తోలు బొమ్మలు - పార్ట్ 1
- Chaturveadula Chenchu Subbaiah Sarma

- 53 minutes ago
- 6 min read
పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.
మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.

తోలు బొమ్మలు - పార్ట్ 1 – చంద్రశేఖర్‌కు ఏడు సంవత్సరాల శిక్ష | తెలుగు సామాజిక నవల
Tholu Bommalu - Part 1 - Telugu Serial | Ch. C. S. Sarma
తోలు బొమ్మలు - పార్ట్ 1 - తెలుగు ధారావాహిక | సిహెచ్. సీఎస్. శర్మ
Published In manatelugukathalu.com On 28/08/2026
న్యాయం అంటే ఏమిటి? సాక్ష్యాల ఆధారంగా ఇచ్చే తీర్పే నిజమైన న్యాయమా? లేక మనస్సాక్షి చెప్పేదే నిజమా?
తోలు బొమ్మలు పార్ట్ 1 ఈ ప్రశ్నలతోనే పాఠకుడిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. సుప్రీంకోర్టులో న్యాయదేవత విగ్రహంలో వచ్చిన మార్పుల గురించి ఆలోచిస్తున్న జిల్లా కోర్టు జడ్జి సత్యానందరావు, తన ముందున్న ఒక క్లిష్టమైన కేసు గురించి తీవ్రంగా ఆలోచిస్తుంటారు. హత్యా నేరానికి పాల్పడ్డాడని సాక్ష్యాలతో నిరూపించబడినట్లు భావిస్తున్న యువకుడు చంద్రశేఖర్ విషయంలో మాత్రం జడ్జిగారి మనసు మరో నిజాన్ని సూచిస్తుంది.
మన న్యాయ దేవత!
సుప్రీంకోర్టులో కొత్త న్యాయదేవత విగ్రహ ప్రతిష్ఠ 21 వ తేదీ అక్టోబర్ నెల 2024న జరిగింది. శ్రీ సీజేఐ చంద్రచూడ్ గారి ఆదేశాల మేరకు, పాత విగ్రహానికి పలు మార్పులు చేస్తూ న్యాయమూర్తుల లైబ్రరీలో దానిని ఆవిష్కరించారు.
న్యాయ దేవత విగ్రహంలో అంతకుముందు కళ్లకు గంతలు, రెండు చేతుల్లో భాగంగా కుడిచేతిలో త్రాసు, ఎడమచేతిలో ఖడ్గం ఉండేవి.
అయితే, నూతన విగ్రహంలో కళ్లకు గంతలు తొలగించారు.
అలాగే ఎడమ చేతిలో ఖడ్గానికి బదులుగా రాజ్యాంగ పుస్తకాన్ని ఉంచారు.
జిల్లా కోర్టు జడ్జి సత్యానందరావు ఆ గతాన్ని తలచుకుంటూ సోఫాలో కూర్చున్నారు. టీపాయ్ పైన వున్న దినపత్రిక 'భారత్ అవని'ని చేతికి తీసుకున్నారు. సంపాదకీయం చదవటం ప్రారంభించారు.
మనది హైందవ దేశం. ఈ దేశంలో సనాతన ఆర్య ఋషి పరంపరగా కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము గడచిపోయాయి.
కృతయుగ కాలం 17,28,000 సం.లు, త్రేతాయుగ కాలం (శ్రీ రామచంద్రమూర్తి కాలం) 12,96,000 సం.లు. ద్వాపర యుగము (శ్రీకృష్ణ పరమాత్మ కాలం) 8,64,000 సం.లు. ప్రస్తుతం నడుస్తున్నది కలియుగము.
యుగ కాలము 4,32,000, ఇంతవరకూ జరిగిపోయిన కాలం 5,125 సం.లు, మిగిలి యున్నది 4,26,875 సం.లు. ఈ కలియుగం క్రీస్తుపూర్వం 3102 లో ప్రారంభమైనదని విజ్ఞులైన మన పెద్దల (హైందవుల) విశ్వాసం.
మన భారతదేశ జనాభా 1,450,935,000 అంటే 145 కోట్లు. హైందవ పాపులేషన్ 80% అనగా 116 కోట్లు. పై అంశాల రీత్యా భారత్ హైందవ జాతి సంస్కృతి ఎంతో పురాతనమైనదన్నది నగ్న సత్యం. ఎంతో గొప్ప చరిత్ర కలది. విమర్శలకు అతీతమైనది.
ఎవరైనా ఒక విషయంలో చర్చ, విమర్శ సాగించాలంటే అర్హత, ఆ విషయం యొక్క ఆది, అంతములు కూలంకుషంగా ఎరిగి ఉండవలయును.
హైందవ సిద్ధాంతం, పరమత దూషణం మహాపాతకం – సర్వమానవ సమానత్వం, ప్రేమ, కరుణ, అభిమానం, సౌభ్రాతృత్వం ఉన్నత మానవ లక్షణాలు. భారత హైందవ జాతి విశ్వసించి, నమ్మి ఆచరించే ధర్మ విధానాలు. కానీ ప్రస్తుత కాలంలో చాలామంది స్వార్థం, స్వాతిశయం, కులతత్వం, స్వమతాభిమానంతో అన్ని మతాల వారిని నీచంగా చూస్తున్నారు.
మనం పీల్చే గాలికి, త్రాగే నీటికి, వీక్షించే ఆకాశానికి, సంచరించే భూమికి, అగ్నికి మతం, కులం లేదు; అవి అందరినీ సమదృష్టితో చూచి వర్తించునవి. పంచభూతాలు (భూతం అంటే శక్తి) అవి జగత్ కర్త నిర్దేశకం.
సంపాదకులు: ఆచార్య శ్రీరామ్.
సంపాదకీయాన్ని జడ్జి సత్యానందరావు గారు చదవడం ముగించారు.
వారి అర్థాంగి అరుంధతి చిరునవ్వుతో కాఫీ గ్లాసును అందించింది. జడ్జిగారి ముఖంలో ఏదో కలవరం. ఇరవై సంవత్సరాలు వారితో సహజీవనం చేసిన కాత్యాయని సోఫాలో వారి ప్రక్కన కూర్చుని, సత్యానందరావు గారి ముఖంలోకి పరీక్షగా చూసింది.
సాలోచనగా కాఫీని త్రాగి, జడ్జిగారు కప్పును టీపాయ్ పై ఉంచి, తదేకంగా తనను చూస్తున్న అర్థాంగి ముఖంలోకి చూశారు.
ఆమే వదనంలో చిరునవ్వు...
‘‘కాత్యా!... ఏమిటి అలా చూస్తున్నావ్?...’’
‘‘మీరు ఏదో విషయాన్ని గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నారు కదూ!...’’ చిరునవ్వుతో అడిగింది.
‘‘అవును!...’’
‘‘ఆ విషయం ఏమిటో నేను తెలుసుకోవచ్చా!...’’
‘‘నేడు కోర్టులో నేను చెప్పవలసిన తీర్పు!...’’
‘‘తీర్పు చెప్పడం ఈనాడు మీకు ఏమీ కొత్త కాదుగా!... పది సంవత్సరాలుగా మీరు చేస్తున్న పనే కదా అది!...’’ ప్రశ్నార్థకంగా భర్త ముఖంలోకి చూసింది కాత్యాయని.
‘‘ఇంతకు ముందు చెప్పిన తీర్పులకు, ఈ రోజు నేను చెప్పబోయే తీర్పుకు వ్యత్యాసం ఉంది కాత్యా!...’’
‘‘అంటే!...’’
‘‘సాక్షులు మూలంగా న్యాయానికి వ్యతిరేకంగా అధర్మాన్ని సమర్థించి చెప్పవలసిన తీర్పు...’’
‘‘కాస్త వివరంగా చెప్పగలరా!...’’
‘‘హంతకుడు అని సాక్షుల మూలంగా నిరూపించబడిన పాతికేళ్ళ యువకుడు, విద్యావంతుడు చంద్రశేఖర్ అనే వ్యక్తిని నేను నేరస్థుడిగా భావించి తీర్పు చెప్పవలసిన పరిస్థితి!...’’ నిట్టూర్చారు విచారంగా జడ్జిగారు.
‘‘అతడు నిర్ధోషి అని మీరు ఎలా నమ్మతున్నారు?...’’
‘‘నా అనుభవంతో, నేను ఒక వ్యక్తిని చూచి, అతని మాటలను విన్న తరువాత, అతను నిజం చెబుతున్నాడా, అబద్ధం చెబుతున్నాడా అని నేను గ్రహించగలను కాత్యా!...’’
‘‘అంటే, అది ఫేస్ రీడింగ్ కదా!...’’
‘‘అవును కాత్యా, టిఫిన్ పెట్టు. కోర్టుకు టైమ్ అవుతూ ఉంది...’’ సోఫా నుండి లేచాడు సత్యానందరావు. డైనింగ్ టేబుల్ ను సమీపించాడు.
కాత్యాయని వంట ఇంటి వైపుకు నడిచింది.
సత్యానందరావు గారు టిఫిన్ చేసి, తన గదికి వెళ్ళి డ్రస్ మార్చుకుని మేడ మీద నుండి క్రిందికి దిగారు.
‘‘కాత్యా!...’’
కాత్యాయని వారికి ఎదురుగా నిలబడింది చిరునవ్వుతో. ప్రతిరోజూ కోర్టు దినాల్లో సత్యానందరావు కోర్టుకు వెళ్ళే సమయంలో, వారికి ఎదురురావడం కాత్యాయని అలవాటు.
‘‘వెళ్ళొస్తాను కాత్యా!...’’
‘‘మంచిదండీ!...’’
సత్యానందరావు పోర్టికోలో ఉన్న తన కారులో కూర్చున్నారు.
డ్రయివర్ ఫకీర్ డ్రయివర్ సీట్లో కూర్చొని కారు స్టార్ట్ చేశాడు. కాత్యాయని కుడిచేతిని పైకెత్తి సత్యానందరావుకు బై చెప్పింది.
కారు భవంతి ఆవరణం దాటి వీధిలో ప్రవేశించింది. అరగంటలో కోర్టు ఆవరణంలో ప్రవేశించింది.
సమయం పది గంటలు...
జడ్జి సత్యానందరావు గారు కారు దిగి కోర్టులో ప్రవేశించి, క్రింద ఉన్న లాయర్లకు, పబ్లిక్కు నమస్కరించి తన స్థానంలో కూర్చున్నారు.
అమీనా, కేసు పేపర్ల కట్టలను జడ్జిగారి ముందు ఉంచారు. జడ్జిగారు పైన ఉన్న కట్టను తీసుకుని కొన్ని క్షణాలు పరిశీలించి, ‘‘లాయర్ జగన్నాథ్ గారు!... ప్లీజ్ ప్రొసీడ్!...’’ అన్నారు జడ్జిగారు.
లాయర్ జగన్నాథ్ జడ్జిగారి ముందు నిలబడ్డారు.
అమీనా: ‘‘కేస్ నంబర్ 320. ముద్దాయి చంద్రశేఖర్... ముద్దాయి చంద్రశేఖర్...’’ రెండుసార్లు పిలిచాడు.
పోలీసులు ఇరువురు మధ్యన చంద్రశేఖర్ కోర్టులో ప్రవేశించి బోన్ లో నిలబడ్డాడు.
తైలసంస్కారం లేని తలజుట్టు, గడ్డం, మాసిన బట్ట, విచార వదనం... బోన్ లో ఉన్న చంద్రశేఖర్ ను కొన్ని క్షణాలు పరీక్షగా చూశారు జడ్జి సత్యానందరావు.
‘‘మై లార్డ్!... బోన్ లో ఉన్న ఈ ముద్దాయి చంద్రశేఖర్ పగ, కక్ష, కార్పణ్యాలతో ధనుంజయ రావును పట్టపగలు వారి ఆఫీస్ గదిలోనికి ప్రవేశించి, అతన్ని అతి దారుణంగా కత్తితో పొడిచి చంపాడు. అతని ఆ చర్యకు అవసరమైన సాక్ష్యాధారాలను, సాక్షులను నేను పోయినసారి కోర్టువారికి సమర్పించాను.
కనుక తమరు ధనుంజయరావు గారిని అమానుషంగా చంపిన చంద్రశేఖర్ కు భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 299-377 ప్రకారం కఠిన శిక్ష విధించవలసినదిగా కోర్టువారిని కోరుచున్నాను. దట్ ఈజ్ ఆల్ మై లార్డ్!...’’ లాయర్ జగన్నాథ్ తన ప్రసంగాన్ని ముగించి వెళ్ళి తన స్థానంలో కూర్చున్నారు.
జడ్జిగారు చంద్రశేఖర్ వైపు చూచారు.
‘‘మిస్టర్ చంద్రశేఖర్!... మీరు కోర్టు వారికి ఏమైనా చెప్పుకోవాలని ఉందా!...’’
చంద్రశేఖర్ వంచిన తలను పైకెత్తి... ఏమీ లేదన్నట్లు తలను అటూ ఇటూ త్రిప్పాడు విచార వదనంతో...
‘‘ఏమీ లేదా!...’’ జడ్జిగారి ప్రశ్న.
‘‘లేదు సార్!...’’ మెల్లగా చెప్పాడు చంద్రశేఖర్.
జడ్జిగారు ఆశ్చర్యంతో చంద్రశేఖర్ ముఖంలోకి చూచారు. గ్యాలరీలో వున్నవారంతా కూడా చంద్రశేఖర్ ను ఆశ్చర్యంగా చూచారు.
అతని ఆత్మీయులు, అమ్మ, అక్క, బాబాయి, పిన్ని, తమ్ముడు, దీపక్, గోపాలయ్య, చంద్రిక, స్నేహితుడు అశోక్ విచారంతో కన్నీరు కార్చారు.
పబ్లిక్ ప్రాసిక్యూటర్ ధర్మారావు బోన్ లో వున్న చంద్రశేఖర్ ను సమీపించి మెల్లగా ఏదో చెప్పారు.
కానీ... చంద్రశేఖర్ విరక్తిగా నవ్వుతూ తలను అడ్డంగా త్రిప్పాడు.
విచార వదనంతో ధర్మారావు గారు వెళ్ళి వారి స్థానంలో కూర్చున్నారు.
కోర్టులో... జనాల కలకలం... ఏవేవో మాట్లాడుకుంటూ అలజడి.
‘‘ఆర్డర్... ఆర్డర్...’’ సుత్తితో తన టేబుల్ పై ఉన్న ప్యాడ్ పై మూడుసార్లు కొట్టారు జడ్జిగారు.
‘‘ముద్దాయి చంద్రశేఖర్ తన పైన మోపబడిన హత్యా నేరాన్ని అంగీకరించిన కారణంగా భారతీయ శిక్షాస్మృతి చట్టం సెక్షన్ 377 ప్రకారం ముద్దాయికి ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడమైనది..’’ జడ్జిగారి జడ్జిమెంట్.
వారి తన ముందు ఫైలులో వ్రాసిన దాన్ని చదివి, ఆ పెన్ నిబ్ ను విరిచారు జడ్జిగారు.
‘‘నౌ ది కోర్టు ఈజ్ అడ్జర్న్డ్!...’’ తన స్థానం నుండి లేచి లోనికి వెళ్ళిపోయారు.
‘న్యాయ దేవత బొమ్మను మార్చినంత మాత్రాన నేరస్థులని పిలవబడేవారికి కోర్టులో న్యాయం జరగదు. ఆ బొమ్మ ఎడమ చేతిలో ఉండవలసింది రాజ్యాంగ పుస్తకం కాదు. భగవద్గీత. కారణం, భారత రాజ్యాంగ చట్టాలలో కొన్నింటికి సవరణ అవసరం. కానీ భగవద్గీతలో లేనిదంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదు. సాక్ష్యాలకు భయపడి నిర్దోషి దోషిగా ఒప్పుకున్నాడు. చట్టానికి కావాల్సింది సాక్ష్యం అనే నేపథ్యంలో నేను తప్పుడు తీర్పును ఇచ్చాను. సింహం మెడలో గంటను కట్టగలిగిన వారు ఎవరు?...’ విచారంగా అనుకుంటూ జడ్జిగారు తన కారు వైపుకు నడిచారు.
పోలీసులు చంద్రశేఖర్ ను వ్యాన్ లో ఎక్కించుకుని జైలు వైపుకు బయలుదేరారు.
చంద్రశేఖర్ మనోదర్ఫణం పై తన వారి ప్రతిబింబాలు నిలిచాయి.
తాతగారు వీరరాఘవయ్యగారు, నాయనమ్మ పార్వతి, నాన్నగారు పద్మనాభయ్య, అమ్మ భవాని, బాబాయ్, పిన్ని, తమ్ముడు, పద్మనాభయ్యగారి సోదరి సుశీల. అతనికి మేనత్త, తనకంటే పెద్దది అక్క కావ్యతో చిన్నతనంలో వారంతా తనను ఎంతగా ప్రేమించి అభిమానించేవారో!... ఆ దృశ్యాలు కళ్ళముందు నిలిచాయి.
తాతయ్య, నాయనమ్మలు తనకు చిన్నతనం నుంచీ మన హైందవ మత ప్రమాణ గ్రంథాలైన భాగవత, రామాయణ, భారతాలను గురించి కథలు... సందేశాలు, ధర్మసూక్తులు తెలియజేసేవారు. చిరుప్రాయంలో అవి విసురుగా తోచినా, తాను పెరిగే కొద్దీ ఆ ఇరువురి పెద్దల మాటల పట్ల గౌరవం, ఆసక్తి, అభిమానం కలిగేది. వారి మాటలను శ్రద్ధగా వినేవాడు. విష్ణుమూర్తి, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, వారి తత్వాలు, వారి చరిత్రలు తన మనస్సుకు ఎంతో ఆసక్తి కలిగించేవి.
అమ్మా, నాన్నలు తాను చిన్నవాడైనందున ఎంతో గారాబంగా సాకారు. ‘నీవు భావి జీవితంలో బాగా చదివి, ప్రయోజకుడవై, సత్యం, ధర్మం, నీతి, న్యాయం, దానం, సౌభ్రాతృత్వం సదా పాటిస్తూ, నీ సాటివారికి నీవు ఆదర్శంగా నిలిచి, అందరిచేత ‘వాడు చాలా మంచివాడు!...’ అనిపించుకునే రీతిలో జీవితాన్ని సాగించాలని చెప్పేవారు.
అత్త సుశీల, అక్క కావ్య, తనను ఎంతగానో అభిమానించేవారు. తప్పు ఏదైనా చేస్తే దండించేవారు. అక్క... అనునయంగా ‘అలా చేయకూడదు చంద్రా!...’ ఎంతో సౌమ్యంగా చెప్పేది.
కానీ, నేడు అమ్మ, నాన్నల్లో మిగిలి ఉన్నది అమ్మ ఒక్కతే... చంద్రశేఖర్ నయనాల్లో అశ్రువులు. హృదయంలో లేని తన తండ్రిని గురించిన బాధ... ఆవేదన...
వ్యాన్ జైలు ముందు ఆగింది. పోలీసులు దిగి చంద్రశేఖర్ ను క్రిందికి లాగారు. చేతులకు సంకెళ్ళతో, ఇరువైపులా పోలీసులతో చంద్రశేఖర్, జైలు సింహద్వారాన్ని దాటి లోన ప్రవేశించాడు.
============================================================
ఇంకా వుంది..
తోలు బొమ్మలు - పార్ట్ 2 త్వరలో మీ ముందుకు వస్తుంది.
============================================================
పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.
మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.






Comments