ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 1
- seetharamkumar mallavarapu
- 6 hours ago
- 6 min read
#ఉదయరాగఉద్వేగాలు, #UdayaragaUdvegalu, #PandrankiSubramani, #పాండ్రంకిసుబ్రమణి, #TeluguSerials, #TeluguNovel, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ

ఉదయరాగ ఉద్వేగాలు ధారావాహిక ప్రారంభం
Udayaraga Udvegalu - Part 1- New Telugu Web Series Written By Pandranki Subramani Published in manatelugukathalu.com on 23/11/2025
ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 1 - తెలుగు ధారావాహిక
రచన: పాండ్రంకి సుబ్రమణి
ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత
మధుమురళి పని చేస్తూన్న కేంద్ర ప్రభుత్వ డిపార్టుమెంటు తరపున ఢిల్లీ ఇన్సిట్యూషనల్ ఇండష్ట్రియల్ యేరియాలో ఉన్నట్రైనింగ్ అకాడమీలో చేరి వారం రోజులు కావస్తూంది. అసిస్టెంట్ డైరక్టర్ గా తనకది మొదటి రిఫ్రెషింగ్ ట్రైనింగ్ కోర్సు. విశాలమైన మైదానం వంటి ప్రాంగణం, చుట్టు ప్రక్కల పచ్చదనం సంతరించుకున్న ఆహ్లాదకరమైన వాతావరణం. వర్క్ ప్రెజ్జర్ కి అతీతంగా చీకూ చింతాలేని దైనందిన జీవితం, ఆ శిక్షణా శిబిరానికి స్వంతం. వానా కాలంలో నడిరోడ్డున గొడుగు క్రింద పసందుగా నిల్చున్నంత బాదరా బందీ లేని యవ్వనపు రోజులు. ఉదయాన్నే తడిక తోస్తే యెదురయే స్వర్గ ద్వారం వంటి ఆఫీసర్ల వసతి గృహం. చేతికంది వచ్చే పెక్కు వసతులు. సానుకూల సౌక ర్యాలు. జెంట్స్ తో బాటు వివిధ ప్రాంతాలనుంచి ట్రైనింగ్ కోర్సులో చేరిన పంచరంగుల చిలకల్లాంటి అమ్మాయిలు. కొత్త రకాల దుస్తుల్లో రెడీ మేడ్ డిజైనర్ చీరల్లో నేలన జీరాడేలా వేసుకున్న ష్రగ్స్ లో కొత్త మెరుపులతో తేజరిల్లే సీతాకోక చిలకల్లాంటి యవ్వన వతులు.
పరిమళించే పడతుల నవ్వుల గలగలలు, ఓర చూపులతో ప్రక్క ప్రక్కనే కూర్చుని కొత్త కొత్త పెర్ ఫ్యూమ్లు వెదజల్లే అందాల భామలు. తరచి చూస్తే-- దాదాపు తనలా కోర్సుకి హాజరవుతూన్న ఆ లేడీ ఆఫీసర్లందరూ యింకా వివాహం కాని నవయవ్వన యింతులే-- చామంతులే! యవ్వనకాల ప్రాంగణాన నలువైపులా పారాడే పరిమళభరిత వీచికలే— హృదయాంగత మనోల్లాసాలే-- హాయి గొల్పే కాలేజీ రోజుల్ని తలంపుకి తెచ్చే అటువంటి రంగుల కలల్ని కళ్ళ ముందుకు తెచ్చే కమ్మటి కవితా ధార వంటి మధురాను భూతుల్ని ఉన్నపాటున చెదర గొడ్తూ రామకృష్ణా పురం నుండి తండ్రి త్యాగరాజునుండి ఒకపూట ఉదయాన రూములో టీ తాగుతూ తోటి ట్రైనీ క్యాండి డేట్లతో గప్పాకోడ్తూ కూర్చున్న మధు మురళికి ఫోను కాల్ వచ్చింది.
అంతటితో అతడి రంగుల ఇంద్ర ధనుస్సు పట్టున ఒరిగి బురద గుంతలో పడ్డట్లయింది. పట్టు దారం తెగింది ”నువ్వెవరికి యేమి చెప్పి యెలా చెప్పి వస్తావో నాకు తెలవదు— నాలుగు రోజుల లీవ్ ఆఫ్ ఆప్సెన్స్ తీసుకుని రేపు చెన్నై చేరుతావు. అక్కణ్ణించి తిన్నగా చెంగల్పట్టు చేరి కాంచీపరం వస్తావు. నేనక్కడ నీ కోసం యెదురు చూస్తుంటాను”
మధుమురళికి క్షణం పాటు నోట మాట రాలేదు. ఊపిరందుకోవడం మరిచాడు. కోర్సుకి సంబంధంలేని ప్రశ్నా పత్రం కళ్ళ ముందు ప్రత్యక్షమైనట్లయింది. మధుమురళి యెట్టకేలకు తేరుకోవటానికి ప్రయత్నిస్తూ నోరు తెరిచాడు. “తమిళనాడుకా! అక్కడకు నేనెందుకు నాన్నగారూ? మీరూ ఒకనాడు పలు ప్రాంతాలలోని పోస్టల్ డిపార్టుమెంటులో పని చేసిన వారేగా! క్లాస్ వన్- ఆఫీసర్ల ట్రైనింగ్ వ్యవహారాలు యెంత పకడ్బందీగా ఉంటాయో మీకు తెలియనిది కాదుగా! ప్రోగ్రామ్ ప్రిస్టీజియస్ తంతులా సాగుతుంది. నేను గాని ఇప్పుడు లీవ్ ఆఫ్ ఆప్సెన్సె అడిగితే పైకప్పు పెంకులెగిరి పోతాయి. ఇంతకీ టెంపుల్ సిటీ ఆఫ్ కాంచీపురంలో మనకున్న పనేమిటో--”
దానికి త్యాగరాజు వెంటనే బదులిచ్చాడు- “పనికాదు. వివాహానికి హాజరవాలి. నిజానికి మీ అమ్మను తీసుకు వెళ్ళాలనే ప్లాను వేసాను, టిక్కెట్లు కూడా బుక్ చేసాను. కాని— ఎక్కడో వంగి పని చేస్తున్నప్పు డు నడుం పట్టేసిందట. కదల్లేని పరిస్థితి. వైద్యులు ఎక్కడకీ కదలకూడదని ఆంక్షలు విధించారు. మీ చేల్లేమో- ఇయర్లీ యగ్జామ్స్ తో సమరం చేస్తూంది. మార్కులు తక్కువయితే గ్రేడేషన్ దెబ్బతింటుందట. అలాగ్గాని జరిగితే దాని కెరీర్ దెబ్బతినవచ్చట. కాబట్టి మనం తప్పకుండా వెళ్ళాలి, ఎక్కువ రోజులుండనవసరం లేదు. మూడు నాలుగు రోజల లీప్ ఆఫ్ ఆబ్సెన్స్ చాలు”
మధుమురళి ఊపిరి బిగపెడ్తూ స్పందించాడు- “మీరొక్కరు వెళితే చాలు కదా నాన్నగారూ! అంత ఖర్చుపెట్టి అంత తంటాలు పడి అంత దూరం నేను రావాలా!”
“చాలదు. నువ్వు తప్పకుండా రావాలి. మరచిపోకు— రేపు నీకు పెళ్ళి జరగాలి. మీ చెల్లికి జరగాలి. అప్పుడెవరొస్తారు? ”
“వాస్తవమే నాన్నగారూ! కాని-ఇప్పుడు నేనొక్కణ్ణి రాకపోతే పెళ్ళి వాళ్ళకు వచ్చే నష్టమేముంటుంది నాన్నగారూ!“
“బాగానే అడిగావు. ఇంతకీ యెవరింటి పెళ్ళనుకున్నావు? దీనదయాళన్ గారి కడపటి కూతురు శివగామి పెళ్ళి. ఆయనకు కొడుకుల్లేరు. ముగ్గురూ కూతుళ్ళే-- చిన్నప్పుడు నువ్వు శివగామిని చిత్తూరులో నేను డ్యూటీ చేస్తున్న పీరియడ్ లో చూసుంటావు”
మధు మురళి చప్పున ఆగిపోయాడు. ఏమి చెప్పాలి- యెలా చెప్పి ముందుకు సాగాలో అతడికి తోచలేదు. తనకి బాగా తెలుసు దీనదయాళన్ నాన్నగారికి సన్నిహితుడు- దగ్గరితనం గల స్నేహితుడు. వాళ్ళిద్దరు చిత్తూరులో కలసి పని చేసారు. ఇప్పటికి తమ కుటుంబ స్థితి ఓ మోస్తరుగా గాడిలోకి వచ్చింది గాని— అప్పుడలా కాదు. దీన స్థితిలో ఉండేది. వాళ్ళింట్లో యెప్పుడేమి వండుకున్నా మరచి పోకుండా యింటికి పంపించేవాళ్ళు. చిన్నప్పుడు తనకు నాటు కోడి మాంసం- మేక మాంసమంటే చాలా యిష్టం. కాని తరచూ కొనుక్కుని తినగలిగేంత తాహతు ఉండేది కాదు. కారణం— యింటి పరిస్థితులు కలిసొచ్చేవి కావు. తమ వద్ద ఉండే తాతయ్య జబ్బున పడి పోతుండేవాడు. వైద్య ఖర్చులు పెరిగి పోతుండేవి. నాన్న తట్టుకోలేక పోతుండేవాడు. బామ్మేమో ముందస్తు ఆలోచన ప్రకారం ఊళ్ళో అనారోగ్యం పాలయిన పెద నాన్న వద్ద ఉండేది తోడు కోడలకు తోడుగా--
తాతయ్య చివరి రోజుల వరకూ బామ్మ పెదనాన్న సత్యానందంగారి వద్దే ఉండిపోయింది. తాతయ్య మరణ శయ్యపైన ఉన్నప్పుడు బామ్మ పెద్ద కొడుకుతో వచ్చి తాతయ్య చివరి చూపుకి నోచుకుంది. అప్పుడు దీనదయాళన్ గారే దగ్గరుండి అంత్య క్రియలు పూర్తయే వరకూ నాన్నకు వత్తాసుగా ఉండి తాతయ్య మరణ ధ్రువపత్రం అందేంత వరకు అంతా తానై చూసుకున్నారు. అటువంటి గడ్డు పరిస్థితిలో ఆయన సతీమణి ధనమ్మాళ్ కూడా తోడుగా ఉండేవారు. తనకిప్పుడు శివగామి ముఖం గుర్తుకు రావడం లేదు గాని— మిగతావన్నీ కళ్ళకు కట్టినట్టు గుర్తే-- అప్పంటికింకా చిన్న పిల్లయిన మాధవి యెక్కువ సమయం దీనదయాళన్ గారింట్లోనే ఉండేది, ఆయన భార్య ధనమ్మాళ్ తో మక్కువ పెంచుకుంటూ- వాళ్ళ ముగ్గురు అక్కాచెళ్ళెల్లతో కలసిపోతూ- -
ఎంతటి వయసొస్తే మాత్రం జీవన ప్రవాహంలో యెంతటి ఉన్నతి సాధిస్తే మాత్రం, హృద్యమైన వాటిని తనెలా మరచిపోగలడు? అవన్నీ అంత త్వరగా మరచిపోతగ్గ గతకాల మామూలు విషయాలా!మెరుపు జలతారు ప్రోగుల్లా పెనవేసుకునే అనురాగ బంధాలు కదూ! చిట్ట చివరన ఆలోచనల్లో తేలిపోతూ మధు మురళి సమాధానానికి వచ్చాడు. ”అలాగే నాన్నగారూ! మీరు చెప్పినట్టు నాలుగు రోజుల లీవ్ ఆఫ్ ఆప్సెన్సె అడుగుతాను. అకాడమీ డైరక్టర్ యెన్ని రోజులిస్తారో తెలీదు. ఆయనిచ్చే పర్మిషన్ ప్రకారం ఫ్లయిట్ కి బుక్ చేసి చెప్తాను. మొత్తానికి లీవు వేసే ప్రసక్తికి తావులేకుండా రావటానికి ప్రయత్నిస్తాను”
అదెలాగ అని అడిగాడు త్యాగరాజు విస్మయంతో—
మధుమురళి విషయాన్ని విశదీకరించాడు- “అదెలాగంటే— మధ్యాహ్నం గాని సాయంత్రం గాని బయల్దేరానంటే శనివారమూ ఆదివారమూ సెలవులేగా— ఆదివారం సాయంత్రం గాని తిరుగు ప్రయాణం చేస్తే సోమవారం చేరుకోవచ్చు ఢిల్లీ— అప్పటికీ ఆలస్యమైతే యెక్కువలో యెక్కువ సోమవారం ఒకరోజు సెలవు తీసుకుంటే సరిపోతుంది. ట్రైనింగ్ పీరియడ్ లో స్వంత పనులు పెట్టుకుంటే యెలా అని అకాడమీ డైరక్టర్ గాని నిలదీస్తే దానికి తగ్గట్టుగా సమాధానం చెప్పుకుంటానులే--”
“అలాగే— ఇక విషయానికి వస్తాను. అకౌంటు లో క్యాష్ ఉంది కదూ!”
ఆమాట విన్నంతనే మధు నవ్వేసాడు.
“ఎందుకురా ఆ వెర్రినవ్వు? ” త్యాగరాజు అడిగాడు.
మధుమురళి అదే నవ్వు టోన్ తో బదులిచ్చాడు- “కాకపోతే మరేమిటి నాన్నగారూ! నేనేమిటి ఇంటర్ విద్యార్థినా అమ్మచుట్టూ మీ చుట్టూ ప్యాకెట్ మనీ కోసం తిరగడానికి—”
“ఓకే ఓకే!పెద్దవాడివయి పోయావు. ఆఫీసర్వి కూడా ఐపోయావు కదూ! మరచిపోయాన్రోయ్!”
“సారీ నాన్నగారూ!ఏదో మూడ్ లో ఉండి అమ్మతో అన్నట్టు అనేసాను. బయటకు వెళ్తున్నప్పుడు చిల్లర డబ్బలడిగితే అమ్మ పోపుడబ్బాలు వెతికి ఇచ్చేది కదా-- అప్పటి స్కూలు రోజులు జ్ఞప్తికి వచ్చి అలా అనేసిట్టున్నాను. ఇక నేనుంటాను నాన్నా! రానూ పోనూ ప్లేన్ టిక్కట్లు బుక్ చేసుకోవాలి కదా- వాటికి తగ్గట్టు టైమింగ్స్ కూడా చూసుకోవాలి కదా— నేనిక సెలవు తీసుకుంటాను. టిక్కెట్లు బుక్ చేసుకున్న తరవాత మీకు మెసేజ్ పింపిస్తాను” అని సంభాషణకు ముగింపు పలికాడు మధు.
చెన్నై విమానాశ్రయంలో దిగిన మధుమురళి ఖర్చు ముఖం చూడకుండా జాప్యానికి తావివ్వకుండా తిన్నగా టాక్సీ తీసుకుని దారిలో ఒక కప్పు టీ మాత్రం తీసుకుని చెంగల్పట్టులో దిగాడు. చెంగల్పట్టుకి హైవే సాదా సీదాగా సుమారు ముప్పై ఐదు కిలోమీటర్ల దూరాన ఉంటుంది. చూపుడు వ్రేలు చూపించినట్టు నల్లేరు నడకలా వచ్చేస్తుంది. ఇదంతా అతడు తన సహ చెన్నై ట్రైనీ నుండి తెలుసుకున్నాడు. అక్కడాగి, ఎందుకైనా మంచిదనుకుని ముందు జాగ్రత్తగా అల్పాహారం ఆరగించి కాస్తంత సేద దీర్చుకుని సబర్బన్ బస్సెక్కి కాంచీపురం చేరాడు. అప్పుడతనికి మొదటిసారి గ్రాహ్యానికి వచ్చింది; ఎందుకు కాంచీపురాన్ని సిటీ ఆఫ్ టెంపుల్స్ అని పిలుస్తుంటారో నని--
అప్పటి పూర్వ కాలంలో పల్లవులో చాళుక్యలో కట్టి వెడలిన గుళ్లూ గోపురాలూ దారి పొడువునా దర్శనమిచ్చాయతనికి. పరకాయించడం పూర్తయిన తరవాత అతడు వచ్చిన పని మరచిపోకుండా వెంటనే తండ్రికి పోన్ చేసి కళ్యా ణ మండపం యెక్కడుందో తెలుసుకుని పెళ్ళివారి విడిదికి చేరుకున్నాడతను. అతణ్ణి చూసి త్యాగరాజూ దీనదయాళన్ యిద్దరూ నవ్వుతూ యెదురొచ్చారు. మధు మురళి పెద్దలిద్దరి కాళ్ళకూ వంగి నమస్కరించాడు. ఆశీర్వదిస్తూ దీనదయాళన్ అతణ్ణి ఆలింగనం చేసుకున్నాడు- “నిన్ను చూసి యెన్నాళ్ళయిందోయ్!” అంటూ--
మధు ప్రతిస్పందనగా నవ్వుతూ అడిగాడు- “నిజం చెప్తున్నాను అంకుల్—నాకు శివగామి రూపం అస్సలు గుర్తుకు రావడం లేదు. మీరూ ఆంటీ మాత్రమే బాగా గుర్తు-- ఇప్పుడెలాగుంది అంకుల్? చదువు బాగా సాగిందా!”
“దానికేం— అక్కయ్యల కంటే మంచి పొడవు. ఎరుపు కూడాను. మగాళ్ళకంటే ఆడాళ్ళకు జ్ఞాపక శక్తి యెక్కువంటారు కదా-- నిన్ను చూసి సంతోషంతో కేరింతలు కొడ్తుందనుకో! స్టడీస్ లో డిప్లొమా తీసుకుంది. ఉద్యోగం కోసం ట్రై చేస్తుంది”
అప్పుడు దరహాసంతో అడ్డు వచ్చి అన్నాడు మధు -“నిజం చెప్తు న్నాను మీరు తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు అంకుల్. ధనమ్మాళ్ ఆంటీ గారు చిత్తూరులో కొన్నాళ్ళు గడిపినా యింత స్పష్టంగా తెలుగు మాట్లాడలేరనే అనుకుంటాను”
దీనదయాళన్ చిర్నవ్వు చిందిస్తూ అక్కడ నిల్చున్న ఓ అబ్బాయికి మధు చేతిలోని సూట్ కేసు తీసి అందించి ముందుకు నడుస్తూ అన్నాడు- “యు ఆర్ రైట్! మీ అంటీకే కాదు— మా ముగ్గురమ్మాయిలకూ తెలుగు సరిగ్గా రాదు. ఇంతకీ యిక్కడ తెలుగు వారి ఉనికి తక్కువేమీ కాదు. అన్నట్టు చెప్పడం మరచిపోయేటట్టున్నాను — క్లాస్-ఒన్ ఆఫీసర్ పోస్టు అందుకున్నందుకు హార్టీ కంగ్రాట్స్! నేనూ మీ నాన్నా గ్రూప్-బి పోస్టుని అందుకోవడానికే యేండ్లు పట్టాయి”
“థేంక్స యె లాట్ అంకుల్! మీరిద్దరు మిత్రులూ ఆత్మతృప్తితోనే కదా రిటైరయారు, విత్ క్లీన్ స్లేట్-- ఇప్పుడు శివగామిని చూడొచ్చా అంకుల్—”
“ వైనాట్? కొత్తవాడిలా అడుగుతున్నావేమిటి? నీరాక గురించి తెలుసుకుని నీ కోసం రెండు మూడు సార్లు అడిగింది శివగామి. అదంతా తరవాత మాట్లాడుకుందాం గాని, ముందు స్నానపానాదులు ముగించు. ఆతరవాత వెళదాం ఆడాళ్ళ విడిదికి. మేడమ్ గారికి ఒంట్లో బాగా లేదని విన్నాను. ఆమె గారు గాని వచ్చుంటే యింకా బాగుణ్ణు. ఇంతకీ మా ఊరు యెలా ఉంది? నచ్చిందా!”
మధు మురళి నిదానంగా స్పందించాడు--“యాజ్ యె మేటరాఫ్ ఫ్యాక్ట్— ఇక్కడకు వచ్చిన తరవాత నాకు ఇంతకు ముందెన్నడూ లేని అనుభూతి కలిగింది అంకుల్. లోపల మండపమంతా పెళ్ళి కళ. బయటేమో— గుళ్ళూ గోపురాల మధ్య- గంటల నిస్వనాల మధ్య ఆధ్యాత్మిక జీవ కళ. అడుగు అడుగునా ఎదురొచ్చి దీవించే దైవ విగ్రహాలు-- మాటల ముత్యాలతో వర్ణించ తరమా! అదేదో దేవ సభలో ఉన్నట్లుంది”
నిజంగానా-అని గట్టిగా నవ్వేసాడు దీనదయాళన్.
అప్పుడు త్యాగరాజు అడ్డువచ్చి కొడుకు భావోద్వేగానికి అడ్డుకట్ట వేసాడు- “ఇక చాలించరా నీ భావావేశాన్ని— మొత్తానికి నీది ఉడుకు రక్తం అనిపిం చుకున్నావు! ముందు మీ అంకుల్ తో వెళ్ళి స్నానపానాదులు ముగించి రా- నేనిక్కడే ఉంటాను మిగిలిపోయిన పెళ్ళి పనులు చూసుకుంటూ- అమ్మాయి తరపు వారికి చిల్లర మల్లర పనుల్లో వత్తాసు యిస్తూ-”
మధుమురళి అలాగే అంటూ దీనదయాళన్ తో కలసి మేడ పైకి నడిచాడు. అప్పుడక్కడ అతడికి యెవరో యెదురు వచ్చి స్నానాల గది వేపు దారి చూపించాడు.
===============================================
ఇంకా వుంది
ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 2 త్వరలో
===============================================
పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పాండ్రంకి సుబ్రమణి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

1) పేరు-పాండ్రంకి సుబ్రమణి
2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య
3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ
4)స్వస్థలం-విజయనగరం
5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు
6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.





Comments