top of page
Writer's pictureParupalli Ajay Kumar

బంధాలు అనుబంధాలు పార్ట్ 2


'Bandhalu Anubandhalu 2/2' - New Telugu Story Written By Parupalli Ajay Kumar

'బంధాలు అనుబంధాలు 2/2' పెద్ద కథ చివరి భాగం

రచన: పారుపల్లి అజయ్ కుమార్

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

జరిగిన కథ:

అమెరికాలో స్థిరపడ్డ కృష్ణమూర్తి కొడుకు అరవింద్.

తండ్రి ఆఖరి దశలో అతనికి ఇండియాలో మరో భార్య ఉన్నట్లు అరవింద్ తో చెబుతాడు.

తనవాళ్ళని కలవమని తండ్రి చెప్పడంతో ఇండియాకి వస్తాడు అరవింద్.


ఇక బంధాలు అనుబంధాలు పెద్దకథ చివరి భాగం చదవండి.


ఇంతలో లోపలినుండి నడివయసు లో ఉన్న ఒకామె వచ్చి అరవింద్ ను చూసి "మామయ్యా, మామయ్యా.. ఇతను.. " అని సందేహంగా చూసింది అరవింద్ వంక.


"చిన్నప్పటి మీ ఫొటో లో వున్నట్లే ఉన్నాడు మామయ్య.. ఇతను.. ఇతను" అంటూ అరవింద్ వేపు తిరిగి "బాబూ నువ్వు అమెరికా నుండి వస్తున్నావా ?" అడిగింది ఆతురతతో ..


అరవింద్ కు అర్ధమయింది ఆమె తన పెద్దమ్మ రాధ అని.


"అవును అమ్మా" అన్నాడు ఆరవింద్ అప్రయత్నంగానే.



అంతే! 'బాబూ' అంటూ దగ్గరికివచ్చి అరవింద్ చేతిని పట్టుకుంటూ సంతోషంతో "మామయ్యా! మీ మనవడు" ఆంటూనే లోపలికి చూస్తూ 'అత్తయ్యా' అని కేకపెట్టింది.


ఇంట్లోవాళ్లకు నమ్మశక్యంగా లేదు అరవింద్ రాక.


"ముందు డ్రైవరు కు అన్నం పెట్టి పంపించండి" రామయ్యగారి మాటలకు ముందుగా బయటకి వచ్చి చూసిన అమ్మాయి, డ్రైవరు వద్దన్నా వినకుండా అతన్ని వంటగదిలోకి తీసుకెళ్లి అన్నం పెట్టింది.


డ్రైవరు అన్నం తిని శెలవు తీసుకుని వెళ్ళిపోయాడు.


అందరూ అరవింద్ చుట్టూ చేరారు. అప్పటివరకు అరవింద్ చేయి రాధ పట్టుకొనే వుంది.


"ముందు స్నానం చేసిరా బాబు. అవును ఇంతకూ నీపేరు.. " అంటూ కళ్లలో నీరు తిరుగుతుండగా ముఖం పక్కకు తిప్పుకున్నాడు కోదండరామయ్య.


ఆరవింద్ కు తాతయ్య బాధ అర్థమయింది.


పేరు పెట్టి నామకరణం చేయాల్సిన మనిషి పాతికేళ్ల మనవడిని పేరు అడిగి తెలుసుకోవాల్సి వచ్చిందనే బాధ..


ఆరవింద్ తాతయ్య భుజం మీద చేయి వేసి "తాతయ్యా ! నా పేరు ఆరవింద్" అన్నాడు.


రామయ్య ఇటు తిరిగి ప్రేమగా చూస్తూ కన్నీరు నిండిన కన్నులతో అరవింద్ ముఖాన్ని తృప్తిగా చూస్తూ నుదిటిపై ముద్దు పెట్టుకొన్నాడు.


ఆరవింద్ నాయనమ్మ దగ్గరకెళ్ళి "నానమ్మా" అంటూ వంగి కాళ్లకు నమస్కరించాడు.


అన్నపూర్ణ మనవడిని లేవనెట్టి కౌగిలిలో పొదుపుకున్నది కన్నీళ్లు నిండిన కనులతో.


ఆరవింద్ స్నానం చేసి రాగానే రాధ అన్నం కలుపుకుని వచ్చింది. అరవింద్ తింటానన్నా "నేను తినిపిస్తా బాబూ " అంటూ ముద్దలు చేసి పెట్టసాగింది.


ఆరవింద్ కు ఊహ తెలిసాక ఎవరూ ఇలా అన్నం తినిపించలేదు. అంతా క్రొత్తక్రొత్తగా, కలగా అనిపిస్తున్నది.


అన్నం తింటుండగానే

'మీ అత్తయ్య కూతురు శ్రీనిజ M. sc. అగ్రికల్చర్ చదువుతున్నది. సెలవలకి ఇక్కడికి వచ్చింది. ఈమె రాధ, నీకు పెద్దమ్మ. మీ అక్కయ్య ఖమ్మంలో వుంటున్నది. మీ బావ M. D. O గా చేస్తున్నారు. అక్కయ్యకు ఇద్దరు చిన్న పిల్లలు. L K G, U K G చదువుతున్నారు. మీ మామయ్య అడ్వకేటు గా పనిచేస్తున్నాడు. రేపు వస్తారు అందరూ. ఇప్పుడే ఫోన్ చేసి చెపుతా' అని పరిచయాలు కానిచ్చాడు రామయ్య.


అన్నం తినగానే రామయ్యగారు లక్ష్మికి, ప్రణవికి అరవింద్ వచ్చిన విషయం ఫోన్ చేసి చెప్పి రేపు ఉదయం రమ్మని చెప్పాడు. అరవింద్ ను ఒక గదిలోకి తీసుకెళ్లి పడుకోమని చెప్పి పక్కనే కూర్చుంది రాధ.


"రాధా! వాడిని పడుకోనియ్యి " రామయ్య గారి మాటలకు

"కాసేపూ ఇక్కడే వుంటాను మామయ్యా" వచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ రాధ అంది.


అరవింద్ తలను తన ఒడిలోకి పెట్టుకుంటూ అరవింద్ భుజాలపై నెమ్మదిగా జోకొట్టసాగింది. అరవింద్ కిదంతా కొత్తగా, మత్తుగా అనిపిస్తున్నది. పెద్దమ్మ చేతి స్పర్శ దివ్య లోకాలకు తీసుకెళుతున్నట్లుగా వుంది.


తాతయ్య ఏడుస్తున్న నాన్నమ్మను ఓదార్చుతూ అప్పుడప్పుడు గదిలోకి తొంగిచూస్తూ అరవింద్ నే చూస్తున్నాడు నీళ్లు నిండిన కళ్లతో.


ఈ ప్రేమలు, ఆప్యాయతలు అరవింద్ కు ఇంతకు ముందు అనుభవం లోకి రాలేదు.


వీరికి నాన్న మరణవార్త ఎలా చెప్పాలని ఆలోచిస్తూనే మగత నిదుర లోకి జారాడు అరవింద్.


అరవింద్ నిదుర డోర్ బెల్ మోతతో తేలిపోయింది.


కోదండ రామయ్య లేచివెళ్లి తలుపు తీసాడు.


యెదురుగా లక్ష్మి, లక్ష్మిభర్త, ప్రణవి కుటుంబం అందరూ లోపలికి వచ్చారు. వారిని చూస్తునే అరవింద్ లేచి హాల్లోకి వచ్చాడు. కోదండ రామయ్య అరవింద్ కు అందరినీ పరిచయం చేసాడు.


"రేపు ఉదయం రావచ్చుగా ! ఇంత అర్థరాత్రి రాకపోతేనేం " అన్నాడు రామయ్య.


"తమ్ముడిని చూడాలని వెంటనే వచ్చేసాం తాతయ్యా రేపు ఉదయం దాకా ఆగలేక " ఆంటూనే ప్రణవి ఆరవింద్ దగ్గరకొచ్చి "తమ్ముడూ" అని ఆప్యాయంగాపిలిచింది.


ఇక ఆ రాత్రి ఎవ్వరికీ నిదురలు లేవు. తెల్లవార్లూ కబుర్లే కబుర్లు.. వారి మాటలలోనే ఆరవింద్ కు ఆ కుటుంబ సంగతులన్నీ తెలిసాయి.


ప్రణవి లైబ్రెరీ సైన్స్ లో పీజి చేసింది. ఆ వూరిలో 50 లక్షలతో పెద్ద లైబ్రరీ కట్టించింది. ప్రణవికి ఇద్దరు తాతయ్యలు అండగా నిలిచారు.


తన తల్లి పెద్దగా చదువుకోనందుకే తండ్రి తమను విడిచి వెళ్లాడని, అలా ఎవరికి జరగరాదని చిన్నప్పటినుండి స్త్రీలు బాగా చదువుకోవాలని చెపుతుండేది.


గ్రామంలోస్కూల్, కొద్దిదూరం లో కాలేజీలు ఉన్నాయి.


గ్రామంలోని మధ్యతరగతి స్త్రీలంతా పనులయ్యాక కబుర్లతో కాలక్షేపం చేయకుండా పుస్తకాలు చదివితే బాగుంటుందని ఆలోచించి ' పుస్తక పూదోట' పేరుతో గ్రంధాలయం కట్టించింది.


నానమ్మ, పెద్దమ్మ, మేనత్త అందరూ గ్రంధాలయ కమిటీ సభ్యులు. రోజూ రెండు మూడు గంటలు లైబ్రెరీ లో గడుపుతారు. మాట్లాడుతుండగానే కోడికూతలు వినవచ్చాయి.


"బావా " అన్న పిలుపు విని అటు చూశాడు.

శ్రీజ కాఫీ కప్పుతో వచ్చింది.


ఆ పిలుపు అరవింద్ కు గమ్మత్తుగా అనిపించింది.


కాఫీ తాగుతూ "తాతయ్య ఎక్కడ" అని అడిగాడు.


"గదిలో ఉన్నాడు" శ్రీజ చెప్పింది.


అరవింద్ గదిలోకి నడిచి తలుపు గడియ పెట్టాడు. తాతయ్య ను చూశాడు. తాతయ్య చేతిలో తన తండ్రి ఫోటో..


ఇక చెప్పక తప్పదు అనుకుంటూ అరవింద్ వెళ్ళి తాతయ్య ప్రక్కన కూర్చొని తాతయ్య చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు.


*********************************


అరవింద్ ఇండియా వచ్చి అప్పుడే నెల రోజులు గడచిపోయాయి. తండ్రి మరణం తాలూకు దుఃఖం నుండి ఇప్పుడిపుడే కొద్దికొద్దిగా తేరుకుంటున్నారు. తాతయ్య యింట్లో అందరూ అరవింద్ ను ఆప్యాయతానురాగాల లో ముంచెత్తారు.


జీవితంలో ఇన్ని పిలుపులు, ఇంత అనురాగం, ఇంత ప్రేమలు ఎప్పుడూ చవిచూడలేదనిపించింది.

అక్క పిల్లలు మామయ్యా అంటూ అల్లుకుపోయారు. వారు ముద్దుపెట్టుకుంటుంటే అనిర్వచనీయమైన ఆనందం కలిగింది.


అరవింద్ గ్రామంలో ఉన్న లైబ్రరీ చూసాడు.

చాలా పెద్ద లైబ్రరి. మగవారికి, ఆడవారికి, పిల్లలకి విడివిడిగా పెద్ద రీడింగు రూమ్స్ వున్నాయి. షుమారు 50000 వేల పుస్తకాల దాకా ఉన్నాయి. న్యూస్ పేపర్లు, మాగజైన్ లు తెప్పిస్తున్నారు.


జిల్లా కేంద్రం లో ఉన్న గ్రంథాలయం లో లేని పుస్తకాలు ఇక్కడ ఉన్నాయట. చుట్టుప్రక్కల ఊళ్ళనుండి నిరుద్యోగులు ఉదయం వచ్చి, రాత్రి దాకా చదువుకుని వెళుతుంటారు.


కరెంట్, ఫ్యాన్లు, కుర్చీలు, మంచినీటి వసతి, WIFI సౌకర్యం అన్నీ ఉన్నాయి. అక్క చేస్తున్న సేవకు హాట్స్ ఆఫ్ అని అనుకున్నాడు.


ఖమ్మం వెళ్ళి అక్క ఇల్లు, మేనత్త ఇల్లు చూసొచ్చాడు. ఖమ్మం ఖిల్లా, నరసింహస్వామి ఆలయం, మినీ ట్యాంకుబండ్ అక్కపిల్లలతో, బావతో కలసి చూసాడు.

సరాదాగా వుంది పిల్లల తో గడుపుతుంటే.


అరవింద్ తెలుగు మాట్లాడటం వచ్చుకానీ చదవటం, రాయటం రాదు. అక్క పిల్లలు మామయ్యకు తెలుగు నేర్పే గురువులయ్యారు.


ఊరివారందరు కోదండ రామయ్య మనవడిని చూడటానికి తరలి వచ్చారు. ఎవ్వరూ పేర్లతో పిలుచుకోటం చూడలేడు.

పిన్నీ, పెద్దమ్మ, అత్తయ్య, మమయ్య, బాబాయ్, అన్నా, తమ్ముడూ, అక్కా, వదిన వూరి మనుషులందరూ బంధువుల్లానే పరాచికాలు, పలకరింపులు.. అవన్నీ హృదయం నుండి వొచ్చే పిలుపులే..


మామయ్య, బావ తమ పనులకు కొద్దికాలం శెలవు పెట్టి ఆరవింద్ వెంటవుంటున్నారు. అత్త కొడుకు ఖరగ్ పూర్ లో IIT చేస్తున్నాడు.


అతడు రాగానే చుట్టుపక్కల ఉన్న కిన్నెరసాని, భద్రాచల రాముని గుడి, పాపి కొండల ప్రయాణాల గురించి ప్లాన్ చేస్తున్నారు.


వారి ప్రేమానురాగాలకు ఆరవింద్ మనసంతా చెప్పరాని ఆనందంతో పులకరిస్తున్నది.


ముఖ్యంగా శ్రీజ 'బావా' అనే పిలుపు హృదయం లో తీయని అనుభూతులని రేపుతోంది.


పేదరికం, నిరుద్యోగం తో వూరి యువత సతమతమవుతున్నారు. వారికోసం ఏమైనా చెయ్యాలని సంకల్పించి తాతయ్య, మామయ్య, బావ లతో సంప్రదించాడు. ఊరికి దగ్గరలో ఏదైనా మల్టీ లెవెల్ పరిశ్రమ నెలకొల్పితే కొంతమంది నిరుద్యోగులకైనా ఉపాధి దొరుకుతుందనిపించి, దానికి కావలసిన ప్రభుత్వ అనుమతులను తెచ్చే బాధ్యత లాయర్ మామయ్య కు అప్పచెప్పాడు.


అందరూ అరవింద్ తల్లినీ, చెల్లెలినీ చూడాలనీ వుందని అంటున్నారు. స్కైప్ లో వారితో మాట్లాడించవచ్చు కానీ తల్లికి పెద్దమ్మ విషయం ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు.

ఆ రాత్రి అరవింద్ తల్లికి మెయిల్ లో ఉత్తరం రాయ సాగాడు..


"అమ్మా,


ఈ పిలుపు నీకు క్రొత్తగా ఉందా ?

మమ్మీ అన్న పిలుపులో లేని మాధుర్యం అమ్మా అన్న పిలుపులో ఉందని నాకు ఇక్కడి కి వచ్చాకే తెలిసింది.


అమ్మా నీకు గుర్తుందా ?


ఒకసారి పిట్స్బర్గ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కు పోయినప్పుడు నువ్వు అన్నావ్.


'ఇక్కడ కూర్చుంటే ఎంతో ప్రశాంతిగా వుందిరా ' అని.


ఆ ప్రశాంతత నాకు ఇక్కడ లభించింది.


ఈ ఇల్లే ఓ మమతల కోవెల ..అనురాగాల పొదరిల్లు..

ఆప్యాయతల హరివిల్లు..


ఇక్కడ వుండేవారందరూ

ప్రేమ మూర్తులే.


వీరికి ప్రేమించడమే తెలుసు.


అమెరికాలో నేను అరవింద్ ను మాత్రమే.


కానీ ఇక్కడ నేను ఒక మనవడిని, ఒక కొడుకుని, ఒక తమ్ముడిని, ఒక బావను, ఒక మామయ్యను..


ఆపిలుపులన్నీ నన్ను ఇక్కడ బంధించేస్తున్నాయి.


నిజమే అమ్మా, ఇక్కడ నాకు ఒక అమ్మ దొరికింది, అక్క దొరికింది..


నాన్న నీకెప్పుడైనా చెప్పాడో లేడో ..


మీ పెళ్లికి ముందే..

అంటే నాన్న అమెరికా రాక ముందే ఇక్కడ నాన్నకి పెళ్ళి జరిగింది. ఈ విషయాన్ని నాన్న చనిపోయే ముందురోజు నాకు చెప్పాడు. ఇక్కడి వారికి ఉత్తరాలు రాసి నాద్వారా ఇక్కడకి పంపించాడు.


ఇక్కడి వారంతా నాన్నను ఎప్పుడూ పల్లెత్తు మాట అనలేదు.

పెద్దమ్మ కూడా నాన్న తనకు చేసిన ద్రోహానికి ఏనాడు నాన్నను నిందించలేదు.


నన్ను తన సొంత కూతురి కంటే ఎక్కువుగా ప్రేమిస్తున్నది.

అమ్మ లాలన, అమ్మచేతి గోరుముద్దల రుచి ఇక్కడే తెలిసింది.


నువ్వూ, నాన్న మమ్ములను ఎంతో ప్రేమతో పెంచి పెద్దచేశారు. కానీ నేనేనాడు నీ చేతితో గోరుముద్దలు తినలేదు.


నీ వొడిలో తలపెట్టి పడుకో లేదు. ఊహ తెలిసేసరికి మాకు బెడ్ రూం లు వేరే. అది అక్కడి కల్చర్.


ప్రతీ మనిషికీ పుట్టుకతోనే అనేక బంధాలు ఏర్పడతాయి.

హృదయాలు మమేకమై కలసిపోయినపుడే ఆబంధాలన్నీ అనుబంధాలవుతాయి. అనురాగం, ఆత్మీయత కలగలసి నప్పుడే ఆ అనుబంధాలు చిరకాలం మనుగడ

సాగిస్తాయి.


బంధాలను నిలుపుకోవడం ఒక ఎత్తు అయితే వాటిని అనుబంధాలుగా మార్చుకోవడమన్నది మనిషిప్రవర్తన పైనే ఆధారపడి వుంటుంది.


నేను గమనించినది అక్కడ మనుషులు కొంతమేరకే బంధాలకు కట్టుపడతారు. అక్కడంతా చాలా వరకూ

'ఎవరికివారే యమునాతీరే ' అన్నట్లుగా వుంటారు.


ఇక్కడ ప్రతిమనిషి పుట్టిన దగ్గరనుండి చనిపోయేవరకు అనుబంధాలను నిలుపుకోవాలని తహతహలాడుతుంటాడు.


అక్కడున్నంతకాలం తెలియలేదు. ఇక్కడి వచ్చాకే తెలిసింది బంధాలకు, అనుబంధాలకు, ఆప్యాయతలకు, అనురాగాలకు అసలైన అర్థం.


నానమ్మ, తాతయ్య నిన్ను, చెల్లినీ చూడాలని, నీతో మాట్లాడాలని ఉబలాటపడుతున్నారు.


ఒక్కసారి చెల్లిని తీసుకుని ఇక్కడికి వచ్చి చూడు.

నాన్న భార్యగా నిన్ను అందరూ నెత్తినపెట్టుకుంటారు.

ప్రేమానురాగాలతో అందరూ నిన్ను అక్కున చేర్చుకుంటారు.


వెంటనే రావటం వీలు కాకపొతే వీడియో కాల్ లేదా స్కైప్ తో మాట్లాడు. నేను ఎప్పుడు వచ్చేది యిప్పుడే చెప్పలేను. నేను తిరిగి అమెరికా అసలు వస్తానో రానో కూడా చెప్పలేను.


నేను పుట్టింది అమెరికాలో అయినా ఇక్కడి వచ్చాక ఇదే నేను ఉండవలసిన ప్లేస్ అని అనిపిస్తుంది. భారతదేశ పౌరసత్వంకు అప్ప్లై చేసాను. తాతయ్య వారసుడిగా డాక్యు మెంట్స్ సబ్మిట్ చేసాను.


"జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి.. " అని ఇక్కడే విన్నాను. నను కన్న తల్లివి నువ్వు. అమ్మా! నన్ను అర్థం చేసుకుని చెల్లిని తీసుకుని ఇక్కడి కి రా..


ఇదే మన జన్మ భూమి.

మన మూలాలు ఇక్కడే వున్నాయి.

మన సంస్కృతి సంప్రదాయాలు ఎంత గొప్పవో నీకు తెలుసు కదా.


ఇప్పటికీ వాటిని అమెరికాలో నువ్వు పాటిస్తూనే వున్నావు.

పాశ్చాత్య వ్యామోహంలో పడి అల్లాడుతున్న అలక ఇక్కడ ఒక రెండు నెలలు వుంటే తనలో కూడా మార్పు వస్తుందని నా నమ్మకం.


"ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు

ననుగన్న నా వాళ్ళు నా కళ్ళ లోగిళ్ళు"


అని పరవశించి గానం చేస్తున్నా !

ఈ మధుర క్షణాలలో మీరు కూడా నా ప్రక్కనే వుంటే బాగుంటుందనే ఓ చిన్ని ఆశ..

నా ఆశను నువ్వు నెరవేరుస్తావనే నమ్మకంతో ఎదురు చూస్తుంటాను.


నీ సమాదానం కోసం ఎదురు చూసే


నీ అరవింద్..


========================================================================

సమాప్తం

========================================================================


పారుపల్లి అజయ్ కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం

Podcast Link:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

నా పేరు పారుపల్లి అజయ్ కుమార్ ...

పదవీ విరమణ పొందిన ప్రభుత్వ జూనియర్ అధ్యాపకుడుని ...

ఖమ్మం జిల్లా, ఖమ్మం పట్టణ వాసిని ...

సాహిత్యం అంటే ఇష్టం .... కథలు,

నవలలు చదవటం మరీ ఇష్టం ...

పదవీ విరమణ తరువాత నా సహచరి దుర్గాభవాని సహకారంతో ఖమ్మం లో

"పారుపల్లి సత్యనారాయణ పుస్తక పూదోట - చావా రామారావు మినీ రీడింగ్ హాల్ " పేరిట ఒక చిన్న లైబ్రరీని మా ఇంటి క్రింది భాగం లో నిర్వహిస్తున్నాను ..

షుమారు 5000 పుస్తకాలు ఉన్నాయి .

నిరుద్యోగ మిత్రులు ఎక్కువుగా వస్తుంటారు ..

రోజుకు 60 నుండి 70 మంది దాకా వస్తుంటారు ...

ఉచిత లైబ్రరీ ....

మంచినీరు ,కుర్చీలు ,రైటింగ్ ప్యాడ్స్ ,వైఫై ,కరెంటు అంతా ఉచితమే ...

ఉదయం 6 A M నుండి రాత్రి 10 P M దాకా ఉంటారు ...మనసున్న

మనిషిగా నాకు చేతనైన సాయం నిరుద్యోగ మిత్రులకు చేస్తున్నాను. ఇప్పుడిప్పుడే కొంతమందికి జాబ్స్ వస్తున్నాయి.








77 views0 comments

Commentaires


bottom of page