వైష్ణోదేవి యాత్ర
- Annapurna Somayajulu Vempati

- 15 minutes ago
- 4 min read

Vaishnodevi Yathra - Telugu Piligrimage Story | Annapurna Somayajulu
వైష్ణోదేవి యాత్ర - తెలుగు తీర్థయాత్ర కథ | అన్నపూర్ణ సోమయాజులు
Published in manatelugukathalu.com on 02/09/2026
ఇల్లూ, సంసారం, బాధ్యతలూ... అన్నీ పక్కన పెట్టేసి, ఒంటరిగా, ఒక పదిరోజులు ప్రకృతి ఒడిలో గడిపిరావాలని ఒక కోరిక, ఎప్పటినుండో.
ఇన్నాళ్ళకు కుదిరింది. మరీ ఒంటరిగా అంటే, నాకు ఈ వయసులో, ఈ పరిస్థితుల్లో పూర్తిగా అసాధ్యం కనుక, ఇంటినుంచి ఒంటరిగా, సాయికృష్ణ ట్రావెల్స్ వారి ఆధ్వర్యంలో, ఒక గ్రూపుతో కలిసి వైష్ణోదేవి యాత్రకు బయలుదేరాను.
ఆగస్టు 4, 2026 ఉదయం బయలుదేరి ముందుగా ఢిల్లీ, అక్కడ నుంచి అమృత్ సర్ చేరాం.
సాయంత్రం భారత-పాకిస్థాన్ సరిహద్దు గ్రామం అటారీలో బీటింగ్ రిట్రీట్ చూసాం. అద్భుతమైన అనుభవం.
ఆ తర్వాత రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో అమృత్ సర్ స్వర్ణ దేవాలయం చూసాం.
నేను ముఖ్యంగా వైష్ణోదేవి, హిమాచల్ ప్రదేశ్ లోని మరికొన్ని అమ్మవారి ఆలయాల గురించి చెప్పదలచుకుని ఉన్నాను కనుక, బీటింగ్ రిట్రీట్, స్వర్ణ దేవాలయాల గురించి ఒక వాక్యంలో ముగించాను కానీ, ఆ రెండూ కూడా మాటలకందని అనుభూతిని పంచిన అనుభవాలే.
రాత్రి పన్నెండు గంటల ప్రాంతంలో హోటల్ కి చేరాం.
ఆగస్టు 5, 2026, బుధవారం.
ఉదయం ఎనిమిది గంటలకు అల్పాహారం ముగించి, మా బస్సుల్లో తొమ్మిది గంటలకు కత్రా బయలుదేరాం. అమృత్ సర్ నుంచీ దాదాపు పదిగంటల ప్రయాణం.
జమ్మూ కాశ్మీర్ లో ప్రవేశించగానే మా ఫోన్లు అన్నీ మూగపోయాయి.
పోస్ట్ పెయిడ్ ఫోన్లు మాత్రమే పనిచేస్తాయట.
ప్రపంచంతో సంబంధం లేకుండా, హాయిగా ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ కూర్చున్నాం. పది గంటల కాలమూ పది నిముషాలలో గడిచింది అనిపించింది నాకు మాత్రం.
సాయంత్రం ఆరున్నర గంటల ప్రాంతంలో, కత్రాలోని Tulip హోటల్ కి చేరాం. రోజంతా ప్రయాణపు బడలికవల్ల ఆ రోజుకిక విశ్రాంతివైపే మొగ్గాం అందరమూ.
ఆగస్టు 6, గురువారం, వైష్ణో దేవి యాత్ర:
జమ్మూ కాశ్మీర్‌లోని త్రికూట పర్వతాలపై కొలువైన దేవత మాతా వైష్ణో దేవి.
యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః ||
ముందు రోజు రాత్రి పది గంటల ప్రాంతంలో మొదలైన వర్షం అర్ధరాత్రి రెండు గంటలవరకూ ఆగకుండా కురుస్తూనే ఉంది.
హెలికాప్టర్లు క్యాన్సిల్ అయిపోతాయి, అమ్మవార్ని చూసే అవకాశం లేదనే అనుకున్నాం అందరమూ.
కానీ, తెల్లవారేటప్పటికి పూర్తిగా మారిపోయింది వాతావరణం. అమ్మవారికి మనసులోనే వేవేల నమస్కారాలూ, కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఉదయం ఆరున్నర గంటలకు బయలుదేరి హెలీపాడ్ కి చేరుకున్నాం.
నేను హెలికాప్టర్ ఎక్కడం మొదటిసారి. కంగారూ, భయమూ. నోటికొచ్చిన స్తోత్రాలు చదువుకుంటూ కూర్చున్నాను వరుసలో నా పేరు కోసం ఎదురుచూస్తూ.
మూడోసారో నాలుగోసారో వస్తుందనుకుని నిశ్చింతగా జపంలో మునిగిపోయిన నాకు "అన్నపూర్ణా" అన్న పిలుపు అరుపులా వినపడటంతో, ఒక్కసారిగా ఈ లోకంలోకొచ్చాను. వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి భయంతో.
ఆరోజున అది మొదటి ట్రిప్, మొదటి పేరు నాదే!!!
"మీరంతా అదృష్టవంతులు. వారం రోజుల తర్వాత ఈరోజే వాతావరణం అనుకూలించి హెలికాప్టర్లు ఎగురుతున్నాయి. మాతాదీ కీ బులావా హై" అన్నారు సెక్యూరిటీ వాళ్ళు. 🙏 నిజమే.
అక్కడివరకూ వచ్చి కూడా, అమ్మని చూడలేక వెనుతిరిగిన వారెందరో ఉన్నారట.
భయపడుతూ ఎక్కి కూర్చున్నాను. మరికాసేపట్లో ఎగరబోతుందనగా, గబగబా ఒక యువకుడు వచ్చి "కాస్త జరగండమ్మా" అంటూ (హిందీలోనే) నాపక్కనే కూర్చున్నాడు.
భయంతో బిగుసుకుపోయిన నాకు కాస్త ఊపిరి ఆడినట్లైంది. భయం పోగొట్టుకోవడానికి అతనితో మాట కలిపాను, 'స్టాఫా మీరూ, మీ పేరేమిటీ' అంటూ.
"ఔనమ్మా. నాపేరు ఈశ్వర్" అన్నాడు. అంతే. నా భయాలూ సందేహాలు పటాపంచలైనాయి. సాక్షాత్తూ ఆ ఈశ్వరుడే పక్కనుండి యాత్ర చేయిస్తున్నాడనే ధైర్యం అణువణువునా నిండిపోయింది.
*******
వైష్ణో దేవి ఆలయం భారతదేశంలోని అత్యంత పవిత్రమైన శక్తిపీఠాలలో ఒకటి. ఇది జమ్మూ కాశ్మీర్ లోని త్రికూట పర్వతాలపై, సముద్ర మట్టానికి 5200 అడుగుల ఎత్తులో ఉంది. ఇక్కడ అమ్మవారు గుహలో సహజంగా ఏర్పడిన మూడు పిండిల రూపంలో ఉంటారు.
మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి - ఈ మూడు పిండీలు మూడు శక్తులకు ప్రతీక.
సుమారు 98 అడుగులు పొడవున్న గుహ ద్వారా నడచి వెళ్ళి అమ్మవారిని దర్శించుకున్నాం.
ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు.
జమ్మూ లేదా కత్రా చేరుకుని, అక్కడి నుండి దాదాపు 13 కిలోమీటర్ల కాలిబాట లేదా హెలికాప్టర్ ద్వారా భవనాన్ని చేరుకుంటారు. మేము కత్రా వెళ్ళి అక్కడనుంచి హెలికాప్టర్ లో వైష్ణోదేవి ఆలయం చేరుకున్నాం.
కత్రా (Katra), యాత్రకు బేస్ క్యాంపు. జమ్మూ నుండి 45 కి.మీ దూరంలో ఉంది.
కత్రా నుండి బాణగంగ వరకు ఆటోలు లభిస్తాయి. ఇక్కడి నుంచే అసలు నడక యాత్ర మొదలవుతుంది.
నడక దారి సుమారు 13 కి.మీ ఉంది. ప్రత్యామ్నాయంగా గుర్రాలు, పిట్టూలు (పోర్టర్లు) మరియు పాలకీలు అందుబాటులో ఉంటాయి.
అర్ధకుమారి నుండి భవన్ వరకు బ్యాటరీ కార్లు నడుస్తాయి. కత్రా నుండి సంజిఛాట్ (Sanjichhat) వరకు హెలికాప్టర్ సేవలు అందుబాటులో ఉన్నాయి.
యాత్రకు వెళ్లే ముందు తప్పనిసరిగా ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా ‘యాక్సెస్ కార్డ్ (RFID)’ పొందాలి. సాయికృష్ణ ట్రావెల్స్ వారు అడుగడుగునా సూచనలూ సలహాలూ ఇచ్చి చేయించడంతో శ్రమ తెలియలేదు.
హెలికాప్టర్ ద్వారా వెళ్లాలనుకునేవారు ముందే శ్రీ మాతా వైష్ణో దేవి పుణ్యక్షేత్రం బోర్డు అధికారిక వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవాలి.
బాణగంగ, చరణ్ పాదుక, అర్ధకుమారి మరియు భవన్ ముఖ్యమైన ప్రదేశాలు.
కత్రా, భవన్, అర్ధకుమారి ప్రాంతాలలో బోర్డు ఆధ్వర్యంలో గదులు మరియు డార్మిటరీలు అందుబాటులో ఉంటాయి.
స్థలపురాణం:
దక్షిణ భారతదేశంలో రత్నాకరుడు అనే భక్తుడు ఉండేవాడట. సంతానం లేని ఆ దంపతులు దుర్గామాతను ప్రార్థించగా, వారి భక్తికి మెచ్చి అమ్మవారు వారి ఇంట కన్యగా జన్మించింది. ఆ బాలికకు ‘వైష్ణవి’ అని పేరు పెట్టారు.
వైష్ణవి చిన్నతనం నుంచే శ్రీరాముని కోసం త్రికూట పర్వతాలలో తపస్సు చేయడం ప్రారంభించింది. ఆ సమయంలో భైరవుడు అనే రాక్షసుడు ఆమెను వెంబడించడంతో, ఆమె త్రికూట పర్వత శ్రేణుల్లోని ఒక గుహలో తలదాచుకుని 9 నెలల పాటు తపస్సు చేసింది. అమ్మవారిని కనుగొన్న భైరవుడు ఆమెతో యుద్ధానికి దిగగా, వైష్ణోదేవి మహాకాళి రూపం ధరించి భైరవుని శిరస్సును ఖండించింది.
మరణించే సమయంలో భైరవుడు తన తప్పును తెలుసుకుని పశ్చాత్తాపంతో అమ్మవారిని క్షమించమని వేడుకున్నాడు. అప్పుడు దయార్ద్ర హృదయమైన వైష్ణోదేవి అతనికి మోక్షాన్ని ప్రసాదించి, తనను దర్శించుకున్న భక్తులు తప్పకుండా భైరవనాథుడిని కూడా దర్శించుకుంటేనే వారి యాత్ర పరిపూర్ణమవుతుందని వరమిచ్చింది.
ఈ ఆలయంలో ఎలాంటి విగ్రహాలు ఉండవు. గుహ గర్భగుడిలో సహజంగా ఏర్పడిన మూడు శివలింగాకృతులను ‘పిండీలు’ అని పిలుస్తారు. ఇవి ముగ్గురు దేవతలైన మహాకాళి, మహాలక్ష్మి, మరియు సరస్వతీ స్వరూపాలుగా పూజించబడతాయి.
అమ్మవారి దర్శనం అయ్యాక భైరవ్ బాబా గుడికి వెళ్ళాం.
వైష్ణోదేవి ఆలయం నుంచీ ఇంకా పైకి, పైపైకి రోప్ వే లో ఆ ప్రయాణం, ఒళ్ళు జలదరించింది. చుట్టూ ఉన్న అద్భుతమైన ప్రకృతి అందాలు ఆ భయాన్ని మరిపించాయి.
కృష్ణశాస్త్రి గారి "ఆకులో ఆకునై..... ఈ అడవి దాగిపోనా.." పాట అక్షరమక్షరమూ అనుభవంలోకి వచ్చింది.
భైరవ్ బాబా దర్శనం చేస్తేనే యాత్ర సంపూర్ణమవుతుందని సంప్రదాయం చెబుతుంది.
దర్శనం చేసుకుని బయటకొచ్చేటప్పటికి, అప్పటివరకూ అనుకూలంగా ఉన్న వాతావరణం హఠాత్తుగా మారిపోయింది.
హెలికాప్టర్లు రద్దయినాయి. డోలీలూ, పుట్టీలూ అడ్డగోలుగా రేట్లు పెంచేసారు. బాటరీ కారు దొరకలేదు. గుర్రం ఎక్కాలంటే భయం.
చేసేదేంలేక కాళ్ళకు పని చెప్పాం. సాయంత్రం ఏడుగంటలకు కిందకు దిగాం, అక్షరాలా ఆరుగంటల నడక.
హోటల్ కి చేరగానే, టిఫిన్లు ముగించి, కాళ్ళకూ, నడుములకూ మూవ్ స్ప్రే చేసి, మర్నాటి ప్రయాణానికి సిద్ధపడుతూ, పడకలు చేరాం.
(సశేషం)
***
అన్నపూర్ణ సోమయాజులు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: అన్నపూర్ణ సోమయాజులు
పేరు : అన్నపూర్ణ సోమయాజులు. వెంపటి.
W/o. V.s. somayajulu.






Comments