top of page
Original.png

తోలు బొమ్మలు - పార్ట్ 7


తోలు బొమ్మలు పార్ట్ 5 – తాత వీరరాఘవయ్యతో లంకాదహనం తోలుబొమ్మలాట చూస్తున్న చిన్న చంద్రశేఖర్తోలు బొమ్మలు పార్ట్ 6 – మహాలక్షమ్మ గుడి వద్ద లంకాదహనం తోలుబొమ్మలాట చూస్తున్న చంద్రశేఖర్ కుటుంబం, సుశీలను గమనిస్తున్న ధనుంజయరావు.
తోలు బొమ్మలు పార్ట్ 7 – తాత వీరరాఘవయ్య అందించిన రామాయణ పుస్తకాన్ని చదువుతున్న కావ్య, ఆసక్తిగా వింటున్న చంద్రశేఖర్.

Tholu Bommalu - Part 7 - Telugu Serial | Ch. C. S. Sarma 

తోలు బొమ్మలు - పార్ట్ 7 - తెలుగు ధారావాహిక | సిహెచ్. సీఎస్. శర్మ

Published In manatelugukathalu.com On 19/10/2026


తోలు బొమ్మలు పార్ట్ 7లో వర్షం కారణంగా మధ్యలో ఆగిపోయిన తోలుబొమ్మలాట కథను తెలుసుకోవాలనే చిన్న చంద్రశేఖర్ ఆసక్తి, అతన్ని మరో అపూర్వమైన రామాయణ అనుభవంలోకి తీసుకెళ్తుంది. తాత వీరరాఘవయ్య తన తల్లి వెంకటలక్ష్మి రచించిన పుస్తకాన్ని మనవరాలు కావ్యకు అందించి చదవమంటారు. శ్రీరాముని వనవాస ప్రయాణం, సీతాపహరణం, లంకాదహనం, రామరావణ యుద్ధం, చివరగా శ్రీరామ పట్టాభిషేకం వరకు వివరించిన ఆ రచనను కావ్య చదువుతుంటే, చంద్రశేఖర్ ఎంతో ఆసక్తిగా వింటాడు. తరతరాలుగా అందుతున్న సాహిత్య సంపద, కుటుంబ అనుబంధాలు, పెద్దల పట్ల గౌరవం ఈ భాగంలో హృద్యంగా ఆవిష్కృతమవుతాయి.

జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సాక్ష్యాధారాలను బట్టి చంద్రశేఖర్ కు ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధింపబడుతుంది. జైలు నిశ్శబ్దంలో చంద్రశేఖర్ కలం పట్టాడు. తాత వీరరాఘవయ్య నుంచి మొదలైన జ్ఞాపకాలు చివరికి సుశీల–ధనుంజయరావుల వివాహ ప్రతిపాదన వరకు చేరుకున్నాయి. తాత వీరరాఘవయ్య చెప్పిన పరోపకారం, ఆదర్శ జీవనం గురించిన మాటలు చిన్న చంద్రశేఖర్ మనసుపై చెరగని ముద్ర వేస్తాయి. అదే సమయంలో గ్రామానికి వచ్చిన సాంబయ్య తోలుబొమ్మల బృందం అతనిలో కొత్త ఆసక్తిని రేకెత్తిస్తుంది. ప్రదర్శన మధ్యలో ధనుంజయరావు ప్రవర్తనను గమనించిన చంద్రశేఖర్ మనసులో కొత్త సందేహం మొదలవుతుంది.


 

తోలు బొమ్మలు పార్ట్ 7 | రామాయణ విశేషాలు | సిహెచ్. సీఎస్. శర్మ


తోలు బొమ్మలు - పార్ట్ 7

సిహెచ్. సీఎస్. శర్మ 


ఆ రాత్రంతా కుంభవర్షం. ఉరుములు, మెరుపులు... 


ఉదయం ఏడు గంటలకు లేచాను. అప్పటికి అందరూ లేచిపోయారు. నేను కాలకృత్యాలు తీర్చుకొని, స్నానం చేసి ఊయల పీటపై కూర్చొని ఉన్న తాతయ్యను సమీపించాను.


“తాతయ్యా! తోలుబొమ్మలాట రాత్రి వాన వలన పూర్తిగా చూడలేకపోయాము. తర్వాత కథ...”


నేను పూర్తి చేయకముందే తాతయ్యగారు ఊయల పీటపైనుంచి దిగి...

“చంద్రా!... ఐదు నిమిషాల్లో వస్తాను...” వేగంగా తన గదివైపుకు వెళ్లారు.


మా అత్తయ్య సుశీల, మా అక్కయ్య కావ్య ఒకే గదిలో పడుకుంటారు. వారిరువురూ వారి గది నుండి బయటికి వచ్చారు.


“ఏరా చంద్రా!... తాతయ్య ఎక్కడ?...” అడిగింది అక్క.


“వారి గదికి వెళ్లారు అక్కా!...”


“ఏమిటి విషయం?...” అత్తయ్య ప్రశ్న.


“ఏమో!... నాకు తెలీదు అత్తా!...”


తాతయ్య గొంతు సవరిస్తూ వచ్చారు. వారి చేతిలో ఒక పుస్తకం ఉంది. వచ్చి ఊయల పీట మీద కూర్చున్నారు.

అమ్మ భవాని కాఫీ కప్పులతో వచ్చి మా అందరికీ ఇచ్చింది. అందరం కాఫీ తాగాము.


మా చిన్నాన సత్యయ్య పట్నం నుంచి వచ్చాడు. అక్కడ అతను అగ్రికల్చరల్ ఫైనల్ ఇయర్ బి.ఎస్సి. చదువుతున్నాడు.


“నాన్నా, అమ్మా బాగున్నారా!...” ప్రీతిగా అడిగాడు.


“వదినా, అన్నయ్య ఎక్కడ?...”


“వారు పొలాలవైపు వెళ్లారు సత్యా!...”


“ఏరా సత్యా!... చదువు ఎలా సాగుతోంది?...”


“నాన్నా!... బాగా చదువుతున్నాను. స్టేట్ ఫస్ట్ రావడానికి ప్రయత్నిస్తున్నాను!...”


“ప్రయత్నించడం కాదురా!... రావాలి.”


“వస్తాను నాన్నా!...”


“వాణ్ణి స్నానం చేసి టిఫిన్ తిననివ్వండి...” తాతయ్య ముఖంలోకి చురుచురా చూస్తూ అంది మా నాయనమ్మ పార్వతి.


“నాన్నా!... స్నానం చేసి వస్తాను...” చెప్పి చిన్నాన తన గదిలోకి వెళ్లాడు.


“ఒరేయ్ చందూ, అమ్మా కావ్యా, ఈ పుస్తకాన్ని మా అమ్మ వెంకటలక్ష్మిగారు రాశారు. నీవు చదువు. తమ్ముడు వింటాడు. శ్రీరాముల వారి వనవాస వివరణ, పట్టాభిషేకాది విషయాలు ఇందులో ఉన్నాయి.” 


తాతయ్య పుస్తకాన్ని అక్క చేతికి ఇచ్చారు. అక్కా నేను తన గదిలోనికి వెళ్లాము. మంచంపై కూర్చున్నాము. పుస్తకాన్ని తెరిచి అక్క చదవడం ప్రారంభించింది.


శ్రీరామచంద్రమూర్తుల వారి వనవాస కాల వివరణ – 


పట్టాభిషేకం :

చైత్ర శుద్ధ దశమి నాడు 1వ రోజున వనవాస ప్రయాణము, రాత్రి తమసా తీర వాసము…


2వ రోజున జాహ్నవీ తీరవాసము, గుహుని రాక…


3వ రోజున గంగా దక్షిణ తీర తరువు క్రింద ఉండుట…


4వ రోజున ప్రయాగలో ఉండుట, భరద్వాజ మహర్షిల వారి దర్శనము…


5వ రోజున యమునాతీర వాసము, చిత్రకూట ప్రవేశము…


6వ రోజున సుమంత్రుడు అయోధ్యకు తిరిగి వచ్చుట, ఆ రాత్రి దశరథ మహారాజుగారి మృత్యువు.


7వ రోజున కౌసల్యాదుల విలాపము, భరతునికై దూతను పంపుట.


8వ రోజు నుండి 12వ రోజు వరకూ భరతుని అయోధ్యా ప్రయాణము.


13వ రోజున పౌరలౌకిక కర్మాచరణ (దశరథ మహారాజుగారికి).


14వ రోజు నుండి 17వ రోజు వరకు వనమార్గము బాగుచేయుట…


18వ రోజు నుండి 20వ రోజు వరకూ భరతుని వనప్రయాణము…


21వ రోజు నుండి 23వ రోజు వరకూ భరతుడు అడవిలో రాముని వద్ద నుండుట.


24వ రోజు నుండి 27వ రోజు వరకు భరతుడు అయోధ్యకు పాదుకలతో వచ్చుట.


45వ రోజున పాదుకా పట్టాభిషేకము.


శ్రీరాముడు చిత్రకూటమున పదిన్నర మాసములుండెను. మొదటి సంవత్సరము ఇట్లు గడచినది. పిదప చిత్రకూటమును విడిచి దండకారణ్యమున ప్రవేశించి ఋషుల ఆశ్రమములను చూచుచు గడిపిరి.


10 సంవత్సరముల పిదప, పంచవటిలో ఒకటిన్నర సంవత్సరమును గడిపిరి. ఈ విధముగా 12.5 సంవత్సరములు పూర్తి అయినవి. 13వ సంవత్సరము కొంచెము మిగిలి ఉన్నదనగా మాఘ శుద్ధ అష్టమినాడు... అభిజిత్ ముహూర్తములో రావణుడు సీతమ్మను అపహరించినాడు.


జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమినాడు ఋష్యమూక పర్వతము వద్దకు శ్రీ ఆంజనేయులతో చేరుట.


కార్తీక శుక్ల పాడ్యమి వరకు సుగ్రీవ పట్టాభిషేకము, 4 మాసములు వర్షాకాలము. సీతామాత అన్వేషణ జరగలేదు.


కార్తీకము చివర సుగ్రీవునిపై లక్ష్మణులవారి ఆగ్రహము. అక్కడినుండి మార్గశిరము వరకు వానర సైన్యం సీతామాత అన్వేషణ.


హనుమంతుడు మార్గశిర ఏకాదశిన లంకా ప్రవేశము, అర్థరాత్రి సమయాన సీతామాత దర్శనము.


ద్వాదశి నాడు వృక్షము పైనుండి రావణుని చూచుట, సీతామాతతో సంభాషణము.


త్రయోదశి నాడు అక్షాది రాక్షస మూకవధ.


చతుర్దశి నాడు లంకాదహనం, మరలా వానరులతో కలియుటకు ఐదు రోజులు.


మార్గశిర శుక్ల షష్ఠి నాడు మధువన భంజనము.


అష్టమి నాడు ఉత్తరా నక్షత్రమున విజయాఖ్య ముహూర్తమున రామదండు ప్రస్థానము.


పుష్య పాడ్యమికి సముద్ర తీరమునకు చేరుట.

పుష్య శుక్ల చవితికి విభీషణుని రాక.


పంచమి నాడు సముద్రము దాటుటకై ఆలోచన...

పిదప నాలుగు దినములు సముద్రుని రాముడు ప్రార్థించుట, ప్రాయోపవేశమునకు యత్నము.


దశమి నాడు సేతు బంధన ప్రారంభము.

త్రయోదశికి సేతు బంధనము పూర్తి.

చతుర్దశికి రాముడు సువేలగిరి ఎక్కుట.


పుష్య పాడ్యమి నుండి బహుళ విదియ వరకు సైన్యము దాటుట, తదియ నుండి దశమి వరకు సేనానివేశము.

ఏకాదశిన రావణుని ఆదేశముపై శుకసారణులు వచ్చి రామసేనను చూచుట.


ద్వాదశి వానరసేన గణనము.

అమావాస్య రాక్షససేన గణనము.

మాఘ శుద్ధ పాడ్యమి అంగద రాయబారము.


విదియ నుండి అష్టమి వరకు వానర రాక్షస యుద్ధము.

నవమి రాత్రి ఇంద్రజిత్తు నాగాస్త్రముచే రామలక్ష్మణులను బంధించుట.


దశమి గరుత్మంతుని ఆగమనము, నాగపాశ విమోచనము.

ఏకాదశి, ద్వాదశులలో ధూమ్రాక్ష వధ.

త్రయోదశి నాడు అకంపన వధ.


చతుర్దశి నుండి బహుళ పాడ్యమి వరకు యుద్ధము, నీలుడు ప్రహస్తుని చంపుట, రాముడు రావణుని మకుట భంగము చేయుట (నేల కూల్చుట).


పంచమి నుండి చతుర్దశి వరకు కుంభకర్ణునితో యుద్ధము.

అమావాస్య యుద్ధ విరామము.


ఫాల్గుణ పాడ్యమి నుండి చవితి వరకు నరాంతక వధ.

పంచమి నుండి సప్తమి వరకు అతికాయుని వధ.

పిదప మూడు రోజులు దుష్ట రాక్షస వధ.


ఫాల్గుణ శుద్ధ విదియ ఇంద్రజిత్తుతో యుద్ధము.

తదియ నుండి సప్తమి వరకు యుద్ధ విరామము.

త్రయోదశి నాడు ఇంద్రజిత్ వధ.

చతుర్దశి యుద్ధ విరామము.


ఫాల్గుణ అమావాస్య రావణుని యుద్ధ యాత్ర.

చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి రామ రావణ యుద్ధము.

నవమి రావణ పలాయనము.

లక్ష్మణ మూర్ఛ, ఆంజనేయులు హిమాలయము నుండి సంజీవిని తెచ్చుట.

దశమి యుద్ధ విరామము.


ఏకాదశి ఇంద్రుడు దేవతా రథము పంపుట.

ద్వాదశి నుండి బహుళ చతుర్దశి వరకు 18 రోజులు రామ రావణ యుద్ధము, చతుర్దశి నాడు రావణ వధ.


అమావాస్య రావణునికి ఉత్తరక్రియలు.

మొత్తము 18 రోజుల విరామము.


72 రోజులు యుద్ధము.


వైశాఖ శుద్ధ పాడ్యమిన విభీషణ పట్టాభిషేకము.

తదియ నాడు సీతమ్మ అగ్నిప్రవేశము.


చతుర్థి నాడు పుష్పక విమానమున భరద్వాజ ఆశ్రమమునకు రాక.


షష్ఠి రోజున నందిగ్రామములో భరతుని కలియుట.

వైశాఖ శుద్ధ నవమి అయోధ్యలో శ్రీరామచంద్రమూర్తుల వారి పట్టాభిషేకము.


జై... జై... జై... శ్రీరామ్... శ్రీరామ్... శ్రీరామ్...

*

కావ్య చదవడం ఆపింది... ఆమె కళ్లలో కన్నీటి జీరలు.

నేను అక్క ముఖంలోకి దీనంగా చూశాను.


“అక్కా!...” మెల్లగా పలకరించాను.


“ఏంటి చిన్నా?...” (మా అక్క, అత్తయ్య సుశీల, అమ్మ భవాని నన్ను ముద్దుగా పిలిచే పేరు అది).


“అక్కా!... శ్రీరాముడు, సీతామాత, లక్ష్మణులు... పద్నాలుగు సంవత్సరాలు అడవులలో ఎన్ని కష్టాలు పడ్డారక్కా!...”


“అవును చిన్నా!... చాలా కష్టాలు పడ్డారు. మన తాతయ్యగారి అమ్మ, మన గ్రేట్ నానీమా చాలా బాగా రాశారు. ఆమె గొప్ప పండితురాలని తాతయ్య నాతో చెప్పారు...”


“అవును అక్కా!... మన గ్రేట్ గ్రాండ్ మదర్ రియల్లీ గ్రేట్!...” నవ్వుతూ చెప్పాను.


తాతయ్యగారు మా గదిలోకి వచ్చారు.

“అమ్మూ!... చిన్నా!... ఏం చేస్తున్నారు? చదువుతున్నారా!...” నవ్వుతూ అడిగారు తాతయ్యగారు.


ఇరువురం మంచం దిగాము.

“తాతయ్యా, ఒక భాగం, అదే రామాయణ కథ ముగిసింది. మా గ్రేట్ గ్రాండ్ మదర్ సో గ్రేట్! అద్భుతంగా రాశారు...” నవ్వుతూ చెప్పింది అక్క.


“అవును తాతయ్యా!...” అన్నాను నేను.


“ఇంకా ఉంది తాతయ్యా... అన్నం తిని వచ్చి చదువుతాను...” అంది అక్క.


తాతయ్య మా అక్కను దగ్గరకు తీసుకున్నారు. ఆమె నొసటిపైన ముద్దు పెట్టారు.


‘‘మా అమ్మవు నావేనమ్మా!...’’ ఎంతో ప్రీతిగా పలికారు.

ఆ సమయంలో వారి కళ్లలో కన్నీరు.


భోజనానికి అమ్మ పిలుపు – నలుగురం గది నుండి బయటికి నడిచాము.

============================================================

తోలు బొమ్మలు - పార్ట్ 8 త్వరలో మీ ముందుకు వస్తుంది.

============================================================


📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y


సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page