సహజీవనం శాంతినివ్వదు

Sahajeevanam Santhinivvadu - Telugu Emotional Family Story | B. N. Satyanarayana
సహజీవనం శాంతినివ్వదు - తెలుగు భావోద్వేగ కుటుంబ కథ | B. N. సత్యనారాయణ
Published in manatelugukathalu.com on 28/08/2026
“చట్టం శిక్షించకపోయినా… మనసు విధించే శిక్ష నుంచి తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదు.”
🙏 క్షమించడం ఎంత గొప్ప మానవత్వమో… పశ్చాత్తాపం ఎంత భారమైన శిక్షో చెప్పే హృదయవిదారక కథ.
ఈ మధ్యే తండ్రి కాలం చేయడంతో, ఒక్కగానొక్క కొడుకు కావడం వల్ల తల్లి సంరక్షణా భారం మధుపైనే పడింది. అతడికి తల్లి అంటే అమితమైన ప్రేమ. తల్లికి సేవలు చేయడం అతడికి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అది తనకు లభించిన అదృష్టంగానే భావిస్తాడతడు.
తండ్రి చేసే వ్యాపారాన్ని కొనసాగిస్తూనే మధు సంతృప్తిగానే జీవనం సాగిస్తున్నాడు. తల్లి పలుమార్లు తన పెళ్లి ప్రస్తావన తెస్తుండడంతో మధు అందుకు సమ్మతించాడు. ప్రయత్నాలు చేయగా ‘కమల’ అనే తన సమీప బంధువుల్లోని అమ్మాయితో పెళ్ళి నిశ్చయమైంది. పెళ్లి సాంప్రదాయబద్ధంగా, వైభవంగానే జరిగిపోయింది.
కమలకు భర్త అంటే చాలా ప్రేమ, అత్తగారంటే ఎంతో గౌరవం. ఆమెకు ఎటువంటి లోటు లేకుండా సేవలు చేస్తూ, అటు ఇంటి పనులు చూసుకుంటూనే వ్యాపారంలో భర్తకు సహాయపడుతుండేది.
భర్త దుకాణానికి అవసరమైన సరుకులు కొనితెచ్చేందుకు పెద్ద మార్కెట్టుకు వెళ్లే సమయాల్లో, కమలే దుకాణంలో అమ్మకాలు చూసుకుంటూ ఉండేది. అలా వారి జీవితాలు ప్రశాంతంగా, ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా నెమ్మదిగా ప్రవహించే నదీ ప్రవాహంలా సాగిపోసాగాయి.
అయితే విధి విచిత్రమైనది. అది ఎప్పుడు, ఎవరితో ఎలా ఆడుకుంటుందో ఎవరికీ తెలీదు. అది ఇప్పుడు మధు జీవితంతో ఆడుకోవడం మొదలుపెట్టింది. అకస్మాత్తుగా అతడి కుటుంబంలో తుఫాను కాదు, సునామీయే వచ్చి పడింది. వారి ఇంటి ప్రక్కనే ఉన్న ఒక ఇంటిలోకి సుకుమార్ అనే ఒక యువకుడు, బ్యాంకు ఉద్యోగి అద్దెకు దిగాడు. అతడు తనకు కావలసిన సరుకుల్ని మధు దుకాణంలోనే కొంటూ ఉంటాడు. దానితో అతడికి మధు కుటుంబంతో కొంత పరిచయం ఏర్పడింది.
మధు పెద్ద మార్కెట్టుకు వెళ్లే సమయాల్లో కమల దుకాణంలో ఉన్నప్పుడు, సుకుమార్ తనకు కావాల్సిన సరుకులు కొనేందుకు మధు దుకాణానికి వెళ్తూ ఉండేవాడు. అప్పుడు కమలే అతడికి కావలసిన సరుకులు ఇస్తుండేది. అలా కమలతో అతడికి పరిచయం ఏర్పడింది.
అది పెరిగి పెరిగి ఆకర్షణగా మారి, ఇద్దరి మధ్య కొత్త బంధం ఏర్పడేలా చేసింది. అప్పటినుండి కమలలో కొత్త కొత్త ఆలోచనలు పుట్టుకురాసాగాయి. అవి క్రమంగా కోరికలుగా మారి బలపడి ఆమెను పక్కదారి పట్టించసాగాయి. ‘సహజీవనం’ వైపు ఆమె మనసు పోసాగింది. అది తప్పు అని తెలిసికూడా దానినే కోరుకునేది ఆమె మనసు.
ఆమె అదృష్టం ఏమిటో - సుకుమార్‌కు తణుకుకు బదిలీ అయ్యింది. ఆ వార్తతో ఇద్దరిలో ఒక్కసారిగా ఆనందం పొంగిపొర్లింది. వారి ఆశలకు రెక్కలు మొలిచినట్లైంది. దానితో ఒక ప్రణాళిక ప్రకారం ఇద్దరూ ఎగిరిపోయారు. ఆ ఘటనతో మధు హతాశుడైపోయాడు, కృంగిపోయాడు. తనను ఎంతగానో ప్రేమించే కమల ఇలా తనకు ద్రోహం చేస్తుందని, తన జీవితంతో ఆటలాడుకుంటుందని అతడు ఏనాడూ ఊహించలేదు.
పోలీసు కంప్లైంట్ ఇవ్వాలని అనుకున్నాడు. కానీ “మనిషికి చట్టం కొత్తగా ఇచ్చిన స్వేచ్ఛ” వల్ల కంప్లైంట్ ఇచ్చినా ఫలితం ఉండదని భావించి, దాని వల్ల తన పరువు మరింతగా బజారుకెక్కుతుందని భయపడి ఊరుకున్నాడు, నిశ్శబ్దంగా ఉండిపోయాడు.
ఒక సందర్భంలో ఆత్మహత్య చేసుకోవాలనీ ఆలోచించాడు. కానీ తల్లి జ్ఞాపకం రావడంతో ఆ ప్రయత్నమూ విరమించుకున్నాడు. ఆఖరికి ఒక నిస్సహాయుడిలా, నిర్భాగ్యుడిలా మిగిలిపోయాడు.
కోడలు చేసిన గాయానికి అతడి తల్లి మనోవేదనతో మంచం పట్టింది. కొడుకుకు జరిగిన అన్యాయాన్ని, అవమానాన్ని తలచుకుంటూ తల్లడిల్లిపోయింది. ఆ బాధతోనే, ఆ వేదనతోనే అతి కొద్ది రోజుల్లోనే ఆమె కన్నుమూసింది. ఇరుగుపొరుగు వారి సూటిపోటి మాటలు, హేళనలు ఎంతగా బాధిస్తున్నా, మధు ఏమీ చేయలేని అశక్తుడిలా, అసమర్థుడిలా ఉండిపోయాడు.
కమల, సుకుమార్‌లైతే కొత్తచోట కొత్త జంటలా ప్రేమలు పంచుకుంటూ, పండించుకుంటూ ఆనంద సాగరంలో మునిగి తేలసాగారు. భర్త, అత్తగారు గుర్తుకు వచ్చినప్పుడు మాత్రం కమల కన్నీళ్లు పెట్టుకునేది, బాధపడేది.
అంతలోనే సుకుమార్‌తో జీవితాన్ని తలచుకుంటూ అన్నీ మర్చిపోయేది. అలా రోజులు, నెలలు ఆనందంగా గడిచిపోసాగాయి. కానీ విధికి నచ్చలేదేమో! ఆ ఆనందాన్ని ఒక్కసారిగా లాగేసుకుంది.
అనుకోకుండా ఒక రోజు సుకుమార్ కమలను దగ్గరికి తీసుకుని, “కమలా! ఇప్పుడు నీకొక విషయం చెప్పాలి. అది నీకు ఎంతో బాధ కలిగిస్తుందని తెలుసు. అయినా చెప్పక తప్పడం లేదు. ఆందోళన పడకు. దయచేసి పరిస్థితుల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు.”
అంటూ, “మా తల్లిదండ్రులు నాకు పెళ్లి చేయడానికి సంబంధాలు చూస్తున్నారు. దానిని నేను కాదనలేక, వారి ప్రయత్నాలను ఆపనూలేక సతమతమైపోతున్నాను. నిజానికి నిన్ను విడిచిపెట్టాలంటే నాకెంతో బాధగా ఉంది. కానీ ఈ పరిస్థితుల్లో నేనేం చేయాలో నాకు తోచడం లేదు.
నీకు, మా తల్లిదండ్రులకు మధ్య నేనిప్పుడు అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోతున్నాను. ఎంత ఆలోచించినా నిన్ను విడిచిపెట్టడం మినహా నాకు వేరే మార్గం కనిపించడం లేదు. నన్ను క్షమించు. ఇదిగో ఈ డబ్బు నీ దగ్గర పెట్టుకో. ఏ అవసరానికైనా ఉంటుంది” అంటూ కొంత డబ్బు కమల చేతిలో పెట్టి, “ఈ పరిస్థితిలో ఒంటరిగా ఉండడం నీకు శ్రేయస్కరం కాదు. నీవు మీ పుట్టింటికి వెళ్లిపోవడమే నాకు మంచిదనిపిస్తోంది. ఆలోచించుకో. నీ తల్లిదండ్రులు తప్పకుండా నీ తప్పును క్షమిస్తారు. నిన్ను ఆదరిస్తారు, ఆశ్రయం ఇస్తారు. ఇంతకంటే ఇప్పుడు నేను నీకేమీ చెప్పలేను. నన్ను క్షమించు” అని అన్నాడు.
సుకుమార్ మాటలు వింటున్న కమల భయంతో వణికిపోయింది. ఏడుస్తూ అతడి కాళ్లపై పడింది. “సుకుమార్.. నాకన్యాయం చేయకు. నన్ను విడిచిపోకు. నన్ను అనాథను చేయకు. వద్దు సుకుమార్.. నాకన్యాయం చేయకు.
జీవితాంతం కలిసి ఉందాం అనుకునే కదా మనం ఇద్దరం ఇలా వచ్చేసింది. అప్పటి మాటలు ఒక్కసారి గుర్తుచేసుకో” అంటూ భోరున ఏడవసాగింది.
నిజానికి ఆమె పరిస్థితి అతడికీ బాధ కలిగిస్తోంది. కానీ అతడిప్పుడు ఏమీ చేసే పరిస్థితిలో లేడు.
సుకుమార్ కమల భుజాలు పట్టుకుని నెమ్మదిగా పైకి లేపాడు. “కమల, నన్ను క్షమించు” అని అంటూనే ఆఖరుగా ఆమె నుదుటిపై చిన్నగా ముద్దుపెట్టి బయటకు వెళ్ళిపోయాడు.
కమలకు ఒళ్ళంతా చెమటలు పట్టేసాయి, పిచ్చెత్తిపోయినట్లుగా ఉంది. సుకుమార్ తననిలా విడిచిపోతాడని, మోసపుచ్చుతాడని ఆమె ఊహించలేకపోయింది. ఆమెకు ఇప్పుడు అర్థమయ్యింది తను ఇప్పుడు పూర్తిగా ఊబిలో కూరుకుపోయినట్లు. ఇప్పుడు తనేం చెయ్యాలి? ఎలా బ్రతకాలి? చావాలా? బ్రతకాలా? అనేకమైన ప్రశ్నలు ఆమెను చుట్టుముట్టసాగాయి.
ఏ ఒక్క దానికి సరైన జవాబు దొరకడంలేదామెకు. ఆమె ఆ రాత్రంతా కుమిలి కుమిలి ఏడుస్తూ, అలసిపోయి ఎప్పటికో నిద్రలోకి జారుకుంది.
తెలివి వచ్చేసరికి తెల్లవారిపోయింది. చుట్టూ వెలుగు. తన జీవితంలో మాత్రం అంతా చీకటే అని తెలిసాక ఆమెకు ఒక్కసారిగా భయం పట్టుకుంది. ఆ భయంలో పొంతన లేని ఆలోచనలు ఆమెను కమ్ముకోసాగాయి. బాధతో విలవిలలాడిపోయింది.
తేరుకొని కాసేపు ప్రశాంతంగా ఆలోచించింది. ఏ నిర్ణయానికి రాలేకపోతోంది. చేసేదేమీలేక కడసారిగా కనకదుర్గమ్మను దర్శించుకోవాలని అనుకుంది. తయారై సూట్‌కేసు సర్దుకొని విజయవాడకు బస్సు ఎక్కి ప్రయాణమైంది.
అది మొన్నటి వరకు తన ఊరు. తన అత్తగారి ఊరు. తను ఎంతో ఆనందంగా గడిపిన ఊరు. మరిప్పుడు? ఎంత దురదృష్టం! తాను చేసుకున్న పాపానికి శిక్షేనా ఇది? అనుకుంటూ తలచుకుని తలచుకుని కుమిలిపోసాగింది.
అక్కడ మధు జీవితమూ ఒంటరిగా, దుర్భరంగానే ఉంది. తల్లి, భార్యల జ్ఞాపకాలు అతడిని కుంగదీస్తున్నాయి. అతడి మనసు ప్రశాంతతను కోరుకుంటోంది. దుర్గ గుడిలో కాసేపు విశ్రాంతి పొందాలని తలచి గుడి వైపు దారి తీశాడు.
కమల అప్పుడే అమ్మవారి దర్శనం పూర్తిచేసుకొని భవిష్యత్తు పట్ల ఆలోచనలతో సతమతమైపోతూ అన్యమనస్కంగా నడుచుకుంటూ బయటకు రాసాగింది. అప్పుడే అక్కడకు వచ్చిన మధు అకస్మాత్తుగా ఆమెకు ఎదురుపడడంతో ఒక్కసారిగా ఆమె త్రుళ్లిపడింది.
మధు పరిస్థితి అంతే. ఎదురుగా వస్తున్న కమలను చూసి ఉలిక్కిపడ్డాడు. కొన్ని క్షణాలకు ఇద్దరూ తేరుకున్నారు. కమల అపరాధ భావంతో మధును చూడలేక తలవంచేసుకుంది. ముందుగా మధునే మాటలు కలిపాడు. “కమలా! ఎలా ఉన్నావు? నీవొక్కదానివే కనిపిస్తున్నావు. సుకుమార్ ఏడి?” అని అడుగుతుంటే కమలకు ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో తెలియక బిత్తరచూపులు చూస్తూ ఉండిపోయింది.
ఒక్కసారిగా ఆమెకు దుఃఖం పొంగుకొచ్చింది. కొంగు నోట్లో పెట్టుకుని రోధించసాగింది. ఆ స్థితిలో ఆమెను ఓదార్చడం మధుకు సాధ్యం అయ్యేలా లేదు. అందుకే ఊరుకున్నాడు.
కొద్దిసేపటికి కమల మామూలు మనిషి అయ్యింది. అక్కడే కమలతో మనసు విప్పి మాట్లాడడం కుదరదని గ్రహించి, “కమలా! నీవేమీ తిన్నట్లుగా లేవు. నీ ముఖం బాగా నీరసించిపోయి ఉంది. పద! ఏదైనా హోటల్లో తింటూ మాట్లాడుకుందాం” అంటూ మధు బయటకు దారితీశాడు.
కుక్కపిల్లలా కమల అతడ్ని వెంబడించింది. దగ్గరలో ఉన్న ఒక హోటల్‌కు వెళ్లి కూర్చున్నారు. బేరర్‌కు టిఫిన్ ఆర్డర్ చేసి, “కమలా! ఇప్పుడు చెప్పు. ఏం జరిగింది?” అంటూ అడిగాడు.
ఆ పలకరింపులో ఆత్మీయతకు ఆమె కళ్లు వర్షించడం మొదలుపెట్టాయి. కొద్దిసేపటికి తేరుకుని చెప్పడం మొదలుపెట్టింది.
“సుకుమార్‌కు పెళ్లి చేయాలని అతని తల్లిదండ్రులు సంబంధాలు చూస్తున్నారట. అందువల్ల ఇకపై మనమిద్దరం కలిసి ఉండడం కుదరదు. మనకు విడిపోక తప్పడంలేదు. అంటూ కొంత డబ్బు నా చేతిలో పెట్టి నన్ను వదిలిపెట్టి వెళ్లిపోయాడు.
నాకన్యాయం చేసి వెళ్లిపోయాడు. నేను మీకు చేసిన ద్రోహానికి నాకు తగిన శిక్షే పడింది. నేనిప్పుడు ఒంటరిదాన్ని అయిపోయాను. అనాథనైపోయాను. ఏం చెయ్యాలో? ఎలా బ్రతకాలో అర్థం కావడంలేదు. చచ్చిపోవాలని ఉన్నా ధైర్యం చాలడంలేదు.
కొద్దిసేపైనా మనం కలిసి తిరిగిన ఈ గుడిలో ప్రశాంతంగా గడపాలని ఇక్కడికి వచ్చాను. ఆకస్మికంగా మీరు ఎదురయ్యారు” అని చెబుతూ ఏడవడం మొదలుపెట్టింది.
కాసేపటికి, స్థిమితపడ్డాక, “మధుగారు.. మీరెలా ఉన్నారు? మిమ్మల్ని మధు అని పిలిచే అర్హత నేను పోగొట్టుకున్నాను. అందుకే మిమ్మల్ని అలా పిలుస్తున్నాను. అత్తయ్యగారు ఎలా ఉన్నారు?” అంటూ క్షేమ సమాచారాలు అడగడం మొదలుపెట్టింది.
ఆమె పరిస్థితి మధుకు అర్థమయ్యింది. మోసపోయిందని ఆమె ఏడుపే ఆ విషయాన్ని చెప్పక చెబుతోందని గ్రహించాడు. ఆమె అడిగిన దానికి బదులిస్తూ “అమ్మ చనిపోయింది. నేనూ ఒంటరినే అయిపోయాను. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ముందు నీ గురించి చెప్పు. ఇప్పుడు నీవేమి చేయాలనుకుంటున్నావు?”
అంటూనే - ఆమె సమాధానం కోసం వేచి చూడకుండానే “నీవు అంగీకరిస్తే నాదొక సలహా. ఇప్పుడు నీవు ఒంటరివి. ఈ రోజుల్లో ఒంటరిగా ఎక్కడా నీవు బ్రతకలేవు. అందువల్ల నీకు నాపై నమ్మకం ఉంటే నాతో మరలా మన ఇంటికి వచ్చేసేయి. నీకు ఎటువంటి కష్టం కలుగకుండా జీవితాంతం నిన్ను నేను చూసుకుంటాను” అని అంటున్న మధుని చూస్తూ, అతని మాటల్లోని దయకు, కనికరానికి, నిజాయితీకి కమల చలించుకుపోయింది.
తనని, తన తప్పును క్షమించి తనకు ఆశ్రయం కల్పిస్తానన్న అతనిలోని మానవత్వానికి చలించిపోయింది. హృదయంలోనే కృతజ్ఞతలు చెప్పుకుంది. అతని మాటలకు ఊకొడుతూ అది తనకు లభించిన గొప్ప అదృష్టంగా భావించి తన సమ్మతిని తెలుపుతూ తల ఊపింది.
అప్పుడే బేరర్ తెచ్చిన టిఫిన్ తిని బిల్లు చెల్లించి ఇద్దరూ ఆటోలో ఇంటికి చేరుకున్నారు. మధు ఇంటి తాళం తీసి, తలుపులు తెరిచి కమలను లోపలికి రావలసిందిగా పిలిచాడు. ఇంట్లో అడుగు పెట్టగానే కమలకు ఒక్కసారిగా ఒళ్ళు జలదరించినట్లైంది. “ఇంత పవిత్రమైన ఇంటినా తాను వదిలి పెట్టి పోయింది” అనుకుంటూ కళ్ళనీళ్ళు పెట్టుకుంది.
మధు కమలకు ఒక గది చూపించి “ఇది నీ గది. ఎదుటి గదిలో నేనుంటాను. బయటి వారికి మనిద్దరం భార్యాభర్తలం. నిజానికి మన మధ్య ఏ బంధమూ ఉండదు. నీ జీవితం నీది. నా జీవితం నాది. నీవు ఇంటి పనులు మాత్రం చూసుకో” అని చెప్పి మధు తన గదిలోకి వెళ్లిపోయాడు.
మధు చూపించిన ఆదరణకు, అభిమానానికి కమల మనసులోనే అతనికి నమస్కరించుకుంది. “ఇటువంటి మహనీయుడికా తాను ద్రోహం చేసింది?” అనుకుంటూ సిగ్గుపడిపోయింది. తాను చేసిన ద్రోహానికి తనను తానే శపించుకుంది.
మధు మనసుకు ఇప్పుడు కొంత ప్రశాంతత దొరికినట్లు అయ్యింది. కమలకు, తన భార్యకు (?), ఒక అభాగ్యురాలికి కష్టకాలంలో ఆశ్రయం కల్పించగలిగినందుకు అతనికి సంతోషంగా ఉంది.
ఇప్పుడు వారిద్దరూ నిష్కాముకులుగా బ్రతకడాన్ని అలవాటు చేసుకున్నారు. వదిలిపెట్టి ద్రోహం చేసి వెళ్ళిపోయిన భార్యను తిరిగి తెచ్చుకున్నందుకు మధును ఇరుగుపొరుగు వారందరూ తిట్టిపోసాగారు. కానీ మధు వారి మాటలు పట్టించుకోలేదు.
కమలలో ఇప్పుడు చాలా మార్పే వచ్చింది. తనలోని సహజమైన కోరికల్ని తగలబెట్టేసింది. మధును సేవించుకోవడం ఒక్కటే లక్ష్యంగా పెట్టుకుంది. శుద్ధి పడ్డ మనసుతో ఇంటి పనులు చేసుకుంటూ పోసాగింది. మధు కూడా ఒక యోగిలా జీవించసాగాడు. అలా రోజులు గడుస్తున్నాయి.
చేసిన పాపం కమలను విడిచిపెట్టడం లేదు. నిత్యం ఆమెను వెంటాడుతూ వేధిస్తూనే ఉంది. ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ఆ వేదన భరించడం ఆమెకు సాధ్యం కావడం లేదు. బ్రతుకు చాలా భారం అనిపించసాగింది. దానితో ఆమె ఒక నిర్ణయానికి వచ్చింది. కడసారిగా మనసులోనే మధుకు కృతజ్ఞతలు తెలుపుకొని తన గదిలోనికి పోయి ఫేనుకు ఉరివేసుకుని చనిపోయింది.
ఆమె చనిపోవడం మధుకు చాలా బాధ కలిగించింది. “చట్టపరంగా కొన్ని తప్పులకు శిక్షలు లేకపోవచ్చు. కానీ మనసు విధించే శిక్షల నుండి తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదు” అని తెలిసిరావడంతో మధులో వైరాగ్యం పుట్టుకొచ్చింది. ఒక నిర్ణయానికి వచ్చేశాడు. తన ఆస్తిని అంతటిని అమ్మివేశాడు. ఆ వచ్చిన ధనాన్ని ఒక అనాధాశ్రమానికి దానంగా ఇచ్చేశాడు. తన శేష జీవితాన్ని అనాధలకు సేవలు చేసుకుంటూ గడిపేయాలని నిశ్చయించుకొని ఆ ఆశ్రమంలోనే తానూ ఆశ్రయం పొందాడు.
***
పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.
మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.
B. N. సత్యనారాయణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: నా పేరు B. N. సత్యనారాయణ. B.A.
( బొడ్డేడ నూక సత్యనారాయణ )
బి. ఎ.
వయసు: 75 సం॥లు
స్వస్థలం. : అనకాపల్లి. (ఆం॥ ప్ర.)
ప్రస్తుతం
హైదరాబాద్ లో
స్థిరపడ్డాను
వృత్తి. : ప్రైవేటు సంస్థల్లో
అక్కౌంటెంట్‌గా చేసి
రిటైర్ అయ్యాను
ప్రస్తుతం వ్యాపార
రంగంలో ఉన్నాను
ప్రవృత్తి. : సామాజిక రుగ్మతలపై
పత్రికలకు లేఖలు
రాయడం
రెండు సంపుటాలు కూడా
ప్రచురించడం జరిగింది
ఛిన్న కథలు వ్రాయడం
మొదలుపెట్టాను







Comments