పుట్ట
- Santhosh Sarma Lakkaraju

- 10 minutes ago
- 3 min read

Putta - Telugu Social Story | Santhosh Sarma Lakkaraju
పుట్ట - తెలుగు సామాజిక కథ | సంతోష్ శర్మ లక్కరాజు
Published In manatelugukathalu.com on 27/08/2026
“పుట్ట” కథ ఒక సాధారణ గ్రామీణ సంఘటన వెనుక దాగి ఉన్న అసాధారణమైన సామాజిక వాస్తవాన్ని మన ముందుకు తీసుకొస్తుంది. సంతోష్ శర్మ లక్కరాజు రచించిన ఈ కథ తరతరాల పేదరికం, స్త్రీల సామాజిక అసహాయత, మానవత్వం కంటే ఆచారాలకు ఇచ్చే ప్రాధాన్యంపై ప్రశ్నించే సామాజిక వాస్తవిక కథ.
రెండు రోజులుగా ఊరంతా భోరున వర్షం. ఇళ్లలోనుంచి ఎవరూ బయటికి వచ్చే పరిస్థితి లేదు. అయినా రాత్రి తొమ్మిదింటికి ఊరి పొలిమేరలో జనం గుమిగూడి ఉన్నారు. అందరి కళ్ళలోనూ ఆశ్చర్యం, కొంత భక్తి కూడా పొంగుతున్నాయి. కాగడాల వెలుగులో అందరూ తదేకంగా దాని వంకే చూస్తున్నారు. ఉన్నట్టుండి ఆ ఊరి పొలిమేరలో వెలసిన పుట్ట వంకే. పుట్టలో పాము ఉందా లేదా అని చర్చించుకుంటున్నారు కొందరు. కచ్చితంగా పుట్టలో నాగదేవత ఉంది అని నిర్ణయించేసారు ఇంకొందరు. ఆడవాళ్ళు పుట్ట మీద పసుపు కుంకుమలు చల్లుతున్నారు. ఊరి పెద్దమనుషులంతా ఒక చెట్టు కింద చేరి ఏవో మంతనాలు జరుపుతున్నారు. చిన్న పిల్లలు తల్లుల చాటు నుంచి పుట్ట వంక కొంత భయంతో, కొంత కుతూహలంతో చూస్తున్నారు.
అదే రోజు, అదే రాత్రి, ఆ సమయానికే, ఆ పుట్ట వెలిసిన చోటుకి ఒక మైలు దూరంలో చింత చెట్టు కింద, నెలలు నిండిన కడుపుతో ప్రసవ వేదన పడుతోంది రంగి. చుట్టూ చిమ్మ చీకటి, తోడు ఎవరూ లేరు. మొన్న మొన్నటిదాకా ముసలి తల్లి తోడుండేది. రోజూ అడుక్కున్న అన్నం తెచ్చుకుని ఇద్దరూ ఆ చింత చెట్టు కిందే తినేవారు, అక్కడే ఉండేవారు. అయితే ఆమె ఈ మధ్యే పోయింది. ఇంక ఆ ఊరిలో రంగిని పట్టించుకునే పెద్దమనుషులు ఎవరూ లేరు. అపుడప్పుడు, కొన్ని రాత్రులు, ఊర్లో మగవాళ్ళు మాత్రం పట్టించుకునేవాళ్ళు. కానీ ఓ తొమ్మిది నెలలుగా ఆ అవకాశం లేకపోయింది ఎవరికీ. రంగి పురిటి నొప్పుల కేకలు ఆ చీకటి ఆకాశంలో కరిగిపోతున్నాయి.
అక్కడ పుట్ట దగ్గర కూడిన జనం ఇంక ఇంటి ముఖం పడదాం అనుకుంటుండగా, పుట్ట పై రంధ్రంలోనుంచి బుస కొడుతూ ఒక పాము పడగ బయట పెట్టింది. దాంతో ఉన్నట్టుండి అందరూ చేతులు తలల పైకి ఎత్తి దండాలు పెడుతూ, నోటితో రకరకాల శబ్దాలు చేస్తూ, పూనకాలతో ఊగిపోతూ భక్తావేశంతో పుట్ట ముందు నేల పై పడిపోతున్నారు. అక్కడ రంగి కూడా పెద్దగా కేక పెడుతూ, ఒక బిడ్డని కని స్పృహ తప్పి పడిపోయింది. పుట్టిన బిడ్డ చింత చెట్టు ఆకుల నుండి కారుతున్న వర్షపు చినుకులకి తడుస్తూ ఏడుస్తోంది. అది ఆడపిల్ల. పుట్ట దగ్గర పాము పడగ దించి పుట్టలోకి దూరిపోయింది. ఊరి పెద్దమనుషులు నలుగురు ముందుకి వచ్చి, నాగదేవత ఇక్కడ వెలవడం మన ఊరి అదృష్టం అని, ఈ దేవతకి గుడి కట్టి పూజించుకోవాలని తీర్మానం చేసారు.
ఐదేళ్లు గడిచాయి. ఇప్పుడు ఆ పుట్ట చుట్టూ చిన్న గుడి ఉంది. ఆ నాగదేవత ఊర్లో వారి అందరికి ఇలవేల్పు అయ్యింది. ఏ శుభకార్యం జరగాలన్నా, దేవత దర్శనం చేయాల్సిందే. పెళ్ళైనా, పురుడైనా నాగదేవత ఆశీర్వాదం ఉంటేనే జరుగుతాయి, లేకపోతే జరగవు అని బలంగా నమ్ముతున్నారు ప్రజలు. రంగి ఇపుడు తన అయిదేళ్ల కూతురు మంగ తోడుతో అదే చింత చెట్టు కింద తింటోంది, ఉంటోంది. పుట్ట, దాని చుట్టూ గుడి రావటంతో, రంగికి అక్కడ కూడా కొంత ఆదాయం వస్తోంది. ప్రతి రోజు గుడికి వచ్చే భక్తుల దగ్గర ఎలా అడుక్కోవాలో కూతురికి నేర్పుతోంది.
ఇంకొక పదేళ్లు గడిచాయి. ఒక రోజు ఊరి పెద్దలు అందరూ గుడిలో సమావేశం అయ్యారు. తమ ఊరి నాగదేవత మహిమ జిల్లా అంతా వ్యాపించటంతో భక్తుల రాక పెరిగిందని, గుడిని విస్తరించాల్సిన అవసరం ఉందని చర్చించి, ఆ పనులు వెంటనే మొదలు పెట్టాలని నిర్ణయించారు. సమావేశం అనంతరం బయటికి వస్తున్న పెద్దమనుషులలో కొందరు అక్కడే అడుకుంటున్న తన కూతురు మంగ వంక ఆశగా చూడటం రంగి గమనించింది. ఇంక తనకి రాబడి పెరిగే మార్గం దొరికిందని గ్రహించింది.
ఇంకొక అయిదేళ్లు గడిచాయి. ఇప్పుడు ఆ పుట్ట, ఆ గుడి రాష్ట్రంలోనే సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం. అక్కడికి వస్తే చాలు, పెళ్ళిలవుతాయని, బిడ్డలు లేని వారికి సంతానం తప్పక కలుగుతుందని భక్తులు దృఢంగా విశ్వసిస్తున్నారు. ఏటా ఉత్సవాలతో గుడి, అది వెలిసిన ఊరు వైభవంగా వెలుగుతున్నాయి. ఒక రోజు మళ్ళీ భోరున వాన, గుడి బయట జన సమూహం, అందరూ తోసుకుంటూ లోపలికి వెళ్ళటానికి ప్రయత్నిస్తున్నారు. లోపల పెద్ద పుట్ట పక్కనే ఒక చిన్న పుట్ట వెలసిందట. ఆ పుట్టని దర్శించుకోవాలని అందరి తాపత్రయం. గుడి పెద్దలు అందరూ ఈ చిన్న పుట్ట చుట్టూ కొత్త మందిరం నిర్మించాలని చర్చించుకుంటున్నారు.
అదే రోజు, అదే రాత్రి, ఆ సమయానికే చింత చెట్టు కింద మంగ పురిటి నొప్పులు పడుతోంది. తన తల్లిలాగే నిస్సహాయంగా, అంతే ఒంటరిగా.
***
పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.
మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.
సంతోష్ శర్మ లక్కరాజు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం :
నా పేరు సంతోష్. నేను వృత్తి రీత్యా Data Analyst ని. చిన్నప్పటినుండి పుస్తకాలు చదవటం చాల చాల ఇష్టం. నాకు ఎంతో ఇష్టం అయిన రచయిత దైవ సమానులు "కవి సమ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ" గారు. నేను హైదరాబాద్ వాస్తవ్యుడని. నేను రాసిన కొన్ని కథలు కవితలు ఒక చిన్న పుస్తకంగా అచ్చువేయబడినది. అందులో లేని నేను రాసిన ఇతర కథల ను వివిధ "Online Telugu Stories Websites and Competitions" కి పంపించాలని అనుకుంటున్నాను.






Comments