ఈ వయసులో ఇదేం చోద్యం
- Lakshmi Sarma B

- 2 hours ago
- 8 min read

Ee Vayasulo Idhem Chodyam - Telugu Emotional Family Story | Lakshmi Sarma Thrigulla
ఈ వయసులో ఇదేం చోద్యం - తెలుగు భావోద్వేగ కుటుంబ కథ | లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ
(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)
Published In manatelugukathalu.com On 02/09/2026
“ఈ వయసులో ఇదేం చోద్యం” కథలో సత్యవతి దాదాపు యాభై ఏళ్ల దాంపత్య జీవితాన్ని గడిపిన తర్వాత ఒక కీలక నిర్ణయం తీసుకుంటుంది. భర్తకు మరో భార్య ఉందని తెలిసినా ఇన్నాళ్లు కుటుంబం కోసం అన్నింటినీ భరించిన ఆమె, పిల్లల బాధ్యతలు పూర్తయ్యాక తన జీవితాన్ని తాను ఎంచుకోవాలని నిర్ణయించుకుంటుంది. ఆమె నిర్ణయం కోర్టు వరకు వెళ్లినప్పుడు, భర్త వాదనలు, పిల్లల ఆలోచనలు, సమాజం చూపించే తీర్పులు అన్నీ ఒక్కొక్కటిగా బయటపడతాయి.
“సైలెన్స్ సైలెన్స్,” టేబుల్ మీద కొడుతూ చెప్పాడు కోర్టులో జడ్జి.
“యువరానర్, నా క్లయింట్ వేణుగోపాలరావు చాలా పేరు పలుకుబడి ఉన్న పెద్దమనిషి. అలాంటి ఆయనను… ఇన్నాళ్ళు ఆయనతో కాపురం చేసి ఇప్పుడాయనను కోర్టులో నిలబెట్టడం చూస్తుంటే ఇది కావాలనే చేస్తున్నట్టనిపిస్తుంది. వేణుగోపాలరావుగారి భార్యను కొన్ని ప్రశ్నలు అడగాలనుకున్నాను,” జడ్జిని అడిగాడు వేణుగోపాలరావు తరఫు లాయర్ కృష్ణమూర్తి.
“ప్రోసీడ్ ప్రోసీడ్,” అన్నాడు జడ్జి.
“చూడమ్మా… నేనడిగినదానికి అబద్ధం చెప్పకుండా నిజం చెప్పండి.”
“అబద్ధం చెప్పవలసిన అవసరం నాకు లేదు లాయరుగారు,” టక్కున లాయరు మాట పూర్తవకముందే చెప్పింది సత్యవతి, వేణుగోపాలరావు భార్య.
“మిమ్మల్ని చూస్తుంటే నాకాశ్చర్యంగా ఉంది! ఎందుకంటే మీరు, మీ వారు షష్టిపూర్తికి దగ్గరగా ఉన్నారు. ఇప్పుడు విడాకులు కోరుకోవడం ఏంటో? పోనీ ఇప్పటి కాలంలో కొత్తగా పెళ్లి చేసుకుని మనస్తత్వాలు సరిపడక విడాకులు తీసుకుంటున్నారు అంటే వాళ్ళు స్వేచ్ఛగా ఎవరి హద్దులు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా బతకాలనుకుంటున్నారు కాబట్టి విడాకులు తీసుకుంటున్నారు పోనీలే అది వాళ్ళిష్టం అనుకోవచ్చు. మరి మీరు జీవితానుభవంలో ఎన్నో ఒడిదుడుకులు నేర్చుకున్నవాళ్ళు, కష్టాలు సుఖాలు అనుభవించినవాళ్ళు మీరు విడాకులు ఎందుకు తీసుకుంటున్నారు?” అడిగాడు.
“చూడండి లాయరుగారు… నాకు విడాకులు తీసుకోవాలనిపించింది. ఆయనతో కలిసుండాలని నాకు లేదు. బాధ్యతలన్నీ తీరిపోయాయి. నా అవసరం ఆయనకు లేనప్పుడు నేనెందుకు అణిగిమణిగి ఉండాలి? దయచేసి నేనింతకంటే ఎక్కువగా చెప్పలేను జడ్జిగారు. ఒక ఆడదానిగా చాలా చితికిపోయాను. ఈ వయసులో విడాకులు తీసుకోవాలనుకున్నానంటే మీరు పెద్ద మనసుతో అర్థం చేసుకుని నా కోరికను తీర్చండి,” లాయరుతో చెబుతూనే రెండు చేతులు జోడించి జడ్జి వైపు అర్ధింపుగా అడిగింది.
“అదికాదమ్మా… ఇదేమి పిల్లలాటలు కాదు కదా! అసలు విషయం తెలుసుకోకుండా నిర్ణయం తీసుకోలేము. ఇద్దరి వాదోపవాదాలు విన్నాక ఏం చెయ్యాలో మేము చెబుతాము. నువ్వెళ్ళొచ్చు,” చెప్పాడు జడ్జి.
“సర్, నేను నా క్లయింట్ వేణుగోపాలరావును కొన్ని ప్రశ్నలు అడుగుతాను అనుమతివ్వండి,” అడిగాడు లాయరు.
“వేణుగోపాలరావుగారు… మీ భార్య మీ నుండి విడాకులు కోరుతున్నారు. దీనికి మీకు సమ్మతమేనా? ఇంకొన్ని రోజులలో షష్టిపూర్తి చేసుకునే ఈ వయసులో మీకు బాధగా లేదా ఈ విషయం? ఆవిడెందుకు అలా ప్రవర్తిస్తుంది? ఏమైనా మానసికమైన జబ్బుతో బాధపడుతుందా? మీరేమనుకుంటున్నారో ఒక్కసారి ప్రజాముఖంగా చెప్పండి,” అన్నాడు.
“నమస్కారం సర్… నేను నా భార్యను బాగుగానే చూసుకుంటున్నాను. తనకు తిండికి బట్టకు ఎలాంటి లోపం రానియ్యలేదు. పెళ్ళైన ఇన్ని సంవత్సరాలు నాతో ఉండి పిల్లలు, వాళ్ళ చదువులు, పెళ్ళిళ్ళు అన్ని అయిపోయాయి. మరిప్పుడెందుకు నా నుండి దూరంగా ఉండాలనుకుంటుందో నాకర్ధం కావడం లేదు. ఎంత బ్రతిమాలినా కూడా నా మాట వినడం లేదు. కానీ నాకు మాత్రం తనను విడిచిపెట్టాలని లేదు. నేను ఈ విడాకులకు ఒప్పుకోను. మీరే మాకు న్యాయం చెయ్యాలి,” అడిగాడు వేణుగోపాలరావు.
“యువరానర్, నోట్ దిస్ పాయింట్. నేనిలా అడుగుతున్నానని తప్పుపట్టకండి. మీ ఆవిడ ఎవరి సపోర్టుతోనైనా ఇలా చేస్తుందంటరా? ఆమెకు స్వంతంగా ఏమైనా ఆస్తిపాస్తులున్నాయా? అంటే పుట్టినింటివి,” వంకరగా సత్యవతి వైపు చూస్తూ అడిగాడు.
“ఇంకా నయం! ఎప్పుడో చిన్నప్పుడు నయాపైసా కట్నం లేకుండా పిల్లనిచ్చి పెళ్లి చేసి చేతులుదులుపుకున్నారు ఆమె తల్లిదండ్రులు. ఆనాటి నుండి ఇప్పటివరకు నేనే తనకు ఏది కావాలన్నా తీసి పెడతాను. కాకపోతే నాకొక బాధ్యత ఉంది. అది నా పెళ్లి కాకమునే నేనొకరిని పెళ్ళాడాను. మా తల్లిదండ్రులు నన్ను బెదిరించి ఈమెతో పెళ్లికి ఒప్పించారు. నేను మా పెళ్ళయ్యాక అన్ని విషయాలు చెప్పాను తనతో. అప్పుడు సరేనని ఇన్నాళ్ళు నాతో కాపురం చేసింది. నేను తనను బాగానే చూసుకున్నాను. మరి ఇప్పుడేంటో నాకు తెలియడం లేదు,” బాధపడుతూ చెప్పాడు వేణుగోపాలరావు.
“అబద్ధం! ఆయన చెప్పేవన్నీ మోసం వంచన మాటలు.”
“ఆర్డర్ ఆర్డర్… చూడమ్మా నువ్వు ఏమైనా చెప్పాలనుకుంటే బోనులోకి వచ్చి చెప్పు. లేదా నీ తరుపునా లాయరుంటే ఆయనకు చెప్పు,” సత్యవతి గట్టిగా అరుస్తుంటే మధ్యలోనే చెప్పాడు జడ్జి.
“సర్, నాకే లాయరు వద్దు. జరుగుతున్నది కళ్ళముందు కనపడుతుంటే ఇంకా లాయర్లు ఎందుకు సార్? ఇంతకు ముందే చెప్పారు కదా ఆ పెద్ద మనిషి తనకు ఇంకో భార్య ఉందని! నా పెళ్లి జరిగిన నాటి నుండి నేను అతనితో సంతోషంగా గడిపిన క్షణాలే లేవు. వారంలో రెండు రోజులు మాత్రమే ఇంటికి వచ్చే ఆయన నన్నేం సంతోషపెడతాడు?
తప్పదు కాబట్టి నన్ను తల్లిని చేశాడు. అది ఆయన కోరిక తీర్చుకోవడం కోసమే కానీ నన్నొక మనిషిగా నామీద ప్రేమతో కాదు. ఆవిడ బలవంతం మీద ఆ రెండు రోజులు వచ్చేవాడు. పిల్లల గురించి గానీ, నా గురించి గానీ ఏనాడు ఆలోచించని ఈ పెద్దమనిషి నాకు విడాకులు ఇవ్వడానికి నిరాకరిస్తున్నాడంటే వినే వాళ్ళకు, చూసే వాళ్ళకు చిత్రంగా అనిపిస్తుందేమో, నేనే తప్పుచేస్తున్నాను అనుకుంటారు,” చెప్పడం ఆపి కోపంగా భర్తవైపు చూసింది.
“చూడమ్మా, నువ్వు చెప్పేది వింటుంటే చిన్నపిల్లలు కథ చెప్పినట్టుంది. మీరిద్దరు అన్యోన్యంగా లేకపోతే పిల్లలెలా వచ్చారు? వాళ్ళను పెద్ద చదువులు చదివించి మంచి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేసారు. అవన్నీ మీ వారి అండ లేకుండానే జరిగాయా?"
"యువరానర్, తన భర్త వల్ల తను సంతోషంగా లేను అంటున్నారు కదా, ఈ వీడియోలు చూడండి సార్,” అంటూ లాయర్ కృష్ణమూర్తి ఒక కేసెట్ జడ్జికిచ్చాడు.
అందులో సత్యవతి, వేణుగోపాలరావు ఎంతో సంతోషంతో ఒకరితో ఒకరు నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు. అది వాళ్ళమ్మాయి పెళ్లి వీడియో. ఇంకో వీడియోలో అమ్మాయిని అత్తవారికి అప్పగింతలు పెడుతుంటే సత్యవతిని గుండెలకదుముకుని ఓదారుస్తున్న వేణుగోపాలరావు ఉన్నారు.
“ఇప్పుడు చెప్పండి సార్… ఆయనకు ప్రేమ లేదంటే మీరు నమ్ముతున్నారా? నిజంగా భార్యమీద ప్రేమలేకపోతే తనేడుపేదో తనే ఏడవని అని వదిలేసి ఉండేవారు కదా! దీన్ని బట్టి అర్థమౌతుంది ఏంటంటే ఆవిడ మనసులో ఏదో పెట్టుకుని నా క్లయింట్ వేణుగోపాలరావును బోనులో నిలబెట్టింది. పాపం ఆయన నాదగ్గరకు వచ్చి చాలా బాధపడినారు. ఆమె లేకపోతే నేనుండలేను అన్నారు,” వేణుగోపాలరావు వైపు చూస్తూ కన్ను మీటి చెప్పాడు లాయరు కృష్ణమూర్తి.
“ఏమ్మా, ఈ వీడియోలో నువ్వు మీ ఆయన బాగానే ఉన్నారు కదా! మరి నువ్వు చెప్పినది వింటుంటే నమ్మతగినదిగా లేదు. పోనీ మీరు ఏ ఉద్దేశంతో ఆయన మీద ఆభాండాలు వేస్తున్నారు? ఆయన ఇంకో ఆవిడతో ఉంటున్నాడన్న కక్షతో ఇలా చేస్తున్నారా?” అడిగాడు జడ్జి.
“మీరు చూస్తున్నది వందలమంది సమక్షంలో జరిగిన మా అమ్మాయి పెళ్లివేడుక. నలుగురిలో మంచి పేరు తెచ్చుకోవడానికి ఆ మాత్రం నటించకపోతే ఆయన పెద్దమనిషి ఎలా అవుతారు సార్? తెలిసి తెలియని వయసులో పెళ్లి చేసుకుని ఈయన దగ్గరకు వచ్చి ఇప్పటికి యాభై సంవత్సరాలు అవుతుంది.
అంటే ఆ మనిషి ఎలాంటి వాడో నాకంటే ఈ వీడియోలు చూసిన మీకేం తెలుసు? నేను సంతోషంగా గడిపిన క్షణాలంటే నా పుట్టింటిలో, నాకు పిల్లలు పుట్టినప్పుడే! మీరనుకుంటారేమో ఇన్నాళ్ళు ఎందుకు భరించావు, అప్పుడే ఎందుకు వదిలెయ్యలేదని. పవిత్రమైన భరతదేశంలో పుట్టిన ఏ స్త్రీ అయినా కష్టమైనా సుఖమైనా పుట్టింటి మెట్టింటి గౌరవాన్ని కాపాడడానికే చూస్తుంది.
తెలిసి చేసుకున్నా, తెలియక చేసుకున్నా ఒక్కసారి పెళ్ళంటూ జరిగి మెడలో మూడు ముళ్ళు పడ్డాయంటే చచ్చేంతవరకు ఆ తాళిని గౌరవిస్తూ బతుకుతుంది ప్రతి ఆడది. భర్త తాగుబోతైనా, తిరుగుబోతైనా భరిస్తూ ఆ ఇంటి వంశాన్ని నిలబెడుతుంది. అది స్త్రీ అంటే.”
“అబ్బో బలే చెబుతున్నావమ్మా! మరి ఇప్పుడు నువ్వు చెబుతున్న నీతులన్ని ఎవరినుద్దేశించి అంటా?” సత్యవతిని చూస్తూ ఎగతాళిగా అడిగాడు లాయరు కృష్ణమూర్తి, సత్యవతి మాటలకు మధ్యలో కలిగించుకుని.
“ఆర్డర్ ఆర్డర్… కృష్ణమూర్తిగారు, మీరు అలా ఎగతాళి చెయ్యడం సభ్యత కాదు. చూడమ్మా, ఇంత మంచి మాటలు చెబుతున్న నువ్వు ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నావంటే ఏదో బలమైన కారణమే ఉండాలి,” కృష్ణమూర్తిని మందలిస్తూ సత్యవతిని అడిగాడు జడ్జి.
“ఇన్నాళ్ళు ఆయన పట్టించుకోకపోయినా భరించుకున్నాను. బాధ్యతలు అయిపోయాయి, ఆయనెలా తిరిగితే నాకెందుకులే, ఏదో ఒక సమయంలో ఎప్పుడో ఒకసారి వస్తుంటాడు అనుకున్నాను. కానీ ఇప్పుడాయన నన్ను మొత్తం వదిలేసి ఆవిడ దగ్గరనే ఉండాలనుకుంటున్నాడట. అలాంటప్పుడు నేనెందుకు ఆయనకోసం బాధపడాలి చెప్పండి సార్,” ఆవేశంగా అడిగింది.
“అబద్ధం! వేణుగోపాలరావు అలా ఎప్పుడు అనడు. ఆయన ఇద్దరిని సమంగానే చూసుకుంటున్నాడు. లేనిపోని అబద్ధాలు చెప్పి డబ్బు గుంజడానికి ఇదో నాటకం. జడ్జిగారు, మీరు బాగా ఆలోచించి నా క్లయింట్ వేణుగోపాలరావుకు న్యాయం చెయ్యాలని కోరుతున్నాను,” చెప్పాడు లాయరు కృష్ణమూర్తి.
“అలాగే, ఒక్కసారి వేణుగోపాలరావును బోనులోకి పిలవండి. నిర్ణయం తీసుకునే ముందు ఆయన అభిప్రాయం కూడా కనుక్కుందాము,” అన్నాడు జడ్జి.
“సర్, ఈ లాయరుగారికి మా కుటుంబం గురించి ఏమి తెలియదు. చెప్పుడు మాటలు విని నన్ను అనరాని మాటలు అంటున్నారు. నేను ఆయనుండి నయాపైసా ఆశించడం లేదు. నా బతికేదో నేను బతకగలను. ఈ దేశంలో నాలాంటి అభాగ్యులను చేరదియ్యడానికి ఎన్నో వసతి గృహాలున్నాయి. ఎక్కడైనా తలదాచుకోగలను. దయచేసి నా దారిన నన్ను పోనివ్వండి జడ్జిగారు,” చేతులెత్తి నమస్కరిస్తూ ప్రాధేయపడింది.
“మిస్టర్, ఆవిడ చెబుతున్నది విన్నారు కదా! దానికి మీ సందేశం చెప్పగలరా? ఆమె మీ డబ్బుకు ఆశపడడంలేదు. మీ నుండి దూరంగా వెళ్ళాలనుకుంటుంది. దీనికి మీ సంజాయిషీ ఏంటో చెప్పండి,” అడిగాడు జడ్జి.
“ఏముంది? తనకు తన చిన్ననాటి స్నేహితుడు ఈ మధ్యలో కనిపించి చెప్పాడట. నీ కోసమే పెళ్ళిచేసుకోలేదని, చిన్నప్పటి నుండి ఈమెనే ఇష్టపడ్డాడట. తనను నేను మంచిగా చూడడం లేదని చెప్పింది. అందుకు ఆ మహానుభావుడు ‘మీ ఆయనకు విడాకులిచ్చి వస్తే నేను నిన్ను ఉంచుకుంటాను... సారీ, నిన్ను బాగా చూసుకుంటాను’ అన్నాడట. అందుకే నా మీద లేనిపోని అభాండాలు వేస్తుంది,” మనసులో ఉన్న అక్కసునంత వెలిబుచ్చాడు వేణుగోపాలరావు.
“అదికాదు, నువ్వు ఈమెను వదిలేసి ఆమె దగ్గరకు వెళ్ళిపోతాను అన్నావట. నిజమేనా?” అడిగాడు జడ్జి.
“అంటే అది… అది… ఆమెకు ఈ మధ్యలో ఆరోగ్యం బాగుండడంలేదు. చూసుకోవడానికి ఎవరులేరు. ఇక్కడకు తీసుకువస్తాను, నువ్వు సహాయం చేస్తావా అన్నాను, చెయ్యనంది. మరి నాకు తప్పదు కదా! సరే, నీ కర్మ నువ్వనుభవించు, నేను వెళ్ళి ఆమెతో ఉంటానని చెప్పాను. అంతే! ఇదిగో ఇలా రచ్చకీడ్చింది నన్ను,” అన్నాడు.
“విన్నారు కదండి ఆయన మాటలు… నేను ఒకటే చెప్పాను. ‘నీ దారి నువ్వు చూసుకో, నాదారి నేను చూసుకుంటాను’ అన్నాను. నా మీద కసితో ఇలా కోర్టు వరకు తీసుకువచ్చింది ఆయనే సార్! బయటకు వెళితే నేనెక్కడ సుఖపడిపోతానోనని కక్ష, గుట్టు చప్పుడు కాకుండా ఉండాలనుకున్నాను. కానీ ఇప్పుడాయన చెప్పారు కదా నా చిన్ననాటి స్నేహితుడని! నిజంగా ఆయనతో వెళ్ళిపోవాలని ఈ క్షణమే నిర్ణయించుకున్నాను. నా జీవితం చివరి దశలోనైనా నన్ను సంతోషంగా ఉండనివ్వండి. నాకే విడాకులు వద్దు, నాకెవ్వరి సహాయం వద్దు. నన్ను మన్నించండి జడ్జిగారు,” అంది.
“చూసారా చూసారా, మీతో కూడా ఎలా మాట్లాడుతుందో,” కోపంగా అరిచాడు వేణుగోపాలరావు.
“మిస్టర్ వేణుగోపాలరావు, ఆవేశం తగ్గించుకోండి. ఒక స్త్రీ కట్టుకున్న భర్తను వదిలిపెట్టిందంటే ఏదో ఒక కారణం ఉంటుంది. భర్త మంచివాడు కాదనో, తిరుగుబోతనో, సంపాదన లేదని, అస్తమానం కొడుతున్నాడని తెలిసి కూడా ఆ భర్తతో కాపురం చేస్తుంది. అది ఒకప్పుడు! అప్పట్లో చదువుకోకపోయేవారు. తల్లితండ్రులకు గంపెడు సంతానం, పెళ్ళి చేసి చేతులుదులుపుకున్నారంటే ఇక ఆమెకు అత్తిల్లే ఆమె జీవితం.
కానీ ఈనాడు పరిమిత సంతానం కలిగి పిల్లలను పెద్ద చదువులు చదివిస్తున్నారు. నచ్చిన సంబంధం చూసి పెళ్ళి చేస్తున్నారు. ఇద్దరు సమానస్కందులు ఒకరంటే ఒకరు ప్రేమగా ఉంటారు. కానీ ఒక్కమాటన్నా పడే రకం కాదు. ‘నువ్వెంత అంటే నువ్వెంత’ అనుకోవడం, కోర్టుకెక్కి విడాకులు తీసుకోవడం పరిపాటయిపోయింది. కానీ నీ భార్య సత్యవతి పెళ్ళైనప్పటినుండి నీకు మరో భార్య ఉందని తెలిసినా నీతో జీవితం గడిపింది. అవునా?” అవునన్నట్టుగా తలూపాడు.
“గడిచిన ఇన్నేళ్ళలో మీ కాపురంలో ఆమె ఎప్పుడన్నా మీతో గొడవపడి మిమ్మల్ని వదిలి వెళ్ళిందా? పోనీ నలుగురిలో ఎప్పుడైనా మీ పరువు తీసిందా? లేదు కదా! ఒకటి ఆలోచించండి, ఇన్నాళ్ళకు పైగా ఈ వయసులో ఆవిడ మీతో విడిపోవాలనుకున్నదంటే ఆమె మానసికంగా ఎంత బాధకు లోనైందో అర్థమౌతుంది.
ప్రతి భారత స్త్రీ పునీతగా భర్త చేతిలో పోవాలనుకుంటుంది. అలాంటిది ఆవిడ మిమ్మల్ని వదిలిపెడుతున్నదంటే ఆమె మనోవేదన అర్థచేసుకున్నాను. కాబట్టి ఆమెకు స్వేచ్ఛను జారీ చేస్తున్నాను,” సత్యవతి వైపు ఆప్యాయంగా చూస్తూ చెప్పాడు జడ్జి.
కళ్ళనిండా ఆనందభాష్పాలు నింపుకుని జడ్జివైపు చూస్తూ రెండుచేతులెత్తి దండంపెట్టింది సత్యవతి. తల కిందకు దించుకున్నాడు వేణుగోపాలరావు.
“చూడమ్మా, చివరగా నిన్నోక ప్రశ్న అడగాలనుకున్నాను. మీరు మీ పిల్లలదగ్గరకు వెళ్ళి ఉండొచ్చు. ఒంటరిగా ఉండాలని ఎందుకనుకుంటున్నారో తెలుసుకోవచ్చా?” చిరునవ్వుతో సత్యవతిని అడిగాడు.
“విత్తనం ఒకటి పెడితే చెట్టొకటి వస్తుందా చెప్పండి సార్? వాళ్ళు ఆయన సంతానమే, ‘నాన్న మాట వినాలి’ అంటారు. నాన్న చెప్పినట్టు వింటే సరిపోతుంది కదా, ‘అందరూ కలిసి ఉండండి’ అంటారే కానీ, ‘అమ్మా నాన్నతో ఇబ్బందిపడకు, మా దగ్గరకు వచ్చి ఉండమని’ ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు.
అలాంటిది నేను వాళ్ళకు బరువుగా ఎలా ఉండగలను చెప్పండి? మంచి మనసుతో నాకు విముక్తి ఇచ్చారు, మీ మేలు జన్మలో మరిచిపోను, వస్తాను సార్,” ముఖమంతా నవ్వు పులుముకుని చెబుతూ కోర్టు బయటకు వచ్చి తనకోసం ఎదురుచూస్తున్న చంద్రశేఖర్ దగ్గరకు వచ్చింది ఆనందంగా.
“అమ్మా ఏంటి నువ్వు చేస్తున్న పని? మా పరువు తీయ్యడం కాదా! నలుగురిలో మేము తలెత్తుకుని తిరగాలా వద్దా? మా అత్తగారు వాళ్ళు ఏమనుకుంటారు? ‘మీ అమ్మ ఈ వయసులో ఎవరితోనో లేచిపోయిందంటే రేపు మా పిల్లలకు పెళ్ళిళ్ళు అవుతాయా?’ అసలు నీ మనసెలా ఒప్పింది నాన్నను వదిలెయ్యాలని? ఏమనుకుంటున్నావమ్మా నీ గురించి నువ్వు,” కోపంగా అడిగారు తల్లిని అప్పుడే కారు దిగివచ్చిన కొడుకు రమణ, కోడలు పద్మ.
“ఓహో వచ్చారా! నేను చేసింది తప్పుగా అనిపిస్తుందా మీకు? నా వల్ల మీ పరువు మర్యాదలు పోతాయా? మరి ఇన్నాళ్ళు మీ నాన్న మరొకావిడతో ఉంటున్నాడంటే మీ పరువు మీ దగ్గర భద్రంగా ఉందా? ఏం, ఇన్నాళ్ళు మీ అమ్మ గుర్తుకురాలేదు గానీ ఈరోజు మీ నాన్నతో విడిపోయామనగానే నేను తప్పుచేసానని నాకు చెప్పడానికి వచ్చావా? ఇప్పుడు నేను ఎవ్వరి సలహాలు వినడానికి సిద్ధంగా లేను. నాకు నచ్చిన జీవితం నేను అనుభవిస్తాను. నువ్వెళ్ళొచ్చు ఇక,” అంది నిర్మొహమాటంగా.
“ఇతని అండ చూసుకుని నువ్వు ఇలా తయారయ్యావు. ఈయన నిన్ను పెళ్ళి చేసుకుంటాడా ఇప్పుడు? నలుగురిలో నువ్వు తిరగగలవా? నిన్నేమంటారో తెలుసా? ‘ఇతని ఉంపుడుగత్తేవంటారే’ కానీ, ‘అతని భార్యవని’ లోకంలో ఎవ్వరు నీకు విలువివ్వరు.”
“ఏం మాట్లాడుతున్నావురా కన్నతల్లిని పట్టుకుని మాట్లాడే మాటలేనా? నీకు ఏం తెలుసని? ఆమె మనసు పడిన బాధలు, ఆమె మౌనంగా భరించిన ఎన్నో రాత్రులు, కన్నీళ్లు కాలువలై పారుతున్నా పట్టించుకోని నాన్న గురించి తెలిసే మాట్లాడుతున్నావా?
అమ్మ మనోవేదన నీకెలా తెలుస్తుంది? అవున్లే, నువ్వు మగాడివే కదా! ఆ తండ్రి బుద్ధులు రాకపోతే వేరే ఎలా వస్తాయి?” తనకంటే పెద్దవాడని కూడా చూడకుండా చెంప చెళ్ళుమనిపించింది అప్పుడే వచ్చిన సత్యవతి కూతురు రాధ.
“రాధా, నువ్వు వచ్చావా? చూడు అమ్మ నాన్నను వదిలేసి అతనెవరో అతనితో వెళుతుందట. ఈ వయసులో ఇలాంటి పనిచెయ్యడం బాగుందా? ఇప్పుడు అతనిమీద మనసుపడి అతనితో వెళ్ళడమేంటి? అమ్మను నిలదియ్యాల్సింది పోయి నన్నే కొడతావా? నలుగురు ఏమనుకుంటారు?
‘అతను ఉంచుకున్నాడంటారు’, మనం తలెత్తుకుని తిరగగలమా? పైగా నేను తప్పుగా మాట్లాడానని నన్ను కొట్టావు. నీకు బుద్ధుందా అసలు? రేపు నీ ఇద్దరాడపిల్లలకు పెళ్ళిళ్ళు ఎలా అవుతాయనుకున్నావు? మీ అమ్మ యాభై ఏళ్ళ వయసులో ఎవరితోనో పోయిందట అంటే ఏం సమాధానం చెబుతావు?” చెల్లెలి మీద గట్టిగా అరిచాడు.
“నోర్ముయిరా రమణ… నాగురించి నీకేం తెలుసని పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? నేను ఇన్నాళ్ళు మీ నాన్నతో చేసింది అదే కదా? ఆయన అవసరానికి నా దగ్గరకు వచ్చాడే కానీ ఒక భర్తగా రాలేదు. ఆయన ప్రేమ, ఆయన సంతోషం అంతా అక్కడే! నన్నోక ఉంపుడుగత్తేగానే చూసాడు. అలాంటి ఆయనతో ఇంకా కలిసి ఉండవలసిన అవసరం నాకులేదు.
ఏమన్నావు? నాకు ఒక మనసుందని నువ్వనుకుంటున్నావా? మీ నాన్నను పెళ్ళి చేసుకున్నప్పుడే బండబారిపోయింది నా మనసు. ఇక ఇతనితో వెళుతున్నానంటే చిన్నప్పటి నా మీది ప్రేమను అలాగే కాపాడున్నాడు. నా కోసం అతను పెళ్లి కూడాచేసుకోలేదు. అలాగని మేమిప్పుడు పెళ్ళి చేసుకుని కాపురం చెయ్యాలనే ఉద్ధేశం మాకు లేదు.
మీలాంటి వాళ్ళు నోటికి వచ్చింది వాగుతుంటే మాకు సంబంధంలేదు. మేము పవిత్రమైన స్నేహంకోసం ఒకరికోసం ఒకరం తోడుగా ఉండాలనుకున్నాము. ఎవ్వరేమనుకున్నా నా ప్రయాణాన్ని ఆపలేరు. ఆపినా ఆగే శక్తి నాలో లేదు, సెలవు,” అంది. తన పక్కనే నిలబడి ధైర్యంగా మాట్లాడుతున్న సత్యవతి చేతిని అందుకున్నాడు చంద్రశేఖర్.
“అమ్మా… నువ్వు చేసిన ఈ మంచి పనికి ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒక ఆడదానిగా నేను హర్షిస్తున్నాను. ఏ స్త్రీ కి అయినా తన భర్త తనకే స్వంతం కావాలని కోరుకుంటుంది. కలలో కూడా తన భర్తను మరో స్త్రీ తో పంచుకోనివ్వదు. అలాంటిది మా నాన్నను పెళ్ళి చేసుకుని అతనికి వేరే భార్య ఉందని తెలిసి కూడా ఇన్నాళ్ళు నీలో నువ్వే మూగవేదన అనుభవించావు. నిన్ను పూర్తిగా నిర్లక్ష్యం చేసాడు కనుకనే నీకు ఒక ఆలంబన కావాలనుకున్నావు.
నిన్ను నిన్నుగా ఇష్టపడే మనిషి దొరికాడు, రెక్కలు వచ్చిన పక్షిలా గాలిలో తేలిపోవాలనుకున్నావు. అన్నయ్యా, మనం తనకు సానుభూతి తెలుపకున్న పరవాలేదు, ఆమెను ఉత్సాహంగా ఎగురనిద్దాం. అమ్మా నువెక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను,” తల్లిని గట్టిగా కౌగిలించుకుని చెప్పింది.
చంద్రశేఖర్ చెయ్యి పట్టుకుని ముందుకు నడిచింది సత్యవతి తన సంతోషాన్ని వెదుకుతూ.
******* ********** ********** **********
పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.
మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.
లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం
ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం : లక్ష్మి శర్మ త్రిగుళ్ళ
నా గురించి కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను, నేను సికింద్రాబాద్ లాలాపేటలో వుంటాను,
నాకు చిన్నప్పటి నుండి కథలు రాయడంమన్న చదవడంమన్న చాలా ఇష్టం, 1991 నుండి రాయడం మొదలుపెట్టాను, ఎక్కడ ఏ పేపర్ కనిపించినా రాసాను, కానీ ఎవరికి చూపలేదు చెప్పుకోలేదు, ఈమధ్యనే మా అమ్మాయిలు మావారు చూసి కథలు బాగున్నాయి కదా ఏదైనా పత్రికకు పంపమంటే పంపంస్తున్నాను, కర్నూలు గణేశ్ పత్రిక లో నేను రాసిన కవితలు కథలు చాలా వచ్చాయి.ఈ మధ్యలో నేను రాసిన కథలన్నీ ( మబ్బులు వీడిన ఆకాశం ) అనే కథల సంపుటి వచ్చింది, (కిన్నెర ఆర్ట్ పబ్లికేషన్స్) వారిచేత.
ఇంకా ముఖ్యంగా, (మన తెలుగు కథలు కామ్) యాజమాన్యం వారి ప్రోత్సాహం , నాకు ప్రశంసా పత్రాలు ఇవ్వడంతో నాలో ఇంకా ఉత్సాహం పెరిగింది.
మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుతూ,
లక్ష్మి శర్మ
లాలాపేట సికింద్రాబాద్
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.





Comments