top of page
Original.png

భక్త అంబరీషుడు - పార్ట్ 2

4 minutes ago
3 min read

భక్త అంబరీషుని రక్షిస్తున్న సుదర్శన చక్రం, దూర్వాస మహర్షి మరియు అంబరీషుడు

Baktha Ambareeshudu - Part 2 - Telugu Devotional Story | Sudhavishwam Akondi

భక్త అంబరీషుడు - పార్ట్ 2 - తెలుగు భక్తి కథ | సుధావిశ్వం ఆకొండి 

Published in manatelugukathalu.com on 23/11/2026


భక్త అంబరీషుడు పార్ట్ 2లో అంబరీషుని భక్తి, దూర్వాస మహర్షి కోపం, సుదర్శన చక్రం మహిమతో పాటు భక్తుని పట్ల శ్రీహరి చూపే అపారమైన అనురాగాన్ని తెలుసుకుందాం.


అంబరీషుడు విచ్చేసిన అతిథులు అందరి భోజనాలు అయిన తర్వాత తాను కూడా ద్వాదశి పారణ చేద్దామని భోజనానికి కూర్చున్నాడు.


అప్పుడు...


అటువంటి సమయంలో సూర్యునివంటి తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్న మహా తపస్వి అయిన దూర్వాస మహర్షి అక్కడికి విచ్చేశాడు. ఆయన్ని చూడగానే ఎంతో సంతోషించిన అంబరీషుడు...


"మహర్షీ! ఏమి నా అదృష్టం! ఏకాదశి వ్రతం పూర్తయి ద్వాదశి నాడు మీరు అతిథిగా వచ్చారు. 


నా అదృష్టవశాత్తు మీరు నన్ను అనుగ్రహించడానికే వచ్చారు. మీరు కూడా వచ్చి భోజనం స్వీకరించండి. 


ఆ తర్వాత భుక్తశేషంగా నేను ఆహారం తీసుకుంటాను," అన్నాడు వినయంగా.


అందుకు సంతోషించిన దూర్వాస మహర్షి సరేనని, అనుష్ఠానం చేసుకుని వస్తానని నదీ స్నానానికి వెళతాడు. అయితే మహర్షి అక్కడే ధ్యానంలో ఉండిపోతాడు. 


ద్వాదశి ఘడియలు దాటే సమయం వస్తోంది, కానీ మహర్షి ధ్యానం నుంచి బయటకు రాలేదు.

ఇక్కడ... అంబరీషుడు ఆ మహర్షి కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాడు.


'ద్వాదశి ఘడియలు దాటబోతున్నాయి. ద్వాదశి ఘడియలు దాటకముందే భోజనం చేయాలి, లేదంటే వ్రతభంగం అవుతుంది. 


పోనీ వ్రతభంగం కలగకుండా భోజనం చేసేస్తే, అతిథిగా పిలిచిన మహర్షికి పెట్టకుండా తింటే అతిథిని అవమానించిన దోషం వస్తుంది. ఎటూ పాలుపోవడం లేదు! ఏమి చేయాలి!' అని ఆలోచించాడు అంబరీషుడు.


కానీ ఏమి చేయాలో అర్థం కాలేదు. అక్కడున్న పండితులను పరిష్కారం అడుగుతాడు. 


అప్పుడు పండితులు ఒక పరిష్కారం చెబుతారు...

"మహారాజా! అతిథిగా పిలిచి, వారికి పెట్టకుండా భుజించడం గృహస్థు లక్షణము కాదు. అలాగని ద్వాదశి ఘడియలు దాటితే వ్రతభంగం అవుతుంది. 


దీనికి ఒక్కటే మార్గం. కొద్దిగా మంచినీళ్లు స్వీకరించు. దానికి దోషం ఉండదు. ద్వాదశి పారణ అవుతుంది. మహర్షి వచ్చిన తర్వాత, ఆయనకు భోజనం పెట్టిన తర్వాత నువ్వు స్వీకరిస్తావు కాబట్టి అతిథిని అవమానించినట్టు కాదు!" అని ఆ పండితులు చెబుతారు.


పరిష్కారం దొరికిందని సంతోషించి, ఆ పండితులు చెప్పినట్లుగా చేస్తానని అనుకుని కొద్దిగా నీళ్లు స్వీకరించి, ద్వాదశి పారణ చేసి, మహర్షి కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు.


సరిగ్గా అప్పుడు ధ్యానం ముగించుకున్న దూర్వాస మహర్షి అంబరీషుని వద్దకు వచ్చాడు. 


మహర్షి రాగానే భోజనానికి రమ్మని ఎంతో వినయంగా అంబరీషుడు ఆహ్వానించాడు. కానీ తన దివ్యదృష్టితో అంబరీషుడు నీళ్లు తాగాడని తెలుసుకున్న దూర్వాసుడు పట్టరాని ఆగ్రహం పొందాడు.


"అతిథిగా నన్ను ఆహ్వానించి, నేను రాకుండానే ద్వాదశి పారణ చేస్తావా? మహర్షిని అవమానం చేస్తావా?" అంటూ...


అదే కోపంతో వెంటనే ఒక కృత్యను సృష్టించి అంబరీషుని పైకి పంపుతాడు. ఆ భయంకరమైన కృత్య కదిలి అంబరీషుని వైపు వస్తూ ఉంటే, ఆయన శ్రీహరిని మనసులో ధ్యానిస్తూ నిలబడతాడు. 


మహర్షిని ఏమాత్రం తూలనాడకుండా స్వామినే ధ్యానిస్తూ నిలబడతాడు.


అప్పుడు అంబరీషునికి రక్షణగా ఉన్న సుదర్శన చక్రం కదిలి దూర్వాస మహర్షి వెంట పడుతుంది. ముందుగా ఆ కృత్యను నశింపజేసి, మహర్షి పైకి వస్తుంది. ఆయన చక్రం నుంచి తప్పించుకోవాలని భయంతో పరుగెడుతాడు. ఆయనను తరుముతుంది చక్రం.


సాధారణంగా ఆయుధ ధర్మం ప్రకారం వెనక వైపు నుంచి, అంటే వీపు చూపిస్తూ పారిపోతున్న వాళ్లను ఏమీ చేయకూడదు వాళ్లు ఎదురు నిలిచేవరకూ. క్షత్రియుడు తన ఆయుధాలను పారిపోతున్న వారిపై ప్రయోగించకూడదనే నియమం ఉంది.


అటువంటిది ఇది సుదర్శన చక్రం! శ్రీమన్నారాయణుని ఆయుధం! అందుకే నియమాన్ని పాటిస్తూ మహర్షిని తరుముతుంది, ఎదురు నిలిస్తే శిక్షించాలని. 


అలా పరుగెడుతూ దూర్వాసుడు అన్ని లోకాలూ తిరుగుతాడు. ఎవ్వరూ ఏమీ చేయలేము అంటారు.


మొదట బ్రహ్మ గారి వద్దకు వెళ్లి రక్షించమంటాడు. నా వల్ల కాదు అంటాడాయన. "ఇది పరమాత్మ ఆయుధం! దాన్ని నిగ్రహించడం నా వల్ల కాదు!" అని బ్రహ్మ దేవుడు చెప్పగానే అటునుంచి కైలాసానికి పరుగెడుతాడు.


"నన్ను రక్షించవయ్యా మహాదేవా! నువ్వు భోళా శంకరుడివి కదా!" అంటాడు.


ఆ మహర్షి సాక్షాత్తుగా తన అంశనే అయినప్పటికీ... "అయ్యో మహర్షి! ఎంత చిక్కుల్లో పడ్డావు. ఆ సుదర్శన చక్రం విష్ణువుది. 


నేనెలా ఆపగలను? నాకు విష్ణుమాయనే ఇప్పటికీ అర్థం కాలేదు. నేనేమీ చేయలేను. ఆయన వద్దకే వెళ్లి వేడుకో!" అంటాడు పరమశివుడు.


ఇక తప్పక వైకుంఠం వెళతాడు. శ్రీహరి పాదాలపై పడతాడు.


"ఏమయ్యింది మహర్షీ! ఇలా వచ్చారు?" అని ఏమీ తెలియనివాడిలా శ్రీహరి అడుగుతాడు.

"అయ్యా! నన్ను సుదర్శనం తరుముతోంది. 


రక్షించు స్వామీ!"


"ఎందుకు అలా తరుముతోంది? అసలేమయ్యింది?"


"అయ్యా స్వామీ! క్షణికమైన కోపంతో నీ భక్తుడైన అంబరీషుని పైకి కృత్యను సృష్టించి, పంపాను. అందుకు ఈ చక్రం కృత్యను నశింపజేసి, నా వెంట పడింది," అంటూ జరిగిన విషయాలు అన్నీ చెబుతాడు.


అప్పుడు ఆ భక్త వత్సలుడైన శ్రీమన్నారాయణుడు... "దూర్వాస మహర్షీ! నేను ఆవు వెంట కోడెదూడ వెళ్ళినట్లుగా, నన్నే నమ్మిన భక్తుల వెంట ఉంటాను. 


ఆ భక్తులు నన్ను వాళ్ల గుండెల్లో పెట్టి గట్టిగా కట్టేసుకుంటారు. అందుకే వాళ్లతోనే ఉంటూ ఉంటాను. వారికి హాని చేసేవారిని నేను కూడా రక్షించలేను. నువ్వు వెళ్లి అంబరీషుని వద్దకే వెళ్లి, ఆయన్ని శరణు వేడుకో," అని చెబుతాడు ఆ పరంధాముడు.


ఇక తప్పనిసరి అయి అంబరీషుని వద్దకు వెళ్లి, రక్షించమని ఆయన కాళ్లపై పడి శరణు కోరతాడు మహర్షి.


సశేషం...శ్రీకృష్ణార్పణమస్తు 🙏


  


సుధావిశ్వం

-సుధావిశ్వం






Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page