తోలు బొమ్మలు - పార్ట్ 11

Tholu Bommalu - Part 11 - Telugu Serial | Ch. C. S. Sarma
తోలు బొమ్మలు - పార్ట్ 11 - తెలుగు ధారావాహిక | సిహెచ్. సీఎస్. శర్మ
Published In manatelugukathalu.com On 18/11/2026
తోలు బొమ్మలు పార్ట్ 11లో చంద్రశేఖర్ బాల్య జ్ఞాపకాలు, సుశీల వివాహ నిర్ణయం, సత్యహరిశ్చంద్ర నాటక ప్రదర్శన ఆసక్తికరంగా సాగుతాయి. డాక్టర్ కావాలనుకున్న చిన్న చంద్రశేఖర్ చదువుపై తాతయ్య వీరరాఘవయ్య ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. మరోవైపు సుశీలను ధనుంజయరావుకు ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించడంతో కుటుంబంలో కొత్త పరిణామాలు చోటుచేసుకుంటాయి. సుశీలను ప్రేమించిన మురారి ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. చివరగా వీరరాఘవయ్య సత్యహరిశ్చంద్రుడిగా నటించిన నాటకంలోని హృదయవిదారక ఘట్టాలు చంద్రశేఖర్ మనసులో చెరగని ముద్ర వేస్తాయి.
జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సాక్ష్యాధారాలను బట్టి చంద్రశేఖర్ కు ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధింపబడుతుంది. జైలు నిశ్శబ్దంలో చంద్రశేఖర్ కలం పట్టాడు. తాత వీరరాఘవయ్య నుంచి మొదలైన జ్ఞాపకాలు చివరికి సుశీల–ధనుంజయరావుల వివాహ ప్రతిపాదన వరకు చేరుకున్నాయి. లో గ్రామానికి వచ్చిన సాంబయ్య తోలుబొమ్మల బృందం అతనిలో కొత్త ఆసక్తిని రేకెత్తిస్తుంది. ప్రదర్శన మధ్యలో ధనుంజయరావు ప్రవర్తనను గమనించిన చంద్రశేఖర్ మనసులో కొత్త సందేహం మొదలవుతుంది. కాశీ విశ్వనాథ ఆలయ చరిత్ర, పంచారామ క్షేత్రాల పురాణ నేపథ్యం, ద్వాదశ జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తిపీఠాలు, ప్రసిద్ధ శివాలయాల ప్రత్యేకతలను తెలుసుకుంటూ అక్కాతమ్ముళ్లు ఆసక్తిగా వింటారు. అయితే ధనుంజయరావుతో సుశీల వివాహం జరగవచ్చనే సూచనపై సత్యయ్య తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తాడు. తోలు బొమ్మలు పార్ట్ 10లో పార్వతీపురం గ్రామంలో ప్రదర్శించిన బాలనాగమ్మ వీధి భాగోతం ద్వారా తెలుగు జానపద కళల వైభవాన్ని రచయిత సిహెచ్. సీఎస్. శర్మ ఆసక్తికరంగా ఆవిష్కరించారు.
గత ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తోలు బొమ్మలు – నవల పరిచయం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తోలు బొమ్మలు - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తోలు బొమ్మలు - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తోలు బొమ్మలు - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తోలు బొమ్మలు - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తోలు బొమ్మలు - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తోలు బొమ్మలు - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తోలు బొమ్మలు - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తోలు బొమ్మలు - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తోలు బొమ్మలు - పార్ట్ 11 – సత్యహరిశ్చంద్ర నాటకం
అక్క కావ్య, నేను, గోపాలయ్య మాస్టర్ గారి కూతురు చంద్రిక మా ఊరి ప్రాథమిక స్కూల్లోనే చదువు కున్నాము. మా అక్క కావ్య మూడవ తరగతిలో ఉండగా టైఫాయిడ్ జ్వరం వచ్చింది. ఆ కారణం పరీక్షలు రాయలేకపోయింది. రెండవ తరగతిలో ఉన్న నేను, చంద్రికా పాసయ్యాము.
మేము మూడవ తరగతికి వచ్చాము. అనారోగ్య కారణం పరీక్ష రాయని అక్క, మాతో పాటే మూడవ తరగతిలో రెండవసారి చదివింది. అక్క చాలా తెలివికలది. అన్నింటిలో ఆమెకే ఫస్టు మార్కులు.
నేను విపరీతంగా ఆటలు ఆడువాడిని, పరీక్ష రోజుల్లో అక్కతో కలసి చదివేవాడిని. అక్కకు ప్రతి సబ్జెక్టు తొంభైకి పైగా మార్కులు వస్తే, నాకు నలభై ఐదు, యాభై లోపల వచ్చేవి. చంద్రిక అక్కతో పోటీపడి చదివేది. ఆమె క్లాసులో సెకండ్ ర్యాంకు.
ఒకరోజు మా తాతయ్య నన్ను పిలిచారు. దగ్గర కూర్చోబెట్టుకున్నారు.
‘‘చిన్నా!... నీవు పెద్దయితే ఏం కావాలనుకుంటున్నావ్!...’’ అడిగారు.
‘‘నేను డాక్టర్ కావాలనుకుంటున్నా తాతయ్యా!...’’ చెప్పాను.
అదే సమయానికి, ఆ రోజు ఆదివారం అయినందున గోపాలయ్య మాస్టర్ మా తాతగారితో మాట్లాడాలని వచ్చారు. ఆయన మాకు బంధువే. మా అమ్మ చిన్నానగారి కుమారుడు.
‘‘ఏంటి బావా!... ఏమంటున్నాడు మనవడు?...’’ నవ్వుతూ అడిగాడు.
‘‘పెద్దయితే డాక్టర్ అవుతాడట, గోపాలం. రా కూర్చో!...’’ అన్నాడు తాతయ్య.
‘‘ఏరా!... డాక్టర్ అవుతావా!...’’
ఆయన్ను చూస్తే నాకు భయం. మాస్టారు గారు కదా, అందువల్ల, తల ఎగరేశాను జవాబుగా.
‘‘బావా!... వీడికి ఆటల మీద ఉన్న ధ్యాస చదువు మీద లేదు. కావ్యకు అన్ని సబ్జెక్టుల్లో నూటికి తొంబైకి పైగానే, నా కూతురు చంద్రికకు కావ్య పోటీ. ఇద్దరూ పద్ధతిగా చదువుతారు. కానీ నీ ముద్దుల మనవడు సరిగా చదవని కారణంగా వచ్చే మార్కులు నలభై లోపే!...’’
‘‘అలా మార్కులు వస్తే డాక్టర్ ఎలా అవుతాడు బావా!...’’ ప్రశ్నార్థకంగా తాతయ్య ముఖంలోకి చూశాడు గోపాలయ్య మాస్టారు.
తాతయ్య ప్రశ్నార్థకంగా నా ముఖంలోకి చూశారు. అదే నిజం కాబట్టి నేను బుంగమూతితో తలదించుకున్నాను.
‘‘గోపాలం, వాడి విషయంలో నీవు కొంచెం శ్రద్ధ తీసుకోవాలయ్య’’ అన్నాడు తాతయ్య.
‘‘అందరికీ చెప్పినట్లే వీడికీ చెబుతాను బావా!... కానీ వీడి ధ్యాసంతా ఆటలమీద. ఏమాట కా మాట చెప్పుకోవాలి. అన్ని ఆటల్లో వీడే ఫస్టు...’’ చిరునవ్వుతో చెప్పాడు గోపాలం మాస్టారు.
‘‘చిన్నా!...’’
నేను తల ఎత్తి తాతయ్య ముఖంలోకి భయంగా చూశాను.
‘‘చంద్రా!... డాక్టర్ కావాలంటే బాగా అక్క, చంద్రికల్లా చదవాలి. ముగ్గురూ ఒకే తరగతి కదా!... నీవు కష్టపడి చదవాలయ్యా!...’’ అనునయంగా చెప్పాడు తాతయ్య.
క్షణం తర్వాత.
‘‘గోపాలం!... ఏమిటి విశేషాలు?...’’
‘‘మరేం లేదు బావా!... మన స్కూలును మాధ్యమిక స్కూలుగా మార్చేదానికి ప్రయత్నించండి బావా!... ఈ సంవత్సరం ఐదవ తరగతిలో పాతికమంది పిల్లలున్నారు. వారు మన స్కూల్లోనే వచ్చే సంవత్సరం ఆరవ తరగతి చదివేలా మీరు జిల్లా పరిషత్తు అధ్యక్షులు గారితో మాట్లాడితే బాగుంటుంది...’’ వినయంగా చెప్పాడు గోపాలయ్య మాస్టారు.
‘‘అవును, ప్రతి సంవత్సరం ఒక్కో తరగతి పెంచుకుంటూ పోయే విధంగా నేను పట్నంలో అధ్యక్షులు మార్కండేయులతో మాట్లాడతాను. పై సంవత్సరం మన స్కూల్లో ఆరవ తరగతి ప్రారంభిద్దాం. సరేనా!...’’
‘‘చాలా సంతోషం బావా, మరో విషయం నేను ఎం.ఏ. పాసయ్యాను బావా!...’’
‘‘అలాగా!... నాకు పరమానందం గోపాలం. అయితే నీవే హెడ్ మాస్టర్ అవుతావ్!...’’
‘‘బావా!... మీరు తలచుకొంటే!...’’
‘‘తప్పకుండా!...’’
‘‘సరే బావా!... ఇక నేను వస్తాను. సరే చంద్రా, అక్క దగ్గర కూర్చొని బాగా చదువు!...’’ అన్నాడు గోపాలం మాస్టారు.
‘‘గోపాలం!....’’
‘‘బావా!...’’
‘‘ప్రతిరోజూ సాయంత్రం వేళ నీవు చంద్రానికి ఒక గంట శిక్షణ ఇవ్వగలవా!...’’
‘‘బావా!... మీరు వాడిని నా ఇంటికి పంపితే తప్పకుండా వాణ్ని ఆకురాయిని చేస్తాను...’’
‘‘చిన్నా!...’’
‘‘తాతయ్యా!...’’
‘‘ఈ సాయంత్రం నుంచి ప్రతిరోజు నీవు గోపాలం ఇంటికి వెళ్ళి చదువుకొని రావాలి, సరేనా!....’’
‘‘అలాగే తాతయ్యా!...’’
‘‘సరేరా!... ఐదున్నరకల్లా ఇంటికి పుస్తకాలు తీసుకొని రా!... బావా, నేను వెళ్ళొస్తాను!...’’
‘‘మంచిది గోపాలం...’’
గోపాలయ్య మాస్టారు వెళ్ళిపోయారు.
‘‘చూడు నాన్నా!... నీవు బాగా చదివి అన్ని సబ్జెక్టుల్లో అక్కా చంద్రికల కన్నా పరీక్షలు బాగా రాసి, వారికన్నా నీవు ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి. సరేనా చిన్నా!...’’ అనునయంగా చెప్పాడు తాతయ్య.
‘‘అలాగే తాతయ్యా!...’’ తల ఆడించాను.
గోవర్ధనరావు గారు, సరాగాల సాంబయ్యగారూ గేటు తెరుచుకొని లోనికి ప్రవేశించారు.
‘‘చిన్నా!... నీవు లోపలికి వెళ్ళు...’’ అన్నాడు తాతయ్య.
నేను ఇంట్లోకి వెళ్ళాను. తలుపు చాటున ఓరగా నిలబడి వరండాలోకి చూస్తున్నాను.
‘‘బావా!... నమస్కారం...’’ గోవర్థనరావు గారి మాట.
‘‘సార్!... వందనములు...’’ సరాగాల సాంబయ్య పలుకు.
‘‘రండి, రండి!...’’ తాతయ్య ఆహ్వానం.
ఇరువురూ వరండాలో ప్రవేశించారు. తాతయ్య ఎదురుగా కూర్చున్నారు.
‘‘బావా!... ఏమిటి విశేషం?...’’ చిరునవ్వుతో అడిగాడు తాతయ్య.
నాయనమ్మ నన్ను చూసింది, సమీపించింది.
‘‘చిన్నా, ఇక్కడ నిలబడడం ఏందిరా!...’’ అడిగింది.
గోవర్ధనరావు, సరాగాల సాంబయ్య వచ్చారని మెల్లగా చెప్పాను. ఆమె నా పక్కనే నిలబడింది. వరండా వైపు చూసింది.
‘‘బావా!... నీతో రెండు విషయాలను గురించి మాట్లాడాలని వచ్చాను...’’ అన్నారు గోవర్ధనరావు గారు.
‘‘ఓహో అలాగా!...’’
‘‘అవును బావా!...’’
‘‘చెప్పు ఆ రెండు విషయాలేమిటో!...’’
‘‘అయ్యా!... తమరి అమ్మాయి సుశీల గారి చదువు ప్రశస్తంగా పూర్తయింది కదా!...’’ నవ్వుతూ చెప్పాడు సరాగాల సాంబయ్య.
‘‘సాంబయ్యగారు తమరు మౌనంగా వుండటం మంచిది!...’’ నవ్వుతూ అన్నారు తాతయ్య.
‘‘బావా!... చెప్పు విషయం ఏమిటో?...’’ అడిగాడు.
గోవర్ధనరావు గొంతు సంవరించాడు.
‘‘ఏం బావా!... ఏమైనా తాగుతావా?.. అమ్మా సుశీ!... ఇలా రా!....’’
ఊయలపీట మీద ఉన్న అత్తయ్యను చూసి నాయనమ్మ ‘‘సుశీ!...’’ వరండా వైపుకు చేతిని చూపి, తాతయ్య పిలుస్తున్నాడన్నట్లు సైగ చేసింది.
అత్తయ్య ఊయలపీట మీద నుంచి దిగి వరండాలోకి ప్రవేశించింది.
‘‘అమ్మా!... మీ మామయ్య వచ్చారు చూడు. కాఫీ తీసుకొని రామ్మా!...’’
‘‘అలాగే నాన్నా!...’’ అత్త వేగంగా వంట ఇంటివైపుకు నడిచింది.
కాఫీ పెడుతున్న అమ్మ కిటికీలోంచి గోవర్ధనరావు, సరాగాల సాంబయ్య రావడం చూసింది. మూడు కప్పుల కాఫీని ప్లాటులో పెట్టి అత్త చేతికి అందించింది. అత్తయ్య వరండాలో ప్రవేశించి కాఫీ కప్పులను ముగ్గురికీ అందించి ఇంట్లోకి వచ్చి ఊయలపీట మీద కూర్చొని ఏదో పుస్తకాన్ని చదవసాగింది.
‘‘బావా!...’’
‘‘చెప్పు బావా!...’’
‘‘నేను మన ధనుంజయకు వివాహం చేయాలనుకుంటున్నాను.’’
‘‘చాలా మంచి విషయం కదా బావా!... వాడు ఎం.ఏ. పాసయ్యాడుగా!...’’
‘‘అవును బావా!...’’
‘‘నాకు...’’
‘‘ఆ చెప్పు బావా!...’’
‘‘మన సుశీలను నా కోడలిగా చేసుకోవాలనుకుంటున్నాను. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏమిటి బావా!...’’ మెల్లగా అడిగాడు గోవర్ధనరావు.
‘‘అలాగా!...’’
‘‘అవును బావా!...’’
‘‘సరే, అందరితో మాట్లాడి, నేను నా అభిప్రాయాన్ని నీకు తెలియజేస్తాను...’’
‘‘ఎప్పుడు?...’’
‘‘ఒకటి రెండు రోజుల్లో!...’’
‘‘బావా!... మీరు నా కోర్కెను తీర్చాలి!...’’ ప్రాధేయ పూర్వకంగా కోరాడు గోవర్థనరావు.
‘‘ఇది మొదటిది, మరి రెండవది ఏమిటి?...’’ అడిగాడు తాతయ్య.
‘‘ఈ మధ్యన తోలు బొమ్మలాటలు వీధి భాగోతాలు చూచి తరువాత మనం ఒక నాటకాన్ని వేస్తే బాగుంటుందని నా అభిప్రాయం...’’ నవ్వుతూ చెప్పారు గోవర్ధనరావు గారు.
‘‘ఓహో అదా!... సరే బావా వేద్దాం. ఏ నాటకం వేద్దాం?’’ అడిగాడు తాతయ్య.
‘‘అయ్యా!... నాకూ రంగు పిచ్చి ఉంది. మీరు ఆడబోయే నాటకంలో నాకూ ఒక పాత్రనివ్వండి...’’ నవ్వుతూ అడిగాడు సరాగాల సాంబయ్య.
‘‘సత్యహరిశ్చంద్ర వేద్దాం బావా!...’’ అన్నాడు గోవర్ధనరావు.
‘‘అందులో, నీ పాత్ర ఏమిటి?...’’ తాతయ్యగారి ప్రశ్న.
‘‘ఒకటి కాదు బావా, రెండు. విశ్వామిత్రుడు, వీరబాహుడు. మీరు హరిశ్చంద్రుడు...’’
‘‘నేను నక్షత్రకుని పాత్ర వేస్తాను గోవర్ధనరావు గారూ!...’’ అన్నాడు సరాగాల సాంబయ్య.
‘‘వరి కోతలు కావడంతోటే నాటకాన్ని వేద్దాం బావా!... కావలి కాంతయ్యకు హార్మోనియం పెట్టెతో రెండు వారాల తర్వాత రమ్మని కబురు పంపుతాను...’’ అన్నాడు తాతయ్య.
‘‘అయ్యా!... చిన్న ప్రశ్న?...’’ అన్నారు సరాగాల సాంబయ్య.
‘‘ఏమిటి?...’’ తాతయ్య ప్రశ్న.
‘‘మరి చంద్రమతి?...’’
‘‘నెల్లూరి నారాయణి. ఆమె మంచి నటి!... మాతో కలసి చాలా నాటకాలు లోగడ వేసింది...’’ తాతయ్యగారి జవాబు.
‘‘సరే బావా!... ఇక నేను బయలుదేరుతాను...’’
గోవర్ధనరావు కుర్చీ నుండి లేచాడు.
‘‘మంచిది బావా!....’’
‘‘బావా!... మొదటి విషయం?...’’
‘‘రేపు సాయంత్రం తెలియజేస్తాను బావా!...’’ నవ్వాడు తాతయ్య.
‘‘వస్తాను బావా!...’’ బయలుదేరాడు గోవర్ధనరావు.
సరాగాల సాంబయ్య తాతయ్యకు నమస్కరించి గోవర్ధనరావు వెనుక పరుగెత్తాడు.
ఇంట్లో ఉన్న అమ్మ, అత్తయ్య, నాయనమ్మ, నా అక్క గోవర్ధనరావు గారి రాకను గురించి చర్చించుకున్నారు. వివాహ ప్రసక్తి రాగానే అత్తయ్య చిరునవ్వుతో తన గదిలోకి వెళ్ళిపోయింది, అత్తయ్య వెనుకనే అక్క.
నాన్న, చిన్నానలు పొలాల నుంచి వచ్చారు. స్నానాలు చేశారు. అందరం మధ్యాహ్నం భోజనాలకు డైనింగ్ టేబుల్ చుట్టూ కూర్చున్నాము.
అమ్మ, నాయనమ్మలు మాకు వడ్డిస్తున్నారు.
అత్తయ్య అమ్మ పిలుపువిని వచ్చింది.
‘‘అమ్మా!... నీవు నా ప్రక్కన కూర్చో...’’ అన్నాడు తాతయ్య.
అత్తయ్య తాతయ్య పక్కన కూర్చుంది, తలదించుకుంది. మరో పక్క నేను. మాకు ఎదురుగా నాన్న, నా అక్క, బాబాయ్ కూర్చున్నారు.
తాతయ్య తలవంచి అత్తయ్య ముఖంలోకి చూస్తూ....
‘‘అమ్మా!... నీకు ధనుంజయ అంటే ఇష్టమేనా తల్లి!...’’ మెల్లగా అడిగారు.
‘‘నాన్నా!... మీకు ఇష్టమైతే నాకూ ఇష్టమే నాన్నా!...’’ మెల్లగా చెప్పింది సుశీల అత్తయ్య.
తాతయ్య వదనంలో అంతులేని ఆనందం. వారు మా నాయనమ్మ ముఖంలోకి నవ్వుతూ చూచారు.
జవాబుగా నాయనమ్మ నవ్వింది. వారి మధ్యన మాటలు కళ్ళతోనే జరిగాయి.
బాబాయి తాతయ్య ముఖంలోకి చూచి మా నాన్నగారి ముఖంలోకి చూచాడు.
మా నాన్న తన ఎడమ చేత్లో మా బాబాయి భుజంపై మెల్లగా తట్టాడు. బాబాయి మౌనంగా తలదించుకొన్నాడు.
‘‘అందరూ వినండి!...’’ తాతయ్య గంభీరమైన పలుకు అందరం వారి ముఖంలోకి చూచాము.
‘‘మీ అందరికీ మన సుశీ మీద ఎంత ఆదరాభిమానాలు ఉన్నాయో నాకు తెలుసు. నా తల్లికి మనలనందరినీ వీడి మరో ఊరికి కోడలుగా వెళ్ళడం ఇష్టంలేదు. నాకూ నా బిడ్డకు దూరంగా ఉండాలనే భావనలేదు. కనుక నేను నా ఇష్టానుసారంగా ఆమె వివాహాన్ని నా చెల్లి నిర్మల కొడుకు ధనుంజయరావుతో జరపాలని నిర్ణయించుకున్నాను.
ఉదయం నా బావ గోవర్ధనరావు వచ్చి నాతో ఆ విషయాన్ని గురించి ప్రస్తావించారు. వారు మన సుశీలను తన కోడలిగా చేసుకోవాలనే తన కోరికను నాతో చెప్పారు. నేను అందరినీ సంప్రదించి చెబుతానన్నాను. నేను నా నిర్ణయాన్ని మీకందరికీ తెలియజేశాను. మీరు నాతో ఏకీభవిస్తారని నమ్ముతున్నాను...’’ భోజనం చేయసాగారు.
అందరం మౌనంగా భోంచేశాము. చేతులు కడుక్కున్నాము. పెద్దలందరూ వారివారి గదులకు వెళ్ళిపోయారు.
మా ఇంటి పనిమనిషి చంచమ్మ, ఆమె సోదరి మరకతం అక్కాచెల్లెళ్ళు కలసి వచ్చారు.
‘‘ఏమే మరకతం, ధనుంజయగారింట సరాగాల సాంబయ్య గారింట్లో పని ముగిసిందా!...’’ అడిగింది నాయనమ్మ.
‘‘అయిపోయిందమ్మా!...’’
‘‘ఏం ఇంటికి పోకుండా అక్కకు తోడుగా వచ్చావా?...’’
‘‘లేదమ్మగోరు!... మీతో ఓ విషయం చెప్పాలని వచ్చాను!...’’
‘‘ఏంటే ఆ విషయం?...’’
‘‘సరాగాల సాంబయ్య ఇంట్లో ఈ రోజు పెద్ద గొడవ జరిగిందమ్మగోరు!...’’
‘‘ఏ విషయంలోనే!...’’
‘‘సాంబయ్య కొడుకు పెళ్ళి విషయంలో!...’’
‘‘తండ్రికొడుకులు కొట్టుకోవడం తక్కువ. అంత పెద్దగొడవ జరిగింది అమ్మగోరు!...’’
‘‘ఇంతకు విషయం ఏమిటో చెప్పవే!...’’ అంది అమ్మ.
‘‘అమ్మగోరూ, ఆ మురారి సాంబయ్య పెద్ద కొడుకు...’’ నాలుగు వైపులా చూసి, ‘‘అమ్మా, వాడు మన సుశీలమ్మను ప్రేమించాడంట అమ్మా!... సాంబయ్య, గోవర్ధనరావుతో ఇక్కడికొచ్చి పెద్దయ్యగారితో సుశీలమ్మను ధనుంజయకిచ్చి పెళ్ళి చేయాలనుందని గోవర్ధనయ్య అడిగాడంట.
సాంబయ్య తన కొడుకు మురారిని గురించి పెద్దయ్యతో మాట్లాడలేదంట. ఆ మాట విన్న మురారి సాంబయ్యను తన్నబోయినాడు. నేను నీతో చెప్పింది ఏందీ, నీవు చేసుకొచ్చింది ఏందీ అని నిలదీసిండు.
సాంబయ్య 'గోవర్ధనాన్ని నేను ఎదిరించగలనా? వీరరాఘవయ్యను సుశీలను నీకిచ్చి పెళ్ళి చేయమని అడగగలనా!' అని యాష్టపోయిండు.
మురారికి చాలా కోపం వచ్చింది. సాంబయ్యను నోటికొచ్చినట్లు తిట్టిండు. 'నా కోర్కెను తీర్చలేని నీవు నా తండ్రివా!... చూస్తాను ఆ ధనుంజయగాడు ఆ సుశీలతో ఎలా కాపురం చేస్తాడో!...' ఎంతో కోపంగా సెప్పి వెళ్ళిపోయాడు మురారి.
సాంబయ్య, ఆయన భార్య సంగీత తలలు పట్టుకొని ఏడ్చారు. ‘గోవర్ధనరావుతో మనకు పోటీయా!...’ విచారంగా ఏడ్చారు అమ్మా!...’’ చెప్పడం ఆపింది మరకతం.
నాయనమ్మ, అమ్మ నవ్వుకున్నారు. మరకతం వెళ్ళిపోయింది. చంచమ్మ తన పని ప్రారంభించింది. మరుసటి రోజు తాతయ్య, నేను గోవర్ధనరావుగారి ఇంటికి వెళ్ళాము. మమ్మల్ని చూసిన గోవర్ధనరావు లేచి మాకు ఎదురువచ్చి తాతయ్య చేతులు పట్టుకొని...
‘‘బావా!... రండి రండి!...’’ ప్రీతిగా ఆహ్వానించాడు.
మా తాతగారి చెల్లెలు, గోవర్ధనరావు భార్య నిర్మలమ్మ తాతయ్యను చూసి...
‘‘అన్నయ్యా!... మీరు ఇలా రావడం నాకు ఎంతో సంతోషంగా వుందన్నయ్యా!...’’ నవ్వుతూ ఆనందంగా చెప్పింది.
హాల్లో సోఫాల్లో కూర్చున్నారు.
నిర్మలమ్మ వంటింట్లోకి వెళ్ళి మూడు గ్లాసులతో పాయసం తీసుకొనివచ్చి...
‘‘ఈ రోజు శుక్రవారం కదా అన్నయ్యా, పాయసం చేసి పార్వతీమాత శివయ్యలకు నైవేద్యం పెట్టాను. తీసుకోండి అన్నయ్యా!...’’ ముగ్గురికీ గ్లాసులందించింది.
‘‘చంద్రా!... బాగా చదువుతున్నావా!...’’ అడిగింది.
నేను తలఆడించాను.
ముగ్గురం పాయసం తాగాము.
‘‘అమ్మా నిర్మలా!... పాయసం అమృతంలా ఉందిరా!...’’ ఎంతో సంతోషంగా తాతయ్య చెప్పాడు.
‘‘ఆఁ... ధనుంజయ ఇంట్లో లేడా బావా!...’’ అడిగాడు తాతయ్య.
‘‘ఎరువులకోసం నెల్లూరు వెళ్ళాడు బావా!...’’
‘‘అలాగా!...’’
‘‘అవును...’’
‘‘సరే!... బావా!... నీ కోర్కెను, అదే నా కూతురు సుశీల నీ కోడలు. త్వరలో మంచి ముహూర్తాల్లో నిశ్చితార్థం, వివాహ ముహూర్తాన్ని నిర్ణయిస్తాను. సంతోషమేనా!...’’ నవ్వుతూ అడిగాడు తాతయ్య.
‘‘పరమానందం బావా!...’’
‘‘అన్నయ్యా!... చాలా చాలా సంతోషం...’’ ఎంతో ఆనందంగా నవ్వుతూ చెప్పింది నిర్మలమ్మ.
‘‘సరే!... మంచిది, వెళ్ళొస్తాం!...’’ తాతయ్య సోఫా నుండి లేచి బయలుదేరారు. వారి పక్కనే నేను. గోవర్ధనరావు, నిర్మలమ్మలు మాతో వీధిగేటు దాకా వచ్చారు.
మేము వీధిలో ప్రవేశించాము. మా ఇంటి వైపుకు నడిచాము. ఆ రాత్రి భోంచేసి ఎవరి గదుల్లో వాళ్ళు పడుకున్నాము.
నేను, తాతయ్య, నాయనమ్మలం తాతయ్య గారి గదిలో ఎప్పటిలా పడుకున్నాము.
మా అమ్మ నాన్నలు తలుపు తట్టారు...
నిద్రపోని నేను చంగున మంచందిగి వెళ్ళి తలుపు తీశాను.
‘‘ఏరా ఇంకా నిద్రపోలేదా!...’’ అడిగింది అమ్మ.
‘‘లేదమ్మా!... తాతయ్య పద్యాలు చెబుతుంటే, దేవుడికి సంబంధించినవి పలుకుతూ నేర్చుకొంటున్నాను...’’
తాతయ్య, నాయనమ్మలు లేచి మంచంపైన కూర్చున్నారు.
‘‘పద్మా!... ఏం నాయనా!... రండి లోపలికి!...’’ పిలిచాడు తాతయ్య.
అమ్మానాన్నలు గదిలోనికి వచ్చారు.
‘‘కూర్చోండి....’’ అంది నాయనమ్మ.
నాన్న కుర్చీలో కూర్చున్నాడు. అమ్మ వారి కుర్చీ వెనకాల నిలబడింది.
‘‘పద్మా!... ఏమిటి విషయం?..’’ అడిగారు తాతయ్య.
‘‘నాన్నా!... నేను సుశీని 'నీకు ధనుంజయ అంటే ఇష్టమేనా' అని అడిగాను. దానికి ఆమె నాకు చెప్పిన సమాధానం... 'అన్నయ్యా, నేను నావారైన మీ అందరినీ వదలి వేరే ఊరికి కోడలిగా మీకు దూరంగా వెళ్ళడం నాకు ఇష్టంలేదు. నేను నా జీవిత కాలంలో ఎప్పుడు మిమ్మల్ని చూడాలనుకుంటే అప్పుడు నేను మిమ్మల్ని చూడగలగాలి, మాట్లాడాలి.
అది నా నిర్ణయం కనుక నా వివాహ విషయంలో నాన్నగారి నిర్ణయమే నా నిర్ణయం అన్నయ్యా.' నాన్న నిర్ణయం నాకు పరమ సంతోషం అంది నాన్నా!... మనందరి మీద ఆమెకు అంత ప్రేమాభిమానాలు కనుక ఆమె వివాహం చుట్టుపక్కల గ్రామాల వారు చెప్పుకునేలా ఘనంగా జరిపించాలి నాన్నా...’’ నాన్న కళ్ళల్లో కన్నీరు.
‘‘నాయనా!... పద్మా!... నీ చెల్లి మీద నీకు ఎంత ప్రేమో నాకు తెలుసురా!...’’
‘‘నీ నిర్ణయం ప్రకారమే ఆమె వివాహాన్ని జరిపిద్దాం. సరేనా! పొద్దుపోయింది. వెళ్ళి పడుకోండి...’’ అనునయంగా చెప్పారు తాతయ్య.
నాన్న కుర్చీ నుంచి లేచారు.
‘‘అత్తయ్యా, వెళుతున్నా!...’’ నాయనమ్మను చూస్తూ చెప్పింది అమ్మ.
నాన్న తాతయ్యగారికి చెప్పి ముందు నడవగా, అమ్మ వారిని అనుసరించింది.
పురోహితులను పిలిపించారు. అత్తయ్య నిశ్చితార్థానికి, వివాహానికి ముహూర్తాలు నిశ్చయించారు తాతయ్యగారు.
పది రోజుల్లో నిశ్చితార్థం, నెలరోజుల తర్వాత వివాహం ముహూర్తాలు నిశ్చయం జరిగింది.
సంభావన ఘనంగా ఇచ్చి పురోహితులను సాగనంపారు తాతయ్య. గోవర్ధనరావు, నిర్మలమ్మ, ధనుంజయరావు ముఖాల్లో, మా అత్తయ్య ముఖంలో ఎంతో ఆనందం.
నిశ్చితార్థం ఘనంగా జరిపించారు తాతయ్యగారు. గ్రామస్థులు, పక్క ఊళ్ళల్లో ఉన్న మా కుటుంబ బంధువులు వచ్చారు. అందరూ సంతోషించారు.
కావలినుంచి హార్మోనియం విద్వాంసులు కాంతయ్యగారు వచ్చారు. మా అౌట్ హౌస్ లో సత్యహరిశ్చంద్ర నాటకం ప్రాక్టీసు. మా తాతయ్య మంచి పాటగాడు, నటుడు, అలాగే గోవర్ధనరావు గారు కూడా.
సత్యహరిశ్చంద్ర నాటకంలోని ముఖ్యపాత్రలు.
సత్యహరిశ్చంద్రుడు, భార్య చంద్రమతి, కుమారుడు లోహిత్ (సత్యహరిశ్చంద్రుడు అయోధ్యకు చెందిన సూర్యవంశపు రాజు/ఇక్ష్వాకు వంశం), సత్యకీర్తి (మంత్రి), విశ్వామిత్రుడు, నక్షత్రకుడు, మాతంగ కన్యలు, వశిష్ఠుడు, కాలకౌశికుడు, కలహకంఠి, వీరబాహుడు, పార్వతీ పరమేశ్వరులు.
కథ : ఒకనాడు దేవేంద్ర సభలో ఋషిపుంగవులందరూ సమావేశమవ్వగా, దేవతలరాజు దేవేంద్రుడు, సభాసదులను ఉద్దేశించి... ‘‘భూలోకంలో ఎవరైనా సత్యసంధులు ఉన్నారా?...’’ అని ప్రశ్నించాడు.
జవాబుగా వశిష్ఠ మహర్షి... ‘ఇక్ష్వాకు వంశస్థుడు (సూర్యవంశం/రఘువంశం) సత్యహరిశ్చంద్ర భూపాలుడు కలడు’ అని జవాబిచ్చాడు.
ఆ మాట వినగానే విశ్వామిత్రుడు ‘నేను ఆ రాజును అసత్యం పలుకునట్లు చేయుదును. చేసిన, నీవు ఏమి చేయుదువు!...’ అని వశిష్ఠులవారిని ప్రశ్నించాడు.
జవాబుగా వశిష్ఠులవారు ‘నేను శిరోముండనము గావించుకొని జపతపములను వదలి గాడిదపై ఊరేగెదను’ అని జవాబిచ్చి... ‘ఒక వేళ నీవు ఓడిపోయిన ఏమి చేయుదువు!?’ అని విశ్వామిత్రుని వశిష్ఠుడు అడిగెను.
జవాబుగా విశ్వామిత్రుడు... ‘నేను నా తపస్సంపదలో అర్ధభాగము హరిశ్చంద్రునికి ధారపోసి, స్వర్గంలో సురరాజు స్థానాన్ని హరిశ్చంద్రునికి కట్టబెడతాను.’ అంటాడు విశ్వామిత్రుడు.
వారి వారి ప్రతిజ్ఞ ప్రకారం కాశీరాజ్యానికి వచ్చి విశ్వామిత్రుడు సత్యహరిశ్చంద్రుని కలిశాడు. రాజు వారిని సగౌరవంగా ఆహ్వానించి ఆశీస్సులను కోరాడు.
‘నేను గొప్పయాగాన్ని చేయబోతున్నాను రాజా!... నాకు మీరు కొంత ధన సహాయము చేయవలె!...’ కోరాడు విశ్వామిత్రుడు.
‘‘ఎంత కావలయునో తెలియజేయండి మహర్షీ – ఇచ్చెదను.’’ సత్యహరిశ్చంద్రుని సమాధానము.
‘‘ఒక బలమైన వ్యక్తి ఏనుగు పైకెక్కి గగనము వైపుకు రాయిని విసిరిన, అది ఎంత ఎత్తు ఎగురునో, అంత ధనము కావలయును రాజా!...’’
‘‘అలాగే మహర్షీ!...’’
బలమైన వ్యక్తి ఏనుగు పైకి ఎక్కడం, రాయిని గగనమువైపు విసరడం జరిగింది.
సత్యహరిశ్చంద్రుడు అంత ధనమునూ ఇచ్చుటకు సంసిద్ధులై... ‘‘మహఋషీ ధనమును గైకొనుడు. మీ ఆశ్రమమునకు తరలించెదను...’’ అన్నాడు.
‘‘హరిశ్చంద్రా!... నాకు ఆ ధనము ఇప్పుడు అవసరము లేదు. నేను ఆ యాగమునకు అవసరమైన ఇతరములను సిద్ధము చేసుకొని మీకు తెలిపెదను. అప్పుడు పంపండి..’’ చెప్పారు విశ్వామిత్రులవారు.
‘‘అటులనే స్వామీ!...’’ అంగీకరించాడు సత్యహరిశ్చంద్రుడు, విశ్వామిత్ర మహర్షి వెళ్ళిపోయాడు.
కొన్ని దినముల తర్వాత అప్సరసలను మించిన అందగత్తెలను ఇరువురిని అయోధ్యకు పంపాడు విశ్వామిత్రుడు. వారు దర్బారులో రాజుగారిని కలసి...
‘‘మేము మిమ్ములను వరించాము. మీరు మా ఇరువురినీ వివాహము చేసుకోవలెను...’’ కోరారు ఆ మాతంగకన్యలు.
‘‘నాకు వివాహం అయినది. ఒక పుత్రుడూ ఉన్నాడు. నేను ఏకపత్నీవ్రతుడను. మిమ్ములను పరిణయమాడలేను..’’ చెప్పాడు సత్యహరిశ్చంద్రుడు.
మాతంగకన్యలు వెళ్ళి విషయాన్ని విశ్వామిత్రుల వారికి తెలియజేశారు.
ఆగ్రహావేశంతో, ఆ కన్యలతో, విశ్వామిత్రుడు సత్యహరిశ్చంద్రుని దర్బారుకు వచ్చాడు.
‘‘హరిశ్చంద్రా!... ఈ కన్యలు నా అభిమాన పుత్రికలు. నిన్ను వలచినారు నీవు వీరిని వివాహము చేసికొనవలె!...’’ అదేశించినాడు.
‘‘మహర్షీ!... అది నాకు అసాధ్యము... కారణం నేను వివాహితుడను... నన్ను మన్నించండి...’’
ప్రాధేయపూర్వకంగా చెప్పాడు సత్యహరిశ్చంద్రుడు.
‘‘నా కోర్కెను ధిక్కరించిన, నీవు నీ సామ్రాజ్యమును సింహాసనమును నాకు ధారపోయవలె!...’’ అవి విశ్వామిత్రులవారి వేడివాడి పలుకులు.
సత్యహరిశ్చంద్రుడు వారిని సమీపించి... ‘‘స్వామీ, నేను నా యావత్ సామ్రాజ్యాన్ని, సింహాసనాన్ని తమరికి ధారపోయుదును...’’
భటునితో జలపాత్రను తెప్పించి, విశ్వామిత్రులవారి కుడి చేతిలో తన కుడిచేతిపై నుంచి జలధారతో మహర్షికి తన సర్వం ధారపోసినాడు.
తాను, తన భార్య చంద్రమతి, పుత్రుడు లోహితాస్యుడితో విశ్వామిత్రులవారికి నమస్కరించి రాజమందిరం నుండి బయలుదేరబోయాడు సత్యహరిశ్చంద్రుడు.
‘‘హరిశ్చంద్రా!... ఆగు!...’’ అన్నాడు విశ్వామిత్రుడు.
ఆగి వెనుదిరిగి చూశాడు హరిశ్చంద్రుడు.
‘‘నీవు నాకు ఇస్తానన్న ధనము, నాకు ఇచ్చి వెళ్ళుము!...’’ విశ్వామిత్రుల వారి కర్కశమైన పలుకులు.
సత్యహరిశ్చంద్రుడు విరక్తిగా నవ్వి విశ్వామిత్రుల వారిని సమీపించి ‘‘మహర్షీ!... ప్రస్తుతం నా వద్ద చిల్లిగవ్వ కూడా లేదు. నాయందు దయ ఉంచి, నెలరోజులు గడువు ప్రసాదించండి. ఆ ధనమును నేను మీకు ఇచ్చెదను...’’ ఎంతో వినయంగా కన్నీటితో చెప్పాడు సత్యహరిశ్చంద్రుడు.
విశ్వామిత్రుల వారు అందులకు అంగీకరించి, సత్యహరిశ్చంద్రులవారి వెంట తన ప్రియశిష్యుడు నక్షత్రకుడిని, ధనమును వసూలు చేసికొని రాను వారి వెంట పంపాడు... నక్షత్రకునితో కలసి సత్యహరిశ్చంద్ర మహారాజు, అర్థాంగి చంద్రమతి, కుమారుడు లోహితాస్యుడు అయోధ్యా నగరాన్ని వీడి కొంతకాలం అడవులలో పయనించి, చివరకు కాశీపట్టణం చేరారు.
నక్షత్రకుడు సత్యహరిశ్చంద్రుల వారిని,... ‘‘రాజా!... ధనమును ఎప్పుడు ఇస్తావు?... నీతో నేను తిరగలేకున్నాను!... చెప్పు, ఎప్పుడు ఇస్తావ్....’’ అని వేధించసాగాడు.
మహా సాధ్వి చంద్రమతి భర్త ఆవేదనను, నక్షత్రకుని పోరును చూడలేక వినలేక సత్యహరిశ్చంద్రునితో...
‘‘ప్రభూ!... వీరి రుణబాధను తీర్చుటకు నాకు తోచిన ఉపాయం ఒకటున్నది!...’’ చెప్పింది చంద్రమతి.
‘‘మహారాణి!... ఏమిటా వుపాయము?...’’
‘‘నన్ను, కుమారుడు లోహితాస్యుని ఎవరికైనా విక్రయించి, ఆ ధనము ఈ నక్షత్రకునికి ఇచ్చి పంపండి...’’ ప్రాధేయపూర్వకంగా కన్నీటితో చెప్పింది చంద్రమతి.
సత్యహరిశ్చంద్రుడు ఆశ్చర్యపోయాడు.
‘‘స్వామీ, మనకు ఇప్పుడు వేరు మార్గం లేదు కదా!...’’
హరిశ్చంద్రుడు ఆలోచించి సంతలో కాలకౌశికుడు అను బ్రాహ్మణునికి తన భార్యాకుమారులను విక్రయించి, ఆ ధనమును నక్షత్రకునికి ఇచ్చినాడు గుండెల నిండా ఆవేదనతో!...
ధనము తీసికొన్న నక్షత్రకుడు...
‘‘రాజా!... ఈ ధనము నా తిరుగు ప్రయాణ ఖర్చులకే సరిపోదు. నీవు ఇంకా ఇవ్వవలయును!...’’ వ్యంగ్యంగా అన్నాడు నక్షత్రకుడు.
సత్యహరిశ్చంద్రుడు స్మశానవాటికను చేరి అక్కడ ఉన్న వీరబాహుడు అనే స్మశానవాటిక కాపలాదారునికి తాను అమ్ముడుపోయి, ఆ ధనమును నక్షత్రకునకు ఇచ్చి సాగనంపినాడు.
తాను కాటికాపరిగా మారిపోయాడు. కాలకౌశికుని ఆదేశానుసారం దర్భల నిమిత్తం అతని శిష్యులతో కలసి లోహితాస్యుడు అరణ్యమునకు వెళ్ళెను. దర్భలు కోయు సమయమున ఒక నాగుపాము లోహితాస్యుని కాటువేసినది. లోహితాస్యుడు మరణించినాడు.
మరణించిన తనయుని ఎత్తుకొని చంద్రమతి స్మశానమునకు రోదిస్తూ వచ్చినది. కాటికాపరిగా ఉన్న హరిశ్చంద్రుడు కాటిసుంకమును చెల్లించవలసినదిగా కోరెను. వచ్చినది తన భార్య అని, గతించినది తన తనయుడని అతనికి తెలియలేదు.
"నా దగ్గర ద్రవ్యము లేదు. మీరు సహాయము చేసి నా తనయుని అంతిమ సంస్కారమును చేయుడు" అని దీనముగా చంద్రమతి వారిని కోరినది.
ఆమెకు వశిష్ఠ మహర్షి వలన ఒక వరము లోగడ సిద్ధించియున్నది. అది... ఆమె మాంగల్యము, ఆమె భర్తకు తప్ప అన్యుల కళ్ళకు గోచరించదు.
హరిశ్చంద్రుడు కాటికాపరిగా ఆమె మాంగల్యమును చూచినాడు.
‘‘నీ మెడలో మాంగల్యమును విక్రయించి ధనము తెచ్చి కాటిసుంకమును చెల్లింపుము...’’ అని చెప్పినాడు కాటికాపరి.
ఆ మాటను విన్న చంద్రమతి, బాగా పెరిగిపోయిన జుట్టు, గడ్డం, మీసాలతో పోల్చుకొనలేకపోయిన ఆ వ్యక్తిని తన భర్తగా గుర్తించినది.
‘‘నాథా!... నేను మీ ఇల్లాలు చంద్రమతిని. ఈ గతించిన బాలుడు మన కుమారుడు లోహితాస్యుడు!...’’ అని చెప్పి బోరున ఏడ్చినది.
కాటి కాపరిగా ఉంటూ ఎన్నో శవాలకు అంతిమ సంస్కారాలు జరిపించిన హరిశ్చంద్ర మహారాజు తనయుని మరణానికి వాపోయెను కానీ…
‘‘చంద్రమతీ!... నీవు కాటిసుంకమును చెల్లించవలె. నగరములోకి వెళ్ళి నీ మాంగల్యమును విక్రయించి, ఆ ధనమును కాటిసుంకముగా చెల్లింపుము. అప్పుడు నేను నా కర్తవ్యమును నిర్వహించెదను...’’ అని చెప్పెను.
సత్యమును మీరని తన భర్త ఔదార్యమును ఎరిగివున్న చంద్రమతి కన్నీటితో మాంగల్యమును విక్రయించ కాశీపుర వీధుల వైపుకు బయలుదేరెను.
మార్గమున కొందరు దొంగలు కాశీరాజు కుమారుని చంపి అతని వద్ద ఉండిన బంగారు నగలతో పారిపోతూ, చంద్రమతిని సమీపించిరి. వారిని రాజభటులు వెంటాడుతూ వచ్చిరి. ప్రాణభయముతో రాజభటులను చూసిన దొంగలు ఆ నగలను చంద్రమతిపై విసిరి పారిపోయిరి.
తనపై నుండి నేలరాలిన నగలను చంద్రమతి వంగి చేతుల్లోకి తీసుకొనెను. కొన్ని క్షణాలలో రాజభటులు ఆమెను సమీపించి చేతిలోనగలున్న చంద్రమతి దోషిగా భావించి లాక్కొని వెల్ళి రాజుగారి సమక్షమున నిలబెట్టినారు.
మనస్సున పుత్రుని మరణ వేదన, స్మశాన సంస్కారానికి చేతిలో ధనము లేనందున తీవ్ర హృదయభారంతో ఉన్న చంద్రమతి, రాజు అడిగిన ప్రశ్నలకు కన్నీటితో మౌనంగా నోరు విప్పలేకపోయినది. రాజు తన తనయుని చంపి నగలను దోచుకున్నది చంద్రమతియే అను తీర్మానానికి వచ్చి ఆమెకు మరణదండన విధించినాడు.
రాజభటులు ఆమెను స్మశానమునకు ఈడ్చుకొని పోయి, ‘‘కాటికాపరీ... ఈమెకు రాజుగారు మరణదండనను విధించినారు’’ అని చెప్పిరి.
హృదయంలో ఆవేదన అగ్ని పర్వతంలా రగులుచుండగా సత్యహరిశ్చంద్రుడు, చంద్రమతిని మోకాళ్ళపై భువిపై కూర్చుండచేసి తలను వంచమని ఆదేశించి, ఖడ్గమును మెడకు నేరుగా వుంచి రెండు చేతులతో పట్టుకొని సర్వేశ్వరులను తలచుకొంటూ పై కెత్తినాడు.
పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమైనారు వారి ఎదుట…
సత్యహరిశ్చంద్రుల వారు ఆశ్చర్యపోయారు.
‘‘సత్యహరిశ్చంద్రా!... నీ సత్యనిరతి ఈ ప్రపంచమున మరి ఎవ్వరికీ లేదు. నీవు మాకు కడు అభిమాన పాత్రుడవు...’’ నవ్వుతూ పలికారు సర్వేశ్వరులు.
లోహితాస్యుని వైపు చూశారు. అతను నిద్రనుండి లేచినట్లుగా లేచి నిలబడ్డాడు.
విశ్వామిత్రుల వారు వేంచేశారు.
‘‘మహారాజా!... సత్యహరిశ్చంద్రా!... సత్యదీక్షలో ఈ ప్రపంచమునందు మీకు మీరే సాటి. మిమ్ములను ఓడించ నేను ఎన్నో ప్రయత్నములు చేశాను. విజయం మీదే. నేను ఓడిపోయాను. మీకు మీ పూర్వ వైభవము సిద్ధించుగాక. నేను మీ నుండి గ్రహించిన సమస్తమును మీకు ధారపోయుచున్నాను. స్వీకరించండి మహారాజా!...’’ చిరునవ్వుతో తన కమండలమునందున్న జలంతో సత్యహరిశ్చంద్రులవారి చేతిలో ధారపోశారు.
శివపార్వతులు, విశ్వామిత్రుడు వారిని ఆశీర్వదించి అంతర్ధానమయ్యారు.
భటుల వలన విషయాన్ని విన్న కాశీరాజు స్మశానమునకు వచ్చి సత్యహరిశ్చంద్రులను, వారి అర్థాంగి చంద్రమతిని సాదరముగా వారి రాజమందిరమునకు తీసుకెళ్ళి, అతిథి సత్కారాలను జరిపి, వారిని రథారూఢులను చేసి, నమస్కరించి అయోధ్యానగరానికి పంపారు.
ఈ మహాకావ్య నాటక ప్రదర్శనలో మా తాతగారు సత్యహరిశ్చంద్ర మహారాజుగా అద్భుతంగా నటించారు. కాటి సీనులో వారు చేసిన నటన, పాడిన పద్యాలు ప్రేక్షకులందరికీ కన్నీళ్ళు వచ్చేలా చేశాయి. నేనైతే ఎక్కి ఎక్కి ఏడ్చాను. తలుచుకుంటే ఇప్పటికీ నా కళ్ళు చమ్మగిల్లుతున్నాయి. తాతయ్య తోలు బొమ్మ కళ్ళకు గోచరిస్తూ ఉంది. మనస్సున మూగబాధ.
============================================================
తోలు బొమ్మలు - పార్ట్ 12 త్వరలో మీ ముందుకు వస్తుంది.
============================================================
📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!
మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్లో పొందవచ్చు.
✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి
👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.










Comments