నువ్వుంటే చాలు

Nuvunte Chalu - Telugu Family Story | Ch. Pratap
నువ్వుంటే చాలు - తెలుగు కుటుంబ కథ | Ch. ప్రతాప్
Published in manatelugukathalu.com on 01/11/2026
నువ్వుంటే చాలు సి.హెచ్. ప్రతాప్ రచించిన హృద్యమైన తెలుగు కుటుంబ కథ. భార్యాభర్తల మధ్య ప్రేమ, అపార్థాలు, ఆత్మాభిమానం, సంభాషణ ప్రాముఖ్యతను చాటిచెప్పే ఈ భావోద్వేగ కథ ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తుంది.
టేబుల్‌పై రాజ్కిష్టమైన వంటలన్నీ అమర్చి ఉన్నాయి. అనిష మాత్రం అతనొస్తే అస్సలు మాట్లాడకూడదని మనసులోనే గట్టిగా నిర్ణయించుకుంది.
ఆ రోజు వాళ్ల పెళ్లిరోజు.
ఒకప్పుడు నెల ముందునుంచే వేడుకకు ఎంతో ఉత్సాహంతో ఏర్పాట్లు చేసేవాడు. కానీ ఈరోజు ఉదయం కనీసం పలకరించకుండానే పనికి వెళ్లిపోయాడు.
ఆమె కూడా కావాలనే గుర్తుచేయలేదు. గుర్తుచేసిన తర్వాత చెప్పే పడికట్టు శుభాకాంక్షల కోసం ఆమె మనసు ఎదురుచూడటం లేదు.
గత కొన్నినెలలుగా వాళ్లిద్దరూ ఒకే ఇంట్లో బంధీలుగా ఉంటూ, వేర్వేరు మౌనాల్లో నరకం అనుభవిస్తున్నారు.
చిన్నపాటి మాట పట్టింపుగా మారుతోంది, ఆ పట్టింపు కాస్తా పెద్ద గొడవగా పరిణమిస్తోంది. ఇద్దరికీ ఒకరికొకరు దగ్గరవ్వాలనే తాపత్రయం ఉన్నా, ఆత్మమానం అడ్డువచ్చి మొదటి అడుగు మాత్రం ఎవ్వరూ వేయలేకపోతున్నారు.
రాత్రి ఎనిమిదవుతుండగా కాలింగ్‌బెల్ మోగింది.
అనిష నిశ్శబ్దంగా వెళ్లి తలుపు తెరిచింది.
రాజ్ బయట వానలో పూర్తిగా తడిసిపోయి నిలబడి ఉన్నాడు. చొక్కా లోపల వర్షానికి తడవకుండా దాచిన ఎర్రటి పూలగుత్తిని బయటకు తీసి, వణుకుతున్న చేతులతో ఆమెకు అందించాడు.
“పెళ్లిరోజు శుభాకాంక్షలు అనిషా.”
ఆ పూలపై కొన్ని వానచినుకులు ముత్యాల్లా మెరుస్తున్నాయి.
“మర్చిపోయావనుకున్నా…” అనిష గొంతులో తెచ్చిపెట్టుకున్న గాంభీర్యం.
“ఉదయమే చెప్పి ఉంటే రోజంతా ఈ సస్పెన్స్ ఉండేది కాదుగా? నీకు సర్ ప్రైజ్ ఇద్దామనే చెప్పలేదు.”
ఆమె పూలను అందుకుంటూ తలదించుకుంది. “నేను మాత్రం రోజంతా నువ్వు నన్ను మర్చిపోయావని కుమిలిపోయాను.”
రాజ్ ఆమె కళ్లలోకి ఆర్ద్రంగా చూశాడు. “సారీ అనిషా. నా ఆశ్చర్యం నీకు ఆనందాన్ని ఇవ్వాలి కానీ, ఇలా బాధపెడుతుందని ఊహించలేదు.”
ఆ క్షణంలో ఆ మాటలు ఆమెకు ఆ పూలకంటే అపురూపంగా అనిపించాయి.
లోపలికి వచ్చిన రాజ్ డైనింగ్ టేబుల్‌వైపు చూశాడు. “ఇవన్నీ నాకోసమేనా?”
“నువ్వు తింటావనే శ్రమపడి చేశాను. కానీ వచ్చాక నీతో అస్సలు మాట్లాడకూడదనుకున్నా.”
“మరి ఇప్పుడు?”
ఆమె కోపాన్ని నటిస్తూనే అతని తడిసిన చొక్కా చేతిని పట్టుకుంది. “ముందు వెళ్లి పొడి బట్టలు వేసుకో. జలుబు చేస్తుంది.”
అతను గొల్లున నవ్వాడు. “కోపమున్నా నా జలుబు సంగతి మర్చిపోవన్నమాట!”
“నీ మీద కోపం వస్తుంది రాజ్... కానీ నువ్వు అనారోగ్యంతో బాధపడితే నేను చూడలేను.”
అతను ఆమె చేతిని తన రెండు చేతుల్లోకి తీసుకున్నాడు. “నాకూ అంతే అనిషా... ప్రేమున్నా ఈ మధ్య మనస్పర్థల వల్ల ఆ విషయం నీకు తెలీకుండా బతికేస్తున్నాను.”
అనిష తన భారమంతా దింపుకుంటూ అతని భుజంపై తలవాల్చింది. ఎన్నాళ్లకో ఆ ఇంట్లో గడియారం చప్పుడు ఎంతో హాయిగా వినిపించింది.
“వెళ్లి బట్టలు మార్చుకో. తర్వాత నిమ్మళంగా మాట్లాడుకుందాం,” అంది.
రాజ్ పడకగదికి వెళ్లాడు. అనిష ఉత్సాహంగా వంటగదిలోకి వెళ్లి అన్నం వేడిచేయసాగింది.
సరిగ్గా అప్పుడే ఆమె ఫోన్ మోగింది. అపరిచిత సంఖ్య.
“హలో, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నామమ్మా. ఈరోజు సాయంత్రం ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక బైకిస్ట్ తీవ్రంగా గాయపడి చనిపోయాడు. ఆయన దగ్గర దొరికిన పర్సులో 'రాజ్' పేరుతో ఉన్న ఐడెంటిటీ కార్డ్, అత్యవసర సంప్రదింపుల కోసం మీ నంబరు ఉన్నాయి.”
అనిష చేతిలోని గరిటె నేలపై పడి పెద్ద శబ్దం చేసింది. ఆమె గుండె ఆగినంత పనైంది.
“రాజ్... రాజ్ మా ఆయన! ఆయనేంటి, ఇప్పుడే ఇంటికొచ్చారు!” ఆమె గొంతు కంపించింది.
“అలాగా? అయితే ఒక్కసారి ఆయనతో మాట్లాడించండి. మేం వివరాలు నిర్ధారించుకోవాలి.”
“ఒక్క నిమిషం…”
ఆమె ఒళ్లు వణుకుతుండగా పడకగదిలోకి పరిగెత్తింది. మంచంపై అతను మార్చుకోవడానికి తీసిపెట్టిన బట్టలున్నాయి కానీ రాజ్ కనిపించలేదు.
గదికి ఆనుకుని ఉన్న బాత్రూమ్ తలుపు మూసి ఉంది. లోపల నీళ్ల చప్పుడు వినిపిస్తోంది.
అతన్ని పిలవడానికి నోరు తెరిచింది కానీ భయంతో గొంతు పెకిలరాలేదు. పోలీసులు చెప్పిన 'చనిపోయాడు' అనే మాట ఆమె చెవుల్లో మార్మోగుతోంది. అసలు తలుపు తెరిచినప్పుడు నిలబడింది రాజేనా? ఆ పూలగుత్తి, ఆ వెచ్చని స్పర్శ... అన్నీ నిజమే కదా! భయం ఆమె వివేకాన్ని పూర్తిగా మబ్బులా కమ్మేసింది.
“రాజ్!” తలుపుపై గట్టిగా బాదింది.
లోపల షవర్ నీళ్ల చప్పుడులో ఆమె పిలుపు అతనికి సరిగ్గా వినపడలేదు.
“రాజ్… ఒక్కసారి బయటకు రా! ప్లీజ్ మాట్లాడరా!” ఈసారి ఆమె గొంతులోని తీవ్రమైన ఆందోళన, ఏడుపు అతనికి స్పష్టంగా వినిపించాయి.
వెంటనే నీళ్లు బంద్ చేసి, తలకు తువాలు చుట్టుకుంటూ తలుపు తెరిచాడు. “ఏమైంది అనిషా? ఎందుకలా ఏడుస్తున్నావు?”
ఆమె క్షణం కూడా ఆలస్యం చేయకుండా అతన్ని గట్టిగా కౌగిలించుకుంది. చెమర్చిన కళ్లతో ఫోన్‌ను అతని చేతిలో పెట్టింది.
ఫోన్ చెవిన పెట్టుకుని అవతలి మాటలు విన్న రాజ్ ఒక్కసారిగా షాకయ్యాడు. ఆపై విషయాన్ని గ్రహించి నిటారుగా నిలబడ్డాడు.
“సార్, నా పేరు రాజ్. ఈరోజు సాయంత్రం సిగ్నల్ దగ్గర నా బైక్ డోకీ నుంచి పర్సు దొంగతనానికి గురైంది. నేను ఇప్పటికే ఆన్లైన్లో ఫిర్యాదు కూడా చేశాను. ఆ దొంగే రోడ్డు ప్రమాదంలో చనిపోయి ఉంటాడు. నా ఫిర్యాదు నంబరు, వివరాలు మీకు పంపుతాను చూడండి.”
అవసరమైన సమాచారం ఇచ్చి ఫోన్ కట్ చేసిన రాజ్, వణుకుతున్న అనిష పక్కన కూర్చున్నాడు.
“సాటి కంగారులో పర్సు పోయిన విషయం నీకు చెప్పడం మర్చిపోయాను అనిషా. అందుకే అంతగా భయపడిపోయావా?”
ఆమె అతన్ని ఇంకా గట్టిగా పట్టుకుని, కన్నీళ్లు పెట్టుకుంది. “ఆ ఒక్క క్షణంలో... ఇన్నాళ్లూ నీతో ఆత్మమానం కోసం గొడవపడినవన్నీ నా కళ్లముందు కదిలాయి రాజ్.
నువ్వు లేని జీవితం ముందు ఆ గొడవలు, పట్టింపులు ఎంత క్షమాపణ లేని విషయాలో అర్థమైంది. నువ్వుంటే చాలు అనిపించింది!”
రాజ్ ఆమె కన్నీళ్లను ప్రేమగా తుడిచాడు. “మనం మనుషులం అనిషా... రేపు మళ్లీ మన మధ్య చిన్నపాటి కోపం లేదా గొడవ రావచ్చు,” మెల్లగా అన్నాడు.
ఆమె అతని గుండెలపై తలవాల్చింది. “కోపాలు రానీ రాజ్... కానీ మన మధ్య ఎంత పెద్ద గొడవ వచ్చినా, మాట్లాడటం మాత్రం ఎప్పుడూ ఆపొద్దు. ఆ మౌనమే మన మధ్య దూరాన్ని పెంచేస్తోంది.”
ఆ రాత్రి ఇద్దరూ ఎంతో ప్రశాంతంగా ఒకే పళ్లెంలో భోజనం చేశారు. అనిష ప్రేమిస్తూ వడ్డిస్తుంటే, రాజ్ ఆమెకు మొదటి పెళ్లిరోజున తినిపించినట్లే ఎంతో మమకారంతో ముద్ద కలిపి తినిపించాడు.
***
📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!
మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్లో పొందవచ్చు.
✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి
👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y
మనతెలుగుకథలు.కామ్ — తెలుగు కథలకు మీ సొంత వేదిక
***
Ch. ప్రతాప్ గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):
Ch. ప్రతాప్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం: https://www.manatelugukathalu.com/profile/pratap

నేను వృత్తిరీత్యా ఒక సివిల్ ఇంజనీర్ అయినప్పటికీ, నా నిజమైన ఆసక్తి, నా జీవనసారం సాహిత్యానికే అంకితం. తెలుగు పుస్తకాల సువాసన నా జీవితంలో 1984 నుంచే పరిమళించింది. అప్పటి నుంచి పఠనం నా అలవాటుగా కాక, నా జీవనశైలిగా మారింది. పుస్తకాలు నా మనసును తీర్చిదిద్దాయి, ఆ పఠనమే క్రమంగా రచనగా రూపాంతరం చెందింది. ఆలోచనల రూపం, అనుభవాల ప్రతిబింబం, హృదయానికి స్వరం — అదే నా రచన.
ఆధ్యాత్మికత, మానవ సంబంధాల లోతులు, సామాజిక స్పృహ, ప్రజాసేవ పట్ల నాలో ఉన్న మమకారం ప్రతి రచనలోనూ ప్రతిఫలిస్తుంది. నేను రాసే ప్రతి వాక్యం పాఠకునితో చేసే ఒక మౌన సంభాషణ. నా కలం కేవలం అక్షరాలు కాదు; అది జీవనాన్ని గ్రహించే ఒక మార్గం.
ఇప్పటివరకు నేను రచించినవి రెండు వందలకుపైగా కథలు, ఐదు నవలలు, రెండు వేల వ్యాసాలు. ఇవి పలు దిన, వార, మాస పత్రికలలో, అలాగే డిజిటల్ వేదికలలో వెలువడి విభిన్న వయస్సుల పాఠకులను చేరాయి. ప్రతి రచన నా అనుభవాల సారాన్ని పాఠకుని మనసుతో కలిపే ఒక మాధ్యమంగా నిలిచింది.
సాహిత్యం నాకు హాబీ కాదు — అది నా జీవిత యానం. కొత్త ఆలోచనలను అన్వేషించడం, తెలుగు భాషా సౌందర్యాన్ని కొత్త రూపాల్లో వ్యక్తపరచడం, సమాజానికి ఉపయోగపడే మార్గాలను వెతకడం — ఇవే నా సాహిత్య సాధనకు మూలాధారం. రచన ద్వారా మనసులను మేల్కొలపడం, మనసుల్లో విలువల జ్యోతిని వెలిగించడం నా నిశ్చయం.
ఇటీవల నా కృషికి గాను ఒక ప్రముఖ సంస్థ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయడం నా జీవితంలో ఒక విశిష్ట ఘట్టం. అది కేవలం గుర్తింపే కాదు, మరింత బాధ్యతను జోడించిన ప్రేరణ.
మన పురాణాలు, ఉపనిషత్తులు, వేద వాక్యాలలో దాగి ఉన్న ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆధునిక పాఠకులకు అందించడం, వాటి సారాన్ని సమాజానికి చేరవేయడం నా సాహిత్య లక్ష్యం. ఆ దిశగా ప్రతి రచన ఒక నూతన యత్నం, ఒక అంతర్ముఖ ప్రయాణం.
సాహిత్యం నా కోసం కేవలం అభిరుచి కాదు; అది నా ఆత్మ స్వరూపం. నా కలం నా ఆలోచనలకు శ్వాస, నా రచన నా జీవితయానం.





















Comments