తోలు బొమ్మలు - పార్ట్ 4

Tholu Bommalu - Part 4 - Telugu Serial | Ch. C. S. Sarma
తోలు బొమ్మలు - పార్ట్ 4 - తెలుగు ధారావాహిక | సిహెచ్. సీఎస్. శర్మ
Published In manatelugukathalu.com On 24/09/2026
జరిగిన కథ: సాక్ష్యాధారాలను బట్టి చంద్రశేఖర్ కు ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధింపబడుతుంది. జైలు జీవితం ప్రారంభించిన చంద్రశేఖర్ తన జీవితంలో జరిగిన సంఘటనలను రాసుకోవాలనే ఉద్దేశంతో జైలర్ రఘునందన్‌ను కాగితాలు, పెన్నులు కోరతాడు.
తోలు బొమ్మలు పార్ట్ 4 – చంద్రశేఖర్ రాసిన తాతల కాలం కథ
జైల్లో ఉన్న చంద్రశేఖర్ తన సెల్‌లో నుంచి బయటకు వచ్చి... విజిటర్స్‌ను చూచే పక్క గదిలో ప్రవేశించాడు. ఎదుటి గోడకు ఉన్న గోడ గడియారాన్ని చూశాడు. సమయం రాత్రి తొమ్మిదిన్నర. పరిసరాలు పరమ ప్రశాంతంగా ఉన్నాయి.
డ్యూటీలో ఉన్న పోలీసులు ఇరువురూ కుర్చీలలో కూర్చొని ఉన్నారు. చంద్ర గడియారాన్ని, పోలీసులను చూసి కూర్చొని, చేతిలో ఉన్న ప్యాడ్‌పైన ఉన్న తెల్ల కాగితాలను సరిచేసి, క్లిప్ ప్యాడ్‌పైన కింద ఉంచి రాయడం ప్రారంభించాడు.
ఓం శ్రీ
తోలు బొమ్మలు (నవల)
తాతల కాలం:
నా తాతగారి పేరు వీరరాఘవయ్య, నానమ్మ (వారి భార్య) పేరు పార్వతి.
మాది ఒక చిన్న గ్రామం. మొత్తం రెండు వందల కుటుంబాలు ఉంటాయి. కులమత భేదాలు కలవారు.
కానీ అందరూ వారి వారి ధర్మాలను పాటిస్తూ, వారి వృత్తుల రీత్యా మనుగడను సాగిస్తూ, పరస్పర సఖ్యత, సోదర భావాలతో కలిసికట్టుగా జీవించేవారు. పిన్నలు పెద్దలను, తల్లిదండ్రులను ఎంతగానో గౌరవించేవారు. కులమతాలు వేరైనా పరస్పర సంబోధన (పలకరించే విధానం) అన్నా, బావా, మామా, చిన్నాన్నా అనే రీతిలో వ్యక్తుల మధ్యన సాగేది.
మా తాతగారికి ఇరువురు సంతానం. మొదట మా నాన్నగారు, వారి పేరు పద్మనాభయ్య. వారికి ఒక సోదరి, పేరు సుశీల (నా మేనత్త), ఒక తమ్ముడు సత్తయ్య (నా చిన్నాన్న).
మా తాతగారికి ఒక సోదరి, పేరు నిర్మలమ్మ. వారి భర్తగారు గోవర్ధనరావు. ఆ దంపతులకు ఒకే కొడుకు, పేరు ధనుంజయరావు.
అప్పటికి నా వయస్సు ఐదు సంవత్సరాలు. నాకు ఒక అక్క, పేరు కావ్య... ఆమె వయస్సు ఏడు సంవత్సరాలు. మా నానమ్మ, తాతయ్యలకు మేమిరువురమంటే పంచప్రాణాలు. ఆ వయస్సులో మా నానమ్మ అన్నంలో అన్నీ తన స్వహస్తాలతో కలిపి మాకు భాగవత, రామాయణ, భారత కథలను, బలి, శిబి, సత్యహరిశ్చంద్రుని కథలను చెబుతూ, శుక్లపక్షంలో (చంద్రుని ఎదుగుదల) ఇంటి ముంగిట వెన్నెట్లో మాకు తినిపించేది.
ఆ కారణంగా మా ఇరువురికి చిన్నతనం నుండి మన అద్వైత సనాతన హైందవ ధర్మాల పట్ల, మన సంప్రదాయాల పట్ల ఎంతో అవగాహన, గౌరవం, అభిమానం కలిగాయి. సత్యం, ధర్మం, నీతి, దానం, నిజాయితీల విషయంలో ఎంతో నమ్మకం, మా నిజ జీవితంలో వాటిని పాటించే మనస్తత్త్వమూ మాకు కలిగాయి.
నా అక్క నేను తనకంటే చిన్నవాడిని అయినందున నన్ను ఎంతగానో అభిమానించేది. అక్క కావ్యను నాకంటే రెండు సంవత్సరాల ముందు స్కూళ్లో చేర్చారు. తాను రెండవ తరగతిలో ప్రవేశించిన సంవత్సరంలో నాకు అక్షరాభ్యాసం చేశారు.
నేను బాగా చదివి గొప్పవాడిని కావాలని తాతయ్య, నానమ్మ, అమ్మా, నాన్నా, అక్క నన్ను దీవించారు. రెండవ తరగతి చివరి ఏప్రిల్ పరీక్షల సమయంలో అక్కయ్యకు టైఫాయిడ్ జ్వరం వచ్చింది. పరీక్షలు రాయలేదు. మరుసటి సంవత్సరం ఇరువురం రెండవ తరగతి చదివాము.
ప్రాథమిక పాఠశాలలో మా అక్క లీడర్. కారణం ఆమె చాలా బాగా చదివి ఉపాధ్యాయుల మన్ననలను, మంచి మార్కులను సాధించేది. అక్క నాకు ఆదర్శం. నేను కూడా ఆమె అడుగుజాడల్లో నడిచి, చదివి, పరీక్షలు రాసి క్లాస్ ఫస్ట్ విద్యార్థిగా పేరు తెచ్చుకున్నాను.
నానమ్మ, తాతయ్య, అమ్మ, నాన్నలు మా ఇరువురినీ పద్ధతిగా చదివించేవారు. కేవలం చదువులోనే కాదు, ఆటల పోటీలలో కూడా ప్రతిసారీ మేమిరువురం ప్రథమ శ్రేణిలో నిలిచేవారం. ఆ కారణంగా మా తోటి విద్యార్థులు, మాస్టర్లు మా ఇరువురినీ ఎంతగానో అభిమానించేవారు. అక్క కూడా నాకు చదువులో సాయంచేసేది.
మా బాబాయి నెల్లూరులో అగ్రికల్చర్ బి.ఎస్సి. చదువు ఫస్ట్ క్లాస్‌లో పాసైనారు. నెల్లూరు అగ్రికల్చర్ జిల్లా ఫారమ్‌లో ఉద్యోగి అయినారు.
మా అత్తయ్య చాలా తెలివైనది. అప్పటికి అత్తయ్య హైస్కూలు, కాలేజీలో బి.ఏ. ముగించింది. తాతయ్య, నానమ్మలు ఆమెను వివాహం చేయాలని నిర్ణయించుకున్నారు.
ఐదేళ్ల కిందట పడమటి ఉదయగిరి పల్లె ప్రాంతం నుండి సరాగాల సాంబయ్యగారు మా గ్రామానికి వచ్చారు. ఆ ప్రాంతంలో నీటిపారుదల వనరులు లేక, పంటలు పండక, కరువు కాటకాలతో జీవిత అవసరాలను తీర్చుకోలేని దీనస్థితిలో వారు మా గ్రామానికి వచ్చారు.
కలిగిరి రిజర్వాయర్ కింద మా తూర్పు గ్రామాలన్నీ సస్యశ్యామలంగా పంటలు పండి, జనులకు, పశువులకు జీవనోపాధికి ఎలాంటి కొరతా లేని నెల్లూరు ప్రాంతం మాది.
సాంబయ్యగారు మా తాత నాన్నల సహాయంతో మా గ్రామంలో కొంత భూమిని కొని, ఉండటానికి గృహనిర్మాణాన్ని చేసుకొని, వారు మా గ్రామవాసిగా మారిపోయారు. మా తాతగారు సదా మాతో చెప్పేవారు— ప్రతి వ్యక్తీ అరిషడ్వర్గాలను జయించాలి.
అరిషడ్వర్గాలు అనగా కామం (మితిమీరిన కోరికలు), క్రోధం (కోపం), లోభం (పిసినారితనం లేక స్వార్థం), మోహం (భ్రమ), మదం (అహంకారం), మాత్సర్యం (అసూయ, మత్సరము, పగ).
ఆ ఆరింటినీ అదుపులో ఉంచుకొని జీవిత గమనాన్ని సాగించాలి. అలాంటి వారిని సాటి జనులు, సభ్య సమాజం గౌరవిస్తుంది, అభిమానిస్తుంది, ఆదరిస్తుంది.
మా ప్రాంతానికి ఎత్తివచ్చిన సరాగాల సాంబయ్య, పై తత్త్వాలకు పూర్తి వ్యతిరేకి, స్వార్థపరుడు. కానీ... మా తాతయ్య వీరరాఘవయ్య, మా తండ్రి పద్మనాభయ్య అరిషడ్వర్గాలను జయించినవారు. వారికి అనువైన జీవిత భాగస్వాములే మా నానమ్మ పార్వతి, మా అమ్మ భవాని.
మా ఇంట్లో ఒక పనిమనిషి ఉండేది, పేరు చెంచమ్మ. ఆమె భర్త రాజయ్య గ్రామ కాపలాదారి. భార్యాభర్తలు చాలా మంచివారు.
మా నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆగ్నేయ భాగంలో ఉంది. ఈ జిల్లా చరిత్ర చాలా పురాతనమైనది. క్రీ.పూ. 3వ శతాబ్దంలో మౌర్య సామ్రాజ్యానికి చెందిన గొప్ప రాజు అశోక చక్రవర్తి ఈ జిల్లాను పాలించాడు.
చారిత్రాత్మకంగా ఈ జిల్లా మౌర్యుల, శాతవాహనుల, పల్లవుల, చోళుల, తెలుగు చోళులు, కాకతీయుల పరిపాలనలో ఉండేది. సుప్రసిద్ధ తెలుగు కవి తిక్కన సోమయాజిగారు నెల్లూరులో సంస్కృత మహాభారతం యొక్క 15 పర్వాలను తెలుగులోకి అనువదించారు.
నెల్లూరు జిల్లా 1953 అక్టోబరు 1వ తేదీ వరకు మద్రాసు ఉమ్మడి రాష్ట్రంలో భాగంగా ఉండేది. నెల్లూరు అసలు పేరు సింహపురి.
నెల్లూరుకు ఆ పేరు ఎలా సిద్ధించిందంటే, మనమసిద్ధి మహారాజు కాలంలో ఈ ప్రాంతం సస్యశ్యామలమై అత్యధిక వరిధాన్యపు ఉత్పత్తితో విలసిల్లింది. ‘వరి’ని తమిళ భాషలో ‘నెల్’ అంటారు. కావున ‘నెల్ ఊరు’ అనే పేరు వచ్చింది. అది కాలక్రమంలో ‘నెల్లూరు’గా రూపాంతరం చెందింది.
పల్లవ రాజుల చిహ్నం సింహం కనుక, రాజా విక్రమసింహుని కాలంలో సింహపురి రాజధానిగా ఉన్నందున ఆ ఊరికి ‘విక్రమసింహపురి’ అని కూడా అంటారు. ఆ రెండు పేర్లూ శాసనాల్లో ప్రాచీన కాలం నుంచీ వాడుకలో ఉన్నాయి.
ఇంకో కథనం ప్రకారం నెల్లూరు పట్టణమందు శ్రీమూలస్థానేశ్వర ఆలయాన్ని ఆంధ్ర రెడ్డి పాలకుడైన ముక్కంటి రెడ్డిరాజుగారు కట్టించారట. ఆ రాజుకు ఒకనాడు కలలో పరమశివుడు సమీపించి—‘రాజా!... నేను ఈ ప్రాంతమున ఉన్న ఉసిరిక చెట్టు మూలమున వెలసి ఉన్నాను. నేను ఇప్పుడు భక్తకోటిని రక్షించుటకు రాదలచాను. కనుక ఆ చోట నాకు ఒక ఆలయమును కట్టించు’ అని ఆజ్ఞాపించారట.
మరుసటి రోజు ఉదయమే ఆ రాజు ఉసిరి చెట్టు దగ్గరకు వెళ్లి పరిశీలించి చూడగా, అక్కడ లింగాకృతిలో వృక్షమూలమున పరమేశ్వరుడు కనబడారట. పరమానందంతో ఆ రాజు వెంటనే ఆలయాన్ని కట్టించి, అందులో ఆ శివలింగమును ప్రతిష్ఠింపచేసి భక్తిప్రపత్తులతో ఆరాధించారట.
ఉసిరి చెట్టును తమిళమున ‘నెల్లి’ అని అంటారు. కావున ఆ నెల్లి పేరు మీదగానే అక్కడ వెలసిన గ్రామం ‘నెల్లూరు’ అయింది.
మన భారత ప్రథమ ప్రధానమంత్రి శ్రీ పండిట్ జవహర్‌లాల్ నెహ్రూగారు 1959 అక్టోబర్ 2న రాజస్థాన్‌లోని నాగావుర్‌లో పంచాయతీ రాజ్ వ్యవస్థను ప్రారంభించారు. శ్రీ మహాత్మా గాంధీజీ పుట్టిన రోజు సందర్భంగా ఆ రోజును ఎంపిక చేశారు. పంచాయతీ రాజ్ ద్వారా గ్రామ స్వరాజ్యాన్ని గాంధీజీ కోరుకున్నారు.
గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ, బ్లాక్ స్థాయిలో పంచాయతీ సమితి, మండల పరిషత్ మరియు జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ స్థాపనలు జరిగాయి.
ప్రజల ఓట్ల మూలంగా ఐదు సంవత్సరాలకు ఒకసారి ఆయా నాయకులను స్థానిక ప్రజలు ఎన్నుకుంటారు.
గ్రామ, పట్టణ, నగరాలను వాటి జనాభాను బట్టి వార్డులుగా విభజించి, ఆయా ప్రాంతాల నుండి ప్రజల ఓట్లతో సభ్యులు, ప్రధాన నాయకుల ఎన్నికలు జరుగుతాయి.
అంటే ప్రతి గ్రామము, మండలము, తాలూకా, జిల్లా నందు స్థానిక సభ్యుల మూలంగా ఎన్నికైనవారు స్వపరిపాలనను నిర్వర్తిస్తారు. దీనికే ప్రజాస్వామ్య వ్యవస్థ అని పేరు. మన భారతదేశాన్ని 'సావరిన్ డెమోక్రటిక్ రిపబ్లిక్' అంటారు. అంటే ‘సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం’ అని అర్థం. ఇది ఒక దేశం యొక్క పాలన మరియు రాజకీయ వ్యవస్థను సూచిస్తుంది.
మన భారతదేశానికి ‘ఇండియా’ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా!... ప్రాచీన కాలంలో భరతదేశాన్ని జంబూద్వీపము, భరతఖండము, హిమవర్షం, ఆర్యావర్తం, హిందూస్థాన్ ఇలా రకరకాల పేర్లతో పిలిచేవారు.
కానీ భారతదేశానికి ‘ఇండియా’ అనే పేరు సింధూ నది వల్ల వచ్చింది. సింధూ నది, జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్ మరియు సరస్వతి మొదలగు 7 నదులను కలిపి సప్తసింధు అని పిలుస్తారు.
అంతరించిపోయిన ఆ సరస్వతీ నదిని గురించి ఋగ్వేదంలో ప్రస్తావించబడింది. ఆ తరువాత వచ్చిన పర్షియన్లు ‘స’ ను ‘హ’ గా పలికేవాళ్లు. దానితో సప్తసింధు కాస్త హప్తహింధుగా మారింది. ‘స్థాన్’ అంటే ప్రదేశం అని అర్థం. హప్తహిందూ, హిందూస్థాన్‌గా మారింది. అయితే గ్రీకు భాషలో ‘హ’ ఉచ్చారణ లేదు. దీనితో హిందూ ‘ఇండోస్’ అయినది. ఆ తరువాత లాటిన్ భాషలో ‘ఇండియా’గా మారింది.
గ్రామస్థులలో ఎవరికైనా సమస్యలు, పరస్పర అభిప్రాయభేదాలు కలిగినప్పుడు వారు (ఇరువర్గాలు) మా తాతయ్య వీరరాఘవయ్యగారిని కలిసేవారు. ఇరువర్గాల వారూ వారి వారి అభిప్రాయాలను తాతగారికి తెలియజేసేవారు.
అరిషడ్వర్గాలను జయించిన మా తాతగారు ఆ ఉభయుల విన్నపాలను ప్రశాంత చిత్తంతో వినేవారు. ఇరువర్గాల వారు చెప్పడం ముగిశాక, ప్రతి వర్గం వారిని సౌమ్యంగా వారి సమస్యలకు సంబంధించిన కొన్ని ప్రశ్నలు అడిగేవారు. నిజాయితీపరులు వారి ప్రశ్నలకు నిర్భయంగా జవాబు వెంటనే చెప్పేవారు. అవినీతి భావన మనస్సున ఉన్నవారు వారి ప్రశ్నలకు వెంటనే జవాబు చెప్పలేక, మాటల తడబాటుతో బొంక చూసేవారు.
‘‘చూడండి, సత్యానికి ఎప్పుడూ తెగువ, నిర్భయం ఉంటాయి. అసత్యానికి తడబాటు, భయం ఉంటాయి. మీలో నాకు అవి కనిపించాయి. మీ మాటల వలన నా చెవులకు సత్యాఅసత్యాలు వినిపించాయి. మీ రెండు వర్గాల వారూ నా ఆత్మీయులు, నాకు కావలసినవారు. స్వార్థం కొన్ని సమయాల్లో విచక్షణాజ్ఞానాన్ని కోల్పోయేలా చేస్తుంది.
చలమయ్య!... ప్రస్తుతం నీ పరిస్థితి అదే. నీ ముఖంలో నాకు భయం కనిపిస్తూ ఉంది. సుందరయ్య ముఖంలో నాకు సత్యం గోచరిస్తూ ఉంది. మన జీవితం చాలా చిన్నది. ఆ జీవితకాలంలో మనం చేసే పనులు— అవి మంచివి గాని, చెడ్డవి గాని— మనం పైకి వెళ్ళిపోయిన తరువాత మనవారి మధ్యన మిగిలిపోతాయి.
సభ్య సమాజంతో మంచిగా వర్తించినవారు గతిస్తే, మిగిలి ఉన్నవారు వారు చేసిన మంచిని గురించి పదిమందికీ చెప్పుకుంటారు. అదే చెడులు చేసి, స్వార్థంతో జీవితాన్ని సాగిస్తే, చలమయ్యా, నీలాంటి వారిని గురించి తమరి నిర్యాణం తరువాత 'పరమ దరిద్రుడు చచ్చాడు, ఈ గ్రామానికి పట్టి ఉండిన శని వదిలిపోయింది' అని అనుకుంటారు.
కనుక సుందరయ్య, అతని కుటుంబ సభ్యులు యాత్రలకు వెళ్ళిన సమయంలో ఇండ్ల స్థలాల హద్దు రాళ్ళను మార్చడం అన్నది నీవు చేసిన తప్పు. మీకు తల్లులు వేరైనా తండ్రి ఒక్కడే కదా!... అన్నదమ్ములైన మీరు మూడు నాలుగు అడుగుల నేల కోసం ఒకరిని ఒకరు మోసం చేసే ప్రయత్నం చేయడం తప్పు. నేను రేపు వచ్చి కొలిచి, హద్దు రాళ్ళను మీ చేతనే పాతిస్తాను. ఎలాంటి మనోవికారాలూ లేకుండా ఇరువురూ చేతులు కలపండి. అన్నదమ్ములైన మీరు మీ జీవితాంతం కలిసిమెలసి ఉండాలన్నది నా కోరిక. నా మాటలను మీరు గౌరవిస్తారని మీ ఉభయుల మీదా నాకు నమ్మకం...’’ అని తాతయ్య చిరునవ్వుతో చెప్పారు.
ఆ ఇరువురు అన్నదమ్ములూ ఆనందంగా చేతులు కలుపుకున్నారు. తాతగారికి నమస్కరించి, వారికి చెప్పి సంతోషంగా వెళ్ళిపోయారు. ఇలా ఎందరో ఏవేవో సమస్యలతో గ్రామ ప్రజలు తాతగారి దగ్గరకు అప్పుడప్పుడు వచ్చేవారు. వారు వారిని నొప్పించక ఎవరికి ఏం చెప్పాలో చెప్పి సమస్యను పరిష్కరించి వారిని సాగనంపేవారు.
స్వాతంత్ర్యం సాధించి మనకు పంచాయతీ వ్యవస్థ ఏర్పడిన నాటినుంచీ దాదాపు పది సంవత్సరాలు తాతయ్యగారే ఏకగ్రీవంగా గ్రామ సర్పంచిగా ఊరిజనం చేత ఎన్నుకోబడ్డారు.
ఉదయగిరి ప్రాంతం నుంచి వచ్చిన సరాగాల సాంబయ్యకు ఆ విషయం జీర్ణం కాలేకపోయింది. గోవర్ధనరావుగారిని కలిశాడు. ఆ పంచాయతీ సర్పంచి విషయాన్ని గురించి చర్చించాడు. ఆ పదవిపై గోవర్ధనరావుగారికి ఆశను కల్పించాడు. ఫలితంగా గోవర్ధనరావుగారు మా తాతగారిని కలుసుకున్నారు.
‘‘బావా!... నమస్కారం...’’
కూడా సరాగాల సాంబయ్యగారు ఉన్నారు.
‘‘రండి బావా, రండి. కూర్చోండి...’’ తాతయ్యగారు గోవర్ధనరావుగారికి ఆసనం చూపించారు.
నక్కవినయంతో సరాగాల సాంబయ్య... ‘‘నమస్కారం సార్!...’’ చేతులు జోడించాడు.
గోవర్ధనరావుగారు, వారి ప్రక్కన సాంబయ్యగారు కూర్చున్నారు.
‘‘ఆ... బావా, చెప్పండి, ఏమిటి విషయం?...’’ అడిగారు తాతగారు.
‘‘రెండు నెలల్లో పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, బావా!...’’
‘‘ఆ...’’
‘‘మీరు ఇప్పటికి పదిసార్లు ఏకగ్రీవంగా సర్పంచిగా గెలిచారు కదా!...’’
‘‘అవును...’’
‘‘ఈసారి నేను నిలబడాలనుకుంటున్నాను, బావా!...’’
తాతగారు కొన్ని క్షణాలు గోవర్ధనరావుగారి ముఖంలోకి, సాంబయ్య ముఖంలోకి చూశారు. వారికి విషయం అర్థమయింది.
‘‘బావా!... నాకు నిరభ్యంతరం!....’’ నవ్వుతూ చెప్పారు తాతయ్యగారు.
‘‘తప్పుగా అనుకోలేదు కదా, బావా!...’’
‘‘లేదు, ఒప్పుగానే అనుకున్నాను. ఈసారి మీరే నిలబడండి. నేను మీకు సపోర్టు చేస్తాను, బావా!...’’ చిరునవ్వుతో చెప్పాడు తాతయ్య.
సరాగాల సాంబయ్య నవ్వాడు.
‘‘సాంబయ్యగారూ, ఎందుకు ఆ నవ్వు?...’’ తాతగారి ప్రశ్న.
‘‘అనుకున్నాను సార్!... నేను అనుకున్నాను!...’’ వెకిలి నవ్వు.
‘‘ఏమని?...’’
‘‘తమరు కాదనరని!...’’
‘‘మీరు చాలా గొప్పవారు, సాంబయ్యా!... ఇంతవరకూ మా గ్రామంలో వ్యక్తుల మధ్యన భిన్న అభిప్రాయాలు లేవు. మీరు కల్పించదలచారు. అందుకు సాక్ష్యం మా బావగారు నాతో చెప్పిన మాట!...’’ తీక్షణంగా సాంబయ్య కళ్ళల్లోకి చూశాడు తాతయ్య.
సరాగాల సాంబయ్య బెదిరిపోయాడు. జాలిగా గోవర్ధనరావుగారి ముఖంలోకి చూశాడు.
‘‘బావా!...’’
‘‘ఏమిటి గోవర్ధనా!....’’
‘‘నీకు ఇష్టంలేకపోతే నేను నిలబడను...’’
‘‘ఆ మాట నేను అనలేదుగా!... 'నిన్ను నిలబడు' అనే చెప్పాను..’’ చిరునవ్వుతో చెప్పాడు తాతయ్య.
సరాగాల సాంబయ్య కుర్చీనుంచి బిక్కముఖంతో లేచాడు.
అతన్ని చూసిన గోవర్ధనరావు...
‘‘సరే బావా, నేను వెళ్ళి వస్తాను.’’ వారూ కుర్చీ నుండి లేచారు. అదే సమయానికి మా అత్తయ్య సుశీల జిల్లా నగరం నుండి వచ్చింది.
మా అత్తయ్య చాలా అందగత్తె. గోవర్ధనరావుగారిని చూచి చేతులు జోడించి వినయంగా...
‘‘నమస్కారం మామయ్యా!...’’ అంది.
గోవర్ధనరావు మా అత్తయ్యను ఎంతో ఆశ్చర్యంగా చూశాడు.
సరాగాల సాంబయ్య కప్పలా నోరుతెరిచి నిలబడిపోయాడు. అతను అంతవరకూ మా అత్తయ్య సుశీలను చూడలేదు.
‘‘అయ్యా, వీరు!...’’ సరాగాల సాంబయ్య మా అత్తయ్యను చూస్తూ గోవర్ధనరావుగారిని తట్టి అడిగాడు.
‘‘మా బావ కూతురు, పేరు సుశీల. పట్నంలో చదువుతూ ఉంది...’’ చిరునవ్వుతో చెప్పాడు. మా అత్తయ్య వైపుకు తిరిగి...
‘‘అమ్మా, సుశీలా!... బాగున్నావా?... పరీక్షలు బాగా రాశావా?...’’ ప్రీతిగా అడిగాడు గోవర్ధనరావు.
‘‘ఆ, రాశాను మామయ్యా!...’’
మా నానమ్మ పార్వతి కూతురు గొంతు విని వరండాలోకి వచ్చింది.
‘‘అమ్మా!... బాగున్నావా!...’’ నవ్వుతూ తల్లిని సమీపించి, ఆమె చేతులు పట్టుకొని మా అత్తయ్య అడిగింది.
‘‘ఆ, నేను బాగానే ఉన్నానే... నీకు పరీక్షలు ముగిశాయా?...’’ అడిగింది మా నానమ్మ.
‘‘ముగిశాయి నానమ్మా!... బాగా రాశాను...’’ నవ్వుతూ చెప్పింది అత్తయ్య.
‘‘సరే, రా!...’’ నానమ్మ అత్తయ్య చేతిని పట్టుకుంది. ఇరువురూ ఇంట్లోకి వెళ్ళిపోయారు.
‘‘సరే బావా!... వెళ్ళొస్తాను.’’
ముందు గోవర్ధనరావు, వెనకాల సరాగాల సాంబయ్య వెళ్ళిపోయారు.
మార్గమధ్యంలో శివాలయం ఉంది.
‘‘అయ్యా!... గోవర్ధనరావుగారూ!...’’
‘‘ఆ... ఏమిటి సాంబయ్యా!...’’
‘‘నన్ను గురించి మీరు ఏమనుకుంటున్నారు?’’
‘‘నా శ్రేయోభిలాషివని!...’’
‘‘వీరరాఘవయ్యగారి కూతురును చూశారుగా!...’’
‘‘ఆ, చూశాను!...’’
‘‘ఏమనిపించింది?...’’
‘‘ఆ అమ్మాయికేం, చక్కగా ఉంది...’’
‘‘అంతేనా!...’’
‘‘అంతే కాదు. వీరరాఘవయ్య బావ పిల్లల్ని చాలా పద్ధతిగా పెంచాడు. అందమే కాదు, గుణగణాలూ మంచివి. ఆ అమ్మాయిని భార్యగా పొందే యోగం ఎవరికి రాసి పెట్టాడో ఆ బ్రహ్మ ఆ దేవుడు, వాడు నిజంగా చాలా అదృష్టవంతుడై ఉండాలి.’’
‘‘అలాగా!...’’ ఆశ్చర్యంతో గోవర్ధనరావుగారి ముఖంలోకి చూశాడు సాంబయ్య.
‘‘అవును!...’’
‘‘ఆ అదృష్టవంతుడు తమరి కుమారుడు ధనుంజయరావు ఎందుకు కాకూడదు?...’’
గోవర్ధనరావు ఆశ్చర్యంతో సాంబయ్య ముఖంలోకి చూశాడు.
‘‘ఏంది సార్!... అలా చూస్తున్నారు?... మీరు ఊ అనండి, మిగతా కథను నేను నడుపుతాను...’’ వికారంగా నవ్వాడు సాంబయ్య.
‘‘అంటే!...’’
‘‘మీ తరఫున నేను వీరరాఘవయ్యగారితో మాట్లాడి, వారి అమ్మాయికి, మీ అబ్బాయిగారు ధనుంజయరావుకు వివాహం జరిగేలా నేను చేస్తాను...’’
‘‘నిజంగా!...’’
‘‘సత్య ప్రమాణంగా!...’’ నవ్వుతూ చెప్పాడు సాంబయ్య.
‘‘సరే సాంబయ్యా, గట్టిగా ప్రయత్నించు...’’ ఆనందంగా చెప్పాడు గోవర్ధనరావు.
‘‘మీరు ఓకే అన్నారుగా!... నేను చూసుకుంటాను, పదండి...’’
ఇరువురూ ఆనందంగా వారి వారి ఇళ్ళ వైపుకు నడిచారు.
============================================================
ఇంకా వుంది..
తోలు బొమ్మలు - పార్ట్ 5 త్వరలో మీ ముందుకు వస్తుంది.
============================================================
పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.
మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.







Comments