కురుక్షేత్ర యాత్ర – 5

Kurukshetra Yathra - 5 - Telugu Piligrimage Story | Annapurna Somayajulu
కురుక్షేత్ర యాత్ర – 5 - తెలుగు తీర్థయాత్ర కథ | అన్నపూర్ణ సోమయాజులు
Published in manatelugukathalu.com on 04/10/2026
కురుక్షేత్ర యాత్ర – 5
మర్నాడు 11.08.2026, మంగళవారం, మా యాత్రలో ఆఖరి రోజు.
ఉదయం ఎనిమిదిన్నర గంటలకు బయలుదేరాం.
పదకొండు గంటల ప్రాంతంలో కురుక్షేత్రం చేరాం.
ధర్మక్షేత్రం, కురుక్షేత్రం.
శమంతక పంచకం అనేది మహాభారతంలో ప్రస్తావించబడిన ఒక చారిత్రక, పవిత్రమైన ప్రదేశం. ఇది ప్రస్తుత హర్యానా రాష్ట్రంలోని కురుక్షేత్ర ప్రాంతానికి పాత పేరు. థానేసర్ అని స్థానికులు వాడుతున్నారు.
తర్వాతి కాలంలో కురు మహారాజు ఈ ప్రదేశంలో యాగం చేయడం వల్ల, ఇది పవిత్రమైన కురుక్షేత్రంగా మారింది.
హిందూ ఇతిహాసాల ప్రకారం, కౌరవ పాండవులు హస్తినాపుర సింహాసనం కోసం ఈ ప్రదేశంలో 18 రోజుల పాటు భీకరమైన యుద్ధం చేశారు.
ఈ స్థలాన్నే యుద్ధానికి ఎంపిక చేయడానికి మహాభారతంలో ఒక కారణం చెప్పబడింది, ఈ నేలపైన పాపము చేసినప్పటికీ ఆ పాపము ఆ నేల యొక్క పవిత్రత వలన క్షమింపబడుతుందట.
వసుదేవసుతం దేవం కంస చాణూరమర్దనమ్।
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్॥ 🙏
శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీత బోధించిన ప్రదేశం. 🙏
విశ్వరూపం చూపించిన ప్రదేశం. 🙏
భీష్ముడు 58 రోజులు అంపశయ్యపై ఉన్న ప్రదేశం. 🙏
పురాణాల ప్రకారం, పరశురాముడు 21 సార్లు భూమిని క్షత్రియ రహితంగా చేసి, ఆ క్షత్రియుల రక్తంతో ఐదు మడుగులను సృష్టించాడట. ఆ ఐదు మడుగులనే "శమంతక పంచకం" అంటారు.
సమయాభావం వల్ల మేము ఆ మడుగులను చూడలేకపోయాము.
బ్రహ్మ సరోవర్ హర్యానాలోని కురుక్షేత్రలో ఉన్న అత్యంత పవిత్రమైన తీర్థస్థలాల్లో మరొకటి. హిందూ సంప్రదాయంలో ఇది సృష్టికర్త బ్రహ్మదేవునితో మరియు మహాభారత కాలంతో అనుబంధం కలిగిన పవిత్ర క్షేత్రంగా భావిస్తారు.
ఇది ఒక విశాలమైన పవిత్ర జలాశయం.
పురాణ సంప్రదాయం ప్రకారం బ్రహ్మదేవుడు ఇక్కడ సృష్టికార్యాన్ని ప్రారంభించారని విశ్వాసం.
కురుక్షేత్రాన్ని ధర్మక్షేత్రంగా భావించడానికి బ్రహ్మ సరోవర్ కూడా ఒక ముఖ్య కారణం.
ఇక్కడ పవిత్ర స్నానం చేయడం ద్వారా పాపాలు తొలగి పుణ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం.
బ్రహ్మ సరోవర్‌లో సూర్యగ్రహణ సమయంలో పవిత్ర స్నానం చేయడానికి దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తారు.
యుద్ధానికి ముందు పాండవులు ఈ సరోవరంలోనే స్నానాలు, జపాలు చేసి బయలుదేరారనీ, యుద్ధానంతరం, యుద్ధంలో చనిపోయిన బంధువులకూ మిత్రులకూ ఈ సరోవరతీరంలోనే తర్పణాలు వదిలారనీ,
దుర్యోధనుడు భీముడి బారి నుంచి పారిపోయి దాక్కున్న మడుగు కూడా ఇదేననీ...
దుర్యోధనుని రక్తంతో తడిసిన శిరోజాలను ద్రౌపది ఈ సరోవరపు నీటితోనే శుభ్రం చేసుకుందనీ...
ఇలా అనేక రకాలుగా ఈ సరోవరం భారతంతో ముడిపడి ఉందని స్థానికుల కథనం.
కురుక్షేత్రం అంటేనే మహాభారత యుద్ధభూమి. శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను బోధించిన పవిత్ర భూమి ఇదే.
సరోవర్ చుట్టూ అనేక చిన్న దేవాలయాలు, పూజా స్థలాలు ఉన్నాయి.
కురుక్షేత్రలో జరిగే గీతా జయంతి వేడుకల సమయంలో బ్రహ్మ సరోవర్ ప్రత్యేకంగా అలంకరించబడుతుందట. దీపాలంకరణ, సాంస్కృతిక కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాలు ఆకర్షణీయంగా ఉంటాయని గతంలో చూసినవారు, స్థానికులూ చెప్పగా విని ఆనందించాం.
సాయంత్రం సమయంలో సరోవర్ చుట్టూ దీపాలు వెలిగినప్పుడు చాలా అందంగా ఉంటుందట. మేము మూడు గంటల ప్రాంతంలోనే వెనుతిరిగి వచ్చేయడం వలన ఆ అందాన్ని చూడలేకపోయాం. ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేసుకోవడానికి మాత్రం చాలా అనుకూలమైన వాతావరణం ఉంది.
బ్రహ్మ సరోవర్‌ను కేవలం ఒక నీటి కొలనుగా కాకుండా సృష్టి, ధర్మం, మహాభారతం, గీతా తత్వంతో అనుసంధానమైన పవిత్ర క్షేత్రంగా భక్తులు భావిస్తారు.
జ్యోతిసర్ హర్యానాలోని కురుక్షేత్రంలో ఉన్న అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి. హిందూ సంప్రదాయం ప్రకారం, మహాభారత యుద్ధం ప్రారంభానికి ముందు శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను బోధించిన ప్రదేశం ఇదే అని విశ్వసిస్తారు.
“జ్యోతిసర్” అనే పేరు జ్యోతి + సర్ నుంచి వచ్చింది. దైవజ్ఞాన ప్రకాశం వెలసిన స్థలంగా దీనిని భావిస్తారు.
ఇక్కడే శ్రీకృష్ణుడు అర్జునుడికి 18 అధ్యాయాలు, సుమారు 700 శ్లోకాలతో కూడిన భగవద్గీతను ఉపదేశించాడని పురాణ విశ్వాసం.
గీతా బోధ సమయంలో శ్రీకృష్ణుడు విశ్వరూపాన్ని అర్జునుడికి దర్శింపజేశాడని నమ్మకం.
ఇక్కడ ఉన్న ప్రాచీన వటవృక్షంను అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఈ మర్రిచెట్టు 5000 సంవత్సరాల కంటే పురాతనమైనదని నమ్ముతారు,
ప్రస్తుత వృక్షం ఆ ప్రాచీన వృక్షానికి వారసత్వంగా కొనసాగుతున్నదని స్థానిక సంప్రదాయం చెబుతుంది.
ఈ చెట్టు కింద శ్రీకృష్ణుడు గీతను బోధించాడనే విశ్వాసంతో భక్తులు చెట్టును దర్శించి ప్రదక్షిణలు చేస్తారు.
జ్యోతిసర్‌లోని ఈ వటవృక్షం భక్తులకు ప్రధాన ఆకర్షణ.
కురుక్షేత్ర యుద్ధభూమిలో తన బంధువులు, గురువులు, మిత్రులను చూసిన అర్జునుడు యుద్ధం చేయడానికి నిరాకరించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అతనికి కర్తవ్యం, ఆత్మ, కర్మయోగం, జ్ఞానయోగం, భక్తియోగం వంటి విషయాలను బోధించాడు.
ఆ ఉపదేశమే భగవద్గీతగా ప్రసిద్ధి చెందింది.
శ్రీకృష్ణుడు, అర్జునుడి రథం మరియు గీతా బోధ దృశ్యాలను సూచించే విగ్రహాలు ఇక్కడ చూడవచ్చు.
జ్యోతిసర్‌లో మహాభారతం మరియు భగవద్గీత కథాంశాలను ఆధునిక లైట్ & సౌండ్/మల్టీమీడియా ప్రదర్శనల ద్వారా చూపించే కార్యక్రమాలు కూడా ప్రసిద్ధి చెందాయి. వెళ్లే ముందు ప్రస్తుత షో సమయాలను నిర్ధారించుకోవడం మంచిది. మాకు కుదరలేదు, చూడలేకపోయాము. :(
ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు తన ప్రాణాన్ని వదలకుండా మొత్తం 58 రోజులు అంపశయ్యపైనే ఉండి భీష్ముడు ధర్మరాజుకు రాజనీతి, విష్ణుసహస్రనామం వంటి విశేష జ్ఞానాన్ని ఉపదేశించిన పవిత్ర ప్రదేశం.
అంపశయ్య, భీష్మ కుండం ఇవన్నీ కూడా అక్కడ శిల్పాల రూపంలో కనువిందు చేశాయి.
అక్కడే శివుణ్ణి స్థాణేశ్వర్ మహాదేవ్‌గా చూశాం. ఆ రోజు మాసశివరాత్రి కావడం మరొక విశేషం.
కురుక్షేత్రం లాంటి పవిత్ర ప్రదేశంలో, గీతాచార్యుడి సన్నిధిలో, మాసశివరాత్రినాడు మహేశ్వరుణ్ణి దర్శించుకోవడం ఒక అనిర్వచనీయమైన అనుభూతిని కలిగించింది. 🙏
తర్వాత భద్రకాళీ ఆలయం చూశాం.
ఓం జయంతీ మంగళా కాళీ భద్రకాళీ కపాలినీ।
దుర్గా క్షమా శివా ధాత్రీ స్వాహా స్వధా నమోస్తుతే ॥
శ్రీ దేవీకూప్, కురుక్షేత్రలో ఉన్న భద్రకాళి ఆలయం, సతీదేవి యొక్క శక్తిపీఠాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ సతీదేవి యొక్క కుడి చీలమండ పడిందని విశ్వసిస్తారు. ఇక్కడ అమ్మవారు భద్రకాళి రూపంలో కొలువై ఉన్నారు.
ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పలు ఫలకాల ద్వారా తెలిసిన విషయాలు...
శ్రీకృష్ణుడు మరియు బలరాముడి ముండన సంస్కారం (పుట్టువెంట్రుకలు) ఈ చారిత్రక ప్రదేశంలోనే జరిగిందట.
మహాభారత యుద్ధానికి ముందు, యుద్ధంలో విజయం సాధించాలని కోరుతూ పాండవులు అమ్మ భద్రకాళి దేవిని పూజించారట.
యుద్ధం అనంతరం వారు అమ్మవారికి గుర్రాలను సమర్పించారట. అందుకేనేమో, ఆలయ ప్రాంగణంలో అమ్ముతున్న చిన్న చిన్న గుర్రపు బొమ్మలను కొని భక్తులు ఆలయంలో సమర్పిస్తున్నారు.
భారతదేశంలోని భద్రకాళి దేవికి సంబంధించిన ప్రముఖ ఐదు ఆలయాలలో ఈ ఆలయం కూడా ఒకటి.
రాత్రి ఏడు గంటలకు రూమ్ చేరుకున్నాం.
********
12.08.2026, బుధవారం. ఉదయం ఐదున్నర గంటల సమయం.
మళ్ళీ కలవాలంటే, ఇప్పుడు విడిపోవాలిగా! :(
ఈ తొమ్మిది రోజులుగా చేరువైనవారందరికీ, బరువెక్కిన హృదయంతో వీడ్కోలు పలికి, చండీగఢ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి, 7:25 నిమిషాలకు 6E867 నంబర్ ఫ్లైట్‌లో బయలుదేరి, 9:15 నిమిషాలకు హైదరాబాద్ చేరాం.
ఈశ్వరుడు అనుగ్రహిస్తే, మరొక యాత్రా విశేషాలతో అతి త్వరలో మళ్లీ మిమ్మల్ని కలుస్తాను.
నమస్తే.
(సమాప్తం)
***
పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.
మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.
అన్నపూర్ణ సోమయాజులు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: అన్నపూర్ణ సోమయాజులు
పేరు : అన్నపూర్ణ సోమయాజులు. వెంపటి.
W/o. V.s. somayajulu.







Comments