top of page
Original.png

ఏకాకులు

7 hours ago
4 min read

ఏకాకులు తెలుగు సామాజిక కథలో ఒంటరితనాన్ని అనుభవిస్తున్న వృద్ధ మిత్రులు అనంతం, ఆనంద్

Ekakulu - Telugu Social Story | Susmitha Ramana Murthy

ఏకాకులు - తెలుగు సామాజిక కథ | సుస్మితా రమణ మూర్తి

Published In manatelugukathalu.com On 13/10/2026


“ఏకాకులు” సమ్మెట్ల వేంకట రమణమూర్తి రచించిన హృదయాన్ని కదిలించే తెలుగు సామాజిక కథ. వృద్ధాప్యంలో పిల్లలకు దూరంగా జీవించే తల్లిదండ్రుల ఒంటరితనాన్ని, కుటుంబం మధ్యలో ఉన్నా ఆప్యాయతకు నోచుకోని వృద్ధుల మానసిక వేదనను ఈ కథ సున్నితంగా ఆవిష్కరిస్తుంది.


తలుపు కొట్టిన శబ్దం విని, అనంతం తలుపు తీశాడు. ఎదురుగా ఆనంద్. ఇద్దరూ మంచి స్నేహితులు, సహోద్యోగులు. పదవీ విరమణ చేసిన విశ్రాంత జీవులు.


"ఏంట్రా! ముఖం వెలిగిపోతోంది!? ఏమైనా విశేషమా?"

చరవాణిలోని వాయిస్ మెసేజ్ వినిపించాడు అనంతం.


"డాడీ! మేమంతా ఈనెల ఇరవయ్యో తేదీన మనింటికి వస్తున్నాం. నీవు విమానాశ్రయంకి రావద్దు, మేమే వచ్చేస్తాం. ఫ్లైట్ సమాచారం మెసేజ్ పెడతాను."


"వాడు పిల్లలతో వస్తున్నాడు. బూజులు దులిపించాలి, ఇల్లంతా శుభ్రం చేయించాలి."


"గాభరా పడకురా! నాకు తెలిసిన మంచి పనివాడిని పంపుతాను, అన్నీ వాడే చేస్తాడు.


మీవాడు అమెరికా నుంచి వస్తున్నందుకు చాలా సంతోషంరా! మళ్లీ వస్తాను," ఆప్యాయంగా భుజం తట్టి వెళ్లిపోయాడు ఆనంద్.


"ఆనంద్! రేపు మధ్యాహ్నమే మావాడు వస్తున్నాడు కదరా! నీవు తోడు వస్తే నాకు ధైర్యంగా ఉంటుంది. ఉదయమే టిఫిన్ చేసి వెళ్దాం, వచ్చేముందు ఫోన్ చేయి."


"విమానాశ్రయానికి రెండు గంటల ప్రయాణం మనకు. హైరానా పడి వెళ్లడం దేనికి? మీవాడు రావద్దని మెసేజ్ పెట్టాడు కదరా? వాళ్లు వస్తారులే!"


"వాడు అలాగే అంటాడు, నాతో నీవు వస్తున్నావు... అంతే!"

మిత్రుని మాట కాదనలేకపోయాడు ఆనంద్.


"ఒంటి గంటవుతోంది. విమానం రావడానికి ఇంకా రెండు గంటల టైముంది. తొందరగా భోజనం చేసి బయల్దేరుదామంటే విన్నావు కాదు."


మిత్రుని అసహనం పట్టించుకునే స్థితిలో లేడు అనంతం. డిస్ప్లే బోర్డు వైపు, అరైవల్ గేటు వైపు తదేకంగా చూస్తున్నాడు. తన ఆలోచనలన్నీ పిల్లల వైపే ఉన్నాయి.


"పదరా, కాఫీ తాగి వద్దాం."


కాదనలేదు అనంతం.


అరగంట తర్వాత ఇద్దరూ వచ్చి, డిస్ప్లే బోర్డుకి ఎదురుగా కూర్చున్నారు.


ఆనంద్ సంచిలోంచి దినపత్రిక తీసి చదవడంలో లీనమైపోయాడు. అనంతం చేతి వాచీ వైపు పదే పదే చూసుకుంటున్నాడు. ఆనంద్ చేతిలో పేపరు జారిపోయింది, తను కునికిపాట్లు పడుతున్నాడు.


"లేవరా లే! మావాడి విమానం వచ్చేసింది!" మిత్రుని భుజం తడుతూ సంతోషంగా చెప్పాడు అనంతం.


"వాళ్లు బయటకు రావడానికి కనీసం మరో గంటైనా పడుతుంది. లగేజ్కి కస్టమ్స్ వారి క్లియరెన్స్ అవ్వాలి," కింద పడిన పేపరు తీసుకుంటూ చెప్పాడు ఆనంద్.


ఉత్సాహంగా లేచిన అనంతం, నిరుత్సాహంగా కూర్చున్నాడు.


గంట గడిచింది. మరో అరగంట కూడా గడిచింది. వాళ్లు బయటకు రాలేదు. అనంతం ముఖం కళ తప్పింది.


"నీ ఫోను మోగుతోంది చూడరా!"

అనంతం ఆత్రంగా ఫోను చూశాడు.


"డాడీ! నాకు ప్రమోషను వచ్చింది, ప్రోగ్రామ్ కేన్సిల్ అయింది. మేము బయల్దేరలేదు..."

అనంతం హతాశుడయ్యాడు. ఫోన్లో కొడుకు మాట్లాడుతున్నాడు, అనంతం వినటం లేదు. పిల్లలు కళ్లలో కదులుతున్నారు. ఆనంద్ ఫోను తీసుకుని వినసాగాడు.


"డాడీ! జీతం బాగా పెరిగింది. ఇకమీదట నెలనెలా యాభై వేలు మీకు పంపిస్తాను. రెండేళ్ల క్రితం వచ్చినప్పుడు వాషింగ్ మిషన్ సరిగ్గా పని చేయలేదు, కొత్తది కొనండి. అలాగే టీవీ కూడా. మీ ఎకౌంట్లో అవి కొనేందుకు సరిపడా డబ్బు వేస్తాను.


మీరు దేనికీ ఇబ్బంది పడకండి. ఏంకావాలన్నా చెప్పండి. మీరు ఇక్కడికి వచ్చేస్తే బాగుంటుంది కదా? మాది రాలేని పరిస్థితి. మిమ్మల్ని చూడాలని ఉంది. ఈ ఏడాది రావడం అవ్వదు, వచ్చే సంవత్సరం ప్రయత్నిస్తాను. బై డాడీ!"


ఫోనులో మాటలు ఆగిపోయాయి.


"నీవింతలా బాధపడడం దేనికిరా! నీ కొడుకు బంగారం! ఎక్కడున్నా తన ధ్యాసంతా నీ గురించే! సంతోషంగా ఉండరా! తనకు వీలైనప్పుడే వస్తాడులే! కాదంటే అక్కడకు నీవే వెళ్లు, శేష జీవితం విదేశాలలో హాయిగా గడిపేసేయ్."


మిత్రుని ఓదార్పుకి నిర్లిప్తంగా నవ్వుకున్నాడు అనంతం. ఆ నవ్వులో జీవం లేదు, అసంతృప్తి ఉంది, నిట్టూర్పు ఉంది.


'తనుంటే నా బాధను అర్థం చేసుకునేది... అదృష్టవంతురాలు! ముందే వెళ్లిపోయింది. నాకు అన్నీ ఉన్నాయి, తోడుగా తను లేదు. వాళ్లు అమెరికాలో, నేనిక్కడ. డబ్బుకి ఇబ్బంది లేదు.


విశాలమైన ఇంటిలో నేనే రాజుని, మంత్రిని... సేవకుణ్ణి! సమస్తం నేనే! అందరికీ డబ్బుతో వచ్చే సుఖాలే కనిపిస్తాయి; గుండె లోతుల్లోని బాధ ఎవరికీ కనిపించదు... "డాడీ! తొమ్మిదవుతోంది, ఈ మాత్ర వేసుకుని పడుకోండి... తాతా! మేము నీదగ్గరే పడుకుంటాం... మావయ్య గారూ! ఈ సిరప్ వేసుకోండి, దగ్గు వెంటనే తగ్గిపోతుంది" అన్న అభిమానం, ఆప్యాయతలు డబ్బుతో కొనలేనివని వాడికి అర్థమయ్యేది ఎప్పుడో? పుట్టి పెరిగిన ఊరుని వదిలి, ఈ వయసులో నేనెలా అక్కడకు వెళ్లగలను? వెళ్లి నా అనారోగ్య సమస్యలతో వాళ్లను ఎలా బాధ పెట్టగలను? అక్కడ వెంటనే డాక్టర్ల అప్పాయింట్మెంటు దొరకదు, వైద్యం చాలా ఖరీదు!...'


అనంతం కుమిలిపోతున్నాడు. ఆనంద్ మిత్రుని బాధ చూసి, ఏమీ చేయలేక మౌనంగా ఉండిపోయాడు.


'నీ బాధ నాకు అర్థమవుతోందిరా! ఇద్దరి బాధ ఒక్కటే! నీవు బయటపడుతున్నావు, నేను లోలోనే బాధపడుతున్నాను.


మావాళ్లంతా ఇక్కడే ఉన్నా, ఆప్యాయత అనురాగాలకు నోచుకోని ఒంటరి జీవిని! ఏకాకిని!! అర్థాంగి ఎప్పుడూ కూతురు దగ్గర బెజవాడలో ఉంటుంది, తనను పట్టించుకోదు. కొడుకు, కోడలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఎప్పుడూ ల్యాప్‌టాప్‌ల ముందే ఉంటారు.


ఇద్దరు మనవలవి హాస్టల్ చదువులు. పండుగ నాడైనా అందరం మనసారా కబుర్లు చెప్పుకుంటూ సంతోషంగా భోజనం చేసే అదృష్టం లేని బతుకు నాది.


బాధను దిగమింగి మొండిగా బతికేస్తున్నానురా!... అందరిలో ఉంటున్న ఏకాకిని నేను! అందరికీ దూరమైన ఏకాకివి నీవు! ఇద్దరం ఏకాకులమే!...'

అది ఆనంద్ మనసులోని బాధ!



 / సమాప్తం /

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^



📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y


సుస్మితా రమణ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం

  ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


సమ్మెట్ల వెంకట రమణ మూర్తి

రచయిత పరిచయం : సమ్మెట్ల వెంకట రమణ మూర్తి

కలం పేరు : సుస్మితా రమణ మూర్తి

పుట్టుక, చదువు, వుద్యోగం, స్వస్థలం .. అన్నీ విశాఖలోనే.

విశ్రాంత జీవనం హైదరాబాద్ లో.

కథలు, కవితలు, కొన్ని నాటికలు .. వెరసి 300 పైచిలుకు వివిధ వార, మాస పత్రికలలో ప్రచురితమయ్యాయి. ఆకాశవాణి లో కూడా ప్రసారం అయ్యాయి.

బాగా రాస్తున్నవారిని ప్రోత్సహిస్తూ , కలం కదిలితే రాయాలన్న తపనతో

      మీ సుస్మితా రమణ మూర్తి.


 

 

 

 

 

 





 

 

 



 




 


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page