top of page
Original.png

మమకారం ముసుగు

#వసుంధరరాణిమునిపల్లె, #VasundharaRaniMunipalle, #MamakaramMusugu, #మమకారంముసుగు​, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు


Mamakaram Musugu - New Telugu Story Written By Vasundhara Rani Munipalle

Published In manatelugukathalu.com On 17/12/2025

మమకారం ముసుగు​ - తెలుగు కథ

రచన: వసుంధర రాణి మునిపల్లె 


​రమేష్ ఒక మంచి వ్యక్తి, మంచి కొడుకు మరియు మంచి భర్త. భవాని కూడా ఆ భర్తకు తగ్గ ఇల్లాలు. కాకపోతే గుడ్డిగా అందరిని నమ్మదు, తనకు మాలిన ధర్మం చేయదు. ఫాల్స్ ప్రెస్టేజ్ కోసం పోదు. 


అతని తల్లి రాజేశ్వరి దేవికి బంధువర్గంలో తన గురించి, తన పెంపకం గురించి గొప్ప పేరు, గౌరవం ఉండాలని ఆరాటం.


​ఈ సమయంలో, దేశంలో వివిధ ప్రాంతాలలో ప్రాణాంతకమైన అంటువ్యాధి ప్రబలింది. ఈ ప్రాంతాలలో సేవ చేయడం అంటే ప్రాణం మీద ఆశ వదులుకోవడమే.

​రాజేశ్వరి దేవి, బంధువుల మెప్పు కోసం ఈ అవకాశాన్ని వాడుకోవాలని చూసింది.


​"ఏ తల్లి అయినా కొడుకు ప్రాణానికి తన ప్రాణం అడ్డువేసి కాపాడుకుంటుంది. కానీ, ఈ తల్లి తన గొప్ప కోసం కొడుకు ప్రాణాన్ని పణంగా పెట్టింది."


​ఆమె రమేష్‌తో, "నువ్వు సేవ చేసి, బంధువుల్లో గొప్ప పేరు సంపాదించుకోవాలి. అప్పుడు అందరూ నా పెంపకం గురించి గొప్పగా చెప్పుకుంటారు, నా కొడుకు త్యాగాన్ని గురించి మాట్లాడుకుంటారు. అదే నాకు కావాలి!," అని పట్టుబట్టి, ఆ కార్యక్రమానికి పంపించింది.

​రమేష్ సేవలో పాల్గొనడానికి వెళ్లాల్సి వచ్చింది. కొన్ని రోజులకు, రమేష్‌కు ఆ ప్రాణాంతకమైన అంటువ్యాధి సోకింది. దానితో పోరాడి చివరికి ఓడిపోయాడు.


​రమేష్ కన్నుమూసిన తర్వాత, భవాని అతని ఫోన్‌ను పరిశీలిస్తుండగా, రమేష్ తల్లితో మాట్లాడిన చివరి సంభాషణ యొక్క కాల్ రికార్డింగ్‌ను కనుగొంది.


​ఆ రికార్డింగ్‌లో: రమేష్, "అమ్మా, నాకు అక్కడికి వెళ్లడం ఇష్టం లేదు. ఇది ప్రాణాపాయం. నా వల్ల కాదు," అని బతిమాలాడు... 


దానికి రాజేశ్వరి దేవి, "బంధువుల ముందు నా పరువు తీయకు. నువ్వు ఆ సేవ చేయాలి. నువ్వే వెళ్లాలి. యెట్టాగో అట్టా ఆ కార్యక్రమం పూర్తి చెయ్యాలి. దేవుడు చూసుకుంటాడులే, నీకేం కాదు," అంటూ అతన్ని పట్టుబట్టి పంపిందనే వాస్తవం స్పష్టంగా రికార్డై ఉంది.


​భవాని గుండెలు ముక్కలయ్యాయి, ఇంత చేసి ఒక అపరాధభావన లేకుండా అత్తగారు మామూలుగా ఎలా ఉండగలుగుతోందో అర్థం కాలేదు.


​రమేష్ అంత్యక్రియలు పూర్తయిన తర్వాత, కుటుంబ సభ్యులు మరియు బంధువులంతా ఉన్నప్పుడు భవాని... రాజేశ్వరి దేవిని నిలదీసింది.


​"మీ నటన చాలు అత్తయ్యా! నా భర్త ప్రాణానికి ప్రమాదం అని తెలిసినా, మీ బంధువర్గంలో గొప్ప కోసం పంపారు. మీరు ఆయన్ని ఒత్తిడి చేసిన కాల్ రికార్డింగ్ నా దగ్గర ఉంది. ఏమీ తెలియని అమాయకురాలిలా నటిస్తున్నారు కదూ? మీ నిర్లక్ష్యమే మా జీవితాన్ని నాశనం చేసింది!"


​రహస్యం బట్టబయలవడంతో, రాజేశ్వరి దేవి అహం దెబ్బతింది, ముఖ్యంగా బంధువుల ముందు తన పరువు పోయిందనే కోపంతో, "నేను పోతున్నాను. నన్ను తిరిగి రమ్మని బతిమాలినా రాను," అని బెదిరించి, ఇంటిని విడిచి వెళ్లిపోయింది.


​ఆమె ఊరిలో ఉన్న తమ పాత ఇంట్లో ఒంటరిగా ఉండటం మొదలుపెట్టింది. అలాగైతే సానుభూతి తన మీదే ఉంటుందని, లోకానికి భయపడి కోడలే కాళ్ళబేరానికి వస్తుందని ఆవిడ నమ్మకం.


​భవాని ఆవిడతో మాట్లాడటం పూర్తిగా మానేసింది. దాంతో, రాజేశ్వరి దేవి తన తదుపరి ఎత్తుగడను ప్రారంభించింది.

​భవాని తనతో మాట్లాడకపోవడంతో, రాజేశ్వరి దేవి ఇంట్లో ఉన్న తన మనవరాలితో ఫోన్‌లో మాట్లాడటం మొదలుపెట్టింది.


​ఆమె మనవరాలితో తన బాధలు, కష్టాలు, లేనిపోనివన్నీ చెప్పి భావోద్వేగ బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టింది. "మీ అమ్మ నన్ను చాలా బాధ పెడుతోంది. నాకు వండుకుని తినే ఓపిక లేదు, బయట తిండి పడదు. నేను ఇక్కడే ఒంటరిగా చనిపోతానేమో. నీకు నాయనమ్మ మీద ప్రేమ ఉంటే, మీ అమ్మను నన్ను రమ్మని చెప్పమ్మా," అంటూ అమాయకురాలైన మనవరాలిని ఉపయోగించుకోవాలని చూసింది.


​మనవరాలు ఈ విషయాలు భవానికి చెప్పడంతో, భవాని కోపం, బాధ రెండూ పెరిగాయి. తన అత్తగారి ఆటలు ఇంకా ఆపడం లేదని అర్థం చేసుకుంది.


​ఈ దశలో కూడా భవాని కాళ్ళబేరానికి రాలేదని గ్రహించిన రాజేశ్వరి దేవి, ఇంకొంచెం బలమైన నాటకానికి తెర లేపాలని నిర్ణయించుకుంది.


​రాజేశ్వరి దేవి, భావోద్వేగ బ్లాక్‌మెయిల్‌ను తీవ్రతరం చేయడానికి, భవాని ఇంటికి మూడు గంటల ప్రయాణ దూరంలో ఉన్న 'మాతృచ్ఛాయ వృద్ధాశ్రమం'లో చేరిపోయింది.


​వృద్ధాశ్రమంలో చేరిన తర్వాత కూడా, ఆమె తన పాత పద్ధతిలోనే బంధువుల దృష్టిని, సానుభూతిని పొందాలని ప్రయత్నిస్తూనే ఉంది.


​రాజేశ్వరి దేవి తన తప్పు ఒప్పుకుని, తన వల్లే కోడలి కుటుంబం తలకిందులైందన్న పశ్చాత్తాపం ఉండి ఉంటే, కోడలితో సహా బంధువర్గంలో అందరికీ ఆమె మీద జాలి ఉండేది. కానీ ఏమీ తెలియని అమాయకురాలిలా నటించడంవల్ల, ఏ బంధువుల కోసం గొప్పలకి పోయిందో, వాళ్ల దృష్టిలో కూడా తన విలువను పోగొట్టుకుంది. చివరికి ఒక పెద్ద దిక్కుగా కొడుకు కుటుంబానికి ఉండాల్సిన ఆవిడ, అహంకారంతో ఒంటరి జీవితాన్ని గడపవలసి వచ్చింది.

​రాజేశ్వరి దేవి వృద్ధాశ్రమంలో చేరిందనే విషయం తెలుసుకున్న భవాని, మరుసటి రోజు ఆ ఆశ్రమానికి వెళ్లింది. రాజేశ్వరి దేవి ఆనందపడింది.


​"అత్తయ్యా, నేను మీ సమస్యను పరిష్కరించడానికే వచ్చాను మిమ్మల్ని తీసుకెళ్లడానికి కాదు," అంటూ భవాని ఒక లీగల్ కాంట్రాక్ట్‌ను తీసి ఆమె చేతికి ఇచ్చింది.


​"మీరు బంధువుల్లో గొప్పగా ఉండాలని కోరుకున్నారు కదా అత్తయ్యా? మీ ఆ కోరిక నెరవేరుతుంది. మీ ఆస్తి వాటాను ఈ వృద్ధాశ్రమానికి ఒక పెద్ద డొనేషన్‌గా ఇవ్వడానికి అంగీకరిస్తున్నట్టు ఈ పత్రాలలో ఉంది. ఈ డబ్బుతో, ఈ ఆశ్రమానికి ఈ రోజు నుండి 'రాజేశ్వరి దేవి దాతృత్వ నిధి' అని నామకరణం చేస్తారు."


​"మీరు గొప్ప కోసం నా భర్త ప్రాణాన్ని ప్రమాదంలోకి నెట్టారు. మీరు కోరుకున్నట్లు, బంధువుల్లో గొప్ప దాతగా, గౌరవనీయురాలిగా ఇక్కడే ప్రశాంతంగా జీవించవచ్చు. మళ్లీ ఎప్పుడూ ఇంటికి రావలసిన అవసరం లేదు. నా బాధ్యతను నేను ఈ విధంగా నెరవేరుస్తున్నాను," అని భవాని స్థిరమైన కంఠంతో చెప్పి, వెనుదిరిగి చూడకుండా వెళ్లిపోయింది.


​ఎవరైనా వయసును అడ్డుపెట్టుకుని సానుభూతితో మనుషుల్ని గెలవడానికి ప్రయత్నించడం కన్నా, మంచితనంతో, ప్రేమతో ఆత్మీయుల్ని సంపాదించుకుని మనసులని గెలుచుకోవాలని తెలుసుకుంటే రాజేశ్వరి దేవిలాగా ఒంటరి జీవితాన్ని గడపవలసి రాదు

            

***

వసుంధర రాణి మునిపల్లె గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం: వసుంధర రాణి మునిపల్లె


నాకు ఈ సదవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు.


నేనొక హౌస్ వైఫ్ ని నాకు కథలు రాయడం ఒక హాబీ.

ఇంతకుముందు జాగృతి లాంటి పత్రికలలో కథలు ప్రచురితమయ్యాయి. ఇంకా కొన్ని కథలు పరిశీలనలో ఉన్నాయి.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page