వ్యాపార ప్రపంచం – పార్ట్ 4
- Pandranki Subramani

- 30 minutes ago
- 8 min read

Vyapara Prapancham – Part 4 | Telugu Emotional Inspirational Serial | Pandranki Subramani
వ్యాపార ప్రపంచం – పార్ట్ 4 | తెలుగు భావోద్వేగ ప్రేరణాత్మక ధారావాహిక| పాండ్రంకి సుబ్రమణి | ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత
Published in manatelugukathalu.com on 26/08/2026
వ్యాపార ప్రపంచం – పార్ట్ 4లో సుగుణ్ ట్రేడర్స్ సీఈఓ సుఖదేవ్ ఒక ప్రత్యేకమైన వీకెండ్ మూడ్‌లో కనిపిస్తాడు. అత్యవసరమైన వ్యాపార ఫైళ్లను క్లియర్ చేసి ఇంటికి బయల్దేరే సమయంలో అతని సీనియర్ పీఏ మాలిని తిరుపతి లడ్డూ తీసుకొచ్చి ఇవ్వడం, ఆమె తనపై చూపుతున్న ప్రత్యేకమైన ఆసక్తిని సుఖదేవ్ గమనించడం ఈ భాగానికి ఆసక్తికరమైన ప్రారంభాన్ని ఇస్తుంది. అయితే మాలిని పట్ల ఎలాంటి ఆసక్తి లేని సుఖదేవ్ తన భార్య ప్రణవిపైనే తన ప్రేమ, అనుబంధం ఉన్నాయని స్పష్టంగా భావిస్తాడు. ఇంటికి చేరిన తర్వాత ప్రణవితో కలిసి కారుకు బదులుగా బైక్‌పై బయటకు వెళ్లాలని నిర్ణయించుకోవడంతో వారి వీకెండ్ ప్రయాణం మొదలవుతుంది. వనజమ్మ, విద్యాభవాని సరదా మాటల మధ్య ఈ దంపతులు భవానీ అమ్మవారి ఆలయం, రెస్టారెంట్, గండిపేట ప్రాంతాలకు వెళ్లి తమ పాత మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటారు.
వ్యాపార ప్రపంచం జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
జరిగిన కథ: కుటుంబ ప్రేమతో రోజును ప్రారంభించిన సుఖదేవ్, కార్యాలయంలో మాత్రం కఠినమైన వ్యాపార నిర్ణయాల ముందుంటాడు. ఉద్యోగుల ప్రమోషన్లు, నైతిక విలువలు, నాయకత్వ బాధ్యతలు, వ్యాపార విస్తరణ—ఈ నాలుగు అంశాల మధ్య జరిగిన ఆసక్తికర సంభాషణ కథను కొత్త మలుపులోకి తీసుకెళ్తుంది. వ్యాపార ప్రపంచం – పార్ట్ 2 లో సుగుణ్ ట్రేడర్స్‌లో కీలకమైన పదవికి కొత్త వ్యక్తిని ఎంపిక చేసే ప్రక్రియ మరింత ఆసక్తికరంగా మారుతుంది. స్త్రీలను కేవలం లింగం ఆధారంగా పక్కన పెట్టడం సరైన నిర్ణయం కాదని నాగముని సుఖదేవ్‌కు వివరిస్తాడు. సీనియర్ సూపర్‌వైజర్ దీనదయాళ్ భానుప్రసాద్ ను క్యాంటీన్‌కు తీసుకెళ్లి ఉద్యోగ బాధ్యతలు, పై అధికారులతో వ్యవహరించే పద్ధతి, టీమ్‌వర్క్, సహోద్యోగులతో స్నేహపూర్వకంగా మెలగడం వంటి విషయాలపై హితబోధ చేస్తాడు.
వ్యాపార ప్రపంచం గత ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇక వ్యాపార ప్రపంచం - పార్ట్ 4 చదవండి
అది వీకెండ్. సహజంగానే కార్యాలయ ప్రాంగణంలో తేలికపాటి వర్షం పడుతుంటే ఆనందం వెల్లివిరుస్తుంటుంది. వీకెండ్ రావడం కంటే, వీకెండ్ రాబోతుందన్న ఆలోచన మరింత మోదం కలిగిస్తోంది. ఆ విషయంలో సుగుణ్ ట్రేడర్స్ సి.ఈ.ఓ.కు మాత్రం మినహాయింపు ఉంటుందా? అదొక మూడ్...
ఉత్తేజకరమైన మూడ్. మాటలతో వర్ణించలేని తేలికపాటి ఉద్వేగపూరిత మూడ్.
అదే ఊపున సుఖదేవ్, అర్జంట్ వ్యాపార ఒప్పందాలకు సంబంధించిన ఫైల్స్ క్లియర్ చేసి, మిగతావి తదుపరి వర్కింగ్ డేలో చేస్తానని బాబాయి నాగమునికి చెప్పి, తన రివాల్వింగ్ కుర్చీ నుండి లేచాడు. తన పర్సనల్ బ్రీఫ్‌కేస్ అందుకున్నాడు.
అప్పుడు మాలిని నవ్వుతూ, "మే ఐ కమ్ ఇన్, సార్!" అంటూ ప్రవేశించింది.

వ్యాపార ప్రపంచం – పార్ట్ 4: మాలిని పట్ల సుఖదేవ్ వైఖరి
అతడు కనురెప్పలార్చి చూశాడు తన సీనియర్ పి.ఏ. (PA) వైపు. ఎర్రంచు తెల్లచీరలో నిగనిగలాడే యవ్వన శోభతో, జాతర గుర్రంలా నిండుగా ఉందామె.
అతడు అసహనంగా ముఖం తిప్పుకుని అడిగాడు, "ఏదైనా అర్జంట్ మేటరా? ఏదైనా సోమవారం చూస్తానులే. హేవ్ ఎ గుడ్ డే!" అంటూ ఎగ్జిట్ డోర్ వైపు కదిలాడు.
మాలిని ఊరుకోలేదు. "ఒక్క నిమిషం సార్! ప్లీజ్!" అంటూ అతడి ముందు తెల్ల కాగితం పొట్లం చూపించింది.
ఏమిటది అన్నట్లు మరొకసారి అసహనంగా ముఖం పెట్టి చూశాడు అతను.
"మా మామయ్య తీర్థయాత్రలకు వెళ్ళొచ్చాడు. ఇది తిరుపతి లడ్డూ, మీకోసం తెచ్చాను."
ఆ మాటతో అతడి ముఖాన ప్రసన్నత చోటు చేసుకుంది. "ఓ! థేంక్స్ ఎ లాట్. మా ఇంట్లో వాళ్లకు, ముఖ్యంగా మా మిసెస్ కి ఏడుకొండలవాడంటే వల్లమాలిన భక్తి. వాళ్లకు తీసుకెళ్లి ఇస్తాను."
"మరి మీకు?"
"నాకివ్వకుండా వాళ్లు ఊరుకోరుగా! నాకు మాత్రం వేంకటేశ్వర స్వామి పట్ల భక్తి లేదేమిటి?" అంటూ బయటకు దూసుకుపోయాడు సుఖదేవ్.
లోలోన అతడిలోని మనోరాగం మౌనంగా చెబుతూనే ఉంది- మాలిని తన తాహతు మరచి అతణ్ణి చూపులతో, తేనె చుక్కలు చిందే మాటలతో వెంటాడుతూనే ఉందని.
ఆపాటి ఆడదాని హావభావాల గురించి తెలుసుకోలేని అరసికుడా తను! తన రెండు బిడ్డల తల్లి ప్రణవిని తను మనసా వాచా కర్మణ, అణువణువునా ప్రేమిస్తున్నాడని, ఎప్పుడు ఎలా చెప్పాలో, ఎలా విదితం చేయాలో అతడికి తెలియడం లేదు. అసలు తనకు మాత్రం స్వంతమైన అటువంటి సౌమ్య సుతారమైన భావాన్ని ఇతరులకు ఎందుకు చెప్పాలి?
బాబాయి గనుక తన నిర్ణయానికి అడ్డు తగలకుండా ఉంటే, మాలిని ఈపాటికి మరొక వర్కింగ్ వింగ్ కి ఎప్పుడో బదిలీ చేయబడి ఉండేది. బహుశా జీవితానికి ఉన్న పరమార్థం ఇదేనేమో— సుముఖత లేకున్నా, ఇష్టం లేకున్నా అసహనమనే గుదిబండను మోస్తూనే సాగాలేమో!
ఇల్లు చేరి అతడు ఫ్రెషప్ అయి, లైట్ కలర్ దుస్తులు వేసుకుని, చంగాళమ్మ అందించిన అరకప్పు కాఫీ తీసుకుని హాలులో ప్రణవి కోసం ఎదురుచూడసాగాడు. ఆమె కూడా భర్త మూడ్ కి అనుగుణంగా తేలికపాటి లేత రంగు చేనేత చీర కట్టుకుని, రెండు కాఫీ కప్పులతో భర్త వద్దకు వచ్చింది.
అది చూసి సుఖదేవ్ రవంత విస్మయంతో చూశాడు. "అదేమిటి, మరొక కప్పా? చంగాళమ్మ ఇప్పుడిప్పుడే అరకప్పు కాఫీ ఇచ్చి వెళ్ళిందిగా!"
ఆ మాట విని ప్రణవి ముఖం అదోలా పెట్టింది. "అదేంవిటండీ, ప్రతి సాయంత్రం నేనేగా మీ కోసం, మీకు నచ్చే విధంగా కాఫీ కలిపి తీసుకొస్తాను! ఈ రోజేమిటి, ఎప్పుడూ లేనిది చంగాళమ్మను అడిగి కాఫీ తీసుకున్నారు?"
"నథింగ్, జస్ట్ లైక్ దట్. నీతో కలిసి వెళ్లాలన్న ఖుషీ మూడ్ లో ఉన్నానేమో, రొటీన్ పద్ధతిని పట్టించుకోలేదు. ఇప్పుడు మాత్రం ఏం మునిగిపోయిందని!" అంటూ ప్రణవి చేతిలోని కాఫీ కప్పుని అందుకున్నాడు అతను.
అతడు కాఫీ తాగడం పూర్తి చేసిన తర్వాత ప్రణవి అతడి చేతిలో కీ పెట్టింది. "ఇదిగోండి కారు కీ. బెడ్ పైన విడిచి వచ్చేసారు."
సుఖదేవ్ నవ్వుతూ వెనక్కి తగ్గుతూ అన్నాడు, "లేదు, ఈరోజు మనం కారులో వెళ్లం. ఇండియన్ మేడ్ బైక్ పైన స్వింగింగ్ స్పీడుతో రంయ్ మని దూసుకు వెళ్తున్నాం."
ఆ మాట విని ఆమె ఆశ్చర్యంగా చూసింది. "అదేమిటండీ, కారులో ఫ్రీ ఫీలింగ్ తో వెళ్లకుండా, మధ్యలో ఈ ఇరుకైన బైక్ ఎందుకండీ!"
"అదంతే, మూడ్ ని బట్టి మార్పు కూడా ఉండాలి. కారులో వెళితే స్వింగింగ్ స్పీడ్ అందుకోలేననా!"
అప్పుడు హాలు చివరన వనజమ్మ గొంతు ఖంగున వినిపించింది. "ఆగరా సుఖదేవ్! ఇదెక్కడి వింతైన కోరికరా! నువ్విప్పుడు హైస్కూలులోనో, కళాశాలలోనో ఉంటున్నావా ఏమిటి? బాధ్యతాయుత కంపెనీ సంస్థలో ఉన్నత మేనేజ్మెంట్ పోస్టులో కదూ ఉన్నావు. పోస్టుకి తగ్గట్టు డిగ్నిటీతో నడచుకో.
ఒకరోజు ఇలాగే మూడ్ వచ్చిందని ప్రణవిని బైక్ పైన తీసుకెళ్లి పడగొట్టావు. మంచిపని అయ్యింది, అప్పుడది కడుపుతో లేదు కాబట్టి ఏమీ సీరియస్ యాక్సిడెంట్ సంభవించలేదు. ఇద్దరూ తప్పిపోయారు. మరేమీ చెప్పకుండా వెనక్కి తగ్గు. ప్రణవి చేతిలోని కారు కీ అందుకుని బయటకు వెళ్ళు. నీ మంచి కోసం తాపత్రయడేది నేను మాత్రమే కాదు, నిన్ను కట్టుకున్న పెళ్ళాం కూడాను. గుర్తు పెట్టుకో!"
అప్పుడు సుఖదేవ్ చెల్లి విద్యా భవాని అక్కడికి చేరుకుంది. చేరుకుంటూనే తల్లిని ఉద్దేశించి అంది, "నువ్వు ఊరుకోమ్మా! విషయం తెలుసుకోకుండా మరీ సీరియస్ అయిపోకు. ఇది బరువు బాధ్యతల నుండి తెరపినిచ్చే వీకెండ్ కదా! అంచేత గతకాలంలో లైట్ గా సాగిన రోజుల్ని రివైండ్ చేసుకోవాలనుకుంటున్నాడు మీ సుపుత్రుడు. వదిన తోడు లేకుండా పూర్తి రివైండింగ్ ఎలా సాగుతుంది?"
రివైండింగ్ అంటే—అన్నట్టు ప్రశ్నార్థకంగా చూసింది వనజమ్మ.
భవాని వత్తాసు పలికింది, "ఇంకా అర్థం కాలేదా! రివైండింగ్ అంటే గతకాల మధురమైన రోజుల్ని, సంఘటనల్ని మనసున గుర్తు చేసుకోవడం, కళ్ల ముందుకు తెచ్చుకోవడం అన్నమాట. అన్నయ్య ఓ ఇంటివాడు అవ్వకముందు, కంపెనీ బాధ్యతలు స్వీకరించక ముందు ఏం చేసేవాడు? గుర్తు చేసుకో.
చుట్టుప్రక్కల కాలేజీలు తిరిగేవాడు ఫ్రెండ్స్ కోసం. అప్పుడు ఎవర్ని వెంటబెట్టుకుని జల్సాగా తిరిగేవాడు? కాలేజీ బ్యూటీగా పేరు పొందిన వదిననేగా పిల్లోపైన కూర్చోబెట్టుకుని తిరిగేవాడు! అదన్నమాట సంగతి. సరే, అదలా ఉంచు. నేను ఛాలెంజ్ చేస్తాను. వదిన ఇద్దరు పిల్లల తల్లే కదా— ఆ కారణం చెప్పి అన్నయ్యతో బైక్ రైడింగ్ చేయనని ఇప్పుడు నీ ముందు చెప్పమనండి, చూస్తాను!"
వనజమ్మ కళ్లు పెద్దవి చేసుకుని కోడలు పిల్ల వైపు చూసింది. చీర చెంగుని ఉండలు చుట్టూ, సిగ్గు దొంతర్ల మధ్య మొగ్గయిపోతూ తల వంచుకుని నిల్చుంది ప్రణవి.
పరిస్థితి అర్థం చేసుకున్న పెద్దావిడ దారికి రాక తప్పలేదు. "అది సరే! మొగుడూ పెళ్లాల మనోభావం అర్థమైంది. అలాగే వెళ్లిరండి. కాని స్పీడుతో వంకర్లు తిప్పుతూ వెళ్లకండి. ఇంతకీ మీరు బయటకు వెళ్తున్న వైనం పిల్లలిద్దరికీ చెప్పారా!"
"చెప్పానత్తయ్యా! ఏదో ఆన్‌లైన్ గేమ్ ఆడుకుంటున్నారు. అది పూర్తయిన తర్వాత ఇద్దరూ మిమ్మల్ని వెతుకుతూ వస్తారు. చెగోడీలు మరింకేవో తినిపించి వాళ్ల అత్తయ్యతో వాకింగ్ కి పంపించండి అత్తయ్యా!"
అంతా విన్న వనజమ్మ తలూపుతూ కూతురు వైపు చూపులు తిప్పింది; ఆన్‌లైన్ గేమ్ ఆడుకుంటున్న అన్నాచెల్లెళ్లిద్దర్నీ క్రిందకు తీసుకు రమ్మనమని సంకేతం ఇస్తూ— భవాని అలాగే అంటూ తలాడిస్తూ మేడమెట్ల వైపు నడిచింది. బయట బైక్ స్టార్టయిన కిక్కింగ్ శబ్దం వినిపించింది.

ప్రణవితో బైక్‌పై వీకెండ్ ప్రయాణం
అలా బైక్ పైన సాగిపోయిన వాళ్లిద్దరూ మొదట భవానీ అమ్మవారి గుడికి వెళ్లి దైవ దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత స్వీట్ స్నో రెస్టారెంట్లో ఐస్ క్రీమ్ ఊసులాడుకుంటూ తిన్నారు. యవ్వనపు రోజుల తియ్యటి కబుర్లు పంచుకుంటూ తిన్నారు.
ఆ తర్వాత గండిపేటకు సర్రున బయల్దేరారు. అక్కడకు చేరుకున్న తర్వాత రెండు కప్పుల చిక్కటి టీ తాగి, కాసేపు చెట్ల చెంతన సేదతీర్చుకుని, కొబ్బరిబొండం నీరు తాగి, తనకు ఆకలి వేస్తుందన్న ప్రణవి వైపు చూసి అన్నాడతను,
"ఎలాగూ మనమిప్పుడు ఇంటికి వెళ్లి భోజనం చేసే ప్రసక్తే లేదు. ఎంత వేగంగా దూసుకువెళ్లినా రెండున్నర గంటలకు పైగానే టైము పడుతుంది. అంతేకాక—నాకు కొంచెం అలసటగా కూడా ఉంది."
ప్రణవి వెంటనే సుఖదేవ్ మాటకు అడ్డు తగులుతూ అంది, "అలసటగా ఉందంటే ఉండదూ మరి! కొంచెం దూరమా స్వింగింగ్ స్పీడుతో బైక్ తోలారు! అంతేకాక మరీ ఎక్కువగా హైరానా పడిపోతూ అలసటకు లోనయితే ఆరోగ్యం చెడిపోదూ? అలా ఆరోగ్యం పాడు చేసుకుంటే మీ కంపెనీ బిజినెస్ ఎవరు చూస్తారు? పెట్టుబడులకై తీసుకున్న బ్యాంకు లోన్లు ఎవరు కడతారు వడ్డీతో సహా?

పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న సుఖదేవ్–ప్రణవి
ఎంతమంది సహాయకులు ఉంటే మాత్రం కంపెనీ అంతిమ బాధ్యతలు మీవే కదా! అంచేత చెబుతున్నాను, హోటల్ లో భోజనాలు ముగించి అక్కడే గెస్ట్ రూము గాని ఉంటే విశ్రాంతి తీసుకుని, ఆ తర్వాత ఇక్కడ గండిపేటలో నెలకొని ఉన్న శివాలయంలో శివార్చన చేసి తిరుగు ప్రయాణం చేద్దాం. ఏమంటారు?"
"నేనేమంటాను? ఎక్సలెంట్ ఐడియా అంటాను." అంటూ హోటల్ సవేరా ముందు బైక్ పార్క్ చేసి, కడుపారా నాన్-వెజ్ భోజనం చేసి, పచ్చకర్పూరం- సుగంధ ద్రవ్యాలు కలిపిన తాంబూల సేవనం చేస్తూ హోటల్ లోని విడి రూము తీసుకున్నారు.
రూములోకి వెళ్తూ ప్రణవి అడిగింది, "ఓ గంట సేపు ఉండటానికి గెస్ట్ రూము కోసం అడగమన్నాను కదా, అడగలేదా?"
"సర్దుబాటు కోసం చిన్నపాటి గెస్ట్ రూము అడగాలనే వెళ్ళాను. కాని అక్కడ ఎదురుచూడని విధంగా మా కంపెనీ లాంగ్ స్టాండింగ్ కస్టమర్ అగర్వాల్ ఎదురయ్యాడు.
అప్పుడతని కళ్ళముందు చిన్నపాటి గెస్ట్ రూము కోసం ప్రాధేయపడుతూ ఇబ్బంది పడటం ఎందుకని సింగిల్ బెడ్ రూము తీసుకున్నాను. అప్పుడప్పుడు వ్యాపారంలో లాభాల కోసమే కాదు— మన డిగ్నిటీ కోసం కూడా ఖర్చులు చేస్తుండాలి కదా! వ్యాపారిని అయినంత మాత్రాన ఖర్చు కోసం ఆలోచిస్తూ సోషల్ స్టేటస్ కోల్పోలేను కదా! ఎనీ హౌ, ఇందులో నీకేమైనా ప్రాబ్లమా?"
ప్రణవి తేటగా నవ్వుతూ బదులిచ్చింది, "నాకేమి ప్రాబ్లమండీ, మీరు నా ప్రక్కనుండగా! తెలిసినవారూ, తెలియనివారూ ఎవరెంత మంది మనల్ని చూసినా, లోలోన ఏమనుకున్నా నేను ఖాతరు చేయను."
అప్పుడతను రూములోకి ప్రవేశిస్తూ చప్పున ఆగి, వెనక్కి తిరిగి చూసి అడిగాడు, "ఏమైనా అనుకుంటారంటే— దాని అర్థం?"
"ఇంకా పాయింట్ పట్టుకోలేదా మహానుభావా! మనల్ని భార్యాభర్తలమని తెలుసుకోకుండా లవర్సని తలపోసినా నాకు అభ్యంతరం లేదంటున్నాను."
దానికతడు లోపల అనుకుంటున్నానని భావిస్తూనే పైకి అనేశాడు, "నాకు కావాల్సింది అదే కదా!"
"ఏయ్ దొంగా! పెద్ద ప్లానుతోనే నన్నిక్కడకు తీసుకొచ్చారన్నమాట! మీ వీకెండ్ మూడ్ లో ఇంతటి తీవ్ర ప్రేరణ ఉంటుందని నాకు తెలియదు సుమా! అయినా, నేనక్కడ మీకేమి తక్కువ చేశానని? ఫ్రాంక్ గా చెప్పండి!" అంది ఆమె, అతడి పెదవులతో తన పెదవులు కలుపుతూ.
అప్పుడతను భార్యను ఒడిలోకి తీసుకుంటూ అన్నాడు, "నేనెప్పుడన్నానని నువ్వు తక్కువ చేశావని? కాని యెందుకు దాచడం గాని, నాకు ఒకటి తక్కువయినట్లే తోస్తుందోయ్!"
ఆమె గలగలమని నవ్వుతూనే అడిగింది, "ఏమిటది?" అని. అతడు ఆమె నవ్వునీ, నవ్వుతున్న పెదవుల్నీ తనలోకి ఇముడ్చుకుంటూ బదులిచ్చాడు, "ఫ్రీడమ్. ఫ్రీడమ్ ఆఫ్ మూవ్ మెంట్."
"అదేమిటండీ అలాగంటారూ! ఇల్లు మీది. అక్కడి వాతావరణమంతా మీది. అలాంటప్పుడు స్వేచ్ఛ ఎలా తక్కువవుతుంది?"
"ఇటు నా ప్రక్కన రాఘవ, అటు నీ ప్రక్కన కామిని— ఊసులాడుతూ కూర్చుంటే నాకెలా మూడ్ విజృంభిస్తుంది?"
"ఇదీ మరీ బాగుందండోయ్! అవ్వా కావాలి, బువ్వా కావాలి అంటే ఎలా కుదురుతుంది?" అని అడిగిందామె.
"అంటే నీ ఉద్దేశ్యం?" అన్నట్టు ప్రణవి వైపు చూశాడు అతను.
అప్పుడామె విడమరిచింది, "అంటే—మీ పేరూ, మీ ఇంటి పేరూ నిలబెట్టడానికి వంశాంకురం కావాలి. కాని, సమయానికి తగ్గట్టు ఓర్చుకోలేరు, సర్దుకోలేరు, అంతేనా!"
"అబ్బే— నేనంటున్నది అది కాదే బుల్ బుల్ రాణీ! అప్పుడప్పుడు మనం ఇలా ఫ్రీగా ఆటంకమే లేని వాతావరణంలో శృంగార లీలల్లో మునిగి తేలితే బాగుంటుందని. రిపీట్ చేస్తున్నాను, అప్పుడప్పుడని— ప్రామిస్ చేయవే నా రంగుల రంగోళీ!"
"ప్రామిస్ చేయలేను. మీరంతగా రొమాన్స్ ఫీల్ తో విజృంభిస్తున్నారు కాబట్టి ఆలోచిస్తానని మాటిస్తున్నాను. అదీను ఇంట్లో అన్నీ అనుకూలంగా ఉంటేను— ముఖ్యంగా అత్తయ్యకు మన శృంగార లీల గురించి అనుమానం కలగకుండా ఉంటేనూ— పవిత్ర దినాలు, పూజలూ, పునస్కారాలు అడ్డురాకుండా ఉంటేనూ!"
"ఇదీ మరీ బాగుందోయ్! అదేదో లవర్ తో దొంగచాటుగా వస్తున్నట్లు మార్మికంగా మాట్లాడుతున్నావు!"
"ఇప్పుడిప్పుడేగా అన్నారు నన్ను అప్పుడప్పుడు ఫ్రీగా లవర్ గా చూడాలని— అప్పుడే మీకు ఊపు వస్తుందని!"
ఆ మాటతో సుఖదేవ్ పెదవులు మూతపడ్డాయి. ఆపుకోలేని తమకంతో చేతులు ప్రణవి చీరను విప్పసాగాయి. అప్పుడామె అతణ్ణి ఆపడానికి ప్రయత్నించింది, "పూర్తిగా విప్పకండీ!" అంటూ.
దానికతడు ప్రత్యుత్తరంగా బదులిచ్చాడు, "పూర్తిగా విప్పితే గాని నాకు పరిపూర్ణానందం కలగదోయ్ మంగోలియా మహరాణీ!"
ఈసారమె అతడికి అడ్డు చెప్పకుండానే విసుగ్గా ముఖం పెట్టి అంది, "అదేంవిటీ— ఈరోజు కొత్త కొత్త పేర్లతో, కొత్త టోన్స్ తో పిలుస్తున్నారు!"
"అదంతే— ఈరోజంతా పేర్లే కాదు, అంతా కొత్తగానే ఉంటుంది. అనుభవం కూడా కొత్తగా, తేజోవంతంగా ఉంటుంది." అంటూ ప్రణవిని గుండెలపైకి లాక్కున్నాడు.
ఆమె పైకి ఏదీ అందనట్టు, ఏదీ కనిపించనట్టు భావన చూపిస్తుందే గాని, లోలోన మనసు ఆనందడోలికల్లో తేలియాడుతోంది. ఇద్దరు బిడ్డల తల్లయిన తనపైన భర్తకు మోహం పిసరంత కూడా తగ్గకపోవడం తలచి మనసంతా మోహనకరంగా మారుతోంది. కోర్కెల శిఖరాలను తాకుతోంది.
సరస పూరిత కార్యం పూర్తయిన తర్వాత ఇద్దరూ ముఖం కడుక్కుని ఫ్రెషప్ అయ్యారు. ప్రణవి తనవంతు ముఖం కడుక్కున్న తర్వాత నిస్పృహగా ముఖం పెట్టుకుని చూసింది.
అది చూసి సుఖదేవ్ అడిగాడు, "వాట్ ఈజ్ ది మేటర్? ఏమైనా పోగొట్టుకున్నావా!"
ఆమె తలూపుతూ బదులిచ్చింది, "ఇదంతా జరుగుతుందని తెలియక నేను బొట్టు తెచ్చుకోలేదండీ!"
"అదీ ఒకందుకు మంచిదేలే— ఈ విధంగా నా కోరిక ఈడేరుతుందిలే!"
అదేలాగన్నట్టు ఆమె ఆశ్చర్యంగా చూసింది.
"నాలోని మార్మికానందం ఏమిటో చెప్పేదా!"
ఉఁ అందామె. అప్పుడతను రహస్యం విప్పాడు, "బొట్టు పెట్టుకున్న ముఖంతో వస్తే నువ్వు నాకు భార్యవవుతావు. బొట్టులేని ముఖంతో వస్తే నువ్వు నాకు ప్రియమైన గాళ్ ఫ్రెండ్ వవుతావు. మొత్తానికి విన్-విన్ సిట్యుయేషన్!" ఆ చలాకీ మాట విని ప్రణవి భర్త ముక్కు పట్టుకుని లాగింది, "ఈ మధ్య విదేశీ పర్యటనలపై వెళ్ళి బాగా మారిపోతున్నారు—కాదు, పాడైపోతున్నారు."
"ఇంతకంటే ఎక్కువగా పాడైపోకుండా ఉండాలంటే, అది నీ చేతుల్లోనే ఉందోయ్ బుడబుక్కల చెంచు లక్ష్మీ!" అంటూ డోర్ బెల్ మ్రోగిస్తూ లోపలకు వచ్చిన రూమ్ బాయ్ కి టిప్స్ అందించి, ప్రణవి చేయి అందిపుచ్చుకుని బయటకు నడిచాడతను.
=================================
ఇంకా ఉంది
వ్యాపార ప్రపంచం – పార్ట్ 5
త్వరలో మీ ముందుకు వస్తుంది.
=================================
పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.
మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.
పాండ్రంకి సుబ్రమణి గారి కొన్ని ఇతర రచనలు:
పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పాండ్రంకి సుబ్రమణి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

1) పేరు-పాండ్రంకి సుబ్రమణి
2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య
3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ
4)స్వస్థలం-విజయనగరం
5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు
6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.

a











Comments