top of page
Original.png

బహుమతి

3 hours ago
4 min read

బహుమతి తెలుగు కథలో పెళ్లిరోజున ప్రేమగా ఒకరికొకరు పాయసం తినిపించుకుంటున్న రామారావు శారద దంపతులు

Bahumathi - Telugu Family Story | Merla Srilakshmi

బహుమతి తెలుగు కుటుంబ కథ | మెర్ల శ్రీలక్ష్మి

Published in manatelugukathalu.com on 19/09/2026


“శారదా! టీ పట్టుకుని రా..” అని వాకిట్లో కూర్చొని పేపర్ చదువుతూ కేక వేశాడు రామారావు.


“కాస్త ఆగండి, పూజ ఇప్పుడే అయింది” అని దేవుడికి హారతి ఇస్తుంది.


“ఏవండీ!” అని హారతి పళ్లెం తెచ్చి చూపించింది.


అతను చేతులు ముందుకి చాచి, కళ్ళకి అద్దుకుని భార్య వైపు చూశాడు.


ఎరుపు, పచ్చ కలగలిసిన కాటన్ చీర, ముడతలు పడిన శరీరం, అక్కడక్కడా తెల్లపడిన జుట్టు. తడి జుట్టు ఇంకా ఆరలేదు, చివరన ముడి వేసుకుని ఉంది.

ముఖం పైన రూపాయిబిళ్ళ కంటే కొంచెం చిన్నగా ఉన్న కుంకుమ బొట్టు. తలలో మందారం, అక్షింతలు చూసి, “ఈవేళ ఏమైనా పండుగా..?” అని అడిగాడు సందేహంగా.


“అవును, పండుగ మన ఇద్దరిదే. ఈరోజు మన పెళ్ళి రోజు!” అని అన్నది నవ్వుతూ.


ఇంతలో ఎదురింట్లో నవ్వులు వినిపిస్తున్నాయి. ఏమిటా అని చూశాడు.


ఎవరెవరో వస్తున్నారు జనం. హడావిడిగా అటు ఇటు తిరుగుతున్నారు. అప్పుడే ఇంటి ముందు కట్టిన రంగురంగుల బ్యానర్ చూశాడు. అందులో పుట్టినరోజు శుభాకాంక్షలు అని కనిపించిన అక్షరాలు చూసి, “ఈరోజు గురుమూర్తి గారి మనవడి పుట్టినరోజు” అని అన్నది.


“ఊరు నుండి కొడుకులు, కోడళ్ళు, కూతుర్లు, అల్లుళ్ళు, పిల్లలు అంతా వచ్చారు. ఎందుకో అనుకున్నా, ఇందుకే అన్నమాట” అని అన్నాడు రామారావు.


“వారసుడు వచ్చాడని గొప్పగా ఊరందరినీ పిలిచి భోజనాలు పెడుతున్నారు. మనల్నీ పిలిచారు. సాయంత్రం అక్కడే భోజనం. కానీ నేను రాను, నీచు మాంసాలు ముట్టుకోను. మీరు వెళ్ళండి.”


శారద టీ పెట్టడానికి వంటింట్లోకి వెళ్ళింది.

“నువ్వు రాకుండా నేను ఎందుకు..” అన్నాడు.


“బాగోదు, వెళ్ళాలి. ఇరుగు పొరుగు కదా.”


“అయితే ఇద్దరం కలిసి వెళ్తాం. కనిపించి వచ్చేస్తాం.”


“అలాగే!” అన్నది.


శారదా రామారావులకు ముగ్గురు కూతుర్లు. పెళ్లిళ్లు అయ్యి పిల్లలతో దూరంగా ఉన్నారు. ఈరోజు ఆ దంపతులు ఒకటైన రోజు..


“ఈరోజు వంట ఏమి చేయమంటారు?”


“నీ ఇష్టం..”


“అదేంటీ, ఈరోజు మీకు నచ్చినవి వండి పెడదాం అనుకుంటే..” అడిగింది టీ అందిస్తూ.


రామారావు సగం టీ తాగి ఆమెకి వేరే గ్లాసులో ఇస్తూ, “ఇప్పటి వరకు నువ్వు నాకు చేసింది చాలు. ఈరోజు నేనే నీకు ప్రత్యేకంగా వంట చేస్తాను” అన్నాడు.


“ఏంటి, మీరా?” అని ఆశ్చర్యపోయింది.


“అవును, నేనే! నేను చేస్తే తినవా?” అని అడిగాడు నవ్వుతూ.


“లేదు, మీకు వంట వచ్చా అని..”


“వచ్చు” అని అన్నాడు.


“అయితే ఈరోజు పాయసం, పులిహోర, వడలు, రవ్వ లడ్డు చేయండి” అన్నది ఆర్డర్ వేస్తూ.


“అలాగే శ్రీమతి గారూ!” అని వినయంగా అన్నాడు నవ్వేస్తూ.


“నువ్వు ఎదురుగా ఉంటే నేను వండలేను. నువ్వు కాసేపు టీవీలో నీకు ఇష్టమైన సినిమా చూడు” అని పంపాడు.


ఆవిడ అలాగేనని టీవీ ముందు కూర్చుంది.


మధ్యమధ్యలో ఎదురుగా గోడ మీద ఉన్న గడియారం వైపు ఒకసారి, వంటగది వైపు మరోసారి చూస్తుంది.


రామారావు వంటింట్లో వంట చేస్తూ గిన్నె పడేస్తే ఆవిడ గబగబా పరిగెత్తింది.


“ఏవండోయ్! ఏంటా శబ్దం?” అని అడిగింది.


“ఏమీ లేదే!” అని వెనుక ఏదో దాచే ప్రయత్నం చేశాడు.


“వంట అయిపోయిందా?” అని అడిగింది.


“అయిపోతుంది ఇంకో పావుగంటలో..” అన్నాడు చెయ్యి చూపిస్తూ.


వంటగదిలో వస్తువులను పరిశీలనగా చూసింది. గిన్నెలు, కూరగాయలు, డబ్బాలు కింద కనిపించాయి.


నవ్వుకుని, “సరే చేయండి” అని వెళ్ళిపోయింది.


ఇంతలో వీడియో కాల్‌లో కూతురు వంట చేస్తూ చెపుతుంటే అతను చేయడం గమనించేసింది శారద.


“అమ్మా దొంగా! ఇన్నాళ్ళలో వంట చేసింది లేదు. నేను వండి పెడితే తినని మీరు ఈరోజు వంట వచ్చు, చేస్తానని చెప్పి మీరు చేసేది ఇదా?” అని అన్నది బుంగమూతి పెట్టి.


“నాన్న అడిగింది వడలు ఒకటే కదా అమ్మా!”



‘వడలు ఒకటే అడిగారా, మిగతావి’ అన్నట్టు చూసింది.


భర్త పిలుస్తుంటే, “అమ్మా, నాన్నా! గొడవ

పడకండి. ఈరోజు మీరిద్దరూ ఒకటైన రోజు. పెళ్లిరోజు శుభాకాంక్షలు” అని పెట్టేసింది.


ఆ తర్వాత పులిహోర, వడలు, రవ్వలడ్డు చూసి, “పాయసము చేయలేదే!” అని అడిగింది.


“అది అడుగుతుంటే నువ్వు వచ్చావు, ఫోన్ పెట్టేసింది.”


“అంటే పులిహోర, రవ్వలడ్డు వచ్చా మీకు?”


“లేదు, పులిహోర పెద్దమ్మాయి చెప్పింది, రవ్వలడ్డు రెండోది, వడలు ఎలా చేయాలో మూడోది.. పాయసం ఎవరిని అడగాలని ఆలోచిస్తున్నా.”


శారద నవ్వుకుని, “సరే, పాయసం నేను చేస్తాను!” అని అన్నది.


“వద్దు, ఈరోజు నేనే చేస్తానని చెప్పా. ఎలా చేయాలో చెప్పు, చేసేస్తా” అన్నాడు.


ఆమె సరేనని పక్కన ఉండి చెపుతుంటే అతను వంట పూర్తి చేశాడు.


ఇద్దరూ కలిసి ఒకరికొకరు తినిపించుకుంటూ భోజనం చేస్తూ ఉంటే, టీవీలో ‘మిధునం’ సినిమా వస్తోంది.


బయట గురుమూర్తి గారి మనవడి పుట్టినరోజు వేడుకలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.


ఊరి అందరితో పాటు రామారావు, శారద దంపతులు కూడా ఆ వేడుకలో పాల్గొన్నారు.


నాన్-వెజ్ తినని వారి కోసం టిఫిన్ ఏర్పాట్లు చేశారని తెలిసి అటు వెళ్లారు. కడుపునిండా తిని పుట్టినరోజు బాబుకి శుభాకాంక్షలు చెప్పి కానుక ఇవ్వడానికి జేబులో డబ్బు తీసుకున్నాడు.


బాబు తల్లి ఒడిలో కూర్చున్నాడని, “శారదా, నువ్వే పెట్టు..” అని ఆమె చేతికి అందించాడు.


శారద సరేనని రెండు వందల నోటు బాలుడి చేతిలో పెట్టి, వాళ్ళు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ తీసుకుని వెనక్కి వచ్చేశారు.

వాళ్ళు కట్టుకున్న బట్టలు పంచె, కాటన్ చీర, పసుపు తాడు, మట్టిగాజుల వైపు ఎగతాళిగా చూసింది.


ఆ తల్లి పిల్లాడి చేతిలో రెండు వందలు చూసి, “రెండు వందలు పెట్టి, వేల రూపాయల ఖరీదు చేసే గిఫ్ట్ పట్టుకుని పోతున్నారు” అన్నది భర్తతో విసుగ్గా.


“తప్పు భార్గవీ! మనం పుట్టినరోజు చేసేది డబ్బుల కోసమా.. అందరికీ కడుపునిండా భోజనం పెట్టి ఆశీర్వాదం ఇస్తారని కదా!” అని తిట్టాడు.


“ఏమో, అనవసరంగా మీరు డబ్బు వృధా చేస్తున్నారు. ఇలా పెట్టి.. వాడే బదులు ఒక ఏసీ కారు కొన్నా బాగుండేది” అన్నది.


ఆ మాటలు రామారావు, శారద చెవిన పడ్డాయి. వాళ్ళకి బాధగా అనిపించింది, ఉండలేకపోయారు.


ఇంటికి వచ్చిన తర్వాత పడుకుని తీక్షణంగా ఆలోచిస్తున్నాడు రామారావు.


శారద చూసి, “ఏమిటండీ! ఇంకా ఆ అమ్మాయి అన్న మాటల గురించే ఆలోచిస్తున్నారా?” అని అడిగింది.


అతనేమీ బదులు ఇవ్వలేదు.


“ఆ అమ్మాయి పద్ధతి అంతేనట. ఊరిలో అందరూ చెప్పుకుంటున్నారు. ఎవరికీ ఇంత పెట్టడానికి ఒప్పుకోదట. ఇంటికి వచ్చిన వాళ్ళకి మర్యాద చేయదని అత్తగారు చెపుతుంటే విన్నాను.”


“శారదా! ఒకటి అడుగుతాను, చెప్తావా?” అని అడిగాడు.


“ఏంటండీ, అడగండి” అని అన్నది.


“నువ్వు నాతో ఇప్పటి వరకు సంతోషంగానే ఉన్నావా?” అని ప్రశ్నించాడు.



“అదేం ప్రశ్నండీ! మీతో నేను సంతోషంగా ఉన్నానా ఏంటి? చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకలా అడిగారు?”


అతని కళ్ళలో కన్నీళ్ళు చేరాయి.


“ఎందుకండీ కన్నీళ్ళు?” అని కంగారు పడింది ఆవిడ, పక్కన నుండి లేచి కళ్ళు తుడుస్తూ.


అతని కళ్ళలో కన్నీళ్ళు ఇంకా ఎక్కువయ్యాయి.


“మన పిల్లల చదువు కోసం, పెళ్లిళ్ళ కోసం నీ మెడలో పసుపు తాడు ఒకటి ఉంచుకుని మిగతా బంగారం అంతా త్యాగం చేశావు. ముగ్గురు మగబిడ్డల తర్వాత ఒకే ఆడబిడ్డ అని పట్టుచీరతో, బంగారు నగలతో మీ అమ్మ నాన్న నిన్ను అత్తారింటికి పంపితే, సంవత్సరానికి ఒక చీర చాలని సరిపెట్టుకుంటూ పసుపు తాడుతో జీవితం చాలని నాకోసం ఎన్నో త్యాగాలు చేశావు. 


నీ సంతోషం అంతా దోచుకున్న ద్రోహిని నేను. కష్టసుఖాలలో తోడు ఉంటానని మాటకి కట్టుబడి నాకోసం ఎన్నో త్యాగాలు చేశావు. నేను నీకు ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలను?”


భర్త మాటలకు అతని మనసులో బాధ ఎంత ఉందో అర్థం చేసుకుంది.

ఆవిడ వెంటనే అతని చెయ్యి గట్టిగా పట్టుకుంది.


“ఎందుకండీ అలా మాట్లాడతారు? ఇప్పుడేం తక్కువ మనకు? ముగ్గురు కూతుళ్ళ పెళ్లిళ్ళు అయ్యి, పిల్లపాపలతో, అల్లుళ్ళతో సంతోషంగా ఉన్నారు. అయినా జీవితంలో సంతోషం అంటే ఆ భార్గవి ఖరీదైన వస్తువులు, కార్లు, ఇల్లు, ఐశ్వర్యం, డబ్బులతో కొలుస్తుందేమో.. 


నా దృష్టిలో జీవితంలో సంతోషం అంటే బాధ్యత తెలిసి మనసును అర్థం చేసుకునే తోడు దొరకడం.. అలాంటి మొగుడ్ని ఆ దేవుడు నాకు ఇచ్చాడు. ఈరోజు నాకోసం మీరు మీ కూతుళ్ళతో కలిసి వంట చేయడానికి పడిన కష్టాన్ని చూస్తేనే తెలిసింది మీ ప్రేమ ఎంత గొప్పదో.. ఈ జీవితానికి ఇంతకంటే ఏం కావాలి!” అని అన్నది.



రామారావు శారద చెయ్యి గట్టిగా పట్టుకుని, “నా జీవితంలో నువ్వు నాకు దేవుడిచ్చిన గొప్ప బహుమతి” అన్నారు.


గురుమూర్తి గారి ఇంట్లో లైట్లు ఆరిపోతున్నాయి. పాటలు వినిపించడం లేదు. హడావిడి అయిపోయింది. ఒక రోజు పండుగ సందడి అయిపోయింది. చిన్న పెంకిటింట్లో మాత్రం టీవీలో ‘మిధునం’ సినిమాలో “ఎవరిప్పుడు గెలిచారు” పాట వస్తోంది. భార్యాభర్తలిద్దరూ ఉదయం మిగిలిపోయిన సేమ్యా పాయసం వేడి చేసుకుని పంచుకుని ఒకరికొకరు తినిపించుకుంటున్నారు.


సమాప్తం


*** 



పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి  సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.

మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.



మెర్ల శ్రీలక్ష్మి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



పరిచయం: నా పేరు మెర్ల శ్రీలక్ష్మి

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page