top of page

బంధాలు అనుబంధాలు పార్ట్ 1'Bandhalu Anubandhalu 1/2' - New Telugu Story Written By Parupalli Ajay Kumar

'బంధాలు అనుబంధాలు 1/2' పెద్ద కథ మొదటి భాగం

రచన: పారుపల్లి అజయ్ కుమార్

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

"ఎంత టైమ్ పడుతుంది, ఖమ్మం చేరుకోటానికి ?"


వెనుక సీటు లో ఉన్న అరవింద్ డ్రైవర్ ని అడిగాడు.


"మూడున్నర లేదా నాలుగు గంటలు పడుతుంది. ట్రాఫిక్ ను బట్టి ఒక్కోసారి లేట్ అవుతుంది."

డ్రైవరు తలతిప్పకుండానే బదులిచ్చాడు.


అరవింద్ టైం చూసాడు. సాయంత్రం అయిదు. తొమ్మిదిలోపే ఖమ్మం చేరుకోవచ్చు అనుకున్నాడు. అక్కడినుండి వెంకటాయపాలెం 15 నిమిషాలు.. ట్రాఫిక్ తో లేట్ అయినా మొత్తం మీద పదింటికల్లా చేరుకోవచ్చు అనుకున్నాడు అరవింద్.


క్యాబ్ ORR మీద వేగంగా పరుగెడుతోంది. అరవింద్ సీటు వెనక్కు వాలి కళ్లు మూసుకున్నాడు.


తన రాకను తాతయ్య వాళ్లు ఎలా రిసీవ్ చేసుకుంటారోనని మనసంతా అదుర్దాగా వుంది. తను ఇండియా రావటం తల్లి కి అసలు ఇష్టం లేదు. కానీ ఇది నాన్న కోరిక.. చివరి కోరిక..


పుట్టినప్పటినుండి మొన్నమొన్నటివరకు నాన్న వైపు బంధువుల గురించి ఏమి తెలియదు.


అమ్మమ్మ, తాతయ్య అమెరికాలో స్థిరపడిన తెలుగువారు. అమ్మ శశికళ అమెరికాలోనే పుట్టిపెరిగింది.


నాన్న కృష్ణమూర్తి ఇండియా నుండి MS చేయటానికి అమెరికా వచ్చాడు. చదువు అయ్యాక మంచి జాబ్ వచ్చింది. అప్పుడే నాన్నకి అమ్మతో పరిచయం అయింది. ఇద్దరూ ప్రేమించుకొని పెళ్ళి చేసుకున్నారు. అయితే అమ్మ పెళ్లికి ఒక కండిషన్ పెట్టిందట. నాన్న ఇండియా కు వెళ్లరాదని, అక్కడి వాళ్ళతో సంబంధాలూ ఉండకూడదని. నాన్న ఒప్పుకున్నాడు. ఈ సంగతులన్నీ తను పెద్దయ్యాక నాన్న చెపితేనే తెలిసాయి.


అమ్మమ్మ, తాతయ్య పెళ్లికి అభ్యంతరం చెప్పలేదు.


అమ్మా, నాన్నలు ఇద్దరూ మంచి జాబ్స్ తో బాగానే సంపాదించారు. తను, చెల్లి అలక చదువులు అయిపోయి జాబ్స్ చేస్తున్నారు.


తను అమెరికా లో పుట్టిపెరిగినా తనకు అమెరికా కల్చర్ అంతగా నచ్చలేదు. చెల్లెలు మాత్రం అమెరికా కల్చర్ బాగా వంటబట్టించుకొంది. అప్పటికే ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్ తో డేటింగ్ చేసి నచ్చక వారిని వదిలి ఒక నీగ్రోను పెళ్ళి చేసుకుంటానని చెప్పింది. నాన్న వద్దన్నాడు. కానీ అలక వినలేదు. ఇద్దరూ అరుచుకున్నారు.


అప్పుడే నాన్నకు మొదటిసారిగా మైల్డ్ హార్ట్ స్ట్రోక్ వచ్చింది. హాస్పిటల్ లో జాయిన్ చేసారు. వాల్వ్ లు మూసుకుపోయాయని స్టంట్ వేయాలని అన్నారు డాక్టర్లు. నాన్న ముఖం లో ఏదో చెప్పలేని బాధ. ఎందుకో బాగా ఆందోళనగా ఉన్నాడు.


తెల్లవారి హాస్పిటల్ కు వెళ్ళినప్పుడు నాన్న రెండు లెటర్స్ నాచేతిలో ఉంచి చెప్పాడు.

'తనకేమన్నా అయితే ఆ లెటర్స్ పోస్టు చేయమన్నాడు ' ఒక్క క్షణం ఆగి 'అమ్మకు చెప్పవద్దు ' అని చిన్నగా అన్నాడు.


నాన్నను ఆపరేషన్ రూం లోకి తీసుకెళ్లాక ఆ లెటర్స్ పై అడ్రస్ చూసాను.

ఇండియా అడ్రసు..

ఆ లెటర్స్ ను నా బాగ్ లో వుంచాను.


నాలుగు రోజుల తరువాత నాన్న క్షేమంగా ఇంటికి వచ్చాడు.


ఆ రోజు రాత్రి నాన్న నా గదికి వచ్చాడు.


సోఫా లో కూర్చుంటూ ''నీతో కాసేపు మాట్లాడాలిరా చిన్నా" అని అన్నాడు."చెప్పండి నాన్నా! దేని గురించి?" అడిగాను కొద్దిగా విస్మయంతో."నా గురించి.. ఇంతకాలం నేను చెప్పని నా గతం గురించి.." నాన్న దీర్ఘంగా వూపిరి పీల్చుకుని చెప్పసాగాడు.


"మనది ఖమ్మం పట్టణానికి దగ్గరలో ఉన్న వెంకటాయపాలెం గ్రామం. మా నాన్న పేరు కోదండరామయ్య, అమ్మపేరు అన్నపూర్ణ. నాన్న ఆ ఊరిలో మోతుబరి రైతు. నాకొక చెల్లెలు పేరు లక్శ్మి. చిన్నప్పటినుండి నాకు చదువుమీద ఎంతో ఇష్టం. నాన్న కూడా నేను ఎంతవరకు చదివితే అంతవరకు చదివిస్తానన్నాడు.


B. Tech పూర్తి అయ్యాక విప్రో లో జాబ్ వచ్చింది. నాకు అమెరికా వెళ్లి MS చెయ్యాలని కోరిక.

'దేశం లో ఎంతవరకైనా చదువు కానీ విదేశాల మోజు వద్దని' నాన్న మందలించాడు. నేను ఎక్కడ తమని వదిలి పోతామోనన్న భయంతో మామయ్య కూతురు రాధ కు నాకు పెళ్ళిచేసారు. అది చిన్నప్పటి నుండి అనుకుంటున్న సంబంధమే" నాన్న చెప్పటం ఆపాడు.


టేబుల్ మీద ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని నీళ్ళు తాగాడు.

నాన్నకి ఇంకొక పెళ్ళి అయిందన్న విషయం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది.


నాన్న తిరిగి చెప్పటం కొనసాగించాడు.


"రాధ పెద్దగా చదువుకోలేదు. మాములుగా ఉంటుంది. రాధ అంటే నాకు అయిష్టము లేదు. ఇష్టము లేదు. చిన్నప్పటినుండి తెలిసిన మామయ్య కూతురు. అంతే.. కానీ రాధకు నేనంటే ప్రాణం. నన్ను పిచ్చిగా ప్రేమించింది. ఆరు నెలలు కలసి కాపురం చేసాము.


నేను అమెరికాలో MS చేయాలనే ప్రయత్నాలు చేసాను. అయితే ఈ సంగతులేమీ ఎవరికీ చెప్పలేదు. ఇంతలో నేను పనిచేస్తున్న కంపెనీ వారు 6 నెలల పాటు అమెరికా లో ట్రైనింగ్ కు పంపిస్తామన్నారు. ఇంట్లో ఈ వంక చెప్పి అమెరికా వచ్చాను.


అంతకు ముందే నేను MS కు అప్లై చేసిన యూనివర్సిటీలో సీటు సంపాదించి చేరిపోయాను.

ఇంటికి లెటర్ రాసాను, 'MS లో చేరానని, అది అయ్యాక ఇండియా వస్తానని. '


నాన్న, అమ్మా బాధపడ్డారని చెల్లెలు ఉత్తరం రాసింది. రాధ గర్బవతి అని రాసింది.


MS అవగానే ఇక్కడే జాబ్ వచ్చింది. జాయిన్ అయ్యాను. నేను కొంతకాలం జాబ్ చేసి ఇండియా వెళ్లాలని అనుకునేవాడిని. అప్పటి ఆలోచన అది.


జాబ్ లో వున్నప్పుడే మీ అమ్మతో పరిచయం అయింది. మీ అమ్మ లో చలాకీ తనం నన్ను ఆకర్షించింది. మీ అమ్మ అందం నన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. తన కలుపుగోలు తనం, మాట్లాడే విధానం, తెలివితేటలు అన్నీ నన్ను వివశుణ్ణి చేసాయి. పరిచయం స్నేహంగా, స్నేహం ప్రేమగా మారటానికి ఎక్కువ కాలం పట్టలేదు.


నా సంగతులు కొన్ని మాత్రమే మీ అమ్మకు చెప్పాను. నాకు పెళ్లి అయిన సంగతి చెప్పలేదు. మీ అమ్మ అమెరికాలో పుట్టిపెరిగినా ఇక్కడి సంస్కృతి అంతగా అలవాటు చేసుకోలేదు. జీవితం లో ప్రేమ, పెళ్లి ఒక్కసారే, ఒక్కరితోనే అనే భావనతోనే పెరిగింది.


మా పెళ్లికి ఒక షరతు పెట్టింది.. తను ఎప్పటికీ ఇండియా రానని, నేను కూడా ఇండియా ను మరచిపోవాలని, ఇక్కడే ఉండిపోవాలని.. ఆ సమయంలో నాకు నా కన్నవారు, నా బార్య, నా వూరు, నా దేశం ఏమీ కనపడలేదు. మీ అమ్మ పై ఉన్న ప్రేమ మైకం లో నేను మీ అమ్మ కండిషన్స్ కు సరేనన్నాను.


మా పెళ్లి జరిగిపోయింది. నేను అప్పుడే నాన్నకి ఉత్తరం రాసాను, ఇండియా కు రానని, ఇక్కడ మరో పెళ్లి చేసుకున్నానని, క్షమించఘని అడుగుతూ రాసాను. దానికి సమాధానం వచ్చిందో లేదో తెలియదు. పెళ్ళీకాగానే మీ అమ్మా, నేను వేరే స్టేట్స్ లో మంచి జాబ్స్ వచ్చి అక్కడకి మారిపోయాం.


మీ అమ్మా నేను అన్యోన్యంగా కాపురం చేసాం. నువ్వు పుట్టిన రోజులలోనే ఇక్కడ ఒక చిన్ననాటి మిత్రుడు కలిసాడు. అతను మాఊరివాడే. అతని ద్వారా నాన్న సంగతులు కొన్ని తెలిసాయి.

రాధకు కూతురు పుట్టిందట. చెల్లి పెళ్లి జరిగింది. బావ జిల్లాకోర్టులో అడ్వకేటు.


రాధ అమ్మానాన్నల దగ్గిరే ఉందట. నాగురించి నాన్న ఎప్పుడూ ఎవరిదగ్గర చులకన చేసి మాట్లాడలేడట. నా గురించి ఎవరయినా అడిగితె 'మాకు వాడిక లేడు మాకింతే ప్రాప్తం. దేవుడు మా రాత ఇలా రాసాడు ఎవరం చేసేదేమి లేదు' అని అనేవాడట. ఒక్క పరుష వాక్యం కూడా మా నాన్న నోటి నుండి రాలేదట.


ఆ రోజు రాత్రి గుండె పట్టేసినంత బాధ. నిద్ర పోలేకపోయాను. మనసులో చెప్పలేని దిగులు. ' అలా ఉన్నారేం ' అని మీ అమ్మ అడిగితే పని ఒత్తిడి అని చెప్పి తప్పించుకున్నాను. రెండురోజుల మాములు మనిషినయ్యాను. రొటీన్ లైఫ్ లో పడిపోయాను.


తరువాత అలక పుట్టింది. మీఇద్దరిని చూసుకొని మురిసిపోయాను. ఎప్పుడైనా ఇండియా నుండి వచ్చిన మిత్రుల ద్వారా నాన్న సంగతులు తెలుసుకుంటున్నాను.


రాధ కూతురి పేరు ప్రణవి. పీజీ చదివింది. నీకన్నా మూడు ఏళ్లు పెద్ద. నీకు అక్క అవుతుంది. చెల్లెలు కు ఒక కూతురు, ఒక కొడుకు. అమ్మా నాన్న ఇప్పటికీ వ్యవసాయం చేయిస్తూనే ఉన్నారు. నువ్వు అచ్చం మా నాన్న లానే ఉంటావు. రూపమే కాదు గుణాల కూడా మా నాన్నవె. అందుకే ఇంతవరకు ఎవరికి చెప్పని నా గతాన్ని నీకు చెపుతున్నా మొన్న హాస్పిటల్ లో ఉన్న రాత్రి అమ్మానాన్నలకు ఒక ఉత్తరం, రాధకు ఒక ఉత్తరం రాసి నీకిచ్చాను. నాకు తెలుస్తూనే వుంది. నేను ఎక్కువకాలం బతకనని.. " నాన్న చెప్పటం ఆపాడు.


నాన్న కళ్లల్లో కన్నీరు.. నేను ఇంతవరకూ చూడని నాన్నని చూస్తున్నాను.


"నాన్నా " అన్నాను బాధగా.


నాన్న కన్నీరు తుడుచుకుని మాట్లాడబోతుండగా


"పడుకోండి నాన్నా ! రేపు మాట్లాడుకొందాం " అన్నాను.


నాన్న తల అడ్డంగా ఊపుతూ "లేదురా.. ఈ రోజే చెప్పాలి. నా కథ.. నా వ్యధ.. నువ్వు మా నాన్నవనే నీకిదంతా చెపుతున్నా. అమ్మనాన్నలు దేవతలు.. వారిని వదిలేసి వచ్చి పెద్ద తప్పు చేసాను. ఇప్పటికీ నేను వెళితే వాళ్ళు నన్ను క్షమించి అక్కున చేర్చుకుంటారు. కానీ వెళ్లలేను. నేను క్షమించరాని తప్పు చెసింది రాధ పట్ల. అక్కడికి వెళ్లి రాధ ముందు నిలుచునే ధైర్యం లేదు. శతకోటి ఆశలతో నా జీవితం లోకి నడిచివచ్చిన రాధను ఆమె ఖర్మానికి ఆమెను వదిలేసి వచ్చాను. నిన్ను ఒక కోరిక కోరుతా తీరుస్తావా చిన్నా" బేలగా అడిగాడు నాన్న.


"అదేంటి నాన్నా ! నువ్వు చెప్పింది ఏనాడైనా కాదన్నానా ? చెప్పు నాన్నా నీవు ఏమి అడిగినా తప్పక చేస్తాను." నాన్న చేతిని నా చేతిలోకి తీసుకుంటూ అన్నాను.


నాన్న ముఖం లోకి వెలుగు వచ్చింది.


"చిన్నా! ఒక్కసారి నా కోసం నీవు ఇండియా వెళ్ళి నీ నానమ్మను, తాతయ్యను కలిసి రావాలి. నా బాధను ఉత్తరంలో రాసాను. ఆ ఉత్తరాలను నువ్వే స్వయంగా వెళ్ళి ఇచ్చిరావాలి. కోదండ రామయ్య మనవడిగా నువ్వు మన వారందరికీ పరిచయం కావాలి. మా నాన్నకి నేను అందివ్వలేని ఆప్యాయాతానురాగాలను నువ్వు ఇవ్వాలి. మీ అమ్మకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఇంతకాలం మౌనంగా ఉండిపోయాను. మా నాన్నకు నాకు మధ్య నువ్వే వారథి కావాలి. ఇదే రా చిన్నా నేను కోరుకునేది."


నేను నాన్న ముఖం లోకి చూస్తూ "కానీ నాన్నా.. వారంతా నాకు తెలియదు.. నేనూ వారికి తెలియదు.. "


నాన్న నన్ను నవ్వుతూ చూసాడు. "ఎవరూ తెలియనక్కరలేదురా.. వూరి పొలిమేరలో నిలబడి 'నేను కోదండరామయ్య గారి మనవడిని' అని చెపితే చాలు, వూరు ఊరంతా నిన్ను భుజాల మీద మోసుకుంటూ మా నాన్న దగ్గరకి తీసుకు వెళుతారు" నాన్న ఉత్సాహంగా అన్నాడు.


ఆ రాత్రి చాలాసేపటివరకు ఆ ఊరికి ఎలా వెళ్ళాలి, ఊరిలో ఎవరెవరు వుంటారు, ఇంటిలో వాళ్ళ పరిచయాలు అన్నీ చెపుతూనే ఉన్నాడు. తెల్లవార్లు నాన్న చెప్పిందే చెపుతూనే ఉన్నారు. చేతిలో చేయి వేయించుకొని మాట తీసుకున్నాడు. ఆ తరువాత నాన్న ముఖం లో ఎంతో ప్రశాంతత కనిపించింది.


"మనసిప్పుడు ప్రశాంతంగా ఉందిరా ! గుడ్ బై" అని గొణుగుతూ నాన్న తన బెడ్ రూం లోకి వెళ్ళాడు.


****************************************


"సార్ టీ ఏమన్నా తాగుతారా ? "


డ్రైవరు మాటలకు ఆలోచనలనుండి బయట పడ్డాడు అరవింద్. కారు ఆగివుంది. చుట్టూ చీకట్లు. పరుచుకొంటున్నాయి. ఏదో హోటల్ వుంది పక్కన.


"నాకేం వద్దు. ఫ్లైట్ లో తిన్నదే కడుపు నిండుగా వుంది. నువ్వు ఏమన్నా తినిరా" అని 500 నోటు ఇచ్చాడు డ్రైవరు కు.


డ్రైవరు దిగి హోటల్ లోనికి వెళ్ళాడు. తిరిగివస్తూ ఒక పేపర్ గ్లాసులో టీ తీసుకువచ్చాడు. "అల్లం టీ సార్, బాగుంది తాగండి " అంటూ ఇచ్చాడు.


టీ తీసుకుని కొద్దిగా సిప్ చేసాడు అరవింద్. " బాగుంది " అంటూ మొత్తం తాగాడు.


చిల్లర తిరిగి ఇవ్వబోతే ఆరవింద్ ఉండనీ అని అన్నాడు. డ్రైవరు కారు స్టార్టుచేసి ముందుకు దూకించాడు.


"ఇంకా ఎంత టైం పడుతుంది ?" అరవింద్ అడిగాడు.


"సగం దూరం దాటేసామ్ సార్. షుమారు రెండు గంటల్లోపే ఖమ్మం చేరుకుంటాం" డ్రైవర్ బదులిచ్చాడు.


ఆరవింద్ మౌనంగా వుండిపోయాడు. చెదిరిన జ్ఞాపకాలన్నీ మరలా మనసులో కదలాడ సాగాయి.


ఆ తరువాతరోజు నాన్న పదింటిదాకా లేవలేదు. ఆఫీస్ కు వెళుతూ నాన్నకు చెప్పి వెళదామని నాన్న రూముకు వెళ్ళి పిలిచాడు. నాన్న బదులు పలుకలేదు.


దగ్గరికివెళ్ళి అనుమానంగా చూసి చేయిపట్టుకొన్నాడు. మంచులా చల్లగా తగిలింది చేయి. డాక్టర్ కు ఫోన్ చేసాడు. అప్పటికే అమ్మ, చెల్లి ఏడుపు మొదలుపెట్టారు.


డాక్టరు వచ్చిచూసి ' హి ఈజ్ డెడ్ ' అని కన్ఫామ్ చేసాడు. నిర్వేదం తో నిలుచుండిపోయాడు అరవింద్.


అప్పుడే నెలరోజులు గడచిపోయాయి తండ్రి చనిపోయి.. అరవింద్ కు ఇంకా నమ్మశక్యం కావటం లేదు. ఆ రాత్రి అంత యిదిగా మాట్లాడిన నాన్న తెల్లవారేసరికి విగతజీవుడు కావటం. అమ్మమ్మ, తాతయ్య వచ్చారు. కార్యక్రమాలన్నీ ముగిసాయి. తల్లి ఆఫీస్ కు వెళుతున్నది. చెల్లి పెళ్ళి విషయం ఆమెకే వదిలేసింది తల్లి.


అరవింద్ ఇండియా వెళ్ళటానికి ఏర్పాట్లు చేసుకోసాగాడు. అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. తండ్రి సంపాదించిన ఆస్తులన్నీ ముందుచూపుతో మూడు భాగాలు చేసి ఎవరి అకౌంట్ లో వారి కి జమచేసాడు. ఎవరికీ డబ్బు ఇబ్బంది లేదు బ్రతకటానికి..


ఇండియా వెళ్ళే ముందు రోజు తల్లికీ, చెల్లికీ చెప్పాడు తను ఇండియా వెళ్లి వస్తానని.


“మమ్మీ. ఇది నాన్న నన్ను కోరిన కోరిక. నాన్న కోరికను నేను తీరుస్తానని మాట ఇచ్చాను. అదే నాన్న చివరి కోరిక అవుతుందని అస్సలు ఊహించలేదు. దానికోసమే నేను రేపు బయలుదేరి ఇండియా వెళుతున్నాను. "


అరవింద్ మాటలకు తల్లి అభ్యంతరం చెప్పింది.


"అక్కడ నీకెవరు తెలుసు ? అసలు ఎలా వెళతావు అక్కడికి ? ఏ వూరో ఎలా వెళ్లాలో నీకెలా తెలుస్తుంది?"


తల్లి మాటలకు "మమ్మీ! నాన్న చివరి రోజు అన్నీ వివరంగా చెప్పారు. అన్నీ నాకు తెలుసు. నాన్న చివరి కోరిక తీర్చలేకపోతే నాకు మనఃశాంతిఉండదు" నచ్చచెప్పాడు.


తల్లికి నాన్న కు అంతకు ముందే పెళ్ళి అయిందన్న సంగతి మాత్రం చెప్పలేదు. తల్లి మౌనాన్ని అర్ధాంగీకారంగా తీసుకుని అమెరికా నుండి బయలుదేరి వచ్చాడు.


హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో దిగగానే ఎయిర్ పోర్ట్ అధికారుల సాయంతో ఖమ్మానికి కాబ్ బుక్ చేసుకుని ప్రయాణం సాగించాడు ఆరవింద్. ఖమ్మం చేరుకోగానే వెంకటాయపాలెం ఎటు వెళ్లాలో కనుక్కుని డ్రైవరు సరిగ్గా తొమ్మిదింటికల్లా ఊరికి చేర్చాడు.


రోడ్డు మీద నడుస్తున్న ఒక మనిషిని 'కోదండరామయ్య గారి ఇల్లు ఎక్కడ? ' అని అడిగిన అరవింద్ ను వింతగా చూస్తు 'రామయ్య గారి ఇల్లు తెలీదా ?ఈ ఊరికి కొత్తగా వస్తున్నావా ' అంటూ ఇంటికి ఎలా వెళ్ళాలో చెప్పాడు.


ఇంటికి చేరుకోగానే డ్రైవరు కు మాట్లాడుకున్న దానికన్నా ఎక్కువగానే ఇచ్చాడు. డ్రైవరు లగేజీ తెచ్చి ఇంటి వరండాలో ఉంచాడు.


కారు శబ్దం విని ఇంట్లోనుండి ఒక అమ్మాయి తొంగిచూసింది వచ్చింది ఎవరో అర్థం కాక "తాతయ్యా ఎవరో వచ్చారు చూడు" అంటూ కేకపెట్టింది.


కోదండరామయ్య బయటికి వచ్చాడు.


అరవింద్ ను చూస్తూనే "ఎవరు బాబూ నువ్వు ? " అన్నాడు.


అరవింద్ తాతయ్యను తనివితీరా చూసాడు. 'తాతయ్యా 'అంటూ వంగి కాళ్లకు నమస్కారం చేసాడు. రామయ్యగారు ఆరవింద్ ను భుజాలు పట్టుకొని లేవనెత్తి అతనికేసి విస్మయంగా చూసాడు.

========================================================================

ఇంకా వుంది...

========================================================================


పారుపల్లి అజయ్ కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం

Podcast Link:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

నా పేరు పారుపల్లి అజయ్ కుమార్ ...

పదవీ విరమణ పొందిన ప్రభుత్వ జూనియర్ అధ్యాపకుడుని ...

ఖమ్మం జిల్లా, ఖమ్మం పట్టణ వాసిని ...

సాహిత్యం అంటే ఇష్టం .... కథలు,

నవలలు చదవటం మరీ ఇష్టం ...

పదవీ విరమణ తరువాత నా సహచరి దుర్గాభవాని సహకారంతో ఖమ్మం లో

"పారుపల్లి సత్యనారాయణ పుస్తక పూదోట - చావా రామారావు మినీ రీడింగ్ హాల్ " పేరిట ఒక చిన్న లైబ్రరీని మా ఇంటి క్రింది భాగం లో నిర్వహిస్తున్నాను ..

షుమారు 5000 పుస్తకాలు ఉన్నాయి .

నిరుద్యోగ మిత్రులు ఎక్కువుగా వస్తుంటారు ..

రోజుకు 60 నుండి 70 మంది దాకా వస్తుంటారు ...

ఉచిత లైబ్రరీ ....

మంచినీరు ,కుర్చీలు ,రైటింగ్ ప్యాడ్స్ ,వైఫై ,కరెంటు అంతా ఉచితమే ...

ఉదయం 6 A M నుండి రాత్రి 10 P M దాకా ఉంటారు ...మనసున్న

మనిషిగా నాకు చేతనైన సాయం నిరుద్యోగ మిత్రులకు చేస్తున్నాను. ఇప్పుడిప్పుడే కొంతమందికి జాబ్స్ వస్తున్నాయి.

78 views5 comments

5 Comments


@sesikotha8758 • 5 hours ago

Nice Story

Like
Replying to

Thank you

Like

@PadmaParupalli • 31 minutes ago

చాలా బాగుంది

Like
Replying to

Thank you

Like
bottom of page