వ్యాపార ప్రపంచం – పార్ట్ 6

Vyapara Prapancham – Part 6 | Telugu Emotional Inspirational Serial | Pandranki Subramani
వ్యాపార ప్రపంచం – పార్ట్ 6 | తెలుగు భావోద్వేగ ప్రేరణాత్మక ధారావాహిక | పాండ్రంకి సుబ్రమణి | ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత
Published in manatelugukathalu.com on 13/09/2026
వ్యాపార ప్రపంచం – పార్ట్ 5లో సుఖదేవ్–ప్రణవి వీకెండ్ ప్రయాణం ఊహించని విషాద సంఘటనతో ఒక్కసారిగా మారిపోతుంది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ వివాహిత.. తన కవితకు తృతీయ బహుమతి వచ్చిన వార్త ఆమె వ్యక్తిత్వంలోని మరో కోణాన్ని వెలుగులోకి తెస్తుంది.
వ్యాపార ప్రపంచం జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
జరిగిన కథ: కుటుంబ ప్రేమతో రోజును ప్రారంభించిన సుఖదేవ్, కార్యాలయంలో మాత్రం కఠినమైన వ్యాపార నిర్ణయాల ముందుంటాడు. స్త్రీలను కేవలం లింగం ఆధారంగా పక్కన పెట్టడం సరైన నిర్ణయం కాదని నాగముని సుఖదేవ్‌కు వివరిస్తాడు. సీనియర్ సూపర్‌వైజర్ దీనదయాళ్ భానుప్రసాద్ ను క్యాంటీన్‌కు తీసుకెళ్లి ఉద్యోగ బాధ్యతలు, పై అధికారులతో వ్యవహరించే పద్ధతి, టీమ్‌వర్క్, సహోద్యోగులతో స్నేహపూర్వకంగా మెలగడం వంటి విషయాలపై హితబోధ చేస్తాడు. మాలిని పట్ల ఎలాంటి ఆసక్తి లేని సుఖదేవ్ తన భార్య ప్రణవిపైనే తన ప్రేమ, అనుబంధం ఉన్నాయని స్పష్టంగా భావిస్తాడు. రోడ్డు ప్రమాదంలో ఒక స్త్రీ మరణించిన దృశ్యం ప్రణవిని బాధిస్తుంది.
వ్యాపార ప్రపంచం గత ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వ్యాపార ప్రపంచం - నవల - ముందుమాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వ్యాపార ప్రపంచం - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వ్యాపార ప్రపంచం - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వ్యాపార ప్రపంచం - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వ్యాపార ప్రపంచం - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వ్యాపార ప్రపంచం - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇక వ్యాపార ప్రపంచం - పార్ట్ 6 చదవండి
మరునాడు ఉదయం సుఖదేవ్ శంషాబాద్ విమానాశ్రయానికి సాగిపోయాడు, బాబాయ్ నాగమునికి ఫోనులో ఓ మాట చెప్పి — అతడికి ముంబాయిలో జరగబోయే ముఖ్యమైన బ్యాంకర్స్ మీట్‌కి హాజరవాల్సి ఉంది. పనిలో పనిగా అక్కడున్న ఇద్దరు ముగ్గురు ప్రముఖ క్లయింట్లతో చర్చలు కూడా జరపవలసి ఉంది. అంతేకాక — ఈస్ట్ బాంద్రాలోని ప్రభుత్వ సంస్థతో కొన్ని అవుట్‌స్టాండింగ్ క్వరీలు క్లియర్ చేయాల్సి ఉంది.
అంచేత అతడు ముంబాయిలో వారం రోజులపాటు స్టే చేయాల్సి వచ్చింది — సంస్థ మేనేజర్ల తోడ్పాటు లేకుండానే — వ్యాపార అంతర్లోకాలకి చెందిన కొన్ని గుప్తమైన వ్యాపార వ్యవహారాలు అటువంటివి మరి — ఏసీ రూములో ఫైల్స్ పైన ఆదేశాలు జారీ చేస్తూ కుదురుగా కుర్చీలో ఆసీనుడయి అనాయాసంగా అవలోకిస్తూ గడపవలసిన విషయం కాదు కదా!
ఎళ్లప్పుడూ కాకపోయినా — అప్పుడప్పుడు కాళ్ళక్రింద బలపం కట్టుకుని పరుగులు తీయాల్సి కూడా ఉంటుంది కదా! జంకితే, తగ్గితే వ్యాపార ప్రపంచం కురుక్షేత్ర రణరంగంలా మారవచ్చు కూడా..
ఆ మాటకు వస్తే జీవిత రంగమే కాదు; పోటీలతో ఒరుసుకుపోతూ దూసుకుపోయే వ్యాపార ప్రపంచం కూడా ఒక విధమైన రణరంగమే కదా! క్లుప్తంగా సూచీ ముఖభావంతో చెప్పాలంటే — అదొక జటిల పథ సంకులం. సగటు మనిషి ఊహకు అంత త్వరగా అందని ఉద్వేగపూరిత అంతర్నాటకం — నిత్యనూతన జీవన సమరం.
తిరుగు ప్రయాణంలో పలు రకాల బిజినెస్ మీట్లతో ఉత్తేజితుడైన సుఖదేవ్ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దిగి తిన్నగా ఇంటికి వెళ్ళలేదు. అక్కడ పలు విధాల వ్యాపార చర్చల ద్వారా అతడు రీ-చార్జ్ అయి వచ్చాడన్న మాట. అంచేత అతడు సుగుణ్ ట్రేడర్స్ ఫంక్షనల్ కార్యాలయానికి దూసుకు వెళ్ళాడు.
తన ఛేంబర్ ప్రవేశ ద్వారం వద్ద అతణ్ణి చూసి చట్టున లేచి నిల్చుని అభివాదం చెప్పిన ఇద్దరు పి.యే.ల వైపు చూపు కూడా మరల్చకుండా తన రివాల్వింగ్ ఛైర్‌లో వెళ్ళి కూర్చున్నాడు. అతడి ముఖంలోని ఉద్విగ్న ఛాయల్ని గమనించిన సీనియర్ పి.యే. మాలిని వెంటనే నాగమునికి కబురందించింది.

బాస్ రాక గురించి కబురందుకున్న నాగముని ఒక నిమిషం కూడా కాలయాపనకు తావివ్వకుండా పరుగు వంటి నడకతో వచ్చి చేరాడు. నిజానికి బాస్ ఆంతరంగికుడైన బంధువైన అతడికి కూడా తెలియదు — సుఖదేవ్ వ్యాపార పర్యటన పూర్తి చేసిన తరవాత ఇంటికి వెళ్ళకుండా సేదతీర్చుకోకుండా తిన్నగా కార్యాలయ ప్రాంగణానికి చేరుకుంటాడని —
“లైఫ్ - బిజినెస్ లైఫ్ - జస్ట్ లైక్ దట్ ఓన్లీ” — సరైన రీతిన ప్రతిఫలించని ఇయర్లీ బ్యాలెన్స్ షీటు చాలా మంది వ్యాపార ప్రముఖులకు టెన్షన్ ఇస్తూనే ఉంటుంది. అప్పుడప్పుడు నిద్రలేని క్షణాలకు సహితం లోను చేస్తుంది. ఇది — వ్యాపార రంగపు అంతర్లోకాల గురించి, లోతైన దాని కోణాల గురించి తెలిసిన వారికే అవగతమవుతుంది.
లోపలకు వచ్చి ఆసీనుడు కాకముందే విస్మయం ప్రకటించబోయి తమాయించుకున్నాడు నాగముని — “అదేమిటి అబ్బాయీ — సారీ — బాస్ గారూ — ఇలా వేగవంతంగా ఇంటికి కూడా వెళ్ళకుండా వచ్చేసారట! ముఖ్యమైన లాంగ్ బిజినెస్ టూర్ చేసి వచ్చారు — సేదతీర్చుకుని రేపు రావచ్చుగా! ఇక్కడ మీకు సహకరించడానికి నాతో బాటు తదితర మేనేజర్లు, సూపర్‌వైజర్లు కూడా ఉన్నారుగా —”
ఆ మాట బాబాయి నోట విన్న సుఖదేవ్ తగ్గలేదు. తల అడ్డంగా ఆడిస్తూ కూర్చోమని సైగ చేస్తూ — షార్ప్‌గా అడిగాడు — “నేను మీకప్పగించిన పనేమైంది డిప్యూటీ మేనేజర్ గారూ! ఇప్పటి పరిస్థితిలో అదెంతటి ప్రాముఖ్యత గల రాచకార్యమో మీకు తెలుసు కదా!”
నాగముని వెంటనే బదులివ్వలేదు. మాలిని స్వయంగా తీసుకువచ్చిన నిమ్మరసం గ్లాసుల్ని అందుకుని ఆమె వైపు మెచ్చుకోలుగా చూసి — ఒక గ్లాస్ సుఖదేవ్ ముందుంచాడు. గ్లాసులోని నిమ్మరసాన్ని యథాలాపంగా చప్పరించిన సుఖదేవ్ నిదానంగా అడిగాడు — “ఇప్పుడు చెప్పండి నాగముని గారూ! ఇతర బ్రాంచీల మేనేజర్లను కూడా పిలవమంటారా చర్చల్లో పాలు పంచుకోవడానికి?”

“అవసరంలేదు సార్! ముందు నన్ను రవంత ఊపిరి తీసుకోనివ్వండి — ప్లీజ్!” అంటూ నిమ్మరసం తాగసాగాడు నాగముని.
అతడి ముఖాన నిదానం రవంత కూడా చెక్కు చెదరలేదు. అతడిలోని అనుభవసారం అతణ్ణి ఎప్పుడూ ప్రబోధిస్తూనే ఉంటుంది — “బాస్ ఈజ్ బాస్ — అండ్ బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్!”
నిమ్మరసం తాగడం పూర్తి చేసిన తరవాత నాగముని చెప్పసాగాడు — “మీరు టూరుపైన వెళ్ళిన తరవాత నాకు బోలెడంత తీరిక చిక్కింది. అంచేత — నేనా పనిలో ముమ్మరంగా పడ్డాను. పలు రకాల ఛానెల్స్ ద్వారా ముగ్గురిని లిస్టవుట్ చేశాను. అన్ని అంశాలూ నాకు అందుబాటులో ఉండవు కాబట్టి — నా అవగాహనకు అందవు కాబట్టి తోటి సీనియర్ మేనేజర్లతో కూడా సంప్రదించాను — ముఖ్యంగా టెక్నికాలిటీస్ విషయంలోనూ, క్యాండిడేట్స్ చదివిన అకాడమిక్, ప్రొఫెషనల్ కాలేజీల నేపథ్యం గురించి —”
అప్పుడు సుఖదేవ్ బాబాయిగారికి అడ్డువచ్చాడు — “ఇక్కడ మీకొకటి చెప్పాలనుకుంటున్నాను మిస్టర్ డిప్యూటీ మేనేజర్. నా ఎరుకలో చాలా మందికున్న యోగ్యతా పత్రాలకు అనుభవసారం ఉండదు. పేపర్ వాల్యూ మాత్రమే ఉండవచ్చు. ఆంతరంగికంగా డైనమిజమ్ ఉండదు పైపై కనిపించే డాంబికం తప్ప — ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే — ఇది కీలకమైన పోస్ట్ — మళ్ళీ మళ్ళీ ఆఫీసర్లను మార్చగల పోస్టు కాదు —”
“యు ఆర్ కరెక్ట్ సార్! హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ — ఇక నేను లిస్టవుట్ చేసిన ముగ్గురి పేర్లను మీ ముందుంచేదా సార్!”
“అలాగే — మరి ఇప్పటి ఇన్కంబెంట్ వినాయక రావు గారి విషయం ఏమి చేశారు? అగ్ని శేషం ఉండకూడదన్నది మీకు తెలుసు కదా మేనేజర్ గారూ!“
“అదెలా మరచిపోతాను సార్? మనం అనుకున్నదానికంటే సుహృద్భావంతో రావుగారికి హ్యాండ్‌షేక్ ఇవ్వబోతున్నాం.”
“అంటే — మనం అందివ్వబోయే ఎగ్జిట్-పే తో తృప్తి చెందాడన్నమాట వినాయక రావుగారు!”
నాగముని కాదన్నట్టు తల అడ్డంగా ఆడించాడు —
అది చూసి — “మరి?” అన్నట్టు కనుబొమలెగరేశాడు సుఖదేవ్ —
నాగముని కొనసాగించాడు — “వాళ్ళ ఫ్యామిలీకి కూడా బెనిఫిట్ ఇచ్చాం — ఎలాగంటే — వాళ్ళ పెద్దక్కయ్య వితంతువు. ఇద్దరు పిల్లలతో రావుగారితో ఉంటోంది. ఆమెగారి చదువుకి తగ్గట్టు రెండు మూడు చోట్ల పోస్టులు దొరికాయి గాని — అవి దూరప్రాంతాలలో ఉన్న సంస్థల్లో దొరికాయి.
కాబట్టి — రావుగారి కోరిక ప్రకారం ఇక్కడ మన సంస్థలో సీనియర్ గ్రేడ్ అసిస్టెంట్‌గా పోస్టు ఆఫర్ చేశాం. దానితో డీల్ పూర్తయింది. ఇక ఆయనకు వీడ్కోలు-కమ్-సన్మాన సభ ఏర్పాటు చేయడమే తరువాయి —”
“గుడ్ — ఇక మీరు లిస్టవుట్ చేసిన ముగ్గురు క్యాండిడేట్ల విషయానికి వద్దామా?”
“అలాగే సార్!” అంటూ ఏవో ఫైళ్ళు చేతబట్టుకుని నిల్చున్న ఇద్దరు పి.యే.ల వైపు చూశాడు నాగముని.
అతడి చూపుల్లోని సంజ్ఞను అర్థం చేసుకున్న మాలిని, రాగిణి — అలాగే అన్నట్టు తల పంకించి భవ్యంగా బయటకు కదిలారు. వాళ్ళిద్దరూ అలా నిష్క్రమించిన తరవాత ఫైలు నుండి లిస్టు విడదీసి సుఖదేవ్ ముందుంచాడతను.
లిస్టునీ, లిస్టుకి సంబంధిత వివరాలను అవలోకించాడు సుఖదేవ్. అవలోకిస్తూ వ్యాఖ్యానించాడతను — “ముగ్గురికీ చెప్పుకోతగ్గ విద్యార్హతలే ఉన్నాయి. ఇక వాళ్ళకున్న అనుభవం గురించే విశ్లేషించుకోవాలి.”
నాగముని వత్తాసు పలుకుతూ చెప్పాడు — “ఔను సార్ — వాళ్ళలో లేడీ క్యాండిడేట్ ఎన్.ఎస్.ఈ.లో ఇక్విటీ రీసెర్చ్ అండ్ వాల్యుయేషన్ కోర్సు చేశారు. అంతేకాక — క్షణాలలో మారే మార్కెట్ ట్రెండ్స్‌లో టెక్నికల్ అనాలిసిస్ కోర్సు కూడా పూర్తి చేశారు. కార్యాలయ నిర్వహణలో స్కిల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నారు. పేరు — మిస్ గీతా మాధురి.”
“ఆఫ్ కోర్స్ – నేను కాదనడంలేదు. కాని తతిమ్మా ఇద్దరు మేల్ క్యాండిడేట్లకు కూడా అటువంటి విద్యార్హతలేగా ఉన్నాయి. వీళ్ళ గురించి కూడా మీరు చెప్పాలి కదా బాబాయి గారూ!”
“ఎందుకు చెప్పను? చెప్తాను, చెప్తాను. ముందు గీతా మాధురి గారి గురించి చెప్పాలి. మనసా వాచా కర్మణా అంకిత భావం గల లేడీ క్యాండిడేట్ — సముచిత కుటుంబ నేపథ్యం గల స్త్రీ.”
నాగముని నోట మాధురి గురించి విన్న సుఖదేవ్ రవంత సేపు ఊరకుండిపోయాడు. ఎటో చూస్తూ ఉండిపోయి పెదవి విప్పాడు — “ఇలా అనుకుంటున్నానని — అంటున్నానని మరోలా అనుకోకండి బాబాయ్ — మీకు మొదటినుండీ స్త్రీల పట్ల ఓ విధమైన అబ్సెషన్ ఉన్నట్లుంది బాబాయ్. వాళ్ళకు మాత్రమే డెడికేషన్ ఉంటుందని — వాళ్ళకు మాత్రమే కుటుంబ విలువలు అధికంగా ఉంటాయని తలపోస్తున్నారు.
అది — మీ దృక్కోణం కావచ్చు. కాని — అందులో సంపూర్ణత ఉండకపోవచ్చు. ఎందుకంటే — పర్సనల్ వాల్యూస్ — కుటుంబ విలువలు మేల్స్‌కి కూడా ఉంటాయన్నది మీరు గుర్తించాలి. ఇప్పటి రోజుల్లో స్త్రీలు కూడా ఒకే విధమైన రఫ్ అండ్ షార్ప్ ఆటిట్యూడ్ చూపిస్తున్నారన్నది మనం గుర్తించాలి.
ఇప్పటి స్త్రీలందరూ మృదువైన పూమొగ్గలని భ్రమపడకండి. మనం నడుపుతున్నది సిద్ధుల ఆశ్రమం కాదని కూడా మనం గుర్తుంచుకోవాలి. కట్ థ్రోట్ పోటీ ప్రపంచమని మనం అనుదినం మననం చేసుకుంటూనే ఉండాలి. ఇక — సూటిగా అసలు విషయానికి వస్తున్నాను.
కుటుంబ నేపథ్యమూ — కుటుంబ విలువల గురించి ప్రస్తావిస్తున్నారు కావున అడుగుతున్నాను — అంతటి అంకిత భావమూ, కుటుంబ విలువలూ ఉన్న మిస్ గీతా మాధురి గారు ఇంకా ఎందుకు పెళ్ళి చేసుకోలేదు? ఆమెగారికున్న వయసు మరీ చిన్నవయసు కాదు కదా — ఇరవై ఏడేళ్ళకి పైమాటేగా —
ఈ కాలపు ఆధునిక యువతుల్లా ఆమె కూడా స్వేచ్ఛా ప్రియత్వాన్ని గాఢంగా కోరుకుంటుందనేగా —”
అప్పుడు నాగముని పెదవులపై హాసరేఖను తెచ్చిపెట్టుకుంటూ స్పందించాడు — “చూడబ్బాయీ! నువ్వు ఎమోషనల్ అయిపోయి నన్ను కూడా అదే కోవలోకి తీసుకురావడానికి పూనుకున్నట్టున్నావు. ఐనా పర్వాలేదు. నాకున్న అవగాహన మేర విశదీకరిస్తాను —
బ్రౌనీ పాయింట్స్ స్కోర్ చేయడానికి మాత్రం కాదు. నేనెప్పుడూ మగవారిలో ఫ్యామిలీ వాల్యూస్ ఉండవనో — లక్ష్య సాధన పట్ల అంకిత భావం ఉండదనో చెప్పలేదు. మానసిక స్థితిని బట్టి వాళ్ళకున్న సహజమైన సున్నిత మనోభావాల వల్ల స్త్రీలు టార్గెట్ పట్ల ఒక ఇంచుక ఎక్కువ అంకిత భావం చూపిస్తుంటారు.
ఇక రెండవ పాయింట్‌కి వస్తే — ఔను — నేను ఒప్పుకుంటాను — ఇప్పటి స్త్రీలు వేగంగా, డేషింగ్‌గా మారుతున్నారు. కొందరేమో క్రైమ్ చార్ట్‌లో సహితం మగాళ్ళకు సమానంగా పాలు పంచుకుంటున్నారు కూడాను — కాని — ఒక్కటి మాత్రం ఎప్పటికీ మారదు. వాళ్ళ మనోభావంలోని మృదుత్వం.
వివాహ వ్యవస్థకు అతీతంగా వాళ్ళలో ఆకులందు అణగి మణగి ఉన్న కోయిలలా వాళ్ళ మనోరాగంలో దాగి ఉన్న మాతృత్వం. ఇక — ఆఖరి పాయింట్‌కి వస్తున్నాను. గీతా మాధురిగారు ఇంకా ఎందుకు పెళ్ళి చేసుకోలేదన్న అంశమే మిగిలి ఉన్నది —
దీనికి కారణం కూడా ఉన్నది — వాళ్ళ తండ్రి గారు ఆ పిల్లకు పదేళ్ళ వయసులో ట్రైను యాక్సిడెంట్‌లో పోయాడు. ఆమె తల్లితో బాటు పెదతల్లీ, చినతల్లీ కూడా మాధురి గారి తండ్రిని నమ్మి ఉన్నారు. ఇద్దరూ వైధవ్యం ప్రాప్తించిన వారే — పెదతల్లిగారికి ఒక కొడుకు — ఒక కూతురు, చినతల్లేమో పిల్లలు లేని వితంతువు.
ఈమెగారే — అంటే గీతా మాధురి గారే పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ ఈవినింగ్ కాలేజీలో చదువు సాగిస్తూ ఇంతవరకూ నెట్టుకు వచ్చారు. ఎనీహౌ — పాత నానుడినే పాటిస్తాను. బాస్ ఈజ్ బాస్ — అండ్ బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ — మాధురి గారి ప్రొఫైల్‌ని పక్కన పెట్టేసేదా?”
“వద్దు. ఓసారి ఇంటికి వెళ్ళి మీ వదినెగారితో మాట్లాడతాను.”
“ఇట్ ఈజ్ ఓకే — డబుల్ ఓకే! ఇక్కడే ఇప్పుడే చెప్పగలను — గీతా మాధురి మీ పర్సనల్ వింగ్‌కి, బిజినెస్ అడ్వాన్స్‌మెంట్‌కీ అసెట్‌గా ఉంటుందని. యూ కెన్ టేక్ ఇట్ ఫ్రమ్ మీ —”
“విషయం ఇంకా ఒక కొలిక్కి రానప్పుడు మీరు దానిని నాపైన రుద్దడానికి ప్రయత్నించకూడదు బాబాయీ! చెప్తున్నాగా మీ వదినెగారితో మాట్లాడతానని —”
“ఓకే ఓకే — ఇప్పుడు మనం మరొక విషయం వైపు చూపు మరల్చుదాం — ప్రణవిని మన కంపెనీ మేనేజ్‌మెంట్ లైనులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు ప్రారంభించావా!”
“అది అంత త్వరగా లైనులోకి వచ్చేటట్లు లేదు బాబాయి! మొన్న చూసిన రోడ్డు యాక్సిడెంట్ వల్ల ప్రణవి అలజడికి లోనయినట్లుంది. కచ్చితంగా పరిస్థితి ఒక కొలిక్కి రావడానికి కొన్ని రోజులైనా పడుతుంది” అని మొన్న అతడూ ప్రణవీ బైకు పైన తిరుగు ప్రయాణం చేస్తున్నప్పుడు షాక్ తినేలా చూసిన హృదయవిదారక దృశ్యాన్ని వివరించి చెప్పాడు సుఖదేవ్.
అంతా విన్న నాగముని తను ఓ రోజు సమయం చూసి ఇంటికి వచ్చి ప్రణవిని కలుస్తానని చెప్పి అభ్యర్థుల ప్రొఫైల్స్ ఫైలుని అందించి బయటకు నడిచాడు. అతడు వెళ్ళిపోయిన తరవాత సుఖ్‌దేవ్ కూడా బల్లపైనున్న మంచి నీళ్ళ గ్లాసు ఖాళీ చేసి ఫైలుని బ్రీఫ్‌కేసులో పెట్టుకుని బయటకు నడిచాడు.
అతడి కదలికను గమనించి లేచి నిల్చున్న పి.యే.లను చూసి ఆగి అన్నాడతను — “డోంట్ థింక్ అదర్‌వైజ్ — నేను సరసరా వస్తున్నప్పుడు మీరు లేచి చేసిన అభివాదాన్ని గమనించకుండానే లోపలకు వెళ్ళిపోయాను. మేటర్ ఆఫ్ మెంటల్ టెన్షన్. అంతే — గుడ్ ఈవినింగ్!” అంటూ ఎదురొచ్చి ఫైళ్ళను అందుకోవడానికి చేయి చాపిన లేడీ మెసెంజర్‌కి అవసరం లేదని సంకేతమిస్తూ సాగిపోయాడు.

ఇల్లు చేరిన వెంటనే సుఖదేవ్ కళ్ళు భార్య కోసం వెతికాయి. అప్పుడప్పుడే పిల్లలచేత హోమ్‌వర్క్ పూర్తి చేయించి మేడ మెట్లు దిగి వస్తున్న ప్రణవిని ఓపారి తదేకంగా చూశాడు. లేత పచ్చరంగు చీరలో సురమోదంలో ఉన్న గాంధర్వ స్త్రీలా కనిపించింది.
చేతిలోని బ్రీఫ్‌కేసును సోఫాలోకి గిరటేసి — “హేయ్! మై లవ్లీ డార్లింగ్ — హౌ డు యూ ఫీల్ నౌ? ఇంకా అదే శోకతప్త మూడ్‌లో ఉన్నావేమోననుకుని భయపడి చచ్చాననుకో!”
ఆమె సరాసరి మెట్లు దిగి వస్తూ అంది — “అదేమిటి — ఎప్పుడూ లేనిది టూరు ముగించుకుని ఇంటికి రాకుండా కనీసం కబురు కూడా పెట్టకుండా డ్యూటీ పాయింట్‌కి గరుడ పక్షిలా ఎగిరిపోయారు. నా పైన ఇంకా కోపం తగ్గలేదా!”
అతడా ప్రశ్నను అనాయాసంగా కొట్టిపారేస్తూ — “అటువంటిదేమీ లేదోయ్!” అంటూ ఆమె రెండు చేతుల్నీ అందుకోబోయాడు.
కాని — అతడి ఫ్రెండ్లీ గెస్టర్‌ని ఆమె స్వీకరించలేదు. చేతుల్ని వెనక్కి తీసుకుంది. కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ అంది — “ఇది బ్రతుకు బాట. బంతాట మైదానం కాదు. కుటుంబంలో శీషభిషలు చోటు చేసుకుంటూనే ఉంటాయి ఏదో ఒక రూపంలో — అంత మాత్రం చేత ఇలాగా రుద్రతాండవం చూపిస్తారా!
నేను ముందే ఒకసారి చెప్పాను — మీరీ మధ్య విదేశీ టూర్లకు వెళ్ళి వచ్చిన తరవాత మారిపోతున్నారని అన్నదానికి ఇలాగా రుద్రతాండవం చేస్తారా — నేను మీ పెళ్ళాన్ని — మీ ప్రియరాలిని కాను. గుండెలో కదలిక లేని రోబోని అంతకంటే కాను.
అనుక్షణం కాకపోయినా అనుదినం మీ కోసం ఎదురు చూస్తుంటానన్నది మరచిపోకండి. మీ అభిప్రాయాలకన్నిటికీ తందనాతానా అని మేం తాళం వేస్తుంటామని ఎదురు చూడకండి — మాకూ కొన్ని స్వంత అభిప్రాయాలూ, స్వంత అభిరుచులూ ఉంటాయన్నది విస్మరించకండి —”
ఈసారి అతడు కౌగిలిలోని పట్టుని బిగియార ఉపయోగించి ఆమెను వెనక్కి జరగనీయకుండా ఫోర్స్‌తో పెనవేసుకుని చుట్టుపక్కల ఎవరి అలికిడీ లేదని గ్రహించి ప్రణవిని మోహపూరితంగా ప్యాషనేట్‌గా ముద్దుపెట్టుకున్నాడు.
“సారీ! బిజినెస్ టూరులో సంభవించిన కొన్ని సంఘటనలను, వాడివేడిగా సాగిన కొన్ని చర్చలను మననం చేసుకుంటూ అర్జెంట్ వ్యవహారం పూర్తిచేయడానికి అక్కణ్ణించి అలా కంపెనీ కార్యాలయానికి సాగిపోయాను. నథింగ్ మోర్ అండ్ నథింగ్ లెస్ —” అంటూ ఆమెను సోఫా వద్దకు తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు.
ఈసారామె వెనక్కి తగ్గలేదు. భర్త చెంత కరిగిపోతూ పెనవేసుకుంది. ఆమెను మరింత దగ్గరగా లాక్కుంటూ గుండెల పైన ముద్దుల వర్షం కురిపిస్తూ అన్నాడు — “వారం రోజుల ఎడబాటు వల్లనో లేక నేను లేనన్న విరహం వల్లనో నువ్విప్పుడు ఎంత కళగా, మరెంత ఫ్రెష్‌గా కనిపిస్తున్నావో తెలుసా! థ్యాంక్ గాడ్ — ఎట్టకేలకు నువ్వా హైరోడ్డు యాక్సిడెంట్ ప్రభావం నుండి బయటపడ్డావు —”
ఆ మాట విని ఆమె అభావంగా చూస్తూ తల అడ్డంగా ఆడించింది. అంటే? — అన్నట్టు షార్ప్‌గా ప్రశ్నార్థకంగా చూశాడతను —
అప్పుడామె నోరు తెరిచింది — “నేనిలా చెప్తున్నానని డిస్టర్బ్ అవకండి. రోడ్డు ఓరన పడిపోయి రక్తసిక్తమైన శరీరంతో వణకుతూ మన కళ్ళ ముందు మరణించిన ఆ వివాహిత స్త్రీ నాకు కలలో కనిపించింది. మీరు ముంబాయి వెళ్ళిపోయిన ఈ వారం రోజుల్లో ఆమె నాకు రెండు సార్లు కలలో కనిపించింది. నాకు నిద్రలేకుండా చేసింది.”
=================================
ఇంకా ఉంది
వ్యాపార ప్రపంచం – పార్ట్ 7
త్వరలో మీ ముందుకు వస్తుంది.
=================================
పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.
మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.
పాండ్రంకి సుబ్రమణి గారి కొన్ని ఇతర రచనలు:
పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పాండ్రంకి సుబ్రమణి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

1) పేరు-పాండ్రంకి సుబ్రమణి
2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య
3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ
4)స్వస్థలం-విజయనగరం
5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు
6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.

a











Comments