top of page
Original.png

ద్వంద్వ  ఘంటారావం

#DwandwaGhantaravam, #ద్వంద్వఘంటారావం, #DrBrindaMN, #డాక్టర్.బృందఎంఎన్., #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు


Dwandwa Ghantaravam - New Telugu Story Written By Dr. Brinda M N

Published In manatelugukathalu.com On 11/03/2026

ద్వంద్వ  ఘంటారావం - తెలుగు కథ

రచన: డాక్టర్ బృంద ఎం. ఎన్.


డుం డుం డుం డుం డుం డుం డుం మాంగల్యం తంతునానేనా  మమ జీవన హేతునామ్ ,,,,,,,,,


"హమ్మయ్య! మాంగళ్యధారణ మనస్ఫూర్తిగా అనుకున్న శుభ ఘడియలకే జరిగిందమ్మా."


"అవును అన్నయ్యా, చిన్నప్పుడు నీవు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నావు. లక్ష్మీదేవి నా కోడలు కావటం పూర్వజన్మ సుకృతం."


"ఇక నా కంటిపాపకు అన్ని నువ్వే చెల్లెమ్మా, అమాయకురాలు, కాస్త జాగ్రత్తగా చూసుకో"


"అన్నయ్యా, నువ్వు వేరే చెప్పాలా! నేను ఇష్టపడి కలలుకని తెచ్చుకున్న కోడలిని నా సొంత కూతురిలా చూసుకుంటాను"


అప్పగింతలు అత్యంత వైభవంగా జరిగాయి. ఆడుతూ, పాడుతూ అల్లరి చేస్తూ ఆనందంగా ఆరు కుటుంబాలకు పెద్ద కూతురిగా, నాన్న కూచీగా అందరి ప్రేమను పొందిన లక్ష్మీదేవికి కొత్త కాపురం వింతగా ఉంది.


సంవత్సరాలు గడుస్తున్నా సంతాన యోగానికి నోచుకోలేక పోయారు దంపతులు. లెక్కలేనన్నీ పూజలు, వ్రతాలు, నోములు, నోచగా పదేళ్లకు పండంటి పసిపాప గొంతు వినిపించింది. పుట్టినప్పటి నుండే మౌనంగా ఉంటూ, తనే ఆడుకుంటూ, అప్పుడప్పుడు కూని రాగాలు తీస్తూ, రాసి రాయని చేతులతో చిన్న చిన్న బొమ్మలు గీస్తూ, పెరిగి పెద్ద కాసాగింది నిహస్వి. పసితనం నుండే డాక్టర్ ఆట ఆడుకుంటూ సూదులు ఎలా ఇవ్వాలి? ప్రిస్క్రిప్షన్ ఎలా రాయాలి? అని తనకు తెలిసిన పద్ధతులలో ప్రాక్టీసు చేసేది. ఇంటిలో ఉండే చిన్న రబ్బరు పైపు మరియు రబ్బరు కార్క్ తో స్టెతస్కోప్ తయారు చేసుకుంది. అలాగే ప్లాస్టిక్ సూదులు, దూది, స్పిరిట్ కు బదులుగా గ్లాసులో నీరు, పేషెంట్ ను పడుకోబెట్టడానికి చిన్న నారుచాప ఇలా ఎన్నెన్నో.


"నీ పేరు?"


"శైలజ"


"ఏమైందమ్మా"


"ఛాతిలో నొప్పి"


"ఎప్పటినుండి?"


"నిన్నటి నుండి"


"ఏమైనా మసాలాలు తిన్నారా?"


"అబ్బా! నీహూ లేదు, ఎంతసేపు పడుకోబెడతావు,లేస్తాను" శైలజ గోడు


"ఉండుండు, చెక్ చేస్తాను, ఆ ఈ చీటీలో మందులు రాశాను వాడండి మర్నాడు చీటీ తీసుకొని కనిపించండి."


"అబ్బా! ఏమే, నువ్వు నిజమైన డాక్టర్ కంటే ఎక్కువ సేపు చూస్తావు, రేపు నేను రాను పోయే" శైలజ నిట్టూర్పు


"కచ్చితంగా రావాలి, లేదంటే డాక్టర్ ఆట ఎలా ఆడాలి చెప్పు?"


ఇంకొకరోజు "ఏమైందండీ? మీ పేరు లత కదా"


"అబ్బా, నీకు తెలుసు కదా మళ్లీ ఎందుకు?"


"పంటి నొప్పి"


"ఆ ,,,,అన్నట్టు మీరు చాక్లెట్లు ఎక్కువగా తినడం నేను గమనించాను. వాటిని తగ్గించండి. దాంతోపాటు ఈ మాత్రలు వేసుకోండి.


"సరే"


"ఇంకొక మాట రోజుకి రెండుసార్లు బ్రష్ చేయండి"


" రాత్రి కూడానా. వద్దే తల్లి!" లతా దండం పెట్టింది.


నిహస్వి ఆటను ప్రతిరోజు నానమ్మ కళ్ళార్పకుండా చూస్తూ ఉండేది తను పెద్దయ్యాక నిజంగా డాక్టర్ అయితే ఎంతమందికి సేవ చేస్తుందో అని. స్నేహితులందరూ ఆట స్థలంలో, పార్కులో ఎన్నో ఆటలు ఆడేవారు కానీ తనకు తెలిసిన ఒకే ఒక ఆట డాక్టర్ ఆట. ప్రతిరోజు అది కొంతమంది స్నేహితులు అవన్నీ ఆడుకొని చివరగా తన దగ్గరికి వచ్చేవారు.


"అక్క నేను నిహస్వి ఇంటికి వెళుతున్నాను" లతా చెప్పింది.


"అదేంటి! ఆ చిన్న పేపర్ తీసుకెళ్తున్నావు"


"ఆ ,,,,తను డాక్టర్ కదా మాత్రలు రాసి ఇచ్చింది."


ఇలా పలుమార్లు గమనించిన లత అక్క "ప్రతిసారి ఎందుకు ఆ పేపర్?"


"అక్క, తనే డాక్టర్ అందుకు."


" ఏం, మీరు ఎవరైనా ఉండొచ్చు కదా!"


"తను ఒప్పుకోదు"


"రోజు ఒక్కొక్కరు డాక్టర్ గా ఉండి ఆడుకోండి. కుదరదు అంటే ఎవరు వెళ్ళకండి." దుష్ట స్వభావం గల లత అక్క. అక్క చెప్పినట్టుగా రాయి విసిరింది లత.


"ఈరోజు నేను డాక్టర్ గా ఉంటా మీరందరూ పేషంట్స్" అంది


"నో,,,,, నో,,,, నో ,,,,,నెవర్, నేనే డాక్టర్ గా ఉంటా మీరే పేషెంట్స్ లేకపోతే ఆట క్యాన్సిల్" కోపంతో రుసరుసలాడింది నిహస్వి.


వారం రోజులు ఎవ్వరూ రాలేదు. కానీ తను ఆటను మానలేదు. తన అపురూపమైన రాధ బొమ్మను పేషెంట్గా చేసి ఆడుకునేది. స్నేహితులు ఇళ్లల్లో హోంవర్క్ చేయమనే వారు పెద్దలు, ఎక్కడా కదలడానికి, మెదలడానికి లేకపోయేది. దీనికంటే నిహస్వీ వద్ద పేషంట్ గానే బావుండేది అనుకున్నారు.


"సారీ,,,,, సారీ,,,, నువ్వే డాక్టర్, మేమే పేషంట్స్ రోజు వస్తాం ఇక మునుపటిలా ఆడుకుందాం."


"సరే, అందరికీ ధన్యవాదాలు, రండి."

***


"ఆ,,,, శైలజ! ఏంటి సమస్య?"


"జ్వరం, తలనొప్పి, దగ్గు"


"జ్వరం చాలా లైట్ గా ఉంది తగ్గిపోతుంది. మిగతా వాటికి మాత్రం రాస్తాను. శైలజ ఇంటికి వెళుతూ ఆ పేపర్ అలాగే ముందరుంచి  పట్టుకు పోయింది.

***


"ఏమ్మా , శైలు అయిపోయాయ ఆటలు? ఏం పేపర్ అది?"


"మావయ్యా, ఇదా! మా ఫ్రెండ్ ఇచ్చింది"


లక్ష్మీపతి ఒక్కసారి ఆ పేపర్ చూసి అవాక్కయ్యాడు.


"ఏమైందన్నయ్యా?"


" అమ్మ ఈ ప్రిస్క్రిప్షన్ ఎంబీబీఎస్ డాక్టర్స్ రాసేది చూడు."


"సారీడాన్, కార్టిల్,  ఇసిగోపైరిన్, పాప నిజంగా ఫ్రెండ్ ఇంటి నుంచి వచ్చిందా?"


"అయ్యో! అన్నయ్యా.. అదేదో పిచ్చాట  ఆడుకుంటారు"


"కాదమ్మా, శైలు మీ ఫ్రెండ్ ని రేపు మన ఇంటికి పిలుచుకురా"


"మామయ్యా! ఆట అయిపోగానే హోం వర్క్ చేసుకుంటుంది రాదు"


"ప్లీజ్ అమ్మ, నేను మాట్లాడాలి తనతో"


"అన్నయ్యా! ఆ ఫ్రెండ్ నీకు తెలుసు నిహస్వి."


"ఏంటి? నిహస్వా,,,,,, వావ్ షి విల్ బికమ్ ఏ డాక్టర్, షి మస్ట్ బికమ్ ఎ డాక్టర్."


మరుసటి రోజు లక్ష్మీదేవితో మాట్లాడాడు లక్ష్మీపతి." ఏమ్మా బావున్నారా? నిన్ననే నిహస్వి గురించి తెలిసింది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా పాపను డాక్టర్ చదివించండి."


"సరే అన్నయ్యా!, ఆ సమయానికి ఎలా జరుగుతుందో, ఎవరికి తెలుసు?"


"ఈ ప్రయత్నం చేయండమ్మా"


నాల్గవ తరగతికే కూతురికి వైద్యం పట్ల ఇంత అవగాహన ఉండడం చూసి ఆనందపడ్డారు తల్లిదండ్రులు. తర్వాతి  కాలంలో చెల్లితో ఆడుకునేది  నిహస్వి. ఇంటర్ అయిన వెంటనే ఎంసెట్ రాసింది. అదృష్టం తలుపు తట్టినట్టుగా రష్యా నుండి లేఖ,  టెలిగ్రామ్ చాలాసార్లు వచ్చాయి  ఎం. బి . బి. ఎస్ లో చేరటానికి. తండ్రి చాలా ప్రయత్నించి కావలసిన ధనాన్ని కూడా కూడబెట్టుకున్నారు. నిహస్వి కూడా సంసిద్ధంగా ఉంది.


"ఏంటే, నిన్ను కని, పెంచి, చదువు చెప్పించింది, దేశం కానీ దేశం  పంపటానికా? ఐదేళ్లు అక్కడే ఉండాలా వద్దంటే వద్దు"


"అమ్మ! నువ్వు, నాన్నగారు రావచ్చు. నేను మాత్రం కోర్స్ వరకు అక్కడే ఉంటాను. తర్వాత ఉద్యోగ అవకాశాలు కూడా  వారే కల్పిస్తారు. జాగ్రత్తగా ఉంటాను అమ్మా. నా కల నెరవేర్చుకోవడానికి మంచి అవకాశం కదమ్మా."


"వద్దండి, చిన్న పిల్ల అంత దూరం పంపను నాకు ఇష్టం లేదు"


"ఏమీ కాదు సంవత్సరానికి ఒకసారి మనం వెళ్లి వద్దాం"


"మమ్మల్ని ఎలా విడిచి పోతావే" అని మొహం చిట్లించింది లక్ష్మీదేవి. తల్లి వేదన చూసిన నిహస్వి ఆమెను బాధ పెట్టడం ఇష్టం లేక విరమించుకుంది.


తన కల  కల్లగా  మిగిలిపోకూడదని ఆయుర్వేద, యోగాలో తర్ఫీదు పొంది సొంతంగా ప్రాక్టీసు మొదలు పెట్టింది. ఉచితంగా యోగా తరగతులు నిర్వహించడం, మధ్య మధ్యలో చిట్కాలు చెప్పడం, అవసరమైతే వారి వారి ఇంటికి వెళ్లి సేవ చేసేది నిహస్వి.


చిన్నప్పటి తన కలను నెరవేర్చుకునే దిశలో ఎందరికో సేవ చేసే భాగ్యం దక్కిందని ఆనందంలో తన్ను తాను మరిచిపోయింది నిహస్వి. తను నిర్వహించే ఉచిత యోగ శిక్షణా తరగతులకు నిత్యం వంద మంది హాజరు అయ్యేవారు వయస్సు, లింగ బేధాలతో సంబంధం లేకుండా. ఎందరికో బిపి, షుగర్, కిడ్నీ సమస్యలు, మైగ్రేన్, గ్యాస్, వీపునొప్పి లాంటి సమస్యలు పూర్తిగా నయమయ్యాయి. ముఖ్యంగా చిన్నపిల్లలకు ఏకాగ్రత, ఎత్తు పెరగడం. సంక్రాంతి, దసరా వేసవి సెలవుల్లో  నిహస్వి సొంతంగా కొన్ని ఔషధ ఆకులతో  గుగ్గుళ్ళు తయారు చేసి ఉచితంగా పంపిణీ చేసేది, తద్వారా కీళ్లవాతం ఎంతోమందికి మెరుగుపడింది.


అనుకోకుండా ఒక రోజు ఒక అద్భుతాన్ని విని అవాక్కయింది నిహస్వి. పది రోజుల పాటు తరగతుల్లో వారం రోజులు మాత్రమే పాల్గొన్న మాధవి చెప్పిన సంగతి.


"మేడం, నేను మీ క్లాసుకు మూడవరోజు వచ్చాను భయంకరమైన తలనొప్పితో. మరుసటి దినం నుండి మానేద్దాం అనుకున్నాను, కానీ మీరు కచ్చితంగా వారం రండి తగ్గుతుందని, మీరు క్లాసులో నాకోసం ప్రత్యేకంగా చేయించినటువంటి ప్రాణాయామాల వల్ల, ఇంతకు మునుపు పెద్ద పెద్ద నగరాల్లో దాదాపు 7 నుండి 8 లక్షల ఖర్చు పెట్టుకున్నా, పన్నెండేళ్ళనాటి  నా తలనొప్పికి విరుగుడు లేదు. కానీ మీ క్లాస్ కు కేవలం వారం రావడం, మీరు నా పైన చూపిన ప్రత్యేక శ్రద్ధ, చిట్కాల వలన పూర్తిగా తగ్గిపోయింది. ఐ యాం వెరీ వెరీ హ్యాపీ మేడం."


మాధవి సమాధానంతో నిహస్వి నయనాలు ఆనందాశ్రువులతో తడిసిపోయాయి. కక్ష్యలో చప్పట్ల గంటలు మారుమ్రోగాయి. దీనితో నిహస్వి సేవా తత్పరతకు పిచ్చి ముదిరింది. తల్లిదండ్రుల సేవ, సామాజిక సేవ ధ్యేయంగా పయనించింది. ముప్పై ఏళ్ళ తన జీవితంలో ఏనాడు తన గురించి చింతన లేదు. శరీరంలో మార్పులు వస్తున్నా, అవయవాలు హెచ్చరిస్తున్నా, అప్పడప్పటికీ మాత్రమే మందులు వేసుకోవడం, తర్వాత షరా మామూలే. ఇంకా ఇంటి బాధ్యతలు కూడా మీద పడ్డాయి.


జీవితంలో ఒక్కసారిగా పెద్ద బాంబు పడింది ఈ ప్రవాహ చక్రంలో తన మోకాలు రెండుసార్లు బెణికింది. అయినా తన  దినచర్యలో మార్పు లేదు. ఇంతింతై వటుడింతై  అన్నట్టుగా మోకాలు అతిపెద్ద వాపు, నొప్పితో ప్రత్యక్షమయింది. అడుగు తీసి అడుగు వేయలేని స్థితి. లిగమెంట్ మీద అతి దొడ్డ దెబ్బ పడింది. కొంతమంది కీళ్ళనిపుణులను  సంప్రదించగా మోకాలు మార్పిడికి వెళదాం అన్నారు. నిహస్వి మనసు ఒప్పుకోలేదు. చిన్నప్పటినుండి నమ్మిన ప్రకృతి చికిత్సకే  పెద్ద పీట వేసింది. తల్లిదండ్రులు వార్ధక్యంలో ఉన్నారు కనుక వారికి నచ్చచెప్పి వెళ్ళింది. తోబుట్టువులు, బంధువులు, స్నేహితులు అందరూ వారి వారి పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఎవరి సహకారం తీసుకోవడానికి ఇష్టపడని సునిశిత మనస్కురాలు  నిహస్వి.


స్నేహితురాలు ప్రణవికి ఫోన్ చేసి విషయం అంతా వివరించింది.


"ప్రణవి కర్తవ్యంలో విజయశాంతిలా పోరాటాలు చేస్తున్నానని, సమరం,,,,, సమరం,,,,, పొంగే,,,,, రుధిరం అంటూ సాధిస్తాననే సంకల్పంతో ఉన్నాను."


"నిహస్వి, ఒక మాట చెప్పనా, నిన్ను బాగా ఎరుగుదును. నువ్వు విజయశాంతిలా చేయగలుగుతున్నావు కానీ విజయశాంతి నీలా చేయగలదా?"


"అంటే,,,, అర్థం కాలేదు"


"అదే,,, ఓ!  అమాయకురాలా, తను సినిమా కోసం నటించింది. కానీ నువ్వు నిజ జీవితంలో బలమైన, భయంకరమైన, భీభత్సకరమైన పోరాటాలు చేస్తున్నావు. యు ఆర్ ద రియల్ విజయశాంతి. ఐ యాం వెరీ ప్రౌడ్ అఫ్ యు. హావ్ ఎ స్పీడీ రికవరీ."


"థాంక్యూ సో మచ్ ప్రణవి, ఇలాంటి మంచి స్నేహితురాలు దక్కటం నా పూర్వజన్మ సుకృతం."


"ఒద్దు, నిహస్వి! ఉన్న జన్మకి అలసి పోతున్నాను" పకపకా నవ్వింది ప్రణవి


ఆరోగ్యం బాలేదని తెలుసుకున్న కొంతమంది ఫోన్ ద్వారా పరామర్శించారు.


"మేడం, మీరు చేసిన మంచి మిమ్మల్ని కాపాడుతుంది. వేల కుటుంబాలు మీవల్ల సంతోషంగా ఉన్నాయి." అని ఒకరు


"మేడం, మంచితనం వల్ల అంతా నష్టపోయాను. ఎందుకు పనికి వస్తుంది? అని వాపోయేవారు ఎప్పుడైనా గుర్తుందా? ఇప్పుడు అదే మీకు శ్రీరామరక్ష" అని ఇంకొకరు


"మేడం, ఒక ఎయిడ్స్ వ్యాధి ఎంత వరకు వ్యాపిస్తుందో నాకు తెలియదు, కానీ మీ మంచితనం అనే అందమైన వ్యాధిని ప్రపంచం అంతటా వ్యాపించారు. మిమ్మల్ని మరల ఆ పాత, చలాకి మేడంగా చూస్తాను అన్న నమ్మకం ఉంది." అని మరొకరు


"నువ్వు ఇంకా ఇప్పటికీ డాక్టర్ని అనుకుంటున్నావా?" ప్రణవి సంకోచం


"అబ్సల్యూట్లీ,,,,,,, వై నాట్?"


"ప్రస్తుతం పక్కా పేషంట్ కదా"


"ఐ ఆమ్ టూ ఇన్ వన్, డాక్టర్ కం పేషంట్"


"హౌ"


"పేషెంట్ గా ఉన్నా డాక్టర్ గారి సలహాలు కార్యక్రమం కొనసాగుతూనే ఉందోయ్"


"మొత్తానికి నిజ జీవితంలో ద్వంద్వ ఘంటారావం  ఆనందంగా మ్రోగిస్తున్నావు.

నిహస్వి నువ్వు త్వరగా కోలుకోవాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. గాడ్ బ్లెస్స్ యు డియర్."


నిహస్వి నిరాడంబరత, క్రమశిక్షణ, మంచితనం, ఆత్మవిశ్వాసం, పట్టు వదలని సంకల్పమే తన భవిష్యత్తును నిర్ధారిస్తాయి.


నీతి: ఆరోగ్యమే మహాభాగ్యం. శరీరం అలారంలాగ ఆకలి, నిద్ర, విశ్రాంతి, ఏది కావాలి, ఏది వద్దు అని కచ్చితంగా చెబుతుంది.  శరీర భాషను అర్థం చేసుకుని సంకేతాలను దృష్టిలో ఉంచుకొని తగువిధంగా నడుచుకుంటే అందరూ సుఖంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటారు.


 "జై తెలుగుతల్లి! జై భరతమాత"


 సమాప్తం


డాక్టర్ బృంద ఎం. ఎన్.  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం: డాక్టర్ బృంద ఎం. ఎన్.

 

కవయిత్రి, రచయిత్రి, గాయని,

స్కిట్ డైరెక్టర్, చిత్రకారిణి

15 సంవత్సరాలుగా నిరంతర తెలుగు భాషా పరిరక్షణ కొరకు పాటుపడుట

భారతీ సాహితీ సమితిలో ప్రధాన కార్యదర్శిగా ఉండి ఆధునిక ప్రాచీన సాహిత్యంపై పని చేయడం అలాగే విద్యార్థులకు సుమతీ, వేమన, భాస్కర శతక పద్య పోటీలు నిర్వహించుట, తెలుగు సాహితీ మూర్తుల జయంతి వేడుకలు జరిపి వారి సేవలను గురించి సమాజానికి తెలియపరచుట, సందేశాత్మక కథలు, నీతి కథలు వ్రాసి విజేతలగుట, ప్రపంచ తెలుగు మహాసభల్లో చురుకుగా పాల్గొని (delegate) పెద్దవారి ప్రశంసలు పొందుట, యువతను ఉద్దేశించి రచనలు చేయుట, భారతదేశ ఔన్నత్యాన్ని దశ దిశల చాటుట, ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ కవి సమ్మేళనంలో పాల్గొనుట తదితరమైనవి.


 


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page