‘చిన్న దొర’ రియాలిటీ షో
కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Youtube Video link

'Chinna Dora Reality Show'
New Telugu Story
Written By Mallavarapu Seetharam Kumar
రచన, పఠనం : మల్లవరపు సీతారాం కుమార్
"మైకం టీవీ ఎండీ మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు.. నేను వారి అసిస్టెంట్ సోనియాను మాట్లాడుతున్నాను..."
ఫోన్ లిఫ్ట్ చెయ్యగానే అవతలి వైపునుండి వినపడ్డ మాటలకి కిరణ్మయి ఉబ్బి తబ్బిబ్బయింది.
ఆమె ఒక యువ రచయిత్రి. ఇటీవలే కొన్ని షార్ట్ ఫిలిమ్స్ కి కథలు రాయడంతో పాటు, తానే డైరెక్ట్ చేసింది. ఒక కొత్త టీవీ ఛానల్ వాళ్ళు వాటిని ప్రసారం చేశారు.
అనూహ్యంగా ఆ ఛానల్ టీఆర్ఫీ బాగా పెరిగింది. మరికొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేసి పెట్టమని కోరారు వాళ్ళు.
కానీ ఆ ఛానల్ చూసే వాళ్ళు కొద్దిమందే.
ఏదైనా ప్రముఖ టీవీ ఛానల్ లో అవకాశం వస్తే బాగుండునని ఎదురు చూస్తోంది.
ఈ రోజు ఇలా మైకం టీవీ వారినుండి కాల్ రావడంతో ఆనందంతో నోట మాట రాలేదు కిరణ్మయికి.
"హలో మేడం... లైన్ లోనే ఉన్నారా.." అంటూ అటు వైపు నుండి సోనియా అడగడంతో, ఈ లోకంలోకి వచ్చింది కిరణ్మయి.
"అనుకోని సర్ప్రైజ్ కదా.. మాట రాలేదు. చెప్పండి. ఎప్పుడు కలవాలి? కలవడానికి వచ్చేటప్పుడు ఏవైనా షార్ట్ ఫిలిం కథలు తేవాలా?" అతృతతో అడిగింది కిరణ్మయి.
ఆమె ఎగ్జైట్మెంట్ కి కారణం ఉంది.
గత ఏడాది వరకు టాప్ పొజిషన్ లో ఉన్న ఛానల్ అది.
సాగతీత సీరియల్స్ దెబ్బకి ఇటీవల కాస్త వెనకపడింది.
బహుశా తన షార్ట్ ఫిలిమ్స్ తో తిరిగి పుంజుకోవాలని అనుకుంటున్నారేమో...
"మా ఎండీ గారిని కలిశాక మరింత సర్ప్రైజ్ అవుతారు. ఖాళీ చేతులతో రండి చాలు. వీలయితే ఇప్పుడే కలవండి. మీ అడ్రస్ చెబితే కారు పంపిస్తాము" చెప్పింది సోనియా.
తన అడ్రస్ చెప్పి ఆనందంతో ఫోన్ పెట్టేసింది కిరణ్మయి.
వెంటనే ఆఫీస్ లో ఉన్న భర్తకు కాల్ చేసి తనకు వచ్చిన ఫోన్ గురించి చెప్పింది.
"కంగ్రాట్స్ కిరణ్.. మంచి అవకాశం వచ్చింది. గో ఎహెడ్" అంటూ అభినందించాడు ఆమె భర్త ప్రవీణ్.
హాల్లో టివి చూస్తున్న అత్తమామల దగ్గరకు వెళ్లి విషయాన్ని చెప్పింది.
"అయితే ఇక మీదట టివిలో నీ సీరియళ్ళే చూడొచ్చన్నమాట" అన్నారు కిరణ్మయి అత్త జానకమ్మగారు.
"మాకు మాత్రం రాబోయే ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో ముందుగానే చెప్పాలమ్మాయ్" అన్నారు మామ రాఘవరావు గారు.
వాళ్ళిద్దరికీ నవ్వుతూ సమాధానం చెప్పి రెడీ కావడానికి తన గదికి వెళ్ళింది కిరణ్మయి.
ఓ పావుగంటలో రెడీ అయి హాల్లోకి వచ్చి, అత్తగారి పక్కన కూర్చుంది.
కోడలు టెన్షన్ పడుతున్నట్లు గమనించిన అత్తగారు టివి రిమోట్ కోడలి చేతికిచ్చి, "కారు వచ్చేవరకు ఏదో ఒక ప్రోగ్రాం చూస్తూ ఉండమ్మా" అంది.
ఒక ఛానల్ లో ఒక సీరియల్ ఐదువందల ఇరవైరెండో ఎపిసోడ్ వస్తోంది.
అది చూసిన మామగారు "ఈ మధ్య ఒక జోక్ చూసాను. ఒక టివి ప్రేక్షకుడు ప్రధానికి విజ్ఞప్తి చేస్తూ 'ఐదు వందలు, వెయ్యి నోట్లను రద్దు చేసారు కదా! ఆ చేత్తోనే ఐదు వందల ఎపిసోడ్ లు దాటిన సీరియల్స్ ని కూడా రద్దు చేయండి' అని వేడుకున్నాడట" అని చెప్పాడు.
అప్పుడు అత్తగారు, "అవి రద్దు చేసి రెండువేల నోట్లను పెట్టారు కదా! అందుకని రెండు వేల ఎపిసోడ్ లు లేకపోతే తమ సీరియల్స్ ని రద్దు చేస్తారని భయపడి పొడిగిస్తున్నట్లున్నారు" అంది నవ్వుతూ.
ఛానల్ మార్చింది కిరణ్మయి.
మరో ఛానల్ లో ఏదో ఇంగ్లిష్ రియాలిటీ షో వస్తోంది.
పాతికమంది ఆడామగా కలిసి ఒకే ఇంట్లో కొన్ని రోజులు గడుపుతారట.
వాళ్ళు పళ్ళు తోముకోవడం, వాష్ రూమ్ కి వెళ్లడం, ఒకరితో ఒకరు లింగ భేదం లేకుండా దెబ్బలాడుకోవడం, పైనా కిందా పడటం.. ఇలాంటివన్నీ చూపిస్తున్నారు.
అత్తమామలతో పాటు తనకు కూడా ఇబ్బంది కలగడంతో వెంటనే ఛానల్ మార్చింది కిరణ్మయి.
ఇంతలో ఆమె ఫోన్ మ్రోగింది.
కారు ఆ వీధిలోకి వచ్చిందనీ, బయటకు రమ్మనీ చెప్పాడు డ్రైవర్.
కిరణ్మయితో పాటు రాఘవరావు, జానకమ్మలు కూడా బయటకు వచ్చారు.
'మైకం టివి' స్టిక్కర్ ఉన్న కారును చూసి, చెయ్యి ఊపారు రాఘవరావు గారు.
కారు వాళ్ళ ఇంటిముందు ఆగింది.
కిరణ్మయిని కారు ఎక్కించి లోపలి వచ్చారు ఇద్దరూ.
***
కారు నేరుగా మైకం టివి స్టూడియోలోకి ప్రవేశించింది.
సోనియా స్వయంగా కారు దగ్గరకు వచ్చి, కిరణ్మయిని ఎండి క్యాబిన్ లోకి తీసుకొని వెళ్ళింది.
ఎండి చెంచలరావు కిరణ్మయిని కూర్చోమన్నాడు.
ఆమె కూర్చొని, అయన ఏం చెబుతాడోనని ఆసక్తిగా చూస్తోంది.
"మా ఛానల్ టీఆర్ఫీ పెంచడానికి ఒక రియాలిటీ షో నిర్వహించాలనుకుంటున్నాము. షో పేరు ‘చిన్న దొర’. దాదాపు పాతిక ఎపిసోడ్ లు రావాలి. మీ షార్ట్ ఫిలిమ్స్ చూశాను. కథ బాగా రాయడంతో పాటు చక్కగా తీశారు. అందుకే మా రియాలిటీ షో కి సంబందించిన స్కిట్ లు రెడీ చెయ్యండి." చెప్పాడు ఆయన.
"ఇది రియాలిటీ షో కాదా..? నేను రెడీ చేసేదేముంటుంది?" సందేహంగా అడిగింది కిరణ్మయి.
"పేరుకి ఇది రియాలిటీ షోనే. కానీ అంతా మీరు రాసినట్లే నడుస్తుంది.
కంటెస్టెంట్ లు ఒకరినొకరు తన్నుకోవడం దగ్గర్నుంచి హగ్ చేసుకోవడం వరకు అంతా మన ప్లానింగ్ ప్రకారమే జరుగుతుంది" చెప్పాడు చెంచల రావు.
"కానీ నాకు ఇలాంటి షోల మీద పెద్దగా సదభిప్రాయం లేదు. ఆసక్తికరంగా రాయగలను కానీ మీరు చెప్పినట్లే రాయాలంటే కష్టం. నాకు, నాదంటూ ఒక శైలి ఉంటుంది. నా ఆలోచనలకు తగ్గట్లు తీసినందువల్లే నేను తీసిన లఘు చిత్రాలు విజయవంత మయ్యాయి" నిర్మొహమాటంగా చెప్పింది కిరణ్మయి.
“కోట్లలో ఖర్చు పెట్టేది మేము. కాబట్టి మేము అనుకున్నట్లు తీస్తే, రేపు నష్టపోయినా మా తప్పే కాబట్టి భరిస్తాము. పేరున్న రచయితలు, దర్శకులు మేము చెప్పినట్లు వినరు. మీలాంటి కొత్తవారైతే ప్రతిభతో పాటు కాస్త సర్దుకుపోయే స్వభావం ఉంటుందని, మమ్మల్ని అర్థం చేసుకుంటారని మిమ్మల్ని పిలిచాము.
ప్రేక్షకుల నాడి ఎలావుందో, ఎలా చేస్తే ఎక్కువమంది చూస్తారో విశ్లేషించమని యిద్దరు మనస్తత్వ శాస్త్రవేత్తలను నెల క్రితమే నియమించాము. రేపు వాళ్లిద్దరూ మా స్టూడియోకి వస్తున్నారు. మీరు కూడా వచ్చి వారు చెప్పిన సూచనలను వినండి. అందుకు తగ్గట్లుగా ప్రోగ్రాం రూపొందించండి. నలుగురూ మెచ్చేదే మంచి ప్రోగ్రాం కదా! నిర్బంధమేమీ లేదు. మీకు ఇష్టం లేకుంటే విరమించుకోవచ్చు" చెప్పడం ముగించాడు చెంచల రావు.
"అలాగే! రేపు వచ్చి వాళ్ళను కలుస్తాను. తరువాత నా అభిప్రాయం అప్పటికప్పుడే చెబుతాను" అని చెప్పి, అయన దగ్గర, సోనియా దగ్గర సెలవు తీసుకోని ఇంటికి వచ్చింది కిరణ్మయి.
ఆమె ఇంటికి వచ్చేసరికి భర్త కూడా ఆఫీసునుండి వచ్చి ఉన్నాడు.
అందరినీ హాల్ లో సమావేశపరిచి రియాలిటీ షో గురించి చెప్పింది.
ఆ ఇంట్లో ఎవరూ అలాంటి షోలు పెద్దగా చూడరు.
"మనకు ఆ షో గురించి అవగాహన లేదు. మనమెవ్వరం చూడటం లేదు కదా! ఈ రోజంతా అందరం గతంలో పూర్తి అయిన అలాంటి షో పాత ఎపిసోడ్ లు చూద్దాం. తరువాత నువ్వు ఆ షో చెయ్యగలవో లేదో నిర్ణయిద్దాం"" అన్నాడు ఆమె భర్త ప్రవీణ్.
ఇక ఇంటిల్లిపాదీ అలాంటి షో పాత ఎపిసోడ్ లు చూడ్డం మొదలు పెట్టారు.
ఆ షో లో ఒక యువతికి భర్తతో వీడియో కాల్ మాట్లాడే అవకాశం ఇచ్చారు.
ఆమె కళ్ళవెంట ధారగా నీళ్లు కారుతున్నాయి.
అది చూస్తున్న అత్తగారు, మామగారు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు.
"పాపం.. ఆ షోలో వచ్చే డబ్బుల కోసం ఆ అమ్మాయి ఎంత అవస్థ పడుతోందో.." అంటూ జాలి చూపించింది జానకమ్మ.
ఆ యువతి ఫోన్ ముగించి కళ్ళు తుడుచుకుంది.
‘హమ్మయ్య! తెరిపిన పడింది కాబోలు’ అని అనుకుంటున్నంతలో మళ్ళీ భోరుమని ఏడుస్తూ పక్కనే అందుకోసమే ఎదురు చూస్తున్నట్లుగా వేచి ఉన్న యువకుడి పైకి వాలిపోయింది.
అతడు ఓ ఐదు నిముషాల పాటు ఆమెను గాఢంగా కౌగలించుకొని ఓదార్చి, విడిచి పెట్టాడు. తరువాత మరో కంటెస్టెంట్ వంతు.
అలా నలుగురైదుగురు హగ్ చేసుకొని ఓదార్చాక ఆ యువతి శాంతించింది.
"ఇదేం విచిత్రంరా .. భర్త దూరంగా వుంటే అతన్ని తలుచుకొని బాధపడాలి గానీ ఇలా వేరేవాళ్లను..అందునా మగవాళ్ళను కావిలించుకొని ఏడవడమేమిటి? మరీ చోద్యం కాకుంటే.." అంటూ ముక్కున వేలేసుకొంది జానకమ్మ.
"ఇలాంటివి మన తరం వాళ్ళకి నచ్చవులే. ఇప్పటి పిల్లలకైతే తప్పుగా అనిపించదేమో" అన్నాడు రాఘవరావు.
"అదేం కాదు. నాకైతే అసలు నచ్చలేదు” అంది కిరణ్మయి.
"ఇప్పుడు మనం నలుగురం ఈ ప్రోగ్రాం చూసాము కదా! నలుగురిలో ఒక్కరికి కూడా ఈ ఎపిసోడ్ నచ్చలేదు. రేపు వాళ్ళతో ఇదే విషయం చెప్పు. ఇలాంటి అసహజమైన సీన్లు లేకుండా చేస్తానని చెప్పు" అన్నాడు ప్రవీణ్.
మళ్ళీ షో కంటిన్యూ చేశారు.
ఈసారి షోలో అందరూ కలిసి ఒక వింత ఆట ఆడుతున్నారు.ఆటలో భాగంగా ఒకరిమీద ఒకరు పడుతున్నారు. హఠాత్తుగా ఇందాకటి యువతి పెద్దగా కేకలు పెడుతూ ఒక యువకుడిని బూతులు తిడుతోంది.
అందరూ ఆ యువతి చుట్టూ మూగి ఏం జరిగిందని అడుగుతున్నారు.
ఆ యువతి ముక్కు చీదుకుంటూ "వీడు నా నడుమును టచ్ చేశాడు" అంది.
క్లోజప్ లో ఆ యువకుడిని చూపించారు.
ఇందాక ఆ యువతి తన భర్తతో మాట్లాడి ఫోన్ పెట్టేశాక, మొదటగా హగ్ చేసుకుంది ఇతడే.
వాళ్లిద్దరూ ఒకరినొకరు తిట్టుకున్నాక ఎప్పటిలానే ఆ యువతిని కొందరు కౌగలించుకొని ఓదార్చారు.
కొందరు యువతులు ఆ యువకుడి బుగ్గ నిమురుతూ, జుట్టు సవరిస్తూ ఓదార్చారు.
టివి ఆఫ్ చేసింది కిరణ్మయి.
"ఇలాంటి సీన్లు పెట్టమని ఒత్తిడి చేస్తే వాళ్లకు గుడ్ బై చెప్పి వచ్చేస్తాను" అంది కోపంగా.
అర్థరాత్రి జానకమ్మ , రాఘవయ్యలు ఉన్న గదిలోంచి గట్టిగా కేకలు వినపడ్డంతో మెలకువ వచ్చింది కిరణ్మయి, ప్రవీణ్ లకు.
కంగారు పడుతూ ఆ గదిలోకి వెళ్లారు, ఏమైందంటూ .
"చూడరా ప్రవీణూ! ఈయన నా భుజం టచ్ చేసాడు" అంది జానకమ్మ.
"నువ్వు నిద్రలో ఆవేశంగా కదులుతూ వుంటే భుజం కుదిపి లేపాను" అంటూ సంజాయిషీ ఇచ్చుకుంటున్నట్లుగా చెప్పి "అయినా నేను ఆ టివి షోలో నీ తోటి కంటెస్టెంట్ ని కాదు. ముప్పై ఏళ్ళు కాపురం చేసిన భర్తను." దీనంగా అన్నాడు రాఘవరావు.
కిరణ్మయి ఒక గ్లాస్ తో మంచినీళ్లు తెచ్చి అత్తగారి చేత తాగించింది.
ఆమె కాస్త కుదుటపడి "ఈ షో ఒక రోజు చూస్తేనే మైండు ఖరాబయింది. రోజూ చూసే వాళ్ళ పరిస్థితి ఏమిటో.." అని బాధపడింది.
ఓదార్చడానికి భుజం మీద చెయ్యి వెయ్యబోయి, వెనక్కి తగ్గాడు రాఘవరావు.
వాళ్ళు కుదుట పడేదాకా అక్కడే కూర్చొని, తరువాత తన గదిలోకి వచ్చారు కిరణ్మయి, ప్రవీణ్ లు.
"ఇలా తీస్తేనే ప్రేక్షకులు చూస్తారని తీసేవాళ్ళు అంటుంటారు. అది ఎంతవరకు నిజం?" భర్తను అడిగింది కిరణ్మయి.
"అది కేవలం ఒక అపోహ. మంచి చిత్రాలను, మంచి ప్రోగ్రామ్స్ ను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూ ఉంటారు. కొత్త దర్శకురాలిగా నువ్వు తీసిన సందేశాత్మక షార్ట్ ఫిలిమ్స్ ని, కామెడీ స్టోరీస్ ని ప్రేక్షకులు మెచ్చుకున్నారు కదా ..! కాబట్టి లోపం ప్రేక్షకులలో లేదు.
నీకు ఒక ఉదాహరణ చెబుతాను. ఒక పరభాషా చిత్రంలో కథానాయకుడు పల్లెటూరికి చెందిన మొరటు వ్యక్తి. సినిమా ఆద్యంతం పంచెను పైకి కట్టుకొని ఉంటాడు. ఫైట్ సీన్లలో అతడి పంచె తొలిగి అతడు వేసుకున్న చారల నిక్కరు కనపడుతుంది.
ప్రేక్షకుల దురదృష్టమేమో.. ఆ సినిమా హిట్ అయింది.
నిజానికి ఆ సినిమాలో సెంటిమెంట్ బాగా పండడం వాళ్ళ ఆ సినిమా ఆడింది.
కానీ 'మేల్ ఎక్స్ పోజింగ్' వల్ల ఆడిందని కొందరు పొరబడ్డారు.
ఆ తరువాత చాలా సినిమాల్లో అలాంటి సీన్లు పెట్టారు.
కానీ సక్సెస్ కాలేదు.
బాగున్న సినిమాలు ఒకటో రెండో ఆడాయి.
అలాగే ఓ ప్రముఖ హీరోయిన్ కురచ దుస్తులతో ఐటం సాంగ్ చేసిన సినిమా హిట్ అయింది అదే హీరోయిన్ తో మరింత పొట్టి బట్టలతో ఐటం సాంగ్ పెట్టి తీసిన మరో సినిమా ప్లాప్ అయింది.
కాబట్టి ప్రేక్షకుల తప్పు ఎప్పుడూ లేదు. సినిమా బాగుంటే చూస్తారు. అంతే " అన్నాడు ప్రవీణ్.
"ఇదే విషయాన్ని రేపు వాళ్లకు స్పష్టం చేస్తాను. నాకు పూర్తి స్వేచ్ఛను ఇస్తేనే వాళ్ళ ప్రోగ్రాం చేస్తాను" అంది కిరణ్మయి.
***
మర్నాడు కూడా టివి ఛానల్ వాళ్ళు కార్ పంపారు.
కిరణ్మయి వెళ్లేసరికి ఎండీతో పాటు ఇద్దరు వయసుమళ్ళిన వ్యక్తులు కూడా ఉన్నారు.
"వీళ్ళిద్దరూ ప్రముఖ సైకియాట్రిస్ట్ లు" అంటూ వాళ్ళ పేర్లు చెప్పి పరిచయం చేసాడు ఎండీ.
తరువాత "మనం చెయ్యబోయే రియాలిటీ షో కోసం నెలరోజులుగా పరిశోధనలు చేశారు. ప్రోగ్రాం ఎలా ఉంటే బావుంటుందో వాళ్ళు చెబుతారు" అని చెప్పాడు.
వాళ్లలో ఒకతను మాట్లాడుతూ "చూడమ్మా! ఒక సినిమా గానీ ప్రోగ్రాం కానీ సక్సెస్ కావాలంటే ప్రేక్షకులు దాంట్లో లీనమవ్వాలి.మేము చేయించిన సర్వేల ప్రకారం మగవాళ్ళు గంటల తరబడి టివి చూస్తూ కూర్చోరు. ఆడవాళ్ళలో కూడా పెళ్ళై ఇంటిపట్టున వుండే గృహిణులే ఎక్కువగా టివి చూస్తారు. కాబట్టి ఈ షోలో మధ్యమధ్యలో కంటెస్టెంట్ లు వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడినట్లు చూపిస్తాం. దీని వెనక ఉద్దేశం టివి చూస్తున్న మహిళలు తమను తాము ఆ కంటెస్టెంట్ లతో పోల్చుకోవడమే. ఎక్కువమంది మన ప్రోగ్రాం కి కనెక్ట్ కావడమే.." అని చెప్పాడు.
నిన్న రాత్రి అత్తయ్య, ఈ ప్రోగ్రాం ప్రభావంతో మామగారితో గొడవపడటం గుర్తుకొచ్చింది కిరణ్మయికి.
"ఎక్కువ మందిని కనెక్ట్ చేయించండి. కానీ వాళ్ళు మెచ్చుకునేలా ప్రోగ్రాం ఉండాలి. అంతే కానీ మీ అభిప్రాయాలను వాళ్ళ పైకి రుద్దకండి." అంది కిరణ్మయి.
"ఈ రోజుల్లో పక్కా బూతు చిత్రాలే ఇంటర్నెట్ లో లభ్యమవుతున్నాయి. ఈ ప్రోగ్రాం లో మాత్రమే తప్పులు వెదకడం ఎందుకు?" అన్నాడు ఎండీ.
"నిజమే! కానీ టివి అనేది ఇంట్లో అందరూ కలిసి చూసే వినోద సాధనం. ఈ విషయం మీ సర్వేలలోనూ తెలిసి ఉంటుంది.
ఎక్కువమంది కనెక్ట్ కావడం కోసం పార్టిసిపెంట్లను వివాహితులుగా చూపుతున్నారు.
అందుకోసం వాళ్ళు షో మధ్యలో తమ పిల్లలతో మాట్లాడుతున్నట్లు చూపుతున్నారు.
"ఐ మిస్ యు" అంటూ వాళ్ళు ఏడుస్తుంటే, ప్రోగ్రాం చూస్తున్న పిల్లలు కూడా తమ పేరెంట్స్ అక్కడ ఉన్నట్లు ఫీల్ అవుతున్నారు. కానీ ఫోన్ ముగియగానే వాళ్ళు, పక్కవాళ్ళతో అవసరానికి మించి చనువుగా ఉంటున్నారు. అది చూసిన ప్రేక్షకులు ‘ఇంతసేపు ఆ పార్టీసిపెంట్స్ పిల్లలమీద, భార్య లేదా భర్త మీద చూపించిన ప్రేమ నటనేనా’ అనుకుంటున్నారు. అయినా ఇలానే తియ్యాలనుకుంటే వాటిని ఏ సర్టిఫికెట్ తో ఏ అర్థరాత్రో ప్రసారం చెయ్యండి. నలుగురూ కలిసి కూర్చొని చూసే సమయంలో కాదు" చెప్పింది కిరణ్మయి.
"కానీ ఇలాంటి ప్రోగ్రామ్స్ కి జనాదరణ బాగా ఉందని మా సర్వేలో తేలింది.." అంటూ ఏదో చెప్పబోయాడు రెండో మనస్తత్వ వేత్త.
“సగటు గృహిణికి కాలక్షేపం టివి. కాబట్టి ఉన్నవాటిలో కాస్త బావున్న ప్రోగ్రాం చూస్తారు.
అంత మాత్రాన ఆ ప్రోగ్రాం లో చూపించిన ప్రతిదీ వాళ్ళు ఆమోదించినట్లు కాదు.
మీరు చూపించే కొన్ని సన్నివేశాలు బాగున్నాయా లేదా అని తెలుసుకోవడానికి సర్వేలు అవసరం లేదు. మీరు మీ కుటుంబంతో కలిసి కూర్చొని చూడగలుగుతున్నారా లేదా అని ఆలోచించండి.. అవి ఎంత ఎబ్బెట్టుగా ఉన్నాయో మీకు అర్థం అవుతుంది.
ప్రేక్షకుల ఆదరణ పొందడానికి చాలా మార్గాలున్నాయి.
‘పాడుతా తీయగా’ లాంటి కార్యక్రమాలు ఎంతటి విజయం సాధించాయో మీకు తెలీదా? సమాజంలో ఉండే వివిధ సమస్యలపైన ప్రజల అభిప్రాయాలు అడుగుతూ తమిళంలో విసు చేసిన 'అరట్టై అరంగం' ప్రోగ్రాం సంచలనం సృష్టించింది కదా! కాబట్టి ప్రేక్షకులు చూస్తున్నారు కాబట్టి ఇలా తీస్తేనే ప్రేక్షకులు చూస్తారనే మీ వాదన పక్కన పెట్టండి." చెప్పడం ముగించింది కిరణ్మయి.
"అయితే 'చిన్నదొర' రియాలిటీ షో చెయ్యనంటారా?" అడిగాడు ఎండీ.
"చేస్తాను. అయితే మీరనుకున్న ప్రోగ్రాం కాదు. 'చిన్నదొర' అన్న పేరు వినగానే నా మదిలో ఒక గేమ్ షో కి ఆలోచన వచ్చింది. వివిధ రకాల పరిస్థితులలో పిల్లల మనోభావాలు ఎలా ఉంటాయో చిత్రీకరిస్తాను. తరువాత ఇప్పుడు తెర వెనుక వున్న ఈ విశ్లేషకులు తెర పైకి వచ్చి ఆ పిల్లల మనస్తత్వాల గురించి, అందుకు దారితీసిన పరిస్థితుల గురించి వివరిస్తారు. వాళ్ళ పేరెంట్స్ ని వేదిక మీదకు పిలిచి, వారికీ తగిన సలహాలు ఇస్తారు. అవసరమైతే కౌన్సిలింగ్ ఇస్తారు.
అలాంటి ప్రోగ్రాం కావాలంటే సాయంత్రం లోపల కాల్ చెయ్యండి. సక్సెస్ చేయించే బాధ్యత నాది" అని చెప్పి బయటకు నడిచింది కిరణ్మయి.
ఆమె బయటకు రాగానే డ్రైవర్ కారు డోర్ తెరిచాడు.
కారు స్టూడియో గేట్ దాటిన కాసేపటికే అతని ఫోన్ మోగింది.
"ఒక్క నిముషం మేడం. సోనియా మేడం ఫోన్ చేశారు" అంటూ కారును రోడ్ పక్కగా ఆపాడు డ్రైవర్.
'నాతో వీళ్లకు అవసరం లేదు కదా! కారులో వదలడం దండగని అనుకొని ఉంటారు' అనుకుంటూ కారు దిగింది కిరణ్మయి.
అంతలో ఆమె ఫోన్ మోగింది.
మైకం టివి ఛానల్ ఎండీ కాల్ చేసాడు.
"మేడం.మీరు చెప్పిన థీమ్ తోనే కంటిన్యూ అవుదాం.
వీలుంటే ఇప్పుడే అగ్రిమెంట్ చేసుకుందాం" అన్నాడతను.
తిరిగి కారులో కూర్చొని, "స్టూడియోలోకి పోనివ్వు" అంది కిరణ్మయి ఆత్మ విశ్వాసంతో, ఒకింత విజయగర్వంతో.
***సమాప్తం***
గమనిక: ఈ కథలోని పాత్రలు, సన్నివేశాలు పూర్తిగా కల్పితం. ఎవరినీ ఉద్దేశించి రాసినవి కాదు.
మల్లవరపు సీతారాం కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
https://linktr.ee/manatelugukathalu
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
https://www.facebook.com/ManaTeluguKathaluDotCom
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).
https://www.manatelugukathalu.com/profile/msrkumar/profile
.