళకనుకూలంగా పే-ఫిక్సేషన్ కూడా చేస్తూనే ఉన్నాను. సూపర్ వైజరీ స్థాయి ప్రమోషన్ల విషయంలోనే నేను నా సొంత భావ ప్రకటనతో ప్రమేయం కలుగ చేసుకుంటున్నాను. ”
“బట్ వై? వాళ్ళేమి పాపం చేసుకున్నారు అంతటి కఠినమైన మూల్యాంకనానికి లోనుకావడానికి?“
“సింపుల్ — కుటుంబ వ్యవస్థలో పాటించాల్సిన విలువలకు ప్రాధాన్యత ఇస్తాను. ”
సుఖదేవ్ అక్కడ కట్ చేశాడు - “బట్ — ఎగైన్ - వై? మనం నడుపుతున్నది వ్యాపార సంస్థ - ఇక్కడ ఆశ్రమ ధర్మాలకు ఆస్కారం ఉండదు బాబాయ్! మనకు కావాల్సింది, చేయవలసిన పనులు, ముగించవలసిన పనులు సమయానికి జరిగిపోవాలి — అంతే“
“ఆస్కారమే కాదు. పోస్టుకీ మనిషి వ్యక్తిత్వానికీ సంబంధం కూడా ఉంది. నిలకడ గల కుటుంబ జీవితాన్ని గడపలేని వాడు ఉద్యోగ బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించలేడు. సంస్థకు ముఖ్యంగా క్రింది స్థాయి ఉద్యోగులకు తగు రీతిన దిశానిర్దేశం చేయలేడు. అన్ని సందర్భాలలో కాకపోయినా — కొన్ని సమయాలలో వ్యక్తిగత జీవితాన్ని ఉద్యోగ ధర్మం నుండి వేరు చేయలేం. ఇది సూపర్ వైజరీ పోస్టులకు, సీనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకూ వర్తిస్తుంది.”
“నా అవగాహనకు సరిపడా మీకెదురైన ఉదంతాలు చెప్తారా బాబాయ్ !”
“వైనాట్? ప్రమోషన్ లిస్టులో పుష్పరాజ్ అనే సీనియర్ స్టాఫ్ పేరు ఉంది. అతడి విషయంలో సూపర్ వైజర్ పోస్టు విడుదల చేయకుండా అడ్వర్స్ రిమార్కులతో అడ్డతగిలాను. కారణం - అతడు వివాహితుడు. యవ్వనవతి అయిన భార్యతో బాటు ఇద్దరు బిడ్డలు కూడా ఉన్నారు. కానీ — అతడు బంధానికి ఏ విధంగానూ లోనుకాని అపరిచిత స్త్రీలతో పైలా పచ్చీసుగా తిరుగుతూ విచ్చల విడిగా ఖర్చు చేస్తూ పిల్లల స్కూలు ఫీజు కూడా ఇవ్వకుండా జల్సా చేస్తున్నాడు.
అతడి భార్యామణి - అతడి మామగారూ ఇచ్చిన ఫిర్యాదు అందుకుని రిటన్ వార్నింగ్ ఇచ్చాను ఒళ్ళు దగ్గర పెట్టుకుని నడుచుకోమని. కానీ — అతడు తనను తను సరిదుద్దుకోలేదు సరికదా — నా రిటన్ మెమోని ఖాతరు చేయలేదు.
దాదాపు అటువంటిదే మరొక కేసు — అతగాడి పేరు మన్మథరావు. అతడు భార్య పిల్లలూ ఉండగానే అతగాడి ఇద్దరి మరదళ్ళతో విడిగా చిన్నిండ్లు పెట్టి భార్యా బిడ్డలను దిక్కుమాలిన వాళ్ళను చేసి కామ క్రీడా విలాసాలను అనుభవిస్తున్నాడు. అతగాడి భార్య ఫిర్యాదు వ్రాసి హెచ్చారెమ్ వాళ్ళకు పంపించింది. వాళ్ళేమో నాకు పంపించారు. న్యాయ సూత్రం ప్రకారం వార్నింగ్ ఇచ్చాను. సరిదిద్దుకోలేదు. ప్రమోషన్ రాకుండా ఆపుచేశాను.
వ్యక్తిగత జీవితానికే కాదు - ఉద్యోగ ధర్మానికి కూడా కుటుంబ విలువలు పునాది రాళ్ళ వంటివి అబ్బాయ్.. అవ్వా కావాలి బువ్వా కావాలి అంటే కుదరదు కదా! కనీస మర్యాదలు పాటించకుండా, సంస్కారాలు అలవర్చుకోకుండా ఉన్నత ఉద్యోగాలు కావాలంటే ఎలా? ఇంకా చెప్పాలంటే - వీళ్ళకు మనం మేలే చేశాం మన స్థాయిలో యాక్షన్ తీసుకుని గడువిచ్చాం -“
అదెలాగన్నట్టు విస్మయాత్మకంగా చూశాడు సుఖదేవ్ నాగముని వైపు.
“ఎలాగంటే — ఆడాళ్ళిద్దరూ మనపైన గౌరవంతో ఫిర్యాదుల్ని సరాసరి మనకిచ్చారు కాబట్టి వ్యవహారం మన పరిధిలోకి వచ్చి చట్టబద్ధమైన చర్యలకు లోనుకాకుండా ఆగిపోయింది. అలా కాకుండా అదే ఫిర్యాదుల్ని ఆడాళ్లిద్దరూ పోలీసులకో మేజిస్ట్రేటుకో సాక్షుల సపోర్టుతో ఇచ్చి ఉంటే ఈపాటికి రోడ్డు రోమియోలిద్దరూ ఉద్యోగాలు కోల్పోవడమే కాకుండా శ్రీ కృష్ణ జన్మస్థానానికి వెళ్ళి కటకటాలు లెక్కిస్తూ ఉండేవారు —“
అంతా విన్న సుఖదేవ్ అన్యాపదేశంగా తలూపుతూ ఉండిపోయి చివరకు పెదవి విప్పాడు - “ఇప్పటికి అదంతా ప్రక్కన పెడదాం. ఇప్పుడు నాకు డిస్టర్బ్ చేస్తున్న సంగతి మరొకటి ఉంది — నాకెందుకో ఇన్వెస్ట్‌మెంటు వింగూ ఒప్పందాలు క్లించ్ చేసే వింగూ నేను ఆశించినంత మేర ఫంక్షన్ కావడం లేదనే తోస్తుంది బాబాయ్! ఆ రెండు విభాగాలనూ తగు రీతిన రివ్యాంప్ చేయాల్సి ఉందనిపిస్తుంది బాబాయి —“
నాగముని అవునన్నట్లు తలూపాడు; నాగలక్ష్మి, ‘మే ఐ కమిన్ సార్’ అంటూ అందించిన టీ కప్పులు అందుకుంటూ — ఆ తరువాత ఒక కప్పు సుఖదేవ్ ముందుంచి మరొకటి తను తీసుకుని ఇక వెళ్ళవచ్చని నాగలక్ష్మికి కళ్ళతో సంకేతం ఇచ్చాడు. ఆ తరువాత ఎటో చూస్తూ టీ చప్పరిస్తూ కూర్చున్నాడు అతను.
అది చూసి సుఖదేవ్ అదోలా ముఖం పెట్టి చూశాడు - “అదేమిటి బాబాయ్ — టీ అంత రుచిగా ఉందేమిటి అంత టేస్ట్‌ఫుల్లీ తీసుకుంటున్నారు! ఇంతటి సెన్సిటివ్ విషయాన్ని ప్రస్తావించాను. మీరేమో అదేమీ పట్టించుకోకుండా అలా ఉండిపోయారు —“
ఆ మాట విని నాగముని చప్పుడు వినిపించనంతగా నవ్వాడు - “నేనేమీ అనకుండా మిన్నకున్నానంటే ఆలోచిస్తున్నానన్న మాటే కదా--“
“అదే ఆలోచనను నాతో పంచుకోవచ్చు కదా—నాకు కూడా ఆలోచనకు రూపమివ్వటానికి వ్యవధి దొరుకుతుంది కదా!”
“యు ఆర్ రైట్ - ఇప్పుడు చెప్తున్నాను. మనసు పొరను విప్పుతున్నాను. నాకూ అలానే అనిపిస్తుంది, ఆ లెవల్ లో మార్పు తీసుకురావాలని. అయితే — ఇందులో రెండు అంశాలు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది.
మొదటిది — ఇప్పుడు ఆ పోస్టులో ఉన్న వినాయకరావుని అంత త్వరగా రిమూవ్ చేయలేం. అతడికి నచ్చచెప్పి ఒప్పించి ఎక్కడా చేదు భావం మిగల్చకుండా అతణ్ణి అక్కణ్ణించి కదలించాలి. కారణం -- అతడికి సుగుణ్ ట్రేడర్స్ వ్యవస్థకు సంబంధించిన కొన్ని సెన్సిటివ్ విషయాలు తెలిసే ఉంటాయి. వాటినతడు ఎక్కడైనా బయట పెడితే కొంపలేవీ మునిగిపోవు గానీ — మన బిజినెస్ రైవల్స్ కి చేతులకు తొడుగులా ఉపయోగపడతాయి. మన ఫంక్షన్ లో అడుగడుగుకీ ఆటంకాలు ఏర్పడతాయి. అతడు అది ప్రత్యక్షంగా చేయకపోవచ్చు. కానీ మన బిజినెస్ రైవల్స్ ద్వారా చేయవచ్చు. ”
అప్పుడు సుఖదేవ్ అడ్డు వచ్చి తల ముందుకు చాచాడు - “దానికి మనమేమి చేయాలి?”
“అట్రాక్టివ్ ఎగ్జిట్ పే ఇవ్వాలి. కాదనలేని రీతిన యివ్వాలి. ఆ తరవాత వినాయక రావునీ అతడి భార్యామణినీ సన్మాన సత్కారాలతో సాగనంపాలి విత్ నో ట్రేస్ ఆఫ్ బిటర్ నెస్—“
“గుడ్ ఐడియా — మరి ఆ పోస్టుకి కొత్త అభ్యర్థిని సెలెక్ట్ చేసే విషయం గురించి ఆలోచించారా?”
“హుఁ ఎందుకు ఆలోచించలేదూ! ఈ సారి ఆ పోస్టు సెలెక్షన్ వ్యవహారం మన మిద్దరం మాత్రమే పూర్తి చేస్తాం. హైలీ కాన్ఫిడెన్షియల్ — అండ్ - హైలీ సెన్సిటివ్ - సరేనా!”
సుఖదేవ్ తలూపుతూ తన వంతు స్పందించాడు -- “అయితే — ఇందులో ఒక విషయం గుర్తుంచుకోవాలి బాబాయ్! ఈ పోస్ట్ హైలీ కాంపిటేటివ్ కాబట్టి ప్రిఫరబ్లీ జెంట్ నే సెలెక్టు చేద్దాం. ఎందుకు చెప్తున్నానంటే — మీకు ఇంట్లో అమ్మాయిల అలికిడి లేకపోవడాన - ముగ్గురూ అబ్బాయిలే కావడాన మీకు ఆదినుంచీ స్త్రీల పట్ల అపరిమితమైన అభిమానం. అందుకే చెప్తున్నాను”
============================
వ్యాపార ప్రపంచం - పార్ట్ 2 త్వరలో...
============================
పాండ్రంకి సుబ్రమణి గారి కొన్ని ఇతర రచనలు:
పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పాండ్రంకి సుబ్రమణి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

1) పేరు-పాండ్రంకి సుబ్రమణి
2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య
3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ
4)స్వస్థలం-విజయనగరం
5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు
6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.

a











Comments