బెస్ట్ ఫ్రెండ్స్

Best Friends - Telugu Family Story | Yasoda Gottiparthi
బెస్ట్ ఫ్రెండ్స్ - తెలుగు కుటుంబ కథ | యశోద గొట్టిపర్తి
Published In manatelugukathalu.com On 19/09/2026
పేదరికం ఎన్నో కష్టాలను తెచ్చినా, తల్లిదండ్రుల ప్రేమ పిల్లల కలలకు బలమవుతుంది. తన కొడుకు భవిష్యత్తు కోసం జీవితాంతం శ్రమించిన దర్జీ ధర్మన్న కథ ఇది. తండ్రి త్యాగాన్ని అర్థం చేసుకున్న విద్యాధర్, చదువుతో తన తండ్రి కలను ఎలా నెరవేర్చాడో తెలిపే హృదయస్పర్శి కథ “బెస్ట్ ఫ్రెండ్స్”. తండ్రి–కొడుకు ప్రేమ, కష్టం, పట్టుదల, విజయాన్ని ప్రతిబింబించే స్ఫూర్తిదాయక కథ ఇది.
ప్రతి మనిషి అత్యవసరమైన తిండి, బట్ట, గూడును సంపాదించుకోవడానికి కష్టపడుతుంటాడు. కొందరు పంటలు పండిస్తూ కడుపు నింపితే, మరికొందరు రకరకాల డిజైన్లతో బట్టలు కుట్టుతూ అధిక ధరలకు రెడీమేడ్ షాపులకు పంపిస్తుంటారు. అతి తక్కువ ధరలో దేహానికి తగినట్టుగా కుట్టి సంతోషపెట్టే దర్జీలు కొందరుంటారు. అలాంటి వారిలో ధర్మన్న ఒకరు.
పాఠశాల చదువు ముగించుకుని కళాశాలలో చేరిన వారిలో ధర్మన్న కొడుకు విద్యాధర్ బాగా చదువుకునే బుద్ధిమంతుడు.
"శ్రీధర్! నీ షర్ట్ చాలా బాగుందిరా, కొత్త డిజైన్, రెడీమేడ్ కదా!" అని అందరూ మెచ్చుకుంటుంటే, పక్కనే ఉన్న విద్యాధర్ మాత్రం తను వేసుకున్న చొక్కా చూసుకొని తనకు తానే సంతోషపడ్డాడు.
డబ్బులు ఉన్నవాళ్లు షాపుల్లో కొనుక్కొని సంబరపడతారు. తనను ఎవరూ మెచ్చుకోకపోతే ఏంటి? తను వేసుకున్న దానిలో ఎంతో ప్రేమ నిండుగా ఉంది. ఆ ప్రేమలో ఒక సంతోషం, అది తనకే సొంతం అని లోలోపల మురుస్తూ, మిగతా చొక్కాలన్నిటినీ వారానికి సరిపోయేలా బ్యాగ్ లో పెట్టుకుంటున్నాడు.
శ్రీధర్ వచ్చి, "నగధర కాలేజీలో మేం డొనేషన్ కట్టి చేరాము. నీవేమో పేదరికంతో ఈ కాలేజీలో చేరావు" అని వ్యంగ్యంగా మాట్లాడుతుంటే, గతం అంతా కళ్ళ ముందు కదిలి తన రూమ్మేట్ సునీల్కు చెప్పసాగాడు.
***
పది రోజుల్లో దసరా పండుగ. ఊరందరూ వచ్చి తమ పిల్లలకు, పెద్దలకి బట్టలు తెచ్చి కొలతలు ఇచ్చి త్వరగా కుట్టాలని చెప్పగానే, నాన్న వాటిని ప్రసాదంలా తీసుకుని, తప్పనిసరై కత్తెర పట్టుకొని అతి జాగ్రత్తగా కొలతలు చూస్తూ వాటిని కట్ చేస్తుంటే, నేను కూడా కొత్త ప్యాంటు, షర్టు బట్ట తీసుకువచ్చి, "ముందు నాదే కుట్టాలి" అని పట్టుపట్టాను.
పండుగ లోపల బట్టలన్నీ కుట్టి అందివ్వాలని టెన్షన్ పడుతూ, తగిన దారాలు, బటన్స్, అస్తరు బట్టలు కూడా షాప్కి వెళ్లి తీసుకురావాలని లెక్కలు వేసుకుంటున్న నాన్న నన్ను చూసి, "ముందు ఇక్కడి నుండి వెళ్ళు. నీ బట్టలకు ఏం తొందర లేదు? నేను ఇప్పుడు కుట్టలేను, ముందు కస్టమర్స్ వి కుట్టాలి" అని కసురుకున్నాడు.
"అమ్మమ్మ ఊరు వెడితే పెట్టిన బట్ట నాన్నా", అంటూ "వంటి మీద కొలతలు తీసుకోవా? నేవీ బ్లూ కలర్ చొక్కా, నల్ల రంగు ప్యాంటు బాగుంది" అని మొండి పట్టుతో నిలబడ్డాను. ఏడుపు చూడలేక కుట్టుతుంటే, అక్కడే ఉంటూ, సగం కుట్టగానే వేసుకుని చూస్తూ, మురిసిపోతుంటే, అమ్మ వచ్చి, "ఒరేయ్! పొలం వెళ్లి, మోటార్ పెట్టి నీళ్లు పారిద్దాం పద" అంటూ నన్ను తీసుకొని వెళ్ళింది.
కొత్త బట్టలు నెల రోజుల ముందు నుండే మిషన్ మీద నుండి కదలకుండా కుట్టుతూ, బట్టలు ఇవ్వడానికి వచ్చిన వాళ్లకు ఒక్కొక్కరికి ఒక్కో విధంగా నచ్చచెప్పుతూ ఉండేవారు. వచ్చిన వారికి ఆ సమయంలో నాన్న కుట్టుతూ కనపడకపోతే, "వాళ్లు బట్టలు ఇంకా కుట్టలేదా? ఇక్కడే అలాగే కట్టలుగా పడి ఉన్నాయి.. రెండు రోజుల ముందే ఇవ్వాలన్నాముగా.." అంటూ మాటలు బాణాలు వదిలేవారు.
మిషన్ శబ్దంతో పాటు, మెడలు వంచి, కళ్ళు చమర్చకుండా, కాళ్లతో తొక్కుతూ మిషన్ కుట్టుతుంటే నాన్న పడే ఆరాటం చూసి, "ఏమయ్యా! నిద్రమరచినా, మీ ఆరోగ్యం గురించి కూడా ఆలోచించూ" అని అమ్మ అంటున్నా పట్టించుకోకుండా కుట్టుతూ, "మనకు పండుగ సీజన్లోనే ఆదాయం, ఇప్పుడు అలసట అనుకుంటే ఖర్చులకు డబ్బులు ఎలా వస్తాయి?" అనేవాడు నాన్న.
ఊరందరికీ ఎన్నో బట్టలు కుట్టే నాన్నకు పంచె, భుజం మీద బనియను తప్ప జత బట్టలు ఉండక, ఉతికి ఆరగానే వేసుకోవడం తప్ప కొత్త బట్టలు ఏనాడు ఆశించలేదు. అమ్మ నాన్న కుట్టిన బట్టలకు చేతి వర్క్ చేస్తూ చేదోడుగా ఉండేది.
"అందరూ ప్రతి పండుగకు కొత్త బట్టలు కుట్టించుకుంటున్నారు, మాకు కావాలి, కొత్తవి కుట్టండి నాన్న!" అని గోల చేస్తుంటే, అక్కడక్కడ మిగిలిన ముక్కలతో చెల్లెలికి కొత్త డిజైన్ గౌన్ కుట్టి ఏడుపు మాన్పించడం చూసి నేను అడగకపోయేవాణ్ణి.
ఉదయాన్నే వీరన్న వచ్చి, "ధర్మన్న, నా చొక్కా కుట్టినవా? నేను ఊరికి పోవాలి, బంధువుల పెళ్లి" అనగానే, లోపలికి పోయి చూస్తే ఎలుకలు కొరికిన బట్టను చూసి, కళ్ళకు నీళ్లు వచ్చినా దాచుకొని, "వీరన్న, సాయంత్రం వచ్చి తీసుకోపో" అని కొత్త బట్ట అట్లాంటిది తెచ్చి, చొక్కా కుట్టిచ్చి మాట నిలబెట్టుకున్నాడు. మాట ఇచ్చిన సమయంలో కుట్టివ్వాలని ఎప్పుడూ తొందరతో మోకాలు నొప్పి రావడం, నడవలేక ఇబ్బంది పడినా కుట్టుతూనే ఉండేవాడు.
ఇచ్చిన మాటకు ప్రాణం ఇచ్చే మా నాన్న, ఏ పనైనా కష్టపడకుండా చేయాలని చెప్పాడు. కష్టం అనుకోకుండా చేయాలని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించి అనుకున్న లక్ష్యం చేరాలి అంటాడు.
నా సంతోషం కోసం ఎలుకలు కొరికిన మిగిలిన బట్టను నాకోసం చొక్కా కుట్టాడు. బొమ్మ కొనివ్వమని ఏడుస్తుంటే, డబ్బులు లేవని చెప్పలేక అమ్మ బాధతో, కత్తిరించగా మిగిలిన కొత్త బట్టలతో రంగు రంగుల బొమ్మలు కుట్టి అమ్మ మమ్మల్ని ఆడించేది.
నాన్న వంటికి అద్దినట్టు కుడతాడని, బట్ట చినిగినా కుట్టు పోదనీ, నాణ్యతగల దారాలు, బటన్స్ కొంటాడనీ మెచ్చుకుంటూ ఉంటే, "నేను టైలరింగ్ నేర్చుకుంటాను, నేర్పమని" పట్టుపట్టాను.
అప్పుడు నాన్న నాతో, "నిన్ను బడికి పంపిస్తున్నాను కదరా! చదువు అంటే నీకు బాగా ఇష్టమే. పెద్ద చదువు చదవాలి" అన్నాడు.
"నా చిన్నప్పుడు మా నాన్న నన్ను చదివించడానికి ప్రయత్నం చేసినా, అక్కడ ప్రాథమిక పాఠశాల మాత్రమే ఉండి ఆపేసాను. ఆ రోజుల్లో డబ్బుల లెక్కపెట్టడం రాని నాన్న, కూలి పనులు చేస్తూ, తనకు వచ్చిన విద్య బట్టలు కుట్టడం నేర్పించాడు.
చదువు రాకపోతే మోసం తెలుసుకోలేకపోవడం, అన్యాయం జరిగినా మాట్లాడకపోయేవాడు. ఆ పరిస్థితుల్లో నాకూ, కుటుంబానికి దర్జీపని జీవనోపాధి అయింది.
మా నాన్న నాకు నేర్పిన టైలరింగ్లో శిక్షణ పొందాను. నాన్న అనారోగ్యంతో మరణించడం, కుటుంబ బాధ్యత నా మీద పడింది. ఇద్దరు చెల్లెళ్ల పెళ్లిళ్లు చేయడం, అమ్మ వైద్యానికి నా సంపాదించిన డబ్బులన్నీ ఖర్చు చేస్తూ ఎదుగుబొదుగు లేకుండా ఇంతవరకు గడిచింది."
ఆ మాటలతో "నాన్న కోరిక తీర్చాలంటే బాగా చదువుకోవాలి" అనే పట్టుదల వచ్చింది. టీచర్స్ దగ్గరికి వెళ్ళి, నోట్స్ లు వ్రాసుకుంటూ శ్రద్ధగా చదివాను.
కుట్టుమిషన్ చుట్టూ కొత్త బట్టలెన్నున్నా, నా వంటి పైనున్న షర్ట్, నెక్కర్ మాత్రమే కొత్తగా అనిపించేది. పుస్తకాలే రోజు కొత్త పాఠంగా, అన్ని సబ్జెక్ట్లలో వంద శాతం మార్కులతో పదవ తరగతిలో రాష్ట్రంలోనే మొదటి ర్యాంకు సంపాదించాను. రిజల్ట్స్ పేపర్లో మొదటి ర్యాంక్ నా నెంబర్ చూసి నాన్న కళ్ళలోని సంతోషం మరువలేను. జిల్లా, రాష్ట్రస్థాయి కళాశాలలన్నీ స్కాలర్షిప్ ప్రకటించాయి. ఉన్నత చదువులకు ఖర్చు భరిస్తామంటూ ముందుకు వచ్చాయి. అలా పేద దర్జీ కళ్ళలో కొత్త వెలుగు ప్రకాశించింది.
తెల్లవారి దినచర్యలో బట్టలు కుట్టడానికి వెళ్లేసరికి, అమ్మకు, నాన్నకు కొత్త ఎలక్ట్రిక్ మిషన్స్, ఎంబ్రాయిడరీ, రెడీమేడ్ దుస్తులకు అనుకూలంగా కుట్టడానికి టేబుల్స్ పైన "అమ్మ నాన్నకు ప్రేమతో" అని పెద్దగా వ్రాసి ఉండడం చూసి ఆశ్చర్యానందాలతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు.
***
"నేను కష్టపడి చదివి ర్యాంకుతో వచ్చిన డబ్బులతో కొన్నాను" అంటూ, "నాన్న! నేను పెద్ద ఆఫీసర్ అయ్యే కోరిక కూడా తీరుస్తానని" పాదాలకు మొక్కి, ఆశీర్వాదాలు తీసుకుని ఈ "నగధర" కళాశాలలో చేరాను అని ఆనంద బాష్పాలతో చెప్పాడు.
అలా ఇద్దరూ "బెస్ట్ ఫ్రెండ్స్" అయ్యారు.
సమాప్తం
యశోద గొట్టిపర్తి గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):
యశోద గొట్టిపర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం
ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: యశోద గొట్టిపర్తి
హాబిస్: కథలు చదవడం ,రాయడం








Comments