top of page
Original.png

మూలాలు

#వసుంధరరాణిమునిపల్లె, #VasundharaRaniMunipalle, #Mulaalu, #మూలాలు, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Mulalu - Telugu Inspirational Story - Vasundhara Rani Munipalle

మూలాలు తెలుగు కథ

రచన: వసుంధర రాణి మునిపల్లె 

మనిషికి రెక్కలు వచ్చాయని ఎగరడం ఒక్కటే కాదు, ఆ రెక్కలు అలసిపోయినప్పుడు నేల మీద  ఎలా నిలబడాలో కూడా తెలిసి ఉండాలి.

​సువిక ఒక  మధ్యతరగతి అమ్మాయి. చిన్నప్పటి నుంచి తండ్రి పడే కష్టం, అమ్మ చేసే పొదుపు చూస్తూనే పెరిగింది.  సువిక కష్టపడి చదువుకుని ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో పెద్ద జీతంతో ఉద్యోగం సంపాదించింది. చేతి నిండా డబ్బులు వచ్చేసరికి అప్పటివరకు వాయిదా వేసుకున్న కోరికలన్నీ ఒకేసారి పడగ విప్పాయి. సువికకు ఒక్కసారిగా ఆకాశంలో విహరించడానికి రెక్కలు వచ్చినట్లయింది. మనసులో ఏ చిన్న ఆలోచన వచ్చినా వెంటనే ఫోన్ తీసి ఆర్డర్ పెట్టేయడం ఆమెకు అలవాటైపోయింది.


​ఈ కాలం ఆడపిల్లలం, మన కష్టార్జితాన్ని మన ఇష్టానికి ఖర్చు పెట్టుకోకపోతే ఇంకెందుకు అనే భావన సువికలో బలంగా ఉండేది. ఏ కోరికా తీరకుండా మిగిలిపోకూడదని ప్రతి విషయంలోనూ నిర్ణయాలు టక్కున తీసేసుకునేది. తన డబ్బు, తన ఇష్టం అనే వ్యక్తిత్వం పెరగడంతో తన విషయాల గురించి ఇంకొకరి అనుమతి తీసుకోవడం ఆమెకు నచ్చలేదు. అందుకే  తన గదిని ఖరీదైన వస్తువులతో నింపేసింది.


అప్పటివరకు  స్నానపు సోపు వాడే సువిక, ఇప్పుడు తన బాత్రూమ్‌ను రకరకాల బాత్ జెల్స్, బాడీ వాష్‌లతో నింపేసింది. తన సహజమైన గిరజాల జుట్టును ఇంకాస్త అందంగా మార్చడానికి రకరకాల సీరమ్స్, అదే జుట్టును నిటారుగా మార్చడానికి ఖరీదైన హెయిర్ స్ట్రైట్నర్లు, విదేశీ బ్రాండ్ల మేకప్ సామాన్లు, రకరకాల షాంపూలు.. ఇలా ఒకటేమిటి వందలాది ప్రొడక్ట్స్ ఆమె గదిలోకి వచ్చి చేరాయి. ఇల్లంతా సువిక కొన్న వస్తువులతో నిండిపోయి ఒక చిన్నపాటి షాపులా మారిపోయింది. అక్కడితో ఆగకుండా తన తమ్ముడికి కూడా అడిగిందల్లా కొనివ్వడం మొదలుపెట్టింది. వాడికి ఆడంబరాలు అలవాటు చేయకు, కష్టం విలువ తెలియకుండా పెరుగుతున్నాడు అని వాళ్ళ అమ్మ ఎన్నిసార్లు మొత్తుకున్నా సువిక వినేది కాదు.


​కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. సువిక పనిచేస్తున్న కంపెనీలో ఆర్థిక సంక్షోభం వచ్చి హఠాత్తుగా ఆమె ఉద్యోగం పోయింది. చేతిలో చిల్లిగవ్వ లేదు, కానీ అప్పటికే కొన్న వస్తువుల తాలూకు క్రెడిట్ కార్డు బిల్లులు మాత్రం కొండలా పేరుకుపోయాయి. అదే సమయంలో తమ్ముడు వచ్చి తను ఎప్పటి నుంచో కోరుకుంటున్న ఒక ఖరీదైన వస్తువు కొనిమ్మని అడిగాడు. సువిక  వచ్చే నెల చూద్దాం అంది. అంతే.. అప్పటివరకు అక్క ప్రేమను తను అడిగిన వస్తువుల రూపంలోనే చూసిన తమ్ముడు కోపంతో రగిలిపోయాడు. అక్కా మొన్నటిదాకా అడిగిందల్లా ఇచ్చావు, ఇప్పుడెందుకు ఇలా చేస్తున్నావు? నువ్వు మారిపోయావు! అని నిష్టూరంగా అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.


​వాడు అన్న ఆ మాట సువిక గుండెల్లో బాణంలా దిగబడింది. తన గది నిండా ఉన్న ఆ సీరమ్స్, కాస్మెటిక్స్, ఖరీదైన వస్తువులు ఏవీ తన కష్టాన్ని తీర్చలేవని ఆమెకు అప్పుడు అర్థమైంది. ఆ సమయంలో వాళ్ళ అమ్మ సువిక దగ్గరకు వచ్చి, నిశ్శబ్దంగా తన గదిలో ఉన్న ఆ వస్తువులన్నింటినీ ఒక్కసారి కలియజూసింది. సువిక కళ్ళలో ఉన్న నిస్సహాయతను చూసి అమ్మ ఇలా అంది. "చూశావా సువిక, గిరజాల జుట్టును నిటారుగా చేసే మిషన్లు కొన్నావు కానీ, జీవితంలో వచ్చే ఒడిదుడుకులను ఎదుర్కోవడానికి కావాల్సిన ధైర్యాన్ని మాత్రం కొనుక్కోలేకపోయావు. ఈ సీరమ్స్, ఈ మేకప్ సామాన్లు నీ ముఖానికి మెరుపును ఇస్తాయేమో కానీ, కష్టం వచ్చినప్పుడు నీ కన్నీళ్లు తుడవలేవు."


సంపాదన ఎప్పుడూ ఒకేలా ఉండదు, కానీ సంస్కారం, పొదుపు అనేవి ఎప్పుడూ మనల్ని కాపాడే కవచాలు. ఖర్చు పెట్టి మిగిలింది పొదుపు చేయడం కాదు, ముందు పొదుపు చేసి ఆ తర్వాత మిగిలింది ఖర్చు పెట్టుకోవాలి. నువ్వు తమ్ముడికి అడిగిందల్లా కొనిచ్చి వాడికి కష్టం అంటే ఏంటో అని తెలియకుండా మార్చావు తప్ప, అక్కగా వాడికి బాధ్యతను నేర్పించలేదు అంది.


మెల్లగా "ఈ నెల నీ క్రెడిట్ కార్డు బిల్లు ఎంత కట్టాలి? ఆ మొత్తాన్ని నేనిస్తాను అని అడిగింది. సువిక ఆశ్చర్యపోయి అమ్మ వైపు చూసింది. అమ్మ తను దాచుకున్న డబ్బును తీసి సువిక చేతిలో పెట్టింది. ఇదిగో ఈ అప్పు తీర్చేసి ముందు ఆ కార్డులు పక్కన పెట్టు. మనిషికి రెక్కలు వచ్చాయని ఎగరడం ఒక్కటే కాదు, ఆ రెక్కలు అలసిపోయినప్పుడు నేల మీద  ఎలా నిలబడాలో కూడా తెలిసి ఉండాలి. మన మధ్యతరగతి మూలాలే మనల్ని ఎప్పుడూ జాగ్రత్తగా కాపాడుతాయి అని గుర్తుంచుకో" అంది.


అమ్మ మాటల్లోని నిజాన్ని గ్రహించిన సువిక, ఆ వస్తువుల మోజును వదిలేసి మళ్ళీ తన ప్రయాణాన్ని బాధ్యతగా మొదలుపెట్టింది.


                   సమాప్తం 



వసుంధర రాణి మునిపల్లె గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):

వసుంధర రాణి మునిపల్లె గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం: వసుంధర రాణి మునిపల్లె


నాకు ఈ సదవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు.


నేనొక హౌస్ వైఫ్ ని నాకు కథలు రాయడం ఒక హాబీ.

ఇంతకుముందు జాగృతి లాంటి పత్రికలలో కథలు ప్రచురితమయ్యాయి. ఇంకా కొన్ని కథలు పరిశీలనలో ఉన్నాయి.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page