తోలు బొమ్మలు - పార్ట్ 10

Tholu Bommalu - Part 10 - Telugu Serial | Ch. C. S. Sarma
తోలు బొమ్మలు - పార్ట్ 10 - తెలుగు ధారావాహిక | సిహెచ్. సీఎస్. శర్మ
Published In manatelugukathalu.com On 09/11/2026
తోలు బొమ్మలు పార్ట్ 10లో పార్వతీపురం గ్రామంలో ప్రదర్శించిన బాలనాగమ్మ వీధి భాగోతం ద్వారా తెలుగు జానపద కళల వైభవాన్ని రచయిత సిహెచ్. సీఎస్. శర్మ ఆసక్తికరంగా ఆవిష్కరించారు. బాలనాగమ్మ జననం, మాయల ఫకీరు ఆమెను అపహరించడం, కుమారుడు బాలవర్ధనరాజు తల్లిని రక్షించేందుకు చేసిన సాహసాలు, పంచవన్నెల రామచిలకలో దాగిన ఫకీరు ప్రాణరహస్యం వంటి ఘట్టాలు ఉత్కంఠభరితంగా సాగుతాయి. ఈ ప్రదర్శనను తిలకిస్తున్న చిన్న చంద్రశేఖర్, తన అత్త సుశీలపై ధనుంజయరావు చూపులను గమనిస్తాడు. జానపద కళలు, కుటుంబ అనుబంధాలు, గ్రామీణ సంస్కృతి కలగలిసిన ఆసక్తికరమైన భాగమిది.
జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సాక్ష్యాధారాలను బట్టి చంద్రశేఖర్ కు ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధింపబడుతుంది. జైలు నిశ్శబ్దంలో చంద్రశేఖర్ కలం పట్టాడు. తాత వీరరాఘవయ్య నుంచి మొదలైన జ్ఞాపకాలు చివరికి సుశీల–ధనుంజయరావుల వివాహ ప్రతిపాదన వరకు చేరుకున్నాయి. లో గ్రామానికి వచ్చిన సాంబయ్య తోలుబొమ్మల బృందం అతనిలో కొత్త ఆసక్తిని రేకెత్తిస్తుంది. ప్రదర్శన మధ్యలో ధనుంజయరావు ప్రవర్తనను గమనించిన చంద్రశేఖర్ మనసులో కొత్త సందేహం మొదలవుతుంది. కాశీ విశ్వనాథ ఆలయ చరిత్ర, పంచారామ క్షేత్రాల పురాణ నేపథ్యం, ద్వాదశ జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తిపీఠాలు, ప్రసిద్ధ శివాలయాల ప్రత్యేకతలను తెలుసుకుంటూ అక్కాతమ్ముళ్లు ఆసక్తిగా వింటారు. అయితే ధనుంజయరావుతో సుశీల వివాహం జరగవచ్చనే సూచనపై సత్యయ్య తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తాడు.
గత ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తోలు బొమ్మలు – నవల పరిచయం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తోలు బొమ్మలు - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తోలు బొమ్మలు - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తోలు బొమ్మలు - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తోలు బొమ్మలు - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తోలు బొమ్మలు - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తోలు బొమ్మలు - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తోలు బొమ్మలు - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తోలు బొమ్మలు - పార్ట్ 10 – బాలనాగమ్మ వీధి భాగోతం
మా బృందం, గోవర్ధనరావు గారి బృందం తోలుబొమ్మలాటకు కూర్చున్న విధంగానే వీధికి రెండు వైపులా చెరోవైపు మంచాల మీద కూర్చున్నాము.
ధనుంజయరావు కళ్ళు మా అత్తయ్య సుశీల మీదనే ఉన్నాయి. అతని చూపులను తాతయ్యగారు కూడా గ్రహించారు. చిరునవ్వుతో అతని వైపు చూశారు. అతను ముఖాన్ని పక్కకు తిప్పుకున్నాడు. అప్పుడు నాకు అర్థమయింది, తాతయ్యకు ధనుంజయరావు అంటే ఇష్టమని.
బాలనాగమ్మ వీధిభాగోతం ప్రారంభమయింది. అది జానపద కథ. కథలోని పాత్రలను గురించి ఆ బృంద నాయకుడు గోవింద వివరించారు. పాత్రధారులందరూ ఆయా పాత్రలకు తగిన వేషాలు (దుస్తులు వగైరా) ధరించి తెర వెనుక ఉన్నారు. వారే కాదు, వాయిద్య బృందం అంటే హార్మోనియం, మద్దెల, ఫ్లూట్, తాళాలు వాయించేవారు.
గోవింద ప్రేక్షకుల ముందుకు వచ్చాడు…
‘‘అయ్యలారా!... అమ్మలారా!... ఈ సుదినాన శ్రీశ్రీ వీరరాఘవయ్యగారి ఆధ్వర్యంలో మా బృందం మీ ముందు బాలనాగమ్మ జానపద కథను ప్రదర్శించబోతున్నాము. ఇందలి పాత్రలు భూచక్రపురం మహారాజు నవభోజరాజు, వారి అర్థాంగి భూలక్ష్మీదేవి, జటంగముని, ఏడుగురు ఆడ సంతానంలో చివరి బిడ్డ బాలనాగమ్మ. వారి అన్నగారు పానుగంటిపురం మహారాజు రామవర్ధనరాజు, వారి ఏడుగురు కుమారులు. బాలనాగమ్మగారి భర్త కార్యవర్ధనరాజు. మంత్రతంత్రాల మాయగాడు మాయల ఫకీరు, అతని ప్రియురాలు సంగు. బాలనాగమ్మ కుమారుడు బాలవర్ధనరాజు. ఇంకా చాకలి తిప్పడు, తంబళ్ళ పెద్దమ్మ, ఆమె మనుమడు వీరయ్య (బాలవర్ధనరాజు మారువేషంలో) — ఈ పాత్రలన్నీ మేము ఆడబోయే బాలనాగమ్మ వీధిభాగోతంలో వస్తాయి. ప్రార్థన చేసి భాగోతాన్ని ప్రారంభిస్తాము. మీరంతా మమ్మల్ని ఆశీర్వదించండి, సాములారా, అమ్మలారా!....’’ చేతులు జోడించాడు గోవింద.
గంట గణగణమ్రోగింది. శ్రీవిఘ్నేశ్వర ప్రార్థన ప్రారంభం అయింది.
‘‘శుక్లాంబరధరం విష్ణుం... శశివర్ణం చతుర్భుజమ్। ప్రసన్నవదనం ధ్యాయేత్... సర్వవిఘ్నోపశాంతయే!॥ అగజానన పద్మార్కం... గజాననమహర్నిశమ్। అనేకదంతం భక్తానాం... ఏకదంతముపాస్మహే!॥ వక్రతుండ మహాకాయ... కోటిసూర్య సమప్రభ। నిర్విఘ్నం కురు మే దేవ్... సర్వకార్యేషు సర్వదా!॥’’ అందరూ కలసి లయబద్ధంగా వాద్యాలతో ప్రార్థన గీతాన్ని వీనులకు విందుగా పాడారు.
బాలనాగమ్మ వీధిభాగోతం ప్రారంభమయింది.
కథ: భూచక్రపురం మహారాజు నవభోజరాజు. వారి అర్థాంగి భూలక్ష్మీదేవి. వారి వివాహమైన తర్వాత చాలా సంవత్సరాలు సంతానం కలగలేదు. ఒకనాడు జటంగముని వారు రాజమందిరానికి వచ్చారు. మహారాణి మునివరులను భక్తిశ్రద్ధలతో పూజించి, ఎంతోకాలంగా తమకు సంతానం కలగలేదన్న విషయాన్ని తెలియజేసింది. మునివరులు కళ్ళు మూసుకొని కొన్ని క్షణాలు ఆలోచించి...
‘‘మహారాణీ!... నీకు మగబిడ్డ కావలయునని కోరినచో, ఆ బిడ్డ జన్మించిన తర్వాత నీ పతి మరణిస్తాడు. ఆడపిల్ల కావాలన్నచో నీవు మరణిస్తావు. ఇది దైవనిర్ణయం. భక్తిశ్రద్ధలతో నాగదేవుని పక్షం రోజులు పూజించి, మరుదినం భవంతికి ఉత్తరాన ఉన్న మద్దిమానుల వనానికి వెళ్ళి, అక్కడ అనేక ఫలములతో ఉన్న మామిడి వృక్షం నుండి ఒక్క ఫలాన్ని కోసి ఆరగింపుము. నీవు కోరిన విధముగా నీకు సంతానం సిద్ధిస్తుంది...’’ చెప్పారు జటంగముని.
రాణి... ‘‘నాకు ఆడబిడ్డే కావాలి. నేను చనిపోయినా నా భర్త నా బిడ్డలను సాకి పెంచి పెద్ద చేయగలడు. అది నాకు ఆనందం..’’ అంది.
‘‘తథాస్తు!...’’ దీవించి మునివరులు వెళ్ళిపోయారు.
నాగదేవుని వ్రతాన్ని అతిశ్రద్ధా భక్తులతో నిర్వహించింది భూలక్ష్మీదేవి.
పక్షం రోజుల తర్వాత మద్ది వనానికి వెళ్ళి అక్కడ ఉన్న పెద్ద పుట్ట పక్కన ఉన్న మామిడి ఫలవృక్షాన్ని చూచి, పరమానందంతో ఒక్క ఫలమునకు బదులుగా మునివరుల మాటను మరచి ఏడు ఫలాలను కోసింది.
పుట్టలోని నాగేంద్రుడు క్రోధంతో బయటికి వచ్చి మానవరూపం దాల్చి, ‘‘ఒక్క ఫలానికి బదులుగా ఏడు ఫలాలను కోశావు. నిన్ను నేను ఇప్పుడే సంహరిస్తాను..’’ అని ఆవేశంగా పలికాడు నాగరాజు.
రాణి భూలక్ష్మీదేవి తన తప్పును ఒప్పుకొని నాగరాజుని ప్రార్థించింది. ఆమె సత్వగుణాన్ని గ్రహించిన నాగరాజు... ‘‘నీకు సంతతి కలిగిన తర్వాత, ఆరు నెలల తదుపరి నేను నిన్ను చంపుతాను’’ అని చెప్పి అంతర్ధానమయ్యాడు.
భవంతికి వచ్చి రాణి ఏడు ఫలాలను ఆరగించింది.
మహారాణి పది మాసముల తర్వాత ఏడుగురు ఆడపిల్లలను ఒకేసారి ప్రసవించింది. ఆ పాపలకు ఆ దంపతులు నాగేంద్రుని నామం కలిసివచ్చేలా నామకరణాలు చేశారు. ఏడవ సంతానానికి బాలనాగమ్మ అని పేరు పెట్టారు.
తన అవసాన కాలం ఆసన్నం కాబోయే ముందు భూలక్ష్మీదేవి, నాగరాజు మూలంగా తనకు త్వరలో సంభవించనున్న మృత్యువును గురించి విచారంతో భర్తకు తెలియజేసింది. రాజు ఒంటి స్తంభం మేడను నిర్మించి అందులో రాణిని ఉంచాడు. దేశంలోని గొప్ప గొప్ప మాంత్రికులను, సైన్యాన్ని, వైద్యులను ఆ మేడ చుట్టూ కాపలా ఉంచాడు.
ఆ రోజు రానే వచ్చింది. మేడ చుట్టూ పొగమంచు క్రమ్ముకుంది. భవంతి ద్వారాల సందు నుండి పొగ రూపంలో నాగేంద్రుడు లోనికి ప్రవేశించి, మానవరూపంలో మహారాణి ముందు నిలిచాడు. ‘‘నీ మృత్యు సమయం ఆసన్నమైనది రాణీ, నేను నిన్ను కాటువేసి చంపబోతున్నాను!...’’ అన్నాడు.
ఆమె ‘‘సరే స్వామీ!...’’ అన్నది విచార వదనంతో!...
ఆమె సౌశీల్యానికి సంతోషించిన నాగరాజు... ‘‘నీవు మరణించినా అదృశ్యరూపంలో నీ పిల్లలకు అండగా ఉండగలవు...’’ అనే వరాన్ని ప్రసాదించి భూలక్ష్మీదేవిని కాటువేశాడు.
ఆమె మరణించింది. తల్లి లేని పిల్లలను నవభోజరాజు ప్రాణసమానంగా భావించి పది సంవత్సరాలు పెంచాడు.
రాజు అంతరంగికులు, ఇల్లాలు లేని రాజును మరో వివాహం చేసుకోవలసినదిగా పలుమార్లు చెప్పారు. కానీ రాజు అంగీకరించలేదు. చివరకు వారు ఏడుగురు రాకుమార్తెలతో, ‘‘దేశ ప్రజలు, మేము మీ తండ్రిగారిని మరో వివాహం చేసుకోవలసినదిగా కోరాము. కానీ వారు మా మాటలను పాటించలేదు... రాజ్యం కోసం, దేశ ప్రజల ఆనందం కోసం మీరు మీ తండ్రిగారిని మరో వివాహం చేసుకోవడానికి ఒప్పించవలయును’’ అని కోరారు.
పుత్రికల కోరికపై నవభోజరాజు మాణిక్యాలదేవిని వివాహం చేసుకున్నారు.
మాణిక్యాలదేవి భర్త సమక్షంలో ఏడుగురు ఆడపిల్లలపై ఎంతో అభిమానాన్ని ప్రదర్శించేది. ఆయన ఊరిలో లేని సమయంలో చిత్రహింసలు పెట్టేది.
భర్త తనకు సర్వదా అనుకూలంగా, విధేయుడుగా ఉండాలని దాసీ సాయంతో మత్తు మందును తెప్పించి, దాన్ని భోజనంలో కలిపి రాజు తినేట్టు చేసింది. ఆ మందు మహిమతో రాజు ఆమె చెప్పినట్లుగా నడుచుకునేవాడు. తన పిల్లలను విస్మరించాడు.
చారుల మూలంగా ఆ పిల్లల మేనమామ, మాణిక్యాలదేవి తన అక్క పిల్లలను ఏ విధంగా హింసిస్తూ ఉందో తెలుసుకున్నాడు. భూచక్రపురానికి వచ్చి ఆ ఏడుగురు ఆడపిల్లలను తనతో తన రాజ్యమైన పానుగంటిపురానికి తీసుకువెళ్ళాడు మేనమామ రామవర్ధనరాజు.
యుక్త వయస్కులైన పిమ్మట ఆ ఏడుగురు ఆడపిల్లలకు తన ఏడుగురు మొగపిల్లలతో వివాహాన్ని జరిపించాడు రామవర్ధనరాజు. బాలనాగమ్మ భర్త పేరు కార్యవర్ధనరాజు. ఏడుగురు అక్కచెల్లెళ్ళు వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడపసాగారు. బాలనాగమ్మ గర్భవతియై నవమాసాలు నిండిన తర్వాత మగశిశువుకు జన్మనిచ్చింది. నాగళ్ళపూడి అనే ప్రాంతంలో గొప్ప మంత్రతంత్రవేత్త, పేరు మాయల ఫకీరు. అతనికి గొప్ప కోటలు, భవనాలు, పరివారం ఉన్నాయి. అతని ప్రియురాలు సంగు గొప్ప అందగత్తె.
ఇరువురి మధ్యన ఒకనాడు ‘అందం’ విషయంలో తర్కం జరిగింది.
‘‘నన్ను మించిన అందగత్తె ఈ భూప్రపంచంలో లేదు...’’ అని ఎంతో గర్వంగా పలికింది సంగు.
మాయల ఫకీరుకు సంగు పలికిన మాటల వలన ఆవేశం కలిగింది. సంగు గర్వాన్ని అణచాలనుకున్నాడు. తన మంత్రశక్తితో కాపాలికను ఆహ్వానించాడు. ప్రపంచంలో గొప్ప అందగత్తె ఎవరో చూపించమన్నాడు. కాపాలిక దర్పణంలో (అద్దంలో) బాలనాగమ్మ రూపాన్ని చూపించింది.
మాయల ఫకీరు బాలనాగమ్మ అందచందాలను చూచి ముగ్ధుడై, జంగందేవర వేషంలో పానుగంటిపురానికి వెళ్ళి, ఎదురుపడ్డ వారిని తన మంత్రశక్తితో సమ్మోహితులను చేసి బాలనాగమ్మ మందిరాన్ని చేరాడు. ‘‘భవతి భిక్షాం దేహి’’ అని బిగ్గరగా పలికాడు.
బాలనాగమ్మ పరిచారిక చేత భిక్షను పంపింది.
‘‘పరిచారిక చేతి భిక్షాన్ని మేము స్వీకరించము. ఇల్లాలు భిక్షతో రావలెను!...’’ అన్నాడు ఫకీరు.
విషయాన్ని విన్న బాలనాగమ్మ వెండి తట్టతో భిక్షను తీసుకొని ఫకీరును సమీపించింది.
ఫకీరు ఆమెను కుక్కపిల్లగా మార్చి తనతో నాగళ్ళపూడికి తీసుకువచ్చి, సంగు సమక్షాన కుక్కపిల్లను బాలనాగమ్మగా మార్చాడు. సంగు బాలనాగమ్మ రూపాన్ని చూచి ఆశ్చర్యపోయింది. అవమానంతో తల దించుకొని పక్కకు వెళ్ళిపోయింది.
‘‘బాలనాగమ్మా!.... నేను నిన్ను వరించాను. వివాహం చేసుకుంటాను, నా ప్రాణసమానంగా నిన్ను చూసుకుంటాను. నా మాట విను...’’
ప్రాధేయపూర్వకంగా చెప్పాడు మాయల ఫకీరు.
అతన్ని ఎదిరించి ప్రయోజనం లేదని గ్రహించిన బాలనాగమ్మ... ‘‘పద్నాలుగు సంవత్సరాలు నేను ఒక వ్రతాన్ని ఆచరించాలి. అది నా భర్తకు రక్షణ. ప్రారంభించి కొద్ది రోజులే అయినది. వ్రతం పూర్తయిన తర్వాత మీ ఇష్టమే నా ఇష్టము!...’’ అని చిరునవ్వుతో చెప్పింది బాలనాగమ్మ.
నాగమ్మను సుందర మందిరంలో ఉంచి పరిచారికలను నియమించాడు ఫకీరు.
బాలనాగమ్మను ఫకీరు సునకంగా మార్చి తీసుకువెళ్ళిన సమయంలో కార్యవర్ధనరాజు, అతని ఆరుగురు సోదరులు, తండ్రి గండికోట పొరుగురాజుపై యుద్ధానికి వెళ్ళారు. విజయులై తిరిగి వచ్చిన వారు రాణుల మూలంగా మాయల ఫకీరు బాలనాగమ్మను తీసుకువెళ్ళిన విషయాన్ని విని, నాగళ్ళపూడికి వెళ్ళి ఫకీరుతో యుద్ధం చేసి బాలనాగమ్మను విడిపించుకోవడానికి బయలుదేరారు.
మాయల ఫకీరు తన మంత్రబలంతో వారినందరినీ శిలలుగా మార్చాడు. బాలనాగమ్మ కుమారుడు బాలవర్ధనరాజు పదునైదేళ్ళ ప్రాయానికే అరవై నాలుగు కళలు అభ్యసించాడు. పెదతల్లులు చెప్పగా తన తల్లిదండ్రులు నాగళ్ళపూడిలో ఫకీరుకు బందీలైన విషయాన్ని తెలుసుకున్నాడు. తల్లుల ఆశీర్వాదంతో తన గుర్రముపై బయలుదేరాడు బాలవర్ధనరాజు.
మార్గంలో శార్దూలపురాన పూటకూళ్ళ అవ్వ మూలంగా ఆ ఊరి చెరువుల ప్రాంతంలో తిరుగుతున్న పులిని గురించి, పౌరుల భయాన్ని గురించి తెలుసుకున్నాడు. చెట్ల చాటున చేరి పులి రాకను గమనించి, ఆ పులిని చంపాడు. రాజభటులతో కలసి ఆ రాజును కలిశాడు. వారు పరమానందంతో... ‘‘మీరు మహావీరులు, మా ప్రాంతపు సమస్యయైన పులిని చంపి తొలగించారు. మీరు మా కుమార్తె సుభద్రాదేవిని వివాహం చేసుకోవలసినది...’’ అని కోరారు.
బాలవర్ధనరాజు... ‘‘నేను ఒక గొప్ప కార్యార్థినై నాగళ్ళపూడికి వెళుతున్నాను. తిరిగి వచ్చి మీ అభిమతాన్ని నెరవేరుస్తాను..’’ అని చెప్పి అక్కడి నుండి ముందుకు బయలుదేరాడు.
చిలకరాజపురం చేరాడు. దారిలో చిట్టడవిలో ఒక పులి, నక్క, ఎలుగుబంటి మాటలను విన్నాడు. సారాంశం ఏమిటంటే — ఆ రాజకుమార్తె ఆనందవల్లి రాచపుండ్లతో బాధపడుతున్నట్లు, ఎందరు వైద్యులు చికిత్స చేసినా ప్రయోజనం లేనట్లు తెలుసుకున్నాడు. ఎలుగుబంటికి, వాటికి ఎదురుగా ఉన్న ఒక చెట్టు బెరడును పక్కనే ఉన్న మరో చెట్టు ఆకు పసరుతో కలిపి రాస్తే ఆ రాచపుండు మాయమైపోతుందని పులికి నక్క చెప్పింది.
బాలవర్ధనరాజు పక్షులు, జంతువుల భాషలను అర్థం చేసుకోగలడు. బాలవర్ధనరాజు ఆ రెండు మూలికలతో ఆ రాజకుమారి ఆనందవల్లి పుండును రూపురేఖలు లేకుండా చేసి ఆ యువరాణికి స్వస్థత కలిగించాలనుకున్నాడు.
ఆ మూలికలను సేకరించి రాజు దర్బారుకు వెళ్ళి... ‘‘యువరాణిగారి సమస్యను నేను తీరుస్తాను...’’ అన్నాడు.
రాజుకు, ఆ మాట విన్న వారందరికీ పరమానందం. రాజు బాలవర్ధనరాజును అంతఃపురంలోకి తీసుకువెళ్ళి శయ్యపై నిర్జీవంగా పడి ఉన్న యువరాణిని చూపించాడు.
బాలవర్ధనరాజు ఆ చెక్కపొడిని, ఆకు పసరును కలిపి పుండుపై రాసి కట్టు కట్టాడు. ‘‘రేపు వచ్చి చూస్తాను...’’ అని చెప్పి వెళ్ళిపోయాడు.
మరుదినం మాట ప్రకారం వెళ్ళి మెల్లగా తాను కట్టిన కట్టును విప్పదీశాడు. రాచపుండు మాయమైపోయింది. యువరాణి లేచి నిలబడి చిరునవ్వుతో నమస్కరించింది. రాజూ రాణీ పరమానంద భరితులయ్యారు.
‘‘యువరాజా!... మీ ప్రతిభ అసాధారణం. మీరు మా కుమార్తెను వివాహమాడి మాతో ఉండిపోండి...’’ అని అర్థించారు ఆ రాజు దంపతులు.
బాలవర్ధనరాజు తనకు ముఖ్యమైన పని ఉన్నదని, నాగళ్ళపూడికి వెళ్ళాలని, తిరిగి వచ్చి మీ అభిమానాన్ని చూరగొంటానని చెప్పి, ఆ పెద్దలకు నమస్కరించి అక్కడి నుండి నాగళ్ళపూడి వైపుకు బయలుదేరాడు.
నాగళ్ళపూడిలో వీధిలో తంబళ్ళ పెద్దమ్మ అనే పూల వ్యాపారిని కలిశాడు.
‘‘కొద్దిరోజులు నేను నీతో ఉండవచ్చా అవ్వా!...’’ అని అడిగాడు.
ఎవరూలేని ఆ తంబళ్ళ పెద్దమ్మ ఆనందంగా సమ్మతించింది. బాలవర్ధనరాజు ఆమె వెంట వెళ్ళాడు.
ఊరి విషయాలు అడిగాడు. మాయల ఫకీరు దుర్మార్గాలను గురించి పెద్దమ్మ బాలవర్ధనరాజుకు చెప్పింది. ఆ రాత్రి మాట్లాడుతూ అవ్వకు పూలు కట్టడంలో సాయం చేశాడు బాలవర్ధనరాజు.
మరుదినం పెద్దమ్మ పూల మాలలతో ఫకీరు భవంతికి వెళ్ళింది. ఆ మాలలను చూసిన మాయల ఫకీరు ఆశ్చర్యపోయాడు.
‘‘పెద్దీ!... ఈ రోజు పూల మాలలు నిన్నటిలా లేవు, ఎవరు కట్టారు?..’’ అడిగాడు ఫకీరు.
‘‘నా మనవడు సామి వీరయ్య, నిన్న పొద్దువేళ వచ్చిండు!...’’
‘‘హో!... శభాష్!... నీ మనవణ్ణి నేను చూడాలి. రేపు తీసుకురా!...’’
‘‘అలాగే సామీ!...’’ చెప్పింది తంబళ్ళ పెద్దమ్మ.
మరుదినం తనతో బాలవర్ధనరాజును ఫకీరు నిలయానికి తీసుకెళ్ళింది.
బాలవర్ధనరాజు మాయల ఫకీరును చూచి చిరునవ్వుతో అతనికి నమస్కరించాడు. ఫకీరుకు అతనిపై ప్రీతి కలిగింది. బాలవర్ధనరాజు కట్టిన పూలమాలలను గురించి ప్రశంసించాడు.
‘‘ఇవే కాదు సామీ!... ఇంకా ఎన్నో రకాలుగా మనుషుల మనస్సును మార్చగలిగే రీతిగా కూడా పూలదండలు కట్టగలను..’’ అన్నాడు బాలవర్ధనరాజు.
ఫకీరు బాలనాగమ్మ గురించి చెప్పి... ‘‘ఆమె మనస్సు నాపై మరలేటట్టు పూలదండలు కట్టగలవా!...’’ అని అడిగాడు.
‘‘ఓ!... తప్పకుండా!... కానీ ఈ రోజు తలలో పెట్టుకొని రేపు తల నుండి తీసిన వాడిన పూల దండలు నాకు చేరేలా చేయాలి. దాన్ని నేను మంత్రోచ్ఛారణతో గంగలో కలపాలి. అప్పుడు తమరి కోరిక సిద్ధిస్తుంది. అంతేకాదు, ఆ వ్యక్తిని నేను ఒక్కడినే చూడాలి, నాలుగు మాటలు మాట్లాడాలి...’’ అన్నాడు బాలవర్ధనరాజు.
‘‘సరే...’’ అని చెప్పి బాలవర్ధనరాజును బాలనాగమ్మ మందిరానికి పంపాడు మాయల ఫకీరు.
బాలవర్ధనరాజు బాలనాగమ్మను చూచి, తన మెడలోని హారాన్ని ఆనవాలుగా చూపి... ‘‘అమ్మా!... నేను నీ కొడుకును...’’ అన్నాడు.
బాలనాగమ్మ బాలవర్ధనరాజును ఆనందంగా దగ్గరకు తీసుకుంది. తాను ఫకీరుకు చెప్పిన ప్రతి విషయాన్ని బాలవర్ధనరాజుకు తెలియజేసింది. బాలవర్ధనరాజు వాడిన పూల విషయాన్ని తల్లికి చెప్పి... ‘‘అమ్మా!... ఫకీరు ప్రాణ రహస్యాన్ని ప్రీతిగా నటించి తెలుసుకొని, కాగితంపై రాసి ఆ వాడిన పూల దండలో ఉంచి నాకు చేర్చు. ఆపై నేను చేయవలసింది చేసి ఫకీరును చంపి నిన్ను ఈ చెర నుండి విడిపిస్తాను...’’ అని చెప్పి వెళ్ళిపోతాడు.
ఫకీరు బాలనాగమ్మ మందిరానికి వచ్చి, ఆమె యందు తనకున్న ప్రేమని ఒలకబోశాడు. తొలుత ప్రీతిగా నటించిన బాలనాగమ్మ, చివరన బోరున ఏడ్చింది. ఫకీరు ఆశ్చర్యంతో కారణాన్ని అడుగుతాడు.
‘‘మీలాంటి గొప్ప మాంత్రికులకు శత్రువులు ఎందరో!... వారు ఎవరైనా మిమ్మల్ని చంపినచో నేను ఎలా బతకగలను..’’ అని ఎంతో ఆవేదనతో చెప్పింది బాలనాగమ్మ.
ఫకీరు వికటంగా నవ్వి... ‘‘అదా నీ భయము?... నా ప్రాణాలు ఎక్కడ ఉన్నదీ చెబుతాను విను. భయానక మృగాలు సంచరించే దట్టమైన అడవి, తర్వాత సప్త సముద్రములు, ఆవల కీకారణ్యం, అందు మధ్యన ఒక పెద్ద మర్రిచెట్టు, ఆ చెట్టులో ఒక బిల మార్గం ఒక కోసు దూరం (మూడు మైళ్ళు), తదుపరి కంచుభూమి, ఆ భూమి మధ్యన సుందర వెండి మహల్. ఆ మహల్ మధ్యమున బంగారు పంజరం, అందు పంచవన్నెల రామచిలక.
బాలా!... నా ప్రాణములు ఆ చిలుకలో ఉన్నాయి. మానవమాత్రుడెవ్వడూ అక్కడికి పోలేడు. నీవు నిర్భయముగా ఉండుము. నీ గడువు తీరుటకు ఏడు రోజులు మాత్రమే మిగిలివున్నవి. ఎనిమిదవ రోజు మన వివాహము. అన్ని ఏర్పాట్లు ఎంతో ఘనంగా జరిపిస్తున్నాను బాలా!...’’ అని ఆనందపరవశంతో నవ్వాడు మాయల ఫకీరు.
బాలనాగమ్మ తన కన్నీటిని తుడుచుకొని నవ్వుతూ నటనను ప్రదర్శించింది. సంతోషంగా బాలవర్ధనరాజు కట్టిన పూలమాలలను తలలో పెట్టుకుంది.
మరుదినం వాడిన పూలను తల నుండి తీసి ఫకీరు ప్రాణ రహస్యాన్ని లేఖగా రాసి, ఆ వాడిన పూల మధ్య ఉంచి పెద్దమ్మ ద్వారా బాలవర్ధనరాజుకు అందజేసింది.
బాలవర్ధనరాజు తన తల్లి లేఖను చదివి తంబళ్ళ పెద్దమ్మకు చెప్పి, ఆమె ఆశీర్వాదాలతో ఫకీరు ప్రాణాలున్న పంచవన్నెల రామచిలక కోసం బయలుదేరాడు తన శ్వేతాశ్వంపై. తమ ఇలవేల్పు నాగేంద్రుని స్మరిస్తూ భయానక మృగాల అడవిని దాటి సప్త సముద్రముల (1. లవణ సముద్రము, 2. చెరకురస సముద్రము, 3. కల్లు సముద్రము, 4. నెయ్యి సముద్రము, 5. పాల సముద్రము, 6. పెరుగు సముద్రము, 7. మంచినీటి సముద్రము) ప్రాంతానికి చేరాడు బాలవర్ధనరాజు.
మొదటి సముద్రమైన లవణ (ఉప్పు) నీటి సముద్రము మొదలు ఏడవ సముద్రము వరకు ఎలా దాటవలెననే ఆలోచనతో గుర్రం దిగి, ఎదురుగా ఉన్న మర్రిచెట్టు, గండబేరుండ పక్షుల గూళ్ళు, ఆ గూళ్ళలోని పక్షుల పిల్లలను, ఆ పిల్లలను మింగేందుకు పెద్ద నాగసర్పము చెట్టుపైకి ప్రాకడాన్ని చూశాడు. పక్షుల పిల్లలను రక్షించేందుకు తన ఖడ్గంతో ఆ పామును నరికి చంపేశాడు.
ఆ దృశ్యాన్ని చూసిన గండబేరుండ పక్షి జంట బాలవర్ధనరాజును సమీపించాయి.
‘‘మీరెవరో మహానీయులు. మా పిల్లలను, మమ్మల్ని ఆ కాలనాగు బారి నుండి కాపాడారు. మీ రుణాన్ని మేము ఎలా తీర్చుకోగలము?’’ అని మగ పక్షి అడిగింది.
తాను సప్త సముద్రాలను దాటి ఆవలికి చేరవలెనని బాలవర్ధనరాజు చెప్పాడు.
ఆ పక్షిరాజు... ‘‘రాకుమారా!... మేము దేవతా పక్షులము. శాపంచేత ఇక్కడ ఇలా ఉన్నాము. మేము మా అవసర నిమిత్తం కాయాన్ని (దేహం) పెంచగలము. మీరు మా వీపున ఆసీనులు కండు. నేను మిమ్మల్ని సప్త సముద్రములను దాటించి ఆవలివైపుకు చేర్చగలను...’’ అని చెప్పి తన శరీరాన్ని పెంచింది. బాలవర్ధనరాజు గుర్రాన్ని అక్కడ వదిలి పక్షి వీపున కూర్చున్నాడు. ఆ పక్షి సప్త సముద్రములను దాటి ఒడ్డున కిందకు వాలింది. ఎదురుగా పెద్ద ఊడల మర్రి బాలవర్ధనరాజుకు గోచరించింది.
‘‘నేను వెళ్ళి వస్తాను పక్షిరాజమా!...’’ అన్నాడు.
‘‘మీరు తిరిగి వచ్చేవరకు నేను ఇక్కడనే ఉండెదను రాకుమారా!... వెళ్ళి విజయులై తిరిగిరండి...’’ అన్నాడు ఆ పక్షిరాజు.
బాలవర్ధనరాజు ఆ ఊడల మర్రిని సమీపించి, బిల (రంధ్రం) మార్గంలో ప్రవేశించి ఒక కోసు దూరం నడిచి కంచుభూమిని సమీపించాడు. ఎదురుగా ఉన్న వెండి మహల్ చూశాడు.
వెండి మహల్ చుట్టూ కాలనాగులు (పాములు) బుసలు కొడుతూ ఉన్నాయి. బాలవర్ధనరాజు తన ఇలవేల్పు నాగరాజును భక్తితో స్మరించాడు. పెద్ద నాగము ఒకటి ఆ కంచువేదికపై వెలసి, అక్కడున్న పాములన్నింటినీ ద్వారానికి ఇరువైపులా రక్షకభటుల రీతిగా నిలిచేలా చేసింది. వెండి మహల్ ద్వారాలు తెరుచుకున్నాయి.
బాలవర్ధనరాజు ఆనందంగా మహల్లోకి ప్రవేశించి, మధ్యన వేలాడుతున్న బంగారు పంజరాన్ని, అందులోని పంచవన్నెల రామచిలకను చూశాడు. కరవాలంతో గొలుసును ఖండించి పంజరాన్ని చేతికి తీసుకున్నాడు. ఆనందంగా మహల్ నుండి బయటికి వచ్చి మర్రిచెట్టు బిలమార్గం గుండా సాగి గండబేరుండ పక్షిని సమీపించాడు. పక్షి వీపున కూర్చున్నాడు.
ఆ పక్షి సప్త సముద్రాలు దాటి తాను తనవారు ఉన్న మర్రిచెట్టు కింద వాలింది. బాలవర్ధనరాజు ఆ పక్షిరాజుకు ధన్యవాదాలు చెప్పి, తన అశ్వాన్ని పిలిచి అధిరోహించి, తిరుగు ప్రయాణం సాగించాడు. మాయల ఫకీరు భవంతిలోనికి వెళ్ళి, తన తల్లి ఉన్న మందిరంలో ప్రవేశించాడు. ఫకీరు పంజరంతో బాలనాగమ్మ మందిరంలో ప్రవేశించిన బాలవర్ధనరాజును చూశాడు. పరుగున బాలనాగమ్మ మందిరానికి వచ్చి పంజరాన్ని చిలకతో సహా తనకు ఇమ్మని ఆవేశంతో అడిగాడు మాయల ఫకీరు.
‘‘అరే!... మూర్ఖుడా!... ఈమె నా తల్లిరా!... నా అమ్మను చెరపట్టిన నీకు, నేను ఎంతో కష్టపడి సాధించిన పంజరాన్ని చిలకను నీకు ఎలా ఇస్తాననుకున్నావురా!...’’ అని ఆవేశంగా చెప్పి చిలక ఒక కాలిని విరిచాడు బాలవర్ధనరాజు…
మాయల ఫకీరు కాలు విరిగిపోయింది.
‘‘అరే వీరయ్యా!... ఆ చిలకను నాకివ్వరా!... నీవు ఏది కోరితే అది నీకు నేను ఇస్తానురా!...’’ అని దీనంగా కోరాడు మాయల ఫకీరు.
‘‘నా తండ్రి, పెదతండ్రులను, తాతగారిని, నీ భవంతి ముందు శిలలుగా ఉన్న వారందరికీ నిజరూపాలను కల్పించు!...’’ అని శాసించాడు బాలవర్ధనరాజు.
ఫకీరు తన చేతిలోని మంత్రదండాన్ని బాలవర్ధనరాజు చేతికి ఇచ్చి... ‘‘దీన్ని వారందరికీ తాకించు, మామూలు రూపులు అవుతారు. నీ తల్లిని నీతో తీసుకుని వెళ్ళు. ఆ చిలకను నాకు ఇవ్వరా వీరా!...’’ అని బ్రతిమిలాడాడు ఫకీరు.
అతని మాటలను లెక్క చేయకుండా బాలవర్ధనరాజు వేగంగా మంత్రదండంతో శిలలుగా ఉన్న తనవారి వద్దకు వచ్చి, తన కులదైవాన్ని స్మరిస్తూ దండాన్ని అందరికీ తాకించాడు.
అందరూ మామూలు స్వరూపాలను పొందారు.
తన పోలికలతో వున్న బాలవర్ధి రాజును చూచిన కార్యవర్ధిరాజు...
‘‘నీవు... నీవు!...’’ అని ఆశ్చర్యానందాలతో అన్నాడు కార్యవర్ధనరాజు.
‘‘నాన్నా!... నేను మీ కొడుకును, బాలవర్ధనరాజును!...’’ అని నవ్వుతూ చెప్పాడు బాలవర్ధనరాజు.
అందరూ బాలవర్ధనరాజును కౌగిలించుకున్నారు. బాలనాగమ్మ ఉన్న భవంతికి చేరారు.
అందరినీ చూచి ఫకీరు బాధతో చిలకను ఇవ్వమని బాలవర్ధనరాజును కన్నీటితో దీనంగా అర్థించాడు.
బాలవర్ధనరాజు చిలక మరో కాలిని కూడా విరిచాడు. ఫకీరు బాధతో ఏడుస్తూ కుప్పలా నేలకూలాడు.
‘‘బాలకా!... బాలకా!... నేను బాధలను భరించలేకున్నాను. ఆ చిలక మెడ విరిచి నన్ను చంపేయి బాలా!... బాలా!...’’ అని బోరున ఏడ్చాడు ఫకీరు.
బాలవర్ధనరాజు చిలక మెడను విరిచాడు. మాయల ఫకీరు మరణించాడు.
కార్యవర్ధనరాజు, బాలనాగమ్మలు ఆనందంగా కౌగిలించుకున్నారు. అయినవారందరూ వారిని చూసి ఆనందించారు.
రెండు రాజ్యాల రాకుమార్తెలు వారి తల్లిదండ్రులతో, తనవారందరితో కలసి బాలవర్ధనరాజు భూచక్రపురం చేరాడు. ఇరువురు రాకుమార్తెలతో వివాహం, రాజ్యపట్టాభిషేకం ఘనంగా జరిగాయి.
ఈ కథలోని అన్ని పాత్రలలోనూ వీధిభాగోతం బృందం అద్భుతంగా నటించి, ప్రేక్షకులకు కన్నీటిని, ఆనందాన్ని కలిగించారు. తాతయ్యగారు మరుదినం వారినందరినీ మా ఇంటికి ఆహ్వానించి భోజనాలు పెట్టి, వస్త్రాలు సమర్పించి, కొంత ద్రవ్యాన్ని ఇచ్చి వారందరినీ సత్కరించారు.
‘మాతా పితా గురువు దైవం... సత్యం, ధర్మం, న్యాయం, నీతి, నిజాయితీ, ప్రేమ, అభిమానం, ఆదరణ’ అనునవి సనాతన ఆర్ష/హైందవ సిద్ధాంతాలు. తాతగారు పై ధర్మాలను తూచా తప్పకుండా పాటించేవారు. ఆ లక్షణాలు నాన్నగారికి, బాబాయికి, అత్తయ్యకు, అమ్మకు, నానమ్మలకు, కొంతవరకు నాకు సంక్రమించాయి.
ప్రతి సంవత్సరం వేసవిలో తాతయ్య నాటకాలు వేయించడమే కాకుండా, వీధిభాగోతాల తర్వాత వచ్చిన నాటకాలు ప్రజలను ఎంతగానో ఆకర్షించాయి. ఆ నాటకాలలో తారాశశాంకం, బాలనాగమ్మ, రాయబారం, తులాభారం, సతీసావిత్రి, చింతామణి, రంగూన్ రౌడీ, రక్తకన్నీరు కొన్ని ముఖ్యమైనవి.
పై నాటకాలను ప్రముఖులు — పీసుపాటి, అద్దంకి, ఏ.వి. సుబ్బారావు, వేమూరి గగ్గయ్యగారు, రఘురామయ్యగారు (ఈలపాట), షణ్ముఖ ఆంజనేయులుగారు, నాగభూషణంగారు, ధూళిపాళ (సినీనటులు), రెబాల రమణ (చింతామణి సంగు ఫేం), ఇంకా ఎందరో కళాకారులు ప్రదర్శించేవారు. తాతయ్య, గోవర్ధనరావు కలసి జిల్లా, తాలూకా నగరాల్లో ఆ నాటకాలను చూసి ఎంతో ఆనందంగా తిరిగి వచ్చేవారు. ఆయా నటుల గాత్రాన్ని గురించి, నటనను గురించి మాకు చెప్పేవారు తాతయ్యగారు.
యాచకులుగా బుడబుక్కలవారు, గంగిరెద్దులవారు, ఎలుగుబంటు సాహెబులు వచ్చేవారు. అలా వచ్చేవారందరికీ తాతయ్య చిరపరిచితులు. వారంతా తాతయ్యను ఎంతగానో పొగిడేవారు. తాతయ్య వారికి ధనధాన్యాదులను ఇచ్చి సంతోషపరిచేవారు.
‘‘శ్రీ వీరరాఘవయ్యగారి సంస్థానంలో పిల్లపాపలు, ఆడమగ, గొడ్డుగోదలన్నీ సలక్షణంగా ఉండాలి’’ అని వారి వారి పరిభాషలో వారు దీవించేవారు. స్వచ్ఛమైన మనస్తత్వాలతో, ధనికులు పేదలు అనే భేదభావం లేకుండా సాగిన రోజులవి. ఆ మనుషులకు కల్లాకపటం లేదు, యథార్థవాదులు.
కూడు గుడ్డకు వారు పేదవారైనా మంచి మనసున్న ఉన్నత మానవులు. ఏ కులం వారైనా మరో కులం వారిని అన్నా, మామా, బావా, బాబాయి అనే వరసలతో ప్రీతిగా పలకరించే రోజులవి. ఒకరిని ఒకరు పేరుతో పిలవని కాలమది. మంచి మానవత్వం కళ్ళకు గోచరించే రోజులవి. కానీ కాలక్రమేణా పాశ్చాత్య నాగరికత, నూతన విజ్ఞాన సాధనాలు మనుషుల్లో మార్పును కలిగించసాగాయి.
============================================================
తోలు బొమ్మలు - పార్ట్ 10 త్వరలో మీ ముందుకు వస్తుంది.
============================================================
📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!
మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్లో పొందవచ్చు.
✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి
👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.










Comments