top of page
Original.png

ఘటన - పార్ట్ 2

ఘటన పార్ట్ 2, సుధావిశ్వం, తెలుగు కథ, భావోద్వేగ కథ, కుటుంబ కథ, అక్కాచెల్లెళ్ల అనుబంధం, హ్యూమన్ ట్రాఫికింగ్, మహిళల భద్రత, సామాజిక అవగాహన, తెలుగు సాహిత్యం, క్రైమ్ స్టోరీ, హృదయ విదారక కథ, Mana Telugu Kathalu

పదహారు సంవత్సరాల తర్వాత ఆసుపత్రిలో అక్కాచెల్లెళ్లు కలుసుకుని భావోద్వేగంగా హత్తుకున్న తెలుగు కథ దృశ్యం.
పదహారు సంవత్సరాల తర్వాత ఆసుపత్రిలో అక్కాచెల్లెళ్లు కలుసుకుని భావోద్వేగంగా హత్తుకున్న తెలుగు కథ దృశ్యం.

Ghatana - Part 2 - Telugu Emotional Story | Sudhavishwam Akondi

ఘటన - పార్ట్ 2 - తెలుగు భావోద్వేగ కథ | సుధావిశ్వం ఆకొండి 

Published in manatelugukathalu.com on /07/2026


ఒక్క చిన్న సంఘటన జీవితాన్ని ఎంతగా మార్చగలదో చెప్పే భావోద్వేగ కథ "ఘటన – పార్ట్ 2". పదహారు సంవత్సరాల తర్వాత అక్కాచెల్లెళ్లు కలుసుకున్నా, విధి మరో విషాదాన్ని రాసిపెడుతుంది. మానవ అక్రమ రవాణా (Human Trafficking) వంటి భయానక సామాజిక సమస్యను హృదయాన్ని కదిలించేలా చూపిస్తూ, కుటుంబ బంధాల విలువను గుర్తు చేసే అద్భుతమైన తెలుగు కథ ఇది.


"మా అక్క మామూలు స్థితికి వస్తుందా? నన్ను గుర్తు పడుతుందా?" అంది భర్తతో.


"డాక్టరుతో మాట్లాడాను. పరీక్షలు అన్నీ చేశాక చెబుతామని అన్నారు. నువ్వు వర్రీ అవ్వకు. కొన్ని రోజుల్లో మామూలు అవుతుంది" అని భార్యకు ధైర్యం చెప్పాడు.


"నన్ను అర్థం చేసుకుని, మా అక్క బాగవ్వడానికి హాస్పిటల్ లో చేర్పించినందుకు చాలా సంతోషంగా ఉందండి! ఐయామ్ లక్కీ!" అంటూ చిరంజీవి చేతులను పట్టుకుని కాఫీ కప్పులు తీసుకుని వెళ్ళబోయింది సుభాషిణి.


ఆమె మామూలు స్థితికి వచ్చిందని అర్థమైంది చిరంజీవికి. ఆమె భుజాలు పట్టుకుని సోఫాలో కూర్చోబెట్టి అడిగాడు.


"సుభాషిణీ! నువ్వు నీలోనే పెట్టుకుని బాధ పడుతూ కూర్చుంటే బాధ పెరుగుతుందే కానీ తగ్గదు. పెళ్లయిన రోజు నుంచీ నువ్వు అప్పుడప్పుడు పరధ్యానంలోకి వెళ్ళిపోతూ ఏదో బాధ పడుతున్నట్లు కనిపించినా, ఎప్పుడూ నిన్ను విషయం ఏమిటో చెప్పమని బలవంతం చేయలేదు.


మొదట్లో అడిగితే ఏమీ లేదన్నావు. నీకు చెప్పాలని అనిపించినప్పుడే చెబుతావని ఊరుకున్నాను. మీ అక్క గురించి అని ఇప్పుడు తెలిసింది. కానీ నువ్వు ఏడుస్తూ అన్న మాటలను బట్టి నువ్వు ఏదో అపరాధ భావనతో బాధపడుతున్నావని అనిపిస్తోంది. 


అన్ని విషయాలు చెబితే నీ భారం తగ్గుతుంది. అసలు ఏం జరిగిందో చెప్పడం ఇంకా ఇష్టం లేకపోతే మానెయ్యి! నిన్ను బలవంతపెట్టను" అన్నాడు భుజం పైన వేసిన చెయ్యి అలాగే ఉంచి.


అప్పుడు జరిగిన విషయం చెప్పడానికి ఉద్యుక్తురాలైంది సుభాషిణి.


               ***

"ఆరోజు అక్క పుట్టినరోజు. నాన్న ఆఫీసు పని మీద ఊరికి వెళ్లారు. పొద్దున్నే ప్రక్క వీధిలోనే ఉన్న గుడికి వెళ్లి వచ్చాం! సాయంత్రం కేక్ కటింగ్ కోసం ప్లాన్ చేసుకున్నాం! ఆరోజు మా ఇద్దరికీ కాలేజీ సెలవు కావడంతో హ్యాపీగా గడుస్తుందని అనుకున్నాం! 


ఆరోజు చెడ్డ రోజు అవుతుందని ఊహించలేదు. సాయంత్రం ఇద్దరం వెళ్లి కేకు ఇంటికి తెచ్చుకుందామని అనుకున్నాం. అయితే చిన్న విషయానికి గిల్లికజ్జాలు పెట్టుకుని, పెద్ద గొడవ చేసుకుని అలిగి కూర్చున్నాం! 


మా అమ్మ ఇద్దరినీ తిట్టి సర్ది చెప్పాలని విఫల ప్రయత్నం చేసింది. కాసేపటికి అక్కనే కోపాన్ని సడలించుకుంది.


చిరు చీకట్లు ముసురుతున్నాయి. తన ఫ్రెండ్ కి ఇచ్చిన నోట్ బుక్ తీసుకుని, బేకరీ షాప్ నుంచి కేకు తెచ్చుకుందామని అక్క తనతో రమ్మని అడిగింది.


"సుభాషిణి! నా ఫ్రెండ్ వద్ద నా నోట్ బుక్ ఉండిపోయింది. అది రేపు కాలేజీలో చూపించాలి. తనని కాలేజీకి తెమ్మని చెబితే మర్చిపోతే కష్టం! అందుకని ఇప్పుడే వెళ్లి ఆ బుక్ తీసుకుని వస్తూ, బేకరీ షాప్ లో కేక్ తీసుకుని వద్దాం! నువ్వు కూడా రావే!" అని బ్రతిమిలాడింది.


"పో! నేను రాను! నువ్వు ఒక్కదానివే వెళ్లు! పెద్ద నువ్వు ఒక్కదానివే ధైర్యవంతురాలివి అన్నట్లు కోతలు కోశావు కదా! నేను భయపడితే నన్ను వెక్కిరించావు కదా!" అని నేను ముఖం తిప్పుకుని కూర్చున్నాను.


"అరే! నేనిప్పుడు ఏమన్నాను? కాలేజీలో వాడెవడో ఏదో అన్నాడని భయపడకు. ఇలా ధైర్యంగా ఉండు! నేను అలాగే చేశాను. వాడు భయపడి పారిపోయాడు అని చెప్పడం కూడా తప్పేనా?" అని ఎంత కన్విన్స్ చేసినా వినలేదు నేను.

            ***

"అమ్మ కూడా చెప్పి చూసింది. అప్పుడు అంత మొండిగా కూర్చున్నాను. చివరికి తనే ఒంటరిగా వెళ్లింది. తిరిగి ఇంటికి రాలేదు. వాళ్ల ఫ్రెండ్ ఇంట్లో అడిగితే, అసలు తను వాళ్లింటికి రాలేదని చెప్పారు. మరునాడు నాన్న వచ్చాక విషయం అంతా చెప్పాక నన్ను తిట్టారు. 


పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం! కానీ ఆచూకీ దొరకలేదు. అక్క గురించి బెంగ పెరిగిపోయి అమ్మానాన్న వరుసగా ఏడాది తేడాతో కాలం చేశారు. నన్ను అక్కడే ఊళ్లో బట్టల షాపు నడుపుకుంటున్న మా బాబాయి చేరదీసి చదివించాడు.


అప్పట్నుంచి అప్పుడప్పుడు పోలీస్ స్టేషన్ కి వెళ్లి అక్క గురించి తెలిసిందా అని అడిగి వచ్చేదాన్ని. మీతో పెళ్లి అయ్యాక వేరే ఊరికి వెళ్లడంతో పోలీస్ స్టేషన్ కి కాల్ చేసి అడిగేదాన్ని. కానీ ఈ మధ్య మీకు ఇటు బదిలీ అవ్వడంతో, పోలీస్ స్టేషన్ కి వెళ్లి అడిగి వస్తున్నాను అప్పుడప్పుడు. 


ఇన్నాళ్లకు అక్క దొరికిందని సంతోషించాను. కానీ అక్క నన్ను గుర్తుపట్టలేని స్థితికి వచ్చిందని బాధగా ఉంది!" అని అన్నీ వివరంగా భర్తతో చెప్పేసరికి కొంత భారం తగ్గినట్లుగా అనిపించింది ఆమెకు.

"వెరీ సాడ్! కానీ ఇందులో అపరాధ భావన పెట్టుకునేంతగా నీ తప్పు లేదు. నువ్వు ఇలా జరుగుతుందని ఊహించలేదు కదా! తోబుట్టువుల మధ్య గిల్లికజ్జాలు మామూలే! దురదృష్టం, ఇలాంటి సంఘటన జరిగింది..." భార్యను అనునయించాడు చిరంజీవి.


ఇలా వీళ్లు మాట్లాడుతూ వుండగానే హాస్పిటల్ నుంచి కాల్ వచ్చింది. అర్జెంట్ గా  రమ్మని చెప్పారు.

            *****

చెల్లిని గుర్తుపట్టింది సుహాసిని. ఏడుస్తూ చెల్లిని గాఢంగా హత్తుకుంది. కాసేపటికి ఇద్దరూ సేదతీరారు.


"హమ్మయ్య! అక్కా నన్ను గుర్తుపట్టావు. చాలా ఆనందంగా ఉంది. ఇక నువ్వు నాతోనే ఉండాలి" అంది సుభాషిణి.


"నేను కుళ్ళిపోయాను చెల్లీ! ఈ భయంకరమైన శరీరం నుంచి నాకు విముక్తి కలగాలని కోరుకుంటున్నాను. అమ్మానాన్న ఏరి? ఒక్కసారి మిమ్మల్ని అందరినీ చూసి మనశ్శాంతిగా చనిపోతాను" అంది సుహాసిని.


"అమ్మానాన్న నీ గురించి బెంగతోనే చనిపోయారు. నువ్వు ఎలాగైనా రావాలని రోజూ దేవుడికి మొక్కుకుంటూ ఉన్నాను. అలా అనకు అక్కా! నువ్వు నాతోనే ఉంటావు. అంతే!"


అప్పుడు సుహాసిని జీవం లేని నవ్వు నవ్వింది.


"ఎవరక్కా వాళ్లు? వాళ్లను..." అంటూ కోపంగా అంది సుభాషిణి.


"ఎవరో తెలియదే! మన వీధి చివర స్ట్రీట్ లైట్ వెలగడం లేదని అనుకున్నాం కదా! అక్కడి వరకూ వెళ్లగానే ఎవరో నా ముక్కుకు ఏదో తగిలించారు. అంతే నేను స్పృహ కోల్పోయాను. మెలకువ వచ్చేసరికి ఏదో వ్యానులో ఉన్నాను. 


నాతో పాటుగా ఇంకా ఆడవాళ్ళు ఉన్నారు. అందరూ కూడా నాలాంటి స్థితిలోనే ఉన్నారు. నేను ఎదిరించి మాట్లాడితే మళ్లీ వాసన చూపించగానే స్పృహ తప్పాను. చివరికి రెడ్ లైట్ ఏరియా లో తేలాను..." అని చెబుతూ ఏదో తెలియని ఒత్తిడి రావడంతో అలా కూలిపోయింది సుహాసిని.


చెల్లిని చూసిన సంతృప్తితో ఆమె ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. గుండెపగిలేలా ఏడ్చింది సుభాషిణి.

"ఆవిడ బ్రెయిన్ లో క్లాట్స్ వచ్చాయి. చాలాకాలం అయింది. బాగా ముదిరిపోయింది రోగం. సారీ! ఎంత ప్రయత్నం చేసినా కాపాడలేకపోయాం!" అని డాక్టరు చెప్పాడు.


"చివరి రోజుల్లో నిన్ను చూసినందుకు సంతృప్తితో కన్నుమూసింది. బాధ పడకు! మన చేతుల్లో ఏముంది.." అని భార్యను ఓదార్చాడు చిరంజీవి.


ఎవరికి ఎవరు ఎంతకాలమో! ఒక్కొక్కరి జీవితాలు ఒక్కోరకంగా గడుస్తాయి. ఉన్న చిన్న జీవితంలో ఈగోలు, ఆవేశాలు, గొడవలు, కక్షలు, కార్పణ్యాలు పెంచుకుంటూ పోతే మిగిలేవి ఏదో ఒక రూపంలో  బాధలు మాత్రమే. అందుకే అనవసరమైన విషయాల జోలికి వెళ్లకుండా ఉంటే జీవితం హాయిగా ఉంటుంది.

***


ఒక యథార్థ సంఘటనను కథగా మలిచి మీ ముందు ఉంచాను!

సుధావిశ్వం 



-సుధావిశ్వం






Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page