top of page
Original.png

వికటించిన యువప్రాయం

29 minutes ago
3 min read

వికటించిన యువప్రాయం కథలో కొడుకు వ్యసనాలకు బానిస కావడంతో విషాదంలో ఉన్న వైద్య దంపతులు

Vikatinchina YuvaPrayam - Telugu Family Story | Goparaju Venkata Suryanarayana

వికటించిన యువప్రాయం - తెలుగు కుటుంబ కథ | రచన: గోపరాజు వెంకట సూర్యనారాయణ|

Published In manatelugukathalu.com On 23/11/2026


“వికటించిన యువప్రాయం” యువతను చెడు స్నేహాలు, వ్యసనాల నుంచి కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తుచేసే విషాదభరితమైన సామాజిక కథ.


ఆ పట్టణంలో శ్రీదేవి, రంగనాథ్ దంపతులు పేరుపడ్డ వైద్యులు. సొంత నర్సింగ్ హోమ్ నడుపుతూ ఆ చుట్టుపక్కల ఊళ్ళ వారందరికీ వైద్యసేవలు అందిస్తున్న ప్రముఖులు.


శ్రీదేవి ప్రసూతి వైద్యురాలు, రంగనాథ్ ప్రముఖ వైద్య శస్త్రచికిత్సా నిపుణుడు. అందుచేత వారి హాస్పిటల్ ఇరవై పడకల నుంచి యాభైకి పెరిగి దినదినాభివృద్ధి చెందుతూ మంచి పేరుపొందింది.


చుట్టుపక్కలకంతకూ తలమానికమై నిలిచింది. పేరుతో పాటు ఇబ్బడిముబ్బడిగా సంపాదన కూడా పెరిగి తొందరగానే గొప్ప సంపన్నులయ్యారు.


వారికి రవి, రమేష్ ఇద్దరే పిల్లలు. పిల్లల జీవితాలు చిన్నప్పటి నుంచీ వడ్డించిన విస్తరి. ఏది కావాలన్నా వెంటనే వారికి సాకారమయ్యే సౌలభ్యం! విలాసవంతమైన కులాసా విచ్చలవిడి జీవితం!


తల్లిదండ్రులు ఇద్దరిదీ తీరికలేని వైద్య వృత్తి! పిల్లల ఆలనాపాలనా చూసుకొని పర్యవేక్షించేందుకు తగిన తీరిక చిక్కని పరిస్థితి. 


ఆయాల ద్వారానే పిల్లల నిత్యావసరాలు చూసే ఏర్పాటు. కానీ... పిల్లల భవిష్యత్తుపై వారు పెంచుకున్న ఆశలు మాత్రం మెండు! డబ్బుతో సాధించగల దేన్నయినా పిల్లల కోసం చేయగల సమర్థత కలవారే.


అయినా... సంపదలు పిల్లలకు క్రమశిక్షణను, విజ్ఞతను ఇవ్వలేవు కదా! పెద్దవాడు రవి చదువుపై అంతగా శ్రద్ధ చూపక విద్యలో పెద్దగా రాణించలేదు.


“రవీ! ఎలాగైనా డిగ్రీ అయినా కనీసం పూర్తి చేయరా!” అని తల్లిదండ్రులు పోరగా పోరగా… “ఈ చదువు నా వల్ల కాదు. ఏదైనా వ్యాపారం చేసుకుంటాను” అని మొండికేశాడు.


ఎలాగో అమ్మా నాన్నా పోరు పడలేక డిగ్రీనే అతి కష్టం మీద అంచెలంచెలుగా పూర్తి చేశాడు. సరేలే... చేసేదేముంది... ఆస్తిపాస్తులు చూసుకుంటాడులే అని సరిపెట్టుకోక తప్పలేదు చివరకా తల్లిదండ్రులకు.


ఇకపోతే... చిన్నవాడు కొంతలో కొంత మెరుగు. చిన్న కొడుకు రమేష్ పైనే తమ అస్తిత్వ సామ్రాజ్యానికి వారసునిగా ఆశలన్నీ పెట్టుకున్నారు.


చిన్న కొడుకు కూడా పోటీ పరీక్షలో పెద్దగా నెగ్గుకు రాలేకపోయినా... డొనేషన్ కట్టి వేరే రాష్ట్రంలో, పేరున్న వైద్య విద్యా రెసిడెన్షియల్ కళాశాలలో సీటు సంపాదించి పెట్టి ప్రవేశపెట్టారు.


అక్కడ చేరేవాళ్లంతా డబ్బున్న మహారాజుల బిడ్డలే! అక్కడ చదువు కంటే ఆడంబరాలే ఎక్కువ. జల్సారాయుళ్లకు కొదవ లేదు.


ఏమాత్రం మనోనిబ్బరం, నిబద్ధత సడలినా, ఆధునిక పోకడల దృష్టిలో పడి దారి తప్పడం ఖాయం! అదే యువతలోని బలహీనత కూడా కదా! అందుకు చేతిలో డబ్బు గలగలలు తోడయితే చెప్పేదేముంది? చెడు అలవాట్లు అలవరచటానికి వ్యసనపరులు వెన్నంటే ఉంటారు.


యువరక్తం అందుకు దాసోహమంటుంది. మత్తు పానీయాలతో మొదలైన రమేష్ తొలి అడుగు సిగరెట్లకు, తాగుడుకు, ఆపైన గంజాయి సేవనకు అలవాటు పడ్డాడు. మెట్టుమెట్టుగా డ్రగ్స్ మత్తుకు అతని శరీరం బానిస అయ్యింది.


మత్తులోనే గడపటంతో కాలేజీకి క్రమంగా వెళ్ళక చదువు వెనకపడింది. సెమిస్టర్ పరీక్షలలో వచ్చిన మార్కుల వెనుకబాటు దిగులుతో, మరింత మత్తులో ఉండడానికే అలవాటు పడ్డాడు.


ఇంటి నుంచి డబ్బు కోసం కుంటి సాకులు, అబద్ధాలు చెప్పటం అలవాటుగా మారింది. ఆపైన చేస్తున్న అప్పులు తీర్చటానికై సొంత ఇంట్లోనే... నగలు, డబ్బు దొంగతనానికి కూడా వెనుకాడని పరిస్థితికి దిగజారాడు.


ఒకటి రెండు సార్లు డబ్బు వృథా ఖర్చు విషయమై కొద్దిగా అనుమానం కలిగినా, డబ్బుకు కొదవలేని పెద్దలు పెద్దగా దృష్టి సారించి నిఘా పెట్టే ప్రయత్నాలేవీ చేసే తీరిక లేకపోయిందా వైద్య దంపతులకు.


తల్లిదండ్రులకు కాలేజీ నుంచి హెచ్చరికల లేఖలు వచ్చి తెలుసుకొని గమనించేసరికి పరిస్థితి చేయి దాటిపోయింది.


దైన్యపు చివరి దశలో పెథిడిన్ ఇంజక్షన్ ఓవర్ డోస్‌తో, ఆత్మహత్యకు పాల్పడి ఆపస్మారక స్థితికి చేరాడు రమేష్!


కాలేజీ యాజమాన్యం పిలుపుతో తెలుసుకున్న తల్లిదండ్రులు హడావుడిగా వెంటనే వచ్చినా, కొడుకు పరిస్థితి విషమించటంతో, కన్న కొడుకును కూడా కాపాడుకోలేని వారయ్యారా డాక్టర్ల జంట.


తన తప్పుల్ని క్షమించమని వేడుకుంటూ నిండు ప్రాణాలు తీసుకుంటూ, కొడుకు రాసిన సూసైడ్ నోట్!


“అమ్మా! నాన్నా!... నేను మీ ఆశలు తీర్చలేని అధోగతి స్థితికి చేరుకున్నాను. ప్రస్తుతం నా మనసే కాదు, శరీరం కూడా నా స్వాధీనంలో ఉండటం లేదు! చదువులో పూర్తిగా వెనకపడ్డాను! 


సెమిస్టర్ పరీక్షలు రాసి పాసవ్వగలనన్న నమ్మకం లేదు!! నేను దారి తప్పి వ్యసనాలకు బానిసనై జీవితం పూర్తిగా పాడు చేసుకున్నాను! ధన మదం నన్నీ స్థితికి నెట్టింది! 


మీరు నాకు అన్నీ ఇచ్చారు! పేరెంటల్ నిఘా, పర్యవేక్షణ తప్ప! 


అది నా పాలిట దౌర్భాగ్యమయ్యింది! నాలోనూ విజ్ఞత కొరవడింది! డబ్బున్నవారి చెడు స్నేహాల ఉచ్చులో చిక్కుకుపోయాను! 


వెనకకు మళ్ళి, నా పరిస్థితి చక్కదిద్దుకునే స్థాయి దాటిపోయింది! నాకు వేరే మార్గం కనిపించటం లేదు! మీకు నేరుగా క్షమాపణ చెప్పే ధైర్యం లేదు! 


వైద్య వృత్తితో తెలిసిన సునాయాస మరణాన్ని ఆశ్రయిస్తున్నాను! నా జీవితం సంపన్నులకు గుణపాఠం కావాలి! మీకిలా శోకాన్ని మిగులుస్తున్నందుకు నన్ను క్షమించండి!”


కొడుకు రాసిన ఆ మరణ వాంగ్మూలం చూసి దుఃఖంతో తల్లడిల్లారా సంపన్న డాక్టర్ దంపతులు.


 సమాప్తం








📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y



గోపరాజు వెంకట సూర్యనారాయణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

గోపరాజు వెంకట సూర్యనారాయణ

రచయిత పరిచయం:

 ముందుగా మన తెలుగు కథలు.కామ్ నిర్వాహకులకు నమస్కారం, అభినందనలు. మీరు తెలుగు కథలను, కథకులను ప్రోత్సహిస్తున్న తీరు ఈ మధ్యనే తెలిసింది!

నా పేరు: గోపరాజు వెంకట సూర్యనారాయణ, తల్లిదండ్రులు: గోపరాజు కృష్ణమూర్తి, అనసూయ దంపతులు.నివాసం: కూకట్ పల్లి, హైదరాబాదు.

వృత్తి రీత్యా M.Tech. Machine design చదివిన నేను, HMT Hyd. లో, దాదాపు ముప్పై ఏళ్ళు పైన పనిచేసి డిప్యూటీ జనరల్ మేనేజరు స్థాయిలో వాలంటరీ పదవీ విరమణ చేసిన ఇంజనీరును.

ఆ తర్వాత పేరున్న విజ్ఞాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీలో ప్రొఫెసర్ గానూ, మరికొన్ని ఇంజనీరింగు సంస్థల్లో డిజైన్ కన్సల్టెంటు గానూ పనిచేసిన అనుభవం.

ప్రస్తుతం విశ్రాంత సీనియర్ సిటిజన్ ను.స్వతహాగా సాహిత్యాభిమానిని, కళాభిమానిని. కథలంటే బాగా ఇష్టపడతాను.ఈ మధ్యనే, రిటైర్మెంట్ తర్వాత స్వీయరచనా వ్యాసాంగానికి, స్వీయ పెయింటింగ్సు వేయడానికి సాహసిస్తున్నాను. పలు అంతర్జాల సమూహలకు, సంకలనాలకు కవితలు, చిన్నగా కథలు రాస్తున్నాను, ప్రచురిస్తున్నారు, అభినందిస్తున్నారు! 




Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page