top of page
Original.png

వ్యాపార ప్రపంచం – పార్ట్ 3


ప్రభుత్వ కార్యాలయంలో ఫైళ్ల మధ్య ఆలోచనలో కూర్చున్న యువ ఉద్యోగి భానుప్రసాద్.

Vyapara Prapancham Part 3 | Telugu Emotional Inspirational Serial | Pandranki Subramani 

వ్యాపార ప్రపంచం – పార్ట్ 3 | తెలుగు భావోద్వేగ ప్రేరణాత్మక ధారావాహిక| పాండ్రంకి సుబ్రమణి | ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత

Published in manatelugukathalu.com on 20/08/2026


వ్యాపార ప్రపంచం – పార్ట్ 3లో ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తున్న యువ ఉద్యోగి భానుప్రసాద్ వ్యక్తిత్వం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. స్టాఫ్ యూనియన్ కమిటీ సభ్యుడిగా సమస్యలపై నేరుగా మాట్లాడే అతని ధైర్యం ప్రశంసనీయం అయినప్పటికీ, ఆవేశాన్ని అదుపులో పెట్టుకోలేకపోవడం కొన్ని సందర్భాల్లో అతనికే కాకుండా తోటి ఉద్యోగులకు కూడా ఇబ్బందులు కలిగించే పరిస్థితిని సృష్టిస్తుంది. అందుకే సీనియర్ సూపర్‌వైజర్ దీనదయాళ్ అతనిని క్యాంటీన్‌కు తీసుకెళ్లి ఉద్యోగ బాధ్యతలు, పై అధికారులతో వ్యవహరించే పద్ధతి, టీమ్‌వర్క్, సహోద్యోగులతో స్నేహపూర్వకంగా మెలగడం వంటి విషయాలపై హితబోధ చేస్తాడు. ఈ సంభాషణ తర్వాత భానుప్రసాద్‌లో మొదలయ్యే అంతర్మథనం కథను మరింత ఆసక్తికరంగా ముందుకు తీసుకెళ్తుంది.


వ్యాపార ప్రపంచం జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

జరిగిన కథ: కుటుంబ ప్రేమతో రోజును ప్రారంభించిన సుఖదేవ్, కార్యాలయంలో మాత్రం కఠినమైన వ్యాపార నిర్ణయాల ముందుంటాడు. ఉద్యోగుల ప్రమోషన్లు, నైతిక విలువలు, నాయకత్వ బాధ్యతలు, వ్యాపార విస్తరణ—ఈ నాలుగు అంశాల మధ్య జరిగిన ఆసక్తికర సంభాషణ కథను కొత్త మలుపులోకి తీసుకెళ్తుంది. వ్యాపార ప్రపంచం – పార్ట్ 2 లో సుగుణ్ ట్రేడర్స్‌లో కీలకమైన పదవికి కొత్త వ్యక్తిని ఎంపిక చేసే ప్రక్రియ మరింత ఆసక్తికరంగా మారుతుంది. స్త్రీలను కేవలం లింగం ఆధారంగా పక్కన పెట్టడం సరైన నిర్ణయం కాదని నాగముని సుఖదేవ్‌కు వివరిస్తాడు.

ఇక వ్యాపార ప్రపంచం - పార్ట్ 3 చదవండి


అది కేంద్ర ప్రభుత్వానికి చెందిన అనుబంధిత సచివాలయ కేంద్రం. అటు ఇటుగా సిబ్బంది నూట నలభై మంది దాకా ఉంటారు. అకౌంట్స్ విభాగానికి చెందిన గ్రూపులు ఆరు - ఎన్‌ఫోర్స్‌మెంట్‌కి చెందిన గ్రూపు మరొక ఆరు - అటు తరువాత నిర్వహణా విభాగానికి చెందిన సెక్షన్లు మూడు. లీగల్ సెక్షన్‌కి చెందిన మరొక రెండు విభాగాలు. అలా అవి కుదురుగా చెదరి రాలిన పలాశ పత్రాల్లా కార్యాలయ ప్రాంగణాన విస్తరించి ఉంటాయి.


పోయినేడాది ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజ్ ఆధ్వర్యాన నిర్వహించిన పోటీ పరీక్షల్లో విజేతయై అకౌంట్స్ గ్రూపులో అకౌంట్స్ అసిస్టెంటుగా చేరాడు భాను ప్రసాద్. ఉద్యోగం భాగ్యనగరంలో చేస్తున్నా అతడి స్వస్థలం ఇక్కడ కాదు. చుట్టుప్రక్కల కూడా కాదు. గజపతినగరానికి చెందిన యువకుడు. అతడి పూర్వీకులు నగర సంస్థానంలో కొలువు చేసే వారని అతడి గురించి తెలిసిన వారు - అతడికి దగ్గరితనం గలవారు మరికొందరు చెప్పుకుంటారు. 


అటువంటి పూర్వపు వాసనల వల్ల కావాలి; అతడిలో సభ్యతా సంస్కారాలు మిక్కిలిగా ఉన్నా దేహభాషలో దూకుడెక్కువ కనబరుస్తుంటాడు. భావ వ్యక్తీకరణలో ముఖ్యంగా పాయింట్స్ ఆఫ్ వ్యూ చెప్పేటప్పుడు పెల్లుబికిన ఆవేశాన్ని అదుపులో పెట్టుకోలేక పోతుంటాడు. 


పోకడలో రాడికల్ గా గోచరించినా అంతరంగాన సౌమ్యుడు - భక్తి పరాయణుడు. నిత్య స్తోత్రావళి - “శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్” అతడికి కరతలామలకం. 


ఎలాగంటే — వర్కింగ్ సీటులో ఆసీనుడవక ముందు అతడు తప్పనిసరిగా పఠించే విఘ్నేశ్వర స్తుతి ఇదే! అదే రీతిన అతడు అడపా తడపా వ్రాసే కవితల్లో కూడా భక్తి భావం ప్లస్ అతడిలోని ఆవేశ పూరితమైన ఉద్వేగం సమపాళ్ళల్లో ద్విగుణీకృతమై పొడసూపుతుంటాయి. 


దట్ ఫార్ అండ్ నో ఫార్ అన్న చందాన అంతవరకూ అతడి ప్రవర్తన ఓకే — కానీ, తోటి యువ సిబ్బంది ప్రోద్బలం వల్లనో — లేక తనకే తోచిన భావ జాలం వల్లనో భానుప్రసాద్ ఆ ఏడాది జరిగిన స్టాఫ్ యూనియన్ కార్యవర్గ ఎలక్షన్స్‌లో కమిటీ మెంబరుగా ఎన్నికయ్యాడు. 


అప్పట్నించి ఆరంభమయ్యాయి ఎదురు చూడని అడ్డంకులు. ఆ అడ్డంకులు అతడికి మాత్రమే కాదు; తనతో బాటు ఎన్నికైన ఇతర యూనియన్ కమిటీ సభ్యులకు కూడా ఎదురయ్యాయి. స్టాఫ్ యూనియన్ అంటే ప్రైవేటు యాజమాన్యాన్ని నడిపే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీట్ కాదు; ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పి చక్కా కూర్చొని సేదతీర్చుకోవడానికి — 


స్టాఫ్ యూనియన్ స్వభావ స్వరూపం అటువంటిది కాదు. ప్రభుత్వ కార్యాలయంలోనూ పలు విభాగాలలోనూ స్టాఫ్ యూనియన్ అన్నది ఒకటే.. దాని ముఖ్యోద్దేశ్యం - వివిధ స్థాయిలో ఉన్న సిబ్బందికీ కార్యాలయాన్ని ముకుతాడు బిగించి నడిపించే మేనేజ్‌మెంట్‌కి మధ్య వారధిలా ఉండటం - సమస్యల పరిష్కారంలో మేనేజ్‌మెంట్‌కి తోడుగా ఉండటం. 


ఎప్పుడైనా ఏదైనా సమస్య అపరిష్కృతంగా మిగిలిపోతే యూనియన్ ప్రత్యక్ష చర్యకు పాల్పడాలంటే నియమిత పద్ధతుల్ని పాటించి, తీసుకోబోయే చర్యను ముందస్తుగా కార్యాలయ మేనేజ్‌మెంట్‌కి తెలియజేయడం — ఇదీ చేయాల్సిన కర్తవ్య నిర్వహణ. 


తెలిసో తెలియకనో భానుప్రసాద్ సీనియర్ అధికారులతో జరిపే చర్చల్లో పాల్గొంటున్నప్పుడు ఇది పాటించడం లేదు. తగురీతిన నిగ్రహం చూపించడం లేదు. అంతే కాదు - ముఖాముఖి చర్చలు సాగుతున్న సమయంలో అతను తన ముందున్నది తనను అదుపులో ఉంచే సీనియర్ అధికారులన్నది ఆవేశంలో పడి మరచిపోతున్నాడు. 


అకారణంగా దూకుడుకి లోనవుతుంటాడు - ఎంతలా అంటే — ఉన్నట్లుండి అసమ్మతికి సూచనగా కుర్చీని ఉన్నపాటున గిర్రున ప్రక్కకు తోసి కాఫీ కప్పుని క్రింద పడవేసి విసురుగా లేచి వెళ్ళిపోతుంటాడు. 


న్యాయంగా చెప్పాలంటే అటువంటి దూకుడుని యూనియన్ నాయకులు మెచ్చుకుంటారు. ధీరత్వంగా శ్లాఘిస్తారు. కానీ — ప్రసాద్ విషయంలో వాళ్ళకు సహితం బెరుకు పుట్టుకొచ్చింది. ఎప్పుడేమి జరగబోతున్నదో నన్న జంకు పట్టుకుంది. జీవితానుభవం గల వాళ్ళు కాబట్టి యూనియన్ నాయకులకు తెలుసు; ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగి ప్రవర్తన శృతి మించి రాగాన పడితే, లక్ష్మణ రేఖను దాటితే పర్యావసానం ఎలాగుంటుందో ..


అంచేత ప్రసాద్ కి తగురీతిన హిత బోధన చేయడానికి - తమకూ ప్రసాదుకీ మధ్య మీడియేటర్‌గా ఉండటానికి పెద్దరికం గల సీనియర్ సూపర్‌వైజర్ దీనదయాళ్‌ ని నియమించారు. 

క్యాంటీన్‌లో భానుప్రసాద్‌కు ఉద్యోగ బాధ్యతలు, నిగ్రహం, టీమ్‌వర్క్‌పై దీనదయాళ్ హితబోధ చేస్తున్న దృశ్యం.

Deenadayal explains t

స్టాఫ్ యూనియన్ కార్య నిర్వాహకులు ఈ ఏర్పాటు ఎందుకు చేసారంటే .. స్వభావసిద్ధంగా ఆవేశపరుడైన భాను ప్రసాద్ అహం దెబ్బతినకూడదని, ఆ కారణాన యూనియన్ కార్యకలాపాలకు అడపాదడపా చేబట్టబోయే ఉద్యమాలకు అతడి క్రియాశీలక పాత్ర దూరమవకూడదని — ఏ రీతిన కూడా అతణ్ణి చిన్నబుచ్చుకోకూడదని ..

అనుకున్న రీతిన సూపర్‌వైజర్ దీనదయాళ్ వెసులుబాటు చూసి అలా ముందుకు సాగుతూ భాను ప్రసాదు సీటు వైపు వచ్చి అడిగాడు - ”అలా వెళ్ళొద్దాం .. వస్తారా?“ 


సీనియర్ సూపర్‌వైజర్ అలికిడి గమనించి అతడి గొంతు విని భానుప్రసాద్ చప్పున సీటులో నుంచి లేచి అభివాదం చేసాడు. సూపర్‌వైజర్ అతడి అభివాదం అందుకుంటూ నవ్వుముఖంతో మరొకసారి అడిగాడు - “పనిలో బిజీగా ఉన్నట్టున్నావు. సమయం చూసి మరొక తూరి కలసి వెళదాం. సరేనా!”


“అబ్బే — అటువంటిదేమీ లేదండీ — సీనియర్లు మీరు పిలవడమూ నేను రాలేకపోవడమూనా - నెవర్!” అంటూ చేతనున్న పేపర్లను ఫోల్డర్‌లో పెట్టి దీనదయాళ్ వెంట నడిచాడు భాను ప్రసాద్. 


అకౌంట్స్ గ్రూపులోని ఇతర స్టాఫ్ ముఖ్యంగా లేడీ స్టాఫ్ వాళ్ళిద్దర్నీ ఆశ్చర్యంగా చూడసాగారు. అమాంబాపతు సీనియారిటీ గల సూపర్‌వైజర్, యువకుడైన భానుప్రసాద్‌ ని సాదరంగా స్వయంగా వచ్చి తనతో రమ్మనమని పిలవడమా! అందులో స్నేహ స్వభావం మచ్చుకైనా చూపించలేని భాను ప్రసాద్‌ ని మచ్చికగా స్నేహ పూరితంగా ఆహ్వానించడమా! అదేదో అబ్బురమైన విషయంగానే తోచింది అక్కడివారందరికీ —


ఇద్దరూ నడచుకుంటూ వెళ్ళి ఓసారి అలవోకగా కార్యాలయ ఆవరణలోని తోట చుట్టూ తిరిగి ఎట్టకేలకు క్యాంటీనులో కూర్చున్నారు. వాళ్ళ అలికిడి గమనించి క్యాంటీను బాయ్ వచ్చి వాళ్ళ ముందు రెండు టీ కప్పులతో బాటు రెండు ఉల్లి గారెలు కూడా ఉంచి వెళ్లాడు. 


దీనదయాళ్ టీ కప్పు మాత్రం దగ్గరకు తీసుకుని గారెను ప్రసాద్ ప్లేటులో పెట్టాడు తనకు అజీర్తిగా ఉందంటూ — ప్రసాద్ అలాగే అంటూ లేచి వెళ్ళి ఒక బిస్కటు తీసుకువచ్చి సూపర్‌వైజర్ గారి ప్లేటులో పెట్టాడు. అది అందుకుంటూ అతను థాంక్స్ చెప్పాడు. 


అది విని ప్రసాద్ నవ్వుతూ అడిగాడు - “థాంక్స్ ఎందుకు సార్? మీరు మీ ఉల్లిగారెను నాకివ్వలేదూ!” 


ఆ మాటకు దీనదయాళ్ కూడా నవ్వాడు - నవ్వుతూనే బదులిచ్చాడు - “నేను థాంక్స్ చెప్తున్నది బిస్కట్టు కోసం కాదోయ్! నన్ను నా దారిన పోనివ్వకుండా వెళ్ళి బిస్కట్టు తీసుకువచ్చి ఇచ్చావు చూడు! దానికి.” 


మాటకు ప్రత్యుత్తరంగా నవ్వి కాసేపు మౌనం వహించి భానుప్రసాద్ అడిగాడు - “మహరాజులు మా ఊరి వైపూ మా వీధి వైపూ ఊరకే రారుగా! చెప్పండి.” 


“నిజమే — నేను మిమ్మల్ని ఊరకే పిలవలేదు. మీ గొంతులోని గజపతినగరం భాషా యాసా గుర్తించాను. భేష్ — ఇక విషయానికి వస్తాను. 


యూనియన్ లీడర్లు మీతో కొన్ని విషయాలు మాట్లాడమని నన్ను పంపించారు. నేను చెప్పబోయే కొన్ని విషయాలు మీకు సానుకూలంగా లేకపోతే విసుగు చెందకండి. అఫెండ్ కాకండి. సరేనా!” 


తలూపాడు భాను ప్రసాద్. 


దీనదయాళ్ సాగించాడు - “మనం చేసే పనులు ఎప్పుడు చేసినా ఎలా చేసినా ఎదుటివారికి మంచి జరిగేలా ఉండాలి. మరొక కోణంలో నుంచి చూస్తే — మంచి జరగకపోయినా పర్వాలేదు — సాధ్యమైనంత వరకూ చెడు మాత్రం జరక్కుండా చూసుకోవాలి. 


వై - బికాజ్ - దీని వక్ర ప్రభావం మనలో చాలా కాలం పాటు జ్వలిస్తూనే ఉంటుంది. ఇలా జరగడానికి కర్మసిద్ధాంతం కారణం కావచ్చు లేదా బౌద్ధ ధర్మసూత్రం కారణం కావచ్చు. ఫలితం మాత్రం ఒక్కటే ..


ఇప్పుడు మీ విషయానికి వస్తున్నాను; స్టాఫ్ యూనియన్ వ్యవహారాలలో మీకున్న చిత్తశుద్ధిని కార్యవర్గ సభ్యులెవరూ శంకించడం లేదు. మీలో అంతటి చిత్తశుద్ధి ఉంది కాబట్టే చర్చల సమయంలో పై అధికారుల కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడగలుగుతున్నారు. దాపరికం లేకుండా చెప్పదలచుకున్నది సూటిగా చెప్పగలుగుతున్నారు. 


కానీ — ఒక ముఖ్యమైన విషయాన్ని విస్మరిస్తున్నారు. మనం పని చేస్తున్న సంస్థ ప్రైవేటు యాజమాన్యం వాళ్ళది కాదు. అక్కడ మీతోనూ సహ కార్యవర్గ సభ్యులతో మాట్లాడుతున్నది మన కార్యాలయాన్ని - మనల్ని సహితం శాసిస్తూ ఆదేశిస్తూ నిర్వహిస్తున్నది పరిపాలనా దక్షత గల పై అధికారులు. 


మనలో చాలామంది వార్షిక కాన్ఫిడెన్షియల్ రిపోర్టులను పూర్తి చేసే పై అధికారులు వారే ..కొన్ని సమయాలలో అడ్వర్స్ కాన్ఫిడెన్షియల్ రిపోర్టులు మన ప్రమోషన్ల పైనే కాక - మన క్యారియర్ పైనే నకారాత్మక ప్రభావం చూపించవచ్చు. 


కొన్ని సందర్భాలలో మీరు ఆవేశంలో పడి అనుకోకుండా ఏదైనా అనేసారనుకోండి. అత్తపైన కోపం దుత్తపైన చూపిస్తున్నట్లు వాళ్ళు వల్నరబుల్ స్టాఫ్ పైన - అంటే ప్రమోషన్ లిస్టులో ఉన్నవారి పైన రిటైర్ కాబోతున్న వారిపైనా ప్రతికూల ప్రభావం ఉండేలా చేయవచ్చు.” 


అప్పుడు భాను ప్రసాద్ అభావంగా చూస్తూ అడిగాడు - “అంటే ఎప్పుడూ అణగి మణగి ఉండాలంటారు. నోరెత్తకూడదంటారు.”


“నో — అది నా ఉద్దేశ్యం కాదు. సత్య వాక్కు పలకడానికి భయపడనేల? నేనిక్కడ అంటున్నది ఒక్కటే - మన చర్యల వల్ల గానీ పలుకుల వల్ల గానీ తోటి వారి పైన ప్రతికూల ప్రభావం పడకుండా చూసుకోవాలని — ఇలా ఉండాలనుకోవడం మీ మంచి కోసం మాత్రమే కాదు — తోటి వారి మంచి కోసం కూడాను. ఇక రెండవ అంశానికి వచ్చేదా!” 


భాను ప్రసాద్ భవ్యంగా తలూపాడు. దీనదయాళ్ చెప్పసాగాడు - “మీరు తోటి స్టాఫ్ తో — ముఖ్యంగా లేడీ స్టాఫ్ తో పెడసరంగా ప్రవర్తిస్తున్నారు. ముభావంగా ఉంటున్నారు.” 


అప్పుడు ప్రసాద్ ‘అంటే’ అన్నట్లు తలెత్తి చూసాడు.


“అంటే — మీరు చాలామంది లేడీ స్టాఫ్ తో అలూఫ్‌గా ఉండటానికి ప్రయత్నిస్తున్నారు. పొడి మాటలతో సంభాషణ ముగించాలని చూస్తుంటారు. ఇటువంటి పోకడ అప్పటి రోజుల్లో సరిపోవచ్చు. ఇప్పటి రోజుల్లో కుదరదు. మీ ఇష్టాఇష్టాలతో నిమిత్తం లేకుండా మీరు తోటి స్టాఫ్ తో సర్దుకుపోవాల్సిందే — 


ఇప్పుడు నాకున్న అనుభవాన్ని మీ ముందుంచుతున్నాను. నేనీ కార్యాలయంలో చేరినప్పుడు సెక్షన్ల అమరిక ఎలా ఉండేదో చెప్తాను. వినండి — అటువైపు వరసగా లేడీ స్టాఫ్ కూర్చునేవారు. లేడీ స్టాఫ్ మాత్రమే కూర్చునే వారు. ఇటు జెంట్స్ వరసగా కూర్చునే వారు. ఇప్పుడలా కూర్చోవడం కుదరదోయ్ ..ఎందుకంటే — ఇప్పుడు అందరూ కలసే కూర్చుంటున్నారు. కలసే పనిచేస్తున్నారు. 


ఎందుకంటే — టాస్క్ జాయింట్ టాస్క్ - లింగ భేదానికి అతీతంగా అందరూ కలసే పూర్తి చేయాలి ఒకరికొకరు తోడ్పాటునిస్తూ.. అలాంటప్పుడు మీరు పుట్టి పెరిగిన గజపతినగరంలో ఉన్నట్లో ప్రక్కనున్న విజయనగరంలో ఉన్నట్లో ప్రవర్తిస్తే ఎలా కుదురుతుంది? 


మీ సీటు పని మాత్రమే మీరు ఎడంగా ఉంటూ చేసుకుంటూ పోతానంటే ఎలా వీలవుతుంది? ఇక్కడ అసలు విషయానికి వస్తే — కొందరు లేడీసులు నొచ్చుకుంటున్నది మీరు వాళ్ళకు ఎడంగా ముభావంగా ఉంటున్నారని కాదు — మీలో టీమ్ వర్క్ స్పిరిట్ లేకపోవటాన నిర్దేశిత టాస్క్ నిర్దేశిత కాలంలో పూర్తి కావటం లేదనే — 


మీరు పుట్టి పెరిగిన పరిసరాలను బట్టి మీరు కలుపుగోలుతనంతో మూవ్ చేయలేకపోయినా పర్వాలేదు. కానీ — ఎవరైనా లేడీ స్టాఫ్ తానుగా వచ్చి పలకరిస్తే కనీసం చిన్నపాటి నవ్వు చిలకరించవచ్చు కదా — స్త్రీలు సహజంగా సున్నిత హృదయులు. మీరు ఉన్నపాటున అలా అకారణంగా అలూఫ్‌నెస్ చూపిస్తే వాళ్ళ మార్నింగ్ మూడ్ పాడవచ్చు కదా — 

ప్లీజ్ ట్రై టు అండర్ స్టాండ్ ది ప్రెజంట్ సోషియల్ సినారియో — ఏది ఏమైనా ఇప్పటి రోజుల్లో అందునా నలువైపులా పెచ్చరిల్లిపోతున్న ఇప్పటి సైబర్ విజృంభణ వాతావరణంలో మీవంటి యవ్వనవంతుడు స్త్రీలకు ఎడంగా అలూఫ్‌గా ఉండటం, ఉండాలనుకోవడం విస్మయాత్మక విషయమే —” 


దీనదయాళ్ చెప్పిందంతా విన్న భాను ప్రసాద్ తలవంచుకుని మిన్నకుండిపోయాడు. అలా కూర్చున్నవాడు కూర్చున్నట్లే ఉండిపోయి — క్యాంటీను బాయ్‌ కి సంజ్ఞ చేసాడు మరొక రెండు కప్పుల టీ తీసుకురమ్మని — అప్పుడు రెండవ టీ- కప్పు కోసం ఎదురు చూస్తూ సూపర్‌వైజర్ మరొక అంశం కూడా ఎత్తాడు - ముఖపుస్తక విశేషాలు ప్రస్తావిస్తూ ..


భాను ప్రసాద్ కొత్త అంశం వినటానికి ఆసక్తితో తల ముందుకు చాచాడు. దీనదయాళ్ నవ్వుతూ కొనసాగించాడు - “మీరు ఫేస్‌బుక్‌లో యాక్టివ్‌గా ఉంటారని గమనించాను. తెలుగులో ఆంగ్లంలో మీరు చేసిన రెండు మూడు వ్యాఖ్యానాలు చూసాను. కొన్ని కవితలు కూడా చదివినట్టు గుర్తు. 


ఫేస్‌బుక్‌లోని పద ప్రయోగం భావ ప్రకటనం రెండంచుల కత్తి వంటిది, ముఖ్యంగా స్త్రీల మనోభావాల విషయంలోకి వస్తే ..మీరు స్వతహాగా భావావేశం గల వారు కాబట్టి ఇది ముందస్తుగా మీతో ప్రస్తావించాలనిపించింది. నథింగ్ మోర్ - అండ్ నథింగ్ లెస్ — వయసులో సర్వీసులో పెద్దవాణ్ణి. అవధికి మించి ఎక్కువగా మాట్లాడానేమోననిపిస్తుంది.” 


ప్రసాద్ వెంటనే తల అడ్డంగా ఆడించాడు అటువంటిదేమీ లేదన్నట్టు సంకేతం ఇస్తూ ..


క్యాంటీను బాయ్ తెచ్చిన టీ కప్పుని అందుకుని దీనదయాళ్ కి అందిస్తూ ..- 


ఇకపోతే భానుప్రసాద్ వర్కింగ్ సెక్షన్‌లో అలా మౌన ముద్రతో కూర్చుని ముని పుంగవుడిలా ఉండి పోవడానికి కారణం లేకపోలేదు. అతడి అంతరంగాన విసురు వీచికల్లా హోరున కురుస్తున్న చినుకుల్లా చెలరేగుతున్న ఆలోచనలే అసలు కారణం. అప్పటి గజపతినగరం విజయనగరం సంస్థానాలలో కొలువు తీర్చిన కుటుంబాలు అక్కడక్కడ చెల్లాచెదురుగా కొన్ని ఉన్నాయి. 


భాను ప్రసాద్ ఇంట్లోవాళ్ళు తనకు అటువంటి కుటుంబాలతో పెండ్లి సంబంధం కుదర్చాలన్న ఉబలాటం చూపిస్తున్నారన్నది అతడికి తెలుసు. అంచేత–- ఆ విషయంలో, తన అంతరంగం లోలోతున ఇంట్లోవాళ్ళకు ముఖ్యంగా అమ్మానాన్నలకూ నిరుత్సాహం కలిగించడం అతడికి ఏమాత్రమూ ఇష్టం లేదు. 


అతడికి తెలుసు కార్యాలయంలో పని చేస్తున్న స్త్రీలు చాలా మంది తన కుటుంబ సామాజిక నేపథ్యానికి చెందిన వారేనని - కానీ వాళ్ళలో బ్రాహ్మణ అమ్మాయిలూ కొందరున్నారు. నొప్పించక నొప్పింపక అన్న రీతిన అతను ఆచితూచి నడచుకుంటాడు. 


కారణం — తను మాంసాహార ప్రియుడు. ముక్కలేనిదే అతడికి ముద్ద దిగదు. వాళ్ళేమో శాకాహార ప్రియులు. అనుకోకుండా స్నేహమో దగ్గరితనమో కుదిరితే ఆ తరువాత కారణాంతరాల వలన బంధం బెడిసి కొట్టవచ్చు. లోతుగా వెళ్లి బంధాలు కుదిరిన పిమ్మట నగుబాట్లకు లోనుకాకుండా ఏమరపాటుకి గురికాకుండా చూసుకోవడం ఉభయ తారకం కదా — 

వ్యాపార ప్రపంచం పార్ట్ 3లో భానుప్రసాద్ ఆవేశం, దీనదయాళ్ హితబోధ, వైష్ణవితో జరిగిన సంఘటనలను ప్రతిబింబించే దృశ్యం

అడుసు తొక్కనేల కాలు కడుగ నేల — ఇదీ అతడి జీవిత దృక్పథం. అప్పుడు అతడి ఆలోచనలను చెదరగొడుతూ ఎవరిదో గొంతు వినిపించి చేతిలోని ఫైలు ప్రక్కన పెట్టి అటు తల తిప్పి చూసాడతను. వైష్ణవి చిన్నటి నవ్వుతో చూస్తూ అతడికి చాక్లెట్ అందిస్తుంది. అతడు దానిని అందుకుంటూ అడిగాడు - “ఎందుకండీ!” అని. 


ఆమె మరింత చిక్కటితనంతో నవ్వుతూ బదులిచ్చింది - “ఈరోజు నా పుట్టినరోజండి. మన సెక్షన్ వాళ్ళకు చాక్లెట్లు ఇచ్చి వెళ్ళడానికి వచ్చాను. ఇంటిల్లపాదీ ఎదురు చూస్తుంటారు గుడికి వెళ్ళటానికి..” 

ఆ మాట విన్నంతనే అతడు ఉన్నపాటున లేచి నిల్చున్నాడు - ఫైలుని ప్రక్కన పెడుతూ - “శుభాకాంక్షలు హృదయపూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీరు పెక్కు కుటుంబ సంప్రదాయాలు పాటించే నేపథ్యానికి చెందిన వారు కదా — లేచీ లేచిన వెంటనే చాలా లాంఛనాలే ముగించి ఉంటారే — అవేమీ చేయలేదా!” 


అదేమిటన్న ముఖ భావంతో విస్మయాత్మకంగా చూసిందామె. 


“అదేనండీ! పూజలూ పునస్కారాలు గుడి ప్రదక్షిణలు గట్రా చేసి ఉంటారే — అదేమీ తేలేదా?” 


అప్పుడామె సూటిగా స్పందించింది - “నేను ముందే చెప్పాను అందరితో కలసి గుడికి వెళ్లాలని — వాళ్ళందరూ ఎదురు చూస్తుంటారని ..అసలు మీకేమి కావాలో ఫ్రాంక్ గా చెప్పండి. అప్పుడు చెప్తాను మీకివ్వగలనో లేదో —“


“విషయం ఇంకా అందుకోలేదా! ఇప్పటికే ఉదయాన లేచి ఇంట్లో పూజలూ పురస్కారాలూ చేసి ఉంటారు కదా .. మాకివ్వడానికి ప్రసాదమేదీ తేలేదా అని అడుగుతున్నాను.”


“ఓ అదా! సారీ - తెచ్చాను, ఇవ్వడం మరచిపోయాను.” అంటూ వైష్ణవి తేరుకుంటూ వెళ్ళి ప్రసాదం తెచ్చి అందించింది. 


ఆమె చేతినుండి అరటి పండు ముక్క అందుకుని కుంకుమ తీసి నుదుట పెట్టుకుని థాంక్స్ చెప్పి కూర్చున్నాడతను. ఆమె వెనక్కి మరలుతూ మనసున అబ్బురపడింది - “ఇతనా ఇంత కలివిడిగా నోరు విప్పి మాట్లాడుతున్నాడు! నమ్మశక్యం కాకుండా ఉందే ..” 


అతడు అదేమీ గమనించుకుండానే మనసున నెమరు వేసుకున్నాడు - “అందుకే కదా ఒక లాటిన్ కవిరేడు ఇలా గొంతెత్తి హోరెత్తి అన్నాడు - “నేను మార్పుని సదా వాంఛిస్తాను. సదా ఆహ్వానిస్తాను. అలా కోరడం మార్పు కోసం మార్పు రావాలని కోరడం మాత్రం కాదు. 


మార్పు ప్రకృతిలో అంతర్భాగం. నేను సహితం ప్రకృతిలో అంతర్భాగాన్నే - అందుకే నేను మార్పుని సదా కోరుకుంటాను. నాలాగే తోటివారిని కూడా కోరుకోమంటాను.” 


దీనిని అతడు మొన్నమొన్ననే ముఖ పుస్తకంలో చదివినట్లు గుర్తు.


=================================

ఇంకా ఉంది 

వ్యాపార ప్రపంచం – పార్ట్ 4

త్వరలో మీ ముందుకు వస్తుంది.

=================================


పాండ్రంకి సుబ్రమణి గారి కొన్ని ఇతర రచనలు:


పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పాండ్రంకి సుబ్రమణి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


పాండ్రంకి సుబ్రమణి

1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.

30 /10 /2022  తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.

a






Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page