top of page
Original.png

తోలు బొమ్మలు - పార్ట్ 6


తోలు బొమ్మలు పార్ట్ 5 – తాత వీరరాఘవయ్యతో లంకాదహనం తోలుబొమ్మలాట చూస్తున్న చిన్న చంద్రశేఖర్తోలు బొమ్మలు పార్ట్ 6 – మహాలక్షమ్మ గుడి వద్ద లంకాదహనం తోలుబొమ్మలాట చూస్తున్న చంద్రశేఖర్ కుటుంబం, సుశీలను గమనిస్తున్న ధనుంజయరావు.
తెరపై రామాయణ ఘట్టాలు… తెర ముందు మానవ సంబంధాల్లో కొత్త పరిణామాలకు నాంది! పార్వతీపురంలో తోలుబొమ్మలాట సందడి.

Tholu Bommalu - Part 6 - Telugu Serial | Ch. C. S. Sarma 

తోలు బొమ్మలు - పార్ట్ 6 - తెలుగు ధారావాహిక | సిహెచ్. సీఎస్. శర్మ

Published In manatelugukathalu.com On 15/10/2026


తోలు బొమ్మలు పార్ట్ 6లో తెలుగు పల్లె సంస్కృతికి ప్రతీకగా నిలిచిన తోలుబొమ్మలాట కళారూపం ఆసక్తికరంగా ఆవిష్కృతమవుతుంది. సాంబయ్య బృందం మహాలక్షమ్మ ఆలయం ముందు ప్రదర్శనకు ఏర్పాట్లు చేయడం, చిన్న చంద్రశేఖర్ ఆ ఏర్పాట్లను ఆసక్తిగా గమనించడం, తాత వీరరాఘవయ్య కుటుంబ సభ్యులతో కలిసి లంకాదహనం ప్రదర్శనను తిలకించడం ఈ భాగంలోని ముఖ్య ఘట్టాలు. బంగారక్క–కేతిగాడి సంభాషణలతో ప్రారంభమైన రామాయణ కథ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అయితే ప్రదర్శన మధ్యలో ధనుంజయరావు ప్రవర్తనను గమనించిన చంద్రశేఖర్ మనసులో కొత్త సందేహం మొదలవుతుంది.

జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సాక్ష్యాధారాలను బట్టి చంద్రశేఖర్ కు ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధింపబడుతుంది. జైలు నిశ్శబ్దంలో చంద్రశేఖర్ కలం పట్టాడు. తాత వీరరాఘవయ్య నుంచి మొదలైన జ్ఞాపకాలు చివరికి సుశీల–ధనుంజయరావుల వివాహ ప్రతిపాదన వరకు చేరుకున్నాయి. తాత వీరరాఘవయ్య చెప్పిన పరోపకారం, ఆదర్శ జీవనం గురించిన మాటలు చిన్న చంద్రశేఖర్ మనసుపై చెరగని ముద్ర వేస్తాయి. అదే సమయంలో గ్రామానికి వచ్చిన సాంబయ్య తోలుబొమ్మల బృందం అతనిలో కొత్త ఆసక్తిని రేకెత్తిస్తుంది.


 

తోలు బొమ్మలు పార్ట్ 6 – లంకాదహనం తోలుబొమ్మలాట


తోలు బొమ్మలు - పార్ట్ 6

సిహెచ్. సీఎస్. శర్మ 


మరుసటి రోజు ఉదయం ఏడు గంటలకు తోలుబొమ్మలాట సాంబయ్య మా ఇంటికి వచ్చాడు.

తాతగారు వరండాలో కూర్చొని దినపత్రికను చూస్తున్నారు. 


‘‘సామీ, దండాలు!’’ చెప్పాడు సాంబయ్య.


‘‘ఆ... శుభోదయం సాంబయ్యా!... పంచల కోసం వచ్చావా?...’’ అడిగారు తాతగారు.


‘‘అవును సామీ!...’’


తాతయ్య నాయనమ్మను పిలిచారు. మా నాయనమ్మ చాలా తెలివైనది. సాంబయ్య రావడాన్ని చూసింది. చేతిలో నాలుగు ఎనిమిది మూరల పంచలతో వరండాలోకి వచ్చింది.


‘‘సాంబయ్యా!... ఇవిగో పంచలు నాలుగు. చాలకపోతే మరో రెండు ఇచ్చేదా!...’’ అడిగింది నాయనమ్మ.


‘‘తల్లీ, మరో రెండు ఇయ్యండమ్మా!...’’ అడిగాడు సాంబయ్య. 


నాయనమ్మ ఇంట్లోకి వెళ్ళింది.

‘‘సాంబయ్య గారూ!...’’ నేను పిలిచాను.


‘‘ఏం చినసామీ!...’’


‘‘స్టేజీ ఎక్కడ, ఎప్పుడు వేస్తారు?..’’ అడిగాను.


‘‘మహాలక్షమ్మ దేవళం ముందు, స్కూల్లో నించి బెంచీలు తెచ్చి మరో రెండు గంటల్లో ప్రారంభిస్తాము చినసామీ!...’’ చిరునవ్వుతో చెప్పాడు సాంబయ్య.


‘‘నేను చూడాలి!...’’


‘‘పోయేటప్పుడు మిమ్మల్ని పిలుస్తా సామీ. మాతో రండి చూదురు గాని...’’


‘‘అట్టాగే, మరచిపోకుండా నన్ను పిలవండి!...’’


‘‘అట్టాగే సామీ!...’’ నవ్వుకొంటూ తాతయ్యకు చెప్పి సాంబయ్య మా చింతచెట్ల వైపు నడిచాడు.


స్కూలుకు వెళ్ళి అతను, అతని బృందంలో ఉన్న మగవారు, తాతయ్యకు చెప్పి స్కూల్లోని బెంచీలను మహాలక్షమ్మ గుడి ముందుకు చేర్చారు. తర్వాత సాంబయ్య అక్కడికి వెళుతూ నన్ను పిలిచాడు. 


సెలవు రోజులు కావడం వల్ల తాతయ్య, నాన్న, నాయనమ్మ, అమ్మ, అక్కకు చెప్పి, మహాలక్షమ్మ గుడి దగ్గరకు సాంబయ్యతో కలసి వెళ్ళాను.


అతని మనుషులు బెంచీలను ఒకదాని పక్కన ఒకటిగా చేర్చి అరుగులా చేశారు. దానికి నాలుగు వైపులా చవకలను నాటి గుంటలను మట్టితో పూడ్చారు. ఆ చవకల పొడవు దాదాపు పది అడుగుల పైనే ఉంటుంది. వాటికి అడ్డంగా నిలువుగా కొన్ని వెదురు గడలను స్టేజీ ముందు వెనుక వరుసగా ఉన్న చవకలకు పైనా కింద కట్టారు. 


మధ్యలో మరో వెదురు గడను ముందు వైపు కట్టారు. మా తాతయ్య పంచలను చవకలపై గడకు కింద బెంచీల మట్టంలో ఉన్న వెదురు గడకు సన్న దారాలతో పంచ అంచులను గడలకు కట్టారు. ఒకదాని పక్కన ఒక పంచను అదే రీతిగా కట్టి తుమ్మ ముళ్ళతో ఒక పంచకు నిలువుగా మరో పంచను బిగించారు. 


ఐదు పంచలతో ముందు స్క్రీన్ తయారయింది. మరో పంచను వెనుక గడలకు కట్టారు. వారి దగ్గర ఉన్న రంగు గుడ్డలను స్టేజీ కుడి, ఎడమ వైపుల వేలాడదీశారు. సాంబయ్య నాలుగు వైపులా తిరిగి తల ఊపుతూ...

‘‘ఓరేయ్ గోవిందా, స్టేజీ బాగా కుదిరిందిరా!...’’ ఆనందంగా నవ్వుతూ అన్నాడు సాంబయ్య. నా వైపు చూసి...

‘‘చినసామీ!... చూశారుగా స్టేజీని ఎట్టా తయారు చేశామో!... ఎలా ఉంది సామీ!...’’ అడిగాడు సాంబయ్య.


‘‘చాలా బాగుంది!....’’ నవ్వుతూ చెప్పాను.


‘‘సామీ?.... చాలా సేపటి నుంచి నిలబడి మాతో పాటి స్టేజీ నాలుగు వైపులా తిరుగుతూ అలసిపోయారు. 

భోజనాల వేళ కూడా అయింది. పదండి ఇంటికి పోదాం...’’ అన్నాడు సాంబయ్య.


అందరం మా ఇంటి వైపుకి నడిచాము. వారు చింతచెట్ల కిందకు వెళ్ళిపోయారు. నేను ఇంట్లోకి ప్రవేశించాను.

ఉయ్యాల మంచం మీద కూర్చొని ఊగుతున్న తాతయ్య నన్ను చూసి, ‘‘ఏం సార్!... స్టేజీ పని పూర్తి చేయించి వచ్చారా!...’’ నవ్వుతూ అడిగారు.


‘‘పని పూర్తయిపోయింది తాతా!... వాళ్ళూ భోజనానికి వచ్చారు.’’


‘‘అంటే ఈ రోజు నీవు ఒక కొత్త విషయాన్ని తెలుసుకున్నావన్న మాట!...’’


‘‘అవును తాతయ్య!...’’ నవ్వుతూ చెప్పాను.


‘‘ఎండలో నిలబడినందుకు ముఖం వాడిపోయింది. వెళ్ళి స్నానం చేసి రా. ఈలోగా మీ నాన్నా వస్తాడు. అందరం కలసి భోంచేద్దాం..’’ చెప్పారు తాతయ్య.


అమ్మ భవాని, నాయనమ్మ పార్వతమ్మ వంటింటి నుంచి బయటికి వచ్చారు. అక్క కావ్య తన గది నుంచి బయటికి వచ్చింది.


మా నాన్న, వారి చెల్లి సుశీలమ్మ తోటకు వెళ్ళి కూరగాయలు, మామిడిపళ్ళు తేవడానికి వెళ్ళిన వారిరువురూ సంచులతో వచ్చారు. మా నాన్నగారికి తన చెల్లి అంటే పంచప్రాణాలు.


వారు మా తాతయ్యగారు అన్న మాటలను విన్నారు.

‘‘నాన్నా!... చంద్రా ఎక్కడికి వెళ్ళాడు?...’’ అడిగారు.


‘‘సెలవులని ఊరి మీద బలాదూరుగా తిరగడానికి వెళ్ళావా?...’’ నన్ను చురచురా చూస్తూ మా అత్తయ్య సుశీల అడిగింది.


‘‘ఆగండ్రా!... ఎందుకు అంత ఆవేశం. వాడేం ఊరి మీద బలాదూరుగా తిరగడానికి వెళ్ళలేదు. సాంబయ్య స్టేజిని కడుతుంటే చూడడానికి వెళ్ళి వచ్చాడు...’’ చెప్పారు తాతయ్య.


‘‘అలాగా!...’’ అంది అత్త.


‘‘అవునూ!...’’ నా జవాబు.


‘‘ఏం, తోలుబొమ్మలు ఆడిస్తావా!...’’ నవ్వుతూ అంది అత్తయ్య నా దగ్గరకు వచ్చి, తన చేతిని నా తలపై ఉంచి జుట్టు కెలికింది.


‘‘అత్తయ్యా!...’’ దీనంగా ఆమెను చూస్తూ అన్నాను.


‘‘ఆఁ సరే, వెళ్ళి త్వరగా స్నానాలు చేసి రండి. అన్నా చెల్లీ భోంచేద్దురు గాని...’’ అంది నాయనమ్మ పార్వతి.


నాన్న, అత్త వారి వారి గదుల్లోకి వెళ్ళారు. ఇరవై నిమిషాల్లో స్నానం చేసి డ్రస్ మార్చుకుని హాల్లోకి వచ్చారు. అందరం డైనింగ్ టేబుల్ ముందుకు చేరాము. నాయనమ్మ, అమ్మ మాకందరికీ వడ్డించారు. అందరం ఆనందంగా భోంచేశాము. హాల్లో సమావేశమయ్యాము.


నా మిత్రుడు వివేకానంద వచ్చాడు. వాడు మా తాతయ్యగారి మరో చెల్లెలు సుభద్రమ్మ మనవడు. వారి ఊరికి మా ఊరికి ఐదు కిలోమీటర్ల దూరం. వాడు నాకంటే ఏడేళ్ళు పెద్దయినా మా ఇద్దరికీ మంచి స్నేహం.


మా అక్కకు నాకు రెండు సంవత్సరాల వ్యత్యాసం. అలాగే వాడికి మా అక్క కావ్యకు నాలుగేళ్ళ వ్యత్యాసం. వాడు మా ఇంటికి అప్పుడప్పుడూ వస్తూ ఉంటాడు. అక్క, నేను, వాడు, మా అత్తయ్య సుశీల కలసి క్యారమ్స్ ఆడుకుంటూ ఉంటాం. 

అత్తయ్య తన కాలేజీ అనుభవాలను గురించి ఒక్కోసారి చెప్పేది. మేము శ్రద్ధగా వినేవాళ్ళం. కథలూ చెప్పేది, ఆనందంగా ఆలకించేవాళ్ళం.


‘‘ఏరా వివేకా!... భోంచేస్తావా?...’’ అడిగింది అమ్మ.


‘‘తినేసే బయలుదేరాను అత్తయ్యా!...’’


‘‘అమ్మ బాగుందా!....’’ నాయనమ్మ పలకరింపు.


‘‘ఆఁ... బాగుంది అమ్మమ్మా!...’’


‘‘రండ్రా!... క్యారమ్స్ ఆడుకుందాం...’’ అత్త సుశీల పిలుపు.


నలుగురం క్యారమ్స్ ఆట ప్రారంభించాము. నేను అత్త ఒక జట్టు, అక్క కావ్య, వివేకానంద ఒక జట్టు. అత్త రిఫరీ.

తోలుబొమ్మలాట స్టేజ్ నాకు గుర్తుకు వచ్చింది.


‘‘బావా వివేక్!... నీకో విషయం తెలుసా!...’’


‘‘ఏమిట్రా అది?...’’


‘‘ఈ రాత్రి మా ఊర్లో మహాలక్షమ్మ గుడి దగ్గర తోలుబొమ్మలాట లంకాదహనం...’’


‘‘అలాగా!...’’

‘‘అవును. నీవు ఈ రాత్రికి ఉండిపో. మాతో కలసి నీవూ చూద్దువు గాని...’’


‘‘అలాగే!... నేను వెళ్ళి అమ్మకు చెప్పి వస్తాను...’’ వివేకానంద వేగంగా లేచి అందరికీ చెప్పి వరండా వైపుకు నడిచాడు.


నేను వాడిని అనుసరించాను. నాతో చెప్పి వివేకానంద తన సైకిల్‌పై వారి ఊరికి వెళ్ళిపోయాడు. ఐదు గంటలకల్లా తిరిగి వచ్చాడు.


అందరం కలసి ఏడు గంటలకే భోంచేశాము. కారణం తోలుబొమ్మలాటను చూడాలి కదా!...


మా పాలేర్లు మూడు నులక మంచాలను తీసుకుని వెళ్ళి స్టేజికి ముందు కుడివైపున వరుసగా ఉంచారు.


సాంబయ్య బృందం ఆ పెద్ద బొమ్మలు ఉన్న పెట్టెలను స్టేజీలోకి చేర్చారు. అతని బృందం అందరూ అక్కడికి చేరారు.


సాంబయ్య మా ఇంటికి వచ్చాడు.

‘‘ఏం సాంబయ్యా!... అంతా సిద్ధమేనా?...’’ అడిగాడు తాతయ్య.


‘‘సామీ, అంతా రెడీ. తమరు పరివారంతో వచ్చినారంటే లంకాదహనం ప్రారంభిస్తా సామీ!...’’ ఎంతో వినయంగా చెప్పాడు సాంబయ్య.


‘‘సరే!... నీవు వెళ్ళు. మేమంతా వస్తున్నాం.’’ 

తాతయ్యగారి జవాబు.


సాంబయ్య నమస్కరించి చిరునవ్వుతో వెళ్ళిపోయాడు.


‘‘పార్వతీ!...’’


వంటిట్లో నుంచి నాయనమ్మ, మా అమ్మ భవాని, అత్తయ్య సుశీల, అక్కయ్య కావ్య వేగంగా వచ్చారు.


‘‘పద్మా!...’’ పిలిచాడు తాతయ్య.


‘‘ఆఁ... వస్తున్నా నాన్నా!...’’ అంటూ నాన్నగారు తన గదిలో నుంచి హాల్లోకి వచ్చారు. అందరం హాల్లో సమావేశమయ్యాము.


తాతయ్య ఊయల మీద నుంచి దిగి...

‘‘పారూ!... బయలుదేరుదామా!....’’


‘‘ఆ... అలాగేనండి!...’’


‘‘నాన్నా!... పద్మా!...’’ నాన్న వైపు చూశాడు తాతయ్య.


‘‘బయలుదేరుదాం నాన్నా!...’’


అందరి ముఖాల్లో ఆనందం...

ముందు తాతయ్య, వారి వెనకాల అందరం ఇంటి నుంచి బయటికి నడిచాము. అత్తయ్య సుశీల సింహద్వారానికి తాళం బిగించింది.


అందరం ఇంటి ఆవరణం దాటి వీధిలో ప్రవేశించాము. మా వెనకాల మా పాలేర్లు సింగన్న రంగన్నలు నడవసాగారు.


ఏడు ఎనిమిది నిమిషాల్లో మహాలక్షమ్మ గుడిని చేరాము. పాలేర్లు ముందుకు పరుగెత్తి తమ పైపంచలతో మంచాలను దులిపారు. మా కుటుంబ సభ్యులమంతా మా మంచాలపై కూర్చున్నాము. 


నాయనమ్మ, తాతయ్య, నేను ఒక మంచంపైన, మా అత్తయ్య, అక్క, నాన్న, అమ్మలు ఒక మంచంపైన కూర్చున్నారు.


మాకు ఎదురుగా వీధికి అవతలి ప్రక్కన గోవర్ధనరావు, వారి సతీమణి నిర్మలమ్మ ఒక మంచంపైన, వారి కొడుకు ధనుంజయరావు, అతని స్నేహితుడు మురారి, సరాగాల సాంబయ్య కూర్చున్నారు.


సరాగాల సాంబయ్య ధనుంజయరావు చెవిలో ఏదో చెప్పాడు. ధనుంజయరావు మా అత్తయ్య సుశీలను పరీక్షగా చూడసాగాడు. మా అత్తయ్య అతని చూపును గమనించి తలను పక్కకు తిప్పుకుంది.


సాంబయ్య పరుగున మా తాతయ్యగారి వద్దకు వచ్చి...

‘‘సామీ!... ప్రారంభించనా?...’’ అడిగాడు.


‘‘ఆ... ప్రారంభించు!...’’ తాతయ్యగారి గ్రీన్ సిగ్నల్.


నవ్వుకుంటూ సాంబయ్య స్టేజ్ వైపుకు వెళ్ళాడు.

మా పక్కన ధనుంజయరావు గారి పక్కన మంచాలపై మరికొందరు గ్రామ పెద్దలు కూర్చున్నారు.

స్టేజీ ముందు ఊరి జనం ఆడ, మగ, పిల్లలు కూర్చున్నారు.


స్టేజీలో గంట మోగింది....

సాంబయ్య బృందం అందరూ విఘ్నేశ్వరుని ప్రార్థన గీతాన్ని హోరుమని, మద్దెల, తాళాలతో ప్రారంభించి ముగించారు.


స్టేజీపైకి బంగారక్క బొమ్మ, పక్క కేతిగాడి బొమ్మలను నిలబెట్టారు. కాళ్ళు చేతులు ఊపుతూ...

‘‘ఏం బంగారక్కా!... బహు ఖుషీగా ఉన్నావు?...’’ అడిగాడు కేతిగాడు.


‘‘ఓరోరి నా ఎర్రి బావా!... నీవు ఇప్పుడు ఎడున్నావురా!...’’ బంగారక్క కేతిగాడి బొమ్మలు కదులుతున్నాయి స్క్రీన్ మీద.


‘‘నీకు విషయం తెల్వదా?...’’


స్టేజి లోపల, బొమ్మల వెనుక సాంబయ్య బృందపు మాటలు.


‘‘నీకు తెలుసునంటే?...’’


‘‘ఆ... తెలుసు...’’


‘‘సరే, విషయం ఏంటో చెప్పు!...’’


బంగారక్క నవ్వింది.

‘‘ఓరి నా ఎర్రి బావా!... ఈయాళ మన వారంతా కలిసి ఈడ లంకాదహనం నాటకం ఆడబోతుండము!...’’


‘‘అట్టాగా!...’’


‘‘అవును బావా!... ధర్మప్రభువులు వీరరాఘవయ్యగారు మనచేత ఆ బొమ్మలాటను ఆడిస్తుండరు. ఎముక లేని చెయ్యి ఆ సామిగారిది. వారు వారి కుటుంబం మంచాల మీద కూర్చొని నాటకాన్ని చూస్తుండరు. ఆ ప్రభువులు పదికాలాల పాటు చల్లగా ఉండి, మనలాంటి వాళ్ళను ఆదరించాలి బావా!...’’


‘‘ఆ... అవునవును. ఆ మారాజులు వారి కుటుంబం పదికాలాల పాటు చల్లంగుండాలే!... ముందు కథ చెబుతా విను. దశరథ మహారాజు పెద్ద కొడుకు శ్రీరాముడు. వారి భార్య సీతమ్మ. వారికి ముగ్గురు తమ్ములు—లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. ముగ్గురు తల్లులు—కౌసల్య, సుమిత్ర, కైకేయిలు. దశరథ మహారాజు యుద్ధభూమిలో తన్ను కాపాడిన కైకమ్మకు రెండు వరాలిచ్చిండు...’’


‘‘ఏంటి బావా ఆ వరాలు!...’’


‘‘ఓసే బంగారం, ఆ వరాలు ఆమె కావలసినప్పుడు అడగవచ్చని చెప్పిండు ఆ రాజు. పెద్ద కొడుకు శ్రీరాముల వారికి యువరాజు పట్టాభిషేకం చేయాలని దశరథ మహారాజు వారి కులగురువు వశిష్ఠుల వారిచే ముహూర్తాన్ని నిర్ణయించినాడు.


కైకమ్మకు ఒక దాసి ఉంది, పేరు మందర. ఆ మందర మంచిది కాదు. ఆమె రాములవారి పట్టాభిషేకాన్ని గురించి కైకమ్మకు చెప్పింది. అంతేకాదు, కైకమ్మ నీ కొడుకు భరతుని యువరాజుగా చేయమని అడుగు!... అని ఆ నీచబుద్ధి మందర కైకమ్మతో చెప్పింది.


కైకమ్మ మనసులో తన కొడుకు భరతుడు యువరాజు కావాలనే ఆశ కలిగింది. అప్పుడు ఆమె ఎప్పుడో దశరథ మహారాజు తనకు ఇచ్చిన రెండు వరాలూ గుర్తుకు వచ్చినాయి. ఆ వరాలడిగి, భరతుని రాజుగా చేయాలని నిర్ణయించుకుంది కైకమ్మ. తన మందిరానికి వచ్చిన రాజుతో మాట్లాడలేదు. అలిగింది. రాజు ప్రేమతో ఎందుకు అలక అని అడిగాడు.


నాకు మీరిచ్చిన రెండు వరాలూ ఇప్పుడు కావాలని చెప్పింది కైకమ్మ. రాజు అడగమన్నాడు, ఇస్తానన్నాడు. కైకమ్మ... ‘నా మొదటి వరం, నా కొడుకు భరతునికి పట్టాభిషేకం జరగాలి. రెండవ వరం శ్రీరాముడు పద్నాలుగు సంవత్సరాలు వనవాసానికి పోవాలి.’ ఆ రెండు కోరికలను కోరింది కైకమ్మ.


దశరథ మహారాజుకు శ్రీరామచంద్రమూర్తి అంటే పంచప్రాణాలు. బోరున ఏడ్చాడు, మూర్ఛపోయాడు.

విషయాన్ని విన్న శ్రీరాములవారు తండ్రికి ఉపచర్యలు చేసి, కైకమ్మ కోరిన రీతిగా వనవాసానికి పోయేదానికి సిద్ధమైనాడు. వారి ప్రియ సోదరుడు లక్ష్మణుడు, భార్య సీతామాత వారి వెంట అడవులకు వెళ్ళిపోయారు. 


ఆ సమయంలో భరతుడు వారి అమ్మమ్మగారి ఊరిలో ఉన్నాడు. విషయం విని అయోధ్యకు వచ్చి, తల్లి కైకమ్మను తిట్టి అన్న కోసం అడవికి వెళ్ళాడు భరతుడు. అన్నను కలిసి ‘అన్నా, మీరు తిరిగి అయోధ్యకు రండి’ అని కోరాడు. ఆడిన మాటను తప్పడం తెలియని రాముడు, ‘అది అసంభవం సోదరా!...’ అన్నాడు. 


అన్న తత్వం ఎరిగిన భరతుడు వారి పాదుకలను అడిగి తీసుకుని కన్నీటితో రాజ్యానికి తిరిగి వచ్చాడు. అన్నగారి పాదుకలను సింహాసనంపై ఉంచి, ప్రతిరోజూ వాటిని పూజిస్తూ భరతుడు రాజ్యం ఏలాడు. ఇక అడవిలో జరిగిన కథ ‘లంకాదహనం’ మనం ఆడబోతున్నాము బంగారక్కా.’’ చెప్పడం ఆపాడు కేతిగాడు.


హోరుమని మద్దెల, తాళాలు జోరుగా మోగాయి. సాంబయ్య బృందం ‘‘హరేరామ హరేరామ... రామ రామా హరేహరే!...’’ అని బిగ్గరగా పలికారు. శ్రీమద్రామారమణ గోవిందో హరి అని అరిచారు.


నా శరీరం జలదరించింది, తాతయ్య నన్ను దగ్గరకు తీసుకున్నారు.


శ్రీరాముడు, సీతామాత, లక్ష్మణుల తోలుబొమ్మలు తెరపైకి వచ్చాయి. లక్ష్మణుడు వారికి దూరంగా చెట్ల దగ్గర నిలబడి ఉన్నాడు.


రాక్షస కాంత, లంకారాజు రావణుని సోదరి శూర్పణఖ శ్రీరాములవారిని సమీపించింది. సీతమ్మ ఆశ్రమంలోనికి వెళ్ళింది.


‘‘రాజా!... మీరు నన్ను వివాహం చేసుకోవాలి...’’ అడిగింది. 


శ్రీరాములవారు చిరునవ్వు నవ్వి, ‘‘నేను వివాహితుడను.

అడుగో నా తమ్ముడు లక్ష్మణుడు. వారికి తెలుపుము నీ వాంఛ!...’’ చిరునవ్వుతో చెప్పాడు శ్రీరాముడు.


శూర్పణఖ లక్ష్మణుల వారిని సమీపించింది. తన నిర్ణయాన్ని వారికి తెలియజేసింది.


లక్ష్మణుల వారు ఆవేశంతో శూర్పణఖ ముక్కు చెవులను కోశారు. శూర్పణఖ వారిని తిడుతూ, శపిస్తూ వెళ్ళిపోయింది.


తెరమీద తోలుబొమ్మలు రాముడు, సీత, లక్ష్మణుడు, శూర్పణఖల సంభాషణలకు తగిన రీతిగా కదలికలు చేశాయి. తెరవెనుక సాంబయ్య బృందం ఒక్కో పాత్రకు ఒకరుగా ఆడ, మగల మాటలు పలికారు. బొమ్మల అభినయాన్ని, తెరవెనుక ఉన్నవారి మాటలను వింటుంటే మనస్సుకు మహదానందం కలిగింది. 


ఆ బొమ్మలన్నీ తొలిగిపోయాయి. గంట మోగింది.

పది తలల రావణుని బొమ్మ తెరపైకి వచ్చింది.

శూర్పణఖ ఏడుస్తూ వారిని సమీపించింది.

రావణుడు, ‘‘ఏడుపుకు కారణం ఏమిటి సోదరీ!...’’ అడిగాడు.


అడవిలో తాను చూసిన రామ, సీత, లక్ష్మణుల గురించి శూర్పణఖ తన సోదరునికి తెలియజేసింది. తన తెగిన ముక్కు చెవులను అన్నగారికి చూపించి ఏడ్చింది.



‘‘వారికి ప్రతీకారం నేను చేస్తాను, ఏడవకు సోదరీ. లోనికి వెళ్ళు, వైద్యులను పంపుతాను, చికిత్స చేస్తారు. త్వరలో గాయాలు మానుతాయి చెల్లీ!...’’ చెప్పాడు రావణుడు.


‘‘అన్నా!...’’


‘‘ఏమిటమ్మా!...’’


‘‘ఆ రాముడి భార్య సీతట. మహా అందగత్తె అన్నా!...’’ చెప్పింది శూర్పణఖ.


‘‘ఏమిటీ?...’’ ఆశ్చర్యంతో అడిగాడు రావణుడు.


‘‘అవునన్నా!... ఆ సీత మహాగొప్ప సుందరి!...’’ చెప్పింది శూర్పణఖ.


‘‘అటులనా!...’’


‘‘అవునన్నా!...’’


‘‘సరే నీవు వెళ్ళి విశ్రాంతి తీసుకో. త్వరలో ఆ సుందరి సీతను నీకు వదినను చేతును!....’’ వికటాట్టహాసం చేశాడు రావణుడు.


రావణుడు అడవిలో వారు ఉన్న ప్రాంతాన్ని శూర్పణఖ నుండి తెలుసుకున్నాడు. శూర్పణఖ లోనికి వెళ్ళిపోయింది.


‘‘మారీచ మామా!...’’ పిలిచాడు రావణుడు.


వారి మామగారు మారీచుడు వారి ముందుకు వచ్చాడు.

‘‘అల్లుడూ, ఏమిటి విషయం?...’’ అడిగాడు.


‘‘మామా, నీవు బంగారు లేడిగా మారవలె. అడవిలో సీతారామలక్ష్మణులున్న ప్రాంతమునకు వెళ్ళి సీతను నీవు సమ్మోహితురాలిని కావించవలె. రామలక్ష్మణులు నిన్ను పట్టుకొన బయలుదేరవలె!... అప్పుడు నేను సీతను మన లంకానగరానికి కొనివచ్చెద. వెళ్ళు!...’’ ఆదేశించాడు రావణుడు.


మారీచుడు, ‘‘సరే!...’’ అని వెళ్ళిపోయాడు.

గంట మోగింది.


పది తలల రావణుడు మాయమైనాడు.

తెరపైన సీతారాముల ఆశ్రమము.

బంగారు లేడిగా మారిన మారీచుడు ఆశ్రమ ముంగిట చెట్ల నడుమ సంచారం.


సీతామాత, రాములవారు ఆశ్రమం ముంగట.

సీతామాత బంగారు లేడిని వీక్షించుట!...

‘‘నాథా!... అటు చూడండి!...’’ చెప్పింది సీతమ్మ.


శ్రీరాముడు సీతమ్మ తన చూపుడు వేలును చూపిన వైపు చూశాడు. వారికి గోచరించింది బంగారు వన్నె లేడి.

‘‘నాథా!... బంగారు వన్నె లేడి బహు సుందరముగా ఉన్నది కదా!... అది నాకు కావలయును...’’ సీతామాత ప్రాధేయపూర్వకముగా కోరినది.


శ్రీరాములవారు మందహాసంతో...

‘‘దేవీ!... దానిని పట్టి తెచ్చి నీకు ఇచ్చెదను!....’’ అన్నాడు.


లక్ష్మణుని పిలిచి....

‘‘లక్ష్మణా!... నీవు ఆశ్రమమునందు మీ వదినగారికి తోడుగా ఉండుము. నేను ఆ బంగారు లేడిని పట్టి తెచ్చెదను. సీతకు ఇచ్చెదను...’’


లక్ష్మణుడు తల ఊపెను. రాముడు లేడి గడ్డిని మేయుచున్న వైపుకు వెళ్ళెను. లేడి రాముని చూచి ముందుకు పరుగెత్తెను. రాముడు దానిని పట్టుకొనుటకై దాని వెంట ఏగెను. రాముడు, లేడి సీతా లక్ష్మణులకు కనుమరుగాయెను.


దాదాపు అరగంట సమయము గడిచెను. లేడి రామునకు దొరకలేదు.


ఉన్నట్లుండి ‘‘హా సీతా!... హా లక్ష్మణా!...’’ అను ఆర్తనాదము సీతా లక్ష్మణుల చెవులకు సోకెను (వినిపించెను).


అది శ్రీరాముల వారి కంఠస్వరము. సీతామాత హృదయమున కలవరము. రాములవారు ప్రమాదములో ఉన్నారన్న భావన.


‘‘లక్ష్మణా!.... మీ అన్నగారు ఆపదలో ఉన్నట్లున్నారు. ఆ దీనాలాపము వారి స్వరం. నీవు వెంటనే బయలుదేరి మీ అన్నగారిని రక్షించి తీసుకుని రమ్ము!...’’


‘‘తల్లీ!... అది రాక్షస మాయ. త్రిలోకములందు మా అన్నగారిని ఎదిరించగలిగిన వీరులు లేరు. మీరు భయపడకండి. అన్నయ్య క్షేమంగా తిరిగి రాగలరు..’’ ఎంతో వినయముగా లక్ష్మణుడు చెప్పెను.


మరలా అదే ఆర్తనాదము వారికి వినిపించెను.

సీతామాత భయముతో కన్నీరు కార్చుతూ...

‘‘లక్ష్మణా, ఆ పలుకులు మీ అన్నగారివే. వారు ఏదో ఆపదలో ఉన్నారు. వెంటనే వెళ్ళి వారిని కాపాడి తీసుకుని రమ్ము, పొమ్ము!...’’ ఈసారి హెచ్చు స్థాయిలో గద్గద స్వరంతో సీతామాత పలికెను.


లక్ష్మణుడు ముందు చెప్పిన మాటలనే మరోసారి సీతామాతకు ఎంతో అనునయంగా చెప్పెను.

సీతామాత లక్ష్మణుని మాటలను విశ్వసించలేదు. మస్తిష్కంలో ఆందోళన. మనస్సున భయం. తన మాటను విననందున లక్ష్మణునిపై ఆవేశం.


‘‘దుష్ట చింతనతో నీవు నా మాటలను లెక్కచేయకున్నావు. మీ అన్నయ్యగారు ఆపదలో ఉన్నారు. నీవు నన్ను తాకలేవురా మూర్ఖా!...’’ మాత ఆవేశముగా పలికెను.


లక్ష్మణుని నయనాల నుండి అశ్రుధారలు. సీతమ్మ పలికిన దుష్టచింతన అన్న పలుకు అతని హృదయాన్ని ముక్కలు చేసింది.


‘‘తల్లీ!... మీరు నా మాటలను నమ్మలేదు. నన్ను అనుమానిస్తున్నారు. సరే!... మీరు చెప్పిన రీతిగానే నేను వెళతాను.’’ తన అంబుల పొదిలో ఉన్న బాణమును తీసి ఆశ్రమపు ముంగిట ఒక గీత (రేఖ)ను గీచి..


‘‘తల్లీ!... ఎటువంటి పరిస్థితులలోనూ మీరు ఈ గీతను దాటి ముందుకు రాకూడదు. అంతా రాక్షసమాయ. మీరు గ్రహించలేకున్నారు. జాగ్రత్త. నా మాటను గుర్తుంచుకోండి. నేను వెళుతున్నాను...’’


లక్ష్మణుడు ఆందోళనతో అడవిలో ప్రవేశించినాడు, తన అన్న శ్రీరామచంద్రమూర్తిగారి కోసం!...

సీతామాత విచారముగా కన్నీటితో ఆశ్రమములోనికి నడిచినది.


లంకానాథుడు రావణుడు జంగమదేవర రూపంతో ఆశ్రమము ముందుకు వచ్చాడు. ద్వారానికి ఎదురుగా నిలబడి, లక్ష్మణుడు గీచిన గీతకు దూరంగా ఉండి...

‘‘భవతి భిక్షాందేహి... భవతి భిక్షాందేహి’’ బిగ్గరగా పలికెను.


ఆ యాచకుని పలుకులను విన్న సీతామాత ఆశ్చర్యంతో తలుపు తెరచి బయటకు చూచినది.

వాకిట ఎదురుగా ఆజానుబాహుడు, నొసట విభూతి రేఖలు, మెడలో రుద్రాక్షలు, ఒక చేతిలో జపమాల, మరో చేతిలో కమండలం, చంకన ఒక సంచితో నిలబడియున్న జంగమదేవరను మాత తిలకించెను.


దేవర, ‘‘భవతి భిక్షాందేహి!...’’ అని సీతను చూచి మరోసారి పలికెను.


సీతామాత అతను నిజమైన యాచకుడని భావించి లోనికి ఏగి పళ్ళెంలో భిక్ష (ఫల కందమూలాలు)ను ఉంచుకుని ఆశ్రమము నుండి బయటికి వచ్చి లక్ష్మణరేఖకు ఆవలి వైపున నిలబడి...

‘‘స్వామీ, భిక్షను స్వీకరించండి...’’ చెప్పింది సీతామాత.


‘‘నారీ!... నీవు మమ్ములను అవమానింతువా!... మా దరికి వచ్చి భిక్షను మాకు ఒసగవా!... మేము నీ చెంతకు రావలయునా?...’’ దేవర ఆవేశముగా పలికెను.


భర్త ఆర్తనాదాన్ని విని కలవరంతో ఉన్న మాత, ఆ దేవర ఆగ్రహానికి గురికాకూడదని తలచి, మాత లక్ష్మణరేఖను దాటి దేవరకు భిక్షను అతని జోలిలో వేయబోయెను. 


జంగమదేవర నిజరూపం రావణుడుగా మారి సీతామాతను ఎత్తుకొని పుష్పక విమానమునందు మాతను ఎక్కించి గగన వీధిలో లంకా పట్టణము వైపుకు బయలుదేరెను. మార్గమున పూర్వజన్మ జ్ఞానము కల జటాయువు తను రథమున ఆవేదనతో ఉన్నది సీతామాత అని గ్రహించి రావణుని సంహరింప ప్రయత్నించెను.


రావణుడు తనను ఎదుర్కొన్న జటాయువు రెక్కలను తన ఖడ్గముతో నరికి ఆ పక్షిరాజును నేలకూల్చి తాను ముందుకు సాగెను.


గంట మోగింది. ‘‘అయ్యలారా అమ్మలారా, విరామం పదిహేను నిమిషాలు’’ సాంబయ్య కంఠం…


తెరమీద ఉన్న రావణుడు, రథము, సీతామాత, జటాయువు తెర నుండి దిగారు.


అప్రయత్నంగా నా చూపు మా ఎదురుగా కూర్చొని యున్న ధనుంజయరావు వైపు మరలింది. అతను మా అత్తయ్య సుశీలనే చూస్తున్నాడు, నవ్వుతున్నాడు. 


నాకు అతని ప్రవర్తన నచ్చలేదు. నేను అతని చేష్టలను తాతయ్యకు చెప్పాలనుకున్నాను. తాతయ్య తొడపై తట్టాను. వారు నా ముఖంలోకి చూశారు.


‘‘నాన్నా చంద్రా!... నిద్రవస్తూ ఉందా!...’’ అడిగారు.


‘‘లేదు తాతయ్యా!...’’


‘‘మరి ఎందుకు నా తొడపై గిల్లావు?...’’


‘‘గిల్లలేదు తాతయ్యా!... తట్టాను!...’’


‘‘అదే, ఎందుకు?... ఒంటికి వెళ్ళాలా!...’’


‘‘ఆహా, అది కాదు తాతయ్యా, విషయం వేరే!...’’


‘‘ఏమిటి నాన్నా అది?...’’


‘‘తాతయ్యా!... ఆ ధనుంజయరావు మా అత్త సుశీలనే చూస్తున్నాడు!... నేను గమనించాను. అది తప్పు కదా తాతయ్యా!...’’ అడిగాను.


‘‘అలాగా!...’’ ఆశ్చర్యంతో అడిగారు తాతయ్య.


‘‘అవును తాతయ్యా!...’’ నొక్కి వక్కాణించాను. 


తాతయ్య నవ్వారు. ‘‘నాన్నా చంద్రా!... ఆ ధనుంజయ నీకు వరసకు మామ అవుతాడు. పెద్దవాళ్ళను పేరుతో సంబోధించకూడదయ్యా!...’’ నా గడ్డం పట్టుకుని చెప్పారు తాతయ్య.


చినుకులు పడసాగాయి. కొన్ని క్షణాల్లో పెద్ద వాన. అందరూ లేచి వారి వారి ఇండ్ల వైపుకు పరుగెత్తారు. మేమంతా మా ఇంటి వైపుకు పరుగు తీశాము.

============================================================

“ధనుంజయరావు చూపుల వెనుక రహస్యం ఏమిటి?” 

తోలు బొమ్మలు - పార్ట్ 7 త్వరలో మీ ముందుకు వస్తుంది.

============================================================


📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y


సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page