top of page
Original.png

అమ్మ నాతోనే ఉంది


తల్లి మరణించిన తర్వాత ఆమెను చూసిన కూతురిని ఓదార్చుతున్న తల్లి దృశ్యం

Amma Nathone Undhi - Telugu Emotional Story | Penumaka Vasantha

అమ్మ నాతోనే ఉంది - తెలుగు భావోద్వేగ కథ | పెనుమాక వసంత

Published In manatelugukathalu.com On 11/08/2026


“అమ్మ పోవటం ఏంటి?”—తల్లి మరణించి నెల రోజులు గడిచినా ఆ నిజాన్ని జీర్ణించుకోలేకపోయింది ఆ కూతురు. అమెరికా నుంచి సమయానికి రాలేక తల్లిని చివరిసారి చూడలేకపోయాననే బాధ ఆమెను వెంటాడుతూనే ఉంది. అలాంటి ఓ చీకటి రాత్రి, కరెంట్ పోయిన వేళ... తనకు ఎంతో సుపరిచితమైన అడుగుల చప్పుడు వినిపించింది. వెనక్కి తిరిగి చూసేసరికి ఎదురుగా తల్లి! అది నిజమా? కలా? తల్లి చెప్పిన మాటలు ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చబోతున్నాయని అప్పటికి ఆమెకు తెలియదు.


‘అమ్మ పోవడం ఏంటి?’ ఇంకా నాకు కలగానే ఉంది. ఏడుస్తూ ఉన్నాను. ఇంకా అమ్మ నాతోనే ఉన్నట్లు ఉంది. అమ్మ పోయి దాదాపు నెల రోజులవుతుంది.


ఆమె దగ్గర పనిచేసే వాళ్ళు కూడా, "అమ్మ మాకు కలలోకి వచ్చింది" అని ఫోన్లో చెప్తున్నారు.


‘ఏంటమ్మా? అందరికీ కనిపించి నాకు ఎందుకు నువ్వు కనపడవు. నేను నిన్ను చివరి చూపు చూడలేదని కోపమా?’ అని బాధపడుతూ వెనుక బ్యాక్యార్డులో కూర్చున్నా.


ఇంతలో కరెంట్ పోయింది.


కారు చీకటిని చీల్చుకుంటూ వస్తున్న అడుగుల చప్పుడు. ఆ అడుగుల చప్పుడు నాకు సుపరిచితమే.


అవును, అవి అమ్మవే...


“అమ్మా!” అంటూ అటు ఇటు చూశాను.


అప్పటివరకు వీస్తున్న గాలి స్తంభించింది. కాలం ఆగిపోయినట్లుంది.


అమ్మ ఒంటి నుండి వచ్చే జాస్మిన్ సెంట్ గుప్పుమని వచ్చింది. నా వెనుక నిలబడి భుజంపై చెయ్యి వేసింది. చెయ్యి తీస్తూ గిరుక్కున వెనక్కి తిరిగాను.


“అ...మ్మ....” ఆశ్చర్యపోతూ అమ్మ మొహంలోకి చూశాను.


అమ్మకు మొన్న నేను బర్త్‌డేకి కొనిచ్చిన చీరలో ఎంతో బాగుంది. మొహంలో అదే చిరునవ్వు. అమ్మను ఒకసారి కన్నులపండుగగా చూసుకున్నా.


“అమ్మా... అందరూ నీవు పోయావంటారు. కాదు కదూ!” అంటూ అమ్మ మొహంలోకి చూశాను.


“నేనెక్కడికి పోతాను నిన్ను వదిలి బుజ్జీ!” అన్న అమ్మ మాటలకు సంతోషం పట్టలేక “అమ్మా!” అంటూ అమ్మను అల్లుకుపోయాను.


“అమ్మా... నేను అమెరికా నుండి వచ్చేదాకా ఉండకుండా ఎందుకు నన్నొదిలి వెళ్ళావు? నేను నిన్ను చివరి చూపు కూడా చూసుకోలేకపోయాను. నేనేమి పాపం చేశాను. నువ్వు వెళ్ళినరోజే మా అబ్బాయి పెళ్లి. కనీసం నిన్ను చూసి తనివి తీరేలా ఏడవనీకుండా చేశావు. నీకు ఇది న్యాయమా?” అంటుంటే... నా కళ్ళలో ఆగని కన్నీటి చెలమ. నా బుగ్గల నుండి జాలువారుతోంది.


నా కన్నీటిని తుడుస్తూ, “నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళలేదమ్మా. అప్పుడు బాహ్యంగా ఉండేదాన్ని. ఇప్పుడు నీలోనే ఉన్నాను. ఊరుకో బుజ్జీ! ఏడవకు.. చెప్తున్నాగా!” అంటూ నన్ను సముదాయించింది అమ్మ.


“అమ్మా! నేను నిన్ను కడసారి చూసుకోలేకపోయాను. ఒక్క నెల ఆగలేకపోయావా? మా అబ్బాయి పెళ్లి సంగతులు చెప్పేదాన్ని. ఇప్పుడు ఎవరికి చెప్పను?” అంటూ అమ్మ మొహంలోకి చూశాను.


“బుజ్జీ, నీ ప్రతి పనిని నేను పైనుండి చూశాను. నీ చిన్నూ పెళ్ళి వేడుకలు అన్నీ ప్రశాంతంగా చూశాను. నువ్వు రోజు నా ఫోటో ముందు చెప్పే సంగతులు అన్నీ వింటున్నా. నన్ను చూసుకోలేదని... నువ్వు పదేపదే అనుకోకు. అయినా నువ్వు పోయిన నెలలో వచ్చి నన్ను చూసుకున్నావుగా? బంగారు! నా చివరి క్షణాలు నీ మాటలే నా చెవిలో మార్మోగాయి. ఇక ఎన్నాళ్లు ఉండాలి? ఇక్కడే శిల వేసుకుని ఉండాలా? ఇక అందరం ఇక్కడే ఉంటే భూమికి భారం అవుతాం.


“నా జీవిత ప్రయాణం అయిపోయింది. నేను ఇక పైకి చేరితే... ఇంకొంత మంది ఈ భూమి మీదకు వస్తారు” అంటూ ఆగని నా కన్నీటిని తన చీర కొంగుతో తుడిచింది.

“అమ్మా! ఈ నెలలో జరిగిన సంగతులు నీకు చెప్పాలి!” అంటూ తనివితీరా అమ్మకు చెప్పాను. అమ్మ ఒళ్ళో తల పెట్టి పడుకున్నా. అమ్మ తల నిమురుతూ ఉంటే... ఎంతో హాయిగా ఉంది.


“నేను లేనని నువ్వు దిగులు పడి ఏడుస్తూ కూచోకు బుజ్జీ. పుట్టటం, గిట్టటం అన్నవి ప్రతి జీవికి తప్పవు. దేవుళ్లకే అవతారాలు ముగించే టైమ్ వచ్చేసరికి తనువు చాలించారు. ఇక నేను ఎంత?


“నువ్వు నీ ఉద్యోగ బాధ్యతను నిర్వర్తిస్తూ... చిన్నారి పెళ్లి చేయి. అన్నట్లు నేను ఎక్కడికి వెళ్లలేదు. నీకు తోడుగా నేనుంటా.


“నా ఆకారం కనిపించకపోయినా నీ వెనుకనే ఉంటాను. నీ గుండె చప్పుడు నేనే! బుజ్జీ, నువ్వు నాకో సాయం చేయాలి.”


“ఏంటమ్మా? చెప్పు! వెంటనే చేస్తా...” అంటూ అమ్మ మొహంలోకి చూశాను.

“నేను లేకుంటే... మన వృద్ధాశ్రమం సరిగా సాగదు. అందరూ బయట పడతారు. నా ఆలోచనలు ముందుకు తీసుకెళ్లే మార్గం చూడు.


“నాలాగే ఎంతో మంది పిల్లలు తల్లులను వృద్ధాశ్రమంలో చేర్చి, ఇక్కడ సుఖాలు అనుభవిస్తున్నాము అనుకుంటే... అది వాళ్ళ ఆత్మవంచన అవుతుంది.


“వాళ్ళకి ముసలితనం వచ్చేదాకా మాలాంటి తల్లుల బాధ తెలియదు. తెలిసే లోపు మేము ఉండము. బతికినప్పుడు చూడరు కానీ చివరలో ఈ శ్రాద్ధ కర్మలు మాత్రం కాశిలో పెట్టాము, గయలో పెట్టాము అనే బదులు వాళ్ళ తల్లుల పేరు మీద వృద్ధాశ్రమంలో భోజనాలు పెడితే... ఆ వృద్ధులు సంతోషిస్తారు.


“తమ మాతృదేశానికి వచ్చి వాళ్ళ తల్లితండ్రులను చూస్తున్న వాళ్ళు ఎందరు? డబ్బు పంపటం కాదు, మేమున్నామనే ఒక స్పర్శ చాలు. చిన్నప్పుడు మా స్పర్శ కోసం తపించే పిల్లలు పెద్దయి ఆ స్పర్శను వదిలించుకోవాలని చూస్తారు. ఎందుకో అర్థం కాదు.


“నువ్వు ఈ దిశగా కృషి చేయి. నేను చివరి క్షణంలో నీ కోసం ఎదురు చూశాను. కానీ నీవు రాలేని పరిస్థితి.


“నాకోసం నువ్వు నిజంగా బాధపడితే... మన ఆశ్రమంలో ఎందరో అభాగ్యులు ఉన్నారు. వాళ్ళను చూసుకో.


ఇంకా వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ తల్లులను చివరి దశలో చూసుకోవటానికి ఇండియా వచ్చేట్లుగా వాళ్ళను ఒప్పించు. నాలాగా చివరి క్షణంలో తల్లితండ్రులను పిల్లల కోసం ఎదురు చూసేట్లు చేయకు. ఇదేనమ్మా నా చివరి కోరిక.”


ఇంతలో కరెంట్ రావటంతో పైన్ చెట్లలోకి అమ్మ అదృశ్యమైంది. నా చుట్టూ అలుముకున్న నిశ్శబ్దంలో అమ్మను చూశానన్న తృప్తి మిగిలింది. ఇక అమ్మ నాలోనే ఉందా? అన్న నిజాన్ని జీర్ణించుకుంటూ... లేచి ఇంట్లోకి నడిచాను.


వెంటనే ఆశ్రమానికి ఫోన్ చేశాను. ఆశ్రమం ఎలా నడుస్తుందని అడిగాను.

“మీ అక్కగారు చూస్తున్నారు. ఆవిడ ఇంకా ఈ నెల డబ్బు పంపలేదు. కొంచెం ఇబ్బంది పడుతున్నాం అమ్మా! మీ అమ్మ తులసమ్మగారు ఉంటే... అన్నీ చూసుకునేవారు.


“హఠాత్తుగా తులసమ్మగారు పోవటం మాకు చాలా బాధగా ఉంది. మేమందరం ఇక్కడ ఉండాలా? లేక ఇంకో చోటుకు పోవాలో తెలియటం లేదమ్మా...” అంటూ అక్కడి వరమ్మ అనే ఆవిడ కన్నీళ్లు పెట్టుకుంది.


“ఎక్కడికి పోనవసరం లేదు. మా అమ్మ తులసమ్మ పేరు మీద నడుపుతున్న ఈ తులసి వనం ఆశ్రమాన్ని ఇకనుండి నేను చూసుకుంటాను. నేను త్వరలోనే ఇండియా వస్తున్నాను. మీరు దిగులు పడకండి” అని చెప్పిన తర్వాత కాస్త నా ప్రాణం కుదుటపడింది.


ఆ తర్వాత వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నాను.

చిన్నారికి పెళ్లి చేసి రెండు సంవత్సరాల్లో ఇండియాకు పూర్తిగా వచ్చేసాను. అమ్మ ఆశయాలు తీర్చటానికి.


ఆశ్రమంలో ఉన్న వంద మంది వృద్ధులకు నేనే ఇప్పుడు కూతురును. వాళ్ళ పిల్లలు కూడా కొంతమంది నన్ను చూసి ఇండియాకు వచ్చేసి వాళ్ళ తల్లులను ఇంటికి తీసుకెళ్లారు. అప్పుడు వాళ్ళ కళ్ళ ఆనందంలో అమ్మను చూశాను.

అమ్మ ఫోటోకు చెప్పుకున్నా.


“అమ్మా! చూసావా? నీ ఆశయాలు నేను తీరుస్తున్నా. ఇదే కదా నీ కోరిక...” అంటూ దణ్ణం పెట్టుకుంటే... అమ్మ ఫోటో నుండి పువ్వు రాలి పడింది.


“అవును బుజ్జీ! ఎంతోమంది వీధిన పడకుండా ఇంత చేస్తున్నావు. ఇక నువ్వు నన్ను చూడలేదని, చూసుకోలేదని ఎట్లా అనుకుంటావు? తల్లి...” అన్నట్లుగా అమ్మ మాటలు వినిపించాయి.




పెనుమాక వసంత గారి కొన్ని ఇతర రచనలు:


పెనుమాక వసంత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం


  ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

Penumaka Vasantha

 రచయిత్రి పరిచయం:

పేరు వసంత పెనుమాక, గృహిణి. రచనలు చేయటం, పాటలు వినటం హాబీస్.మన తెలుగు కథలకు కథలు రాస్తున్నాను. ధన్యవాదములు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page