వ్యాపార ప్రపంచం – పార్ట్ 5
- Pandranki Subramani

- 22 hours ago
- 6 min read

Vyapara Prapancham – Part 5 | Telugu Emotional Inspirational Serial | Pandranki Subramani
వ్యాపార ప్రపంచం – పార్ట్ 5 | తెలుగు భావోద్వేగ ప్రేరణాత్మక ధారావాహిక| పాండ్రంకి సుబ్రమణి | ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత
Published in manatelugukathalu.com on 05/09/2026
వ్యాపార ప్రపంచం – పార్ట్ 5లో సుఖదేవ్–ప్రణవి వీకెండ్ ప్రయాణం ఊహించని విషాద సంఘటనతో ఒక్కసారిగా మారిపోతుంది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ వివాహిత.. తన కవితకు తృతీయ బహుమతి వచ్చిన వార్త ఆమె వ్యక్తిత్వంలోని మరో కోణాన్ని వెలుగులోకి తెస్తుంది.
వ్యాపార ప్రపంచం జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
జరిగిన కథ: కుటుంబ ప్రేమతో రోజును ప్రారంభించిన సుఖదేవ్, కార్యాలయంలో మాత్రం కఠినమైన వ్యాపార నిర్ణయాల ముందుంటాడు. స్త్రీలను కేవలం లింగం ఆధారంగా పక్కన పెట్టడం సరైన నిర్ణయం కాదని నాగముని సుఖదేవ్‌కు వివరిస్తాడు. సీనియర్ సూపర్‌వైజర్ దీనదయాళ్ భానుప్రసాద్ ను క్యాంటీన్‌కు తీసుకెళ్లి ఉద్యోగ బాధ్యతలు, పై అధికారులతో వ్యవహరించే పద్ధతి, టీమ్‌వర్క్, సహోద్యోగులతో స్నేహపూర్వకంగా మెలగడం వంటి విషయాలపై హితబోధ చేస్తాడు. మాలిని పట్ల ఎలాంటి ఆసక్తి లేని సుఖదేవ్ తన భార్య ప్రణవిపైనే తన ప్రేమ, అనుబంధం ఉన్నాయని స్పష్టంగా భావిస్తాడు.
వ్యాపార ప్రపంచం గత ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇక వ్యాపార ప్రపంచం - పార్ట్ 5 చదవండి
వాళ్ళలా తేటదనం నిండిన ముఖాలతో బైక్ పైన ప్రయాణించిన ఓ గంట తర్వాత అనుకోని విధంగా ఒక హృదయ విదారక దృశ్యం ఎదురైంది. రోడ్డు బ్యారికేడ్ కి అవతల ఒక గుంపు గుమికూడటం గమనించి సుఖదేవ్ బైక్ దిగాడు—భార్యతో సహా!
ఆ దృశ్యం చూసి ఇద్దరికీ గుండె గుభేలుమంది. ఒక వివాహిత శరీరమంతా రక్తసిక్తమై పడి ఉంది. ఆమె ప్రక్కన రెండేళ్ళ పాప పడి ఉంది, గుక్క తిప్పుకోకుండా ఏడుస్తూ.
ప్రణవి "ఏమైంది?" అని అడుగుతూనే, చేతిలోని వాటర్ బాటిల్‌తో క్షతగాత్రురాలైన స్త్రీ వద్దకు పరుగు వంటి నడకతో దూసుకువెళ్ళి, ఆమెకు నీళ్ళు తాగిపించింది.
కానీ, ఆ దెబ్బ తిన్న స్త్రీ చుక్కంత నీళ్ళు మాత్రం తాగి, తదేకంగా చూస్తూనే ప్రాణాలు విడిచింది. ఆమె ప్రాణాలు విడిచేటప్పుడు పాప చేతిపైన తన చేతిని ఉంచుకుని కళ్ళు మూసింది. ప్రణవికి దుఃఖం పొంగుకొచ్చింది. తల తిరిగినట్లనిపించి ప్రక్కకు ఒరిగిపోయింది.
సుఖదేవ్ సమయానికి భార్యను అక్కున చేర్చుకుని, ముఖాన నీళ్ళు చల్లి, చప్టాపైన కూర్చోబెట్టాడు. ఆ లోపల అంబులెన్స్ వచ్చి చనిపోయిన ఆమెనూ, ప్రక్కన పడి ఉన్న ఆమె భర్తనూ, పిల్లనూ తీసుకెళ్ళిపోయింది. రంయ్ రంయ్ మని సైరన్ మోతతో వెళ్ళిపోతున్న అంబులెన్స్ బండిని గమనించ గలుగుతుందే గానీ ప్రణవి లేవలేకపోయింది. పెదవి విప్పలేకపోయింది.
అక్కడ గుంపుగా చెప్పుకుంటున్న మాటల్ని బట్టి సూచాయిగా గ్రహించిందామె; చనిపోయిన ఆమె భర్త స్కూటర్ తోలుతూ, స్పీడ్ బ్రేకర్ ని గమనించకుండా, వేగంగా, ర్యాష్‌గా రావడం వల్ల ఆ ఘోర ప్రమాదం జరిగిందని.. దాని వల్ల తల బ్రద్దలయి భార్య ప్రాణాలు పోగొట్టుకుందని.. కూతురు కూడా దెబ్బల పాలయిందని.
“స్పీడ్ నాట్ ఓన్లీ థ్రిల్స్—స్పీడ్ ఆల్సో కిల్స్!” అన్న ట్రాఫిక్ సూత్రాన్ని వాహన చోదకులు ఎప్పుడు గుర్తిస్తారో కదా!
ఇద్దరూ ఆ మానసిక సంక్షోభం నుండి తేరుకోవటానికి ప్రయత్నిస్తూ ఇల్లు చేరుకుని, బైక్ ని బయట ఆవరణలో పార్క్ చేసి, లోపలికి వచ్చేటప్పటికి రాములమ్మ వాళ్ళకెదురు వచ్చి మంచినీళ్ళ గ్లాసులు అందించింది. “థాంక్స్” అంటూ వాటిని అందుకున్న సుఖదేవ్, తన గ్లాసు నీళ్ళు తాగుతూనే మేడ మెట్ల వైపు నడిచాడు.
అప్పుడు తల్లి వనజమ్మ గొంతు హాలు నుంచి వినిపించింది. అతడు చప్పున వెనక్కి తిరిగి చూశాడు, ఎందుకు పిలిచావన్నట్టుగా. “హాలులో మేమిక్కడ కూర్చున్నామన్నది మొగుడూ పెళ్ళాలూ గమనించారా లేదా!”
అతడు సమయస్ఫూర్తితో బదులిచ్చాడు- “చెమట పట్టిన దుస్తులు మార్చుకుని రావాలనుకుంటున్నానమ్మా! అందుకే అలా వేగంగా..”
పెద్దరికంతో మగ్గిన వనజమ్మ, కొడుకు జవాబుతో తృప్తి చెందినట్లు కనిపించలేదు. అలసి వాడిపోయిన ముఖంతో, ఒరిగిన మొక్కలా నిల్చున్న కోడలి వైపు చూపులు సారిస్తూ నడచి వచ్చిందామె- “అదేమిటమ్మా, అంతలావు బెంబేలు పడిపోతూ నిల్చున్నావు! దారిలో ఏదో జరిగినట్లుంది.
ఎప్పుడు బయటకెళ్ళివచ్చినా నాకేదైనా ప్రసాదమో- కొబ్బరి ముక్కో ఇవ్వకుండా, నన్ను పలకరించకుండా వెళ్ళవు కదా! మరి—ఈ రోజు అలా చప్పుడు లేకుండా జారుకుంటున్నావేమిటి? ఏదైనా జరిగిందా? ఆలయ దర్శనమేదీ చేయలేదా! మరొకసారి మీవాడు స్వింగింగ్ స్పీడ్ అంటూ నిన్నెక్కడైనా కుదేలులా పడవేసాడా!”
ఆ మాటతో ప్రణవి జెర్కింగ్ కి లోనయింది; వేగంగా స్పందించింది- “నో, నో! అటువంటిదేమీ జరగలేదు అత్తయ్యా! దూరప్రయాణం కదా- కాస్తంత అలసటగా ఉంటేనూ—“
“అలాగా! మరి దారిలో ఎక్కడా గుడి దర్శనం చేసుకోలేదా లేక ఆలయమే ఎదురవలేదా?”
దానికి ప్రణవి వెంటనే బదులివ్వలేదు. క్షణం పాటు తేరిపార చూసి మనసున అనుకుంది- “తమ ముద్దుల కొడుకు నన్నెక్కడికైనా వెళ్ళనిస్తేనేగా! విప్పిన చీరను కుదురుగా కట్టుకోనిస్తేనేగా!” అలా అనుకుంటూ బదులు కోసం వెతికేలోపల సుఖదేవ్ భార్య రక్షణకు వచ్చాడు; తల్లి వైపు చూస్తూ బదులిచ్చాడు-
“ప్రణవి గుడికి వెళ్దామనే అంది అమ్మా! నేనే నా స్కూలు మేట్ ఇంటికి వెళ్ళి టైమ్ స్పెండ్ చేశాను. అరగంట సేపు అలాగే కూర్చో..ఇద్దరమూ ఫ్రెషప్ అయి వస్తాము—“ అంటూ ప్రణవి వైపు తిరిగి.. ఇక తనతో పైకి కదలమని చూపుతో సైగ చేసి, సర్రున అక్కణ్ణించి కదలడానికి సంసిద్ధుడయ్యాడు.
అప్పుడక్కడకు విద్యాభవాని చేరింది. “నాకెందుకో మీరిద్దరూ నార్మల్ గా ఉన్నట్టు తోచడం లేదురా సోదరా! వదిన వదనం చూస్తుంటే ఎక్కడో ఏదో జరిగినట్లే అనిపిస్తుంది. మీ పెళ్ళి కొత్తలో మీరిద్దరూ బైక్ పైన వెళ్తున్నప్పుడు జరిగినట్లు ఇప్పుడు మరొకసారి జరగకపోతే సరి!
వెళ్ళేటప్పుడో వచ్చేటప్పుడో దారిలో ఏదైనా జరిగితే మాత్రం దాపరికం లేకుండా వదినెను చెకప్ కోసం క్లినిక్ తీసుకెళితే సర్వదా క్షేమదాయకం” నొసలు చిట్లిస్తూ అందామె.
సుఖదేవ్ చెల్లిని వెంటనే కట్ చేశాడు- “అటువంటిదేమీ లేదే కొంటె కోణంగి దానా! ఏదైనా జరిగి ఉంటే మీకు ఫోన్ చేసి చెప్పమూ! ముందు మీ వదినెకు దారి చూపు—“ అంటూ ప్రణవి చేయి పట్టుకుని లాగాడు.
ఆమెకు కూడా ఆడపడుచుని చూసిన తోడనే ఉషారు కలిగినట్లుంది. వెళ్తూ వెళ్తూ భవాని నెత్తిపైన చిన్నపాటి మొట్టికాయ పెట్టింది; ‘నీ పెళ్ళికి సర్వ కార్యాలలో సంపూర్ణ పెద్దరికం వహించబోయేది నేనే సుమా’ అన్న సరస పూర్వక సంకేతం ఇస్తూ!
ఇద్దరూ మలిస్నానం చేసి పొడి బట్టలు మార్చుకుని పడక గది బెడ్ పైన సుఖాసీనులైన తర్వాత, సుఖదేవ్ భార్యను మెత్తగా, తెలిసీ తెలియని విధంగా చీవాట్లు పెట్టాడు- “చూడు ప్రణవీ! నువ్వు బేసికల్లీ వ్యాపార కుటుంబానికి చెందిన స్త్రీవి.
విజయనగరం రాజావారి వీధిలో ఉన్నట్టు— వీధి చుట్టూ పరచుకున్న గుళ్ళలో ప్రదక్షిణలు చేస్తున్నట్టు కాలం గడిపేయాలని తలపోస్తే కుదరదు. టఫ్ టెంపర్మెంట్ ని అలవర్చుకోవాలి. క్రమక్రమంగా నాతో కలసి బిజినెస్ ఫీల్డుతో మమేకం కావాలి.
చూడు చిన్న సంఘటనకు ఎలా ఎండుటాకులా అల్లాడిపోయావో— అందరి ముందూ ఎలా పుటుక్కున తేలిపోయావో!”

ఆమె వెంటనే స్పందించింది, జుత్తుకి అల్లుకున్న చిక్కుముడిని దువ్వెనతో ఊడదీస్తూ- “అది చిన్న సంఘటనా! కన్నబిడ్డ ప్రక్కన చతికిలబడి గుక్క తిప్పుకోకుండా ఏడుస్తుంటే, దగ్గరకు తీసుకోలేక పాప చేతిని మాత్రం పట్టుకుని శూన్యంలోకి చూస్తూ క్షతగాత్రురాలైన ఒక స్త్రీ ప్రాణాలు విడవడం మామూలు విషయమా?”
“సరే! అది మామూలు విషయం కాదనుకో; దానికి మనమేమి చేయగలం? నెత్తీ నోరూ బాదుకుని అక్కడే కూర్చుండిపోతామా!”
“నేనలా చేయాలని చెప్పడం లేదు. హృదయ విదారకమైన ఆ సంఘటన వల్ల ఏర్పడ్డ ప్రభావం నుండి అంత త్వరగా విడివడటం అందరికీ సాధ్యం కాదంటున్నాను—అంతే!”
ఆ మాటకతడు పెడీల్మని స్పందించాడు- “కాదూ కూడదనకుండా సుసాధ్యం చేసుకోవాలంటున్నాను ప్రణవీ! కాలం ఆగిపోయే ప్రపంచాన్ని ఖాతరు చేయదు. గుర్తుంచుకో..“
అప్పుడామె భర్తకు ప్రత్యుత్తరం ఇవ్వాలనుకుంటున్నప్పుడు తలుపు చప్పుడు వినిపించి ఆగిపోయింది. అక్కడ రాములమ్మ నిల్చుంది- “వంటా వార్పూ పూర్తయి డైనింగ్ టేబుల్ పైన భోజనాలు సిద్ధంగా ఉన్నాయి. పిల్లలిద్దరూ బామ్మగారి ప్రక్కన కూర్చుని కబుర్లాడుతూ కూర్చున్నారు. వస్తారా అమ్మాగారూ!”
ప్రణవి బుర్ర ఊపి రాములమ్మను పంపించేసింది. ఆమె వెళ్ళిపోయిన తర్వాత షర్టుకి గుండీలు వేసుకుంటూ బయటకు కదలబోయాడు సుఖదేవ్.
అప్పుడామె చేతులు రెండూ బారుగా చాచి అతణ్ణి ఆపింది- “మీతో ఒక మాట చెప్పాలి” అంటూ—
“ఉఁ” అన్నాడతను.
ఆమె చెప్పసాగింది- “మీరు వృత్తి రీత్యా బిజినెస్ మ్యాన్ అని తెలుసు. ఉపాధి రీత్యా బిజీ మ్యాన్ అని కూడా తెలుసు. మీది సంపూర్ణ వ్యాపార ప్రపంచమని కూడా తెలుసు. వ్యాపార సరస్సులో ఎల్లవేళలా ఈదుతూ ఉంటారని కూడా తెలుసు. అదే సమయాన మీరు స్త్రీగా, ఇంటి ఇల్లాలుగా నా గురించి కూడా తెలుసుకోవలసి ఉంది”
అంటే— అన్నట్టు కనురెప్పలల్లార్చి చూశాడు సుఖదేవ్.
ఆమె మళ్ళీ చెప్పసాగింది- “నాకంటూ ఒక మనోభావం ఉంటుంది. నాకంటూ ఒక ఎమోషనల్ టెంపర్మెంట్ ఉంటుంది. ఆ రీతిన చూస్తే— అందరికీ గుండెలుంటాయి. అందరి గుండెల్లోనూ తడి ఉంటుంది. ఒక వివాహితగా, ఇద్దరు బిడ్డల తల్లిగా నా గుండెల్లో తడి రవంత ఎక్కువగానే ఉంటుందేమో! కాస్తంత ఆలోచించి చూడండి—“
ఈసారతడు వెంటనే స్పందించలేదు. దవడ బిగించి ఆమె జబ్బను చప్పున తన వైపు లాక్కున్నాడు. పదునగు చూపులతో అన్నాడు- “నువ్వు చెప్పడం నేను విన్నాను. ఇప్పుడు నేను చెప్పబోయేది నువ్వు వినాలి.. నీకిష్టమున్నా లేకపోయినా నువ్వు కంపెనీ బిజినెస్ మెయిన్ స్ట్రీమ్ లో భాగం కావాలి. భాగం మాత్రమే కాదు, కంపెనీ దైనందిన వ్యవహార శైలితో వాచా కర్మణ: మమేకం కావాలి.”
“ఇప్పుడే చేరాలా?”
“నేనలా అనలేదు. నేను అనని మాటను నా నోట బిగించకు— నువ్విప్పుడు ఎదుర్కొంటున్న బ్లూస్ నుండి బయటపడ్డ తర్వాత— మానసికంగా కుదుటపడ్డ తర్వాతనే— ఇక, క్రిందకు నడు!
ముఖాన సీరియస్ నెస్ తగ్గించుకుని నడు.. పిల్లలిద్దరూ మన కోసం డైనింగ్ టేబుల్ వద్ద ఎదురు చూస్తున్నట్టున్నారు!”
ప్రణవి నోరు మెదపకుండా చీర చెంగుతో ముఖం తుడుచుకుని మేడ మెట్లు దిగింది. కోడల్ని అల్లంత దూరాన చూసిన వెంటనే వనజమ్మ గొంతుక విప్పింది- “అంతసేపు గదిలో ఏమి చేస్తున్నారమ్మా! చూడు పిల్లలిద్దరూ ఎలా బేలగా చూస్తూ కూర్చున్నారో—“
“మీరుండగా ఆ రెండు జల్లపిల్లలూ బేలగా ఎప్పుడూ ఫీలవ్వరత్తయ్యా! నా ఉనికి లేనప్పుడల్లా వీళ్ళకు పొద్దుపోయేది మీతోనూ, వాళ్ళ అత్తయ్యతోనే కదా!” అంటూ కొడుకునీ కూతుర్నీ దగ్గరకు తీసుకుని ప్రక్కన కూర్చోబెట్టుకుంది ప్రణవి.
ఆమె కూర్చున్న వెంటనే వనజమ్మ “నీ కోసం ఉత్తరం వచ్చి గంటకు పైగా అవుతోంది” అని ఓ పోస్టల్ కవర్ చాచింది.
దానిని అందుకోబోయిన సుఖదేవ్ ని వారించిందామె..”ఇది నీకు కాదురా అబ్బాయీ! మీ ఆవిడకు వచ్చిన ఉత్తరం!”
అనేటప్పటికి ప్రణవి ఆశ్చర్యంగా చూస్తూ దానిని అందుకుని చాకుతో విప్పి చూసి ఆనందంతో లేచి వచ్చి అత్తయ్యను వాటేసుకుంది. వాటేసుకుంటూ అంది- “ఇది మామూలు ఉత్తరం కాదత్తయ్యా! కవితల పోటీ ఫలితాలు, నేను రాసిన కవితను ప్రచురణకు స్వీకరించడమే కాక, బహుమతి కూడా ప్రకటించారు”

అది విని పప్పుతో అన్నం కలుపుకుంటున్నవాడల్లా ఆగి స్పందించాడు సుఖదేవ్- “బహుమతా! ఫస్టా లేక సెకెండా?”
“తృతీయ బహుమతి”
భార్య నోట ఆమాట విని” అలాగా!”-అంటూ పప్పన్నంతో పాటు విరిచిన అప్పళం నోట్లో పెట్టుకుంటూ కవిత పేరు అడిగాడు- ప్రచురితం కాబోతున్న కవిత గురించి ఆత్మానందం పొందుతూ చెప్పిందామె- “స్త్రీగా నేనూ— పురుషుడిగా నువ్వూ—“
అప్పుడతను చిన్నగా నవ్వుతూ స్పందించాడు-
“ఈ మధ్య చాలా మంది స్త్రీ రచయిత్రులకు, కవయిత్రులకు మగాళ్ళను ఏదో ఒక సాకున దెప్పిపొడవడం బాగా అలవాటయినట్లుంది”
“అదెలాగండీ— కవితను చదవకుండానే ఊహాత్మక విమర్శ చేస్తున్నారు!”
“నేను కట్టుకున్న భార్యామణి ఊహాగానాలు ఎలా పరిఢవిల్లుతుంటాయో చెప్పలేనా?”
అప్పుడు వనజమ్మ కలుగచేసుకుంది- “నువ్వూరుకోరా సుఖదేవా! అంతమంది రచయితలూ రచయిత్రుల మధ్య నిటారుగా పాల్గొని నెగ్గుకు రావడం అంటే మాటలా? మెచ్చుకోకపోతే పోయె— ఆ పిల్ల ఆత్మానందాన్ని తక్కువ చేస్తే ఎలా!
నువ్వేదో చిరాకు మూడ్ లో ఉన్నట్లున్నావు. ఈరోజు రాత్రి ప్రణవి పిల్లలతో గదిలో పడుకుంటుంది. నువ్వేమో నా గదిలో పడుకో— నాకు కంపెనీ ఫైనల్ బ్యాలెన్స్ షీటు వివరాలు ఒకటి తర్వాత ఒకటిగా చెప్తూ, తెలియనివి ఓపిక తెచ్చుకుని విశదీకరిస్తూ నిద్రలోకి జారుకో— ప్రణవి జోలికి రెండ్రోజులు వెళ్ళకు— వెళ్ళేటప్పుడో వచ్చేటప్పుడో మీ ఇద్దరి మధ్యా ఏదో జరిగి ఉంటుంది. ఈ మాట నేనే కాదు- మీ చెల్లి కూడా అంటూంది!”
అప్పుడు ప్రణవి భర్త తరపున వకాల్తా పుచ్చుకుంది- ”పర్వాలేదు అత్తయ్యా! మీ అబ్బాయి మాతోనే పడుకుంటాడు. నేనేమో పిల్లలకు హోమ్ వర్క్ గైడ్ చేస్తూ జానపద కథలు చెప్తూ నిద్రపుచ్చుతాను. నచ్చని విషయాలు, మనసుకి పడని సంగతులు వింటే ఆయనకు అలా పెడ ముఖం పెట్టుకోవడం అలవాటేగా!”
దానికతడు మెత్తబడలేదు సరికదా- పెడీల్మని బదులిచ్చి కంచాన్ని కదలించి లేచాడు- “అవసరం లేదు. కొన్ని బిజినెస్ విషయాలు అమ్మకు చెప్పాల్సి ఉంది. అమ్మ అభిప్రాయాలు కూడా తెలుసుకోవలసి ఉంది. ఈరోజు నేను అమ్మతోనే ఉంటాను. రేపు నాకు అర్జంట్ పని కూడా ఉంది. అడ్డు చెప్పకు!”
ప్రణవి మరేమీ అనకుండా ఊరకుండిపోయింది. రాఘవ్ కంచంలో మిగిలిన అన్నపు పెళ్ళను ముద్దలు చేస్తూ వాడి నోటికి అందిస్తూ ఉండిపోయింది. ఎందుకో భర్త తనపైన కినుక వహించాడన్నది ఊహించుకుంటూ అందరికీ ఎడంగా ఉండిపోయింది.
=================================
ఇంకా ఉంది
వ్యాపార ప్రపంచం – పార్ట్ 6
త్వరలో మీ ముందుకు వస్తుంది.
=================================
పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.
మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.
పాండ్రంకి సుబ్రమణి గారి కొన్ని ఇతర రచనలు:
పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పాండ్రంకి సుబ్రమణి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

1) పేరు-పాండ్రంకి సుబ్రమణి
2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య
3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ
4)స్వస్థలం-విజయనగరం
5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు
6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.

a











Comments