top of page
Writer's pictureSurekha Puli

దొరసాని పార్ట్ 1

విజయదశమి 2023 కథల పోటీలో విశిష్ఠ బహుమతి పొందిన కథ

'Dorasani Part 1/2' - New Telugu Story Written By Surekha Puli

'దొరసాని పార్ట్ 1/2' పెద్ద కథ మొదటి భాగం

రచన: సురేఖ పులి

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

కాంటెస్సా కార్లో కూర్చొని ఎకనామిక్ టైమ్స్ పేపర్ చదవడం పూర్తి చేశాడు సక్సేనా. కారు సికింద్రాబాద్ నుండి బాలానగర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ లోని బట్టలమిల్లు వైపు వెళుతున్నది.


"నర్సింగ్! నాకు ఒద్దికైన వంట మనిషి కావాలి. ఇంటి మనిషిలా సర్దుకుపోవాలి" కారు నడుపుతున్న డ్రైవర్తో యజమాని చెప్పాడు.


'జీతం ఎంత ఇస్తారు సార్ ".


"వెయ్యి రూపాయలు".


"ఏ టైం లో కావాలి సార్ ".


"మూడు పూటలా భోజనం ఏర్పాటు చేయాలి, ఇంట్లోనే ఉండిపోతే బాగుంటుందేమో".


"అట్లాగే సార్".


"నా ఆరోగ్యం పైన శ్రద్ధ చూపే నమ్మకమైన మనిషి కావాలి".


కారు డ్రైవ్ చేస్తున్న నర్సింగ్ ఆలోచించసాగాడు. ఉదయం ఎనిమిది నుండి రాత్రి ఎనిమిది వరకు డ్రైవర్ ఉద్యోగం. రెండు వేల జీతం. భార్య రెండు ఇళ్లలో పని చేస్తున్నా, కొడుకు చదువు, ఇంటి కిరాయి, రోజూ ఖర్చులతో సర్దుకుపోవడం కష్టంగా ఉంది.


ప్రతీరోజు లాగా నర్సింగ్ రాత్రి కాగానే మత్తుమందులోకి దిగలేదు. భార్య చెన్నమ్మ పక్కలో చేరి విషయం చెప్పాడు.


"వంట మనిషిగా వెయ్యి, ఇంటిపనులకు ఇంకో వెయ్యి అడుగుదాం. సార్ ఇంట్లో సర్వెంట్ రూమ్ కూడా ఉంది. ఆ రూము మనం వాడుకోవచ్చును". నర్సింగ్ ఆశ మొదలయింది.


"మీ సార్ నన్ను వంట మనిషిగా ఒప్పుకుంటాడా ?"


"ఎందుకు ఒప్పుకోడు, ఆయనకు కావాల్సింది పనిలో శ్రద్ధ, నిజాయితీ. ఇవి రెండూ మనలో ఉన్నాయి" భర్త సమర్ధన.


"మీ సార్ భార్యా పిల్లలూ ఎవరూ లేరా?"


"అందరూ అమృత్సర్లో ఉంటారు నెలకొకసారి వెళ్తుంటాడు. ఏ మాటకామాట, మా సార్ మంచి పనిమంతుడు, చూస్తుండగానే బట్టల మిల్లు, బట్టల షాపు, చాలా ఆస్తి సంపాదించుకున్నాడు. బిజినెస్ మంచి లాభాల్లో నడుస్తుంది. "


చిన్నమ్మ ఒప్పుకుంది.


**


వయసు యాభైలో ఉన్న సక్సేనా ఆలోచించాడు, డ్రైవర్ భార్య, ఇంట్లో వంట మనిషిగా ఎల్లప్పుడు వుంటే బాగుంటుందా? ముందుమాటగా నర్సింగ్ తో ఇదే విషయంపై చర్చించాడు.


"సార్, ఆలోచించడానికి ఏముంది? మీతో పాటే నేను బయటికి వెళ్తాను, మీతో పాటే తిరిగి వస్తాను. సర్వెంట్ రూములో మేము ముగ్గురము ఉంటూ ఎప్పటికప్పుడు మీ భోజనం ఏర్పాట్లు చూసుకుంటుంది మా చెన్నమ్మ. లోకం ఏమైనా అనుకోవటానికి ఆస్కారమే లేదు, పైగా పనిమనిషి, తోటమాలి ఉండనే ఉన్నారు, నేను కూడా చెన్నమ్మకు సాయంగా ఉంటాను" డ్రైవర్ అభయమిచ్చాడు.


ఇద్దరి సంభాషణ అంగీకారంతో ముగిసింది.


ఒక్కసారి చూడగానే చెన్నమ్మ సౌందర్యం ఆహా అనిపించదు. కానీ చూసిన కొద్దీ చూడాలనిపిస్తుంది. ఆరోగ్యమైన శరీర అవయవాలు, చామనఛాయ వర్చస్సు, శుభ్రమైన బట్టలు ధరిస్తే ఆకర్షణీయంగా ఉంటుంది. నర్సింగ్ పొడుగ్గా సన్నగా పీలగా ఉంటాడు.


ఆలుమగలు ఇరువురు నలభైలో అడుగుపెట్టిన వాళ్లే, ఒక్కగానొక్క కొడుకు ఆలస్యంగా నేల మీదకు వచ్చిన రాములు. ఎంతో కష్టంగా ఇంటర్మీడియట్ సైన్స్ గ్రూప్ తో గవర్నమెంట్ కాలేజీలో చదువుతున్నాడు. కోచింగ్ పెట్టే స్తోమత లేదు, కానీ మెడిసిన్ చదివించాలని చెన్నమ్మ ఆశయం.


ఆశయం ఆకాశమంత ఉంది, కష్టపడి పనిచేసే అవకాశం దొరికినందుకు చెన్నమ్మ పనిలో ఉత్సాహం పెరిగింది. చెన్నమ్మ చేతి వంటతో యజమాని ఆరోగ్యం, మనసు కుదురుగా ఉన్నాయి. ఏ మాట చెప్పినా, ఏ పని పురమాయించినా తిరుగు చెప్పదు. తన పనిని ఎంతో ఏకాగ్రతతో చేసుకుంటూ కాలాన్ని సునాయాసంగా గడుపుతుంది. సక్సేనా కూడా ఈ ముగ్గురిని అభిమానంగా చూస్తున్నాడు. అప్పుడప్పుడు నర్సింగ్ తో కలిసి డ్రింక్స్ తీసుకోవడం, సెలవు రోజున వి. సి. ర్. పెట్టుకొని సినిమాలు చూడ్డం.. కాలాన్ని హాయిగా గడిపేస్తున్నారు.


**

అమ్మ ఆరోగ్యం బాగా లేదని నర్సింగ్ పోచంపల్లి ఊరు వెళ్లాలి అన్నాడు. ‘చెన్నమ్మని కూడా తీసుకువెళ్ళు’ అన్నాడు యజమాని. కానీ నర్సింగ్ ఒప్పుకోలేదు. తానొక్కడే వెళ్లి చూసి వస్తానన్నాడు. రాములు కాలేజీకి వెళ్ళాడు.


ఓల్డ్ సిటీలో బట్టల షాపు ఓనర్ని హత్య చేశారని నిరసనగా జంటనగరాల బట్టల షాపుల షట్టర్లన్నీ మూసుకున్నాయి. సక్సేనా ఇంటికి వచ్చి ఖాతా పుస్తకాలలో మునిగిపోయాడు.


"సార్ మీతో ఒక మాట చెప్పాలి". చెన్నమ్మ ఎంతో వినమ్రతతో అన్నది.


"వూ చెప్పు". వెంటనే అందుకున్నాడు.


"మీ పని అయిపోయిన తర్వాత చెప్తాను". కొద్దిగా జంకుతూ చెప్పింది.


చెన్నమ్మ చెప్పబోయే మాటపై ఆతృత హెచ్చింది.

ఖాతా పుస్తకాలు మూసేసాడు.

సక్సేనా సోఫాలో తీరిగ్గా కూర్చుంటూ, "ఇప్పుడు చెప్పు" అన్నాడు.


అతనికి ఎదురుగా ఉన్న సోఫా చివర్లో నిలబడింది.


"నువ్వు కూడా కూర్చో".


"ఫర్వాలేదు సార్".


"ఇంట్లో మనని అపార్థం చేసుకునే వారు ఎవరూ లేరు. నువ్వు కూడా సోఫాలో ఆరంగా కూర్చో" నొక్కి చెప్పాడు.


సోఫాలో కూర్చుంది. చాలా మెత్తని ఖరీదైన సోఫా. మాటలు ఎలా మొదలు పెట్టాలో అర్థం కావడం లేదు. కొంత సమయం గడిచాక సక్సేనా కలగజేసుకుని "నువ్వు స్థిమిత పడ్డాక చెబుతూ గాని". అని నిలుచున్నాడు.


"సార్, సార్ మీరు పోవద్దు, ఇంతకంటే మంచి టైం మళ్ళీ రాదు, నేను చెప్తాను". అంటూ గాభరా పడి అతన్ని మళ్ళీ కూర్చునేలా చేసింది.


‌"మా నాయిన కట్నం ఇచ్చుకోలేని ఇబ్బందిలో నర్సింగ్ తో పెళ్లి చేశాడు. మాది బీద కుటుంబం, నాకు పెద్దగా చదువు రాదు, నాకు నా రాములు ప్రాణం, వాడిని మాత్రం ఎలాగైనా డాక్టర్ చదివించాలని నా ఆశ గవర్నమెంట్ కాలేజీలో చదువుకుంటున్నాడు. మీకు దండం పెడతాను, నా కొడుకు చదువుకు కావలసిన సాయం చేయండి. పనిమనిషి పని కూడా నేనే చేస్తాను".


మాటల మధ్యలో వస్తున్న కన్నీటిని కళ్ళల్లోనే నిలిపి వేసి చెన్నమ్మ ప్రాధేయపడింది.


సక్సేనా ఆలోచించసాగాడు. నోట్ పాడ్ తీసి లెక్కలు వేసాడు. ఇంతలో చెన్నమ్మ టీ తెచ్చింది.


"నన్ను డబ్బు సాయం అడుగుతున్నట్లు నర్సింగ్కు తెలుసా?" అనుమానం వ్యక్తపరిచాడు.


"ముందు మీరు సరే అంటే ఆయనకు చెపుతా" మనోధైర్యంతో చెప్పింది.


"అదేంటి, నర్సింగ్ను ముందు అడుగు?"

ప్రశ్నకు జవాబు రాలేదు.


మళ్లీ సక్సేనా "సరే సహాయం చేస్తాను, కానీ రాము ముందుగా కాలేజీ మార్చాలి, సరైన కోచింగ్ తీసుకోవాలి. ఒక ప్లాన్ ప్రకారం ఎంతో ఏకాగ్రతతో చదవాలి".


"నా కొడుకు, చెప్పిన మాట వింటాడు సార్, కష్టపడి చదువుతా అని అంటున్నాడు సార్". నొక్కి వక్కాణించింది.


అదే వారంలో అందరి సమక్షంలో ఒప్పందం జరిగింది. రాములు చదువు కోసం పెట్టుబడి పెట్టడమే కాదు, దాని ఫలితం కోసం కూడా పూర్తిగా శ్రమించాడు సక్సేనా.

సంతోషం పట్టలేక నర్సింగ్ మద్యం మత్తు మరింత హెచ్చింది.


"నా శ్రీరామచంద్రుడు డాక్టరు" అనుకుంటూ చెన్నమ్మ ఆనందంతో మురిసిపోయింది.


"సార్, రాములు మెడిసిన్ సీటు వరంగల్లో వచ్చిందిట". సంతోషం పొంగిపోతూ ఉంటే ఆ పొంగును సక్సేనా తో పంచుకుంది.


"ఏదైనా మిఠాయి చేసి పెడతాను, చెప్పండి ఏం కావాలి"?


"నువ్వు ఇలాగే సంతోషంగా ఉండాలి, ఒకసారి రాముని పిలువు మాట్లాడుతాను".


నసుగుతూ చెప్పింది చెన్నమ్మ, "రాములు ఫ్రెండ్స్ తో కలిసి బయటికి వెళ్లాడు సార్"


మాటలను పెంచకుండా తన గదిలోకి వెళ్ళిపోయాడు.

ఇబ్బందిగా ఉంది చెన్నమ్మకు. ఎందుకంటే రాములుకు సక్సేనా సార్ను కలవాలని లేదు. కానీ నిజం ఎలా చెప్పటం. అందుకే అబద్ధం చెప్పింది.


"సార్ మా జీతాలు పెంచండి, కొంత కొంతగా మీ అప్పు తీర్చుకుంటాము" నర్సింగ్ తొందర.


నవ్వుకున్నాడు యజమాని.

"నర్సింగ్! అప్పు తీర్చాలి అనుకుంటే నువ్వు డ్రైవర్ గానే కాక మిల్లులో కూడా కొంత పని సర్దుకో" మరో మార్గం చూపించాడు.


"అంటే ఏం చేయాలి సార్?”


"వర్క్ మెన్ ఎవరో ఒకరు లీవ్ లో వెళ్తారు. లీవ్ లో వెళ్ళిన వర్క్ మెన్ పనిని కొంచెం చూసుకుంటూ ఉండు".


"బట్టల వ్యాపారం గురించి నాకు ఏమీ తెలియదు సార్" ఇష్టం లేనట్లు చెప్పాడు.


"వ్యాపారం కాదు, మిల్లు పని, నీకు పని నేర్పించే ఏర్పాటు చేస్తాను" సక్సేనా క్లుప్తంగా చెప్పాడు.


చెన్నమ్మ, సార్ చెప్పిన మాటను ఒప్పుకోమని బలవంతం చేయసాగింది.


"చెన్నమ్మ! వద్దు బలవంతం చేయకు, నర్సింగ్! నీకు పూర్తిగా ఇష్టం ఉంటేనే ఈ పని ఒప్పుకో".


ఏమనుకున్నాడో ఏమో ఎక్స్ట్రా పనికి నర్సింగ్ ఒప్పుకున్నాడు.


రెండు నెలలు గడిచినా నర్సింగ్ మిల్లు పని నేర్చుకో లేకపోయాడు. ఈ విషయాన్ని నర్సింగ్తో పాటు సక్సేనా కూడా ఈజీగా తీసుకున్నాడు. చెన్నమ్మకు మాత్రం మనసు స్థిమితంగా లేదు. యజమాని అప్పు తీర్చుకునేందుకు మార్గం చూపించాడు కానీ అది కార్యరూపం దాల్చలేదు.


**

సెలవురోజు నర్సింగ్ బయటికి వెళ్ళాడు.

చెన్నమ్మ వంటింట్లో స్టవ్ శుభ్రం చేస్తుంది.


"నర్సింగ్ ఎక్కడ చెన్నమ్మా?”


"ఏమో చెప్పలేదు సార్, కానీ లేటుగా వస్తానన్నాడు. అన్నం కూడా బయట తింటానన్నాడు".


సక్సేనా ఏమీ మాట్లాడలేదు. చెన్నమ్మకు దగ్గరగా వచ్చి, గట్టిగా కౌగలించుకుని ముద్దు పెట్టుకున్నాడు. చెన్నమ్మ ఆశ్చర్యం నుండి తేరుకునే లోపల సక్సేనా ఫ్రిడ్జ్ తెరిచి నీళ్లు తీసుకుని తాగాడు.


చాలా సేపు చెన్నమ్మ తలదించుకునే ఉంది. రెండు చేతులతో ప్రేమగా ఆమె తల ఎత్తి కళ్ళలోకి చూస్తూ అన్నాడు.. "ఐ లవ్ యు" అంటూ భుజాల చుట్టూ చెయ్యి వేసి పట్టుకుని హాల్లో ఉన్న ఉయ్యాల బల్ల పైన కూర్చోబెట్టి తాను కూర్చున్నాడు.


"సార్! మీరు నాకు కనబడే దేవుడు. నా పైన మీ ప్రేమ, కోరిక సరి కాదు. మీ కాళ్ళకు నమస్కరించే అర్హత నాది. ఇట్లా మీ ప్రక్కన ఉయ్యాల ఊగే గొప్పదాన్ని కాదు".


"చెన్నమ్మా! నిన్ను చూసిన మొదటి రోజు నుండే నాలో తెలియని అలజడి పెరిగింది, మా వూరికి నెలకు ఒకసారి వెళ్ళేవాడిని, మూడు నెలలు దాటినా పోవాలని అనిపించడంలేదు. నువ్వంటే ప్రత్యేకమైన ఆకర్షణ ఉంది".


"సార్! నేను ఎప్పుడూ మీలో కోరిక కలిగించేలా ప్రవర్తించ లేదు, అందగత్తెను కూడా కాదు" బేలగా అయిపోయింది.

"నిన్ను నేను నా మనసుతో చూస్తూన్నాను, నేను కోరుకునే అందం నీలో ఉంది" నిర్మొహమాటంగా చెప్పాడు.

"ఇది మనసులో పెట్టుకునే నా కొడుకు చదువుకు సాయం చేశారా సార్?" అనుమానంతో అడిగింది.


"లేదు, అంతకంటే మునుపే నీ పట్ల నాలో ఒక విచిత్రమైన ఆకర్షణ చోటుచేసుకుంది, ఎవ్వరూ చూడకుండా నిన్ను ఎన్నో భంగిమల్లో ఫోటోలు తీశాను. అంతేకాకుండా నిన్ను నా పెయింటింగ్లో కూడా దాచుకొన్నాను. నిజంగా నువ్వంటే నాకు చాలా ఇష్టం" అసలు విషయం చెప్పాడు సక్సేనా.


"మా ఆయనకు తెలిస్తే చంపేస్తాడు సార్" వెనక్కి అడుగు వేస్తూ చెప్పింది.


"నర్సింగే కాదు, ఈ విషయం ఎవరికి తెలియాల్సిన పనిలేదు" గొంతులో ఆజ్ఞ.


"వద్దు సార్, మీ భార్యకు అన్యాయం చేయకండి" అర్థించింది.

"నా భార్యకు అన్యాయం చేయను, కానీ నా ఊహసుందరి సుఖం నాకు కావాలి" క్లారిటీగా చెప్పాడు.


"మీ భార్య వల్ల సుఖం లేదా మీకు?" ఇంకా క్లారిటీ కోసం అడిగింది.


"ఉంది. కాని ఆనందం, తృప్తి లేదు".


"మీరు మీభార్య కలిసి ఒకే చోట ఉండొచ్చు కదా?"


"అమృత్సర్లో మాకు ఉన్ని వ్యాపారం ఉంది. చిన్నమ్మాయి అల్లుడు కూడా ఆమెతోనే ఉంటూ, వ్యాపారం చూసుకుంటారు". సంజాయిషీ ఇచ్చుకుంటున్నాడు ప్రేమికుడు. చిన్నమ్మ వింటూ ఉంది.


"నా భార్యకు ఇక్కడ ఉండటం ఇష్టం లేదు, నా చదువు పూర్తి కాగానే ఇక్కడ డి. బి. ఆర్ మిల్స్ లో మేనేజర్ ఉద్యోగం వచ్చింది, నాకు నా ఉద్యోగం ముఖ్యం, నా భార్యకు పుట్టింటి ఆస్తి ప్రాణం. నేను ఉద్యోగం విడిచి నా సొంతగా ఇక్కడ బిజినెస్ మొదలు పెట్టాను. నేను ఏ పని చేసినా పూర్తిగా ఆనందం అనుభవిస్తాను.


నా ఆనందంలో భాగంగా ఎన్నో భాషలు నేర్చుకున్నాను, వయోలిన్ వాయిస్తాను, పెయింటింగ్ వేస్తాను. మా భాషలోనే కాక ఉర్దూలో కవితలు కూడా రాశాను. ఇలా ప్రతి చిన్న విషయాన్ని హాబీగా మార్చుకొని నాకు కావలసిన తృప్తిని నేను పొందుతున్నాను. నువ్వు కాదంటే నిన్ను బలవంత పెట్టను, నా కోరిక చెప్పాను, నీకు సరే అనిపిస్తే నాకు జవాబు ఇవ్వు, లేకుంటే ఇక్కడితో మర్చిపో".


చెన్నమ్మకు ఏదో భయం, గుండె దడ మొదలైనాయి.


సక్సేనా ఆపకుండా ఇంకా చెప్పుకుంటూనే పోతున్నాడు, "ఎట్టి పరిస్థితుల్లో కూడా రాముకు చేసే డబ్బు సహాయాన్ని బదులు తీర్చుకోవాలని అనుకోకు, నా ప్రేమకు గుర్తుగా ఒక మంచి పని చేశాను అనుకుంటా" అంటూ చేతులపై ముద్దు పెట్టుకున్నాడు.


**

రోజులు చాలా వేగంగా కదులుతున్నాయి. రుతువులు మారినా సక్సేనా ధోరణి మారలేదు. జవాబు కోసం ఎదురు చూస్తున్నాడు.


ఈ మౌన పోరాటం భరించడం భారంగా అయింది చెన్నమ్మకు. సార్ మంచి వాడు. ఎప్పుడు ఖాళీ దొరికినా ఏదో ఒక పని సృష్టించుకున్నాడు. అదే నర్సింగ్ ఎప్పుడు ఖాళీ దొరుకుతుందా అని ఎదురు చూస్తూ ఎంతో పని ఉన్నట్టు నటిస్తాడు.


ఇంటి యజమాని, వృత్తి యజమాని మధ్యలో పోలిక మొదలైంది. ఇద్దరూ మంచి వాళ్ళే. ప్రశాంతమైన చెన్నమ్మ మనసులో ఒక రాయి పడి అలజడి మొదలైంది.


పరీక్షలు రాసి సెలవులకి వచ్చాడు రాములు ఇంగ్లీషులో చకచకా మాట్లాడుతున్నాడు. ఇంకా డాక్టర్ డిగ్రీ రాకముందే చెన్నమ్మకు రాముడు డాక్టర్ అయిన భ్రమ.


మొక్క నాటిన రోజు నుండి ఆనందాన్ని ఇస్తుంది, చిగురిస్తున్న కొద్దీ మరింత తృప్తి కలుగుతుంది.


ఈ సంతోషాన్ని ప్రచారం చేయాలని నర్సింగ్ రాములును ఊరికి తీసుకెళ్తున్నాడు. బంధువులందరితో ఆనందం పంచుకోవలెనని చెన్నమ్మ కూడా వస్తానన్నది.


"వద్దు, నువ్వు రావద్దు. సార్కి కష్టమవుతుంది. ఇప్పటికే మనం చాలా డబ్బు తీసుకున్నాము. ఇంకా పని ఎగ్గొట్టడం సరికాదు".


"నీతో పాటు తీసుకెళ్ళు నర్సింగ్" చెన్నమ్మ సంతోషం కోరిన సక్సెన చెప్పాడు.


"సార్! వద్దు, మీకూ, ఇంటి పనులకు కష్టమవుతుంది" అని తండ్రీకొడుకులు ఊరికి వెళ్ళిపోయారు.


ఆ మర్నాడు సక్సేనా అడిగాడు, "ఇంకా ఎంత టైం తీసు కుంటావు, అవునో కాదో ఏదో ఒక జవాబు చెప్పు".


"నేను కాదంటే నన్ను బలవంతం చేస్తారా?”


"నిన్ను బలవంతంగా సొంతం చేసుకోవడానికి నేను ఇన్ని రోజులు ఎందుకు ఆగుతాను, నువ్వు కాదంటే నేను ఈమాట ఎత్తను".


చెన్నమ్మ తడబడుతూ దగ్గరగా వచ్చి సక్సేనా కాళ్ళను ముద్దు పెట్టుకుంది.


"నాకు కావలసిన జవాబులో తిరకాసు వద్దు". గోముగా అంటూ కళ్ళు మూసుకున్నాడు.


నా కోరికను ఫలించేలా ఆశీర్వదించు దేవా! మనసులో మొక్కుకున్నాడు.


దేవుడు సక్సేన కోరికను చెన్నమ్మ ద్వారా మృదువుగా అందించాడు.

========================================================================

ఇంకా వుంది...

========================================================================


సురేఖ పులి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

Podcast Link:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:

పేరు : సురేఖ పులి

వయసు: 68 సంవత్సరాలు

భర్త పేరు: స్వర్గీయ పి. అరుణ్ కుమార్

పిల్లలిద్దరికీ వివాహమైంది.

నేను ఎంఏ (సోషియాలజీ&ఇంగ్లీష్) చేశాను.

పుట్టి, పెరిగింది హైదరాబాద్ లో.

ప్రస్తుత నివాసం బెంగళూర్ లో.

మా నాన్నగారే నాకు మార్గదర్శకులు.

స్కూల్ మ్యాగజైన్ కు రాయడంతో నా రచనా వ్యాసంగం ప్రారంభమైంది.

ఒక డైలీ న్యూస్ పేపర్ కోసం చాలాకాలం పనిచేసాను.

చందమామ, యువ, స్వాతి, నెచ్చెలి లాంటి ఎన్నో పత్రికలలో నా కథలు ప్రచురితమయ్యాయి.

మరిన్ని రచనలతో పాఠకులకు దగ్గర కావాలన్నదే నా ఆశయం.





289 views8 comments

8 Comments


@haritharockz • 7 hours ago

Chala chala bagundi

Like
Surekha Arunkumar
Surekha Arunkumar
Nov 04, 2023
Replying to

Thank you very much 🌹

Like

@swarnaputta5792 • 2 hours ago

Interasting story.

Like
Surekha Arunkumar
Surekha Arunkumar
Nov 04, 2023
Replying to

Thank you very much 💖

Like

@deepika974 • 23 minutes ago

Very interesting story…

Like
Surekha Arunkumar
Surekha Arunkumar
Nov 04, 2023
Replying to

Thank you very much 🌹

Like
bottom of page