top of page
Original.png

అడవిలో ఊపిరి

#AdaviloUpiri, #అడవిలోఊపిరి, #LakshmiRaghavaKamakoti, #లక్ష్మీరాఘవకామకోటి, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

ree

Adavilo Upiri - New Telugu Story Written By Dr. Lakshmi Raghava Kamakoti

Published In manatelugukathalu.com On 28/11/2025 అడవిలో ఊపిరి - తెలుగు కథ

రచన: డా. లక్ష్మీ రాఘవ కామకోటి

తాతయ్య ఊరు రాఘవపురం జ్ఞాపకాలు ఎప్పుడూ అభినవ్ మనసులో మెదులుతుంటాయి. చిన్నప్పటి సంగతులు ఎప్పుడూ మరచిపోలేనివి. ప్రతి సెలవులకు తాతయ్య ఊరు రాఘవపురం వెళ్ళాల్సిందే.. పల్లె పరిసరాలు, నాన్నమ్మ తాతల ఆప్యాయతలూ పిల్లలకు తెలియాలని నాన్న ఆరాటం. తాత రాఘవయ్య ఆయుర్వేద వైద్యుడు. రాఘవపురం వెళ్ళినప్పుడల్లా తాత అభినవ్ ని పొలాల గట్టున షికారు కు తీసుకెళ్ళేవాడు. అలా వెళ్తున్నప్పుడు పల్లె దగ్గరగా ఉన్న అడవి గురించి ఎక్కువ చెప్పేవారు “ఆ అడవిలోని గాలి పవిత్రం నాన్నా. దానిని పీల్చడం ఎంత మంచిదో.. అందుకే నేను నా రోగులను కొన్నిసమయాలలో అక్కడికి తీసుకెడతాను” అని దూరంగా వేలు చూపుతూ చెప్పే వారు. 


‘అక్కడికి వెడదాం’ అని మొండి చేసిన అభినవ్ కు ‘దారి కష్టం. నీవు నడవలేవు ’ అని అభినవ్ ఇంకాస్త పెద్దయ్యాక వెడదామనీ అనునయించేవాడు. ఆ కోరిక పూర్తి కాకనే తాతయ్య పోవడం తో అభినవ్ కి అడవిలో కెళ్ళి ఊపిరి పీల్చుకోవాలన్న తీరనే లేదు. ఎందుకో తాతయ్య చెప్పిన సంగతులు మాత్రం మరచిపోలేక పోయాడు.. 


**** 

ఇప్పుడు అభినవ్ ఒక టెక్నాలజీ ఇంజనీర్‌. డ్రోన్ టెక్నాలజీలో బాగా పేరు తెచ్చుకున్నాడు. ఒకరోజు పాత ఫోటోల్లో తాత ఊరి పచ్చని అడవి కనిపించగానే మనసులో ఏదో కదలిక.. “తాతయ్య ఊరి అడవి ఎలా ఉందో, డ్రోన్‌తో చిత్రీకరిస్తే బాగుంటుంది” అని నిర్ణయించాడు. 


వెంటనే రాఘవపురం కు వెళ్ళాడు. అక్కడ అతని డ్రోన్ ఆకాశంలో ఎగిరింది. కెమెరా స్క్రీన్‌లో పచ్చని పల్లె, చెట్ల గుంపులు, కొండల సరిహద్దులు కనిపిస్తున్నాయి కానీ ఒక్క ఫ్రేమ్‌లో ఏదో అసాధారణం.. అక్కడి ఒక చోట గుంపుగా ఉన్న చెట్ల సమూహం మనిషి ఊపిరితిత్తుల ఆకారంలో ఉంది! అభినవ్ కళ్ళు మెరిసాయి “ఇది ప్రకృతి ఏదో ఆలోచనతో గీసిన అద్భుతం!” అనిపించింది. ఆ దృశ్యంఅతని మనసును గట్టిగా తాకింది. రాత్రికి ఆ ఫోటోలతో కలిసి ఒక ఆర్టికల్ రాశాడు “అడవిలో ఊపిరి” అనిశీర్షిక పెట్టాడు. 


“మనిషి ఊపిరి తీసుకుంటాడు ప్రకృతితో. కానీ ప్రకృతికీ ఊపిరితిత్తు లున్నాయి ఈ అడవిలో.. "


ఆ అడవిలోగాలి చాలా మంచిదని తాత తన రోగులను అక్కడ తీసుకెళ్ళేవారని, అరుదైన మూలికలు దొరికేవని ఆయన మాటల ద్వారా తెలిసిందని తాతయ్య చెప్పిన జ్ఞాపకాలను కూడా చేర్చాడు. ఆ ఆర్టికల్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన రెండు రోజుల్లోనే వైరల్ అయిపోయింది. వేలాది మంది షేర్ చేశారు. “ఇది సైన్స్ అద్భుతం!” అని కొందరు, “ఇది మన దేశంలో ఒక విచిత్రం!” అని ఇంకొందరు వ్యాఖ్యలు చేశారు. 


కొద్దిరోజుల్లో పర్యావరణ పరిశోధకులు కొందరు ఆసక్తి కొద్దీ అడవికి వచ్చారు. పరీక్షల తర్వాత “ఇక్కడి ఆక్సిజన్ స్థాయి సాధారణం కంటే ఎక్కువగాఉంది. ” అని ప్రకటించారు. అయితే ఆరాత్రే అభినవ్ కి ఒక అనామక మెసేజ్ వచ్చింది.. “నీ డ్రోన్ చూసింది, కానీ నీవు చూడలేదు. జాగ్రత్తగా ఉండు!. ” 


ఇది ఎలాటి బెదిరింపో కానీ ముందుకు తను దేనికి కారణం అవుతాడో అప్పుడు ఊహించలేక పోయాడు!


మనసులో అలజడి ప్రారంభం అయ్యింది. అభినవ్ కి. ఏమైనా సరే అడివి గురించి ఇంకా తెలుసుకోవాలనే పట్టుదలపెరిగింది, అది తాతయ్య ఇంట్లో శోధనతోనే మొదలై అక్కడే తనకు జవాబు దొరకాలి అన్నఉద్దేశ్యం కలిగింది. వెంటనే రాఘవ పురం చేరుకున్నాడు. ఆ పాత ఇంట్లో తాతయ్య గది కి తాళం ఉంది. అది తీసి లోపలకు అడుగుపెట్టాడు. ఆ గదిలో దుమ్ము, పాత వాసన, గాలిలో ఏదో వింత అనుభూతి!. శిధిలావస్థలోఉన్న తాతయ్య టేబుల్ సొరుగు తీస్తే ఒక పాత డైరీ కనిపించింది. మొదటి పేజీలో తాతయ్య చేతిరాతలో “అడవిలో ఊపిరి.. జీవం, మరణం మధ్య గీత. ” 


అది ఏమిటో బొత్తిగా బోధ పడలేదు.. కాకపోతే లోపలి పేజీలలో రాత కూడా అర్థం కాలేదు. చివరి పేజీలు చించబడి ఉన్నాయి. ఇంకా ఏదో రాసి ఉంటాడు అన్న అనుమానం వచ్చింది. తాతయ్య మాటలు అకస్మాత్తుగా జ్ఞాపకం వచ్చాయి. 


“ఎవరూ ఆ అడవి లోతులోకి వెళ్ళకూడదు నాన్నా.. అక్కడి ఊపిరి శాంతంగా ఉంటుంది, దాన్ని కెలక కూడదు.. ” 


ఆ మాట అప్పట్లో అస్సలు అర్థం కాలేదు. ఇప్పుడు తెలుసుకోవడం ఎలా?.. వెంటనే తన ఫ్రెండ్ సమీరా బయోకెమిస్టు అన్నది గుర్తుకు వచ్చి కాంటాక్ట్చేశాడు, ఆమె గాలి నమూనాలను పరీక్షిస్తుందని తెలిసి చాలా సంతోషపడి తాతయ్య ఊరు, అక్కడి అడివి, అతని డైరీ అన్నీ వివరంగా తెలిపాడు. రెండురోజుల్లో సమీరా, అభినవ్ దగ్గరికి వచ్చింది. 


ఇద్దరూ కలిసి అడవిలోకి అడుగుపెట్టారు. గాలి నెమ్మదిగా వీస్తూంది. చుట్టూ చల్లగా, పక్షుల కిలకిలారావాలు.. సమీరకు చక్కటి వాతావరణం చాలా నచ్చి అక్కడి గాలిని పరిశోధన చేయాలనిపించి మొదలుపెట్టింది. కొద్దిసేపట్లోనే “ఇక్కడగాలిలో ఆక్సిజన్ శాతం మామూలు క౦టే 35% ఎక్కువ ఉంది. ఇది సహజం కాదు. మీ తాతయ్య ఈ విషయం గురించి పరిశోధన చేసినట్టు ఉన్నారు. ” అంది. 

అభినవ్ వీడియో లో ఊపిరి తిత్తుల ఆకారాన్ని మరోమారు చూసి ఆమె ఆశ్చర్యపోయింది. అప్పుడు ఆ ఇద్దరికీ తెలియని విషయం అభినవ్ ఆర్టికల్, వీడియో చూపిన  తరువాత బయట ప్రపంచం లో ఎంత సంచలనం కలిగింది అన్నది! ఎక్కడైనా అవకాశవాదులు దోచుకోవడానికి కాచుకుని ఉంటారు అన్నది సత్యం!!!


మరురోజు వచ్చింది పేపర్లలో, మీడియాలో ఒక పెద్ద వార్త! GreenLung Pvt. Ltd. అనే కంపెనీ ఆ ప్రాంతాన్ని “ఆక్సిజన్ ప్రాజెక్ట్” పేరుతో తీసుకుంటున్నట్లు, దానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని. !“


మేము ప్రకృతిలోని ప్యూర్ ఆక్సిజన్‌ను ప్రిజర్వ్ చేసి, ప్రపంచానికి అందించబోతున్నాం. ” అని వారు చేసిన ప్రకటన అందరికీ మెరుపుల్లా అనిపిస్తే ఆ వార్త అబినవ్, సమీరా లను నివ్వెర పరిచాయి. రాఘవ పురం గ్రామస్థులు మొదట గర్వపడ్డారు. “మన ఊరు టీవీలో వస్తుంది!” అని పిల్లలు ఉత్సాహపడ్డారు. కానీ “ప్రకృతి మన ఊరికి ఇచ్చిన వరమని భావిస్తే, దాన్ని వ్యాపారం చేస్తున్నారు!” అని పెద్దలు తలలు పట్టుకున్నారు. 


****

కొద్దిరోజుల్లోనే అక్కడి చెట్ల మధ్య ఇనుప కంచెలు వేసారు. గట్టిగా హమ్ చేసే యంత్రాలు అమర్చారు. చెట్లమధ్య ఇనుప పరికరాలు, సైలెన్సర్లాంటి మిషన్లు, రాగిపైపులు వచ్చాయి. క్రమంగా అక్కడి గాలి చల్లదనం పోయిoది. చెట్ల మొదట్లో తడిమట్టి ఆవిరవుతున్నట్టుంది. పూల సువాసన కదలకుండా గాలిలో నిలిచిపోయినట్టుంది. వంశీ ఆ ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్న నేచురల్ సైన్సెస్‌లో రీసెర్చ్ అసిస్టెంట్‌. అతను ఈ మార్పును గమనించి “సర్, చెట్ల మధ్య ఎలక్ట్రో-సక్షన్ మిషన్లువేస్తే వేర్లకు ఆక్సిజన్ తగ్గిపోతుంది, ” అని హెచ్చరిక చేశాడు. 


కానీ కంపెనీ సీనియర్‌ మేనేజర్ నవ్వుతూ “నేచర్‌ని మనం కంట్రోల్ చేయగలం వంశీ, నేచర్ ఈజ్ మేకబుల్!” అన్నాడు. ‘ఇదిప్రకృతి శ్వాస తీసుకునే స్థలం.. దానికే మనం నాసిరకం ఆక్సిజన్‌ మాస్క్‌ పెట్టినట్టే’ అని వంశీ బాధపడ్డాడు. కొన్నిరోజులు గడిచాక, చెట్లఆకులు ఎండిపోవడం ప్రారంభమైంది. వంశీ ఆందోళనగా డేటా పరిశీలిస్తే ఆక్సిజన్ లెవల్ తగ్గిపోతోంది! 


“ఇదితప్పు దారిలో వెళ్తోంది!” అని వంశీ గొంతు విప్పిన వెంటనే అతడిని ప్రాజెక్ట్‌ నుంచి తొలగించారు. ఆ రాత్రేవంశీ అభినవ్‌ మెయిల్‌ వెదికి “సర్, మీ ఆర్టికల్‌నేను చూశాను. ఈ ప్రాజక్ట్ లోకి రావడం నా అదృష్టం అనుకున్నాను. మీ వల్ల ప్రపంచం ఈ అడవిని చూసింది. కానీ ఇప్పుడు దాన్ని చంపుతున్నారు. మీ తాతయ్య ఊపిరి ఆగిపోతోంది. ”


అభినవ్‌ ఆ మెయిల్‌ చదివిన తర్వాత గుండె లోపల ఏదో విరిగినట్టయ్యింది. తాతయ్య ముఖం గుర్తొచ్చింది. అతని మాటలు కూడా “ప్రకృతిని గౌరవిస్తే, అది మన ప్రాణాన్ని కాపాడుతుంది నాన్నా. ” 


చాలా బాధగా అనిపించింది. సమీర ను కాంటాక్ట్ చేశాడు. ఆమె తాతయ్య ఇంటిలో దొరికిన డైరీ గుర్తుజేసింది. అందులో ఇంకా ఏదో రాసి ఉండాలి.. ఆ ఆక్సిజన్ దోపిడీని ఆపాలంటే దానిలో విశేషాలు తెలియాలి అని చెప్పింది. ఏమి చేయాలి అన్నది చర్చకు వచ్చింది.


 "ఇది కేవలం చెట్ల సమూహం కాదు, ఇది ఒక బలమైన జీవ మండలంలా అనిపిస్తుంది " అని వివరంగా అభినవ్ కి చెప్పింది. ఇది తాము ఇద్దరూ కలిసి విశ్లేషణ చేస్తే ఏదీ తేలదు అని కాస్త సమాలోచన చేశాక తాతయ్య పరిశోధన డైరీలో ఉన్నది తెలుసుకోవడానికి వద్దతిగా ప్రభుత్వానికి తెలియజేస్తే వారు ఈ డైరీ ని స్కాన్ చేసి అధికారకంగా ఫోరెన్సిక్, క్రిప్టో-విశ్లేషణ, లింగ్విస్టిక్ విశ్లేషణ మరియు డిజిటల్ టూల్స్ తో తెలుసు కుంటారని, వీడియో లో ఊపిరి తిత్తుల ఆకార౦ ఉండటానికి ప్రత్యేకతను ఎందుకు ఉందో కూడా తెలుసు కుంటారని. ఈ అడివి దోచుకోకుండా ఉండాలి అంటే ప్రభుత్వ సహకారమే అవసరం. దానికి ముందు ఇంకా కొన్ని ఆధారాలు కావాలని తెలిసాక అభినవ్ ఆలోచనలో పడి వెంటనే సమీరను తీసుకుని అడవికి వెళ్లాడు. 


ఇద్దరూ డ్రోన్ సిగ్నల్ ద్వారా ల్యాబ్‌ దారిపట్టారు. చెట్ల గుంపు పైనే గుట్టలో టెంట్లు, పరికరాలు, గ్యాస్ ట్యాంకులు ఉన్నాయి. అందులోని ఒక ట్యాంక్ మీద లేబుల్ “Human Oxygen Filter” అని ఉంది. సమీర నిశ్శబ్దంగా కొన్ని ఫోటోలను తీసింది. డ్రోన్ విడియోలు అభినవ్ తీశాడు. బయట అడివి ఒక వైపు ఎండి పోయింది గమనించారు. ఇప్పుడు అక్కడ ఇనుప వాసన మాత్రమే ఉంది. రెండు రోజుల్లోనే డ్రోన్‌తో తీసిన వీడియోలతో, కొన్ని ఫోటోలు జత పరిచి, తాతయ్య డైరీ గురించిన విశేషాలతో, వంశీ ఇచ్చిన ఆధారాలతో పర్యావరణ శాఖకు పిర్యాదు చేశాడు. అంతే కాదు, ఒక పెద్ద పత్రికకు “ప్రకృతి ఊపిరిని ఎవరుఅమ్ముకుంటున్నారు?” అనే కొత్త ఆర్టికల్‌ రాశాడు. 


ఆ కథనం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. మీడియా, పర్యావరణ సంఘాలు, ప్రజా ప్రతినిధులు.. అందరూ స్పందించారు. ప్రభుత్వం విచారణ ఆదేశించి, కంపెనీ లైసెన్స్ రద్దు చేసింది. “GreenLung ప్రాజెక్ట్నిలిపివేత!” అన్న వార్త అభినవ్ కి ఎంతో ఊరటనిచ్చింది. కొన్నినెలల తరువాత.. ఆ ప్రాంతం అధికారికంగా Eco-ReserveZone గా ప్రకటించబడింది.. యంత్రాలు పూర్తిగా తొలగించబడ్డాయి. వర్షాలు తిరిగి వచ్చాయి. పక్షులు కూశాయి. అడవి మళ్ళీ పచ్చదనాన్ని పొందింది. 


అంతే కాదు, తాతయ్య డైరీ ఆధారంగా అడవి రహస్యాలను ఛేదించడానికి పరిశోధనా బృందం ఏర్పడింది. భవిష్యత్తులో ఆ అడవికి ఉన్న ప్రాముఖ్యతను దేశానికే చాటాడానికి రంగం సిద్దమైంది.. అభినవ్ చాలా సంతోషపడ్డాడు. తనకు తోడుగా నిలిచిన సమీరాను తీసుకుని ఒక రోజు అడవికి వెళ్ళి చెట్ల మధ్యగా నిలబడ్డారు.  


సమీర చుట్టూచూస్తూ “ఇది పచ్చని సముద్ర౦ అభినవ్” అంది. అభినవ్‌ కూడా తల ఎత్తి పైకి చూసాడు. ఇద్దరూ ఆ దృశ్యాన్ని మౌనంగా ఆస్వాదించారు. “నువ్వు ఆపక పోతే ఈ ఊపిరి ఆగిపోయేది, ”ఆమె మెల్లగా అంది. 


అభినవ్‌ నవ్వుతూ చెప్పాడు “నా పాత్ర నిమిత్తమాత్రమే సమీరా. ఆ కాలంలో ఈ అడివి ప్రాముఖ్యం తెలుసుకుంది తాతయ్య. ఆయన గ్రేట్. ప్రకృతి లో ఇలాటి అద్బుతాలు ఉన్నాయని నా ద్వారా చెప్పించారు. ఇంకా డైరీ లో ఉన్న రహస్యాలు బయటికి వస్తే నా ప్రయత్నం తాతయ్య గుర్తుగా నిలిచిపోతుంది। ఒక్కటి చెప్పాలి సమీరా, మనిషికి టెక్నాలజీ ఇచ్చింది ప్రకృతి. కానీ టెక్నాలజీని ప్రకృతి మీదే తప్పుగా వాడితే మన ఊపిరే తగ్గిపోతుంది అన్నది సత్యం!”


సమీరా ఆమాటలు వింటూ చెట్ల వైపు చూసింది. ఆకాశంనుంచి చినుకులు పడుతున్నాయి. గాలి తేలికగా వీచుతోంది. ఆ గాలి, ఆ తేమ.. అది ప్రకృతి శ్వాస అది తాతయ్య ప్రపంచం!.. ప్రకృతి మనకోసం ఆక్సిజన్ ఇస్తుంది. మనిషి అది అమ్మకం చేయాలనుకునే క్షణంలో.. తన ఊపిరినే కోల్పోతాడు అని తాతయ్య మరోసారి చెబుతున్నట్టే అనిపించింది అభినవ్ కి. 


*****$****


డా. లక్ష్మీ రాఘవ కామకోటి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

ree

రచయిత్రి పరిచయం:

డా. లక్ష్మీ రాఘవ, విశ్రాంత జంతుశాస్త్ర రీడర్ రచయిత్రి మరియు ఆర్టిస్టు

సాహితీ ప్రయాణం – 1966 లో ఆంధ్ర సచిత్ర వార పత్రిక లో మొదటి కథ.

ఇప్పటి దాకా ఏడు కథా సంపుటాలు, ఒక స్మారక సంచిక, ఒక దేవాలయ చరిత్ర ప్రచురణ.

గుర్తింపునిచ్చిన కొన్ని పురస్కారాలు.

కన్నడ భాషకు అనువదింపబడిన ”నా వాళ్ళు’, “అనుభ౦ధాల టెక్నాలజీ” అన్న రెండు కథా సంపుటులు, .

అనేక సంకలనాలలో కథలు.

కథల పోటీ నిర్వహణ, పోటీలలో న్యాయ నిర్ణేతగా వ్యవహరించడం సాహిత్యపు అనుభవం.


రచనలే కాకుండా కళల పై ఆసక్తి, ఆర్టిస్టు గా "wealth out of waste “అంటూ ఎక్జిబిషన్ ల నిర్వహణ



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page