నారద ఆంటీ!

Naradha Aunty! - Telugu Social Story | Penumaka Vasantha
నారద ఆంటీ! - తెలుగు సామాజిక కథ | పెనుమాక వసంత
Published In manatelugukathalu.com On 13/10/2026
నారద ఆంటీ ఒక చక్కని తెలుగు సామాజిక కథ. ఇతరుల వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవడం, గాసిప్ చేయడం, విమర్శించడం వల్ల సంబంధాలు ఎలా దెబ్బతింటాయో ఈ కథ వివరిస్తుంది. ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన జీవిత పాఠాన్ని అందించే కథ ఇది.
కొత్తగా అపార్టుమెంట్లోకి వచ్చాం. ఎదురింటి సువర్చల వచ్చి పరిచయం చేసుకుంది. నేను కొంచెం తక్కువ మాట్లాడేదాన్ని కాబట్టి, ఆవిడ మాట్లాడుతుంటే వింటూ ఉన్నాను.
"నేనే లొడాలొడా మాట్లాడుతున్నాను, నువ్వేమీ మాట్లాడటం లేదు. నేను నీ ఎదురుగానే ఉంటాను. ఏమైనా కావాలంటే మొహమాటం లేకుండా అడుగు.
అవును, అల్లం ఉందా? ఇలాంటి చిన్నదాని కోసం లిఫ్ట్ దిగి వెళ్లాలి," అంటూ నా ముఖంలోకి చూసింది.
"ఉందండి...!" అంటూ ఇచ్చాను.
"సరే వస్తాను. నువ్వు నీ పక్కింటి ఆమెతో ఎక్కువ మాట్లాడకు. కొంచెం ఆమెకు బాగా చదువుకుని ఉద్యోగం చేస్తోందని గర్వం. సరే, పనయిన తర్వాత రా.
నువ్వు నాకన్నా చిన్నదానివి, 'నువ్వు' అంటే పర్లేదుగా?"
"అయ్యో, పర్లేదు! 'వసుధ' అనే పేరుతో పిలవండి."
"అలాగే...!" అంటూ వెళ్లాడు.
ఆ తర్వాత లిఫ్టులో పక్కింటి ఆవిడ పలకరించింది.
"కొత్తగా వచ్చారా? ఏం చేస్తారు మీరు?"
"అవునండి. జాబ్‌కు అప్లై చేస్తున్నాను, ఏదైనా వస్తే జాయిన్ అవుతాను," అన్నాను.
"మీకు ఏదైనా కావాలంటే అడగండి."
అలాగేనని తల ఊపాను. 'సువర్చల ఆంటీ ఈవిడకు పొగరని చెప్పింది, కానీ బాగా మాట్లాడారు' అనుకున్నాను మనసులో.
సువర్చల ఆంటీ రోజూ వచ్చి మాట్లాడేది.
మా పనమ్మాయి చెప్పింది, "మీ ఎదురింటి సువర్చలమ్మను 'నారద ఆంటీ' అంటారండి. అందరికీ తగాదాలు పెడుతుంది. ఇదివరకు ఆవిడ దగ్గర పని చేసేదాన్ని.
అందరి విషయాలు చెప్పమని గొడవ చేసేది. నేను చెప్పడం లేదని నన్ను మానిపించింది. ఎవరూ ఆవిడ దగ్గర చేయరండి," అని నవ్వుతూ చెప్పింది.
మా ఆయన కూడా, "వసుధ! ఆమెతో జాగ్రత్తగా ఉండు. అసలే మనం కొత్తగా దిగాము. అందరి గురించి మనకు చెప్పే ఆవిడ, మన మీద ఇంకొకరికి చెప్పదని గ్యారెంటీ లేదు," అన్నాడు.
నిజమే అనిపించింది.
ఒకరోజు నేను శ్రావణ మాసం తాంబూలం ఇద్దామని ఇంటికి వెళ్లాను. అక్కడ ఉన్న ఆమెతో చెప్తూ ఉంది:
"మా ఎదురింటి పిల్ల వసుధకు చాలా పొగరు. నేను వెళ్లి కబుర్లు చెప్పి రావడమే... తను రాదు.
పెళ్లై మూడేళ్లవుతున్నా ఇంకా కడుపు లేదు, కాయా లేదు. నేను ఇవాళ తాంబూలం ఇద్దామనుకున్నాను... అమ్మో! గొడ్రాలుకు ఎందుకులే అని ఊరుకున్నాను," అని అంటుండగా నేను లోపలికి వెళ్లాను.
"ఆంటీ! తాంబూలం ఇమ్మంటారా? లేదా? ఎందుకంటే నేను గొడ్రాలును కదా?" అన్నాను.
మనిషి బిక్కచచ్చిపోయి, "ఆ... ఇవ్వమ్మా!" అంది.
"ఏమోలే ఆంటీ! మళ్లీ నా దగ్గర తాంబూలం తీసుకుంటే మీకు ఏమైనా అవుతుందేమో? ముందు అసలు మీ పిల్లలకు పెళ్లిళ్లు అయితే... అప్పుడు మీరు నన్ను ఏదైనా అన్నా బాగుంటుంది.
ఇద్దరు మగపిల్లలు నాకన్నా పెద్దవాళ్లని మీరే చెప్పారు. నాకు ఇవాళ కాకపోతే రేపైనా పిల్లలు పుడతారు. మీ పిల్లలకు ఏజ్ దాటితే పెళ్లిళ్లు అవ్వవు, పెళ్లిళ్లు కాకపోతే పిల్లలు పుట్టరుగా!"
అంటూ తాంబూలం ఇచ్చి బయటపడ్డాను.
ఆ తర్వాత ఆంటీ మా ఇంటికి రాలేదు.
పక్కింటి శాంతి, "ఎందుకు వసుధ, నారద ఆంటీతో ఏదో అన్నావుట? నీకు పొగరని నాకు మొన్న ఇంటికి వచ్చి మరి చెప్పింది," అంది.
"పోనీలే... అంటే అననీ అక్కా! కానీ నన్ను ఆ మాట అంది," అని చెప్పి బాధపడ్డాను.
"ఊరుకో వసుధ, ఆవిడ అనడం తీసివేయి. జాబ్ తర్వాత వస్తుంది, ముందు పిల్లల్ని కను. ఆమె మాటల్ని నిజం చేయి," అంది శాంతి.
"నిజం చేశాను అక్కా...!"
"అంటే... నువ్వు...!" అన్న శాంతితో "మూడో నెల" అంటూ వేళ్లు చూపించాను.
పనిమనిషి, "అమ్మా! నారద ఆంటీ ఇల్లు ఖాళీ చేస్తున్నారు," అంది.
"ఎందుకు?" ఆశ్చర్యపోతూ అన్నాను.
"వాళ్ల పెద్దబ్బాయి వేరే కులం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడంట. ఇక ఇక్కడ ఉండలేకపోతున్నారు. అసలు ఆవిడ ఆ దిగులుతో లేచి తిరగడం లేదు, మంచంలోనే ఉంటున్నారు," అంది.
మనసులో బాధ అనిపించింది. ఒకసారి వెళ్లి మాట్లాడాలి అనుకుని సువర్చల ఆంటీ ఇంట్లోకి అడుగుపెట్టాను.
మంచంలో పడుకుని ఉంది. నన్ను చూసి, "రా వసుధ...!" అంది.
"ఆంటీ, ఇల్లు ఖాళీ చేస్తున్నారా?"
"అవునమ్మా, మా ఊరు వెళ్తున్నాం. మా ఆయన రిటైర్ అయ్యారుగా?"
"కానీ మీరు ఇక్కడ ఉంటే హాస్పిటల్‌కు వెళ్లడానికి వీలవుతుంది. ఆ పల్లెటూరులో మీకు ఏం కుదురుతుంది? అయినా ఇక్కడ ఇంతమందిలో ఉండి అక్కడ ఉండగలరా?" అన్నాను అనుమానంగా చూస్తూ.
"ఇక్కడ ఉండి మా వాడు చేసిన పనికి ఎవరికీ మొహం చూపించలేము. చుట్టాలు ఇక్కడే ఉన్నారు, నాకు ఇక్కడ ఉండాలని లేదు," అంది దిగులుగా.
"ఆంటీ, ఈ స్వీట్ తీసుకోండి. నేను తల్లిని కాబోతున్నాను. నిజంగా మీరు ఆ రోజు గొడ్రాలు అన్న మాటకు కోపం వచ్చి ఇప్పుడు తల్లిని అయ్యాను. మీలాంటి వారు మాకు స్పీడ్ బ్రేకర్ లాంటి వారు. మీ విమర్శల వల్ల మమ్మల్ని మేము కరెక్ట్ చేసుకోగలము. మీరు లేకపోతే మాకు అపార్ట్మెంట్‌లో ఏమి జరుగుతుందో తెలియదు ఆంటీ! మీరు ఇక్కడే ఉండాలి."
(అప్పుడు నారదుడు లోక కళ్యాణం కోసం అయితే... మీరు మాలాంటి వారి కోసం) అనుకుని లోపల నవ్వుకున్నాను.
"వసుధ, ఏదో అన్నాను... మనసులో పెట్టుకోకు," అంటూ నా చెయ్యి పట్టుకుని అంది.
"లేదు ఆంటీ...!" అంటూ ఆమె చేతిని ప్రేమగా పట్టుకున్నాను.
"నువ్వు మంచిగానే తీసుకున్నావు. నేను నాకు అబ్బాయిలు అనే పొగరుతో విర్రవీగాను. ఏమైంది? వాడు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడు," అంది దిగులుగా.
"పోనీలే ఆంటీ! మీకు ఒక బాధ్యత తీరింది కదా, ప్రశాంతంగా ఉండండి," అంటూ మా ఇంటి వైపు కదిలాను.
***
📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!
మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.
✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి
👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y
పెనుమాక వసంత గారి కొన్ని ఇతర రచనలు:
పెనుమాక వసంత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం
ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
పేరు వసంత పెనుమాక, గృహిణి. రచనలు చేయటం, పాటలు వినటం హాబీస్.మన తెలుగు కథలకు కథలు రాస్తున్నాను. ధన్యవాదములు.












Comments