top of page
Original.png

పెద్దలకు స్వతంత్రత లేదు!

1 hour ago
5 min read

విష్ణుప్రియ తన తల్లి చెప్పిన కుటుంబ త్యాగాల గురించి తెలుసుకుని భావోద్వేగానికి గురైన దృశ్యం

Pedhalaku Swatantrata ledhu! - Telugu Social Family Story | Bhattu Venkata Rao

పెద్దలకు స్వతంత్రత లేదు! తెలుగు సామాజిక కుటుంబ కథ | భట్టు వెంకటరావు

Published in manatelugukathalu.com on 19/09/2026


“పెద్దలకు స్వతంత్రత లేదు!” ప్రేమ, కుటుంబ బంధాలు, తల్లిదండ్రుల త్యాగం చుట్టూ అల్లుకున్న హృదయస్పర్శి తెలుగు సామాజిక కథ. తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకునే విష్ణుప్రియ ఎదుర్కొనే కుటుంబ పరిస్థితులు కథకు ప్రధాన నేపథ్యం. పెద్దల మంచితనం, చేసిన త్యాగాలు కాలంతో ఎలా మరుగునపడతాయో ఈ కథ సున్నితంగా చూపిస్తుంది. పిల్లల స్వేచ్ఛతో పాటు, పెద్దల మౌన వేదనను కూడా అర్థం చేసుకోవాలనే ఆలోచనను ఈ కథ కలిగిస్తుంది.


(1)

సారథికి విష్ణుప్రియ అంటే చాలా ఇష్టం. విష్ణుప్రియకు కూడా అలాగే సారథి అంటే బాగా ఇష్టం. ఇంజనీరింగు చదువైపోయి, కాంపస్ ఇంటర్వ్యూలలో ఇరువురికీ మంచి కంపెనీలలో ఉద్యోగాలు దొరకగానే పెళ్ళి చేసుకుందాలని నిర్ణయించుకుని ఉన్నారు. విష్ణుప్రియ వైపు పెద్దవాళ్ళకు అది ఇష్టంలేదు. కారణం ఏమిటంటే, వాళ్ళ దృష్టిలో విష్ణుప్రియ చిన్నప్పుడే వాళ్ళ బావ సొత్తయిపోయింది. అది మారేది కాదు.


ఆ బావ విదేశాల్లో ఉన్నాడు. ఇప్పటికే మల్టీమిలియనీరు. తొందర్లో వస్తాడు. పెళ్ళి చేసుకుని విష్ణుప్రియని తనతోపాటు తీసుకుపోతాడు. అదీ వాళ్ళనుకునే సంగతి.

విష్ణుప్రియకు ఈ సంగతి తెలియదా అంటే తెలియక కాదు, ఎన్నాళ్ళనుంచో తెలుసును, పెళ్ళి మాటల సందర్భం వచ్చినప్పుడల్లా అనుకునేదే కాబట్టి. కానీ ఆ మాటలను ఆమె అంత సీరియస్‌గా తీసుకోలేదామె.


"సీరియస్ కాకపోవడమేంటీ... నూటికి నూరుపాళ్ళూ సీరియస్సే! అందులో సందేహమేమీ లేదు. కబురెట్టాను. అరే అబ్బాయ్… బేగొచ్చేసి నీ పెళ్ళాన్ని నువ్వు తీసికెళ్ళిపోరా... అని... ఒచ్చేత్తాడు. తొందర్లోనే వచ్చేత్తాడు. పెళ్ళీడుకొచ్చిన పిల్ల... పబ్లిక్‌లో తిరుగుతా ఉంటే... పనికిమాలిన ఎదవలందరికీ పనే!" అన్నాడు అబ్బాయి తండ్రి. అమ్మాయికి మేనమామ.


"ఏమనుకోవద్దు. మా అన్నయ్య మాటతీరు అంతే. సిటీకొచ్చేసి సంవత్సరాలు దాటినా, ఆ పల్లెటూరి తరహా మాటతీరు ఇంకా వదల్లేదు. ముక్కుసూటి మనిషి. మాట కరుకుగాని, మనసు చాలా మంచిది." పదే పదే ఇవే మాటలను అంటుంది విష్ణుప్రియ వాళ్ళ అమ్మ.


"అది సరేనమ్మా! కానీ నాకు ఈ బాధేంటి? సారథి మంచివాడు. తెలివిగలవాడు. అందమైనవాడు. నీకూ తెలుసు నేనంటే అతనికి ఎంత ఇష్టమో! బావకు కోట్లున్నయ్. కాదనను. కానీ నాకూ బావకు ఏ విషయంలోనూ కలవదు. ఇంతకు ముందు ఎన్నోసార్లు అది నేను గమనించాను. బావకి కూడా ఆ సంగతి తెలుసు. ఇద్దరం ఇబ్బందిపడతాం.


మామయ్యకు ఎలాగో నువ్వు నచ్చచెప్పు. ఆ బాధ్యత నీదే. సారథిని తప్ప నేను ఇంకొకర్ని పెళ్ళి చేసుకోను. అందులో నాకు వేరే ఆలోచన లేదు!" అని సర్దిచెబుతున్నట్లుగానే గట్టిగా కూడా చెప్పింది, వాళ్ళ అమ్మతో విష్ణుప్రియ.


"అది నావల్ల అయ్యే పనికాదు. నా వల్లనే కాదు, ఎవరి వల్లనూ కాదు. మామయ్య మాటను కాదనే ధైర్యం ఇక్కడ ఎవ్వరూ చెయ్యరు. చెయ్యలేరు! ఈ సమస్య ఎలా పరిష్కారమౌతుందో ఆ దేముడికే తెలియాలి!" అంది విష్ణుప్రియ వాళ్ళ అమ్మ.


"సరే అయితే. నేను బావతోనే మాట్లాడతాను. నా సమస్యను నేనే పరిష్కరించుకుంటానులే!" అంది విష్ణుప్రియ.


"మంచిదే! ఏం మాట్లాడతావో మాట్లాడి చూడు!" అంది విష్ణుప్రియ వాళ్ళ అమ్మ.


(2)

ఓ పది రోజుల తరువాత, విష్ణుప్రియ మేనమామ అయిన ఆ పల్లెటూరి వాలకం పెద్దాయనకు, ఆయన చెల్లెలైన విష్ణుప్రియ వాళ్ళ అమ్మకు మధ్య చిన్న సంభాషణ జరిగింది. ఆ సంభాషణ ఇలా జరిగింది:

"ఇది అయ్యేది కాదులేమ్మా! వొదిలియ్!" తాను కూర్చునున్న ఖరీదైన కుషన్ ఉన్న సోఫాకుర్చీలో ఇమడలేక ఇబ్బంది పడుతున్నట్లుగా కదులుతూ, గొంతులోంచి పెగిలి రాలేకపోతున్న మాటల్ని ప్రయత్నం మీద బయటికి తెప్పించి మాట్లాడుతున్నట్లుగా అన్నాడు ఆ పెద్దాయన.


"అదేంటన్నా...?" అందామె, సంగతి అర్థమైనా, ఇంకా ఏదో ప్రయత్నం చేసిచూద్దామన్న తలంపుతో ఉన్నట్లుగా.


"అంతేనమ్మా... ఇయ్యి మన రోజులు గావు. మన రోజులు ఎళ్ళిపోయినయ్. ఇప్పుడు ఏదీ కాదనలేం. ఎవుర్నీ కాదనలేం. కాదంటే ఏమవుద్దో ఊహించలేం. ఊహించి కులాసాగా ఉండలేం. కళ్ళల్లో ఎడారి బెట్టుకుని బతకాల. బయటకు ఒక్క కన్నీటి బొట్టు అవుపడ్డానికి కూడా ఈల్లేదు. అట్టాంటి రోజులొచ్చినయ్. అన్నిటికీ నవ్వేసి ఊరుకోవాల. అంతే. మరోదారి లేదు. పిల్ల ఎళ్ళిపోయినా లెక్కపెట్టగూడదు, పిల్లోడు ఎళ్ళిపోయినా పట్టిచ్చుకోగూడదు. చూస్తూ ఉండాలిసిందే తప్ప ఏమీ మాట్టాడగూడదు. ఎళ్ళొస్తాలే తల్లీ!" అంటూ కుర్చీలోంచి లేవడానికి కూడా కష్టపడుతున్నట్లుగా లేచి నిలబడి, తన ఇంటికి బయలుదేరాడాయన.


"అలాగే అన్నా!" అంది, ఆయన చూస్తుండగానే ఉబికి వస్తున్న కళ్ళనీళ్ళని పీట కొంగుతో తుడుచుకుంటూ ఆ పెద్దాయన చెల్లెలు, విష్ణుప్రియ వాళ్ళ అమ్మ.


(3)

అదే రోజు రాత్రి విష్ణుప్రియ, వాళ్ళ అమ్మతో, "మాట్లాడేశానమ్మా. బావతో అంతా మాట్లాడేశాను. ఎవ్రీథింగ్ ఈజ్ సాల్వుడ్. సమస్య తీరిపోయింది!" అంది.


"ఏం తీరిపోయింది?" అంది ముక్తసరిగా వాళ్ళ అమ్మ.


"నేను సారథిని ప్రేమిస్తున్నాను… అతడినే పెళ్ళి చేసుకుంటాను… అని బావతో స్పష్టంగా చెప్పేశాను" అంది సమాధానంగా విష్ణుప్రియ.


"బావ ఏమన్నాడు?" అడిగింది వాళ్ళ అమ్మ.


"నీ పెళ్ళి, నీ ఇష్టం. నీకు నచ్చినవాణ్ణి నువ్వు చేసుకో విష్ణూ, నాదేముంది... అన్నాడు" అంది విష్ణుప్రియ.


"అంతేనా...?" అంది వాళ్ళ అమ్మ.


"అంతే కదమ్మా మరి. నాకు తెలుసు బావ అలాగే అంటాడని" అంది విష్ణుప్రియ.


"మరి ఇంట్లో పెద్దవాళ్ళ సంగతి?" అంది వాళ్ళ అమ్మ.


"ఓ... మావయ్య గురించా... బావ మాట్లాడతానన్నాడులే…" అంది విసురుగా విష్ణుప్రియ.


"సరే అయితే. మరి నా సంగతి?" అడిగింది వాళ్ళ అమ్మ.


"అమ్మా...?!" అంది ఒకింత ఆశ్చర్యంగా, అనుకోని బాణం వ

చ్చి తగిలినట్లుగా విష్ణుప్రియ.


"అవును. మావయ్యతో బావ మాట్లాడతాడన్నవు కదా. నాతో ఎవరు మాట్లాడతారు? నాతో ఎవరూ మాట్లాడే అవసరం లేదా?" అంది వాళ్ళ అమ్మ.


"అదేంటమ్మా? ఏంటిది కొత్తగా...!?" అంది విష్ణుప్రియ ఇంకా తేరుకోనట్లుగా.


"ఏంటంటే... బావను తప్ప ఎవరిని నువ్వు పెళ్ళి చేసుకున్నా నేను ప్రాణాలతో ఉండను. ఆ సంగతి మనసులో పెట్టుకుని ఏ నిర్ణయమైనా తీసుకో..." అంది అదే నిశ్చయమైనట్లుగా విష్ణుప్రియ వాళ్ళ అమ్మ.


"ఏం మాట్లాడుతున్నావమ్మా? ఏమయింది నీకు?" అంది కళ్ళలో నీళ్ళు తిరుగుతుండగా విష్ణుప్రియ.


కొంతసేపు వారిరువురి మధ్య, అంతకు మునుపెన్నడూ వారు గడిపి ఉండని మౌనం నిండిపోయి కాలం గడిచింది. అమ్మ నోటి నుండి ఇంకా ఏమి వినాల్సి వస్తుందో అన్న భయంలో విష్ణుప్రియ, కూతురికి తను పడుతున్న బాధను ఎలా వివరించి చెప్పాలా అన్న ఆలోచనలో వాళ్ళ అమ్మ… అలా ఎవరి ఆలోచనలలో వారు ఉండగా, వారిరువురి మధ్య ఆ నిశ్సబ్ద సమయం గడిచింది.


ఆ తరువాత విష్ణుప్రియ వాళ్ళ అమ్మ ఈ విధంగా చెప్పింది:

"నువ్వు పుట్టినప్పుడు ఇంట్లో మహాలక్ష్మి పుట్టింది అన్నారు అందరూ. మేమూ అదే అనుకున్నాం. అయితే, ఏడాది తిరగక ముందే మీ నాన్న పెట్టిన ఫాక్టరీ మూతపడి ఆర్థికంగా కోలుకోలేని స్థితిలోకి మనం పడిపోగానే, వాళ్ళే నిన్ను నష్ట జాతకురాలు అన్నారు.


మీ మామయ్య ఒక్కడు మాత్రమే అలా అనలేదు. పనికిమాలిన వాళ్ళు పనికిమాలిన మాటలు ఎన్నో మాట్లాడతారు. అవన్నీ పట్టించుకుంటామా? విష్ణుప్రియ నా కోడలు. నా కోడలు ఎన్నటికీ నష్ట జాతకురాలు కాదు... అని ధైర్యం చెప్పి, తాను ఒక్కడే అన్నిటినీ చూసుకోలేకపోతున్నానంటూ రెండెకరాలలో ఉన్న ఆయన పండ్ల తోటను మీ నాన్న పేరుమీద బదిలీ చేశాడు. ఈ సంగతులేవీ నీకు తెలీదు. ఇంత వివరంగా చెప్పాల్సిన అవసరం నాకు రాలేదు. ఈ రోజు కూడా నీకు చెప్పాలన్న ఆలోచన నాకు లేదు.


‘మామయ్య గురించా… బావ మాట్లాడతానన్నాడులే’ అని నువ్వు చాలా తేలికగా తీసి పారేశావే... అది విన్న తరువాత, ఆ పిచ్చిమారాజు ఈ రోజు మధ్యాహ్నం పడిన తపన తలపుకొచ్చి, చెప్పకపోవడం తప్పనిపించి చెప్పాను..." అని అలిసిపోయినట్లుగా విరామం తీసుకుంది ఆమె.


విష్ణుప్రియ ఏమీ మాట్లాడలేదు. మాట్లాడేందుకు ఆమె ఆలోచనలలో ఏమీ లేదు. అకస్మాత్తుగా ఆమె యువక చిత్తంలో ఒక తాత్కాలిక శూన్యం అలుముకున్నట్లుగా అయింది.


"అంతే. కొన్ని పెద్దరికాలు, మంచితనాలు అలా కాలంలో పడి విలువను పోగొట్టుకుని అపహాస్య ప్రాయమైనవిగా మిగిలిపోతాయి. వాటిని గుర్తుంచుకుని గౌరవించడం, పట్టించుకుని బాధపడడం వృథా అనిపించేంతగా కాలం వాటిని మార్చేస్తుంది. ఇందులో నీ తప్పేమీ లేదు. నేనేమీ చచ్చిపోను. నువ్వు భయపడాల్సిందేమీ లేదు.


ఏదో బాధలో అలా అన్నాను తప్ప, ప్రాణాలు తీసుకునేంత ధైర్యం నాకు లేదు. నేను బాగానే ఉంటాను. నీకు నచ్చినవాడిని నువ్వు పెళ్ళిచేసుకుని నీ బ్రతుకు నీవు బతకవచ్చు. అందుకు ఎవ్వరి అభ్యంతరమూ ఉండదు. అన్నయ్య చెప్పినట్లుగా, మీకు కనిపించేటట్లు బాధపడే స్వతంత్రత కూడా మాకు లేదు. ఇష్టం ఉన్నా లేకపోయినా నవ్వడం ఒక్కటే మేము చేయడానికి అర్హులం. అదే చేస్తాం. చేస్తూనే ఉంటాం. అందులో నువ్వు సందేహించాల్సిందేమీ లేదు..." అని తన మనసులోని బాధను కూతురి ముందు వెళ్ళబోసుకుని, సంభాషణను ముగించి అక్కడి నుంచి వెళ్ళిపోయిందామె.

***


పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి  సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.

మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.



భట్టు వెంకటరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం

  ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: భట్టు వెంకటరావు


భట్టు వెంకటరావు

నా పేరు భట్టు వెంకటరావు.

కేంద్ర ప్రభుత్వ విశ్రాంత అధికారిని. 

సాహిత్యంపై అభిలాషతో విశ్రాంత జీవితంలో తెలుగు సంప్రదాయ సాహిత్యం చదవడం మొదలుపెట్టాను. అలా చదవడం మొదలుపెట్టిన కొన్నాళ్ళకి చిన్న చిన్న వ్యాసాలు వ్రాయడం ఆరంభించి, కొనసాగిస్తున్నాను. 


నా రచనా వ్యాసంగం ప్రథానంగా పూర్వ కవుల రచనలలోని ఆసక్తికరమైన విషయాలపై సాహిత్య సంబంధమైన వ్యాఖ్యలతో కూడినదిగా ఉంటుంది. అన్ని ప్రథాన దినపత్రికల సాహిత్యం పేజీలలో నా వ్యాసాలు గత ఆరేడు సంవత్సరాలుగా ప్రచురితమయ్యాయి, అవుతున్నాయి. వాటితో పాటు అప్పుడప్పుడు ఛందోబద్ధమైన పద్యాలను, కంద పద్యం వ్రాయడంతో మొదలుపెట్టి, వ్రాస్తున్నాను.


ప్రస్తుతానికి నా రచనా వ్యాసంగం గురించి చెప్పుకోగలిగినది ఇంతవరకే. ధన్యవాదములు!

నమస్కారములతో,


భట్టు వెంకటరావు,

హైదరాబాదు. 


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page