top of page
Original.png

రక్తసంబంధం

#Rakthasambandham, #రక్తసంబంధం, #JeediguntaSrinivasaRao, #జీడిగుంటశ్రీనివాసరావు, #TeluguMoralStories, #తెలుగునీతికథలు


Rakthasambandham - New Telugu Story Written By Jeedigunta Srinivasa Rao Published In manatelugukathalu.com On 11/03/2026

రక్తసంబంధం - తెలుగు కథ

రచన : జీడిగుంట శ్రీనివాసరావు

ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత

 

“అన్నదమ్ములు రెండు సంవత్సరాలు మాట్లాడుకోలేదు…

కానీ ఒక చిన్న అమ్మాయి ప్రాణం ప్రమాదంలో పడినప్పుడు

వాళ్లు  చేసిన పని వినగానే మీ కళ్ళలో నీళ్లు వస్తాయి…”

ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత జీడిగుంట శ్రీనివాసరావు గారి రక్త సంబంధం కథలో అనుబంధాల విలువ తెలుసుకోండి. 

 రామారావు, కృష్ణారావు అన్నదమ్ములు. రామారావు ఊర్లోనే ఉండి వ్యవసాయం చూసుకుంటుంటే, కృష్ణారావు పట్టణంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా స్థిరపడ్డాడు. వీరిద్దరి మధ్య గొడవలు లేవు, ఆస్తి తగాదాలు లేవు. కానీ, తండ్రి చనిపోయాక రెండేళ్లు నుండి ఒక విషయంలో మాత్రం చిన్న గొడవ ఉంది. అది వారి పాత ఇల్లు. కృష్ణారావు దాన్ని అమ్మేసి సిటీలో ఫ్లాట్ తీసుకుందాం అంటాడు, రామారావు మాత్రం "నాన్న జ్ఞాపకం" అని అమ్మటం తనకి ఇష్టం లేదు అంటాడు.


రామారావుకి ఒక కూతురు, టెన్త్ క్లాస్ చదువుకుంటోంది. కృష్ణారావుకి ఇద్దరు కొడుకులు డబ్బు ఉండటంతో వాళ్ళని మంచి స్కూల్‌లో చదివిస్తున్నాడు. అన్నదమ్ములు ఏదో విధంగా సద్దుకున్నా, తోడికోడళ్ళు మామగారి ఇల్లు అమ్మకం మీద ఒకరికొకరు మాట్లాడుకోకుండా భర్తలను కూడా కంట్రోల్ చేశారు.


దానితో తల్లిదండ్రుల తిథినాడు తప్పా రామారావు, కృష్ణారావు కలిసేవాళ్లు కాదు.


ఒకరోజు స్కూల్ నుంచి వచ్చిన రామారావు కూతురు ఆయాసంగా ఉంది అని చెప్పడంతో లోకల్‌గా ఉన్న డాక్టర్‌కి చూపించాడు. ఒకసారి పట్నంలో పెద్ద డాక్టర్‌కి చూపించండి అని చెప్పడంతో తమ్ముడు కృష్ణారావు సహాయం తీసుకుందాం అనుకున్నాడు రామారావు. 


మనతో సరిగ్గా మాటలు లేని వాళ్ళ సహాయం ఎందుకు, అదికాక ఆడపిల్ల, అనవసరంగా విషయం వాళ్ళకి తెలియడం మంచిది కాదు అంది రామారావు భార్య.


రామారావు భార్య, కూతురుతో పాటు విజయవాడ వెళ్లి రక్షణా హార్ట్ హాస్పిటల్‌కి చేరుకున్నాడు. ఆటో దిగి లోపలికి వస్తుండగా తమ్ముడు కృష్ణారావు విజిటర్స్ రూమ్‌లో ఉండటం చూసి తమ్ముడిని పలకరిద్దాం అని ముందుకు వెళ్ళబోయాడు. తన చెయ్యి పట్టుకుని ఆపుతున్న భార్యని విదిలించుకుని తమ్ముడు కూర్చున్న చోటుకి వెళ్లి "ఒరేయ్ కృష్ణా, ఏమైంది రా, ఇక్కడ ఉన్నావు?" అని ఆడిగాడు. 


సడన్‌గా అన్నగారిని చూసి నీరసంగా లేచి అన్నగారిని కౌగిలించుకుని "నాకు నెల క్రితం స్టంట్ వేశారు. చెకప్‌కి వచ్చాను. తను లోపల డాక్టర్ గారితో మాట్లాడుతోంది. నువ్వేమిటి హాస్పిటల్‌కి వచ్చావు?" అని ఆడిగాడు.


"ఏముంది రా ఎంత దురదృష్టం కాకపోతే అన్నదమ్ములం ఇలా హాస్పిటల్‌లో కలుసుకోవడం! మా అమ్మాయిని డాక్టర్‌కి చూపిద్దాం అని వచ్చాను. అదిగో అక్కడ మీ వదిన, అమ్మాయి కూర్చొని ఉన్నారు. పద" అంటూ తమ్ముడి చెయ్యి పట్టుకుని తీసుకుని వెళ్ళాడు.


"బాగున్నారా వదినా?" అన్నాడు కృష్ణారావు. "ఆ, ఏం బాగుంటాం! పల్లెటూరిలో ఉండి పొలంలో ఎద్దులతో పాటు మేమూను. సరే, మీ ఆవిడ రాలేదా?" అంది.


"మా తమ్ముడికి స్టంట్ వేశారుట. మా మరదలు లోపల డాక్టర్తో మాట్లాడుతోంది" అన్నాడు రామారావు.


"ఈ వయసులో స్టంట్ ఎందుకు చేశావయ్య! సినిమాలో కూడా నటిస్తున్నావా?" అంటున్న వదినగారిని చూసి "గుండెకు నెత్తురు అందకపోతే వేసే దానిని స్టంట్ అంటారు. చంటితల్లి అప్పుడే టెన్త్ క్లాస్‌కి వచ్చేసిందా!" అంటూ అన్నగారి కూతురిని చూసి "చిన్నపిల్లవి నీకేమి ఉండదులే, బ్లడ్ తగ్గినా ఆయాసం వస్తుంది" అన్నాడు రెండు ఐదు వందల నోట్లు పిల్ల చేతిలోపెట్టి కృష్ణారావు.


ఇంతలో కృష్ణారావు భార్య వచ్చి "మీకెలా తెలుసు ఈయనకి ఆపరేషన్ అయ్యింది అని?" అంది రామారావు భార్యతో. "మాకు తెలియదు, మా అమ్మాయిని డాక్టర్ గారికి చూపించటానికి వచ్చి ఇక్కడ మరిది గారిని చూసి విషయం తెలుసుకున్నాము" అంది రామారావు భార్య.


"సరే పదండి, డాక్టర్ గారు మిమ్మల్ని మూడు నెలలు ఎక్కువగా మాట్లాడకుండా చూడమన్నారు. వెళ్ళొస్తాం" అంటూ భర్త చెయ్యి పట్టుకుని తీసుకుని వెళ్ళిపోయింది. 


"మీ పాపకి గుండెల్లో చిన్న రంధ్రం పడింది. ఆపరేషన్ చెయ్యాలి" అన్నాడు డాక్టర్ గారు టెస్ట్ చేసి రామారావుతో. "త్వరగా మీ నిర్ణయం చెప్పండి. ఆపరేషన్‌కి ఐదు లక్షల వరకు అవుతుంది" అనటంతో బయటకు వచ్చి "మందులు వాడమన్నారు" అని భార్యకి చెప్పి ఇంటికి చేరుకున్న తరువాత కూతురు వినకుండా భార్యకు విషయం చెప్పాడు.


"అంటే మొత్తం ఆరు, ఏడు లక్షలు వరకు అవుతుంది అనుకుంటా. అంత డబ్బు ఎక్కడ నుంచి తెస్తాము?" అంది ఏడుస్తూ. "పిల్ల ఆరోగ్యం ముఖ్యం. ఈ ఇంటి కోసమేగా మా తమ్ముడి కుటుంబంతో విరోధం వచ్చింది. ఈ ఇల్లు అమ్మేసి మనకి వచ్చిన డబ్బుతో అమ్మాయికి ఆపరేషన్ చేయిద్దాము. ఈరోజే మా తమ్ముడికి ఇల్లు అమ్మటానికి నాకు అంగీకారం. వెంటనే బయలుదేరి రమ్మంటాను" అన్నాడు రామారావు.


"ఎలాగో చౌదరి గారు కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఆపరేషన్‌కి సరిపడా డబ్బు అడ్వాన్స్ తీసుకోండి. మీ తమ్ముడు రాగానే రిజిస్ట్రేషన్ చేద్దురుగాని" అంది.


"ఎందుకు అన్నయ్యా సడన్‌గా ఇల్లు అమ్మటానికి సిద్ధం అయ్యావు? డాక్టర్ నన్ను కొన్నాళ్ళు ప్రయాణం చేయద్దు అన్నారు. ఇల్లు అమ్మకం విషయం తరువాత చూద్దాం లే" అన్నాడు కృష్ణారావు. "అయినా ఇంత త్వరగా బేరం ఎక్కడిది అన్నయ్యా?" అన్నాడు. "మన ఊరి చౌదరి గారు కొనుకుంటాను అన్నారు ముప్పై లక్షలకి. మేమే డాక్యుమెంట్స్ పట్టుకుని నీ దగ్గరికి వస్తాము వచ్చే వారం" అన్నాడు రామారావు.


అంతా విన్న కృష్ణారావు భార్య, "ఎందుకైనా మంచిది ఒకసారి చౌదరి గారికి ఫోన్ చేసి అసలు రేట్ ఎంతో తెలుసుకోండి. ఎందుకో మీ అన్నయ్య తక్కువ చెప్తున్నాడు అని అనుమానం" అంటున్న భార్య వంక చూసి "అన్నదమ్ములని విడదీసిన నీ పాపానికి ఆరోగ్యంగా ఉన్న నాకు గుండె జబ్బు వచ్చింది. పల్లెటూరిలో ఉండి తను చదువు మానేసి నాకు చదువుకోవడానికి అవకాశం ఇచ్చిన మా అన్నయ్యని అపార్థం చేసుకుంటున్నావు. ఇప్పటికైనా మారు, లేదంటే వాళ్ళ ఉసురు నాకు తగులుతుంది" అన్నాడు కృష్ణారావు కోపంగా.


"అయ్యో మీరు ఆవేశపడకండి, దగ్గు వస్తోంది. నేను ఏమన్నాను అని? సరే నేను మీ అన్నదమ్ముల విషయంలో నోరుమూసుకుని ఉంటాను. అయినా బావగారు చెప్పబట్టేగా మీరు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది" అంటూ సిగ్గుపడింది కృష్ణారావు భార్య.


"ఒకసారి రేపు డాక్టర్ గారి దగ్గరికి వెళ్లి కారులో నేను ప్రయాణం చేయవచ్చా అని అడుగుదాం. నాకు ఎందుకో నేను పుట్టి పెరిగిన మా ఊరు, మా నాన్న కట్టించిన ఇల్లు చూడాలి అని ఉంది" అన్నాడు. 


"రామారావు గారు మీ అన్నగారుట కదా? మీ విషయంలో చాలా కంగారు పడితే 'మీ తమ్ముడికి ఏమి పర్వాలేదు, ముందు మీ అమ్మాయికి త్వరగా ఆపరేషన్ చెయ్యాలి, లేట్ అవ్వడం మంచిది కాదు' అన్నాను" అని చెబుతున్న డాక్టర్ గారిని తన అన్న కూతురికి వచ్చిన జబ్బు గురించి, ఆపరేషన్‌కి ఎంత ఖర్చు అవుతుందో అడిగి తెలుసుకుని, "మా నాన్నగారు మా ఇద్దరిలో ఒకరినే పై చదువులు చదివించగల స్తోమత ఉంది అన్నప్పుడు, తమ్ముడిని చదివించండి, నేను మీకు వ్యవసాయంలో సహాయంగా ఉంటాను" అన్నాడు.


"మా అన్నయ్య ఆరోజు చేసిన త్యాగం వలనే నేను ఇంజనీర్‌గా పట్నంలో ఉన్నాను. మా అన్నయ్య ఆ పల్లెటూరిలో ఉన్నాడు" అంటూ డాక్టర్ గారికి చెప్పాడు కళ్ళు తుడుచుకుంటూ కృష్ణారావు.


"మీరు ఆవేశ పడకండి. మీ అన్నగారు వారం రోజులలో డబ్బు తీసుకుని వస్తాను అన్నారు. రాగానే ఆపరేషన్‌కి అరేంజ్‌మెంట్స్ చేస్తాను" అంటున్న డాక్టర్ గారితో కృష్ణారావు భార్య కలిపించుకుని "డబ్బులు గురించి ఆలోచన అక్కర్లేదు. నాలుగు రోజులలో ఆపరేషన్‌కి సిద్ధం చెయ్యండి. మేము మా వాళ్ళని తీసుకుని రెండు రోజులలో మిమ్మల్ని కలుస్తాము" అని చెప్పడం విని "తనేనా ఈ మాటలు అంటోంది?" అని గిల్లుకున్నాడు.


బయటకు వచ్చిన తరువాత "పోనీలెండి ఎంతైనా మీది రక్తసంబంధం. మనకైనా వాళ్ళకైనా ఉంది ఆ ఒక్క ఆడపిల్లే. ఇప్పుడు దానికి ప్రాణం మీదకి వస్తే ఎలా ఊరుకుంటాం! ఇందుకోసమే పాపం బావగారు ఇల్లు అమ్మడానికి ఒప్పుకున్నారు. డబ్బులు దాచుకుని ఏం చేస్తాం? అవసరానికి ఆదుకోకపోతే ఇంక అన్నదమ్ములుమిటి? పదండి ఊరు వెళ్లి బావగారిని, అక్కయ్యని, అమ్మాయిని తీసుకుని వద్దాం. సాయంత్రం నేను వెళ్లి డాక్టర్ గారికి చెక్కు ఇచ్చి వస్తాను" అంది కృష్ణారావు భార్య.


"నువ్వేనా ఈ మాటలు మాట్లాడుతోంది?" అన్నాడు కృష్ణారావు. "అవునండి. మీ అన్నగారు చదువుకుంటాను అంటే మనం ఇప్పుడు బావగారి పరిస్థితిలో ఉండేవాళ్ళం. అంతా బావగారి గొప్పతనం" అంది.


ఇంటి ముందు ఆగిన కారులోనుంచి తమ్ముడు, మరదలు, పిల్లలు దిగటం చూసి ఎదురు వచ్చి లోపలికి తీసుకుని వెళ్ళాడు రామారావు.


ఆశ్చర్యం! తన కూతురు, తమ్ముడు కొడుకులు ఎలా ఆడుకుంటున్నారో అప్పుడే అనుకున్నాడు.


కృష్ణారావు అన్నయ్య దగ్గర కూర్చొని "అన్నయ్యా! పాపాయికి ఇంత జబ్బుగా ఉంటే చెప్పకుండా ఇల్లు అమ్మేసి ఆపరేషన్ చేయిద్దాం అనుకున్నావా? ఈ నాడు నేను పెద్ద ఇంజనీర్‌గా ఉన్నాను అంటే, ఆ హక్కుపత్రం నీ త్యాగం అన్నయ్య. నీ కూతురు నా కూతురు కాదా? ఆపరేషన్‌కి అయ్యే డబ్బులు హాస్పిటల్‌లో కట్టేశాము. ఇల్లు అమ్మక్కర్లేదు" అన్నాడు.


అప్పుడు రామారావు తమ్ముడి చేతిని పట్టుకుని ఆప్యాయంగా "అయితే ఇల్లు నీ పేరున రిజిస్ట్రేషన్ చేయిస్తాను, నీకు మాత్రం డబ్బు ఎక్కడ నుంచి వస్తుంది?" అన్నాడు.


"వద్దు బావగారు. ఇల్లు మీద సర్వ హక్కులు మీకు ఇస్తూ మీ తమ్ముడు హక్కు పత్రం రాసి తీసుకుని వచ్చారు. అటు చూడండి బావగారు, పిల్లలు ఎంత ఆనందంగా ఉన్నారో! మేము పిల్లలకు సెలవులు ఇచ్చినప్పుడు మీ దగ్గరకి వచ్చి ఉండేడట్లు అవకాశం ఇవ్వండి చాలు."


"రేపు మనం త్వరగా బయల్దేరి విజయవాడ వెళ్ళాలి. ఎల్లుండి మంచిది. అక్కయ్యా, అమ్మాయిని హాస్పిటల్‌లో జాయిన్ చేద్దాం" అంటున్న కృష్ణారావు భార్యని ఆశ్చర్యంగా చూసింది రామారావు భార్య.


అన్నం తిని వెన్నెలలో అన్నదమ్ములిద్దరూ దొడ్లో మంచం మీద పడుకుని కబుర్లు చెప్పుకోవడం చూసి "ఇన్నాళ్ళు వీళ్ళ బంధానికి అడ్డం తగిలి తప్పు చేసాము అక్కయ్యా" అంది కృష్ణారావు భార్య. "ఇల్లు అంటే ఇటుకలు, సిమెంట్ కాదు. మనుషులు ఉంటే ఇలాంటి ఇళ్లు ఎన్నైనా కట్టుకోవచ్చు. త్యాగం అనేది మాటల్లో చెబితే వినిపిస్తుంది, కానీ చేతల్లో చూపిస్తే గుండెలకు తగులుతుంది. ఎంతైనా రక్తసంబంధం కదా."


                

శుభం


జీడిగుంట శ్రీనివాసరావు గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):

జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.



30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.



2 Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
Mana Telugu Kathalu
Mana Telugu Kathalu
23 minutes ago

@t.s.sbhargavateja6196

•4 minutes ago

Super story and truth of relationship. Great story srinivas rao garu 🎉

Like

Mana Telugu Kathalu
Mana Telugu Kathalu
24 minutes ago

@KasivisweswararaoGoteti

• 16 minutes ago (edited)

మసుకి హత్తుకొనేట్టుఉంది


Like
bottom of page