top of page
Original.png

తోలు బొమ్మలు - పార్ట్ 5

37 minutes ago
8 min read

తోలు బొమ్మలు పార్ట్ 5 – తాత వీరరాఘవయ్యతో లంకాదహనం తోలుబొమ్మలాట చూస్తున్న చిన్న చంద్రశేఖర్

Tholu Bommalu - Part 5 - Telugu Serial | Ch. C. S. Sarma 

తోలు బొమ్మలు - పార్ట్ 5 - తెలుగు ధారావాహిక | సిహెచ్. సీఎస్. శర్మ

Published In manatelugukathalu.com On 05/10/2026


తోలు బొమ్మలు పార్ట్ 5లో చంద్రశేఖర్ బాల్య జ్ఞాపకాల ద్వారా ఒకప్పటి తెలుగు పల్లె జీవితం, కుటుంబ విలువలు, సంప్రదాయ కళల ప్రపంచం మన కళ్లముందు ఆవిష్కృతమవుతుంది. తాత వీరరాఘవయ్య చెప్పిన పరోపకారం, ఆదర్శ జీవనం గురించిన మాటలు చిన్న చంద్రశేఖర్ మనసుపై చెరగని ముద్ర వేస్తాయి. అదే సమయంలో గ్రామానికి వచ్చిన సాంబయ్య తోలుబొమ్మల బృందం అతనిలో కొత్త ఆసక్తిని రేకెత్తిస్తుంది.


జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సాక్ష్యాధారాలను బట్టి చంద్రశేఖర్ కు ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధింపబడుతుంది. జైలు నిశ్శబ్దంలో చంద్రశేఖర్ కలం పట్టాడు. తాత వీరరాఘవయ్య నుంచి మొదలైన జ్ఞాపకాలు చివరికి సుశీల–ధనుంజయరావుల వివాహ ప్రతిపాదన వరకు చేరుకున్నాయి.

 

తోలు బొమ్మలు - పార్ట్ 5 – చంద్రశేఖర్ బాల్యంలో తోలుబొమ్మల అద్భుత ప్రపంచం


తాతయ్య వీరరాఘవయ్య సంస్కృతాంధ్ర పండితులు. అధ్యాపక ఉద్యోగాన్ని చేసుకుంటూ ఇరువురు పాలేర్ల సాయంతో ఉన్న పాతిక ఎకరాలను సాగుచేసి బాగా పండించేవారు. 


గోవర్ధనరావు గారు కరణం కమ్ మున్సబ్. గ్రామంలోని బంజరు భూములను కొన్ని తన బంధువుల పేర్ల మీద, తనకు అతిముఖ్యమైన వాళ్ల పేర్ల మీద రాసి, శిస్తులు కట్టేవాడు. అంటే అదంతా వారి సొంతమే!... 


తాతయ్య వీరరాఘవయ్య, గోవర్ధనరావు తాతయ్య దాదాపు ఒకే వయస్సువారు. మంచి నటులు. ఆ వయసు పెద్దలంతా చేరి నాటకాలు, తులాభారం, శ్రీకృష్ణ రాయబారం, సత్యహరిశ్చంద్ర, తారా శశాంకం, బాలనాగమ్మ, ఏదో ఒకదాన్ని ఎండాకాలంలో ప్రదర్శనకు నిర్ణయించుకుని పద్యాలను వచనాలను ప్రాక్టీస్ చేసేవారు. 


నాకు ఊహ తెలిసిన తరువాత మా తాతయ్యగారు వారి బృందంతో ప్రదర్శించిన నాటకం శ్రీకృష్ణ రాయబారం. అప్పటి నా వయస్సు 6, 7 ఏళ్ల ప్రాయం. 


అంతకుముందు అంటే నా వయస్సు నాలుగైదు సంవత్సరాల తరుణంలో మా గ్రామానికి వేరు వేరు ప్రాంతాల నుండి తోలుబొమ్మల ఆటగాళ్లు, వీధి భాగవతం ఆటగాళ్లు వచ్చేవారు. మా ఇంటి స్థలం ఉత్తరపు హద్దు మీద పెద్ద చింతచెట్లు ఆరు గొడుగుల్లా వ్యాపించి ఉండేవి. వాటిని మా తాతగారి తాతగారు నాటారని తాతయ్య చెప్పేవారు.


ఆ మాటతో పాటు ...‘‘ఒరే చిన్నా!... మనం మన జీవితంలో మన అవసరాలకు శ్రమించి సంపాదించి, పంటలను పండించి వాకిట ముందు పాతరలను పెట్టి ధాన్యాన్ని నిలువ చేసుకుని మనకు అవసరం వచ్చినప్పుడు తీసుకుని తరువాత పాతరను మూసేస్తాము. 


అలాగే మన జీవితకాలంలో మనం మన ముందుతరాల వారి కోసం కొన్ని చెట్లను నాటాలి. ఆ వైపు చూడు, ఏ తాత ముత్తాత నాటాడో ఆ చింతచెట్లు మానులై, మనకు చింతచిగురు, చింతపిందెలు, కాయలు, పండ్లు అన్నీ ఇస్తున్నాయి. ఆ చెట్లను నాటినవారు తాము ఫలితాలను తినాలని వారు ఆశించలేదు. వారి వారసులమైన మనం హాయిగా తినగలుగుతున్నాము. కనుక పరోపకార దృష్ట్యా మన జీవితకాలంలో కొన్నైనా మంచి పనులు చేయాలి…


నాయనా!... చంద్రా!... ఈ తాతయ్య మాటలు ఎన్నటికీ మరువకు. నా గురువు విద్యోధర శర్మగారు నాకు నేర్పిన మాటలివి. నేను వీటిని మీ నాన్న పద్మనాభానికీ, చిన్నాన సత్యానికీ, మీ అత్తయ్య సుశీలకు కూడా నేర్పాను. వారి విషయంలో నాకు చాలా సంతోషం. వారు నా ప్రతి మాటను ఆదరించారు, అభిమానించారు, గౌరవించారు, పాటించారు. ప్రయోజకులైనారు. 


నాయనా!... మనిషి ఎలాగో ఒకలాగా బ్రతకడం ముఖ్యం కాదు. నిర్దిష్టమైన, పదిమందికీ ఆదర్శం, ఆచరణీయమైన మార్గాన నడవాలి. జీవిత గమనంలో వివేకం అతిముఖ్యం.’’


నేను ఉత్తరపు దిశలో ఉన్న చింతచెట్లను చూశాను. వాటి కింద నాలుగు గూడుబండ్లు (Covered) వచ్చి నిలిచాయి.


‘‘తాతయ్య!... అటు చూడండి!...’’


తాతగారు ఆ వైపు చూచారు.

‘‘తోలుబొమ్మల ఆటవాళ్లు చంద్రా!... సంవత్సరానికి ఒకసారి వారు వస్తూ ఉంటారు..’’


బండ్లను చెట్ల క్రింద ఆపి ఒక వ్యక్తి మా ఇంటివైపుకు వచ్చాడు.

‘‘ఏరా సాంబయ్యా!... ఎలా ఉన్నారు?... నీవు నీవారు?...’’ చిరునవ్వుతో అడిగాడు తాతయ్య.


‘‘దండాలు సామీ!... మీ దయవల్ల అంతా బాగుండారు సామి. ఇప్పుడే వచ్చినాము...’’ ఎంతో వినయంగా చేతులు జోడించాడు సాంబయ్య.


‘‘ఏమైనా కావాలంటే మీ అమ్మగారిని అడిగి తీసుకోండి.’’ 


కొత్త వ్యక్తి గళం విని మా నాయనమ్మ పార్వతమ్మ వరండాలోకి వచ్చింది.


‘‘దండాలు తల్లీ!...’’ చేతులు జోడించాడు సాంబయ్య.


‘‘సాంబయ్యా!... అంతా బాగున్నారా!...’’


‘‘అంతా తమరి దీవెన తల్లీ!... బాగుండారు!...’’


‘‘ఏమైనా కావాలా!... నిర్మొహమాటంగా అడుగు. నేను నీ తల్లిని. ఇది నీ ఇల్లు!...’’ నవ్వుతూ చెప్పింది నాయనమ్మ…


‘‘అట్టాగే తల్లీ!... బండ్ల నుంచి సామాను దించి వస్తానమ్మా!...’’


‘‘ఆ, అలాగే సాంబయ్యా!....’’


నమస్కరించి సాంబయ్య వెళ్ళిపోయాడు.

‘‘తాతయ్యా!....’’


‘‘ఏం చంద్రా!...’’


‘‘వీరు ఎప్పుడు తోలుబొమ్మలని ఆడిస్తారు?...’’


‘‘రాత్రిపూట. మనం ఏ నాటకం వేయమంటే దాన్ని ఆడతారు చిన్నా!...’’


‘‘తాతయ్యా!...’’


‘‘ఆంజనేయస్వామి వారు మహా బలవంతుడు కదా!...’’


‘‘వారికి మించిన బలవంతుడు ఈ ప్రపంచంలో లేడు. వారు శ్రీ శివాంశ సంభూతులు నాన్నా!....’’


‘‘లంకాదహనం అంటే తాతయ్య!...’’


తాతయ్య చిరునవ్వు నవ్వారు.

‘‘అడవిలో ఉన్న సీతారామలక్ష్మణులను రావణుని సోదరి శూర్పణఖ చూసింది. శ్రీరాముని అందచందాలను చూసి వారిని సమీపించి ‘నన్ను వివాహం చేసుకో’ అని కోరింది శూర్పణఖ.


‘నేను వివాహితుడను. అడుగో నా సోదరుడు లక్ష్మణుడు, అతనిని కోరుము...’ అన్నాడు శ్రీరాముడు.


శూర్పణఖ లక్ష్మణుని సమీపించి తన కోరికను తెలియజేసింది.


శూర్పణఖ నీచపు మాటలకు విసిగిన లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు, చెవులు కోసి తరిమేశాడు.


బాధ, కోపంతో శూర్పణఖ తనకు జరిగిన పరాభవాన్ని గురించి తన సోదరుడు రావణునికి తెలియజేసి, శ్రీరాముని భార్య సీత మహా సౌందర్యరాశి అని చెప్పింది. 


సీతామాతను అపహరించాలని నిర్ణయించుకున్నాడు రావణుడు. తన మేనమామ మరీచుడిని బంగారు లేడిగా మారి, ఆ శ్రీరాములవారి ఆశ్రమ పరిసరాలలో తిరుగుతూ సీతామాతకు తనపై (ఆ లేడిపై) ఆశ కలుగునట్లు చేయుమని బంగారు లేడి రూపమున రావణుడు మరీచుడిని శ్రీరాములవారి ఆశ్రమ ప్రాంతమునకు పంపినాడు. 


ఆ బంగారు లేడిని సీతామాత చూసినది. ‘నాకు ఆ బంగారు లేడి కావలయును’ అని మాత శ్రీరాములవారిని కోరినది.


అర్థాంగి అభీష్టమును నెరవేర్చుటకు తమ్మునకు సీతకు చెప్పి శ్రీరాముడు బంగారు లేడిని పట్టుకొన ప్రయత్నించాడు. కానీ అది వారికి దొరకలేదు. లక్ష్మణుడు ఆశ్రమం ముందు ఉన్నాడు. కొంత సమయం తరువాత ‘హా సీతా... హా లక్ష్మణా!...’ అను భయంకర దీనాలాపము వారికి వినిపించినది.


తన భర్త శ్రీరాముల వారికి ఏదో అపాయము జరిగినదని సీతామాత వాపోయినది.

‘అంతా రాక్షసమాయ తల్లీ, ... మీరు భయపడకండి, మా అన్నయ్యను ఈ ప్రపంచంలో ఎవరూ ఢీకొనలేరు,’ అన్న లక్ష్మణుని మాటలు విని సీతామాత ఆవేశంతో లక్ష్మణుని అవమానించినది.


ఆ వాక్కులు వినలేక లక్ష్మణరేఖను ఆశ్రమము ముందు గీచి... ‘ఎట్టి పరిస్థితులలోను మీరు మేము తిరిగి వచ్చువరకు ఈ గీతను దాటకూడదు...’ అని సీతామాతకు చెప్పి శ్రీరాముని వెదక బయలుదేరినాడు లక్ష్మణుడు.


ఆ తరుణమునకై వేచియున్న రావణుడు యాచక రూపమున వచ్చి... తాను లక్ష్మణరేఖకు ఆవల దూరంగా నిలబడి, సీతామాతను గీత దాటునట్లు చేసి తనతో తన రాజధాని లంకానగరమునకు తీసుకువెళ్లిపోయాడు.

బంగారు లేడి దొరకని రామలక్ష్మణులు ఆశ్రమమునకు వచ్చారు. సీతామాత వారికి కనుపించలేదు. మాత కోసం అడవిలో వెదకసాగారు రామలక్ష్మణులు. 


శ్రీ ఆంజనేయులవారి పరిచయం వారికి లభించింది. వారు మహనీయులని గ్రహించిన శ్రీహనుమాన్, వారిని తమ రాజు సుగ్రీవుని చెంతకు తీసుకువెళ్లినారు. సోదరుడు వాలి... సుగ్రీవుని రాజ్యం నుండి తరిమి, రాజ్యాన్ని ఏలుతుండగా, వాలిని గురించి విన్న తరువాత... ఆ అన్నదమ్ములకు ద్వంద్వ యుద్ధాన్ని కల్పించి (గెలిచినవారిది రాజ్యం) వాలిని వధించి సుగ్రీవుని శ్రీరాములవారు రాజుగా చేశారు.

సుగ్రీవుడు తన సైన్యంలోని మహా వీరులను అష్టదిక్కులకు పంపి సీతామాత జాడను తెలుసుకుని రమ్మన్నాడు. దక్షిణ దిక్కు వైపుకు శ్రీ ఆంజనేయులవారు బయలుదేరారు. శ్రీలంకకు చేరారు.


 సీతామాతను అశోకవనంలో చూశారు. శ్రీరాముడు తనకు ఇచ్చిన ఆనవాలును మాతకు అందించి, ‘నేను శ్రీరాములవారి దూతను తల్లి, మీ జాడ వెతుకుతూ వచ్చితిని’ అని చెప్పారు. మాత సంతసించింది.

‘‘త్వరలో వానరసైన్యంతో వచ్చి ఈ లంకానగరాన్ని నాశనం చేసి, రావణుని చంపి మీరు శ్రీరాములవారిని కలియునట్లు చేసెదము తల్లీ... నమ్మండి...’’ అని ఆంజనేయులవారు మాతకు విన్నవించారు.


ఆ అశోకవనమును, అందరి కాపలాదారులను, చెట్లను శ్రీ ఆంజనేయులవారు ధ్వంసం చేశారు. చివరగా రావణుని కుమారుడు ఇంద్రజిత్తు చేతిలో బ్రహ్మాస్త్రమునకు పట్టుబడి, శ్రీ ఆంజనేయులు రావణుని కొలువులో ప్రవేశించి, అతనికి నీతివచనాలను, శ్రీరాములవారి పరాక్రమమును గురించి తెలియజేశారు.


చెవిటివాడికి శంఖ ధ్వని వినపడదు కదా!... అలాగే శ్రీ ఆంజనేయులవారి న్యాయవచనాలు రావణునకు పరమ చేదుగా తోచాయి. శ్రీ ఆంజనేయులవారి తోకను కాల్చి పరాభవించాలనుకున్నాడు. గుడ్డలు చుట్టి వారి వాలానికి నిప్పు అంటింపజేశాడు.


ఫలితంగా శ్రీ ఆంజనేయులవారు లంకాపురిలోని భవంతులన్నింటినీ తగులబెట్టి, వాలమును సముద్రములో చల్లార్చుకుని శ్రీరాములవారి సన్నిధికి చేరి, తాను సీతామాతను చూశానని, తాను చేసిన పనులను గురించి శ్రీరామచంద్రమూర్తులవారికి వివరించారు.


‘‘చూచి రమ్మంటే కాల్చి వచ్చితివి కదా అంజనా!...’’ అని సంతసించారు... తాతయ్య చెప్పడం ఆపారు.


గుక్క తిప్పకుండా మొత్తం కథను చెప్పిన తాతయ్యను చూచి నాకు ఎంతో ఆనందం... వారికి నా చేతులు జోడించి నమస్కరించాను.


‘‘చిన్నా!... లంకాదహనం కథ అర్థమయిందా నాన్నా!...’’ ప్రీతిగా అడిగారు తాతయ్య.


‘‘బాగా అర్థమయింది తాతయ్య!...’’ నవ్వుతూ చెప్పాను. 


తోలుబొమ్మల సాంబయ్య మా దగ్గరకు వచ్చాడు.

‘‘సామీ!... తొలి ఆట తమరే వేయించాలి!...’’ ప్రాధేయ పూర్వకంగా కోరాడు.


కొన్ని క్షణాల్లో మరో వ్యక్తి, ఓ ఆడమనిషి వచ్చి తాతయ్యకు నమస్కరించారు.


‘‘ఏరా గోవిందా, అంతా బాగున్నారా!...’’ అడిగాడు తాతయ్య.


‘‘అంతా తమలాంటి ధర్మప్రభువు దయ సామీ! బాగుండాం...’’ నవ్వుతూ చెప్పాడు గోవింద.


‘‘చిన్నా! ఈ గోవింద సాంబయ్య బావమరిది. అంటే సాంబయ్య భార్య తమ్ముడు. ఈమె గోవింద భార్య చిన్నీ. వీరు నాటకం ప్రారంభంలో, మధ్యమధ్యన హాస్యాన్ని ప్రదర్శిస్తారు. వీరికి నాటకంలో పేర్లు బంగారక్క... కేటిగాడు, కమెడియన్స్...’’ నవ్వుతూ చెప్పాడు తాతయ్య.


‘‘ఏం నాటకం వేయిద్దాం చిన్నా!...’’


‘‘లంకాదహనం తాతయ్య!...’’ చెప్పాను.


‘‘చాలా బాగుంటుంది సామీ!...’’ చిరునవ్వుతో చెప్పాడు సాంబయ్య.


‘‘ఎప్పుడు వేస్తారు?...’’ అడిగాను.


‘‘తమరు ఎప్పుడంటే అప్పుడే సామీ!...’’ చెప్పాడు గోవింద.


‘‘సామీ!... బాబు తమరి మనవడా!...’’ అడిగింది చిన్నీ.


‘‘అవును చిన్నీ!...’’


‘‘పేరేంది సామీ!...’’ అడిగింది చిన్నీ.


‘‘చంద్రశేఖర్!...’’ తాతయ్యగారి జవాబు.


‘‘సామీ ఆటను రేపు వేస్తాము. సరేనా!...’’ అడిగాడు సాంబయ్య.


‘‘అలాగే!...’’ అన్నాను నేను తాతయ్య ముఖంలోకి చూస్తూ, తాతయ్య నవ్వుతూ తల ఆడించాడు.


‘‘ఉదయాన్నే కావలసిన పంచలూ అవీ అమ్మగారిని అడిగి తీసుకోండి. స్కూల్లో మంచి బెంచీలు తెచ్చుకోండి...’’


‘‘అట్టాగే సామీ!...’’


‘‘తాతయ్యా, పంచలు బెంచీలు ఎందుకు?...’’


‘‘స్టేజి స్క్రీన్ నిర్మాణానికి చిన్నా!....’’


వారు తాతయ్యకు నమస్కరించి వెళ్ళిపోయారు.

నేను అందరితో కలసి భోంచేసి (మధ్యాహ్నం) తోలుబొమ్మలవారు ఉన్న మా ఇంటి ఉత్తరపు హద్దున ఉన్న చింతచెట్ల దగ్గరకు వెళ్లాను, వాళ్లు ఏం చేస్తున్నారో, ఆ తోలుబొమ్మలు ఎలా ఉంటాయో చూడాలని.


వాళ్లు అన్నం వండుకుని మా నాయనమ్మ దగ్గరి నుంచి తెచ్చుకున్న ఆవకాయ పులుసుతో భోంచేస్తున్నారు. వాళ్లకు కొంతదూరంలో నిలబడి వారివైపు చూశాను.

‘‘చినసామీ!... రండి భోంచేద్దురు గాని!...’’ నవ్వుతూ చెప్పాడు సాంబయ్య.


‘‘నేను తిని వచ్చాను. మీరు తినండి...’’ అన్నాను.


‘‘ఏం సామీ!... ఇలా వచ్చారు?... తాతయ్యగారు నన్ను రమ్మన్నారా!...’’


‘‘ఆహా!... నేను తోలు బొమ్మల్ని చూడాలని వచ్చాను...’’


‘‘అట్టాగా!...’’


‘‘అవును. నేను ఇంతవరకూ చూడలేదు...’’


‘‘ఐదు నిమిషాలు ఆగండి సామి. చెయ్యి కడుక్కొనొచ్చి మీకు బొమ్మల్ని చూపుతా!...’’


‘‘తొందర లేదు. మీరు నెమ్మదిగా భోంచేయండి...’’ అన్నాను. సాంబయ్య నవ్వాడు.


‘‘రేయ్ గోవిందా!... చూచినావా ఆ బాబు మర్యాద!...’’


‘‘అవును మామా, గొప్పింటి బిడ్డ గొప్పోడే కదా!...’’


సాంబయ్య భోజనం ముగించాడు. అతని వెనకాలే గోవింద లేచాడు. ఇరువురూ చేతులు కడుక్కున్నారు. వారు నాలుగు ఒంటెద్దు బండ్లతో వచ్చారు. ఆ బండ్లకు గూడు ఉంది. రెండు బండ్లలో పెద్ద పొడుగాటి ఇనపపెట్టెలు ఉన్నాయి. 


సాంబయ్య, గోవిందలు కలసి ఒక పెట్టెను క్రిందికి దించారు. తాళంతో పెట్టెను తెరిచారు. చిరుచాపలను పరచి ఆ పెట్టెలో ఉన్న దాదాపు ఐదు అడుగుల పొడవున్న రంగురంగుల తోలుబొమ్మను తీసి చాపవైపు ఉంచారు.


‘‘చినసామీ!... ఈ బొమ్మ శ్రీరామచంద్రులవారిది. చూడండి...’’ బొమ్మ పైకెత్తి పట్టుకొన్నాడు సాంబయ్య.


బొమ్మ నీలం రంగులో ఉంది.

కాళ్లు, చేతులు, ముఖం, కళ్లు, ముక్కు అన్నీ మనుషులకు ఉన్నట్లే ఉన్నాయి. ఆశ్చర్యపోయాను.

‘‘మరి సీతమ్మ బొమ్మ!...’’ అడిగాను.


రెండవ పెట్టె తెరచి స్త్రీ బొమ్మను బయటికి తీసి నిలబెట్టి ‘‘ఈ బొమ్మ సీతమ్మ తల్లి సామీ!...’’ అని చెప్పాడు సాంబయ్య. 

మన ఇళ్లల్లో సీతారాముల ఫోటోల్లో ఉండే సీతామాత ఎలా ఉంటుందో ఆ బొమ్మ కూడా అలాగే ఉంది. మనస్సులో భక్తిభావన. కొన్ని క్షణాలు పరీక్షగా చూశాను.

‘‘సాంబయ్య గారూ!... ఈ బొమ్మల్ని మీరే తయారు చేశారా!...’’ అడిగాను.


‘‘అవును సామీ!... పశువు తోలుతో (చర్మంతో) చేస్తాము. బొమ్మ పేరుకు తగినట్టుగా రంగులు వేస్తాం. కాళ్లు చేతులు కదిలించేదానికి రివిట్‌‌లను తగిలిస్తాం. సన్నని వెదురు దబ్బల సాయంతో (బొమ్మకు ఆయా భాగాలకు) దారం కట్టి వెదురుపుల్లను ఆడిస్తూ కాళ్లు చేతులు తలను కదిలిస్తాం...’’


‘‘ఓ చాలా గొప్ప కళ!...’’ ఆశ్చర్యపోయాను.


‘‘రావణుని బొమ్మను చూపిస్తారా!...’’ అడిగాను.


మొదటి పెట్టె నుండి పది తలల రావణుడి బొమ్మను తీసి మడిచి ఉన్న తలలను నేరుగా చేసి నిలబెట్టి చూపించాడు సాంబయ్య.


ఆ రావణుని ఆకారం... మన చిత్రపటాలలో లాగే పెద్ద కళ్లు, మీసాలతో భయంకరంగా ఉంది. అన్నీ చాలా బాగున్నాయి.


‘‘రేపు స్టేజీ ముందు స్క్రీన్ పై పెట్రోమాక్స్ దీపాల కాంతిలో ఇంకా బాగుంటాయి చినసామీ!...’’ చిరునవ్వుతో చెప్పాడు గోవింద.


సాంబయ్య... ‘‘సామీ, మరోమాట. మేము మొత్తం పదిహేను మందిమి. ఒక్కో పాత్రకు మాట పాట ఒక్కోరం చెబుతాం, పాడుతాము. రేపు చూస్తారుగా తమరు!...’’


ఉదయం చూచిన గోవిందా చిన్నీ ఎక్కడికో వెళ్ళి వచ్చారు.


‘‘ఏరా గోవిందా! తుమ్మ ముళ్ళు దొరికాయా!...’’


‘‘ఓ బావా!... చెరువు కట్ట మీద ఐదారు చెట్లు ఉన్నాయి. బావా!... ఇవిగో ముళ్లు!...’’ పొడుగాటి డబ్బాలో ఉన్న తుమ్మముళ్లను గోవిందు సాంబయ్యకు చూపించాడు.


‘‘సరే!... మేమంతా అన్నం తిన్నాము. నువ్వు చిన్నీ తినండి...’’ చెప్పాడు సాంబయ్య.


‘‘అట్టాగే బావా!...’’


‘‘సాంబయ్య గారూ!...’’


‘‘ఆ తుమ్మముళ్ళు ఎందుకు?...’’


‘‘పంచలతో స్క్రీన్‌ను తయారు చేసేదానికి సామీ!...’’

‘‘నేను చూడాలి!...’’


‘‘రేపు నేను పిలుస్తా!... నాతో రండి సామీ చూద్దురు గాని!...’’


‘‘సరే... ఇక నేను వెళుతున్నా. చదువుకోవాలి సాంబయ్యగారు, థ్యాంక్యూ...’’ మా ఇంటి వైపుకు నడిచాను.


ఆ రోజు సాయంత్రం ఐదు గంటలకు సాంబయ్య ఇంటికి వచ్చాడు. తాతయ్యా, పాలేరు పాండు పొలాల వైపుకు వెళ్లారు.


ట్యూషన్ విద్యార్థులు పదిమంది వచ్చారు. నేను వారితో కలసి కూర్చున్నాను. మా నాన్నగారు పద్మనాభయ్యగారు చెప్పసాగారు.


‘‘పిల్లలూ! ఈ రోజు నేను మీకు ద్వాదశ అంటే పన్నెండు జ్యోతిర్లింగాలను గురించి వివరిస్తాను.


జ్యోతిస్వరూపుడైన మహేశుడు అంటే శివుడు మన పవిత్ర భారతావనిలో, పన్నెండు చోట్ల జ్యోతిర్లింగ స్వరూపంలో వెలసి భక్తులను కాపాడి కరుణిస్తున్నాడు.

భారతదేశంలోని నాలుగు దిక్కులలో పన్నెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయి.


సముద్రపు ఒడ్డున రెండు. అవి...

1. బంగాళఖాత సముద్ర తీరాన రామేశ్వరలింగం


2. అరేబియా సముద్ర తీరాన సోమనాథ లింగం


పర్వత శిఖరాలలో నాలుగు. అవి....

3. శ్రీశైల పర్వతంపైన మల్లికార్జునుడు (లింగం)


4. హిమాలయ పర్వతాల్లో కేదారేశ్వరుడు (లింగం)


5. సహ్యాద్రి పర్వతాలలో భీమేశ్వరుడు (లింగం)


6. మేరుపర్వతాలపైన వైద్యనాథ ఈశ్వరుడు (లింగం)


మైదాన ప్రదేశాలలో మూడు. అవి …


7. ద్వారకా వనంలో నాగేశ్వరలింగం


8. ఔరంగాబాద్ వద్ద ఘృష్ణేశ్వర లింగం


9. ఉజ్జయినీ నగరంలో మహాకాళేశ్వరలింగం


నదుల ఒడ్డున మూడు. అవి...

10. నర్మదానదీ తీరాన ఓంకారేశ్వరుడు (లింగం)


11. గోదావరీ నదీ తీరాన త్రయంబకేశ్వరుడు (లింగం)


12. గంగానది తీరాన విశ్వేశ్వరుడు (లింగం)


హైందవులకందరికీ ఆరాధ్యదైవం శ్రీ పరమేశ్వరుడు. లయకారకుడు.. జగద్రక్షకుడు.

చిన్న వయస్సు నుండి దైవం పట్ల భయం, భక్తి అలవరచుకోవాలి.


యావత్ జగత్తుకు రక్షకుడు, సృష్టికర్త, సర్వేశ్వరుడు ఒక్కడే. వారికి పలు నామాలు. ఎవరి ఇష్టం వచ్చిన నామం శివ, రామ, కృష్ణ ఇత్యాది నామాలను ఎవరికి తోచిన, నచ్చిన రీతిలో స్మరించవచ్చు. ఏ నామాన్ని నమ్మి జపించినా, నదులన్నీ భూభాగాన మిట్టపల్లాలలో ప్రవహించి చివరికి సాగరం (సముద్రం) లో ఎలా కలుస్తున్నాయో, అదే రీతిగా ఏ నామాన్ని నమ్మి ధ్యానించి స్తుతించినా ఫలితం మాత్రం ఒక్కటే. అదే ప్రశాంతపూరిత జీవితం.


ఆ పన్నెండు క్షేత్రాల పేర్లను నోటికి వచ్చే రీతిగా చేసుకుని సదా మననం చేయండి. అది ఆనందప్రదం. ఆరోగ్యవంతం.


ఇక ఇళ్లకు బయలుదేరండి. రేపు కలుద్దాం. శుభరాత్రి.’’


నాన్నగారు ఇంట్లోకి వెళ్లిపోయారు. పిల్లలు వారివారి ఇళ్లకు వెళ్లిపోయారు.

============================================================

ఇంకా వుంది..

తోలు బొమ్మలు - పార్ట్ 6 త్వరలో మీ ముందుకు వస్తుంది.

============================================================


📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y


సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page