వ్యాపార ప్రపంచం – పార్ట్ 2
Updated: Aug 20

Vyapara Prapancham – Part 2 | Telugu Emotional Inspirational Serial | Pandranki Subramani
వ్యాపార ప్రపంచం – పార్ట్ 2 | తెలుగు భావోద్వేగ ప్రేరణాత్మక ధారావాహిక| పాండ్రంకి సుబ్రమణి | ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత
Published in manatelugukathalu.com on 14/08/2026
వ్యాపార ప్రపంచం – పార్ట్ 2 లో సుగుణ్ ట్రేడర్స్‌లో కీలకమైన పదవికి కొత్త వ్యక్తిని ఎంపిక చేసే ప్రక్రియ మరింత ఆసక్తికరంగా మారుతుంది. స్త్రీలను కేవలం లింగం ఆధారంగా పక్కన పెట్టడం సరైన నిర్ణయం కాదని నాగముని సుఖదేవ్‌కు వివరిస్తాడు. ఇదే సమయంలో సుఖదేవ్ ఇంటికి తల్లి వనజమ్మ, చెల్లి విద్యాభవాని రావడంతో కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. ముంబైలో న్యాయ శిక్షణ పూర్తి చేసుకుని హైకోర్టు న్యాయవాదిగా ఎదగడానికి సిద్ధమవుతున్న విద్యాభవాని తన అన్నయ్యతో తన భవిష్యత్తు గురించి మాట్లాడుతుంది. కుటుంబ అనుబంధం, స్త్రీ సాధికారత, వృత్తిపరమైన ఎదుగుదల, వ్యాపార నిర్ణయాలు కలిసిన ఈ ఆసక్తికరమైన భాగాన్ని చదవండి.
జరిగిన కథ: కుటుంబ ప్రేమతో రోజును ప్రారంభించిన సుఖదేవ్, కార్యాలయంలో మాత్రం కఠినమైన వ్యాపార నిర్ణయాల ముందుంటాడు. ఉద్యోగుల ప్రమోషన్లు, నైతిక విలువలు, నాయకత్వ బాధ్యతలు, వ్యాపార విస్తరణ—ఈ నాలుగు అంశాల మధ్య జరిగిన ఆసక్తికర సంభాషణ కథను కొత్త మలుపులోకి తీసుకెళ్తుంది.
ఇక వ్యాపార ప్రపంచం - పార్ట్ 2 చదవండి
“నా విషయంలో అది పూర్తిగా కాకపోయినా కొంతలో కొంత వాస్తవం కావచ్చు. అది కాదనడం లేదు. బట్ యాజ్ ఎ మాటరాఫ్ ఫ్యాక్ట్ జెండర్ ప్రాదిపదికన వాళ్ళ పట్ల వివక్ష చూపించడం సబబు కాదు.
ఇటీవల కాలంలో చాలా విషయాలలో అమ్మాయిలు ఆకాశంలో సగంగా యెదిగారన్నది మనం మరచిపోకూడదు. మామూలు వైట్ కాలర్ జాబ్సులోనే కాక- ఇప్పటి స్త్రీలు యుద్ధ నైపుణ్యంలో సహితం సత్తా చాటుకుంటున్నారు. యుద్ధ విమానాలను సోలోగా నడుపుతూ సత్తా చాటుకుంటున్నారు.
అంచేత ఫెళుసు శారీరం గలవారు కాబట్టి వాళ్లను ప్రక్కన పెట్టాలనుకోవడం చెల్లదు. అంతేకాదు— మరొకటి కూడా ఉంది. ఇప్పుడు మన బోర్టాఫ్ డైరక్టర్సులో ప్రణవి ఉంది కాబట్టి సరిపోవచ్చు. కాని— ప్రణవి గాని లేకపోతే రాబోతూన్న కొత్త కంపెనీ రూల్స్ ప్రకారం తప్పనిసరిగా ఒక స్త్రీ డైరక్టరయినా ఉండవలసిందే— అప్పుడేమి చేస్తాం?”
ఆ మాటతో సుఖదేవ్ మిన్నకుండిపోయాడు. బాబాయి చెప్పిందాట్లో కొండంత వాస్తవం ఉన్నట్లే తోచిందతనికి. నిజమే— తెలివి తేటలు ప్లస్ నైపుణ్యం మగాళ్ళ సొత్తు మాత్రమే కానేరదు కదా!
అప్పుడు అబ్బాయి మూడీగా తయారవ్వడం గమనించి నాగముని తేరుకున్నాడు. సీనియర్ పీఏ రావడం చూసి నాగముని ధోరణి మార్చాడు.
ఫార్మల్ టోన్ తో చెప్పసాగాడు- “బండి యింకా కదలనే లేదు కదా! బండి కదలి బ్రిడ్జి యెదురొచ్చినప్పుడు దానిని యెలా దాటాలో అప్పుడు ఆలోచిద్దాం సార్! పలు చానల్స్ ద్వారా విషయ సేకరణ చేసి క్యాండిడేట్సుని లిస్టౌట్ చేద్దాం- అప్పుడు కదా ముఖాముఖి ఇంటర్వ్యూ. సారీ సార్, మీ టైమ్ చాలానే తీసుకున్నట్లున్నాను. ఇక మధ్యాహ్నం తరవాత వస్తాను సార్!” అంటూ నాగముని భవ్యంగా లేచి కదిలాడు.
మాలిని తెచ్చిన ఫైలు సుఖదేవ్ బల్లపైనుంచి ఎడంగా కదలి నిల్చుంది. అతణ్ణే చూస్తూ నిల్చుంది. అతడు అటూ యిటూ చూడకుండా ఫైల్సు చూస్తూ సంతకం పెట్టసాగాడు.
------------------------------------------------------------------------------
అందరూ కాకపోయినా సుఖ్ దేవ్ వంటి వారు కొందరున్నారు. జీవితంలోనే కాక— వ్యాపార జీవితంలో సహితం అడుగు పైన అడుగు వేసుకుంటూ తొట్రుపాటుకు తావులేకుండా అతి జాగ్రత్తగా మెసలుతుంటారు. రాలకుండా ఆకుచివరన మెరుస్తూ కనిపించే నీటి బొట్టులా తొలగి ఉంటారు.
ఇక విషయానికి వస్తే— సుఖదేవ్ యెంతటి సున్నిత మనస్కుడంటే- ఎట్టెదుటే కాదు, చివరకు కలలో సహితం తనభార్య ప్రణవికి దూరం కావడం భరించలేడు. అనుకోకుండా అతడెప్పుడైనా పరస్త్రీ ముఖంలోకి గాని— వాళ్ళ కట్టుకున్న చీర కుచ్చెళ్ళలోకి గాని చూస్తే గగుర్పాటుకు లోనవుతాడు.
అదేదో చూడకూడనదేదో చూసినట్లు కళవళ పడుతుంటాడు. కంపరానికి లోనవుతుంటాడు. భార్య ప్రణవి తప్ప మరింకెవరైనా పరస్త్రీ కలలో వంపులు చూపిస్తూ హొయలు ఒలికిస్తూ కనిపిస్తే ఇక చెప్పనే అవసరంలేదు. అందుకే-- మాలిని వంటి స్త్రీ తెల్ల గుర్రంలా యెత్తుగా అందంగా యెదురొస్తే సుఖదేవ్ దించిన తల యెత్తకుండా దస్త్రాలు పూర్తి చేసి అందిస్తాడు; కళ్ళల్లో కళ్లు కలవకుండా జాగ్రత్తపడుతూ—
అందుచేత—అతడు అప్పుడప్పుడు జరిగే జనరల్ షఫ్లింగ్ లో మాలినిని మరొక డివిజనల్ హెడ్డు వద్దకు బదలీ చేయాలని ప్రయత్నించాడు. కాని, అతడి శ్రేయోభిలాషి బాబాయి నాగముని అడ్డుతగిలాడు; అటువంటి నమ్మకస్థురాలైన పర్సనల్ అసిస్టెంటు దొరకడం చాలా కష్టమని— వ్యాపార రహస్యాలు కాపాడటం అంటే కడుపులోని బిడ్డను సాకడమంత కష్టమని.
అంతేకాక- మాలిని ఎరుపు రంగుతో డ్యాషింగ్ గా, లావిష్ గా కనిపిస్తుంది.
మనసున తొణికే మమకారాలు
కనులను మెరిసే నయగారాలు
తెలుపరాదటే సూటిగా
తెరలు తీసి పరిపాటిగా—“
----------------------------------------------------------------------------
సాయంత్రం కావస్తూంది. నాగముని వచ్చి మరికొన్ని వ్యవహారాల గురించి సుఖ్ దేవ్ తో అల్లనల్లన చర్చించి వెళ్ళిపోయాడు. ముఖ్యంగా పెట్టుబడుల విభానికి వ్యాపార ఒప్పందాల విభానికి సంబంధించిన కొత్త ఇన్చార్జీని సెలెక్టు చేసే విషయమై ఒక ప్రొవిజినల్ (తాత్కాలిక) లిస్టు గురించి వివరాణ్మతక పట్టీ గురించి వివరించి వెళ్ళాడు.
ఆ తరవాత అతడు కొత్త డిజైనర్ ఏ- షేపు లేడీ డ్రెస్సుల డ్రాయింగ్స్ పరీక్షించి కొన్నిటికి ఓకే చెప్పి మరికొన్నటికి రిషేప్ విషయమై మరికొంత చర్చించాల్సి ఉందని రిమార్క్ పాస్ చేసి తన పర్సనల్ బ్రీఫ్ కేసుని సర్దుకున్నాడు ఇక లేచి వెళ్ళడానికి--
అప్పుడు మాలిని చిర్నవ్వుల పూల గుత్తులు వెదజల్లుతూ ప్రవేశించింది. అతడు అసంకల్పితంగా కళ్ళు మిటకరించి చూస్తూ అడిగాడు- “ఇంకేమైనా అర్జంట్ ఫైలుందా క్లియర్ చేయడానికి?”
ఆమె అదే నవ్వు ముఖంతో అతడి సీటుకి సమీపించింది. అప్పుడతడు వెంటనే స్పందించాడు- “అర్థమైంది-మీరు మీ హయ్యర్ గ్రేడేషన్ ఫైలు గురించి అడగటానికి వచ్చినట్లున్నారు. మరొక నలుగురు పేర్లున్న ఆ ఫైలుని మూడు రోజుల క్రితమే క్లియర్ చేసి హెచ్చమ్ వాళ్ళకు పంపించాను. రేపో మాపో పే- ఫిక్షేషన్ ఆర్డర్సు ఇష్యూ చేస్తారు. నథింగ్ టు వర్రీ మాలినీ!”
“సారీ సార్!నేను దానికోసం రాలేదు సార్.”
మరి దేనికోసమన్నట్టు సుఖ్ దేవ్ ఆమె వేపు కళ్లు పెద్దవి చేసుకుని చూసాడు; ఎత్తైన ఆమె గుండెలు యెగిసి పడ్తున్నట్లనిపించి మరోవేపుకి ముఖం తిప్పుకుంటూ—
అప్పుడామె పొంగుకు వస్తూన్న నవ్వుని ఆపుకుంటూ అంది- “మీకోసం హోటెల్ సైబేరియా నుండి తెప్పించిన కాఫీ ఇంకా ఫ్లాస్కులో ఉంది సార్. మీ కిష్టమైన కాఫీ కాబట్టి- మీరెలాగూ గృహాభిముఖులవుతున్నారు కాబట్టి మీరు ఔనంటే పంపించే యేర్పాటు చేస్తాను”
“ఓ అదా సంగతి! నో-థేంక్స్— నేను యెలాగూ ఇంటికి వెళుతున్నాను కాబట్టి అక్కడే తీసుకుంటాను. ప్రణవి యెదురు చూస్తుంటుంది-“ అంటూ లేచి కదిలాడు.
అతడలా కదలడం చూసి మాలిని ప్రక్కకు తొలగుతూ- “దెన్ ఇటీజ్ ఓకే సార్- గుడ్ నైట్ సార్!” అంటూ ఎగ్జిట్ డోర్ ని అతడి కోసం తెరిచింది— అతడు థేంక్స్ అంటూ ఆమె ముఖంలోకి చూస్తూ సాగిపోయాడు.
కారు డ్రైవర్ పరుగు వంటి నడకతో ఎదురు వచ్చి సుఖదేవ్ చేతిలోని బ్రీప్ కేసు అందుకుని అనుసరించాడు.
కారులో డ్రైవర్ ప్రక్కన కూర్చుంటూ మనసున అదో విధమైన విషాదానుభూతితో గాఢంగా అనుకున్నాడతడు- జీవితం చిత్రాచి చిత్రమైన చక్రభ్రమణం. దేనికైతే దూరంగా ఉండాలనుకుంటాడో అదే విషయం కళ్ళకు కట్టినట్లుగా యెదురొస్తుంటుంది. వెన్నంటి వస్తున్నట్లుంటుంది. అటూ యిటూ కాకుండా కొందరు స్త్రీల విషయంలో ఇది మరీ విచిత్రంగా కళ్ళకు స్పష్టాతి స్పష్టంగా కనిపిస్తుంటుంది.
నవ్వే పెదవులే కాదు- చూపుల పలకరింపులే కాదు- ఎదల యెత్తులు సహితం యెదుటి వాడికి ఆహ్వానం పలుకుతునట్లుంటుంది. మౌన నివేదన చేస్తున్నట్లుంటుంది. స్త్రీలలో అలరించే సహజ సౌందర్యానికి ఇది కూడా ఒక కారణమేనేమో—
అర్జునుడు-ప్రవరాఖ్యుడు-సారంగ ధరుడు వంటి మగటిమి గల అందగాళ్ళు ఏదో ఒక రీతిన అటువంటి మానసిక చాంచల్యానికి లోనయి ఉంటారేమో--
ఎట్టకేలకు సుఖదేవ్ ఆలోచనా వలయాల నుండి తేరుకుంటూ ఇల్లు చేరాడు. కారు దిగిన వెంటనే డ్రైవర్ చంద్రం కారు తోలుకుంటూ పోర్టికోవేపు సాగిపోయాడు. ప్రణవి నిలువెల్లా నవ్వుతూ భర్తకు ఎదురొచ్చింది. ఆమెను చూడగానే అతడి మనసు మనోల్లాసంతో ఊగిసలాడింది.
నిండు జాబిల్లిని చూసినట్లు పులకించింది. చుట్టు ప్రక్కల యెవరైనా ఉన్నారో లేదో అన్నది చూడకుండా అతడు ప్రణవి నడుం చుట్టూ చేతులు పోనిచ్చి దగ్గరకు లాక్కున్నాడు.
“అయ్యో రామ! ఆగండి ఆగండి- బెడ్రూముకీ బోర్డు రూముకీ మధ్య తేడా తెలవద్దూ? ఇప్పుడు మిమ్మల్ని అల్లుకుపోవడానికి రాలేదు. మీకు ప్లజంట్ సర్పరైజ్ యివ్వటానికి వచ్చాను. అదేమిటో ముందు తెలుసుకోండి. ”
“ప్లజంట్ సర్ ప్రయిజా! ఇప్పుడా!” అంటూ అతను ఓసారి చిలిపిగా సన్నటి భార్య నడుముని సుతారంగా గిల్లాడు.
“అబ్బ! అయ్యగారి మూడ్ మరీ హోరుగా ఉన్నట్లుందే— ముందు లోపలకు పదండి. అదేమిటో చూద్దురు గాని“ అంటూ భర్త నుండి యెడంగా జరిగి ఇంట్లోపలకు నడిచిందామె.

ఆమెను అనుసరించి నడుస్తూ సగంలో ఆగిపోయి ఆశ్చర్యంగా చూస్తూ నిల్చుండిపోయాడతను. సోఫాలో కూర్చున్న తల్లి వనజమ్మ, చెల్లి విద్యాభవాని నవ్వుతూ అతడి వేపు చూస్తున్నారు.
అతడు పట్టరాని ఆనందంతో అరచినంత పనిచేసాడు- “ఎప్పుడొచ్చారమ్మా! ఈ నెల వరకూ రారేమోనని- కామిని పుట్టిన రోజుకి రారేమో నని నేనూ మీ కోడలూ యెంతగా గాభరా పడ్డామో తెలుసా! ఫోనులో చెప్తే నేను స్వయంగా స్టేషనుకి వద్దును కదా!“
“ఎవరైతేనేమి లేరా! ప్రణవి వచ్చి రిసీవ్ చేసుకుందిగా— ఐనా, నువ్వనుకున్నట్టు మేము రైల్వే స్టేషన్ లో దిగలేదు. శంషాబాదు ఎయిర్ పోర్టులో దిగాం. ”
అలాగా అన్నట్టు అబ్బురంగా చూసాడతను.
“మరి— నువ్వు యెన్ని మెసేజ్ లు పంపించావని— ఒకటా రెండా ఊరుకుని నిబ్బరంగా ఉండటానికి. అందుకే సమయం దొరికిన వెంటనే ప్లేన్ టిక్కెట్లు బుక్ చేసుకుని గాలిలో యెగురుతూ వచ్చేసాం—“
అతడు సావధానంగా తలూపుతూ దగ్గరకు వచ్చి నిల్చున్న చెల్లి విద్యాభవాని భుజం పైన చేతులుంచి అన్నాడతను- “మరి ముంబాయి హైకోర్టు పరిసరాలలో పలు విభాగాలలో తచ్చాడుతూ మీ సీనియర్ మిస్టర్ పళాండే గారి వద్ద తీసుకుంటూన్న లీగల్ ట్రైనింగ్ గురించి యేం చేసావ్ భవానీ!”
“అన్నీ బాగానే చేసాన్రా అన్నయ్యా! మరికొంత ప్రాక్టికల్ లీగల్ ట్రైనింగ్ తరవాత నన్ను ఆంధ్రా హైకోర్టులో రెండు మూడు క్లిష్టమైన కేసులు స్వతంత్రంగా టేకప్ చేయాలన్నారు. ఇక్కడకు రాకముందే వెల్ ఇన్ అడ్వాన్స్ బార్ కౌన్సిల్ మెంబర్ షిప్పుకి అప్లయ్ చేసాను. కొత్త పద్ధతి ప్రకారం వాళ్ళ ఇంటర్వ్యూ కమ్ రిటన్ టెస్టుకి కూడా హాజరయాను.
ఇక బార్ కౌన్సిల్ సభ్యత్వం రావడమే తరువాయి. ముఖ్యమైన రెండు మూడు కేసుల్సి మా గురువుగారి ఆధ్వర్యాన స్వీకరించడమే తరువాయి. ఇక్కడున్న ఇద్దరు సీనియర్ అడ్వకేట్ల పరిచయ పత్రాలను నాకిచ్చి పంపించారు. ఇప్పుడు నేను చేయాల్సింది ఒక్కటే— హైకోర్టు సెంట్రల్ లైబ్రరీలో కూర్చుని ముఖ్యమైన కేసుల్ని తిరగదోయడమే—“
“గుడ్! వెరీ గుడ్! మనింట్లో లీగల్ నిపుణి ఉండటం— అందులో లేడీ లీగల్ నిపుణురాలు ఉందన్నది తల్చుకుంటే యెంత హ్యాపీగా ఉందో తెలుసా! బాగా గుర్తుంచుకో! లా- గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే చాలదు- లీగల్ ట్రైనింగ్ తీసుకుంటే చాలదు- నేర్చుకున్న విషయ పరిజ్ఞానాన్ని నిత్యనూతనంగా పదిలపర్చుకోవడంలోనే ఉంది ఉజ్ఝ్వలమైన భవిష్యత్తు. హేవ్ యు గోట్ మై పాయింట్?”
ఆమె తలూపుతూ అన్నయ్యను సోఫాలో తల్లి ప్రక్కన కోర్చోబెట్టి- “వన్ మినిట్!” అంటూ లోపలకు వెళ్ళి చల్లని పానీయం అతడికి అందించింది.
అందిస్తూనే అందామె- “వదిన నీకిష్టమని ఫిల్టర్ కాఫీ చేయడానికే కిచెన్ కి వెళ్ళింది, నేనే వెళ్ళి ఆపాను- వచ్చిన వెంటనే చల్లని పండ్ల జ్యూస్ యిచ్చి వాషప్ అయిన తరవాత పూజా గది దర్శించి వచ్చిన తరవాత వేడి కాఫీ యిస్తే బాగుంటుందని నచ్చచెప్పి షెడ్యూల్ లో మార్పు తెచ్చాను. ఈజిట్ ఓకే రా అన్నయ్యా!”
“వెరీ వెరీ ఓకే! ఇక విషయానికి వస్తే— ఇదే కాదు. మీ వదినెకు చిన్నా చితకా చిల్లర పనుల్లో సహాయ పడ్తుండు. రిలీఫ్ గా ఉంటుంది. సంగీతం వింటూ సేద తీర్చుకుంటుంది- రాఘవ్ కామినిల ఆలనా పాలనా చూసుకుంటుంది-“
“భలేవాడివిరా అన్నయ్యా! ఇవన్నీ నువ్వు నాకు చెప్పాలా? అన్ని పనులూ పనిగత్తెల చేతిలో పెడితే సంపూర్ణత చెందదని నాకు తెలవదా యేమిటి— అమ్మకూడా ఉందిగా! అమ్మ జోక్యంతో వదినెకు బెలెడంత తీరిక మిగులుతుంది“

అప్పుడు ప్రణవి అన్నాచెళ్లెల్ల వద్దకు వచ్చింది- “చూడు విద్యా భవానీ! అన్నయ్య చెప్పాడు కదానని పనులన్నీ నెత్తిన పెట్టుకోకు. నువ్వు లీగల్ ప్రొఫెషన్ లో కుదురుకోవడానికి చాలానే ఉంది. ఆడపిల్లకు కోర్టులో వాదించడమంటే యుద్ధ క్షేత్రంలో కత్తి పట్టుకుని దిగినట్లే- నువ్వు లీగల్ స్టడీస్ తో కుస్తీపడుతుండు. అప్పుడప్పుడు వీలుంటే నా బ్యాంకు వ్యవహారాలు చూసి పెట్తూండు. అది చాలు”
“అలాగే వదినా! మరి పాప పుట్టిన రోజుకి కొత్త ఫ్యాన్సీ డ్రెస్సుల కోసం యెప్పుడు వెళ్తున్నాం?”
“బర్త్ డే పండగ దానికే కదా- అది స్కూలు నుండి రానియ్యి— దానిని మనతో బాటు తీసుకెళ్దాం. సింపుల్ గా స్టయిలిస్ట్ గా ఉండాలి-“ అంటూ అటు వనజమ్మవేపు తిరిగి అందామె- “మీరు కూడా రండత్తయ్యా! మీరు గాని వస్తే కామిని సరదా పడ్తుంది. ఇప్పటికిప్పుడే బర్త్ డే సంబరం ఆరంభమైనట్లు ఫీలయిపోతుంది”
కోడలి పిల్ల మాటకు వనజమ్మ నవ్వుతూ స్పందించింది- “ఆ పెద్దమనిషికి డ్రెస్సులు సెలక్ట్ చేయడానికి నేను కూడా రావాలా! సరే— అలాగే వస్తాలే! ఈ లోపల– అది స్కూలు నుండి ఇల్లు చేరే లోపల నేను కాసేపు సేద తీర్చుకుంటాను. ” అంటూ బల్లపైనున్న పండ్ల రసం గ్లాసుని ఖాలీ చేసి మేడ మెట్ల వేపు నడచింది.
సుఖదేవ్ అలర్టుగా కదలి వచ్చి తల్లి చేతిని అంది పుచ్చుకుని ఆమెకు ఊతగా నిలుస్తూ వెంబడించాడు.
ఆరోజు సాయంత్రం అనుకున్న ప్రకారం పిల్లలతో కలసి అత్తయ్యా ఆడపడుచుల్ని వెంట బెట్టుకుని కిడ్స్ షాపింగ్ సెంటర్ కి వచ్చింది ప్రణవి. కామినికి ఇష్టమైన డిజైనర్ దుస్తుల్ని ఎంపిక చేసుకుని, పనిలో పనిగా కొడుకు రాఘవ్ కి కూడా రెండు క్యాజ్వుల్ దుస్తుల్ని తీసుకుని మినీ రెస్టారెంటులో అందరికీ ఐస్ క్రీమ్ ఇప్పించి అందర్నీ ఇంటికి బయల్దేరదీసింది ప్రణవి.
పిల్లల ఆనందం చూసి ఆమె మనసు మేఘాలలో తేలియాడింది. పిల్లలకు దుస్తులు కొనడంలో కాదు; వాళ్ళతో కలసి వెళ్ళడంలోనే ఉంది అసలు సిసలైన సంతోషం. పిల్లల సంతోషమే కదా తల్లికి నిజమైన ఆనందం. ఇది లోక విదితమే కదా— కారులో దిగి ఇంట్లోకి వస్తూన్న ప్రణవికి యదురెళ్ళి చిలిపితనం చిలకరించే కళ్ళతో అడిగాడు సుఖదేవ్-
“నాకోసం యేమీ లేదా?”
అప్పుడామె అదే చిలిపి తనంతో కనిపించీ కనిపించని రీతిన అతణ్ణి ఒరసుకుంటూ అందామె- “మీకు ఇవ్వటానికి నేను లేనూ! ఇంతకంటే ముచ్చటైనది, మెచ్చుకోతగ్గది మరొకటి కావాలేమిటి?” అంటూ ప్యాక్ చేసిన వస్తువులన్ని టినీ అతడికి అందించింది.
అతడు దుస్తుల నాణ్యతపై చేస్తూన్న అభిప్రాయాలు వింటూ తలూపుతూ వదినె వెళ్ళిపోయిన తరవాత తనుమాత్రం హాలులో కాసేపు కూర్చుని అందరూ చెదరిపోయి వాళ్ళ వాళ్ళ గదులకు వెళ్ళిపోయిన తరవాత విద్యా భవాని మాత్రం హాలులోనే కూర్చుని తనతో కలసి చదువుకున్న కొందరు లా- స్టూడెంట్సుతో ఫోనులో మాట్లాడి పనిగత్తెలిద్దర్నీ పిలిచింది.
లోపల పనులు చూసుకుంటూన్న చంగాళమ్మ రాములమ్మ ఇద్దరూ భవాని నుండి కబురందుకుని చేతులు ఆదరాబాదరాగా శుభ్రం చేసుకుంటూ వచ్చారు- “పిలిచారమ్మా” అంటూ-
“ఔను పిలిచాను. ఏం? పిలిస్తేనే వస్తారా! మీరుగా వచ్చి నన్ను పలకరించరా! నేను ఇల్లు విడిచి అమ్మతో ముంబాయి వెళ్ళి ఎన్ని నెలలయిందో గుర్తుందా? అసలు నేనెప్పుడైనా గుర్తుకొస్తున్నానా!” అంటూ ప్రక్కనుంచిన రెండు చిన్న ప్యాకెట్లను ఇద్దరికీ అందించింది.
అప్పుడు ఇద్దరూ ఏక కంఠంతో బదులిచ్చారు- “మీరు మా చిన్నమ్మగారు. మిమ్మల్ని మరచిపోతామా! మీకు పెళ్ళి రోజు రానీయండి. అప్పుడు మా తడాఖా చూపిస్తాం” అంటూనే ఇద్దరూ ప్యాకెట్లు అందుకుని అదే కంఠస్వరంతో కళ్ళు పెద్దవి చేసుకుని అడిగారు-
“మాకెందుకమ్మా ఇవన్నీ!”
“విప్పి చూడకుండానే తికమక పడకండి. ఇవి మీకు కాదు. మీ యింట్లో ఇద్దరు చిన్నపిల్లలున్నారు కదా- వాళ్ళకూ ఈ రెండు రెడీ మేడ్ కిడ్స్ దుస్తులు. నేను యిచ్చానని చెప్పి పిల్లలకు తొడిగించండి. ”
“థేంక్యూ చిన్నమ్మగారూ! థేంక్యూ థేంక్యూ చిన్నమ్మగారూ!” ఇద్దరు పనిగత్తెలూ ఏక కంఠంతో అన్నారు.
“ఈ అరకొర ఆంగ్ల పదాలకు మాత్రం తక్కువ లేదు. అన్నాళ్ళ తరవాత ఊరుకొచ్చిన చిన్నమ్మను పలకరించాలన్న ధ్యాస మాత్రం లేదు. అంతే కదూ!” అంటూ ముబైల్ ని చేత బట్టుకుని --లేచిందామె.
“సారీ సారీ! వెరీ సారీ చిన్నమ్మగారూ! మీకు మాంచి ఫిల్టర్ కాఫీ చేసి పట్రానా?”
అక్కడ పని చేస్తూన్న ముగ్గురు నలుగురు పని వాళ్ళలో సీనియర్ పనిగత్తెయిన చంగాళమ్మ, విద్యా భవానిని వెంబడించింది ప్రాధేయ పూర్వకంగా అభ్యర్థిస్తూ—
దానికి భవాని కట్ రైట్ గా బదులిచ్చింది ఆగకుండానే- “ఇప్పుడు కాదు. నేను మా అన్నావదినెలతో కలసి తీసుకుంటాను. ఇప్పుడిక్కడ తచ్చాడ కుండా తిన్నగా వెళ్లి అమ్మకు యేదైనా కావాలేమోనని అడిగి తెలుసుకోండి”
ఆ మాటతో పనిగత్తెలిద్దరూ కాళ్ళకు మేకు దిగేసినట్లు ఆగిపోయారు యెక్కడివాళ్ళక్కడు బిత్తర చూపులు చూస్తూ-- “ముంబాయి వెళ్ళి కోర్టు చదువులు నేర్చుకుంది కదా! చిన్నమ్మ నిజంగానే యమ స్ట్రిక్కే సుమా! ఇప్పటికిప్పుడు చెప్పడం కష్టమేమోగాని- రేపు కోర్టు జడ్డిగా మారినా మారుతుందీ మహాతల్లి. రేపో మాపో పెళ్ళయితే రాబోయే మొగుడు ఈ మహాతల్లి దూకుడుకి యెలా తట్టుకుంటాడో—
పాండ్రంకి సుబ్రమణి గారి కొన్ని ఇతర రచనలు:
పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పాండ్రంకి సుబ్రమణి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

1) పేరు-పాండ్రంకి సుబ్రమణి
2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య
3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ
4)స్వస్థలం-విజయనగరం
5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు
6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.

a













Comments