తోలు బొమ్మలు - పార్ట్ 9

Tholu Bommalu - Part 9 - Telugu Serial | Ch. C. S. Sarma
తోలు బొమ్మలు - పార్ట్ 9 - తెలుగు ధారావాహిక | సిహెచ్. సీఎస్. శర్మ
Published In manatelugukathalu.com On 04/11/2026
తోలు బొమ్మలు పార్ట్ 9లో పార్వతీపురం గ్రామంలోని వీరరాఘవయ్య కుటుంబంలో సుశీల వివాహానికి సంబంధించిన ఆలోచనలు మొదలవుతాయి. బి.ఎస్సీలో స్టేట్ ఫస్ట్ సాధించిన సుశీలను కుటుంబ సభ్యులంతా అభినందిస్తారు. అదే సమయంలో ఆమె వివాహ ప్రస్తావన రావడంతో కుటుంబంలో కొత్త చర్చ ప్రారంభమవుతుంది. తనకు నచ్చిన వరుడితోనే కుమార్తె వివాహం జరిపించాలని వీరరాఘవయ్య భావిస్తారు. అయితే ధనుంజయరావుతో సుశీల వివాహం జరగవచ్చనే సూచనపై సత్యయ్య తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తాడు. కుటుంబ ప్రేమ, వ్యక్తిగత అభిప్రాయాలు, భవిష్యత్తుపై ఆందోళనల మధ్య కథ ఆసక్తికరంగా సాగుతుంది.
జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సాక్ష్యాధారాలను బట్టి చంద్రశేఖర్ కు ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధింపబడుతుంది. జైలు నిశ్శబ్దంలో చంద్రశేఖర్ కలం పట్టాడు. తాత వీరరాఘవయ్య నుంచి మొదలైన జ్ఞాపకాలు చివరికి సుశీల–ధనుంజయరావుల వివాహ ప్రతిపాదన వరకు చేరుకున్నాయి. తాత వీరరాఘవయ్య చెప్పిన పరోపకారం, ఆదర్శ జీవనం గురించిన మాటలు చిన్న చంద్రశేఖర్ మనసుపై చెరగని ముద్ర వేస్తాయి. అదే సమయంలో గ్రామానికి వచ్చిన సాంబయ్య తోలుబొమ్మల బృందం అతనిలో కొత్త ఆసక్తిని రేకెత్తిస్తుంది. ప్రదర్శన మధ్యలో ధనుంజయరావు ప్రవర్తనను గమనించిన చంద్రశేఖర్ మనసులో కొత్త సందేహం మొదలవుతుంది. తోలు బొమ్మలు పార్ట్ 7లో వర్షం కారణంగా మధ్యలో ఆగిపోయిన తోలుబొమ్మలాట కథను తెలుసుకోవాలనే చిన్న చంద్రశేఖర్ ఆసక్తి, అతన్ని మరో అపూర్వమైన రామాయణ అనుభవంలోకి తీసుకెళ్తుంది. తోలు బొమ్మలు పార్ట్ 8లో కాశీ విశ్వనాథ ఆలయ చరిత్ర, పంచారామ క్షేత్రాల పురాణ నేపథ్యం, ద్వాదశ జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తిపీఠాలు, ప్రసిద్ధ శివాలయాల ప్రత్యేకతలను తెలుసుకుంటూ అక్కాతమ్ముళ్లు ఆసక్తిగా వింటారు.
గత ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తోలు బొమ్మలు – నవల పరిచయం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తోలు బొమ్మలు - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తోలు బొమ్మలు - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తోలు బొమ్మలు - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తోలు బొమ్మలు - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తోలు బొమ్మలు - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తోలు బొమ్మలు - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తోలు బొమ్మలు పార్ట్ 9 – సుశీల పెళ్లిపై కుటుంబంలో విభేదాలు
మా అత్తయ్య సుశీల బి.ఎస్సి. స్టేట్ ఫస్ట్ లో పాసయింది. దినపత్రికల్లో ఆమె ఫోటోను, వచ్చిన మార్కుల వివరాలను ప్రచురించారు. తాతయ్య, నాయనమ్మ, నాన్న, అమ్మ, బాబాయిలు ఎంతగానో సంతోషించారు. ఇంట్లో అందరం స్వీట్లు తిన్నాము. అందరం అత్తయ్యను అభినందించాము. (అంతకు ముందు సంవత్సరం బాబాయి అగ్రికల్చర్ బి.ఎస్సి. పాసయి నెల్లూరులో ఉద్యోగంలో చేరారు.)
అత్తయ్య తాతయ్య, నాయనమ్మ, నాన్న, అమ్మ, బాబాయిల పాదాలను తాకింది. అందరూ ఆమెను హృదయపూర్వకంగా ఆశీర్వదించారు.
ఆ విషయం తెలిసిన గోవర్ధనరావు, వారి సతీమణి (మా తాతయ్య గారి సోదరి) నిర్మలమ్మ మా ఇంటికి వచ్చారు. మా అత్తయ్యను అభినందించారు.
నాయనమ్మ వారికి స్వీట్ పంచింది.
వెళ్లేముందు గోవర్ధనరావు గారు మా తాతయ్య గారిని సమీపించి...
‘‘బావా!... సుశీల స్టేట్ ఫస్ట్ న పాస్ కావడం నాకు మహదానందం..’’
‘‘ధన్యవాదాలు బావా!...’’ తాతయ్య గారి జవాబు.
నిర్మలమ్మ మా అత్తయ్యను దగ్గరకు తీసుకొని...
‘‘కోడలా!... మరి పెండ్లి పప్పు అన్నం ఎప్పుడు పెడతావ్?...’’ నవ్వుతూ అడిగింది.
‘‘చెల్లీ!... అంతా దైవనిర్ణయం. కాలం కలసిరావాలిగా!...’’ అన్నాడు తాతయ్య.
‘‘నీవు తలుచుకుంటే తప్పక త్వరలో వస్తుంది ఆ కాలం!...’’
భర్త గోవర్ధనరావు ముఖంలోకి చూస్తూ, నవ్వుతూ అంది నిర్మలమ్మ.
అందరికీ చెప్పి ఆ దంపతులు వెళ్ళిపోయారు.
‘‘సామీ!...’’ వాకిట నుండి పిలుపు.
నేను పరుగెత్తాను ఎవరా అని...
నా వెనకాలే తాతయ్యగారు వచ్చారు.
నేను ఇంతవరకూ చూడని కొత్త మనిషి.
తాతయ్యను చూడగానే...
‘‘దండాలు సామీ!...’’
వారు చేతులు జోడించారు.
‘‘ఏం బంగారయ్యా!... ఎలా ఉన్నావ్?...’’ అడిగారు తాతయ్య.
అక్కా, అత్తయ్యా వరండాలోకి వచ్చారు.
‘‘అంతా మీలాంటి ధర్మప్రభువుల దయ సామీ. బాగున్నా!...’’ వారు వినయంగా చెప్పారు.
‘‘ఆ... మూలికలు తెచ్చావా?...’’ తాతయ్యగారి ప్రశ్న.
‘‘ఆఁ... తెచ్చినాను సామీ. మీరు అనుమతిస్తే మన వేపచెట్టు అరుగుమీద దించుతా సామీ!..’’
‘‘ఆ... దించుకో!... అది నీవు ఎప్పుడూ దించుకొనే స్థలమేగా!...’’
‘‘సంతోషం సామీ. మూటల్ని దించుకుంటా!...’’
‘‘అలాగే!... అవును పోయిన సంవత్సరం రాలేదేమి?...’’
‘‘ఎక్కడ సామీ!... అడవులన్నీ నాశనమైపోతా ఉండాయి. వనమూలికల కోసం భద్రాచలం అడవులు, ఉదయగిరి కొండలు, మన్యం అడవులు, నల్లమల అడవులు తెగ తిరిగి మూలికలను సేకరించాలి సామీ!.. అన్నీ ఒకచోట ఉండవు కదా!...’’ విచారంగా చెప్పాడు బంగారయ్య.
‘‘అవునవును, జనం అడవులను నరికి నాశనం చేస్తున్నారు...’’
‘‘సామాను దించి వస్తా సామీ!...’’
‘‘అలాగే!...’’
ఆ బంగారయ్య వెళ్ళిపోయాడు.
‘‘తాతయ్యా!... వారెవరు?...’’
‘‘చిన్నా!... ఆయన వైద్యుడు. అడవుల్లోని మందు మొక్కలను, వేర్లను సంపాదించి, వాటితో మందులు తయారుచేస్తాడు. వారి ఆ వనమూలికల పొడులు, లేహ్యాలు అన్ని వ్యాధులను గుణపరుస్తాయి. మంచి హస్తవాసి కూడా!...’’
‘‘అలాగా!...’’
‘‘అవును చిన్నా!...’’
నేను మా ఇంటి ముందున్న వేపచెట్టు అరుగు సమీపించాను. నా వెనకాలే మా అక్క కూడా వచ్చింది.
వారు ఒంటిఎద్దు (గుండువున్న) బండి నుంచి మూలికల మూటలు ఐదు దించి మా వేపచెట్టు అరుగుపై ఒక వైపు చెట్టుకు ఆనించారు.
దారిన పోయే ఊరి జనం పెద్దలు బంగారయ్య, అతని తమ్ముడు సంజీవయ్యలను పలకరించి కుశల ప్రశ్నలు అడగటం, దానికి ఆ అన్నదమ్ములు నవ్వుతూ సమాధానం చెప్పడం జరిగింది.
‘‘అవును బంగారయ్యా!... నేను ఎప్పుడు రావాలి? ఈ మధ్యన నాకు తిన్నది సరిగా జీర్ణం కావడం లేదు. మంచి మందు ఇవ్వవయ్యా!...’’ అడిగాడు ఒక వ్యక్తి నరసయ్య.
మరొక వ్యక్తి... ‘‘సంజీవయ్యా!... అంతా కుశలమేనా!... చాలా రోజులయిందయ్యా మీరు వచ్చి. ఇప్పుడు నా వయస్సు అరవై, పనిచేస్తుంటే కాళ్లు చేతులు నొప్పిగా ఉన్నాయి. ఏదైనా మంచి మందు ఇవ్వవయ్యా!...’’
ఆయన పేరు రామదాసు.
‘‘ఆ అలాగే. భోంచేసి మూటలను విప్పుతాం. మూడు గంటలకు రండి.’’
‘‘నాడిని పరీక్షించి మంచి మందులు ఇస్తాను...’’ నవ్వుతూ చెప్పాడు బంగారయ్య.
వాళ్ళు వెళ్ళిపోయారు.
‘‘బంగారం... సంజీవం... భోజనానికి మన ఇంటికి రండయ్యా!...’’ మా నాయనమ్మ పార్వతమ్మ అరుగు దగ్గరకు వచ్చి వారికి చెప్పింది.
‘‘తల్లీ!... అట్టాగేనమ్మా!... తమరు బాగుండారా తల్లీ!...’’
ప్రీతిగా అడిగాడు బంగారయ్య చేతులు జోడించి…
‘‘తల్లీ!... దండాలు...’’ సంజీవయ్య నమస్కరించాడు.
‘‘ఒంటిగంటకల్లా రండి!...’’ అంది నాయనమ్మ.
‘‘సరే తల్లీ!...’’ అన్నాడు బంగారయ్య.
వాళ్ళ బండి ఎద్దును మా పశువుల శాలలో కట్టేశాడు సంజీవయ్య. మా వామి నుండి గడ్డి తెచ్చి దాని ముందు గాట్లో ఉంచాడు. అది గడ్డిని తినసాగింది.
బావి వద్దకు వెళ్ళి కాళ్లు చేతులు ముఖాలు కడుక్కొని, తుడుచుకొని ఆ అన్నదమ్ములు మా ఇంటి భోజనానికి వచ్చారు.
పెరట్లోని అరటి చెట్టు నుండి అమ్మ రెండు అరటాకులను కోసి తెచ్చి, వారిని హాల్లో కూర్చోమని చెప్పి, అరటి ఆకులను కడిగి వారి ముందుంచింది.
కూరలు, భోజనాన్ని వడ్డించింది.
‘‘నిదానంగా కడుపునిండా తినండి. ఏది కావాలన్నా అడగండి. మొహమాటపడకండి. మీరు మాకు బంధువుల్లాంటివారు!...’’ చిరునవ్వుతో చెప్పింది అమ్మ.
‘‘అట్టాగే తల్లీ!...’’ ఆనందంగా చెప్పాడు బంగారయ్య.
‘‘ఏది కావాలన్నా అడిగి కడుపునిండా తినండి...’’ నాయనమ్మ చెప్పింది.
వారు తినడం ప్రారంభించారు.
అమ్మ కొసరికొసరి వారికి వడ్డించింది.
వారు తృప్తిగా భోంచేశారు.
‘‘అన్నదాతా సుఖీభవ!...’’ అన్నాడు బంగారయ్య.
‘‘సంతోషం. ఇక వెళ్ళి మీ పని చూసుకోండి. మీరు ఉన్న రోజుల్లో వంట చేసుకోకండి...’’ మా నాయనమ్మ చెప్పింది.
‘‘మన ఇంట్లోనే భోంచేయాలి!...’’ చిరునవ్వుతో తాతయ్య చెప్పాడు.
‘‘అట్టాగే సామీ వస్తాం...’’ చెప్పాడు బంగారయ్య.
నమస్కరించి ఇరువురూ అరుగు వైపుకు వెళ్ళిపోయారు.
మేమంతా కలిసి భోంచేశాము.
మా ఇంట్లో నియమం. భోజనాల ముందు ఎవరూ మాట్లాడకూడదు. మౌనంగా, నిదానంగా భోంచేయాలి. ఆ విషయాన్ని మా అందరికీ మా తాతయ్యగారు నేర్పారు.
వారు మరో మాటను కూడా చెప్పారు.
‘భగవంతుని తలచుకుంటూ భోంచేయాలి.’
మా ఇంట్లోని వారమంతా ఆ నియమాలను పాటిస్తాం.
భోజనాలు ముగిసాయి.
నేను తాతయ్య వారి గదికి వెళ్ళి, గదిలోనే ఓ పావుగంట అటూ ఇటూ నడవడం మాకు అలవాటు.
అమ్మ, నాయనమ్మలు భోంచేశారు.
అక్క, అత్తయ్య వారి గదిలో ఉన్నారు.
మేము మంచంపై వాలిపోయాము.
నేను నిద్రపోను కళ్ళు మూసుకున్నాను. కానీ నిద్ర రాలేదు.
నాయనమ్మ మా గదిలోకి వచ్చింది.
తాతయ్యను సమీపించి...
‘‘ఏమండీ!...’’ మెల్లగా పిలిచింది.
‘‘ఏమిటి పారూ!...’’
‘‘గోవర్ధనరావు, నిర్మలమ్మ వదినలు మన ఇంటికి ఎందుకు వచ్చినట్టు?...’’ అడిగింది నాయనమ్మ.
‘‘మన సుశీల స్టేట్ ఫస్ట్ న పాసయింది కదా!.. చూసి అభినందించడానికి వచ్చారు...’’
‘‘అది కాదండి. వేరే కారణం ఉంది!...’’
‘‘ఏమిటది పారూ!...’’
‘‘వాళ్ళ అబ్బాయి ధనుంజయరావుకు మన సుశీలతో పెండ్లి జరిపించాలనే భావనతో వచ్చారని నా అనుమానం. వదిన అమ్మాయిని అడిగింది కదా పెళ్ళి పప్పు అన్నాన్ని ఎప్పుడు పెడతావని!...’’ చిరునవ్వుతో చెప్పింది నాయనమ్మ పార్వతి.
‘‘నీవు అలా అనుకుంటున్నావా!...’’
‘‘అవును!...’’
‘‘చూడు, నాకు ఒక్కతే కూతురు. మా అమ్మ. ఆమె అంటే నాకు ఎంత ప్రేమో నీకు తెలుసు. ఆమె వివాహం నీ, నా ఇష్టప్రకారం జరపడం కాదు. ఆమెకు అన్నివిధాలా నచ్చిన వరుడితోనే ఆమె వివాహాన్ని నేను జరిపించాలన్నది నా నిర్ణయం. ఈ నా భావనలో నీ అభిప్రాయం ఏమిటి?...’’ అడిగాడు తాతయ్య.
నిద్రరాని కారణంగా నేను వారి సంభాషణను కళ్ళు మూసుకొని వింటున్నాను. నా కళ్ళు గది ద్వారం వైపుకు ఉన్నాయి. అత్తయ్య సుశీల ద్వారం దగ్గరకు వచ్చి, వారి సంభాషణను విని ఆగిపోయింది. అది నేను చూసి మరలా కళ్ళు మూసుకున్నాను.
‘‘నేను ఏనాడైనా, ఏ విషయంలోనైనా మీతో వ్యతిరేకించానా? సుశీల మీకేనా కూతురు?... నాకు కాదా!... నా బిడ్డ భవిష్యత్తు బాగుండాలనే ఆశయం నాకు ఉండదా!...’’ ఆవేదనతో పలికింది నాయనమ్మ.
‘‘పారూ!... నీకు సుశీల మీద ప్రేమ లేదని అన్నానా!.. ఆమె విషయంలో నా అభిప్రాయాన్ని నీకు తెలియజేశాను. అంతేగా!...’’
‘‘మీతో మాట్లాడి నేను గెలవగలనా!...’’ నవ్వింది నాయనమ్మ.
తాతయ్య కూడా ఆనందంగా నవ్వారు.
అత్తయ్య సుశీల ద్వారం వద్ద నుండి తన గదికి వెళ్ళిపోయింది.
నా కళ్ళు నిజంగా మూతపడుతున్నాయి. నిద్ర నన్ను ఆవహించింది. మూడు రోజులు బంగారయ్య, సంజీవయ్యలు అనేకమందికి మందు వారి దగ్గర తయారుచేసి ఉన్నవాటిని, వారివారి సమస్యలను అడిగి తెలుసుకొని, నాడిని పరీక్షించి, మందులు (పొడులు), లేహ్యాలు తయారుచేసి ఇచ్చారు. అందరూ ఆనందంగా వెళ్ళిపోయారు.
నాల్గవ రోజు ఆ అన్నదమ్ములు ఇరువురూ తాతయ్య, నాన్న, నాయనమ్మలకు చెప్పి వేరే ఊరికి వెళ్ళిపోయారు.
ఆ రోజు ఉదయం తాతయ్యగారు వరండాలో కూర్చొని తెలుగు దినపత్రికను చదువుతున్నారు. నేను వారి ప్రక్కనే ఉన్నాను. ఐదుగురు వ్యక్తులు వచ్చి తాతయ్యకు నమస్కరించారు.
తాతయ్య తలను పైకెత్తి వారిని చూశారు.
‘‘ఆ.... గోవిందా!... ఎప్పుడు వచ్చారు?..’’
‘‘రాత్రి వచ్చాము సామీ!...’’
గోవిందు తనతో ఉన్న నలుగురినీ తాతయ్యకు పరిచయం చేశాడు. అందరూ చిరునవ్వుతో తాతయ్య గారికి నమస్కరించారు…
‘‘తాతయ్యా!...’’
‘‘ఏం చిన్నా!...’’
‘‘వీరెవరు?...’’
‘‘వీధి భాగోతం బృందం నాన్నా!...’’
‘‘వీధి భాగోతం అంటే ఏమిటి తాతయ్యా!...’’
‘‘వీరు రామాయణ, భారత కథలను నాటకంగా ప్రదర్శిస్తారు...’’
‘‘ఓహో అలాగా!...’’
‘‘అవును చిన్నా!...’’
‘‘సామీ, తొలి నాటకం మనదిగానే కావాలి!...’’ చెప్పాడు గోవింద.
‘‘అలాగే!... ఏం నాటకం వేస్తారు!...’’ అడిగారు తాతయ్య.
‘‘మీరు ఏది చెబితే అదే సామీ!...’’
‘‘అలాగా!...’’
‘‘అవునయ్యా!... తొలి నాటకం తమరి పేరు మీదనే జరగాలనేది నా కోరిక సామీ...’’
‘‘ఆ... బాలనాగమ్మను ప్రదర్శించగలరా!...’’
‘‘అట్టాగే సామీ!....’’
‘‘ఫకీర్ పాత్రను ఎవరు వేస్తారు?...’’
‘‘నా పెద్ద కొడుకు మల్లేష్ సామీ!... వాడికి బాగా నేర్పినా!...’’ నవ్వుతూ చెప్పాడు గోవింద. తన కొడుకు చేతిని పట్టుకొని తాతయ్యకు చూపించాడు.
మల్లేష్ ఆరు అడుగుల ఎత్తు ఉంటాడు. బాగా కసరత్తు చేసిన శరీరం. మనిషి కూడా మంచి అందగాడు. కొన్ని క్షణాలు నేను అతన్ని పరీక్షగా చూశాను. అతను నన్ను చూసి నవ్వుతూ...
‘‘సామీ!... బాబు...’’
‘‘నా మనవడు రా!... పేరు చంద్రశేఖర్!...’’ గర్వంగా చెప్పారు తాతయ్య.
మల్లేష్ చేతులు జోడించి నవ్వుతూ... ‘‘చినసామీ!... దండాలు’’ అన్నాడు.
నేను ప్రతినమస్కారం చేశాను. తాతయ్య నాకు అమర్యాదను నేర్పలేదు.
‘మనకన్నా పెద్దవాళ్ళు మనకు నమస్కరిస్తే, మనం తిరిగి వారికి నమస్కరించాలి’ అని…
తాతయ్య నాయనమ్మను పిలిచాడు.
ఆమె వరండాలోకి వచ్చింది.
అందరూ ఆమెను చూడగానే చేతులు జోడించి...
‘‘బంగారు తల్లీ, దండాలు...’’ నవ్వుతూ పలికారు.
‘‘ఓ గోవిందా!... ఎప్పుడు వచ్చారు?... అంతా బాగున్నారా!...’’
ప్రతిగా అడిగింది నాయనమ్మ.
‘‘నాన్నీ, వారంతా నీకు తెలుసా!...’’ అడిగాను.
‘‘ఆఁ, బాగా తెలుసు చిన్నా!...’’ నవ్వుతూ చెప్పింది నాయనమ్మ.
‘‘వీరూ తోలుబొమ్మల ఆటగాళ్ళ మాదిరే, మన ఊరి చాలాసార్లు వచ్చారు చిన్నా!...’’ అంది నాన్నీ.
‘‘ఆ, ఏం నాటకం వేయబోతున్నారు గోవిందా!...’’
‘‘తల్లీ!... అయ్యగారు బాలనాగమ్మను ఆడమన్నారమ్మా!...’’ గోవింద సమాధానం.
‘‘అలాగా!...’’
‘‘అవును తల్లీ!...’’
‘‘పారూ!...’’ నాన్నీ ముఖంలోకి చూశారు తాతయ్యగారు.
‘‘ఆ... అర్థమైందండి. ఐదు నిమిషాల్లో వస్తాను...’’ వేగంగా నాయనమ్మ ఇంట్లోకి వెళ్ళిపోయింది.
వెంటనే తిరిగి వచ్చి తాతయ్య చేతికి కొంత డబ్బును ఇచ్చింది. తాతయ్య నోట్లను లెక్కపెట్టారు.
‘‘గోవిందా!...’’
‘‘సామీ!...”
“ఇలా రా!...’’
గోవింద తాతయ్యను సమీపించాడు. తాతయ్య తన చేతిలోని డబ్బును గోవిందుకు ఇచ్చాడు.
గోవింద కళ్ళకద్దుకొని డబ్బును జేబులో పెట్టుకున్నాడు.
చేతులు జోడించి... ‘‘చాలా సంతోషం సామీ!... నాటకాన్ని ఎప్పుడు వేయమంటారు?...’’ అడిగాడు.
‘‘నీ ఇష్టం!...’’
‘‘రేపు వేస్తాం సామీ!...’’
‘‘మంచిది, వెళ్ళిరండి...’’
వారంతా మరోసారి నమస్కరించి ఆనందంగా వెళ్ళిపోయారు. వారికి ఎదురుగా ముగ్గురు బ్రాహ్మణులు వచ్చారు. వరండాను సమీపించి వారు తాతయ్యకు నమస్కరించారు.
తాతయ్య ప్రతినమస్కారం చేసి...
‘‘రండి, కూర్చోండి..’’
ముగ్గురూ తాతయ్య ఎదురుగా ఉన్న కుర్చీలలో కూర్చున్నారు.
‘‘స్వామీ!... అంతా కుశలమే కదా!...’’ అడిగారు తాతయ్య.
‘‘మీలాంటి ధర్మప్రభువులు ఉన్నంతవరకు మేము కుశలమే స్వామీ!...’’ ఎంతో వినయంగా ఆ ముగ్గురిలో వయస్సు మీరినవారు చెప్పారు.
నేను వంగి తాతయ్య చెవి దగ్గర....
‘‘తాతయ్యా!... వీరెవరు?..’’ అడిగాను.
‘‘చిన్నా, వీరు బ్రాహ్మణులు. మనకు గురుతుల్యులు. వీరిది కరవది. అప్పుడప్పుడూ వస్తూ ఉంటారు. మనకు మంచిచెడ్డలను గురించి చెబుతారు...’’
ఆ ముగ్గురిలో పెద్దవారు మా ఇంటి సింహద్వారాన్ని, పరిసరాలను పరీక్షగా చూశారు.
‘‘పారూ!...’’ తాతయ్య పిలుపు.
అమ్మ వేగంగా వచ్చింది. ‘‘మామయ్యా!... అత్తయ్య స్నానం చేస్తున్నారు’’ చెప్పింది అమ్మ.
బ్రాహ్మణులకు నమస్కరించింది. అమ్మ వెనకాలే అత్తయ్య సుశీల వచ్చింది. ఆ బ్రాహ్మణులను చూసి నవ్వుతూ చేతులు జోడించింది.
‘‘శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు!...’’ వారిలో వయసైనవారు చిరునవ్వుతో కుడిచేతిని పైకెత్తి అత్తయ్య సుశీలను దీవించారు.
‘‘స్వామీ!... మీ పేరు గోపాలశర్మగారు కదూ!...’’ అడిగారు తాతయ్య.
‘‘అవునండీ!...’’ ఆ పెద్దవారి జవాబు.
‘‘ఆమె నా కోడలు భవాని. ప్రక్కన ఉన్నది నా కూతురు సుశీల, పక్కన నా మనుమడు చంద్రశేఖర్...’’ మమ్మల్ని వారికి పరిచయం చేశాడు తాతయ్య.
‘‘స్వామీ, తమరితో ఒక మాట చెప్పాలని ఉంది!...’’ ఆ పెద్ద స్వామి చెప్పారు.
‘‘చెప్పండి స్వామీ!...’’ తాతయ్యగారి జవాబు.
‘‘త్వరలో ఈ ఇంట అమ్మాయిగారి వివాహం జరగబోతున్నది. సమయం ఆసన్నం కాబోతున్నది...’’
అత్తయ్య ఆ మాట విని ఇంట్లోకి వెళ్ళిపోయింది. వెనకాలే అమ్మ కూడా వెళ్ళింది.
నాయనమ్మ వచ్చింది. వారికి నమస్కరించింది.
‘‘స్వామీ, అంతా క్షేమమే కదా!...’’ అడిగింది.
‘‘సర్వేశ్వరుల కరుణాకటాక్షం తల్లీ. అంతా కుశలమే!...’’
‘‘మీరు మా ఇంట...’’
నాయనమ్మ పూర్తి చేయకమునుపే వారు... ‘‘భోంచేయము తల్లి, మీకు తెలుసు కదా!... మేము వండుకుంటాం...’’
నాయనమ్మ ఇంట్లోకి వెళ్ళింది. పది నిమిషాల్లో పెద్ద ప్లేటులో బియ్యం, కూరగాయలు, పప్పు, ఉప్పు, పచ్చిమిర్చితో వచ్చి వారికి అందించింది. వారు అందుకున్నారు.
వారు బావి దగ్గరకు వెళ్ళి స్నానం చేసి, బట్టలు మార్చుకొని, మూడు రాళ్ళతో పొయ్యిని ఏర్పాటు చేసుకొని, వారి వద్ద ఉన్న పాత్రలతో అన్నం, పులుసు అరగంటలో తయారుచేసుకున్నారు.
అమ్మ వారికి అరిటాకులు, ఊరగాయ, పెరుగును ఇచ్చింది. ముగ్గురూ భోంచేశారు.
పాత్రలను తోమి సంచుల్లో పెట్టుకున్నారు.
తాతయ్యను వారు సమీపించి...
‘‘స్వామీ!... మాకు సెలవు ఇప్పించండి!...’’ వినయంగా అడిగారు.
తాతయ్య చెప్పిన రీతిగా నాయనమ్మ ఆ ముగ్గురికీ పంచెలు, పైపంచెలు, బియ్యం, వెయ్యి రూపాయలు రెండు పళ్ళాలలో ఉంచి వారికి అందించింది.
వారు వాటిని స్వీకరించి, ఆశీర్వదించి... ‘‘వెళ్ళివస్తాము స్వామీ!...’’ అన్నారు.
‘‘మంచిది స్వామీ! వెళ్ళిరండి.’’ తాతయ్య చేతులు జోడించారు.
వారూ నమస్కరించి వెళ్ళిపోయారు.
‘‘పారూ!...’’
‘‘ఏమండీ!...’’
‘‘మన సుశీలని చూసి వారు ఏమన్నారో కోడలు నీతో చెప్పిందా!...’’
‘‘ఆ... చెప్పిందండీ!...’’
‘‘వారి ఆ దీవెనకు ఒక వైపు ఆనందం... మరోవైపు ఆవేదన’’ విచారంగా తాతయ్య తన గదికి వెళ్ళిపోయారు.
తాతయ్యను ఆ స్థితిలో చూసిన అమ్మ, నాయనమ్మల నయనాలలో కన్నీరు!...
నాకేం అర్థంకాక నేను వారిని చూస్తూ ఉండిపోయాను.
‘‘మీ అత్తయ్యకు వివాహం చేస్తే, ఆమెను అత్తగారింటికి పంపవలసి వస్తుందని మీ తాతయ్య గారి బాధ చిన్నా!...’’ కన్నీటితో చెప్పింది నాన్నీ.
ఆ క్షణంలో నా కళ్ళల్లో కూడా కన్నీరు!!...
‘అత్తయ్యకు పెళ్ళి అయితే మమ్మల్ని అందరినీ వదలి వెళ్ళిపోతుందా!!’ విచారంగా అనుకున్నాను.
అత్తయ్యకు మా అమ్మ దగ్గర చాలా చనువు... నిర్భయం.
అమ్మ వంటగదిలో ఉంది. అత్తయ్య అమ్మను సమీపించింది. నేను ఆమె వెనకాలే వెళ్ళాను.
‘‘వదినా!...’’
‘‘ఏం సుశీ!... ఏం కావాలి?...’’
‘‘నేను నీతో మాట్లాడాలి!...’’
‘‘ఏ విషయంలో అమ్మా!...’’ చిరునవ్వుతో అడిగింది అమ్మ.
ద్వారం దగ్గర ఉన్న నన్ను చూసింది అత్తయ్య, నవ్వింది.
‘‘సరే!... విషయం ఏమిటో చెప్పు!...’’ అడిగింది అమ్మ.
‘‘నా వివాహ విషయం!...’’
‘‘ఏమిటి నీ అభిప్రాయం?...’’ అమ్మ ప్రశ్న.
‘‘నేను నా జీవితాంతం మీ దగ్గరే ఉండాలి వదినా. మిమ్మల్ని అందరినీ వదలి నేను దూరంగా వెళ్ళలేను...’’
‘‘పెండ్లి జరిగితే ఏ ఆడపిల్ల అయినా అమ్మగారి ఇంటిని వదలి అత్తగారి ఇంటికి వెళ్ళక తప్పదు కదా!...’’
‘‘నేను వేరే ఊరికి వెళ్ళను..’’
‘‘అంటే నీకు సంబంధం ఈ ఊరిలోనే చూడమంటున్నావా!...’’
‘‘అవును!...’’
‘‘నీకు తగినవాడు ఈ ఊర్లో ఎవరున్నారబ్బా!...’’ ఆశ్చర్యంతో చూసింది అమ్మ అత్తయ్య ముఖంలోకి.
‘‘మా అమ్మకు, నాన్నకు, అన్నలకు నీవే నా నిర్ణయాన్ని చెప్పాలి. నా నిర్ణయం మారదు. నీవు ఏం చేస్తావో, ఎలా చేస్తావో అది నీ ఇష్టం. నేను నా అభిప్రాయాన్ని చెప్పా. ఆలోచించు. అందరికీ నా నిర్ణయాన్ని చెప్పు. సరేనా!...’’ అమ్మ జవాబుకు ఎదురుచూడకుండా అత్తయ్య తన గదికి వెళ్ళిపోయింది.
నేను తాతయ్యను సమీపించాను.
‘‘ఏరా చిన్నా!... ఏమిటి సంగతి?...’’
అత్తయ్య అమ్మకు చెప్పిన మాటలను నేను తాతయ్యకు చెప్పాను. అంతా విని తాతయ్య...
‘‘అలాగా!...’’ సాలోచనగా అన్నారు.
‘‘అవును తాతయ్యా!...’’ నా జవాబు.
నాన్న, చిన్నాన్నలు పొలాలనుంచి తిరిగి వచ్చారు.
ఆ రాత్రి వీధి భాగోతం చూడాలి కనుక ఏడుగంటలకే అందరం డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాము.
అమ్మ, నాయనమ్మ వడ్డన ప్రారంభించారు.
అత్తయ్య గది నుండి బయటికి రాలేదు.
‘‘పారూ!... సుశీ ఎక్కడ?...’’ అడిగాడు తాతయ్య.
అమ్మ వెళ్ళి సుశీల అత్త గది ముందు నిలబడి ఆమెను పిలిచింది.
అత్తయ్య ఆమె వెంట, మా అక్క కావ్య బయటకు వచ్చారు.
‘‘అన్నానికి రండమ్మా!...’’ చెప్పింది అమ్మ.
తల ఆడించి అత్త, అక్క కావ్య వచ్చి కంచాల ముందు కూర్చున్నారు.
‘‘అమ్మా సుశీ, నీవు నా ప్రక్కకు రామ్మా!...’’ ప్రియంగా పిలిచారు తాతయ్య.
తాతయ్య ప్రక్కన ఉన్న నేను లేచి వెళ్ళి అత్త స్థానంలో అక్క ప్రక్కన కూర్చున్నాను. అత్తయ్య నా స్థానంలో కూర్చుంది.
తాతయ్య అత్తయ్య ముఖంలోకి క్షణంసేపు చూసి...
‘‘అమ్మా!... ఏ విషయాన్ని గురించో ఆలోచిస్తున్నట్లు ఉన్నావు. మీ వదిన, నాయనమ్మలు నీ వివాహవిషయంలో నీ నిర్ణయాన్ని నాకు తెలిపారు. నీ వివాహం నీవు కోరుకున్నట్లుగానే జరుగుతుంది. నా ఈ ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పు తల్లీ!...’’ అభ్యర్థనగా అడిగారు తాతయ్య.
అందరం తాతయ్య గారి ముఖంలోకి చూశాము.
అత్తయ్య తల ఆడించింది.
‘‘అమ్మా!... నీకు ధనుంజయ అంటే ఇష్టమేనా!...’’ మెల్లగా అడిగారు తాతయ్య.
‘‘మీ ఇష్టమే నా ఇష్టం నాన్నా!...’’ అత్తయ్య జవాబు.
‘‘నాన్నా!...’’ బాబాయి సత్య కంఠం.
‘‘ఏమిటి సత్యా!...’’
‘‘నాన్నా!... నాకు ఆ ధనుంజయ అంటే ఇష్టం లేదు నాన్నా. నా చెల్లి వివాహం అతనితో జరపడం నాకు...’’
‘‘రేయ్!... సత్యా!... నాన్నగారు చెల్లిని అడిగారే కానీ వారి నిర్ణయాన్ని చెప్పలేదు కదరా!...’’ మా నాన్నగారి మాటలు.
‘‘నిర్ణయం లేకుండా నాన్నగారు ఆ పేరును ఎందుకు ఎత్తినట్లు అన్నయ్యా!...’’ అడిగాడు బాబాయ్ సత్య.
‘‘ఒరేయ్ సత్యా!... నీవు చిన్నవాడివి. మీ నాన్నగారికి తెలీదా!... ఏది మంచో ఏది చెడో!...’’ చెప్పింది నాయనమ్మ పార్వతి.
‘‘అమ్మా!... అతని తత్వం మంచిది కాదు. అలాంటి వాడిని నా చెల్లికి...’’
మధ్యలోనే తాతయ్య... ‘‘సత్యా!... ఆ ధనుంజయ నా చెల్లి కొడుకురా!... వాడి మంచి చెడ్డలు నీకన్నా నాకు బాగా తెలుసు...’’
బాబాయి తాతయ్య ముఖంలోకి క్షణంసేపు చూసి తలదించుకున్నాడు.
‘‘సత్యా!.. నాన్నగారు మన చెల్లి వివాహ విషయంలో తప్పుగా ఆలోచించరుగా!...’’
‘‘అన్నయ్యా!... నాన్నగారు తెల్లనివన్నీ పాలు... నల్లనివన్నీ నీళ్ళు అనుకునే రకం. వారికి కల్లాకపటం తెలియదు. కానీ ఆ ధనుంజయ...’’
‘‘ఆపు సత్యా!...’’ తాతయ్యగారి హెచ్చరిక.
బాబాయి మౌనంగా తలదించుకున్నారు.
‘‘సరే!... ఇక ఆ విషయాన్ని వదలండి. అందరూ మౌనంగా భోంచేయండి...’’ సౌమ్యంగా చెప్పారు తాతయ్య.
అందరం భోంచేయడం ప్రారంభించాము.
అందరి కంటే ముందు బాబాయ్ ఏదో తిని లేచి వెళ్ళి చేతిని కడుక్కుని తన గదికి వెళ్ళిపోయాడు.
అందరం ఆశ్చర్యంగా వారిని చూశాము.
బాబాయి తప్ప అందరం వీధి భాగోతం చూడడానికి వెళ్ళాము.
============================================================
తోలు బొమ్మలు - పార్ట్ 10 త్వరలో మీ ముందుకు వస్తుంది.
============================================================
📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!
మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్లో పొందవచ్చు.
✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి
👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.










Comments