ప్రశ్నించడం నిషిద్ధం!

Prasninchadam Nishidham - Telugu Social story | Venkat Manthripragada
ప్రశ్నించడం నిషిద్ధం! - తెలుగు సామాజిక కథ | వెంకట్ మంత్రిప్రగడ
Published in manatelugukathalu.com on 13/10/2026
ప్రశ్నించే స్వేచ్ఛ అనేది విద్యార్థులకే కాదు, ప్రతి మనిషికీ అవసరమైన ఒక ముఖ్యమైన హక్కు. ధైర్యంగా ప్రశ్నించడం, వినయంగా సమాధానాలు వినడం, తప్పులను నిజాయితీగా అంగీకరించడం అనే విలువలను ఈ కథ గుర్తుచేస్తుంది.
చిట్టిబాబు, స్పందన డిగ్రీ సెకండ్ ఇయర్ క్లాసులో చాలా చురుకైన విద్యార్థులు.
చదువులో కాదు... మార్కులు తెచ్చుకోవడంలో, స్టైలిష్ డ్రెస్సులు వేసుకోవడంలో, ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు పెట్టుకోవడంలో, అర్థం లేని విషయాలను గంటల తరబడి చర్చించడంలో వాళ్లకు వాళ్లే సాటి! పరీక్షల్లో సమాధానాలు సరిగ్గా రాయకపోయినా, వాటిని అందంగా ప్రజెంట్ చేయడంలో మాత్రం ఇద్దరికీ డాక్టరేట్ ఇవ్వొచ్చు.
ఆ రోజు భగవాన్ గారి కమర్షియల్ జియోగ్రఫీ క్లాస్.
భగవాన్ గారు కాలేజీలో సీనియర్ లెక్చరర్. ఆయన బోధించే పాఠాల్లో భూగోళం కంటే ఆయన గొంతుకే ఎక్కువ విస్తీర్ణం ఉండేది.
ఆయన చెప్పే విషయాల్లో విద్యార్థులకు అర్థమయ్యేవి కొన్ని, అర్థం కానివి మరికొన్ని. కానీ అర్థం కాని విషయాలను ప్రశ్నించకూడదనే విషయం మాత్రం అందరికీ స్పష్టంగా అర్థమైంది.
ఆ రోజు ఆ క్లాస్ విద్యార్థులు చిట్టిబాబు, స్పందన పదిహేను నిమిషాలు ఆలస్యంగా క్లాసులోకి ప్రవేశించారు. ఒకరి చేతిలో ఖరీదైన కాఫీ కప్పు, మరొకరి చేతిలో మొబైల్ ఫోన్.
క్లాసులో అమ్మాయిల బెంచీలు వేరు, అబ్బాయిల బెంచీలు వేరు. కాలేజీ యాజమాన్యం దృష్టిలో ఇది భారతీయ సంస్కృతిని కాపాడే అత్యంత కీలకమైన వ్యవస్థ.
అయితే, అమ్మాయిలు అబ్బాయిలతో వాట్సాప్‌లో అర్ధరాత్రి వరకు మాట్లాడుకోవడంపై మాత్రం యాజమాన్యానికి ఎలాంటి అధికారిక విధానమూ లేదు.
ఇద్దరూ చివరి బెంచీలో కూర్చున్నారు.
"సారీ సార్!" అన్నాడు చిట్టిబాబు.
"సారీ సార్!" అంది స్పందన.
"మీరిద్దరూ ఒకేసారి ఎందుకు సారీ చెబుతున్నారు?" అని అడిగారు భగవాన్ గారు.
"సార్, ఆలస్యమవడానికి కారణం ఒకటే కాబట్టి సార్!" అన్నాడు చిట్టిబాబు.
"ఏమిటా కారణం?"
"కారణం వేరు సార్, కానీ ఆలస్యం మాత్రం ఒకటే!"
క్లాసులో చిన్నగా నవ్వులు వినిపించాయి.
భగవాన్ గారు కళ్లజోడు సరిచేసుకున్నారు. ఆయనకు విద్యార్థులు నవ్వడం నచ్చదు. ఎందుకంటే, విద్యార్థులు నవ్వడం మొదలుపెడితే ఆలోచించడం కూడా మొదలుపెట్టే ప్రమాదం ఉంది.
ఆలోచించడం మొదలుపెడితే ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నలు వస్తే బోధనకు అంతరాయం కలుగుతుంది. బోధనకు అంతరాయం కలిగితే సిలబస్ పూర్తికాదు. సిలబస్ పూర్తికాకపోతే విద్యార్థులు జీవితానికి సిద్ధం కాకపోవచ్చు!
అయితే, జీవితానికి సిద్ధం చేయడానికి ప్రశ్నలు అవసరమా అనే ప్రశ్నను మాత్రం విద్యావ్యవస్థ ఎప్పుడూ సిలబస్‌లో చేర్చలేదు.
"ఈ రోజు మనం ప్రపంచ వాణిజ్య మార్గాల గురించి తెలుసుకుందాం," అంటూ భగవాన్ గారు బోర్డు మీద పెద్ద అక్షరాలతో రాశారు — 'వరల్డ్ ట్రేడ్ రూట్స్'.
"ప్రపంచ వాణిజ్యం అంటే ఏమిటి?" అని ఆయన క్లాసును అడిగారు.
విద్యార్థులందరూ నిశ్శబ్దంగా ఉన్నారు.
"ఎవరైనా చెప్పండి," అన్నారు భగవాన్ గారు.
చిట్టిబాబు చెయ్యెత్తాడు. "సార్, మన దేశంలో తయారైన వస్తువులు విదేశాలకు వెళ్లడం, విదేశాల్లో తయారైన వస్తువులు మన దేశానికి రావడం ప్రపంచ వాణిజ్యం కదా సార్?"
"అవును. మరి అందులో సమస్య ఏమిటి?"
"సార్, మన దేశంలో తయారైన వస్తువులు విదేశాలకు వెళ్లినప్పుడు వాటి ధర తక్కువగా ఉంటుంది. అదే వస్తువు తిరిగి మన దేశానికి వస్తే ధర ఎక్కువగా ఉంటుంది. మధ్యలో అసలు ఎవరు సంపాదిస్తున్నారు సార్?"
భగవాన్ గారు కాసేపు ఆగారు. "అది నీకు ఇప్పుడు అవసరం లేదు. నేను చెప్పింది నోట్ చేసుకో."
"సార్, కానీ అదే కదా కమర్షియల్ జియోగ్రఫీ?"
"చిట్టిబాబూ! నేను చెప్పేది వినాలి, నీకు నచ్చింది అడగకూడదు."
వెనుక బెంచీలో స్పందన తలెత్తింది. "సార్, అంటే విద్యలో ముఖ్యమైనది విషయం తెలుసుకోవడం కాదు, టీచర్ చెప్పింది నోట్ చేసుకోవడమా?"
ఇప్పుడు క్లాసులో నవ్వులు కొంచెం గట్టిగా వినిపించాయి. భగవాన్ గారి ముఖం ఎర్రబడింది.
"మీ ఇద్దరూ అసలు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. వినడానికి చాలా సొంపుగా ఉన్నాయి గానీ అర్థాలేమీ లేవు.
బ్రేక్‌ఫాస్ట్‌కి చాట్‌జిపిటి తిని వచ్చారా?"
ఈసారి క్లాసంతా పగలబడి నవ్వింది. భగవాన్ గారికి ఆ నవ్వు తన పరువు తీసినట్టనిపించింది.
"నవ్వడం ఆపండి! ఇది కాలేజీ, కామెడీ క్లబ్ కాదు!"
చిట్టిబాబు మెల్లగా స్పందనతో అన్నాడు, "చూశావా? సార్‌కి కూడా చాట్‌జిపిటి గురించి తెలుసు, కానీ దాన్ని ప్రశ్నించడం మాత్రం తెలియదు!"
ఆ మాట భగవాన్ గారికి వినిపించింది. "చిట్టిబాబూ! నువ్వు చాలా తెలివైనవాడివని అనుకుంటున్నావా?"
"అదే తెలియదు సార్, అందుకే అడుగుతున్నాను."
"మరో మాట మాట్లాడితే ప్రిన్సిపాల్ దగ్గరికి పంపిస్తాను!"
"సార్, అక్కడికి వెళ్తే నా ప్రశ్నకు సమాధానం దొరుకుతుందా?"
"దొరకదు!"
"అయితే శిక్ష ఎందుకు సార్? సమాధానం తెలియదని ఒప్పుకున్నందుకు అదనపు మార్కులు ఇవ్వాలి కదా!"
ఈసారి భగవాన్ గారు పుస్తకం మూసేశారు. "క్రమశిక్షణ అంటే ఏమిటో మీకు తెలుసా?"
స్పందన చెయ్యెత్తింది.
"సార్, భయం లేకుండా ప్రశ్నించడం క్రమశిక్షణలో భాగమా?"
"కాదు! టీచర్ మాట్లాడుతున్నప్పుడు మధ్యలో మాట్లాడకూడదు. పెద్దలను ఎదిరించకూడదు. చెప్పింది వినాలి. చెప్పింది రాయాలి.
పరీక్షలో చెప్పింది తిరిగి రాయాలి... అదే క్రమశిక్షణ!"
"సార్," అంది స్పందన, "అయితే మనం విద్యార్థులమా, జిరాక్స్ మిషన్లమా?"
క్లాసులో నవ్వులు మళ్లీ చెలరేగాయి.
భగవాన్ గారు ఆ రోజు తన బోధనా జీవితంలోనే అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు. దాదాపు ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్ లాంటి భావన కలిగింది. ఆయన బోధిస్తున్నది భూగోళశాస్త్రం; కానీ విద్యార్థులు అడుగుతున్నది విద్యావ్యవస్థ ఎక్కడికి వెళ్తోందని తాత్వికపరమైన ప్రశ్నలు!
ఆయన వెంటనే ఒక కొత్త నిర్ణయం తీసుకున్నారు. "రేపటి నుంచి క్లాసులో ఎవరూ అనవసరమైన ప్రశ్నలు అడగకూడదు. ఎవరైనా ప్రశ్న అడిగితే రెండు మార్కులు కట్ చేస్తాను."
"సార్, మరి అవసరమైన ప్రశ్న ఏదో ఎవరు నిర్ణయిస్తారు?" అని చిట్టిబాబు అడిగాడు.
"నేను!"
"అయితే సార్, ప్రశ్న అడగడానికి కూడా మీ అనుమతి తీసుకోవాలన్నమాట?"
"అవును!"
"సార్, ఆ అనుమతి తీసుకోవడానికి ఏ ఫారం నింపాలి? ఆన్‌లైన్‌లోనా, ఆఫ్‌లైన్‌లోనా?"
భగవాన్ గారు తన జీవితంలో మొదటిసారి కమర్షియల్ జియోగ్రఫీ పుస్తకాన్ని చూసి, అది తనకు ఎందుకు అవసరమా అని ఆలోచించారు.
వారం రోజుల్లోనే కాలేజీలో కొత్త సర్క్యులర్ వెలువడింది:
"విద్యార్థులలో క్రమశిక్షణ పెంపొందించడానికి ప్రశ్నల నియంత్రణ విధానం అమలు చేయబడుతుంది."
దాని ప్రకారం, విద్యార్థులు ప్రశ్నలు అడిగే ముందు మూడు విషయాలు నిరూపించాలి:
ఆ ప్రశ్న సిలబస్‌లో ఉందని.
ఆ ప్రశ్నకు పరీక్షలో మార్కులు వస్తాయని.
ఆ ప్రశ్న వల్ల లెక్చరర్ గారి మానసిక ప్రశాంతతకు భంగం కలగదని.
సర్క్యులర్ చివర్లో ఒక ముఖ్యమైన గమనిక కూడా ఉంది:
"విద్యార్థులు స్వతంత్రంగా ఆలోచించవచ్చు. అయితే ఆ ఆలోచనలు కళాశాల నిబంధనలకు అనుగుణంగా ఉండాలి."
ఈ వాక్యాన్ని కాలేజీ యాజమాన్యం తమ విద్యా విధానంలో ఒక చారిత్రక సంస్కరణగా ప్రకటించింది.
తరువాతి నెలలో విద్యార్థుల ప్రతిభను అంచనా వేయడానికి ప్రత్యేక పరీక్ష నిర్వహించారు.
ప్రశ్న: "మీరు ఒక దేశానికి ప్రధానమంత్రి అయితే, దేశాన్ని ఎలా అభివృద్ధి చేస్తారు?"
చిట్టిబాబు సమాధానం ఇలా రాశాడు:
"ముందుగా దేశంలోని విద్యావ్యవస్థలో ప్రశ్నలు అడిగే స్వేచ్ఛను పెంచుతాను. పిల్లలకు తప్పులు చేసే అవకాశం ఇస్తాను. ఉపాధ్యాయులకు కూడా తాము చెప్పేది తప్పు కావచ్చని అంగీకరించే ధైర్యాన్ని నేర్పిస్తాను."
స్పందన సమాధానం ఇంకా ప్రమాదకరంగా ఉంది:
"పరీక్షల్లో విద్యార్థుల జ్ఞానాన్ని పరీక్షిస్తాను. కానీ ఉపాధ్యాయుల జ్ఞానాన్ని పరీక్షించకూడదనే నిబంధనను తొలగిస్తాను. పాఠ్యపుస్తకంలో ఉన్న ప్రతి మాటా సత్యం కాదని, పరీక్షలో పూర్తి మార్కులు తెచ్చుకున్న ప్రతి విద్యార్థీ విజ్ఞాని కాదని అంగీకరిస్తాను."
ఫలితాలు వచ్చిన రోజు ఇద్దరికీ సున్నా మార్కులు వచ్చాయి.
కారణం: "సమాధానాలు సిలబస్ పరిధిని దాటి ఉన్నాయి."
కానీ పరీక్షలో మొదటి ర్యాంకు వచ్చిన విద్యార్థి సమాధానం మాత్రం ఆదర్శంగా ప్రకటించబడింది:
"నేను ప్రధానమంత్రి అయితే, ప్రస్తుతం ఉన్న విధానాలను యథాతథంగా కొనసాగిస్తాను. ఎందుకంటే పెద్దలు తీసుకున్న నిర్ణయాలను ప్రశ్నించడం మన సంస్కృతి కాదు."
ఆ విద్యార్థికి వందకు వంద మార్కులు వచ్చాయి. కాలేజీ వార్షికోత్సవంలో అతడిని సన్మానిస్తూ ప్రిన్సిపాల్ గారు ఇలా ప్రకటించారు: "మన విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. వారు ప్రశ్నలు అడగరు, వివాదాలు సృష్టించరు, వ్యవస్థను సవాలు చేయరు.
భవిష్యత్తులో వీరు గొప్ప నాయకులు అవుతారనే నమ్మకం మాకుంది."
చిట్టిబాబు స్పందన వైపు చూశాడు. "మనకు కూడా నాయకులయ్యే అవకాశం ఉందేమో!"
"ఎలా?"
"మనం కూడా ఇక ప్రశ్నలు అడగడం మానేద్దాం. మొదట కాలేజీ యూనియన్ ప్రెసిడెంట్ అవుదాం. తరువాత రాజకీయాల్లోకి వెళ్దాం. అక్కడ ప్రశ్నలు అడిగేవాళ్లను క్రమశిక్షణ పేరుతో బయటకు పంపించవచ్చు."
స్పందన నవ్వింది. "అయితే మనం వ్యవస్థను మార్చడం లేదు, వ్యవస్థలో మనకో కుర్చీ సంపాదించుకుంటున్నాం."
"అదే కదా సక్సెస్ స్టోరీ!"
కొన్ని సంవత్సరాలు గడిచాయి. చిట్టిబాబు ఒక పెద్ద కార్పొరేట్ సంస్థలో మేనేజర్ అయ్యాడు. స్పందన ఒక ప్రముఖ విద్యాసంస్థలో అకడమిక్ డైరెక్టర్‌గా చేరింది.
చిట్టిబాబు కార్యాలయంలో ఒకరోజు ఉద్యోగుల సమావేశం జరిగింది. కంపెనీ కొత్తగా ప్రవేశపెట్టిన సూపర్ మేధస్సు వ్యవస్థ ఉద్యోగులకు మిగిలిన ఆ కాస్త పనినీ ఆటోమేట్ చేయబోతోంది.
ఒక యువ ఉద్యోగి లేచి అడిగాడు: "సార్, ఈ సాంకేతికత వల్ల ఉద్యోగాలు తగ్గితే, మిగిలిన ఉద్యోగులకు సంస్థ ఏ విధమైన శిక్షణ ఇస్తుంది?"
చిట్టిబాబు ముఖంలో పాత భగవాన్ గారి ఛాయ కనిపించింది. "ఇది సంస్థ తీసుకున్న నిర్ణయం, మనం దాన్ని సానుకూలంగా స్వీకరించాలి."
"కానీ సార్, ఉద్యోగుల భవిష్యత్తు గురించి—"
"నెగెటివ్‌గా ఆలోచించకూడదు. మనకు కావలసింది క్రమశిక్షణ, టీమ్‌వర్క్, పాజిటివ్ యాటిట్యూడ్."
"సార్, ప్రశ్న అడగడం నెగెటివ్ థింకింగా?"
"అవసరం లేని ప్రశ్నలు అడగడం ప్రొడక్టివిటీకి మంచిది కాదు."
ఆ యువ ఉద్యోగి నిశ్శబ్దంగా కూర్చున్నాడు. ఆ సాయంత్రం చిట్టిబాబు అప్పటి ప్రముఖ వృత్తిపరమైన సాంఘిక మాధ్యమం అయిన 'లింక్డ్‌ఇల్యూషన్'లో ఒక వ్యాసం రాశాడు:
"భవిష్యత్ నాయకత్వం: జిజ్ఞాస, విమర్శనాత్మక ఆలోచన, మానసిక భద్రతతో కూడిన సంస్కృతిని నిర్మించడం."
వ్యాసం కింద ఐదు వందల మంది చప్పట్లు కొట్టారు. నూట ఇరవై మంది ఏకవాక్య కామెంట్లు పెట్టారు. అందరూ ఆయన నాయకత్వ దార్శనికతను ప్రశంసించారు; కానీ మరుసటి రోజు ఆఫీసులో మాత్రం ఎవరూ ప్రశ్నలు అడగలేదు.
స్పందన పనిచేసే విద్యాసంస్థలో కూడా పరిస్థితి భిన్నంగా ఏమీ లేదు. అక్కడ విద్యార్థులకు 'విమర్శనాత్మక ఆలోచన' అనే కొత్త సబ్జెక్టు ప్రవేశపెట్టారు.
మొదటి పాఠం: "ఎందుకు ప్రశ్నించాలి?"
రెండో పాఠం: "ఎలా ప్రశ్నించాలి?"
మూడో పాఠం: "ప్రశ్నలు అడిగేటప్పుడు టీచర్‌ను ఇబ్బంది పెట్టకుండా ఎలా ఉండాలి?"
నాలుగో పాఠం: "పరీక్షలో విమర్శనాత్మక ఆలోచనకు సంబంధించిన సమాధానాన్ని పాఠ్యపుస్తకంలో ఉన్న పదాలతోనే ఎలా రాయాలి?"
విద్యార్థులు ఈ నాలుగు పాఠాలను కంఠస్థం చేసి పరీక్ష రాశారు. అందరూ మంచి మార్కులు తెచ్చుకున్నారు.
ఆ విద్యాసంస్థ దేశంలోనే 'అత్యుత్తమ విమర్శనాత్మక ఆలోచనా సంస్థ'గా అవార్డు గెలుచుకుంది. అవార్డు స్వీకరిస్తూ స్పందన ప్రసంగించింది: "మా సంస్థ విద్యార్థుల్లో స్వతంత్ర ఆలోచనను ప్రోత్సహిస్తుంది. మా దగ్గర ప్రతి విద్యార్థికీ ప్రశ్నించే స్వేచ్ఛ ఉంది."
ముందు వరుసలో కూర్చున్న ఒక విద్యార్థి లేచి అడిగాడు: "మేడమ్, ఈ మాట నిజమా?"
స్పందన క్షణం ఆగింది. వేదిక మీదున్న నిర్వాహకుడు అలాంటి ప్రమాదకరమైన ప్రశ్నలు వస్తే ఏం చేయాలో అనే విషయంలో నిష్ణాతుడు!
మైక్ అందుకుని ప్రకటించాడు: "ప్రశ్నోత్తరాల సమయం ముగిసింది. దయచేసి అందరూ టీ కోసం వెళ్లండి."
అవార్డు ప్రదానం విజయవంతంగా ముగిసింది.
ఆ రాత్రి చిట్టిబాబు, స్పందన ఒక కాఫీ షాపులో కలుసుకున్నారు.
"గుర్తుందా?" అన్నాడు చిట్టిబాబు. "మన కాలేజీలో భగవాన్ గారు చాట్‌జిపిటి గురించి అడిగిన రోజు?"
"మర్చిపోలేను. అప్పుడు చాట్‌జిపిటి మొదటి మోడల్ ఉండేది, చాలా ప్రిమిటివ్ సిస్టమ్. అయినా ప్రశ్నలకు సమాధానాలు దొరకలేదు."
"ఇప్పుడు సమాధానాలు చెప్పడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటే ఎన్నోరెట్లు పవర్ఫుల్ సూపర్ ఇంటెలిజెన్స్ మోడల్ ఉంది. కానీ ఏ ప్రశ్న అడగాలో నిర్ణయించడానికి ఇంకా భగవాన్ గారే కావాలి!" ఇద్దరూ నవ్వుకున్నారు.
"నిజానికి మనం ఏం నేర్చుకున్నాం?" అని స్పందన అడిగింది.
చిట్టిబాబు కాసేపు ఆలోచించాడు. "పరీక్షలో ఏం రాస్తే మార్కులు వస్తాయో నేర్చుకున్నాం. ఉద్యోగంలో ఏం మాట్లాడితే ప్రమోషన్ వస్తుందో నేర్చుకున్నాం. సోషల్ మీడియాలో ఏం రాస్తే లైకులు వస్తాయో నేర్చుకున్నాం. సమావేశంలో ఎప్పుడు చప్పట్లు కొట్టాలో కూడా నేర్చుకున్నాం."
"మరి ఆలోచించడం?"
"అది నేర్చుకుంటే ఇన్ని విజయాలు సాధించేవాళ్లమో లేదో తెలియదు!"
స్పందన కాఫీ కప్పు కింద పెట్టింది. "ఒక విషయం మాత్రం అర్థమైంది. క్రమశిక్షణ పేరుతో ప్రశ్నలను చంపినప్పుడు, మనం తయారుచేసేది జ్ఞానవంతులైన మనుషులను కాదు... ఆదేశాలను చక్కగా పాటించే యంత్రాలను!"
చిట్టిబాబు తలూపాడు. "అందుకే కాబోలు ఇప్పుడు యంత్రాలకు మానవత్వం నేర్పించడానికి ప్రయత్నిస్తున్నాం, మనుషులకు మాత్రం ఇంకా ప్రశ్నించడం నేర్పించలేకపోతున్నాం!"
ఇద్దరూ బయటకు నడిచారు. కాఫీ షాపు గోడ మీద ఒక అందమైన నినాదం కనిపించింది:
"భిన్నంగా ఆలోచించు. ప్రతిదాన్నీ ప్రశ్నించు."
దాని కింద చిన్న అక్షరాలతో మరో వాక్యం ఉంది: "ఈ నినాదం గురించి ఎలాంటి ప్రశ్నలు అడగరాదు. యాజమాన్యం నిర్ణయమే అంతిమం."
చిట్టిబాబు ఆగి దాన్ని చదివాడు. "స్పందనా, ప్రపంచం మారిందంటావా?" అని అడిగాడు.
స్పందన నవ్వుతూ అంది: "ప్రపంచం చాలా మారింది. ఒకప్పుడు ప్రశ్నలు అడిగితే టీచర్ కోప్పడేవాడు; ఇప్పుడు ప్రశ్నలు అడిగితే ఆల్గోరిథమ్ నీ రీచ్ తగ్గిస్తుంది, బాస్ నీ పెర్ఫార్మెన్స్ రేటింగ్ తగ్గిస్తాడు, సమాజం నీకు నెగెటివ్ అనే ముద్ర వేస్తుంది."
"మరి పరిష్కారం?"
"ప్రశ్నలు అడగడం మానకూడదు. కానీ ప్రశ్నలు అడగడానికి ధైర్యం కావాలి, సమాధానాలు వినడానికి వినయం కావాలి, తప్పు అని తేలితే మారడానికి నిజాయితీ కావాలి."
చిట్టిబాబు చిరునవ్వు నవ్వి, "అంటే మన విద్యావ్యవస్థకు ఇంకా మూడు సబ్జెక్టులు అవసరమన్నమాట!" అన్నాడు.
"ఏమిటవి?"
"ధైర్యం, వినయం, నిజాయితీ."
"వాటికి మార్కులు ఎన్ని?"
చిట్టిబాబు కాసేపు ఆలోచించి అన్నాడు: "మార్కులు లేవు. అందుకే మన విద్యావ్యవస్థ వాటిని సిలబస్‌లో పెట్టదు!"
ఇద్దరూ నవ్వుకుంటూ వెళ్లిపోయారు. వాళ్ల వెనుక గోడ మీద మాత్రం ఆ నినాదం అలాగే ఉంది:
"భిన్నంగా ఆలోచించు. ప్రతిదాన్నీ ప్రశ్నించు."
ప్రపంచం ఆ నినాదాన్ని చదువుతోంది. పిల్లలు ఆ గోడను తమ ఐఫోన్లలో ఫోటో తీసుకుంటున్నారు... ఎందుకైనా మంచిదని కాబోలు!
దాన్ని గోడ మీద రాసిన వ్యక్తి ఎవరో తెలుసుకోవడానికి మాత్రం ఎవరూ ప్రయత్నించడం లేదు.
*****
📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!
మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.
✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి
👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y
వెంకట్ మంత్రిప్రగడ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం: వెంకట్ మంత్రిప్రగడ

పుట్టి పెరిగింది విశాఖపట్నంలో, స్థిరపడింది హైదరాబాద్ లో, చాలా కాలంగా బెంగళూరు లో ఉంటున్నాను...సాహిత్యాభిలాష చదవడం వరకే పరిమితమైంది...లాక్ డౌన్ సందర్భంగా కొంచం రాయడం కూడా ప్రారభించేసిన ఔత్సాహిక రచయితను...తెలుగు సాహిత్య ప్రపంచంలో గురజాడ, కుటుంబరావు, రావి శాస్త్రి, ముళ్ళపూడి, జ్యేష్ఠ, భరాగో, గొల్లపూడి, జలంధర, కేశవరెడ్డి గార్లు అభిమాన రచయితలు, శ్రీ శ్రీ గారు, సిరివెన్నెల వారూ అభిమాన కవులు...
ఇతర భాషా సాహిత్యాలలో మున్షీ ప్రేమ్ చంద్, మాక్సిం గోర్కీ, దోస్తోయ్వస్కీ, మొరావియా, ఆల్బర్ట్ కామూ, పౌలో కొయిలో, కన్నడం లో భైరప్ప లు కూడా చాలా ఇష్టమైన రచయితలు...
ఆధునిక రచయితల్లో యువల్ నోవా హరారీ, రాజా ఇవటూరి, సత్యం మందపాటి, అనిల్ అనంతస్వామి అభిమాన రచయితలు ...







Comments