వ్యాపార ప్రపంచం – పార్ట్ 13

Vyapara Prapancham – Part 13 | Telugu Emotional Inspirational Serial | Pandranki Subramani
వ్యాపార ప్రపంచం – పార్ట్ 13 | తెలుగు భావోద్వేగ ప్రేరణాత్మక ధారావాహిక | పాండ్రంకి సుబ్రమణి | ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత
Published in manatelugukathalu.com on 09/11/2026
వ్యాపార ప్రపంచం – పార్ట్ 13లో సింగపూర్, థాయ్‌లాండ్ వ్యాపార పర్యటన ముగించుకుని వచ్చిన సుఖదేవ్‌కు నాగముని ఒక ముఖ్యమైన విషయం చెబుతాడు. గీతా మాధురికి మరో సంస్థ నుంచి మంచి ఉద్యోగ అవకాశం రావచ్చని, ఆమెను సుగుణ్ ట్రేడర్స్‌లో కొనసాగించేందుకు ప్రత్యేక ప్రోత్సాహం ఇవ్వాలని సూచిస్తాడు. బోర్డు సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితురాలిగా నియమించాలనే ప్రతిపాదనతో గీతా మాధురిని పిలిపిస్తారు. అయితే ఆమె తన పదోన్నతి కంటే తమ్ముడు ప్రసన్నకు ఉద్యోగం ఇవ్వాలని కోరుతుంది. ఆ యువకుడి భవిష్యత్తు కోసం సుఖదేవ్ తీసుకున్న నిర్ణయం కథలో ఆసక్తికరమైన మలుపుగా నిలుస్తుంది.
వ్యాపార ప్రపంచం జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
జరిగిన కథ: కుటుంబ ప్రేమతో రోజును ప్రారంభించిన సుఖదేవ్, కార్యాలయంలో మాత్రం కఠినమైన వ్యాపార నిర్ణయాల ముందుంటాడు. స్త్రీలను కేవలం లింగం ఆధారంగా పక్కన పెట్టడం సరైన నిర్ణయం కాదని నాగముని సుఖదేవ్‌కు వివరిస్తాడు. సీనియర్ సూపర్‌వైజర్ దీనదయాళ్ భానుప్రసాద్ ను క్యాంటీన్‌కు తీసుకెళ్లి ఉద్యోగ బాధ్యతలు, పై అధికారులతో వ్యవహరించే పద్ధతి, టీమ్‌వర్క్, సహోద్యోగులతో స్నేహపూర్వకంగా మెలగడం వంటి విషయాలపై హితబోధ చేస్తాడు.
రోడ్డు ప్రమాదంలో ఒక స్త్రీ మరణించిన దృశ్యం ప్రణవిని బాధిస్తుంది. కీలకమైన పోస్టుకు గీతా మాధురి ఎంపిక అవుతుంది. గీతామాధురితో దూరంగా ఉండాల్సిన అవసరం లేదని సుఖదేవ్ తో చెబుతాడు నాగముని.
సుఖదేవ్ చెల్లెలు విద్యాభవానికి, భానుప్రసాద్ కు పరిచయం పెరుగుతుంది. ఆఫీసులో మాలినితో జరిగిన అనుకోని సంఘటన కథకు మరో మలుపునిస్తుంది. అనుకోని సంఘటనలో సుఖదేవ్ ఆమెను ముద్దుపెట్టుకోవడంతో గీతా మాధురి దిగ్భ్రాంతికి గురవుతుంది.
వ్యాపార ప్రపంచం గత ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వ్యాపార ప్రపంచం - నవల - ముందుమాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వ్యాపార ప్రపంచం - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వ్యాపార ప్రపంచం - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వ్యాపార ప్రపంచం - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వ్యాపార ప్రపంచం - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వ్యాపార ప్రపంచం - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వ్యాపార ప్రపంచం - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వ్యాపార ప్రపంచం - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వ్యాపార ప్రపంచం - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వ్యాపార ప్రపంచం - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వ్యాపార ప్రపంచం - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వ్యాపార ప్రపంచం - పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వ్యాపార ప్రపంచం - పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అగర్వాల్ ట్రేడింగ్ సెంటర్ తో డీల్ సవ్యంగా స్ట్రయిక్ అయిన తరువాత ఊపులో ఊపుగా, పనిలో పనిగా సుఖదేవ్ షార్ట్ బిజినెస్ టూరు ముగించి వచ్చాడు. సింగపూర్, థాయ్‌లాండ్ దేశాలలో వ్యాపార చర్చలు ముగించి వచ్చాడు అక్కడి భారత రాయబార కార్యాలయాలలోని ట్రేడ్ సెంటర్స్ సహకారంతో—
మానసిక ఉల్లాసం పొందడానికి అక్కడి పురాతన బౌద్ధ విహారాలను కూడా దర్శించి వచ్చాడు. కంబోడియా వరకూ వెళ్ళి అక్కడున్న ప్రాచీన హైందవ ఆలయాన్ని దర్శించుకుని తన్మయత్వం చెందాడు.
అంతేకాక— రెండవ ప్రపంచ యుద్ధకాలంలో బ్రిటిష్ సైన్యానికి వ్యతిరేకంగా సుభాష్ చంద్రబోస్ సాగించిన మెరుపు దాడుల గురించీ, ఇండియన్ నేషనల్ ఆర్మీ సైనికులు బర్మా, థాయ్‌లాండ్ సరిహద్దు ప్రాంతాలలో మకాం పెట్టిన గుడారాల పరిసరాల గురించి కూడా తెలుసుకున్నాడు. వాటి గురించి ఆమూలాగ్రంగా తెలుసుకుని దేశభక్తి పూర్వక ఉద్వేగ భావంతో పులకాంకితుడయ్యాడు.
వీలున్నంత మేర వాటి ఫోటో షాట్స్ తీసి జ్ఞాపికలుగా ఇంటికి తీసుకు వచ్చాడు; జైహింద్ అన్న సమర నాదాన్ని మనసున నింపుకుంటూ-- ఇంట్లో వాళ్ళందరికీ చూపించాడు.
ఇకపోతే--ఎక్కడైనా ఏ ప్రాంతంలోనైనా వ్యాపారి అన్నవాడు నిలకడగా ఓచోట కుదురుగా ఉండలేడు. అలా కుదురుగా ఒకే చోట సౌకర్యవంతంగా ఉండాలనుకున్నవాడు వ్యాపార రంగంలో మనుగడ సాగించలేడు. ఇటువంటి సాధారణ అంశం సుగుణ్ ట్రేడర్స్ సీఈఓ సుఖదేవ్‌కి తెలియకుండా ఉంటుందా ఏమిటి--
ప్రయాణ బడిలిక తీర్చుకోవడానికి ఒకరోజు గడువు తీసుకుని మరునాడు కంపెనీ ప్రాంగణం చేరాడతడు. అతడు తన ఛాంబర్‌లో కూర్చున్న కొన్ని నిమిషాలలో నాగముని కొన్ని పేపర్లను చేతబట్టుకుని ప్రవేశించాడు.

వచ్చీరావడంతోనే అన్నాడు- “నీతో ముఖాముఖి మాట్లాడాలి. మీ ఇద్దరు పీఏలను టీ-కప్పులతో లోపలకు రాకని ఆదేశాలు అందివ్వు! లేకపోతే మన సంభాషణ మామూలుగా ఫార్మల్‌గా మారిపోతుంది. ఇది కొంచెం పర్సనల్--”
సుఖ్‌దేవ్ అలాగే అంటూ మరొక పావు గంటవరకూ ఎవరినీ లోపలకు పంపకని పీఏలిద్దరికీ ఆదేశాలు అందించాడు. బాబాయిగారు తనతో చర్చించబోయే విషయం సీరియస్ వ్యవహారమే అయివుంటుందని తలపోస్తూ మంచినీళ్ళ గ్లాసుని ముందుకు తోస్తూ- “చెప్పండి బాబాయ్!” అని సంభాషణకు తయారయ్యాడతను.
అతడు తలూపి సావధాన చిత్తుడై ప్రారంభించాడు- “నువ్వు వయసులో చిన్నవాడివైనా విద్యా స్థాయిలోనూ, విషయ పరిజ్ఞానంలోనూ ఉన్నతుడివి. కష్టించి పని చేయగల నిర్మాణాత్మక స్వభావం గలవాడివి. అందుకే మరొకసారి చెప్పడానికి ప్రయత్నిస్తాను— మనం ఉంటున్నది శివాశ్రమం కాదు, సేవాశ్రమం అంతకంటే కాదు. తడి గుడ్డతో కుత్తుకలు కోసుకునే పోటీ ప్రపంచం. మనం పాల్పడకపోవచ్చు గాని— కొంచెం రివైండ్ చేసుకుని చూడు; ఎంతమంది ప్రత్యర్థి కంపెనీలు మనం పలికిన టెండర్‌ని మనకు దక్కకుండా చేశారో వేళ్ళపై లెక్కించి చెప్పగలను.
నీకు మూడ్ పాడవకూడదని జాగ్రత్త పడుతూనే ఒకటి రెండుసార్లు దీనిని సూచాయిగా ప్రస్తావించాను కూడాను-- అందుకే మన సుగుణ్ ట్రేడర్స్ సంస్థకు చిత్తశుద్ధి, లోతైన విలువలున్న ఆఫీసర్‌ని, ఇన్వెస్ట్‌మెంట్ విభాగానికి నేర్పూ ఓర్పూ గల వ్యక్తిని ఎంపిక చేయమని మీ వెంట బడ్డాను, సాధించాను కూడా— ఇప్పుడు నీకు చెప్పబోయే అసలు విషయం ఇది కాదు. మరొకటి—”
అప్పుడు అదేమిటన్నట్టు కళ్ళు మిటకరించి చూశాడు సుఖదేవ్.
నాగముని అందుకున్నాడు- “అదేమంటే— విస్తరిస్తున్న మన వ్యాపార వ్యవస్థలో కొన్ని విషయాలలో మరీ సెన్సిటివ్‌గా ఉండనవసరం లేదని— హార్ట్‌కి తీసుకోకుండా ఫార్మల్‌గా ఉండటానికి ప్రయత్నించమని- సాధ్యమైనంత మేర అలా ఉండటానికి అలవాటు చేసుకోమని— డిడ్ యూ క్యాచ్ మై పాయింట్?”
దానికి సుఖదేవ్ తల అడ్డంగా ఆడించాడు క్యాచ్ కాలేదని సంకేతం ఇస్తూ—
“సరే—విడమరిచి చెప్పడానికి పూనుకుంటాను. ఈ మధ్య అగర్వాల్స్ సంస్థలో శోభాగారు యాక్టివ్ రోల్ వహిస్తున్నారని మనకు తెలుసు. మొన్న జరిగిన డీల్ విషయంలోనూ ఆమె గారే భర్తకు వత్తాసుగా నిలిచి ఒప్పందం మనకనుకూలంగా స్ట్రయిక్ అయ్యేలా తోడ్పడ్డారన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమెతోనూ వాళ్ళ కంపెనీతోనూ ఏర్పడ్డ వ్యాపార సంబంధాన్ని విస్తరించుకోవాలి గాని— తెంచుకోవడానికి తావివ్వకూడదు.
మరి నువ్వేమి చేశావు? ఆమె నీ కోసం ఏర్పాటు చేసిన స్పెషల్ భోజనం పూర్తయిన తరువాత ఆమెగారితో స్నేహపూర్వకంగా మాటలు పెంచకుండా వేడినీళ్ళు పోసుకున్నవాడిలా పరుగు పరుగున మాధురిగారిని కారెక్కించుకుని ఛాంబర్‌కి చేరావు. ఇదేనా వ్యాపార సంబంధాలు పెంచుకునే పద్ధతి!
ఆడదాని ఇగో గాని దెబ్బతింటే పగబట్టిన పాములా మారవచ్చు. రేపు మనకు అనుకూలంగా రావలసిన డీల్‌ని ఆమె డామేజ్ చేస్తే అప్పుడు మనమేమి చేయగలం? అగర్వాల్ గారితో మనకెంతటి క్లోజ్ సంబంధాలు ఉన్నా అతడు సమయం గాని వస్తే భార్యవైపు మొగ్గు చూపుతాడు గాని మనకు అనుకూలంగా చర్య తీసుకోడు కదా!
నేను చెప్పొచ్చేదేమంటే— తిన్నగా రంగంలోకి దిగమనడం లేదు— దిగుతున్నట్లు భావన చూపించమంటున్నాను. దీనికి డైరెక్ట్‌గా ఉదాహరణ కోప స్వభావం— కోపం చెడ్డది. చాలా చెడ్డది. ఇందులో సందేహమే లేదు. కాని— అప్పుడప్పుడు కార్యసాధనకై కోపం కలిగినట్లు భావన చూపిస్తుండాలి, నిజంగా— మనసా వాచా కోప్పడకుండానే— అదే విధంగా మన సంస్థ అభివృద్ధికి అంకిత భావంతో పని చేసే గీతా మాధురి విషయంలోనూ అదే జరిగింది.”
అప్పుడు సుఖదేవ్ క్వరీ లేవదీశాడు- “హౌ?” అని విస్మయాత్మకంగా చూస్తూ--
నాగముని హాస్యరేఖను మాత్రం చిందిస్తూ అన్నాడు- “మిస్ మాధురిగారిని ఎంత అలూఫ్‌గా ఉంచాలనుకుంటున్నావో నాకు తెలియదనుకుంటున్నావా సుఖదేవ్! నువ్వీ మధ్య ఆమెను ఛాంబర్‌కి పిలవడం లేదు. ఆమె కూడా ఇక్కడకు రావడానికి ఆస్కారం కల్పించడం లేదు. ముఖ్యమైన మేటర్ ఏదైనా ఉంటే నాకప్పగించి, ఆమెతో చర్చించమని ఆమె రూముకి నన్ను పంపిస్తున్నావు.
నువ్వు ఎవరికైనా ఏ విధమైన డైరెక్షన్ అయినా ఇవ్వవచ్చు. ఎవరూ కాదనలేరు. బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్, అది నాకు మాత్రం తెలవదా! కాని— ఇక్కడ చర్చించాల్సిన విషయం అది కాదు. గీతామాధురి లేడీ ఆఫీసరు. ఆమె మనోభావాలు మరొక విధంగా ఉంటాయి. కొన్ని మృదువుగా ఉంటాయి. మరికొన్ని ఉధృతంగా ఉంటాయి. ఏది ఎలాగున్నా వాళ్ళ మనసులు రాపిడికి తట్టుకోలేవు. సరే-- ఇప్పుడు చెప్పు— నీతో ఆమె అఫీషియల్ బిహేవియర్ బాగాలేదా?”
సుఖదేవ్ స్పందించలేదు. దూరాన టీ పాయ్ పైన ఉన్న కుండీలోని పూలను తదేకంగా చూస్తూండిపోయాడు. స్వగతంలా లోలోన అనుకున్నాడు-- “ఈ పెద్దాయనకు తన అవస్థ అర్థం కాదు. చెప్పినా పెద్ద మనసుతో అర్థం చేసుకోగలడా— ఊహూ సందేహస్పదమే— మిస్ బిహేవియర్‌కి పాల్పడింది మిస్ గీతా మాధురి కాదు. ఆరోజు కార్పెట్ కొన తగిలి తన పైన పట్టుతప్పి పడిపోయినప్పుడు తను అవలీలగా లేవదీసే బదులు సొంత పెళ్ళాంలా అమాంతం పెనవేసుకుని గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు.
అంతటితో ఊరుకున్నాడా- ఇంకేదో చేయడానికి ఉబలాటపడ్డాడు. ఇదంతా తల నెరిసిపోయిన ఈ పెద్దాయనకు తెలుసా! జరిగిందేదో మనసు విప్పి చెప్తే తట్టుకోగలడా? లేదు. తప్పనిసరిగా ఛీ కొట్టి చీదరిస్తాడు. ’నువ్విలా చేస్తావని నేనెన్నడూ అనుకోలేదబ్బాయి!’ అని రంకెలు వేస్తాడు.
తను గాని అసలు విషయం చెప్తే ఇదే కదా జరగబోయేది! తనెందుకు అంతటి వేగిరపాటుకి లోనవుతున్నాడో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించగలడా!”
అప్పుడు నాగముని గొంతు వినిపించి చట్టున తేరుకున్నాడు. “నేనేమీ స్తబ్దుగా లేను బాబాయి! విషయానికి వస్తున్నాను. మనందరికీ తెలుసు మాధురిగారు కీలకమైన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని— మీరందరూ ఉండగా ఆమెను మాటిమాటికీ పిలిచి డిస్టర్బ్ చేయడం ఎందుకని ఛాంబర్‌కి పిలవడం తగ్గించాను. ఇందులో ఆంతరంగికమైన విషయం ఏదీ లేదు”
“అంతేనా! ఇంకేమో అనుకున్నాను. ఇప్పుడామెకు సంబంధించిన ఒక కాన్ఫిడెన్షియల్ సంగతొకటి చెప్పబోతున్నాను. అదేమీ నాకు తెలియదనుకుంటుందామె”
ఆ మాటతో సుఖదేవ్‌కి ఉత్కంఠ రేగింది- ముందుకు వంగి అన్నాడు “చెప్పండి బాబాయ్!”
“చెప్తాను. నేనిక్కడకు వచ్చింది అది చెప్పడానికేగా! ఇక్కడున్న ఒక ఇండియన్ కంపెనీ గుర్గావ్‌లోని ఒక ఫారిన్ కంపెనీ హై పోస్ట్ విత్ హయ్యర్ పే- ప్యాకెట్ ఆఫర్ చేస్తున్నారట— ఇటువంటి సమయంలో ముఖ్యంగా కంపెనీ విస్తరణ కోసం మనం తలమునకలవుతున్నప్పుడు ఆమె దారి మళ్ళితే ఆహ్లాదకరమైన సంఘటన కాదేమో—”
సుఖదేవ్ మరొకసారి సైలెంట్ మోడ్‌లోకి వెళ్ళిపోయాడు. తను ఆనాడు అగర్వాల్ ఇంట్లో పాల్పడిన దూకుడుకి ప్రతిస్పందనగా ఆమె తమ కంపెనీకి వీడ్కోలు పలకడానికి సిద్ధపడుతుందేమో—
ఈసారి నాగముని అతడి చేతిపైన చేయినుంచి అన్నాడు- “నాకొక ఆలోచన ఉంది సుఖదేవ్— వి వుడ్ మేక్ ఆన్ ఆఫర్ దట్ కెనాట్ బి డినైడ్”
“అంటే—పే-ప్యాకెట్ డబుల్ చేద్దామంటారా!”
“మంచి ఆలోచనే— కాని, ఇప్పటికిప్పుడు అది సానుకూలం కాదు. ఎందుకంటే— తోటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లకు, ముఖ్యంగా ఆమె సీనియర్లకు కంటగింపుగా ఉండవచ్చు. కావున— ఆమెకు స్పెషల్ గెశ్చర్‌గా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీట్‌కి స్పెషల్ ఇన్వైటీగా పోస్టింగ్ ఇద్దాం. ఆ తరువాత ఆమెను డైరెక్టర్‌గా నియమిద్దాం. ఈ లోపల ఆమె మీట్‌కి వచ్చినప్పుడల్లా ఆమెకు ఎలాగూ స్పెషల్ అలవెన్సులు ఉంటాయి కదా—అది ఆమెకొక ఇన్సెంటివ్వే కదా--”
“అంతా బాగానే ఉంది. కాని— రేపు దానినే సాకుగా తీసుకుని తనను రెగ్యులర్ డైరెక్టర్‌ని చేయమని ఆమె డిమాండ్ పెడితే—”
“అప్పటి మాట అప్పుడు చూద్దాం. ఇప్పుడామెను మన ఫ్రెండ్లీ ఫీల్‌తో ఉదారమైన చర్యతో కాదనలేని విధంగా కట్టడి చేద్దాం. ఇక్కడ మరొక సానుకూల అంశం కూడా ఉంది. అదేమంటే- ఇంతవరకూ మీ పీఏలే కదా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్‌కి సంబంధించిన ప్రొసీడింగ్స్ తయారు చేస్తున్నారు. ఇకపైన దానిని మాధురిగారే తయారు చేస్తారు. దీంట్లో ఆమెగారికున్న హస్తలాఘవం చూడగలరు” అని పీఏలిద్దరినీ పిలిపించాడు నాగముని.
ఇద్దరూ చెరొక వైపునా వచ్చి నిల్చున్న తరువాత పురమాయించాడు- “మాధురి మేడమ్ గారికి ట్రీట్ ఇవ్వబోతున్నాం. క్యాంటీన్‌లో స్పెషల్‌గా చేసినవి రప్పించి మాధురిగారిని సీఈఓ గారు పిలుస్తున్నారని కబురందివ్వండి.”
సుఖదేవ్ కూడా అదే విధంగా చేయమని సావధానంగా తలూపాడు. వేరే గత్యంతరం లేదు కదా! ఇది ఆటగదరా—బ్రతుకాటగదరా--
కొద్ది సేపట్లో గీతా మాధురి బాస్‌కి శుభోదయం పలుకుతూ ప్రవేశించింది. ఆమె అభివాదాన్ని స్వీకరిస్తూ ఎదురుగా కూర్చోమన్నట్టు సైగ చేశాడు సుఖదేవ్. వాళ్ళిద్దరూ సుమారు రెండువారాల తరువాత ముఖాముఖి కలుసుకుంటున్నారన్నది వాళ్ళ ముఖ భావాలను బట్టి తెలుస్తూనే ఉంది. నాగమునికి మరింత స్పష్టంగా తెలుస్తోంది.

మాధురి అభివాదాన్ని స్వీకరించిన నిమిషం తరువాత- సుఖదేవ్ అన్నాడు నవ్వు తెచ్చిపెట్టుకుంటూ- “కంగ్రాట్స్!” అని.
ఆమె ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసుకుంటూ అడిగింది “ఎందుకు సార్?” అని.
మళ్ళీ అదే నవ్వు ముఖంతో తేల్చాడతను- “మిమ్మల్ని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీట్స్ కి స్పెషల్ ఇన్వైటీగా అపాయింట్ చేయమని హెచ్‌ఆర్‌ఎమ్ వాళ్ళు రికమండ్ చేస్తున్నారు. ఆర్ యూ హ్యాపీ!”
ఆమె వెంటనే స్పందించలేదు, సంతోషం కూడా వ్యక్తం చేయలేదు. కొద్ది సేపు ఆగి అంది- “చాలా సంతోషం సార్! కాని— మీరు గాని నాకు మరొకటి చేస్తానంటే మరింత హ్యాపీగా ఫీలవుతాను సార్!”
అదేమిటన్నట్టు ప్రశ్నార్థకంగా చూశాడు సుఖదేవ్-
మాధురి మొహమాట పడుతూనే కొనసాగించింది- “మరేం లేదు సార్. నాకు ఒక తమ్ముడు, ఒక చెల్లీ ఉన్నారు. ఇద్దరూ మా పెదనాన్నను కోల్పోయి మా ఇల్లు చేరిన మా పెద్దమ్మ గారి బిడ్డలు. మా చిన్నమ్మగారు కూడా మాతోనే ఉన్నారు గాని ఆమెకు బిడ్డలు లేరు. వాళ్ళిద్దరినీ నేనే చదివించాను.
మా పెదనాన్నగారు బ్రతికున్నప్పుడు మాకు చాలా సహాయం చేసేవారు. అందుకని మీరు గాని మన కంపెనీలో మా తమ్ముడికి ప్లేస్‌మెంట్ ఇచ్చారంటే నాకు మీరు స్పెషల్ ఇన్వైటీగా అదనపు పోస్టు ఇవ్వకపోయినా పర్వాలేదు.
ట్రైనింగ్ పీరియడ్‌లో వాడికి మీరు స్టైపెండ్ ఇవ్వకపోయినా పర్వాలేదు. వాడు ఫిట్ అనిపించుకున్న తరువాతనే వాడికి పోస్టింగ్ ఇస్తే చాలు సార్!”
సుఖదేవ్ వెంటనే స్పందించలేదు. కొన్ని క్షణాలపాటు మాధురి ముఖంలోకి చూస్తూ అన్నాడు “మీ తమ్ముణ్ణి హెచ్‌ఆర్‌ఎమ్ వాళ్ళు ఓసారి చూడాలి కదా! అతడు దేంట్లో ఫిట్ అవుతాడో తేల్చుకోవాలి కదా!”
“తప్పకుండా సార్! వాడిపేరు ప్రసన్న— వాడిప్పుడు ఇక్కడే ఉన్నాడు సార్, పిలవమంటారా సార్?”
తలూపాడు సుఖదేవ్. సంకేతం అందుకున్న వెంటనే ఆమె రివ్వున బయటకు దూసుకు వెళ్ళి తమ్ముణ్ణి తీసుకువచ్చింది. అక్కయ్య వెంట వస్తూనే ప్రసన్న సుఖదేవ్‌కి, నాగమునికీ తల వంచి నమస్కరించాడు.
ఎడంగా నిల్చున్న ప్రసన్నను దగ్గరకు రమ్మనమని సంజ్ఞ చేశాడతను. అలాగే అంటూ ఆ అబ్బాయి సమీపానికి వచ్చాడు-
వయసెంత అని అడిగాడు సుఖదేవ్-
“పందొమ్మిది సార్. ట్రైనింగ్ ఎంతటి పీరియడ్ అయినా చేస్తాను సార్! శ్రద్ధగా పని చేస్తాను సార్. సమయపాలన పాటిస్తాను సార్-”
అది విని సుఖదేవ్ తలూపలేదు. తేరిపార చూస్తూ అన్నాడు- “మీ సిస్టర్ మీ గురించి అంతా చెప్పారు. ఇప్పుడు దీనికి బదులివ్వండి. ఎందులో— అంటే ఏ శాఖలో పని చేయాలనుంది?”
ఆ ప్రశ్నకు ప్రసన్న తడబడ్డాడు. “నాకైతే—నాకైతే—” అంటూ ఆగిపోయాడు.
సుఖదేవ్ ప్రోత్సహించాడు-
“కమౌట్ ప్రసన్నా! ఎందులో పని చేయాలన్నది తెలిస్తే కదా మీకు పోస్టింగ్ ఇచ్చేది—”
“అలాగే సార్. నాకైతే ఐటీ వింగ్‌లో పని చేయాలనుంది సార్. కాని—కాని, నాకు అందులో- అంటే కంప్యూటర్ సబ్జెక్ట్‌లో బేసిక్ నాలెడ్జ్ లేదు సార్. అందుకని— మీరెందులో వేస్తే అందులో పని చేస్తాను సార్!”
“అదంతా మీకెందుకోయ్! నాకు కావలసింది మీ ఛాయిస్-అంతే—”
“మరైతే నాకు ఐటీ వింగే కావాలి సార్!”

ఇట్ ఈజ్ ఫైన్ అంటూ నాగముని వైపు తిరిగాడు సుఖదేవ్- “చూడండి డిప్యూటీ మేనేజర్ గారూ! ప్రసన్నకు ఐటీ వింగ్‌లో పోస్టింగ్ ఇవ్వండి. ఇతడి వర్క్ షెడ్యూల్ ఎలాగుండాలంటే— అరపూట కార్యాలయంలో పని చేయాలి. మరొక అరపూట కంప్యూటర్ షార్ట్ టర్మ్ కోర్సులో చేరేటట్టు ఏర్పాటు చేయండి.
యాజ్ ఎ స్పెషల్ కేస్-- కోర్సు ఫీజు ట్రైనింగ్ పీరియడ్‌లో ఒక భాగంగా కంపెనీ కడుతుంది. దీనికి తగ్గట్టు ఫార్మల్ ఆర్డర్ ఇష్యూ చేయమని హెచ్‌ఆర్‌ఎమ్ వాళ్ళకు చెప్పండి”
సుఖదేవ్ నోట తమ్ముడి నియామక ఆర్డర్ ప్రస్తావన విన్నంతనే గీతా మాధురి సంతోషంతో ఉద్వేగం ఆపుకోలేకపోయింది. అక్కడ తదేకంగా చూస్తూ కూర్చున్న నాగమునిని కూడా గమనించకుండా లేచి వెళ్ళి సుఖదేవ్ చేతులు పట్టుకుని పుష్కలంగా కృతజ్ఞతలు తెలిపింది.
అతడు మరీ బాహాటంగా స్పందించకుండా--“ఇట్స్ ఆల్ రైట్!” అంటూ లోపలకు లేడీ ప్యూన్‌ని తీసుకువచ్చిన స్నాక్స్ అందరికీ ఇవ్వమని చూపులతో సంకేతం ఇచ్చాడు.
ఎందుకో నాగమునికి మొదటిసారి తోచింది—వాళ్ళిద్దరి మధ్య ఏదో ఒక అనూహ్యమైన మృదు రాగం భాసిల్లుతున్నట్లు— ఇద్దరి మధ్య అంతర్గతమైన ఆత్మీయమైన అవగాహన చోటు చేసుకుంటున్నట్టు.
ఇకపైన ఎటువంటి ఆఫర్స్ బయటి వ్యాపార సంస్థల నుండి వచ్చినా మాధురి తల వంచదని— ఎగ్జిట్ గేటు వైపు చూపు మరల్చదని-- సుఖదేవ్ ఆ ఒక్క సహాయం చేయడంతో సూటిగా కచ్చితంగా గీతా మాధురితో ఓ విధమైన ఎమోషనల్ ఫీల్‌తో కనెక్ట్ అవుతున్నట్లే— దెబ్బకు రెండు పిట్టలంటే ఇది కాదూ!
=================================
ఇంకా ఉంది
వ్యాపార ప్రపంచం – పార్ట్ 14
త్వరలో మీ ముందుకు వస్తుంది.
=================================
📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!
మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.
✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి
👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y
పాండ్రంకి సుబ్రమణి గారి కొన్ని ఇతర రచనలు:
పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పాండ్రంకి సుబ్రమణి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

1) పేరు-పాండ్రంకి సుబ్రమణి
2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య
3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ
4)స్వస్థలం-విజయనగరం
5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు
6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.

a















Comments