top of page
Original.png

పెదనాన్న

పెదనాన్న, తెలుగు కుటుంబ కథ, వృద్ధాశ్రమం కథ, వృద్ధుల బాధలు, తల్లిదండ్రుల నిర్లక్ష్యం, భావోద్వేగ కథ, కుటుంబ విలువలు

అడుక్కునే స్థితికి చేరిన వృద్ధుడిని ప్రేమగా ఇంటికి తీసుకెళ్లి వృద్ధాశ్రమంలో ఆశ్రయం కల్పిస్తున్న మేనల్లుడిని చూపించే "పెదనాన్న" కుటుంబ కథ చిత్రం.
అడుక్కునే స్థితికి చేరిన వృద్ధుడిని ప్రేమగా ఇంటికి తీసుకెళ్లి వృద్ధాశ్రమంలో ఆశ్రయం కల్పిస్తున్న మేనల్లుడిని చూపించే "పెదనాన్న" కుటుంబ కథ చిత్రం.

Pedananna - Telugu Emotional Family Story | Penumaka Vasantha

పెదనాన్న - తెలుగు భావోద్వేగ కుటుంబ కథ | పెనుమాక వసంత

Published In manatelugukathalu.com On 13/07/2026


సంతానం ఎక్కువగా ఉండడం కాదు... వృద్ధాప్యంలో ప్రేమగా చేయి అందించే ఒక్క మనసే నిజమైన సంపద. పిల్లల నిర్లక్ష్యంతో అడుక్కునే స్థితికి చేరిన ఓ వృద్ధుడికి, మేనల్లుడు ఇచ్చిన ఆత్మీయ ఆశ్రయం ఎలా కొత్త జీవితాన్ని ప్రసాదించిందో హృదయాన్ని కదిలించేలా చెప్పే కుటుంబ కథ "పెదనాన్న". తల్లిదండ్రుల పట్ల బాధ్యత, మానవత్వం, కుటుంబ విలువలను గుర్తు చేసే ఈ కథ ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సినది.


"కారు వెనక్కి పోనివ్వు డ్రైవర్..!"


సుధీర్ అనడంతో డ్రైవర్ కారు వెనక్కి పోనిచ్చాడు.

కారు దిగి, అక్కడ కూర్చొని ఉన్న వ్యక్తి దగ్గరకు వెళ్లి,

"పెదనాన్నా..!" అంటూ పలకరించాడు.


"సుధీర్! బాగున్నావా అయ్యా..!" అంటూ ప్రేమగా పలకరించాడు అప్పయ్య.


"నువ్వేంటి పెదనాన్నా... ఇక్కడ?"


"ఏం చేస్తాంరా! ఐదుగురు కొడుకులు ఉన్నారు. ఐదుగురు ఐదు గుప్పెళ్ల బియ్యం ఇచ్చినా మాకు ముసలితనంలో గడిచిపోతుందని అనుకున్నా. కానీ అంతా వ్యతిరేకమైంది. మీ అయ్యను ఒక్కడినే కన్నావు. నాకు చూడు, ఐదుగురు కొడుకులు అని ఎగతాళి చేసేవాడిని. 'నవ్విన నాపచేను పండుద్ది' అన్నట్టుగా అయ్యింది. వీడు చూస్తాడని వాడు, వాడు చూస్తాడని వీడు... ఎవ్వరూ చూడకుండా తప్పించుకున్నారు. మీ పెద్దమ్మ ఉంటే ఎక్కడో ఒకచోట తెచ్చి ముద్ద పెట్టేది. అది పోయి దిక్కులేని వాడినయ్యాను. ఊరిలో ఉండలేక ఇదిగో ఈ పట్టణానికి వచ్చి అడుక్కుంటున్నాను రా!" అన్నాడు కండువాతో కన్నీళ్లు తుడుచుకుంటూ.


"ఇక నువ్వు అడుక్కోవాల్సిన అవసరం లేదు." అంటూ పెదనాన్నను తన ఇంటికి తీసుకెళ్లాడు.


ఇల్లు చూసి,

"బాగా కట్టావురా!" అంటూ మెచ్చుకున్నాడు అప్పయ్య.


"పెదనాన్నా... నువ్వు ఈ ఇల్లు నీ ఇల్లే అనుకో. మా నాన్న నువ్వు అన్నవని ఎంత గౌరవం ఇచ్చాడో, అలాగే నేను కూడా ఇస్తాను. నువ్వు ఇక్కడే ఉండొచ్చు."


"వద్దులేరా! మా పిల్లలకు తెలిస్తే నిన్ను దుమ్మెత్తి పోస్తారు."


"అదేమీ ఉండదు. నీకు నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను. నువ్వు ఇక అడుక్కోవద్దు."


"కడుపున పుట్టకపోయినా ఆ మాట అన్నావు చాలురా సూరి! మీ ఇల్లును అట్లాగే పెట్టావు. ఎవరికీ అద్దెకు ఇవ్వలేదా?"


"ఇల్లుకు మరమ్మతులు చేయిస్తున్నాను పెదనాన్నా. ఎవరికీ అద్దెకు ఇవ్వను."


"ఒక వారం ఉన్న తర్వాత నేను వెళ్లిపోతానురా. ఇక్కడ ఊరికే తిని కూర్చోలేను. మీ అయ్య బతికుంటే బాగుండేది. నీ ఇల్లును, నిన్ను చూసి ఎంత ఆనందపడేవాడో! వాడిని బాగా చూసుకునే వాడివి."


"అవును పెదనాన్నా... యాత్రలకు వెళ్లిన అమ్మానాన్నల బస్సుకు ప్రమాదం జరగడం మా దురదృష్టం."


"వాడు ఎప్పుడూ 'మా అబ్బాయి రాముడిలాంటి వాడు. ఒక్కడే అయినా పెద్దయ్యాక నన్ను చూసుకుంటాడు' అనేవాడు. నేనేమో కౌరవుల్లా ఎక్కువ మంది పిల్లలను కన్నా, ఒక్కరూ సరిగా లేకపోయారు. చివరికి ఇల్లు అమ్ముకుని రోడ్డున పడ్డాను." అంటూ మళ్లీ కండువాతో కళ్లనీళ్లు తుడుచుకున్నాడు.


మరుసటి రోజు సురేంద్ర, అప్పయ్యను కారులో రామాపురానికి తీసుకెళ్లాడు. తన ఇంటి ముందు ఆపాడు.


ఇంటి ముందు ఉన్న బోర్డు చూసి అప్పయ్య అడిగాడు.

"ఇదేంటిరా సూరీ?"


"మా అమ్మానాన్నల పేరుతో పెట్టిన బోర్డే పెదనాన్నా."


గేటు లోపలికి వెళ్లగానే గార్డెన్‌లో తులసీరామయ్య దంపతుల విగ్రహాలు కనిపించాయి.

వాటిని చూడగానే, ఒకప్పుడు వాళ్ల పిల్లలు ఇద్దరినీ కలిసి బయటకు పంపించిన సంఘటన అప్పయ్యకు గుర్తుకొచ్చింది.


ఇల్లు అంతా కొత్తగా రంగులు వేసి ఎంతో అందంగా ఉంది.

అప్పుడు సురేంద్ర అన్నాడు.


"పెదనాన్నా... నువ్వు మన ఊరిలోనే, మన ఇంట్లోనే ఉండొచ్చు. నువ్వే కాదు, మన ఊరిలో ఎంతో మంది వృద్ధులు పిల్లలు చూడక నానా అవస్థలు పడుతున్నారు. వాళ్లందరి కోసం మా ఇంటిని వృద్ధాశ్రమంగా మార్చాను."


"నువ్వే ఈ ఆశ్రమం బాగోగులు చూడాలి. పక్కనున్న మీ ఇల్లును కూడా కొన్నాను. ఈ రెండు ఇళ్లను కలిపి ఆశ్రమంగా మార్చాను. బయట వేపచెట్టు కింద ఉన్న అరుగు మీద కూర్చొని, ఇదివరకటిలాగే హాయిగా కాలక్షేపం చేయి. ఇప్పుడు మీ పిల్లలు నువ్వు నా దగ్గర ఉన్నావని నిన్ను తిట్టుకోరు. ఎంతో మంది నీ స్నేహితుల మధ్య నువ్వు ఆనందంగా ఉంటున్నావని అనుకుంటారు."


అప్పయ్య కళ్లనీళ్లు తుడుచుకుంటూ "ఎంతమంది పిల్లలు ఉన్నారనేది కాదు సూరీ... పుత్రోత్సాహం ఎవరు కల్పిస్తున్నారు అనేదే ముఖ్యం రా!"


అంటూ తడితో మెరుస్తున్న కళ్లతో సురేంద్రను హత్తుకుని ముద్దాడాడు.


సమాప్తం


పెనుమాక వసంత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం

  ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

 రచయిత్రి పరిచయం:

పేరు వసంత పెనుమాక, గృహిణి. రచనలు చేయటం, పాటలు వినటం హాబీస్.మన తెలుగు కథలకు కథలు రాస్తున్నాను. ధన్యవాదములు.


bottom of page