పేదింటి సంక్రాంతి

Pedinti Sankranthi - Telugu Family Story | Bhanupriya
పేదింటి సంక్రాంతి - తెలుగు కుటుంబ కథ | భానుప్రియ
Published In manatelugukathalu.com On 19/09/2026
“పేదింటి సంక్రాంతి” భానుప్రియ రచించిన హృదయస్పర్శి కుటుంబ, సామాజిక కథ.
పేదరికంలోనూ తన కూతురికి సంక్రాంతి పండుగ ఆనందాన్ని అందించాలనే తల్లి లక్ష్మి తపన ఈ కథకు ప్రాణం. తల్లి ప్రేమ, త్యాగం, పేదరికం, చిన్న చిన్న ఆనందాల విలువను ఈ కథ సున్నితంగా ఆవిష్కరిస్తుంది. పండుగ అనేది డబ్బుతో కాదు, మనసుతో జరుపుకోవచ్చనే మానవీయ సందేశాన్ని ఈ కథ అందిస్తుంది.
"పద్మ... పద్మ..." అంటూ అరుస్తున్న తల్లి మాటలు కూడా వినపడకుండా మట్టిలో కూర్చొని శూన్యంలోకి చూస్తూ ఆలోచిస్తుంటుంది పద్మ కల్మషం లేని మనసుతో.
"ఏమైందే పద్మ! ఏం ఆలోచిస్తున్నావ్?" ఇంతగా పిలుస్తుంటే అని తల్లి లక్ష్మి అనగానే, "అమ్మ, వస్తున్నానే" అని గుడిసెలోకి వెళ్తుంది పద్మ పరుగున.
"బడికి పోవా బిడ్డ, ఇంకా తయారవ్వలేదు. ఈరోజు ఏం ఆలోచిస్తుంటివి పద్మ?"
"ఏం లేదమ్మా, పండుగ వస్తుందంట కదా! అమ్మ సంక్రాంతి, మనమెందుకు జరుపుకోము ఆ పండగని?" అని అమాయకపు ముఖంతో పద్మ అడగగానే, "ఏం పండుగనే తల్లి! మన పేదోళ్లకు పండుగలా పబ్బాలా? మీ అయ్యా రోగమని మంచం మీద పడగానే మన బతుకులు ఇంకా ఆగమయ్యాపు. పుటగడవడమే కష్టమయో, ఇంకా ఈ పండుగలు మనం ఎట్లా చేసుకుంటాం బిడ్డ" అని లక్ష్మి అనగానే పద్మ ముఖం చిన్నబోయింది.
"సరే అమ్మ, నేను బడికి పోతున్నా" అని బయలుదేరింది పద్మ.
ఎన్నడూ లేనిది నా బిడ్డ పండగ గురించి అడిగిందే, ఏం బతుకులో, దేవుడు మా తలరాత ఇట్లా రాశాడు అనుకుంటూ మనసులో మదనపడింది లక్ష్మి. ఎలాగైనా ఈ సంక్రాంతికి తన బిడ్డకు నచ్చినట్టుగా పండుగ జరపాలని మనసులో అనుకుంది.
పండగ కోసమని తను పనిచేసే వాళ్ళింట్లో అమ్మగారు పాత చీర ఒకటి ఇస్తా అన్నారుగా అని తనతో చీరను ఇప్పించుకొని, లక్ష్మి రాత్రి మొత్తం కూర్చుని సూది దారంతో అందమైన గౌనును ఎంతో కష్టపడి కుడుతుంది.
ఇక పండుగ కోసమని చాలా దూరం వెళ్లి పాలు పొంగించడానికి రెండు చిన్న కుండలు తయారు చేయడానికి మట్టిని, పిడకలు తయారు చేయడానికి పెండను తీసుకువచ్చి, ఎంతో కష్టపడి రెండు అందమైన చిన్న కుండలను తయారు చేసి ఎండకు ఎండించి తన కూతురికి తెలియకుండా చేసింది లక్ష్మి.
ఇక పతంగి కోసమని తాను పనిచేసే చోట పేపరు, కట్టెపుల్లలు అడిగి తెచ్చుకొని ఎంతో అందమైన గాలిపటం తయారు చేసి, నా బిడ్డకు పండుగ పూట ఎనలేని సంతోషాన్ని నింపాలని తపన పడిపోతుంది లక్ష్మి.
ఇక సంక్రాంతి పండగ రాగానే లక్ష్మి ఉదయాన్నే లేచి తన గుడిసెనంతా పేడతో కల్లాపు చల్లి, అందమైన ముగ్గులతో, పసుపు, కుంకుమ ఉపయోగించి అందమైన రంగవల్లులను తీర్చిదిద్ది, ముందు రోజు అందరి ఇంటి ముందు చెట్లకు తెచ్చిన పూలతో, పెండతో చేసిన గొబ్బెమ్మలతో ఎంతో చక్కగా అలంకరించింది. పద్మ లేవగానే అన్ని పనులు అయిపోవాలని గుడిసె మధ్యలో అలికి ముగ్గు వేసి, తాను తయారుచేసిన పిడకలను పెట్టి కుండలను అలంకరించి, అందులో పాలు పోసి అన్నిటిని తయారు చేసి పెట్టుకుంది లక్ష్మి ఎదనిండా సంతోషంతో.
ఇక పద్మను లేపగానే ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది.
"అమ్మ, ఇది మన గుడిసెనా! ఎంత అందంగా తయారు చేశావు! ఎందుకమ్మా ఇదంతా?" అని అనగానే, "ఈరోజు సంక్రాంతి బిడ్డ. మనం ఎందుకు పండుగ చేసుకోమని అడిగితివి కదా బిడ్డ. ఈ దినం మనం కూడా సంక్రాంతి చేసుకుంటున్నాము పద్మ" అని అనగానే పద్మకు ఎక్కడిలేని సంతోషంతో గెంతులు వేస్తూ తల్లిని హత్తుకుంటుంది.
లక్ష్మి పద్మకు తలంటు పోసి, తాను ఎంతో కష్టపడి కుట్టిన గౌనును వేయగానే ఎంతో మురిసిపోతుంది పద్మ.
"పద పద్మ, పాలు కూడా పొంగిద్దాం" అని తాను తయారు చేసిన కుండలలో పాలు పోసి దండం పెట్టుకొని పిడకలను పద్మ చేయి పట్టుకొని లక్ష్మి వెలిగించగా, పద్మ ముఖం కూడా చిరునవ్వుతో వెలగడం చూసి లక్ష్మి మది మురిసిపోయింది.
పాలు పొంగించి అందులో బియ్యం, బెల్లం వేసి పాయసం చేసి, "ఇదిగో బిడ్డ, దేవుడి దగ్గర పెట్టి చల్లగా చూడు దేవుడా అని మొక్కుకొని" ప్రేమతో పద్మకి తినిపిస్తుంది లక్ష్మి.
"పా పద్మ, బయటికి వెళ్లి నీ కోసం నేను పతంగి కూడా తయారు చేశాను పా అమ్మ, బయటికి వెళ్లి దీన్ని ఎగరేద్దాం" అని చెప్పగానే, "అమ్మ పతంగి ఆ! నిజంగానా!" అని ఎంతో సంతోషంతో కేరింతలు కొడుతూ పద్మ అమ్మతో కలిసి పతంగి ఎగరవేసి, గుడిసెకు చేరుకుంటారు.
"ఇగో పద్మ, నువ్వు సంతోషమా బిడ్డ ఈరోజు పండుగ జరుపుకున్నందుకు?" అని లక్ష్మి అడగగానే పద్మ గట్టిగా తల్లిని హత్తుకొని, "చానా చానా సంతోషంగా ఉందమ్మా, ఈరోజు నాకు చాలా చేశావు" అని తన తల్లిని ముద్దులతో ముంచెత్తింది పద్మ.
పద్మ ఆనందాన్ని చూసి తల్లి లక్ష్మి కన్నీటితో, "నీ మొఖాన చిరునవ్వు కోసం ఇదంతా చేశాను బిడ్డ" అంటూ హత్తుకొని ముద్దు పెట్టింది తన బిడ్డకు.
"ఇక పడుకో, ఇక పడుకో పద్మ" అని బిడ్డపై చేయి వేసి, పండుగంటే తెలియని నా బిడ్డకి ఈరోజు ఎంత సంతోషమో యే! ఇప్పటినుంచి ప్రతి పండుగను నాకు ఉన్నంతలో ఇలాగే జరిపించాలి, పైసలు లేకపోయినా నాకు ఉన్నంతలో నా బిడ్డను సంతోష పెట్టాలని మనసులో అనుకొని నిద్రలోకి జారుకుంది రేపటి ఉషస్సుకై.
***
పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.
మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.
భానుప్రియ గారి కొన్ని ఇతర రచనలు:
భానుప్రియ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
నేను కొత్త ప్రియాంక (భానుప్రియ) హైదరాబాద్ ఆరు సంవత్సరాల నుంచి కవితలు రాయడం ప్రారంభించినాను. తర్వాత కథలు రాయడం మొదలుపెట్టాను. ఒక మంచి కవయిత్రిగా రచయిత్రిగా నాకంటూ సాహితీ సామ్రాజ్యంలో ఒక పేజీ ఉండాలని , సమాజాన్ని జాగృతి పరిచే విధంగా నా కలం సాగిపోవాలనే తలంపుతో ముందుకు సాగిపోతున్నాను.🙏










Comments