top of page
Original.png

కొడుకు మాట

11 minutes ago
7 min read

సుకుమార్ ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదానం చేస్తుండగా, అతని ఆఫీస్ సహాయకులు మరియు రక్తం కోసం ఎదురుచూస్తున్న తల్లి, కుమార్తె కనిపిస్తున్న దృశ్యం.

Koduku Maata - Telugu Family Comedy Story | Jeedigunta Srinivasa Rao

కొడుకు మాట - తెలుగు కుటుంబ హాస్య కథ | జీడిగుంట శ్రీనివాసరావు | ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత

Published In manatelugukathalu.com On 19/09/2026


కొడుకు మాట అనేది కుటుంబ హాస్యం, మానవత్వం, రక్తదానం విలువను కలిపిన చక్కని సామాజిక సందేశాత్మక కథ. శ్రీనివాసరావు జీడిగుంట రచించిన ఈ కథలో కిషోర్ అనే యువకుడు ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేస్తుంటాడు. అయితే అతని తండ్రి సుకుమార్ మాత్రం కొడుకు ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతూ, రక్తదానం చేయడాన్ని మొదట్లో వ్యతిరేకిస్తాడు.



"అబ్బాయి ఎక్కడికి వెళ్లాడే ఇంత ఉదయమే, కాలేజీ 10 గంటలకు కదా!" అన్నాడు భార్య రాధికతో సుకుమార్.


"ఏమో అండి, వాడి గదిలో లేడా?" అని అడిగింది మంచం దిగుతూ.


"ఉంటే ఎందుకు అడుగుతానే, బయట గేట్ తాళం తీద్దాం అని చూస్తే గేట్ బార్ల తెరిచివుంది, వీడి మోటార్ సైకిల్ లేదు" అన్నాడు.


కిషోర్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. కొడుకు అడిగాడు కదా అని ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడే మోటార్ సైకిల్ కొనిచ్చాడు సుకుమార్. అప్పటికి భార్య వద్దన్నా సుకుమార్ కొడుకు ముచ్చట తీర్చాడు.


పేపర్ చదువుకుంటూ కూర్చున్న సుకుమార్కి మోటార్ సైకిల్ చప్పుడు విని, "ఎక్కడికి వెళ్ళావురా ఉదయమే?" అన్నాడు లోపలికి నీరసంగా వస్తున్న కొడుకుతో.


"మీరు ఉదయమే లేచి నేను ఎక్కడికి వెళ్ళానో గమనించడమేనా? మా స్నేహితుడి తండ్రికి హార్ట్ ఆపరేషన్ అంటే బ్లడ్ ఇవ్వడానికి వెళ్ళాను. అమ్మా, కొద్దిగా కాఫీ ఇస్తావా?" అని అరిచాడు కిషోర్ కుర్చీలో కూర్చుంటూ.


"బ్లడ్ ఇవ్వడం ఏమిటిరా? అసలు నీ వొంట్లో ఉన్న బ్లడ్ నాది, నన్ను అడగకుండా ఎవ్వడికి పడితే వాడికి దానం చేయడానికి నీకు అధికారం లేదు. అసలే ఈసురోమంటూ ఉన్నావు, చదువు చూస్తే కొండంత ఉంది, నీకు అవసరమా? ఇదిగో, నువ్వు ఒక గ్లాసుడు బీట్రూట్ రసం చేసి తీసుకుని రా నీ కొడుక్కి, ఎవ్వరికో బ్లడ్ దానం చేసి పొట్లకాయలా వెళ్ళాడిపోతూ వచ్చాడు" అన్నాడు భార్య రాధికతో సుకుమార్.


"అదేమిటిరా ఉదయమే లేచి రక్తం కళ్ళ చూడటం, ఇహ ఇలాంటి సాహసాలు చేయను అని నా మీద ఒట్టు వెయ్యి" అంటున్న తల్లి వంక చూసి, "అబ్బా ఏమిటమ్మా, నాన్న నువ్వు ఒక్కటే గొడవ! ఆపదలో ఉన్నవాళ్ళకి సహాయం చేశాను అంతే. ఆ బీట్రూట్ జ్యూస్ నాన్నకి ఇవ్వు, ఆయన తాగితే చాలు" అని స్నానానికి వెళ్ళిపోయాడు.


"మీరేం మాట్లాడరే? బ్లడ్ ఇస్తే నీరసపడతాడు, ఇంకా పెళ్ళి కూడా కాలేదు" అంది భర్తతో.


"నా మాట నువ్వే వినవు, ఇహ వాడు వింటాడా?" అన్నాడు సుకుమార్.

"ఏమిటో కొడుకన్నా పట్టించుకోరు, పెళ్ళాన్నీ పట్టించుకున్నారు కనుక ఇహ నుంచి రాత్రి వాడి మోటార్ సైకిల్ తాళం నా దగ్గర పెట్టుకుంటాను, ఇహ ఎలా వెళ్ళి బ్లడ్ డొనేట్ చేస్తాడో చూస్తాను" అంది.


రోజులు గడుస్తున్నాయి. అప్పుడప్పుడు కొడుకు కిషోర్ ఇంట్లో నుంచి మాయం అవ్వడం, వచ్చేటప్పుడు నీరసంగా ఇంటికి వచ్చి తండ్రి వొళ్ళో ఫ్రూటీ ప్యాకెట్ వెయ్యడం బట్టి 'ఓహో, ఈ రోజు బ్లడ్ డొనేట్ చేసి వచ్చాడు అన్నమాట' అనుకునేవాడు. ఇహ కొడుకుకి ఎంత చెప్పినా లాభం లేదు, వాడు ఒక నిర్ణయం తీసుకున్న తరువాత ఇహ మారడు అంతే అని ఊరుకున్నారు.


అయితే కొడుకు గురించి తన ఆఫీసులో గొప్పగా చెప్పేవాడు—"మా అబ్బాయి బ్లడ్ డొనేట్ చేసి ఎన్నో ప్రాణాలు కాపాడాడు" అని.


అయితే సుకుమార్ పెద్ద ఆఫీసర్ కావడంతో అతని క్రింద పనిచేసే స్టాఫ్ ఈ కథ అంతా వినక తప్పేది కాదు. కొంతమంది ధైర్యం చేసి, "సార్, మీ అబ్బాయి ఫోన్ నెంబర్ ఇవ్వండి, మాకు తెలిసినవాళ్ళకి అవసరం పడితే ఇస్తాము" అనేవాళ్ళు.


"మా అబ్బాయి ప్రతి మూడు నెలలకు బ్లడ్ డొనేట్ చేస్తాడు, ఇహ కొత్తవాళ్ళకి ఇవ్వడం కుదరదు" అనేసి తప్పించుకునేవాడు.


"నాన్నా, నాకు ప్రమోషన్ మీద ఢిల్లీకి ట్రాన్స్‌ఫర్ అయ్యింది. ఈ నెలాఖరుకి జాయిన్ అవ్వాలి, మీరు కూడా నాతోనే ఉండాలి, పెద్ద ఇల్లు అద్దెకు తీసుకుంటాను" అన్నాడు సుకుమార్ కొడుకు.


"ఒరేయ్, ఇంకా నాకు నాలుగేళ్లు సర్వీస్ ఉంది, ఆ తరువాత కదా మేము ఎక్కడ ఉండాలో అనే ప్రశ్న! ఇప్పుడే పెద్ద ఇల్లు ఎందుకు దండుగ? నీ పెళ్లి ఈ ఏడాదిలో చేసి హమ్మయ్య అనిపించుకుంటాము. వచ్చే కోడలు నిన్ను కనిపెట్టుకుని ఉంటుంది. ఈ లోపు ఢిల్లీలో మోటార్ సైకిల్ మీద రైడ్స్ అంటూ తిరక్కబ్బా! ఎందుకు చెప్తున్నానో విను, మా ప్రాణాలన్నీ నీ మీద పెట్టుకుని బతుకుతున్నాం అని గుర్తు పెట్టుకో" అని పెద్ద ఉపన్యాసం ఇచ్చాడు సుకుమార్.


"కంచంలో అన్నం పెట్టుకుని అలా ఆలోచనలో పడ్డారేమిటి? తినండి" అంది భర్తని కుదుపుతూ.


"ఏమిటో వెర్రి కుంక, ఆ ఢిల్లీలో రొట్టెలు తినలేక ఏం బాధపడుతున్నాడో! ఈ మామిడికాయ పప్పు, బంగాళాదుంప వేపుడు, ఉల్లిపాయ పచ్చిపులుసు చూస్తూ ఉంటే వాడు గుర్తుకు వచ్చాడు" అంటూ రెండు మెతుకులు తిని చెయ్యి కడుక్కుంటున్న భర్తని చూసి, "అయ్యో, అదేమిటండి మీ మనసు ఇంత సున్నితం అనుకోలేదు" అంది.


సుకుమార్, రాధిక కొడుకు కోసం సంబంధాలు చూసి ఫోటోలు కొడుక్కి పంపడం, ఒకటి రెండిటికి వచ్చి పెళ్లిచూపులు చూసి నచ్చలేదు అని వెళ్ళిపోవడం జరుగుతోంది.


"ఈ పేపర్ వాడికి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధిరాదు, పేపర్ నీళ్లలో విసిరేసి పోతాడు" అనుకుంటూ పేపర్ తీసుకుని లోపలికి వస్తూవుండగా ఫోన్ రింగ్ అవ్వడంతో ఫోన్ తీసుకుని, 'ఎవ్వరో కొత్త నెంబర్' అనుకుంటూ, "హలో, ఎవ్వరు?" అన్నాడు సుకుమార్.


అటునుంచి ఒక స్త్రీ కంఠం వణుకుతూ, "కిషోర్ గారు ఉన్నారా అండీ?" అని అడిగింది.


'అమ్మాయి ఫోన్ వణుకుతున్న స్వరం, వీడేమన్నా...' అనుకోబోయి, 'ఛీ, నా కొడుకు అలాంటి వాడు కాదు' అనుకుంటూ, "లేడమ్మా, మా అబ్బాయి ఇప్పుడు ఢిల్లీలో ఉంటున్నాడు. వాడితో ఏమైనా పని ఉందా?" అని అడిగాడు సుకుమార్.


"సార్, కిషోర్ గారి నెంబర్ అని ఈ నెంబర్ రెడ్ క్రాస్ వాళ్ళు ఇచ్చారు. మా పాపకి గవర్నమెంట్ హాస్పిటల్‌లో ఈ రోజు ఆపరేషన్, నాలుగు బాటిల్స్ రక్తం తీసుకొని రండి అంటున్నారు. మాది ఈ ఊరు కాదు, మాకెవ్వరు ఇస్తారు? మా పాప లేకపోతే దాని పాప తల్లిలేని పిల్ల అయిపోతుంది. అంతా నా ఖర్మ, కిషోర్ సార్ తప్పనిసరిగా ఆదుకుంటారు అని రెడ్ క్రాస్ వాళ్ళు అంటే ఆశతో ఫోన్ చేశాను" అంటూ చెప్పుకుపోతున్న ఆమెతో, "అయ్యో, మీ నెంబర్ ఇవ్వు తల్లి, నేను ఎవ్వరైనా సహాయం చేస్తాను... ఒక గంటలో ఫోన్ చేసి చెప్తాను" అన్నాడు.


ఉదయమే ఎవ్వరితో మాటలు, మీ స్టేనో నా అంటూ బయటకు వచ్చిన భార్యకి విషయం చెప్పి, "వీడు రక్తం ఇచ్చినప్పుడల్లా తిట్టేవాళ్ళం, కానీ ఇప్పుడు అర్థం అవుతోంది ఆ విధంగా ఎంతమంది ప్రాణాలు కాపాడాడో!" అన్నాడు కొడుకుని మెచ్చుకుంటూ.


"పాపం, ఆ ఆడకూతురికి ఎలా అయినా సహాయం చెయ్యాలి. తన కొడుకు ఇక్కడే ఉండివుంటే వాడు చూసుకునేవాడు. అసలు వాడు రెడ్ క్రాస్ వాళ్ళకి నా నెంబర్ ఇచ్చాడు అంటే నాన్న ఎలాగైనా సహాయం చేయగలడు అనేగా! అందుకే వాడి నమ్మకం వొమ్ము కాకూడదు" అనుకుంటూ తన దగ్గర పనిచేస్తూ ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న ఆరుగురు ఉద్యోగులలో నలుగురికి ఫోన్ చేసి విషయం చెప్పి, "ఇతరులకు సహాయపడితే దేవుడు మనకి కూడా సహాయం చేస్తాడు, మీకు త్వరగా ప్రమోషన్ రావచ్చు, అందుకే వెంటనే బయలుదేరి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి రండి, నేను కూడా వస్తున్నాను" అని ఆర్డర్ వేసాడు.


బాస్ మాట వినకపోతే మనకి సరైన రిపోర్ట్ ఇవ్వడు, అప్పుడు ప్రమోషన్ రాదు, బ్లడ్ ఇచ్చేసి ఆయన మెప్పు పొందాలి అనుకున్నారు ఆ నలుగురు.


సుకుమార్ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి చేరి కారు పార్క్ చేసి దిగాడు. అప్పటికే వచ్చి తనకి విష్ చేస్తున్న అసిస్టెంట్స్ వంక చిరునవ్వు నవ్వి, "పదండి లోపలికి" అని ఫోన్ తీసి ఉదయం మాట్లాడిన ఆవిడకి ఫోన్ చేసి, "వచ్చి మమ్మల్ని తీసుకొని వెళ్ళండి, రక్తం ఇస్తాము" అన్నాడు. తను టోపీ పెట్టుకుని ఉన్నాను అని గుర్తుకు చెప్పాడు.


కొద్ది సేపటిలో దరిద్రం మొత్తం వాళ్ళనే ఆవహించినట్టుగా ఉన్న దంపతులు సుకుమార్ దగ్గరికి వచ్చి, "ఈ రోజుల్లో మాట నిలబెట్టుకుని రక్తం ఇవ్వడానికి వస్తారా అనే అనుమానం వచ్చింది సార్, అందుకే బరువు దేవుడి మీద వేసి ఏడుస్తూ కూర్చున్న మాకు మేము వచ్చాము రండి" అనే పిలుపుతో మా ప్రాణాలు మాకు దక్కినట్టు అయ్యింది. రండి సార్, రక్తం తీసుకునే గదికి తీసుకొని వెళ్తాము" అన్నాడు ఆమె భర్త.


గవర్నమెంట్ హాస్పిటల్ అవ్వడంతో ఎక్కడ చూసినా రోగులు వాళ్ళ బంధువులతో ఈగల గుంపులా ఉంది. నడవటానికి దారి లేకుండా రోగులు నేల మీద అడ్డంగా పడుకుని ఉన్నారు. ఆ వాతావరణంలో ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు కూడా అనారోగ్యం తెచ్చుకుంటారు అనిపించింది సుకుమార్ కి.


"ఈ సారే సార్ రక్తం అడిగింది" అంటూ తన దగ్గర ఉన్న కాయితం ల్యాబ్ అసిస్టెంట్ మురళికి చూపించింది.


"మొత్తానికి బ్లడ్ ఇచ్చే వాళ్ళని తీసుకుని వచ్చావే యాదమ్మా, అదృష్టవంతురాలువే!" అని మా వంక చూసి, "మీలో బ్లడ్ ఇచ్చే వాళ్ళు ఆ టేబుల్ మీద కూర్చోండి, బ్లడ్ గ్రూప్ టెస్ట్ తీసుకుంటాను" అన్నాడు.


"ఈ నలుగురు బ్లడ్ ఇస్తారు, కొద్దిగా త్వరగా తీసుకోండి. గవర్నమెంట్ హాస్పిటల్ అంటే టూరింగ్ టాకీస్‌లా ఉందేమిటి? మీకు జీతాలు వస్తాయా సమయానికి?" అని అడిగాడు సుకుమార్.


"సార్, అందరూ డబ్బులు ఉన్నవాళ్ళు ఉండరు, అటువంటి వారికి ఈ హాస్పిటల్ ఐమ్యాక్స్ లా ఉంటుంది" అని నవ్వి ఒక్కొక్కరిని బెడ్ మీద పడుకోబెట్టి బ్లడ్ తీసుకోవడం మొదలుపెట్టాడు.


"సార్, ఏమైనా తింటారా? టిఫిన్ తీసుకుని వస్తాను" అంటున్న ఆమెని చూసి, "అక్కరలేదు, తినే వచ్చాము. మీ అమ్మాయికి ఏమీ కాదు, కంగారు పడకు" అన్నాడు సుకుమార్.


సుకుమార్ అసిస్టెంట్స్ ఒక్కొక్కరే బ్లడ్ ఇచ్చి ఫ్రూటీ బాటిల్‌తో బయటకు వస్తున్నారు.

"ఏమయ్యా, బ్లడ్ తీస్తూ ఉంటే నీరసం ఏమైనా వచ్చిందా?" అని అడిగాడు సుకుమార్ వాళ్ళని.


"అసలు తెలియలేదు సార్, కావాలంటే ఇంకో బాటిల్ ఇస్తాము" అని మెచ్చుకోలు కోసం మాట్లాడుతున్న ముగ్గురిని చూసి, "ఇంకా సుబ్బారావు బ్లడ్ ఇచ్చేస్తే మనం వెళ్ళిపోవచ్చు" అన్నాడు సుకుమార్.


ల్యాబ్ అసిస్టెంట్ బయటకు వచ్చి, "సార్, సుబ్బారావు గారి బ్లడ్ లో హేమోగ్లోబిన్ తక్కువ ఉంది, ఆయన బ్లడ్ పనికిరాదు. ఇంకో బాటిల్ కావాలి, మీరు ఇస్తాను అంటే లోపలికి రండి" అని సుకుమార్ తో అన్నాడు.


ఆ మాటతో సుకుమార్ గుండెల్లో రాయి పడింది. ఇంజెక్షన్ చేయించుకోవాలి అంటేనే వణికిపోయే తను బ్లడ్ ఇవ్వగలడా అనుకుని, "ఇదిగో మూర్తి గారు, నా వయసు వాళ్ళు బ్లడ్ ఇవ్వకూడదు అంటారే!" అని అడిగాడు.


"మీకేం రోగాలు లేవు కదా, ఆరోగ్యంగా కనిపిస్తున్నారు. రండి, మీకు తెలియకుండా రక్తం నేను తీస్తాను" అని సుకుమార్ ని బెడ్ మీద పడుకోబెట్టి, "కళ్ళు మూసుకుని ఉండండి, నీడిల్ గుచ్చుతున్నప్పుడు కొద్దిగా నొప్పి ఉంటుంది అంతే" అని అతను అనడం, "చంపేసావ్ మూర్తి!" అంటూ సుకుమార్ అరవడం జరిగిపోయింది.


"కంగారు పడకండి సార్, ఆఫీసులో మీరు అందరిని హడలెత్తిస్తుంటారుగా, దీనికే భయపడితే ఎలా?" అన్నాడు ల్యాబ్ అసిస్టెంట్.


"ఎందుకో గుండెల్లో దడగా ఉంది, చెమటలు పడుతున్నాయి" అన్నాడు సుకుమార్ ల్యాబ్ అసిస్టెంట్ మూర్తితో.


"అలాగా? అయితే మీరు బ్లడ్ ఇవ్వద్దు, కాసేపు విశ్రాంతిగా పడుకోండి. అవును సార్, ఇప్పుడు బ్లడ్ ఇచ్చిన వాళ్ళు మీ దగ్గర పని చేస్తున్నారా?" అని అడిగాడు.


"అవును మూర్తి గారు, నా దగ్గర చాలా మంది చిన్న ఉద్యోగి నుంచి పెద్ద ఉద్యోగి వరకు ఉన్నారు. అందులో కొద్దిగా బలమైన వాళ్ళని ఏరి తీసుకొని వచ్చాను. రక్తం ఇవ్వమంటే భయం కదా! మీకు ఒక విషయం చెప్పనా? మా అబ్బాయి కిషోర్ ఇప్పటికి ఎన్నోసార్లు రక్తం దానం చేసాడు తెలుసా? రెడ్ క్రాస్ వాళ్ళు మా అబ్బాయికి సర్టిఫికెట్ కూడా ఇచ్చారు" అని చెప్పడం మొదలుపెట్టాడు.


"కిషోర్ గారికి ఉదయం ఫోన్ చేశాము, ఆయన 'ఇప్పుడు వేరే ఊరిలో ఉన్నాను, నా నాన్న నెంబర్ ఇస్తాను ఆయనతో మాట్లాడండి' అని మీ నెంబర్ ఇచ్చాడు. ఇహ లేవండి" అంటూ ఎర్రటి నెత్తురు బాటిల్ పట్టుకుని దానికి స్టిక్కర్ పెడుతున్న మూర్తిని చూసి, "ఆ బ్లడ్ నాదేనా?" అన్నాడు.


"అవును సార్, మిమ్మల్ని కబుర్లలో పెట్టి బ్లడ్ తీసుకున్నాను. ఇప్పుడు గుండెల్లో దడ లేదుగా?" అంటూ నవ్వుతున్న మూర్తిని చూసి, "భలేవాడివి మూర్తి, పూర్వజన్మలో దోమవి అనుకుంటా, చివరికి నన్ను కూడా బ్లడ్ డోనర్ గా చేసేసావు" అంటూ ఫ్రూటీ తీసుకుని బయటకు వచ్చాడు.


"మొత్తం నాలుగు బాటిల్స్ రక్తం ఇచ్చాము, ఇహ కంగారు పడకండి" అంటూ జేబులో నుంచి ఐదు వందల నోట్లు తీసి ఆమె చేతిలో పెట్టి తన స్టాఫ్ తో బయటకు నడిచాడు సుకుమార్.


ఫోన్ సౌండ్‌కి వంటగదిలోనుంచి హాలులోకి వచ్చి, "ఆ చెప్పండి రా అబ్బాయి, కాఫీ తాగావా?" అంది కొడుకు కిషోర్ తో.


"టిఫిన్ కూడా అయ్యింది, నాన్న ఇంట్లో ఉన్నారా లేకపోతే బయటకు వెళ్ళారా?" అన్నాడు.


"అదేమిటిరా వింత, నువ్వు రక్తం ఇస్తాను అంటే ఒప్పుకోము, అలాంటిది నాన్నని ఇరికిస్తావా?" అంటున్న తల్లితో, "అది కాదమ్మా, నేను ఢిల్లీ వచ్చేసినా అవసరం వచ్చినప్పుడు బ్లడ్ డొనేట్ చేస్తున్నాను. కానీ ఈ రోజు ఉదయమే ఒక ఆమె ఏడుస్తూ ఫోన్ చేసింది, రక్తం కావాలి అని. నేను హైదరాబాద్ లో లేను, ఈ నెంబర్ కి ఫోన్ చేసి అడగండి, ఆయన మీకు సహాయం చేస్తారు అని నాన్న నెంబర్ ఇచ్చాను."


"అదా నాయనా! ఆ నెంబర్ వాళ్ళతో మాట్లాడి ఒక ఆపిల్, నాలుగు బిస్కట్లు తిని కారు తీసుకొని వెళ్లిపోయారు, ఇప్పటివరకు రాలేదు. అయినా యాభై ఏళ్ళు వచ్చిన మీ నాన్నని రక్తం ఇమ్మామంటే ఎలారా? అసలే మొహం తెల్లగా పాలిపోయివుంది" అంది రాధిక.


"అది రక్తం లేకపోతే కాదు, రోజుకి రెండు సార్లు మొహానికి ఫేస్ క్రీమ్ పట్టించడం వల్ల! అయినా నాన్న తలుచుకుంటే అవ్వని పనివుండదు, అందుకే నాన్న నెంబర్ ఇచ్చాను, కంగారు పడకు. నాన్న రాగానే నాకు ఫోన్ చేసి మాట్లాడించు" అని ఫోన్ కట్ చేశాడు కిషోర్.


ఇంటి ముందు కారు ఆగడంతో భర్త వచ్చాడు అనుకుంటూ బయటకు వచ్చింది రాధిక. కారులో నుంచి హుషారుగా దిగుతున్న భర్తని చూసి, "ఈయన ఎప్పుడు బ్లడ్ ఇవ్వాలి కనుక" అనుకుంటూ లోపలికి నడిచింది.


"ఒరేయ్ అబ్బాయి, వాళ్ళకి కావలిసిన బ్లడ్ మా అసిస్టెంట్స్‌తో ఇప్పించేసాను. అయితే ఆ ల్యాబ్ అసిస్టెంట్ మాటల్లో పెట్టి నా బ్లడ్ కూడా తోడేసాడు! కానీ నాకు జీతం తీసుకునే రోజుకంటే ఈ రోజు చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఎవ్వరికైనా కావాలి అంటే నాకు రెఫర్ చెయ్యి" అని ఫోన్ పెట్టేసి, "రాధికా, కొద్దిగా ఒక గ్లాస్ బీట్రూట్ జ్యూస్ ఇస్తావా?" అని పిలిచాడు.


రక్తదానం ఒక జీవితాన్ని రక్షించడానికి ఉపయోగపడుతుంది. ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ఒక్కసారైనా రక్తదానం చేయండి.


శుభం 



పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి  సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.

మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.




జీడిగుంట శ్రీనివాసరావు గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):











జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం

  ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


జీడిగుంట శ్రీనివాసరావు

రచయిత పరిచయం:

నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.



30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page